Once you stop learning, you start dying

17, జులై 2014, గురువారం

కాలజ్ఞానం -25 (కన్యా రాశిలో రాహుస్థితి-దేశగోచారం)

13-7-2014 నుంచి రాహువు కన్యారాశిలో ప్రవేశించడం జరిగింది.ఒకటిన్నర సంవత్సరం పాటు ఇక్కడ ఉండటం జరుగుతుంది.ఈ సమయంలో మన దేశంలో జరిగబోయే కొన్నికొన్ని సంఘటనలు ఎలా ఉంటాయో చూద్దాం.

మన దేశానికి సహజరాశి మకరం.స్వాతంత్రం వచ్చినది వృషభ లగ్నంలో అయినప్పటికీ దేశ లక్షణాలను బట్టి సహజరాశి మకరమే అని చాలామంది ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిష్యశాస్త్రవేత్తల అభిప్రాయం.

ఆ మకరరాశినుంచి ప్రస్తుతం నవమస్థానంలో రాహుసంచారం జరగబోతున్నది.నవమస్థానం విదేశాలకు,మత విషయాలకు,పెద్దలకు, గురువులకు,పుణ్యక్షేత్రాలకు,ధార్మిక కార్యక్రమాలకు సూచిక.రాహువు యొక్క కారకత్వాలలో విధ్వంసమూ,కుట్రలూ,కుత్రంత్రాలూ,విదేశీ మతశక్తులూ,మత పరమైన గొడవలూ ఉన్నాయి.

కనుక ఈ రెంటినీ కలిపి చూస్తె కొన్ని విషయాలు స్ఫుటంగా కనిపిస్తున్నాయి.

1.విదేశీ వ్యవహారాలలో మంచి కదలిక వస్తుంది.ప్రస్తుతం మన ప్రధాని విదేశీ యాత్రలు చెయ్యడమూ,అనేక దేశాధినేతలతో కలవడమూ,చెడిపోయిన/పోతున్న సంబంధాలను మళ్ళీ బాగు చేసుకునే ప్రయత్నం చెయ్యడమూ ఇందులో భాగాలే.ఫారిన్ పాలసీ మేటర్స్ ఉన్నట్టుండి బాగా క్రియాశీలకంగా మారడం నవమంలో అడుగుపెట్టిన రాహుప్రభావమే.

2.రాహువు ముస్లిం చాందసవర్గాలకు సూచకుడు గనుక మన దేశానికి ఆల్ ఖైదా,తాలిబాన్ వంటి పొరుగుదేశాల ఉగ్రవాద సంస్థలతో ప్రమాదం పొంచి ఉన్నది.వాళ్ళు మన దేశంలో మళ్ళీ కుతంత్రాలూ విధ్వంసమూ ప్లాన్ చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మతకలహాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి.

3.ఆ కుట్రలలో దేవాలయాలూ,పుణ్యక్షేత్రాలూ,ప్రసిద్ధ మతగురువులూ టార్గెట్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తున్నది.

4.వయసు మళ్ళిన పెద్దలూ,మతనాయకులూ ప్రమాదాలలోగాని ప్రాణాంతక రోగాలతో గాని ప్రాణాలు కోల్పోయే సూచన ఉన్నది.

5.కన్య సహజరాశిచక్రంలో రోగస్థానం గనుక మొండి ఎపిడెమిక్ వ్యాధులు సమాజంలో తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,జపనీస్ ఎన్కెఫలైటిస్ వంటి వ్యాధులూ ఈగలూ దోమల వల్ల వచ్చే వ్యాధులూ వైరల్ జ్వరాలూ విజృంభించే ప్రమాదం ఉన్నది.

6.భూకంపాల వంటి ప్రకృతి ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి.

7.మతసంస్థలలో అంతర్గతకలహాలూ,కల్లోలాలూ తలెత్తే అవకాశాలున్నాయి

ఎంతసేపూ చెడ్డ సంఘటనలేనా?మంచి అసలు జరగదా?అని కొందరికి అనుమానం రావచ్చు.మంచికూడా తప్పకుండా జరుగుతుంది.కాని దానికి ముందు జాగ్రత్తలు అవసరంలేదు.కనుక వాటిమీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఉదాహరణకు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం.

8.ముస్లిం వర్గాలకు మంచిచేసే ఒక దీర్ఘకాలిక నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుంది.దానివల్ల మోడీ ప్రభుత్వం అంటే వారిలో కొందరిలో ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది.

9.దేశంలో మతటూరిజం కొత్త పుంతలు తొక్కుతుంది.ఆ దిశగా అనేక టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులోకి వస్తాయి.

10. షేర్ మార్కెట్ ఉత్సాహంగా ముందుకు దూసుకు పోతుంది.

పైన సూచించిన ప్రమాదకర రంగాలలో(1-7) ముందు జాగ్రత్తలు చాలా అవసరం.వీటిలో పౌరులు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్నైతే ప్రభుత్వం తీసుకోవలసినవి మరికొన్ని.

ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కంటే,ముందే మేలుకొని జాగ్రత్తపడటం మంచిది కదా.