నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, ఆగస్టు 2014, శనివారం

Wise Bucket Challenge

ALS(Amyotrophic Lateral Sclerosis) అనే రోగానికి సంబంధించిన ఎరుక సమాజంలో పెరగడానికీ దాని నివారణకోసం రీసెర్చ్ కి తోడ్పడటానికీ ఐస్ బకెట్ చాలెంజ్ అనేది అమెరికాలో మొదలైంది.ఇందులో ఒక బకెట్ లో నీళ్ళూ ఐస్ ముక్కలూ వేసి వాటిని తలమీద పోసుకుని కొంతమందిని నామినేట్ చేస్తారు.వారు కూడా దీనిని చేసి ఇంకొంతమందిని నామినేట్ చెయ్యాలి. అందరూ కలసి కొంత డబ్బును ఆ రీసెర్చి ఫౌండేషన్ కి దానం చెయ్యాలి.

చాలామంది అమెరికన్లూ దీనిని చేస్తున్నారు.అక్కడ ఉన్న మనవాళ్ళూ చేస్తున్నారు.ఆ రోగానికి సంబంధించిన ఎవేర్ నెస్ పెంచుతున్నారు.బాగానే ఉంది.

పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, దీనిని చూచి మన దేశంలో "రైస్ బకెట్ చాలెంజ్" అనేదొకటి మొదలైంది.మన దేశంలో పేదరికం అధికం కనుక మనకు కావలసింది ఐస్ బకెట్ చాలెంజ్ కాదు, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ఒక బకెట్ లో బియ్యాన్ని నింపి దానిని ఎవరైనా పేదవారికి దానం ఇవ్వడం కొందరు మొదలు పెట్టారు.

ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే మన దేశంలో తీసుకునే వారికి కొదవేముంది?మనదేశంలో కోటీశ్వరులకు కూడా తెల్లకార్డులుంటాయి కదా.ఒక బకెట్ రైస్ వస్తున్నది తీసుకుంటే పోలా అని బెంజీ,  బీ ఎం డబ్లూ, కార్లలో పోయేవారు కూడా ఆగి ఒక బియ్యం బకెట్ ను డిక్కీలో వేసుకుని పోతున్నారు. 

మన దేశంలో ప్రస్తుతం పేదవారు అనేవారు అసలున్నారా? అని నాకొక పెద్ద అనుమానం గత కొన్నేళ్ళ నుంచీ ఉంది.ప్రతి పేదవాడి ఇంట్లోనూ నేడు కలర్ టీవీ ఉంది.ఒకవేళ లేకపోతే ప్రభుత్వమే ఇస్తోంది.ఇంటింటికి కేబుల్ నెట్ వర్క్ ఉన్నది.ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్నది.ఇంటికి నాలుగు చొప్పున సెల్ ఫోన్లూ ఉన్నాయి.మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త మొబైల్నూ కొని పాతదాన్ని నెలకొకసారి మార్చిపారేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ నేడు ఒక మొబైల్ షాపు పెట్టడానికి సరిపోయినన్ని పాత సెల్ ఫోనులు పడున్నాయి.ఇంటికి నాలుగు టూ వీలర్లూ రెండు కార్లూ ఉంటున్నాయి.

ఇకపోతే ఇప్పటికీ మంచినీళ్ళు దొరకని పల్లెటూళ్ళు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి.కాని సారాయి కొట్టులేని ఊరు మాత్రం ఎక్కడా లేదు. ఒకవేళ లేకపోతే,ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలే వాటిని అమర్చిపెట్టి పోయాయి.అన్ని సారాయి షాపులూ సాయంత్రానికి కిటకిట లాడుతున్నాయి.జనంతో కళకళ లాడుతున్నాయి.కొన్ని ఊర్లలో అయితే పొద్దు పొద్దున్నే కూడా అవి జనంతో సందడిగా కనిపిస్తున్నాయి.కాలేజీ ఆడపిల్లల దగ్గరనుంచీ అందరూ నేడు సారాయిని (ఏదో ఒకరూపంలో) చక్కగా తాగుతున్నారు. సారాయి అని చీప్ గా అన్నందుకు మళ్ళీ అది తాగేవారికి కోపం రావచ్చు. పేరు ఏదైనా పదార్ధం అదేగా.

మన దేశంలో 'వైన్ బకెట్ చాలెంజ్'(Wine Bucket Challenge) మాత్రం ఎప్పటినుంచో నడుస్తోంది.దానికి ఎవరి ప్రోత్సాహమూ ఆహ్వానమూ అక్కర్లేదు.ఎవరికి వారే స్వచ్చందంగా పరమోత్సాహంతో దీనిలో పాల్గొంటున్నారు.

ఇలాంటి ప్రజలకు రైస్ బకెట్ నిజంగా అవసరమా? అంటే లేదనే సమాధానం వస్తుంది.ఎవరికో దురదపుట్టి ఇస్తున్నారు గనుక తీసుకునేవారు తీసుకుంటున్నారు గాని నిజంగా మన దేశంలో పేదవాడు ప్రస్తుతం ఎక్కడా లేడు.అందరి దగ్గరా డబ్బులు బాగానే ఉన్నాయి.

ఆ మధ్యన అమెరికానుంచి చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చిన ఒక మిత్రుడు ఇలా అన్నాడు.

'నేను నాలుగేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను.ప్రస్తుతం ఇండియాను చూస్తుంటే అమెరికాలో ఉన్న మేమే మీకంటే పేదవాళ్ళమని అనిపిస్తున్నది.'

ఐస్ బకెట్టూ, రైస్ బకెట్టూ మన దేశానికి అవసరం అవునో కాదో నేను చెప్పను గాని ప్రపంచం మొత్తానికీ అవసరం అయిన చాలెంజ్ ఒకటి మాత్రం నేను చెప్పదలచుకున్నాను.

అదే వైస్ బకెట్ చాలెంజ్ Wise Bucket Challenge

అంటే మనం వైస్ గా జ్ఞానంతో బ్రతకడం,ఇతరులలో దానిని పెంపొందించే పనిని చెయ్యడం అన్నమాట.ఒక్కమాటలో చెప్పాలంటే నిజమైన సనాతనమైన భారతీయ ఆధ్యాత్మికతను నిత్యజీవితంలో ఆచరిస్తూ ఇతరులను కూడా దానిని ఆచరించేలా ఉత్తెజపరచడమే Wise Bucket Challenge.వారూ వీరూ అన్న భేదం లేకుండా ప్రపంచంలోని మనుష్యులకందరికీ ఇది నేటి కాలంలో అత్యంత అవసరం.

అయితే ఆధ్యాత్మికతకీ బకెట్ కీ ఏంటి సంబంధం? అని అనుమానం రావచ్చు.

ఇంగ్లీషులో 'కికింగ్ ద బకెట్' అనే మాట ఉన్నది.అంటే బాల్చీ తన్నెయ్యడం అన్నమాట.

పుట్టిన ప్రతి మనిషీ ఏదోరోజున పోక తప్పదు.ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఆ పోయే సమయానికి కర్మ బ్యాలెన్స్ ను పూర్తిగా ఖాళీ చేసుకుని పోవడమే నేను చెప్పే 'వైస్ బకెట్ చాలెంజ్'.

జ్ఞానంతో జీవిస్తేనే ఇది సాధ్యమౌతుంది.జ్ఞానంతో కర్మ చేస్తూ బ్రతికితేనే ఇది సాధ్యమౌతుంది.అప్పుడే మన ఎకౌంట్లో ఉన్న కర్మ తగ్గుతూ వస్తుంది.దానికి విరుద్ధంగా అజ్ఞానంలో బ్రతికి తదనుగుణమైన కర్మలు చేస్తూ ఉంటే అది రోజురోజుకూ పెరుగుతుంది.అప్పుడు బాల్చీ తన్నేసే సమయానికి తలకు మించిన భారంతో పోవలసి వస్తుంది.ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకున్న కర్మ బ్యాలెన్స్ ను ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ చేసుకుని పోవలసి వస్తుంది. అది అభిలషణీయం కాదు.

మనం ఈలోకంలోకి వచ్చేటప్పుడే ఒక పెద్దబకెట్ నిండా కర్మతో వచ్చాం. జ్ఞానహీనులమై ఇష్టం వచ్చినట్లు బ్రతికితే,బకెట్ తన్నేసే సమయానికి ఒక పెద్ద కర్మగంగాళాన్ని మోసుకుని పోవలసి వస్తుంది. ఆ గంగాళం బరువుతో అప్పుడెక్కడికి పోతామో,ఏ జన్మ ఎత్తుతామో మనకు తెలియదు. 

అలా కాకుండా,చేతిలో ఉన్న బకెట్ ని ఖాళీచేసి అవతలపారేసి హాయిగా చేతులూపుకుంటూ పోవాలంటే,నిత్యజీవితంలో కర్మను యోగంగా మార్చుకుని జీవితాన్ని నడిపినప్పుడే ఈ వైస్ బకెట్ చాలెంజ్ లో మనిషి నెగ్గగలుగుతాడు.

దీనికి ఇంకొకరిని నామినేట్ చెయ్యనవసరం లేదు.అలా నామినేట్ చెయ్యడం కుదరదు కూడా.ఇది ఎవరికి వారికి లోనుండి రావలసిన చాలెంజ్.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకునే చాలెంజ్ కాదు.

ఐస్ బకెట్ చాలెంజ్ వల్ల ALS అనే వ్యాధి నిర్మూలనానికి దోహదం అవుతుంది.

వైస్ బకెట్ చాలెంజ్ వల్ల కూడా ALS అనే వ్యాధి పోతుంది.అయితే ఈ వ్యాధి వేరు.దీనిని నేను 'అజ్ఞాన లంపటం సిండ్రోం' (ALS) అని పిలుస్తాను.వైస్ బకెట్ చాలెంజ్ చెయ్యగలిగిన వాడికి అజ్ఞానమూ పోతుంది.ప్రపంచ లంపటమూ పోతుంది.

ఆత్మారామత్వమూ ఆనందస్వరూపమూ వాడికి మిగులుతాయి.

ఐస్ బకెట్, రైస్ బకెట్ల వల్ల ఏవేవి పోతాయో నేను చెప్పలేను గాని వైస్ బకెట్ వల్ల మాత్రం మూలవ్యాధి (fundamental disease) అయిన అజ్ఞానం నశించిపోతుందని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు.భగవంతుడే దీనిని గురించి చెప్పినాడు.

శ్లో||తేషామేవానుకంపార్ధ మహమజ్ఞానజం తమ:
నాశాయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వతా

(భగవద్గీత 10:11)

(వారి మీద కరుణతో వారి హృదయాలలో నేనే నిలిచి ఉండి,జ్ఞాన తేజస్సుతో వాటిని నింపి,అజ్ఞాన జనితమైన అక్కడి చీకటిని నాశనం చేస్తున్నాను)

అంటూ భగవంతుడే ఈ ఛాలెంజ్ స్వీకరించేవారికి అభయప్రదానం గావిస్తున్నాడు.ఇంక భయమేముంది?

ఈ ఛాలెంజ్ ని మనం స్వీకరించకుండా అడ్డుపడే తమస్సు అంటే ఏమిటో కూడా భగవంతుడే చెప్పాడు.

శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత

(భగవద్గీత 14:8)

నిర్లక్ష్యమూ,ఆలస్యమూ,బద్ధకమూ -- ఈ మూడూ అజ్ఞానం నుంచి పుట్టినవి.ఇవే సమస్త జీవులనూ మోహంలో ముంచి జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి.

ప్రమాదం (నిర్లక్ష్యం) అంటే - మనకిప్పుడే ఆధ్యాత్మికత ఎందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి.

ఆలస్యం అంటే - రేపు చేద్దాంలే అని ఏరోజుకారోజుకి సాధనను వాయిదా వెయ్యడం.


నిద్ర అంటే - సాధనలో బద్ధకాన్ని వదిలించుకోలేని అశక్తత.


తమస్సు అంటే ఈ మూడు లక్షణాలే.


అంతేకాదు, Wise Bucket Challenge (WBC) అనే ఈ ఛాలెంజ్ ని స్వీకరించే వాడికి అంతర్గత WBC (White Blood Corpuscles) కౌంట్ తగినంతగా పెరిగి అజ్ఞానం అనే మహమ్మారిని అడ్డుకునే వ్యాధినిరోధక శక్తి అతనిలో విపరీతంగా పెరుగుతుందని నేను చెబుతున్నాను.

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని సాక్షాత్తూ భగవంతుడే విసుగనేది లేకుండా ఎప్పటినుంచో మనలను పిలుస్తున్నాడు.కానీ ఆయన మాట ఎవరూ వినడం లేదు.

శ్లో||తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసి నాత్మనః
ఛిత్వైనం సంశయం యోగమాత్తిష్టోత్తిష్ట భారత

(భగవద్గీత 4:42)

(ఓ భారతపుత్రా! అజ్ఞానం నుండి పుట్టి నీ హృదయంలో తిష్ట వేసి ఉన్నట్టి సంశయములను జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించు.యోగమును ఆధారంగా చేసుకొని నీ జీవనసమరాన్ని నడిపించు)

ఇదే వైస్ బకెట్ ఛాలెంజ్

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని మన సనాతన ధర్మమూ మన మహర్షులూ కూడా కొన్నివేల ఏళ్ళ నుంచీ మనలను ఆహ్వానిస్తూనే ఉన్నారు.

కానీ ఈ ఛాలెంజ్ ని మనస్ఫూర్తిగా స్వీకరించేవారు ఎందరున్నారు?అందరూ పనికిమాలిన ఐస్ బకెట్ ఛాలెంజ్,రైస్ బకెట్ ఛాలెంజ్ లను స్వీకరించేవారేగాని అసలైన వైస్ బకెట్ ఛాలెంజ్ ని స్వీకరించేవారు ఎవరున్నారు?

కనీసం ఒక్కరన్నా ఉన్నారా???
read more " Wise Bucket Challenge "

27, ఆగస్టు 2014, బుధవారం

స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి

మొన్నొక రోజున పొద్దున్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది.

ఏదో కొత్త నంబర్.

సామాన్యంగా కొత్త నంబర్లకు నేను పలకను.

'సరే చూద్దాంలే పొద్దున్నే ఎవరో' అనుకుని 'హలో' అన్నా.

'స్వామిగారున్నారా?' అవతలనుంచి ఒక గొంతు వినిపించింది.

'నేను స్వామినెప్పుడయ్యానా?' అని నాకే అనుమానం వచ్చింది.

ఏమిటో చూద్దామని -'ఏ స్వామివారు?' అని అడిగాను.

'అదే... గుళ్ళో స్వామిగారు ఉంటారట కదా?' అన్నాడు ఆ వ్యక్తి.

'గుళ్ళో స్వామి ఫోన్లో ఎలా మాట్లాడతాడు?' అడిగాను.

'అదికాదు.ఆయన అపాయింట్ మెంట్ కావాలి.'

పొద్దున్నే ఏమిటో ఈ హాస్యప్రభంజనం అనుకుని-'గుళ్ళో స్వామి అపాయింట్ మెంట్ మీక్కావాలా?' అడిగాను.

'అవును'

'మీ వయసెంత?' అడిగాను.

'నలభై'

'అప్పుడే అంత తొందర ఎందుకు? ఇంకా కొన్నాళ్ళు ఉండండి.' అన్నాను.

నేను చెబుతున్నది అవతల ఎక్కడం లేదు.

'అలా కాదు.నేను చాలా ట్రబుల్స్ లో ఉన్నాను.స్వామిగారిని అర్జెంట్ గా కలవాలి' అన్నాడు.

'స్వామిగారు కూడా ప్రస్తుతం చాలా ట్రబుల్స్ లో ఉన్నారు.ఆయన ఎవర్ని కలవాలో ఆలోచిస్తూ ధ్యానంలో ఉన్నారు.' అన్నాను.

వినిపించుకునే పరిస్థితిలో అవతల వ్యక్తి లేడు.

'ధ్యానం లోనుంచి లేచాక,ఆయనతో మాట్లాడి అపాయింట్ మెంట్ ఇప్పించండి.ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'వీలుకాదు.ధ్యానం తర్వాత ఆయన ప్రియశిష్యురాలితో ఏకాంతసేవలో ఉంటారు.మధ్యాన్నం మూడువరకూ బయటకు రారు.ఈలోపల కదిలిస్తే ఆయనకు మహాకోపం వస్తుంది.'అన్నాను సీరియస్ గా.

అవతలి వ్యక్తి పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు.

'పోనీ ఈలోపల ఏదైనా రెమెడీ మీరు చెప్పినా పరవాలేదు." అన్నాడు.

మధ్యాన్నం మూడువరకూ కూడా ఆగలేడట!!వెంటనే పనిచేసే రెమెడీ ఈలోపల నేను చెప్పాలట!!! ఇదేమైనా తలనొప్పి మాత్రా వేసుకున్న పదినిముషాలలో నొప్పి మాయం అవడానికి??

టీవీ జ్యోతిష్కుల పుణ్యమా అని 'రెమేడీ'అనేది ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది.ఒక లెక్కా ఏమీ లేకుండా ఎవరి నోటికోచ్చినవి వారు చెబుతున్నారు.చేసేవారు చేస్తున్నారు.ఇది కర్మతో చెలగాటం అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఈ ఫోన్ కాల్ ఎవరికో చెయ్యబోయి నాకు చేశాడని అర్ధమైపోయింది.

'అలాంటి రెమెడీలు నాకు తెలియవు.నా రెమెడీలు మీరు ఆచరిస్తే మీ సమస్యలు పోవుగాని ఏ సమస్య వచ్చినా చెదరకుండా మీరు ఉండగలుగుతారు.కానీ అలాంటివి ఫోన్లో చెప్పను.' అన్నాను.

'అందుకే సార్.వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'మీరెలాంటి రేమేడీలు ఆశిస్తున్నారు?' అడిగాను.

'స్వామిగారు హోమాలు చేయిస్తారట కదా?అన్ని ప్రాబ్లెమ్స్ పోతాయట కదా?' అన్నాడు.

ఆ స్వామివారెవరో ఈ గోలేమిటో విషయం వెంటనే అర్ధమై పోయింది.

'స్వామివారి డైరీలో ఇంకో అయిదేళ్ళ వరకూ కాల్షీట్లు ఖాళీలు లేవు. అపాయింట్ మెంట్లు ముందే ఫిక్స్ అయిపోయాయి.' అన్నాను.

'అలా అంటే ఎలా సార్?పోనీ మీరైనా ఏదైనా రేమేడీ చెప్పండి.' అన్నాడు.

నేను స్వామివారి అసిస్టెంట్ ను అనుకుంటున్నాడని నాకర్ధమైంది.

'అసలు మీ ప్రాబ్లెం ఏమిటి?' అడిగాను.

'రెండు కోట్లు బ్లాక్ అయిపోయాయి.అవతలి పార్టీ మోసం చేసాడు.వాడు నా ఫ్రెండే.ఆ డబ్బు వచ్చే మార్గం చెప్పాలి' అన్నాడు.

ఇక ఇతనికి ఉపదేశం అవసరం అనుకున్నా.

'చూడండి.అత్యాశ మంచిది కాదు.ఉన్నంతలో బ్రతకడం నేర్చుకోండి. దురాశకు పోయి నానా పాడుపనులూ చేసి డబ్బు సంపాదించకండి.ఎంత సంపాదించినా వెంట తీసుకుపొయ్యేది ఏమీ లేదు.సుఖాలకు అంతూ పొంతూ కూడా లేదు.మానవ జీవితగమ్యం డబ్బు సంపాదన ఒక్కటే కాదు. అమూల్యమైన మానవజీవితాన్ని అనవసరమైన విషయాలలో వృధా చేసుకోకండి.ధర్మంగా బ్రతకండి.ఒకవేళ అధర్మం అయితే మీకు నష్టం కలిగినా సరే ఆ పనిని ఒదిలెయ్యండి.' అన్నా.

అవతలవైపు నుంచి భయంకరమైన నిశ్శబ్దం వినిపించింది.

ఫోన్ పెట్టేశా.

ఆయన ఫోన్ చేసిన స్వామివారు ఎవరో నాకు తెలుసు.ఆ స్వామివారే ప్రస్తుతం పీకల్లోతు లౌకిక సమస్యలలో కూరుకుని పోయి ఉన్నారు.పోనీ ఆధ్యాత్మిక జ్ఞానమన్నా ఆయనకు ఎక్కువైపోయిందా అంటే అదీ లేదు.అలాంటి స్థితిలో ఉండి వారు ఇతరులకు సలహాలిస్తున్నారు.వీరు స్వీకరిస్తున్నారు.

ఏమిటో ఈ మాయ!!

ఆశ అనేది చాలా గొప్ప శక్తి.దురాశ అనేది ఇంకా గొప్ప శక్తి.ఇవి రెండూ మనిషిని పట్టుకుని పీడిస్తూ ఉన్నంతవరకూ ఇలాంటి స్వాముల చేతులలో చిక్కి బలికాక తప్పదు.ఇలాంటి అనైతిక పనులకు సలహాలిచ్చే వీరు 'స్వామి' అన్న పదానికి అర్హులేనా అని నా ప్రాచీన అనుమానం.చివరకు 'నేటి స్వాములు' హవాలా కార్యకలాపాలకు బ్రోకర్లుగా మారుతున్నారు. ఇంతకంటే చండాలం ఇంకొకటి ఉండదు.

తప్పుదారిన పోతున్నవారికి 'ఇదితప్పు' అనిచెప్పి దారి మళ్ళించి మంచిదారిలో పెట్టేపనిని వారు చెయ్యాలి.అంతేగాని,ఆయా పనులకు సహకరిస్తూ,అవి తేలికగా అయ్యే మార్గాలు చెబుతున్న వీరు 'స్వామి' అన్న పదం తగిలించుకుని దానిని భ్రష్టు పట్టిస్తున్నారు.

దశనామీ సంప్రదాయాన్ని సృష్టించిన ఆదిశంకరుల వంటి మహనీయులు ఇలాంటి స్వాములను పైనుంచి చూచి ఎంతగా బాధపడుతున్నారో అనిపించింది.

దేవుడా!! ఎంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించావయ్యా!! ఎలాంటి లీలను నడిపిస్తున్నావయ్యా !! అని దైవానికి మనస్సులో నమస్కారం చేసుకుని నా పనిమీద నేను బయలుదేరాను.
read more " స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి "

20, ఆగస్టు 2014, బుధవారం

BKS Iyengar-శపిత యోగం

నేడు ప్రపంచంలో BKS Iyengar (బేలూర్ కృష్ణమాచార్ సుందరరామ అయ్యంగార్ )పేరు తెలియని వారు ఉండరు.

Light on Yoga, Light on Pranayama మొదలైన గ్రంధాలు అనేకం వ్రాసి దాదాపు 60 పైన దేశాలలో యోగా స్కూల్స్ స్థాపించిన ఈ 95 ఏళ్ళ యోగాచార్యుడు ఈరోజు ఉదయం పూనాలో దేహం చాలించాడు.

ఈ వయసులో కూడా ఆయన అరగంట సేపు శీర్షాసనంలో ఉండగలడు.మిగిలిన ఆసనాలంటే ఇంక చెప్పనక్కరలేదు.అవన్నీ ఆయనకు కొట్టిన పిండి.'లైట్ ఆన్ యోగా' పుస్తకంలో ఆయన చూపించిన యోగాసనాలు చూస్తే అసలు ఈయన శరీరంలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.

ఈయనకూడా శపితయోగానికి బలయ్యారంటే చదువరులకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

ఒక్కసారి ఈయన జాతకం పరికిద్దాం.

ఈయన 14-12-1918 తేదీన కర్ణాటక కోలార్ జిల్లాలోని బేలూర్ లో ఉదయం 3.00 గంటలకు జన్మించారు.తల్లిదండ్రులు సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణులు.

గురుశనుల వక్రీకరణ వల్ల ఈయనకు లోకంతో ఎంతో కర్మసంబంధం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తున్నది.అందుకేనెమో దేశదేశాలు తిరిగి యోగా స్కూల్స్ స్థాపించి భారతీయ హఠయోగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.

ప్రపంచంలో లక్షలాదిమందికి యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని కలిగించారు. ఇలాంటి వ్యక్తి తన చిన్నతనంలో ఫ్లూ మలేరియా టీబీ టైఫాయిడ్ లతో బాధపడ్డారంటే మనకు నమ్మశక్యం కాదు.కానీ ఇది నిజం.

కాలయుక్తి నామ సంవత్సరం మార్గశిర ఏకాదశి రోజున ఆయన జన్మించారు. ఈయన చనిపోయినది కూడా ఏకాదశి రోజుననే కావడం ఒక విచిత్రం.శ్రావణ ఏకాదశి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమికి దగ్గరగా ఆయన చనిపోవడం ఆయనపైన ఉన్న కృష్ణానుగ్రహాన్ని సూచిస్తున్నది. వైష్ణవునిగా జన్మించినందుకు ఏకాదశి రోజునా అందులోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరగా పోవడం చాలా మంచిది.ఈయనకు ఉత్తమ గతులు కలుగుతాయన్న దానికి ఇది సూచన.

అశ్వనీనక్షత్రం రెండోపాదంలో ఈయన జన్మించారు.అశ్వనీ దేవతలు దేవ వైద్యులు.ఈయన కూడా తన యోగవైద్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు.నక్షత్ర లక్షణాలు ఈ విధంగా జీవితంలో కనిపిస్తూ ఉంటాయి.

ఈయన పుట్టినపుడు కేతు/కుజ దశ జరుగుతూ ఉన్నది.కేతు కుజుల సంబంధం గురించీ వీరవిద్యల గురించీ నేను ఇంతకు ముందు వ్రాసి ఉన్నాను.దీనికి ఋజువు మళ్ళీ ఈ జాతకంలో కనిపిస్తుంది.ఈ సంబంధం ఉన్నప్పుడు శరీరంతో చేసే వ్యాయామవిద్యలు చాలా త్వరగా పట్టుబడతాయి.యోగానికీ వీరవిద్యలకూ సంబంధం ఉన్నదని నేను స్వానుభవంతో నిర్ధారణగా చెప్పగలను.

జననకాల దశాదిపతి అయిన కేతువు అష్టమంలో ఉండటంతో ఆయన చిన్నతనం అంతా రోగాలతోనూ గండాలతోనూ గడిచింది. బలహీనంగా, ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండే ఈ పిల్లవాడు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి యోగాగురువు అవుతాడనీ 95 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతాడనీ బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు.

కుజుడు బలంగా ఉన్న జాతకులకు భౌతిక పరిధిలో అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి.వారు దానిని దాటి వెళ్ళలేరు.ఒకవేళ వెళ్ళినా వారి మూలాలు భౌతికం లోనే పాతుకుని పోయి ఉంటాయి.కుజునికి ఉచ్ఛరాశి మకరం కూడా భూతత్వ రాశియే.అందుకే వారికి భౌతిక శరీర సంబంధం అంత త్వరగా వదలదు.

ఈయన జాతకంలో కుజుడు రాశి నవాంశలలో ఉచ్ఛలో ఉన్నాడు.కనుక చాలా బలంగా ఉన్నట్లు లెక్క.కనుక భౌతిక శరీరంతో చేసే హఠయోగాన్ని ఈయనకు వరంగా ప్రసాదించాడు.
  
18 ఏళ్ళ వయసులో 'యోగా' ను నేర్పడానికి ఆయన పూనాలో అడుగు పెట్టాడు.అప్పుడు ఆయనకు శుక్ర/శని దశ జరుగుతున్నది.మొదట్లో ఎన్నో కష్టాలు పడినా క్రమేణా గుర్తింపు లభించింది.శనీశ్వరుడు ఈయన జాతకంలో విద్యకు కారకుడు.కనుక శరీరకష్టంతో కూడిన యోగవిద్య ఆయనకు పట్టుబడింది.శుక్రుడు లగ్నాదిపతిగా మూడింట నవమాధిపతి అయిన బుదునితో కలసి ఉన్నాడు.నవమం నుంచి గురువుతో చూడ బడుతున్నాడు.కనుక దూరప్రాంతానికి యోగాగురువుగా వెళ్ళాడు.

1952 లో వాయులీన విద్వాంసుడు యెహోదీ మెనూహిన్ ద్వారా ఈయన లండన్ లో యోగా క్లాస్ ప్రారంభం చేశాడు.ఆ సమయంలో చంద్ర/గురు దశ ఈయన జాతకంలో జరిగింది.చంద్రుడు సప్తమంలోనూ గురువు నవమంలోనూ ఉండటం చూడవచ్చు.ఈ రెండూ విదేశాలను సూచించే స్థానాలే.

90 ఏళ్ళ వయస్సులో కూడా రోజుకు మూడుగంటలు ఆసనాభ్యాసమూ ఒక గంట ప్రాణాయామమూ ఆయన ఖచ్చితంగా చేసేవాడు.వంక దొరికితే సాధనను ఎగర గొడదామని చూచే నేటి మనుష్యులు ఈయన్ని చూచి బుద్ధి తెచ్చుకోవలసిన అవసరం చాలా ఉన్నది.

ఈయన జిడ్డు కృష్ణమూర్తికి కూడా యోగా నేర్పించాడు.

ఈయనా రజనీషూ ఇద్దరూ పూనాలోనే ఉండేవారు.రజనీష్ చివరలో రకరకాల రోగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈయన దగ్గర యోగా నేర్చుకోమని కొందరు సూచించగా రజనీష్ తిరస్కరించాడు.శీర్షాసనం అంతసేపు వేస్తే మెదడులో రక్తనాళాలు చిట్లిపోతాయని రజనీష్ వాదించాడు. మరి నేటివరకూ అయ్యంగార్ కు ఏ రక్తనాళాలూ చిట్లలేదు.

1984 లో నేను గుంతకల్లు లో ఉన్నప్పుడు అక్కడ యోగా క్లాసు మొదలు పెట్టించడానికి అక్కడి వైశ్యప్రముఖులు ఈయనను రప్పించారు.అప్పుడు ఆయన యోగా క్లాసును దగ్గరుండి చూచాను.అప్పటికే నేను మార్షల్ ఆర్ట్స్ మరియు యోగా చాలా తీవ్రంగా చేసేవాడిని.అయ్యంగార్ గారి విధానంలో చాలా రకాలైన props వాడతారు.అవీ మంచివే.కానీ యోగాలో నా విధానం వేరు.నాకు ఆ క్లాసులో కొత్త ఏమీ కనపడలేదు.కనుక నేను అందులో చేరలేదు.

పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు ఈయనను వరించాయి.

పద్మశ్రీ 1991 లో వచ్చింది.ఆ సమయంలో గురు/కేతు దశ జరిగింది.వీరిద్దరూ అష్టమంలో ఉండటం చూస్తే ఈ అవార్డ్ ఈయనకు వ్రాసిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది.గత జన్మలో బాకీ ఉన్న దానిని ఈ జన్మలో ఇలా అందుకున్నాడు.

పద్మభూషణ్ 2002 లో శని/శని దశలో వచ్చింది.శనీశ్వరుడు ఈయనకు విద్యాదిపతిగా దశమ లాభ స్థానాలలో ఉండటం చూడవచ్చు.

పద్మవిభూషణ్ 2014 లో శని/రాహు దశలో వచ్చింది.ఘటీ లగ్నం రాహు నక్షత్రంలో ఉండటం గమనిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.

నేడు అంటే 20-8-2014 న శని/రాహు/శనిదశలో ఈయన మరణించాడు.ఇది ఖచ్చితమైన శపితయోగ దశ అని మళ్ళీమళ్ళీ నేను వివరించనవసరం లేదు.ఇదేమిటో నా పాత పోస్ట్ లు చదివిన వారికి సుపరిచితమే.

ప్రస్తుతం గోచార కుజశనులు ఈయన జననలగ్నం మీద సంచరిస్తున్నారు. అంటే ఈయన జన్మలగ్నానికి శపితయోగం పట్టింది.

రాశి నవాంశలలో ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు ఈయనకు శరీర ప్రధానమైన హఠయోగవిద్యనూ ఇచ్చాడన్నది వాస్తవం.అంతర్జాతీయ గుర్తింపును రాహువూ గురువూ ఇచ్చారు.

మన యోగవిద్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఇటువంటి విశిష్ట వ్యక్తులకు 'భారతరత్న' ఇవ్వడం చాలా అవసరం.అలా ఇవ్వడం ద్వారా మన ప్రభుత్వం తనను తానే గౌరవించుకున్నట్లూ మన విద్యలను గౌరవించినట్లూ అవుతుంది.

మన సంస్కృతిని గౌరవించే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్నది గనుక అలా జరుగుతుందని ఆశిద్దాం.
read more " BKS Iyengar-శపిత యోగం "

ఉచిత సలహాలు

ఈ లోకంలో ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలా ఎక్కువ.

కాకపోతే ఆ సలహాలు ఇవ్వబోయే ముందు వారివారి అర్హతలు ఏమిటో చూచుకోకుండా చాలామంది సలహాలు ఇవ్వబోతూ/ఇచ్చేస్తూ ఉంటారు.

నాక్కూడా చాలామంది ఉచిత ఆధ్యాత్మిక సలహాలిస్తుంటారు.

నిన్నగాక మొన్న,పిరమిడ్ ధ్యానం వంటి పిచ్చిపిచ్చి ధ్యాన విధానాలు ప్రారంభం చేసిన కొందరూ,అటుమొన్న సాయంత్రం నుంచీ రమణమహర్షి పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన ఇంకొందరూ,ఒక నెలక్రితం ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన ఇంకొందరూ,ఇంకేదో నిషా పుట్టించే యోగా చేసే మరికొందరూ తరచుగా నాకు ఉచిత సలహాలు ఇస్తుంటారు.

వారి సలహాలకు నాకు చచ్చే నవ్వు వస్తూ ఉంటుంది.ఆ సలహాలు చాలా సరదాగా కామెడీగా ఉంటాయి.నా బిజీ లైఫ్ లో వారి కామెడీ సలహాలు నాకు చాలా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటాయి.

అందుకు,ముందుగా వారికి థాంక్స్ చెప్పాలి.

వాటిలో కొన్నింటినీ,వాటికి నా జవాబులనూ ఇక్కడ చదవండి.

మీరూ హాయిగా నవ్వుకొని రిలాక్స్ అవ్వండి.
-----------------------------------------------
ఈ మధ్యనే ఒక పిల్లకాకి ఇచ్చిన సలహా ఇది.

1) కృష్ణుని జనన సమయం తెలుసుకోవడానికి జ్యోతిష్యం ఎందుకు?ధ్యానంలో అన్నీ తెలుస్తాయి.అలా ట్రై చెయ్యండి.నేను మొన్న ధ్యానంలో ఉన్నప్పుడు ఒక తెల్లని రెక్కల గుర్రాన్ని ఎక్కి గుంటూరులో మీ ఇంటి డాబా మీదకు వచ్చాను.డాబా మీద దిగుదాం అనుకునేలోపు గుర్రం ముందుకు వెళ్ళిపోయింది.ఫోర్త్ డైమెన్షన్ లోకి వెళితే అన్నీ తెలుస్తాయి.

నా జవాబు:

అవునా? ధ్యానం అంటే ఏంటో అదెలా చెయ్యాలో నాకు తెలియదే? ఎలా మరి?పోనీ ఒక పని చేద్దాం.నేను అజ్ఞానిని గనుక జ్యోతిష్య లెక్కలతో కుస్తీ పడుతున్నాను.మీరు ధ్యానసిద్ధులు కదా,మీ ధ్యానంలో చూచి కృష్ణుని అసలైన జననతేదీ వివరాలు చెప్పండి చూద్దాం.నాకీ బాధ తప్పుతుంది.

పోతే నాదొక సలహా.అలా గుర్రంఎక్కి ఆకాశంలో ఎగిరేటప్పుడు దాని మెడను గట్టిగా వాటేసుకోండి.ఒకవేళ బాలెన్స్ తప్పి ఆకాశంలోనుంచి జారి కింద పడితే రక్షించే దిక్కు ఉండరు.మా డాబా మీద పడితే పరవాలేదు.ఏదో ఒక హోమియో మందు నోట్లోవేసి నేను లేపుతాను.కానీ బిజీ రోడ్డు మీద పడితే చాలా కష్టం.

అసలే గుంటూరులో అందరూ పరమ దుర్మార్గులున్నారు.కనీసం 108 ని పిలిచి అందులో ఎక్కించే పనికూడా ఎవరూ చెయ్యరు.రోడ్డుమీద మీ ఖర్మానికి మిమ్మల్ని అలా వదిలేస్తారు.తెల్లరెక్కల గుర్రం మీకోసం ఎలాగూ ఆగదు.ఇంకొక ధ్యానిని వెదుక్కుంటూ అది ముందుకు ఎగిరిపోతుంది.కనుక జాగ్రత్త.

ముందుజాగ్రత్తగా,ఈసారి ధ్యానంలో కూచోబోయే ముందు తలకొక హెల్మెట్ పెట్టుకుని,వీపుకొక పేరాచూట్ కట్టుకుని కూచోండి సరిపోతుంది.అప్పుడు రెక్కలగుర్రంమీద నుంచి కింద పడినా కనీసం తలవరకూ సేఫ్ గా ఉంటుంది.

రాత్రి పూట పడుకోబోయే ముందు నాగేస్పర్రావు నటించిన 'కీలుగుఱ్ఱం' లాంటి పిచ్చిపిచ్చి సినిమాలు చూడకండి.అలా చూస్తే ఇలాంటి కలలే వస్తాయి.

ఇంకొక మహాజ్ఞాని సలహా ఇది.

2) శర్మగారు? అసలు మీకెందుకు ఈ గోల?ఈ బ్లాగులలో వీళ్ళతో ఈ గోలంతా మీకెందుకు? ఆత్మజ్ఞాని లక్షణాలు ఇలా ఉండవు.వెంటనే మీ బ్లాగు మూసేసి ఊరుకోండి.

నా జవాబు:-

మీ సలహాకి నా కృతజ్ఞతలు.

ఆత్మజ్ఞాని లక్షణాలు చెబుతున్నారంటే మీకూ ఆ జ్ఞానం ఉండే ఉంటుంది.మీరూ ఆత్మజ్ఞానులే అయి ఉంటారు.మరి మీరుమాత్రం నా బ్లాగు చూచీ,అందులోని విషయాలు మీకు జీర్ణం కాకా,ఇంత అసూయ పుట్టీ ఇలా బాధపడటం ఎందుకు?నాకు చెబుతున్నట్లు మీరు కూడా ఈ బ్లాగుల గోల వదిలిపెట్టి హాయిగా ఆత్మస్థితులై ఉండవచ్చుగా?

నాకు చెప్పబోయేముందు మీరే ఆపని చెయ్యాలి.ముందా పనిమీద ఉండండి.

మరో మహాజ్ఞాని సలహా ఇది.

3) మౌనమే అత్యుత్తమం అని రమణమహర్షి అన్నాడు.నిజమైన జ్ఞాని మీలా రోజుకొక పోస్ట్ వ్రాస్తూ బోధనలు చెయ్యడు.ఆ సంగతి గ్రహించండి.

నా జవాబు:-

అవునా? రమణమహర్షి మీతో అలా చెప్పారా పాపం? ఆయన బ్రతికి ఉన్న రోజులలో చక్కగా సోఫాలో కూచుని కాఫీత్రాగి న్యూస్ పేపర్ చదివేవారు. రేడియో వినేవారు.ఎందరితోనో ఎన్నో విషయాలు ముచ్చటించేవారు.ఈ సంగతులన్నీ మీకు ఇంకా తెలీవేమో?అవున్లే నిన్నగాక మొన్ననేగా మీరు రమణసాహిత్యం చదవడం మొదలుపెట్టింది.లోతులు అర్ధం కావాలంటే ఇంకా టైం పడుతుంది.

కనీసం ఒక రెండేళ్ళపాటు ఆ పుస్తకాలు బాగా చదివాక అప్పుడు నాతో మాట్లాడే కనీస అర్హత మీకు వస్తుంది.ఆ తర్వాత మళ్ళీ మెయిల్ ఇవ్వండి.

రమణమహర్షి పుస్తకాలు చదవడం కాదు.కనీసం మంచి ప్రశ్నలు ఎలా అడగాలో ముందు నేర్చుకోండి.మీరన్నట్లు రోజుకోక్క పోస్ట్ ఏం ఖర్మ? రోజుకు రెండూ మూడూ పోస్ట్ లు ఎలా వ్రాయాలో నేనీలోపల ప్రాక్టీస్ చేస్తాను.ఈరోజుకి ఇది రెండో పోస్ట్ చూచుకోండి.
---------------------------------------------------
ఇలా రకరకాలైన ఉచిత సలహాలూ విమర్శలూ నాకు వస్తూ ఉంటాయి. వీరిలో చాలామందికి సరియైన తెలుగు వ్రాయడమూ రాదు.మంచి ఇంగ్లీషు వ్రాయడమూ రాదు.సబ్జెక్టూ వారివద్ద ఉండదు.ఇలాంటి వారు నాకు ఉచిత సలహాలు ఇవ్వబోవడం నాకు భలేనవ్వు తెప్పిస్తూ ఉంటుంది.

ఉచిత సలహాలు వారే కాదు.నేనూ ఇవ్వాలి కదా కొన్ని.

అలాంటి వారికందరికీ నాదొక ఉచిత సలహా.

దయచేసి మీమీ ఉచిత సలహాలు ఆపకండి.కనీసం రోజుకొకటి నాకు మెయిల్ ఇస్తూ ఉండండి.ఎందుకంటే ముందే చెప్పినట్లుగా,మీ సలహాలు వచ్చినప్పుడల్లా నవ్వుతో నాకు పొలమారి మంచి నీళ్ళు త్రాగే పరిస్థితి వస్తూ ఉంటుంది.కాకపోతే నా బిజీ లైఫ్ లో మీ కామెడీ మెయిల్స్ వల్లే నేను ఉల్లాసంగా నవ్వుతూ ఉండగలుగుతున్నానంటే మళ్ళీ మీకు మా చెడ్డకోపం వస్తుందేమో.

నా ఈ పోస్ట్ చూచి అలా మీకు కోపం వస్తే, ఒక పని చెయ్యండి.

పిరమిడ్ ధ్యానం అలవాటైన వారు,పిరమిడ్లోకి దూరి తలుపేసుకుని గట్టిగా గాలిపీలుస్తూ శ్వాసమీద ధ్యాస ఉంచండి.మీ కోపం మాయమౌతుంది. కాకపోతే మొత్తం తలుపులు మూసుకోకండి.కనీసం ఒక్క కిటికీ అన్నా ఓరగా తెరిచి ఉంచుకోండి.లేకపోతే ఆ లోపల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయి ఊపిరాడక ఏదన్నా అయితే మీ బంధువులు మీకే ఒక పిరమిడ్ కట్టించవలసిన పరిస్థితి దాపురించవచ్చు.

రమణమహర్షి పుస్తకాలు చదివి నాకు ఉచిత సలహాలు ఇస్తున్న వారికి ఈ పోస్ట్ చదివి పిచ్చికోపం వస్తే - 'ఈ కోపం ఎవరికి వస్తున్నది? అసలు శర్మగారికి ఉచితసలహాలు ఇవ్వడానికి "నేనెవర్ని"?'-అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.మీ కోపం మహర్షి దగ్గరకు వెంటనే పారిపోతుంది.

పాములు పట్టే స్వాములవారి శిష్యులైతే, ముందుగా ఒక మాంఛి పుట్టను సెలెక్ట్ చేసుకుని దాని ఎదురుగా కూచుని నాదస్వరం ఊదుతూ ఆ పామును బయటకు రప్పించే పనిలో ఉండండి.ఏ పక్కనుంచి ఆ పాము బయటకు వస్తుందో అనే భయంలో నామీద కోపం ఎక్కడికో మాయమై పోక తప్పదు. ఒకవేళ మీ ఖర్మం చాలక పుట్టలోంచి పాము బయటకు వస్తే దానికోసం ఒక బుట్టను రెడీగా పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా,మీమీ sub- standard సలహాలు ప్రతిరోజూ నాకివ్వడం మాత్రం దయచేసి మానకండి.ఇంత మంచి ఫ్రీ కామెడీ మీలాంటి వారి దగ్గర కాకపోతే ఇంక నాకెక్కడ దొరుకుతుంది?
read more " ఉచిత సలహాలు "

19, ఆగస్టు 2014, మంగళవారం

మహనీయుల దర్శన మార్గాలు

నా పోస్ట్ లు చదివిన చదువుతున్న కొందరు గుజరాత్ అడవులలోకి వెళ్లి అశ్వద్దామను కలవాలని ప్రయత్నించబోతున్నారని నాకు తెలిసింది.

మహనీయులైన వారిని కలవాలంటే విధానం అది కాదు.పిక్నిక్ కు వెళ్ళినట్లు అడవిలోకి వెళ్లి వెతికితే అక్కడ ఎవరూ కనిపించరు.ఇంకా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో ఏ నక్సలైట్లో రాడికల్సో కనిపించవచ్చు.అది మరీ ప్రమాదం.

చిరంజీవులు ఉన్నారు.కానీ వారు మనకు కనిపించరు.వారికి అతీత శక్తులు ఉంటాయి.రకరకాల వేషాలలో రకరకాల చోట్ల వారు సంచరిస్తూ ఉంటారు.ఒకే సమయంలో అనేక చోట్ల కూడా ఉండగలరు.అందుకే అశ్వత్థామ గుజరాత్ అడవులలోనూ మధ్యప్రదేశ్ అడవులలోనూ హిమాలయాల లోనూ చాలామందికి కనిపించాడు.ఇప్పటికీ కనిపిస్తున్నాడు.

అలాగే ఆంజనేయస్వామి కూడా.

రామనామ భజనా స్మరణా జరిగేచోట ఆయన తప్పకుండా ఉంటాడని మన నమ్మకం.ఆయనను చూచిన వారు ఎందఱో నేటికీ ఉన్నారు.

అయితే అలా చూడడానికి విధానం వేరే ఉన్నది.బజారులో వస్తువుకోసం వెదికినట్లు వెదికితే వారు కనపడరు.వారి దర్శనాన్ని పొందాలంటే దానికి చాలా సాధనాబలం ఉండాలి. నియమయుతమైన జీవితాన్ని కొన్నేళ్ళ పాటు తపోమయ దీక్షలో గడపి ఉండాలి.అప్పుడే వారిని దర్శించే భాగ్యం కలుగుతుంది.

నానా రకాల కోళ్ళనూ కుక్కలనూ పందులనూ ఇంకా ఇతర జంతువుల మాంసాలనూ తింటూ,సారాయి త్రాగుతూ,బ్రహ్మచర్యం లేకుండా,జీవితంలో నానా వెర్రివేషాలూ వేస్తూ, అసూయా కుళ్ళూ కుత్సితాలతో అహంకారంతో ఇంద్రియలాలసత్వంతో నిండి ఉన్న నేటి మనుష్యులు చిరంజీవుల దర్శనాన్ని కాంక్షించడం హాస్యాస్పదం. 

అదెన్నటికీ జరిగే పని కాదు.

నియమయుతమైన జీవితమూ నిరంతర తపస్సూ లేనిదే ఎవరూ వారిని దర్శించడం సాధ్యం కాదు.అలాంటి ఎవరో ధన్యాత్ములకు మాత్రమే వారి దర్శనం కలుగుతుంది.అది కూడా మనం అడవులలో పడి వెదికితే వారు కనబడరు.వారు కనిపించాలి అనుకుంటే మనకు కనిపిస్తారు.లేకుంటే వారు మన పక్కనే ఉన్నా కూడా మనం గుర్తించలేము.ఆయనెవరో ఎల్లయ్యో పుల్లయ్యో అనుకుంటాము.అలాంటి మాయ మన మనస్సులను ఆ సమయంలో కప్పివేస్తుంది.

పాతతరాలలో మన కుటుంబాలలో ఋషితుల్యులైన మనుష్యులు ఉండేవారు.వారు ఎంతో నియమయుతములైన జీవితాలను గడపేవారు.అలాంటి వారికి మహనీయుల దర్శనాలు కలగడం విచిత్రమేమీ కాదు.ఈనాడంటే బ్రాహ్మణ కుటుంబాలు కూడా భ్రష్టు పడుతున్నాయి గాని,మొన్న మొన్నటి వరకూ కూడా ఋషితుల్యులైన మనుష్యులు ప్రతి కుటుంబంలోనూ ఉండేవారు.

హైదరాబాద్ నుంచి సంజయ్ చంద్ర ఇలా వ్రాస్తున్నారు.
-----------------------------
అశ్వథామ యోగిపుంగవుని గురించి మీరు వ్రాస్తున్న పోస్ట్ లను చదువుతున్నప్పుడు, మీతో రెండు విషయాలను పంచుకోవాలని అనిపించింది.

1) మా తాతగారు శ్రీ బులుసు సత్యనారాయణ గారు (మా నాన్నగారి తండ్రి) 

ఈయనకు ఆంజనేయస్వామి వారి దర్శనము అయింది అని అంటారు. విజయవాడ కొండలలోని పురుగుల ఆంజనెయస్వామి (వీర అభయ) వారిని ఉపాసించారట.మూడు తరముల వరకు యేవిధమైన పీడలు లేకుండా మా కుటుంబాన్ని రక్షించెదను అని స్వామి అభయం ఇచ్చారట. ఈయన తపోబలము గురించి మా బంధు వర్గములో చాలా సంఘటనలు కధలుగా చెపుతారు. వీరిని నేను చూడలేదు.

2) మా తాతగారు శ్రీ రొయ్యూరు సత్యనారాయణగారు ( మా తల్లిగారి తండ్రి) :

ఈయనకు అశ్వథామ యోగిపుంగవుని దర్శనము అయ్యింది అని మా తల్లిగారు చెప్పేవారు. వీరు నిరంతర ధ్యాని. అత్యంత ప్రశాంత మనస్కులు. వీరు నిరంతర గాయత్రిమంత్ర ధ్యానులు. వీరికి భద్రాచలం అడవులలో అశ్వథామవారు ఒక సూర్యోదయ సమయమున కనిపించారట. ఫది అడుగుల ఎత్తు, బ్రహ్మతేజముతొ,అత్యంత ఆత్మవిశ్వాసముతో కనిపించారట.చిరు దరహాసముతో వీరివంక కరుణపూర్వకముగా చూసి అడవిలోకి వెల్లిపోయారంట.మా తాతగారి తండ్రిగారు, భద్రాచలములో సన్యాసాస్రమములో శ్రీరామ ఐక్యం అయినప్పుడు ఈ సంఘటన జరిగిందట.
-------------------------------------
తపోబలం ఉన్నపుడు అలాంటి వారి దర్శనం కలుగుతుంది.అంతేగాని తపస్సు లేకుండా ఉత్త క్యూరియాసిటీతో కొండలలో కోనలలో తిరుగుతూ అక్కడి గుహలలోకి పోయి తొంగి చూస్తే ఏమి జరుగుతుందో వేమన యోగి ఒక పద్యంలో వివరించాడు.

ఆ||గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ
క్రూరమృగ మొకండు తారసిలిన
ముక్తి మార్గమదియె ముందుగా జూపురా
విశ్వదాభి రామ వినురవేమ

గురువుల కోసం కొండ గుహలలోకి పోయి వెదికితే అక్కడ ఏ పులో సింహమో కూచుని ఉంటే అప్పుడు ఎక్కువ కష్టపడకుండా ముక్తిమార్గాన్ని అదే చూపిస్తుంది.ఉత్త బోధ చేసి ఊరుకోదు.సరాసరి మోక్షాన్నే ప్రసాదిస్తుంది.

ఒక వస్తువుకోసం ప్రయత్నం చెయ్యడంలో లౌకిక విధానాలు వేరు.ఆధ్యాత్మిక విధానాలు వేరు.చాలాసార్లు ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి.ఆధ్యాత్మిక లోకంలో అర్హత ప్రధానమైనది.దానిని సంపాదించకుండా ఊరకే దేశాలు పట్టుకుని తిరిగినంత మాత్రాన అక్కడ ఏమీ కనపడదు.

చదువరులు ఈ విషయాన్ని చక్కగా గ్రహించాలి.
read more " మహనీయుల దర్శన మార్గాలు "

17, ఆగస్టు 2014, ఆదివారం

అశ్వత్థామ - మహాభారతంలోని కొన్ని ధర్మసూక్ష్మాలు

మహాభారతం ఒక అద్భుతమైన చరిత్రగ్రంధం.

అంతేకాదు అది సమస్త ధర్మాల సమాహారం.సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రపంచం మొత్తంలో ఈ గ్రంధం ఒక్కటి చాలు.సమస్త ధర్మాలూ అవగతం అవుతాయి.

ఇటువంటి అద్భుతమైన గ్రంధరాజం ప్రపంచవాజ్మయ చరిత్రలోనే లేదు అనేది నిజం.

కానీ మనకు మన గ్రంధాల విలువ తెలియదు.

అది కలిప్రభావం.

అసలు మహాభారతాన్ని వ్యాస భగవానుడు ఇన్ని వందల పాత్రలతో ఎలా రచించాడో అన్నన్ని ఘట్టాలను అంత అద్భుతంగా ఎలా వర్ణించాడో, ఆయా పాత్రల ధర్మాలనూ స్వరూప స్వభావాలనూ వాళ్ళ మధ్యన నడిచిన భావోద్వేగాలనూ ఆవేశ కావేషాలనూ ఎలా అక్షరబద్ధం చేసినాడో ఊహిస్తే దిగ్భ్రమ కలుగుతుంది.వ్యాసమహర్షి యొక్క అద్భుతమైన మేధస్సుకు మన చేతులు అప్రయత్నంగా ఆయనను స్మరిస్తూ నమస్కార ముద్రలోని వెళ్ళిపోతాయి.మనస్సు ఆయనపట్ల అమితమైన భక్తిభావంతో నిండిపోతుంది.

'నానృషి కురుతే కావ్యమ్'-

ఋషి కానివాడు కవి కాలేడు.కావ్యాన్ని వ్రాయలేడు అంటుంది మన సంస్కృతి.

కవి అనే పదానికి ప్రాచీనమైన అర్ధం ఋషి,ద్రష్ట అని.అంతేగాని ఏవో రెండు కధలు వ్రాసేసినంత మాత్రాన ఎవ్వరూ కవులు కాలేరు.నేటి ప్రజలు వారి జీవితాలలాగే అన్ని పదాలను కూడా భ్రష్టు పట్టించారు.వాటి అసలు అర్ధాలు మాయమై ఆ అర్ధాల స్థానంలో వీరనుకుంటున్న అర్ధాలు వచ్చి చేరుకున్నాయి.అంటే కలిప్రజలు భాషను కూడా ఖూనీ చేసేశారన్నమాట.

కావ్యాలను అందరూ వ్రాయలేరు.కావ్యం అనబడే దానికి కొన్ని లక్షణాలుండాలి.

సరే ఆ సంగతులు ప్రస్తుతానికి అలా ఉంచుదాం.

మహాభారతంలోని పాత్రలు ఎంత గొప్పవంటే ప్రతి పాత్రా తానూ ధర్మాన్ని ఆచరిస్తున్నాననే అనుకుంటుంది.వారిలో ఎవరి లాజిక్ వారికుంటుంది.శకునీ దుర్యోధనుడూ వంటివారు కూడా ధర్మాన్ని అనుసరిస్తున్నామనే అనుకున్నారు.ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని చేస్తున్న దుశ్శాసనుడు కూడా తన అన్న ఆజ్ఞను పాటిస్తున్నాననీ అదే ధర్మమనీ అనుకున్నాడు.

ఈ ధర్మం అనేది చాలా విచిత్రమైనది.

విశ్వం మొత్తానికీ వర్తించే ధర్మం ఒకటి ఉన్నది.అది కాకుండా మానవ జీవితంలోని స్థితినిబట్టీ స్థాయినిబట్టీ కులాన్నిబట్టీ వృత్తినిబట్టీ సాంఘికమర్యాదను బట్టీ కుటుంబమర్యాదను బట్టీ ఇలా రకరకాలైన ధర్మాలు ఉన్నాయి.ఆయా ధర్మాలను విశ్వధర్మంతో అనుసంధానం చేసుకుంటూ జీవించడమే దైవధర్మం.అప్పుడు కర్మ తగ్గుతుంది.

ఈ నియమాన్ని తప్పి,ఎవరి ధర్మం వారిదే అనుకుంటూ,వారివారి ఆలోచనలన్నీ సరియైనవే అనుకుంటూ ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తే విశ్వధర్మం దూరమౌతుంది.అది కర్మ పెరగడానికి దారితీస్తుంది.ఆ కర్మ కొంత ఫలితాన్నిస్తుంది.మళ్ళీ అది ఇంకొక కర్మకు దారితీస్తుంది.ఈ వలయం ఇలా నిరంతం తిరుగుతూ మనిషిని జన్మవలయాలలో బంధించి పారేస్తుంది.

ఈ విషయాన్ని మహా భారతం కంటే చక్కగా చెప్పిన గ్రంధం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కానేరదు.

ఇందులోని పాత్రలకున్న ఇంకొక్క విచిత్రమైన లక్షణం ఏమంటే-వాటిలో మనల్ని మనమే చూచుకోవచ్చు.జాగ్రత్తగా గమనిస్తే మహాభారత పాత్రలు ప్రతిమనిషి లోనూ ఉన్న అనేక విభిన్న దృక్పధాలుగా మనకు దర్శనమిస్తాయి.

సంతానం చెడునడతలో ఉన్నాసరే వారిమీద ఉన్న అతిప్రేమకు నిదర్శనాలుగా ధృతరాష్ట్రునివద్ద నుంచీ అనేకులు మనకు దర్శనమిస్తారు.

పతులు ఎలాంటివారైనా కూడా వారిని తూచా తప్పక అనుసరించే పాతివ్రత్య ధర్మం కలిగిన గాంధారి వంటి ఎందఱో వనితలు కనిపిస్తారు.

మంత్రములవంటి అతీత శక్తులతో ఆటలాడి తద్వారా ఎంతోమందికి ఎన్నోరకాల క్షోభలు కలగడానికి కారణమైన కుంతీదేవి వంటివారూ దర్శనమిస్తారు.

పాండవుల ప్రతాపానికి అసూయతో వారిని అంతం చెయ్యాలన్న దుగ్ధతో చివరికి అన్ని కోట్ల మంది చావుకు కారకుడైన దుర్యోధనుడు కనిపిస్తాడు.

పగతీర్చుకోవడం కోసం చాపకింద నీరులా కౌరవుల పక్షాన ఉంటూ చివరకు వారి వినాశానాన్నే కొనితెచ్చిన శకుని వంటి వారూ కనిపిస్తారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ఇంకొక ప్రత్యేకవ్యాసం అవుతుంది.అందుకని ఇంతటితో ఆపి మన విషయంలోకి వద్దాము.

అశ్వత్థామ కూడా మహాభారతంలోని మరుగున పడిన పాత్రలలో ఒకడు. సాహిత్యకారులు గానీ చరిత్రకారులు గానీ ఆయనకు పూర్తి న్యాయం చెయ్యలేకపోయారన్నది వాస్తవం.అందుకు ఒక కారణం ఏమంటే,ఆయన ఒక దుష్టుడూ దుర్మార్గుడూ అనుకోవడమే.

'పంచమవేదం' అని ఎంతో గౌరవంగా పిలువబడిన మహాభారతం వంటి ఒక ఉద్గ్రంధాన్నీ మహాకావ్యాన్నీ అర్ధం చేసుకోవాలంటే సంకుచితమైన దృష్టి ఉంటె ఏమాత్రం చాలదు.విషయాన్ని ఒకే ఒక్క కోణంలో చూస్తే అలాంటివారికి ఆ విషయపు లోతులూ ధర్మసూక్ష్మాలూ అర్ధం కావు.

ఒక విషయాన్ని అనేక కోణాలలో చూస్తూ తాను మాత్రం దేనివైపూ మొగ్గకుండా ప్రభావితుడు కాకుండా చూచే దృష్టినే 'సమగ్రదృష్టి' అంటాము. అలాంటి సమగ్రదృష్టి ఉన్నప్పుడే మహాభారతంలోని ధర్మసూక్ష్మాలు అర్ధమౌతాయి.లేకుంటే అర్ధం కావు.అటువంటి కధను రకరకాల ఘట్టాలలో మన ఎదుట సాక్షాత్కరింప చెయ్యడంలోనే వ్యాసమునీంద్రుని యొక్క అద్భుతమైన ప్రతిభ మనకు గోచరిస్తుంది.

ఉదాహరణకు--

పాండవులు మంచివారు.కౌరవులు చెడ్డవారు.అన్న ప్రాధమిక అవగాహన మనం ముందే ఏర్పరచుకుని భారతాన్ని చదివితే అది మనకు ఏమీ అర్ధం కాదు.పాండవులు మంచిగానే కనిపిస్తారు.కౌరవులు చెడ్డవారుగానే కనిపిస్తారు.కానీ అసలు విషయం అది కాదు.

ఇరుపక్షాలలోనూ ధర్మం ఉన్నది.ఇరుపక్షాలలోనూ అధర్మం ఉన్నది.ఆ ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసుకోవాలంటే భారతాన్ని pre-conceived ideas తో చదవకూడదు.ఉన్నదాన్ని ఉన్నట్లుగా నిష్పక్ష పాతంగా చదవాలి.అర్ధం చేసుకోవాలి.అప్పుడే దానిలోని సౌందర్యం అర్ధమౌతుంది.

మహాభారతం లోని ప్రతిపాత్రకూ ఒక ఆత్మ ఉన్నది.ఆ ఆత్మను మనలోకి ఆవహింప చేసుకోవాలి.దాని ఆరాటాన్నీ ఆలోచనలనూ బాధలనూ మానసిక సంక్షోభాన్నీ మనం 'ఫీల్' అవాలి.అలా చెయ్యగలిగితే అప్పుడు మాత్రమే మనకు ఆ పాత్ర పూర్తిగా అర్ధమౌతుంది.అప్పుడే వ్యాస మహాభారతం ఎంతటి గొప్ప గ్రంధమో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది.

ఇక మన ప్రస్తుత విషయం లోకి వద్దాం.

మహాభారతం చదివినవారికి అనేక సందేహాలు తేనెటీగలవలె ముసురుకుంటాయి(మనసు పెట్టి చదివితే).ఆ సందేహాలు అన్నీ నేను ఇక్కడ చర్చించ బోవడం లేదు.ఒక్క అశ్వత్థామ కథలో వచ్చే సందేహాలను మాత్రమె ఇక్కడ చర్చిస్తాను.

1.
అశ్వత్థామకు చిరంజీవిత్వ వరాన్ని ఇచ్చిన ద్రోణాచార్యుడు 'అశ్వత్థామ హత:' అన్న మాటను నమ్మి నిండు యుద్ధభూమిలో ఎలా అస్త్రసన్యాసం చేశాడు?

నిజమే.ఈ వరం ఇచ్చినది తానే.వ్యాసమునీంద్రుని అత్యద్భుతమైన ప్రతిభ ఇలాంటి చోట్లనే మనకు దర్శనమిస్తుంది.మానవ సహజములైన బలహీనతలను అంత చక్కగా వర్ణించడం బహుశా ఆయనకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాకపోవచ్చు.'ప్రమాదో ధీమతామపి' అంటారు.అలాగే ధీమంతులు నిగ్రహపరులు అయినవారికి కూడా ఆపత్కాలంలో మనస్సు చెదిరిపోతుంది అనడానికి ఇదే రుజువు.

తాను చిరంజీవినన్న విషయం తెలిసినా కూడా అశ్వత్థామ ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసినాడు.అంటే కూడా ఇదే సమాధానం.


ధృతరాష్ట్రునికి ఎంత పుత్రవ్యామోహం ఉన్నదో ద్రోణునికీ అంత ఉన్నది. ఎందుకంటే అశ్వత్థామ ఎంతో తపస్సు అనంతరం పుట్టినవాడు. కనుక లేకలేక కలిగిన పుత్రుడంటే అమితమైన ప్రేమ ద్రోణునికి ఉండటం సహజం.

యుద్ధమధ్యంలో మన తర్కం పనిచెయ్యదు.అక్కడ ఆవేశమే ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి అది మంత్రాంగ మందిరం కాదు.అలా ఆలోచిస్తూ కూచుంటే అక్కడ ప్రాణాలు క్షణంలో గాలిలో కలసి పోతాయి.మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకుంటూ విజ్రుమ్భిస్తేనే అక్కడ నిలవడం సాధ్యమౌతుంది.

ఇంకొక్క విషయం.

ఆ మాట చెప్పినది ఎవరు?ఎట్టి పరిస్తితుల్లోనూ అబద్ధం చెప్పడని పేరుపొందిన ధర్మరాజు.అతను ప్రాణం పోయినా కూడా అబద్ధం ఆడడని గురువైన ద్రోణునికి తెలుసు.కనుక అతను చెప్పినపుడు నమ్మకపోవడం అంటూ ఉండదు.ఈ విషయం తెలిసే కృష్ణుడు ధర్మరాజు చేత ద్రోణునికి వినబడేటట్లుగా ఆ అబద్ధం పలికిస్తాడు.

కనుక యుద్ధభూమిలో ద్రోణుడు అటువంటి హటాత్ నిర్ణయం తీసుకుని అస్త్రసన్యాసం చెయ్యడం సమంజసమే.

2.
ఋషి పుత్రుడైన అశ్వత్థామ యుద్ధ న్యాయాన్ని విస్మరించి రాత్రిపూట పాండవ శిబిరం మీదకు దాడి చెయ్యడం సబబేనా?

దీనికి సమాధానం ఇప్పటివరకూ వ్రాసిన పోస్ట్ లలో వివరంగానే చెప్పినాను.

అశ్వత్థామకు ధర్మం తెలుసు.కానీ మిత్రధర్మం ఒకవైపూ,తండ్రి వధకు ప్రతీకారం చెయ్యడం ఒకవైపూ,పాండవులు చేసిన అధర్మయుద్ధాలు ఒకవైపూ కనిపిస్తూ ఆయన్ని పురికొల్పాయి.తాను చేస్తున్నది తప్పు కాదు అన్న బలమైన భావంతోనే ఆయన ఆ పని చేశాడు.పైగా తనను ఆవహించి ఉన్న రుద్రశక్తి ఆయనను కుదురుగా ఉండనివ్వదు.అందుకే ఆయనలా చెయ్యవలసి వచ్చింది.

3.
అన్నీ తెలిసి కృష్ణుడు ఆ రాత్రి పూట పాండవులను ఎక్కడికో తీసుకుపోవడం ఏంటి?అంటే ఆయన కూడా ఈ పనిలో అశ్వత్థామకు సహకరించినట్లే కదా?

అంతే.అసలు ఈ యుద్ధాన్ని నడిపించినదే ఇద్దరు.ఒకరు కృష్ణుడు ఇంకొకరు శకుని.ఒకరు స్క్రిప్ట్ రైటర్ అనుకుంటే ఇంకొకరు డైరెక్టర్ అనుకోవచ్చు.

ఆ మాటకొస్తే అభిమన్య సంహార సమయంలో కూడా కృష్ణుడికి అన్నీ తెలిసే అర్జునుడిని దూరంగా తీసుకువెళ్ళాడు.ఈ యుద్ధంలో అంతా సర్వనాశనం అవుతుందని కృష్ణుడు తన వంతుగా ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు.కర్మ బలీయంగా ఉన్నపుడు మంచి చెప్పినా తలకెక్కదు అంటే ఇదే.

అన్నీ దగ్గరుండి చేయించినది ఆయనే.కానీ ఆయనకు ఏమీ అంటలేదు.అందుకే గీతలో ఆయన ఇలా అంటాడు."నేను అన్నీ చేసినా ఏమీ చెయ్యనివాడనే.ఎందుకంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం నాకు లేదు.'

4.
అలాంటప్పుడు మరి అశ్వత్థామను తాను శపించడం ఎందుకు?

అశ్వత్థామ చిరంజీవి.అతను చేసిన కర్మను అనుభవించడానికి అతనికి మరొక మానవజన్మ లేదు.రాబోయే జన్మలో అతడు వేదవ్యాసునిగా జన్మిస్తాడని అంటారు.ఆ తర్వాత సప్తఋషులలో ఒకరౌతాడని అంటారు. కనుక ఈ మానవకర్మను కుదించడానికి కృష్ణుడు అలా శపించాడు.తద్వారా అతనికి చివరకు ఇంకా ఉత్తమగతే కలిగింది.కృష్ణుడు సరాసరి శాపం ఇచ్చిన సన్నివేశాలు ఇది తప్ప ఇంకెక్కడా నాకు తెలిసినంతవరకూ లేవు.

భగవంతుని శాపం కూడా వరమే(అర్ధం చేసుకోగలిగితే).

5.
మహాభారత  యుద్ధంలో ఎన్నో అన్యాయాలు కృష్ణుడే దగ్గరుండి మరీ చేయించాడు.ఇది ధర్మం ఎలా అవుతుంది?

సామాన్య దృష్టికి అది ధర్మం కాకపోవచ్చు.కానీ సూక్ష్మ దృష్టితో ఆయా కర్మలనూ వాటి ఫలాలనూ అర్ధం చేసుకుంటే అది న్యాయమే అవుతుంది.వారు వారు అలా ఎందుకు చంపబడ్డారో ప్రతిదానికీ ఒక హేతువున్నది.అది కృష్ణునకు తెలుసు.

ఒకవేళ అలా ఏమీ హేతువులు లేవు అనుకున్నప్పటికీ,ధర్మాధర్మములను సృష్టించిన భగవంతునికి వాటి కట్టుబాటు ఏమున్నది?సాధారణంగా ఆయన కూడా వాటిని ఉల్లంఘించడు.కానీ ప్రత్యేక పరిస్తితులలో ఆయన ఒకవేళ మనం అనుకునే అధర్మం చేసినా అది ధర్మమే అవుతుంది.ఎందుకంటే ధర్మమూ తానే అధర్మమూ తానే,రెండూ అవడం ద్వారా రెంటికీ అతీతుడూ తానె గనుక.

ఒకదేశపు చట్టం ఇంకొక దేశంలో పనికిరాదు.ఒకచోట నేరం ఇంకోచోట కాకపోవచ్చు.ఇతర దేశాలలో లిట్టరింగ్ నేరం.మన దేశంలో అది సర్వసాధారణం.ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే అది నేరం.అతనికి ఉరిశిక్ష పడుతుంది.కానీ యుద్ధంలో శత్రుదేశ సైనికులను చంపినవాడికి అవార్డులూ పతకాలూ ఇవ్వబడతాయి.ఇద్దరూ చేసినది హత్యే.ఒకరికి ఉరేమిటి?ఇంకొకరికి అవార్డులేమిటి?

కనుక న్యాయమూ ధర్మమూ అనేవి దేశకాలపాత్రతలను బట్టి మారిపోతూ ఉంటాయి.ఒకరికి ధర్మం అయినది ఇంకొకరికి కాకపోవచ్చు.

ఒక్కొక్కసారి పెద్ద నేరాన్ని నివారించడానికి చిన్న నేరం చెయ్యవలసి వస్తుంది.ఆ చిన్న నేరం అప్పుడు ధర్మమే అవుతుంది.పెద్దప్రాణమా చిన్న ప్రాణమా ఏదో ఒకటే కాపాడగలం అనిన పరిస్తితిలో వైద్యుడు తల్లి ప్రాణాన్ని రక్షించి పిల్ల ప్రాణాన్ని బలిచేస్తాడు.అది నేరం కాదా?అంటే ఏం చెప్పగలం? ఆ పరిస్థితిలో అది న్యాయమే.కానీ మామూలు దృష్టికి అది న్యాయం కాకపోవచ్చు.ప్రాణ విత్త మాన భంగములయందు అబద్ధం చెప్పడం తప్పుకాదు అని ధర్మశాస్త్రం అంటుంది.

కనుక మూడు కాలములూ తెలిసిన భగవంతుని చర్యలను మన సంకుచితమైన ధర్మాధర్మ దృష్టితో చూడటానికి మనమెవరం?దైవం ఏది చేసినా అది ధర్మమే.ఒకవేళ మనం అనుకునే అధర్మం ఆయన చేసినా కూడా అదీ ధర్మమే.కాకపోతే దానిలోతుపాతులు మనకు తెలియక మనం అలా అనుకోవచ్చు.

6.
వ్యాసుడూ పరశురాముడూ ఎందుకు అశ్వత్థామను రక్షించాలని ప్రయత్నించారు?

ఋషులు కారుణ్యమూర్తులు.శరణాగత రక్షకులు.అందులోనూ పరశురాముడు విష్ణు అవతారం.ఆయన సాక్షాత్తూ భగవంతుడే.

చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి తమను శరణు కోరిన వారిని రక్షించడం దైవధర్మం.వారికి తగిన దారి చూపించడమూ అందులో భాగమే.యుద్ధం చివరలో కూడా ఇప్పుడైనా ఈ పద్ధతి మానుకొని దారికి వస్తే మంచిదని కృష్ణుడు దుర్యోధనునికి ఎంతో చెబుతాడు.అప్పుడు కూడా ఆయన ఇంకా ఒక అవకాశం ఇస్తూనే ఉన్నాడు.

దైవసృష్టిలో శాశ్వతస్వర్గం గానీ శాశ్వతనరకం గానీ లేవు.తప్పును దిద్దుకోనడానికి ఇక్కడ ప్రతిక్షణమూ అవకాశం ఇవ్వబడుతూనే ఉంటుంది. అదే దైవన్యాయం.ఆ న్యాయానుసారమే వారు అశ్వత్థామను రక్షించ బూనుకున్నారు.పైగా వ్యాసమహర్షి కూడా చిరంజీవి.ఆయన కూడా విష్ణు భగవానుని అంశావతారమే.కనుక వారిలో దైవసహజమైన క్షమాగుణం ఉండటం సహజం.

(సంపూర్ణం)
read more " అశ్వత్థామ - మహాభారతంలోని కొన్ని ధర్మసూక్ష్మాలు "

13, ఆగస్టు 2014, బుధవారం

అశ్వత్థామ--కృష్ణుని శాపం

సుయోధనుడు తొడలు విరిగి రణరంగంలో పడి ఉన్నాడు.

అతని శరీరం అంతా వజ్రకాయమే.కాని తొడలు మాత్రం కాదు.తల్లి ఎదురుగా నగ్నంగా నిలబడటానికి సిగ్గుపడి అంతవరకూ కప్పుకున్న ఫలితంగా ఆ భాగం మాత్రం మానవ సహజమైనదిగా ఉండిపోయింది.మిగతా శరీరం అంతా గాంధారి పాతివ్రత్య బలంతో కూడిన దృష్టి సోకి వజ్రకాయం అయ్యింది.

కృష్ణుని సూచనతో భీముడు అక్కడే గదాఘాతం చేశాడు.సుయోధనుడు తొడలు విరిగి నేలకూలిపోయాడు.

అశ్వత్థామ పాండవశిబిరంలో మారణహోమం చేసిన రాత్రంతా సుయోధనుడు దిక్కులేని పక్షిలా చావుకోసం ఎదురుచూస్తూ రణరంగంలో పడి ఉన్నాడు.

తెలతెలవారబోతున్నది.

అశ్వత్థామా కృపాచార్యుడూ కృతవర్మా హుటాహుటిన రణభూమికి చేరుకున్నారు.సుయోధనుడు ఎప్పుడు మరణిస్తాడా ఎప్పుడు అతని దేహాన్ని పీక్కు తిందామా అని క్షుద్రమృగాలూ రాబందులూ అతని చుట్టూ మూగి దగ్గరకు రాబోతున్నాయి.అతనికి వాటిని అదలించే శక్తి కూడా లేదు.

ఒకప్పుడు మహారాజులు అతని సమక్షంలోకి రావాలంటే భయపడేవారు. అతని ఆజ్ఞను శిరసావహించడానికి ఎల్లప్పుడూ వందలాది దాసదాసీ జనం సిద్ధంగా ఉండేవారు.అతను కనుసైగ చేస్తే, చేసంజ్ఞ చేస్తే, వెంటనే ఏది కావాలంటే అది సిద్ధం అయ్యేది.

ఇప్పుడో,తన చుట్టూ మూగుతున్న క్షుద్ర మృగాలనూ పక్షులనూ తోలడానికి కూడా అతని చెయ్యి లేవడంలేదు.అతని శరీరంలో శక్తి ఇసుమంతైనా లేదు. రాత్రంతా రక్తం కారిపోయిన దేహంతో నీరసం ఆవహించి మరణానికీ జాగ్రదావస్థకీ మధ్యన గల ఒక అయోమయ స్థితిలో అతడు ఊగులాడుతున్నాడు.

ముగ్గురూ సుయోధనుని స్థితిని చూచారు.

భోరున విలపించారు.

రారాజుకు ఎంతటి గతి పట్టింది?ఒకప్పటి మహావైభోగం ఎక్కడ? ఈ దుర్గతి ఎక్కడ?కాలం ఎవరినీ కలకాలం చల్లగా చూడదు కదా.మహారాజులైనా సరే కాలం కన్నెర్ర జేస్తే మట్టిలో కలసి కనుమరుగు కాక తప్పదు.అమేయమైన కాలప్రభావానికి తలోగ్గని ప్రాణి ఈ సృష్టిలో లేనేలేదు.కాలం కలసి వస్తున్నంత వరకే ఎవరి అహాలైనా.అది గతి తప్పిన మరుక్షణం రాజులైనా సరే తరాజులు కాక తప్పదు.

ముగ్గురూ ఎంతో సేపు పిలిచీ కుదిపీ రకరకాల పాట్లు పడిన తరువాత అతికష్టం మీద సుయోధనుడు కళ్ళు తెరిచాడు.కళ్ళు తెరవడమే అతనికి బ్రహ్మప్రళయం అయ్యింది.శరీరంలోని రక్తమంతా పోవడం చేత అతడు మరణానికి అతి చేరువలో ఉన్నాడు.అసలా క్షణంలో అతడు మరణించేవాడే.వీరు పిలుస్తున్న పిలుపులు లీలగా వినబడి,పోతున్న ప్రాణాలను ఎంతో కష్టంతో కూడగట్టుకుని పళ్ళబిగువున కళ్ళు తెరిచాడు.

'మిత్రమా.పాండవపక్షంలో అందరినీ వధించాను.మనవైపు మేము ముగ్గురం మిగిలాము.వారివైపు పంచపాండవులూ కృష్ణుడూ సాత్యకీ మిగిలారు.ఇన్ని అక్షౌహిణుల సైన్యంలో చివరకు మిగిలినది మేమే.వారు దొరికితే వారినీ వదిలేవాడిని కాను.కానీ వారు కనపడలేదు.ఎటో పారిపోయారు.బహుశా ఇది ఆ మాయావి కృష్ణుని పన్నాగమే అయి ఉంటుంది.నీకు ఈ వార్త చెబుదామని హుటాహుటిన వచ్చాము.' అన్నాడు అశ్వత్థామ.

ఆరిపోబోతున్న సుయోధనుని ముఖంలో చిరునవ్వు మెదిలింది.ఒక్క క్షణం అశ్వత్థామ కళ్ళలో కళ్ళు కలిపాడు సుయోధనుడు.ఆ కళ్ళలో అనంతమైన కృతజ్ఞతాభావం అశ్వత్థామకు గోచరించింది.

అశ్వత్థామ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

'మిత్రమా.నీ ఋణం తీర్చుకున్నాను.నా తండ్రి ఋణం తీర్చుకున్నాను.మా కుటుంబాన్ని నీవు ఆదుకున్నావు.దరిద్రంలో అలమటిస్తున్న మా తండ్రిగారిని నీవు ఆదరించి ఉన్నతమైన స్థానాన్నిచ్చావు.మాకు ఏ లోటూ లేకుండా జీవితాంతమూ రాజభోగాలతో పోషించావు.నీకు మేము ఋణపడి ఉన్నాము.నీవు మాకు చేసిన మేలును మరచిపోతే మేము కృతఘ్నులము అవుతాము.మాకు ఉత్తమ గతులు కలగవు.అందుకే ప్రాణాలకు తెగించి నీ ఋణం తీర్చుకున్నాను.యుద్ధంలో మిగిలిన వేలాదిమంది పాండవ పక్షపు యోధులను ఈ చేతులతో అంతం చేశాను.' అన్నాడు అశ్వత్థామ.

సుయోధనుడు మాట్లాడలేకున్నాడు.మౌనంగా కళ్ళతోనే చిరునవ్వు నవ్వినాడు.

'మిత్రమా.మరొక్క మాట.నీవు కొద్ది క్షణాలలో స్వర్గాన్ని చేరుకుంటావు. మాకు అర్ధమౌతున్నది.అక్కడ మా తండ్రిగారూ,భీష్మ పితామహులూ, కర్ణుడూ,ఇంకా నీ సోదరులూ ఇతర యోధులూ నీకు స్వాగతం చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంటారు.వారిని ఇంకొద్ది క్షణాలలో నీవు కలుసుకుంటావు.

నా తండ్రికి నా మాటగా ఒక్క విషయం చెప్పు.'నీ సుతుడు అప్రయోజకుడు కాడు.నీ దుర్మరణానికి కారకులైనవారిని అతడు అంతం చేసినాడు.నీ ఋణం తీర్చుకున్నాడు.నీ గోత్రఋషుల ఋణం అతడు తీర్చుకున్నాడు.అతన్ని చూచి నీవు గర్వించేలా చేసినాడు.' అని నా మాటగా మా నాన్నగారికి చెప్పు.' అని అడిగినాడు అశ్వత్థామ.

సుయోధనుడు 'నీ కోరిక తీరుస్తాను.అలాగే చెబుతాను' అన్నట్లు చూస్తూనే ఉన్నాడు.మెల్లగా అతని కనురెప్పలు వాలిపోయాయి.అతని కళ్ళు నిర్జీవంగా మారిపోయాయి.అప్పటివరకూ పోదామా వద్దా అన్నట్లు కొట్టుకుంటున్న అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.అతని ఆత్మ శరీరం నుంచి విడివడి స్వర్గం వైపు తేలిపోయింది.

మహాభారత యుద్ధంలో చివరి ఘట్టం ముగిసింది.విజయం పాండవుల పరమైంది.కానీ,ఆ సామ్రాజ్యంలో యువకులు మిగిలిలేరు.వయస్సులో ఉండి శరీరశక్తి ఉన్న మగవారందరూ యుద్ధంలో చనిపోయారు.ఉన్న మగవారందరూ ముసలివారు.ఇక మిగిలింది స్త్రీలు.వయసులో ఉన్న స్త్రీలందరూ విధవలయ్యారు.స్త్రీలూ పిల్లలూ ముసలివారితో కూడిన రాజ్యం ధర్మరాజు పరమైంది.అంత యుద్ధం చేసి విజయాన్ని అందుకున్నా కూడా పాండవులకు దాని అసలైన ఫలం దక్కలేదు.వీరులు లేని రాజ్యం అంటే అండ లేని స్త్రీవంటిదే.

ముగ్గురు వీరులూ ఒకరినుంచి ఒకరు బాధాతప్త హృదయాలతో వీడ్కోలు తీసుకున్నారు.

కృతవర్మ యాదవసైన్యం లోని వాడు.యుద్ధ పంపకాలలో కృష్ణుడు పాండవులవైపు ఉన్నాడు.అతని సైన్యం కౌరవుల పక్షాన యుద్ధం చేసింది.ఆ బృందంలోని వాడే కృతవర్మ.కనుక అతను తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు.

ఇక మిగిలింది మేనమామా మేనల్లుడూ అయిన కృపాచార్యుడూ అశ్వత్థామా.ఇద్దరూ చిరంజీవులే.ఇద్దరికీ చావులేదు.

అశ్వత్థామను ఆవహించిన రుద్రశక్తి వదిలిన తర్వాత అతని ఆలోచనలో మార్పు రాసాగింది.తను చేసిన మారణహోమం ఒప్పేనా అని అతనిలో అంతర్మధనం మొదలైంది.ఎంతైనా రుషిపుత్రుడు కదా.ఎంత కాదన్నా ధర్మం అతని రక్తంలోనుంచి పోదు.

అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురికావడం మొదలుపెట్టాడు. అతని మనస్సే అతన్ని ప్రశ్నించడం సాగించింది.

'సుయోధనుని పక్షాన యుద్ధం చేశావు బాగానే ఉంది.మిత్రధర్మం కాబట్టి, కృతజ్ఞత చూపాలి కాబట్టి,విశ్వాసం ఉండాలి కాబట్టి అలా చేశావు.అది సరే.కానీ రాత్రిపూట అంతమందిని అలా చంపడం సరియైన పనేనా? అందులో చిన్నపిల్లలైన ఉపపాండవులను అలా కిరాతకంగా చంపడం న్యాయమేనా?పోనీ దృష్టద్యుమ్నుని చంపావంటే,నీ తండ్రి వధకు ప్రతీకారం అనుకోవచ్చు.కానీ ఉపపాండవులేం చేశారు?మిగతా సైన్యం ఏం చేసింది?జంతువులేం పాపం చేశాయి?వాటిని కూడా వదలకుండా వధించావు కదా?ఇది ధర్మమేనా?ఎంత క్షత్రియ ధర్మాన్ని పాటించినప్పటికీ నీలో బ్రాహ్మణ రక్తం ప్రవహిస్తున్నది కదా?ఈ విధంగా చెయ్యడం నీకు సరియేనా?' అన్న ప్రశ్నలు అతనిలో సుడులు తిరగడం ప్రారంభించాయి.

అశ్వత్థామలో మనిషి మేల్కొన్నాడు.ఒకవైపు బాధ్యతా ఇంకోవైపు ధర్మమూ అతన్ని చిత్రహింస పెట్టసాగాయి.అతనా మానసిక సంఘర్షణను తట్టుకోలేక పోయాడు.తనకు ఆశ్రయం ఇచ్చేవారూ తన బాధను అర్ధం చేసుకునేవారూ ఎవరున్నారా? అని ఆలోచించాడు.

ఎవ్వరివైపూ మొగ్గకుండా తటస్థంగా ఉంటూ న్యాయం మాత్రమే మాట్లాడే మహర్షి వ్యాసుడు అతనికి గుర్తొచ్చాడు.వెంటనే వ్యాసమహర్షి ఆశ్రమానికి దారితీశాడు.

వ్యాసమహర్షి మహాజ్ఞాని.సర్వవేత్త.జగత్తుకే ఆయన గురువు.అశ్వత్థామ తన ఆశ్రమంలోకి ప్రవేశించడాన్ని ఆయన చూచాడు.సాదరంగా ఆహ్వానించాడు.

తన మనస్సులోని బాధను అశ్వత్థామ ఆయనకు వివరించాడు.ఆనాటి రాత్రి తనలోనికి ప్రళయకాల రుద్రాంశ ప్రవేశించడమూ తాను ఏ విధంగా పాండవ శిబిరాలలో ప్రవేశించి వారిని అందరినీ ఏ విధంగా అంతం చేసినదీ ఏదీ వదలకుండా అంతా వివరించాడు.

అంతా చెప్పిన మీదట ఈ విధంగా ప్రశ్నించాడు.

'మహాత్మా! నీవు సర్వజ్ఞుడవు.ఏ శక్తి నాచేత ఆ కార్యం చేయించిందో నీకు తెలుసు.అది అంతా గతంగా మారిపోయింది.ప్రస్తుతం నన్ను పశ్చాత్తాపం దహిస్తున్నది.మిత్రధర్మం కోసం ఆ విధంగా విలయతాండవం గావించాను. కానీ ఆ క్రమంలో మహాపాపాన్ని మూటగట్టుకున్నాను.ఏం చేస్తే ఈ పాపం పోతుంది?నాకేమీ దిక్కు తోచడం లేదు.నీవే నాకు దారిచూపాలి.నీవే నన్ను రక్షించాలి.' అని ఏడుస్తూ వ్యాసమునీంద్రుని పాదాలపైన పడి విలపించాడు.

వ్యాసమహర్షి నారాయణాంశ సంభవుడు.ఆయన దృష్టికి ముల్లోకాలలోనూ అడ్డులేదు.సమస్త ధర్మ కర్మ రహస్యములనూ ఆయన ఎరిగినవాడు.

పశ్చాత్తాపంతో బాధపడుతున్న అశ్వత్థామను ఆయన వీక్షించాడు.అశ్వత్థామ తన ప్రాణం గురించి భయపడటం లేదు.తాను చేసిన మారణహోమం తెలుసుకున్న పాండవులు కృష్ణసమేతంగా వచ్చి తనను చంపుతారేమో అని భయపడటం లేదు.తాను చేసిన పనిని గురించీ,తద్వారా మూటగట్టుకున్న పాపం గురించీ బాధపడుతున్నాడు.తన ప్రాణాన్ని రక్షించమని అడగడం లేదు.తన పాపాన్ని పోగొట్టే మార్గం చూపమని అడుగుతున్నాడు.అతనిలోని బ్రాహ్మణత్వం మేలుకుంటున్నది.కనుక ఇతనికి దారి చూపాలి అని తలచాడు.

'అశ్వత్థామా.భయపడకు.మార్గం ఉన్నది.సమస్త పాపాలనూ భస్మం చేసే ఒకేఒక్క మార్గం ఉన్నది.చెబుతాను విను.అదే తపస్సు.

పూర్వంకూడా ఇంతకంటే ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన ఎందరో ఆ తర్వాత పశ్చాత్తాప పడి తపస్సులో పునీతులై ఆ పాపాలను కడిగివేసుకుని కడిగిన ముత్యాలవలె స్వచ్చంగా ప్రకాశించారు.

తప్పు చెయ్యడం మానవసహజం. అది తప్పుకాదు.కానీ చేసిన తప్పును తప్పు అని గ్రహించలేక అహంతో విర్రవీగడమే అతి పెద్దతప్పు.

తప్పు చేసిన తర్వాత తెలుసుకుని ఆ తప్పును దిద్దుకోవాలనే సంకల్పం ఉన్నవారి కోసమే దయామయుడైన పరమాత్మ 'తపస్సు' అనే మార్గాన్ని సృష్టించాడు.దిద్దుకోగలిగితే చేసిన తప్పును దిద్దుకోవడమే అసలైన మార్గం.ఆ మార్గం లేనప్పుడూ,నీవు చేసినది దిద్దుకోలేని తప్పు అయినప్పుడూ తపస్సును మించిన మార్గం లేదు.

నీవు ఋషిపుత్రుడవు.తపస్సు నీ రక్తంలోనే ఉన్నది.కనుక బాధపడకు.నా ఆశ్రమంలో నీకు ఆశ్రయం ఇస్తాను.ఇక్కడ ఉండి తపస్సులో పునీతుడవు కా.' అంటూ కరుణతో కూడిన చల్లని చూపులతో చూస్తూ బోధించాడు వ్యాసమునీంద్రుడు.

'మహర్షిసత్తమా! మీ ఆజ్ఞ నాకు శిరోధార్యమైనట్టిది.మీ సమక్షమే సర్వతపస్సుల నిలయం.సచ్చిష్యుడైన వాడికి సద్గురుసాన్నిధ్యం కంటే వేరే గొప్పదైన తపస్సు లేదు.మీరు చెప్పినట్లే మీ సమక్షంలో ఉంటూ తపస్సులో నా కాలం గడపుతాను.' అంటూ కన్నీళ్ళతోనే తన అంగీకారం తెలిపాడు అశ్వత్థామ.

ఇదిలా ఉండగా,అక్కడ శ్రీకృష్ణుడూ పాండవులూ తెల్లవారుతూనే తిరిగి తమశిబిరాలకు వచ్చారు.జరిగిన ఘోరం చూచారు.విషయం గ్రహించారు.

అశ్వత్థామ వ్యాసమునీంద్రుని ఆశ్రమంలో ఉన్నాడన్న విషయం వారికి తెలిసింది.అగ్రహోదగ్రులై అందరూ ఆయుధాలు ధరించి వ్యాసాశ్రమం వైపు వేగంగా బయలుదేరారు.

ఋషుల సమక్షంలో కూర్చుని ఉన్న అశ్వత్థామకు వారు రావడం దూరం నుంచే కనిపించింది.వారు ఎందుకు వస్తున్నారో కూడా అర్ధమైంది.వ్యాసాది మహర్షులకు కూడా వారెందుకు వస్తున్నారో అర్ధమైంది.

చూస్తూండగానే వారి రధాలు ఆశ్రమ సమీపంలో ఆగాయి.అందరూ దిగి ఆశ్రమంలోకి వచ్చారు.అశ్వత్థామను చూస్తూనే వారి కోపాలు సహస్ర గుణములయ్యాయి.

'పట్టుకోండి.వధించండి దుర్మార్గుడిని' అంటూ వారు అశ్వత్థామను చుట్టుముట్టబోయారు.

చిన్ననాటి నుంచీ తాను అవలంబించిన క్షత్రియధర్మం అశ్వత్థామను వశం చేసుకుంది.తాను తపస్సును ఆచరిస్తానని వ్యాసునికి ఇచ్చిన మాటను ఆ క్షణంలో మరచిపోయాడు.శత్రువులు తనపైకి వస్తున్నారు.వారిని ఎదుర్కోవాలి.అంతే.

అతనికా క్షణంలో అదే గుర్తున్నది.ఇంకేమీ గుర్తురాలేదు.

వెంటనే పక్కనే ఉన్న ఒక గడ్డిపరకను చేతిలోకి తీసుకున్నాడు.వేదోక్తమైన విధానంతో మంత్రపఠనం చేస్తూ భయంకరమైన 'బ్రహ్మశిర'మనే అస్త్రాన్ని స్మరించి 'ఈ అస్త్రం పాండవులనందరినీ ఒకేసారిగా సంహరించుగాక' అని సంకల్పిస్తూ పాండవులపైనా కృష్ణునిపైనా ప్రయోగించాడు.

మంత్రప్రభావంతో ఆ గడ్డిపరక భయంకరమైన 'బ్రహ్మశిరాస్త్రం' గా మారి నిప్పులు కక్కుతూ వారివైపు దూసుకురాసాగింది.

అదొక భయంకరమైన మారణాస్త్రం.దానిఫలితంగా ఆ ప్రదేశం అంతా మాడిపోవటమే గాక పన్నెండేళ్ళ పాటు అక్కడ భయానకమైన కరువు తాండవిస్తుంది.అంటే,అక్కడ ఉన్నచెట్టు చేమలూ జంతువులూ అన్నీ మాడిపోతాయి.అంతే కాదు,అక్కడ ఉన్న నీటివనరులు అన్నీ ఆవిరై పోతాయి.ఆ భూమి అంతా ఎడారిగా బీడుభూమిగా మారిపోతుంది.నేటి ఆటం బాంబ్ వంటిదే ఈ అస్త్రం కూడా.అయితే శబ్దతరంగాలతో(sound vibrations) అది జాగృతం చెయ్యబడి ప్రయోగింపబడుతుంది.ఆ శబ్ద తరంగాలనే 'మంత్రం' అంటాము.

భయంకరమైన శక్తితో తమమీదకు దూసుకువస్తున్న ఆ బ్రహ్మశిరాస్త్రాన్ని చూచి వారు దిక్కుతోచక భయకంపితులై శ్రీకృష్ణుని వెనుకకు చేరారు.

ఆయన చిరునవ్వుతో వారిని చూచి-'ఎందుకు భయపడుతున్నారు?అర్జునా! నీకూ ఈ అస్త్రజ్ఞానం ఉన్నది కదా.నీవూ ఇదే అస్త్రాన్ని సంధించి విడచిపెట్టు.ఎందుకంటే దీనిని ఇదే విరుగుడు.ఇది తప్ప ప్రపంచంలో ఇంక ఏదీ దీనిని ఆపలేదు.' అని బోధించాడు.

వెంటనే అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని స్మరించి మంత్రపురస్సరంగా తానూ బ్రహ్మశిరాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు.

రెండు అస్త్రాలూ అనేకవందల సూర్యుల కాంతితో దిక్కుల్ని వెలిగిస్తూ ఒకదానిని ఒకటి గుద్దుకొనబోయాయి.అప్పుడు జరిగే మహావిస్ఫోటనంతో భూగోళమే బద్దలై పోతుందా అన్నంత ఉత్పాతం సంభవించబోయింది.

జరుగబోయే మహావిపత్తును గమనించాడు వ్యాసమహర్షి.తత్క్షణమే ఆ రెండు అస్త్రాల మధ్యలో నిలిచి తన తపోశక్తితో వాటిని ఎక్కడిదానినక్కడ ఆపివేశాడు.

వ్యాసమహర్షి వేదస్వరూపుడు.సమస్త వేదమంత్రములనూ వాటి అర్ధములనూ ఎరిగిన మహోన్నతుడైన దైవాంశసంభూతుడు.కనుకనే ఆ రెండు భయంకర మారణాస్త్రాలను తన శక్తితో నిలురించ గలిగాడు.ఇతరులకు అది అసాధ్యం.

'వీరులారా! మీ యుద్ధం ప్రపంచ నాశనాన్ని కొని తెచ్చేట్లున్నది. ఆపండి.ఇద్దరూ మీమీ అస్త్రాలను ఉపసంహరించండి.ఇది నా ఆజ్ఞ.' అని గద్దించాడు ఆయన.

అర్జునుడు శ్రీకృష్ణుని వంక చూచాడు.ఆయన అనుజ్ఞ ఇవ్వగా తన అస్త్రాన్ని ఉపసంహరించాడు అర్జునుడు.కానీ అశ్వత్థామకు ఉపసంహారవిధానం తెలియదు.

ద్రోణాచార్యుడు ప్రయోగ ఉపసంహార వివరాలను తన ప్రియశిష్యుడైన అర్జునునికే నేర్పించాడు గాని తన కుమారుడైన అశ్వత్థామకు నేర్పలేదు.ఎందుకంటే అశ్వత్థామ ఉద్రేకస్వభావం ఆయనకు చిన్ననాడే తెలుసు.ఎందుకంటే పుత్రుని కోసం ద్రోణాచార్యుడు ఎంతోకాలం పరమేశ్వరుని ప్రార్ధిస్తూ తపస్సు చేశాడు.ఆ వరప్రసాదంగా అశ్వత్థామ జన్మించాడు.కనుక అతనిలో రుద్రుని అంశ ఉన్నదని ద్రోణాచార్యునికి తెలుసు.ఇటువంటి రౌద్రస్వభావం కలిగిన వానికి ఈ అస్త్రం ఇవ్వరాదని ఆయన ఉద్దేశ్యం.

కోపధారియైన వాని చేతులలో భయంకర మారణాయుధం ఉంచితే ఎంత విపత్తు వాటిల్లుతుందో ఆయనకు తెలుసు.విచక్షణ లేకుండా దానిని ఎవరిమీద బడితే వారి మీద ప్రయోగిస్తే అప్పుడు జరిగే నాశనం ఊహకందనట్లుగా ఉంటుంది. 

కానీ శిష్యుడైన అర్జునునికి దానిని చెప్పడం చూచి,అశ్వత్థామ ఎంతో పోరుపెట్టి అలిగి తనూ ఆ విధానాన్ని నేర్చుకున్నాడు.అయితే,ద్రోణాచార్యుడు ప్రయోగవిధానాన్ని అశ్వత్థామకు నేర్పించాడుగాని ఉపసంహార విధానాన్ని నేర్పలేదు.ఎందుకంటే అలా చేస్తే ఆ అస్త్రం ఒక్కసారే ఉపయోగిస్తుంది.అది దాని నియమం.తన జీవితంలో ఆ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే వాడగలనన్న విషయం అశ్వత్థామకూ తెలుసు.

ఆ విధంగా అతనికి ఆ అస్త్రపు సంపూర్ణమైన జ్ఞానం ఇవ్వబడలేదు.అలా చెయ్యడం ద్వారా అశ్వత్థామ జీవితంలో ఎన్నో ఘోరాలు జరుగకుండా ద్రోణాచార్యుడు నిరోధించినవాడయ్యాడు.


ప్రాచీనకాలంలో బ్రాహ్మణఋషులు ఎంతటి నియమాలను పాటించేవారో ఈ ఒక్క ఉదాహరణతో గమనించవచ్చు.అర్హత లేదు అనిపిస్తే సొంత కుమారునికి కూడా ఆ రహస్యాలు నేర్పేవారు కారు.అర్హత ఉంటె పరాయివారికి కూడా నేర్పేవారు.

అదీ నిజమైన బ్రాహ్మణధర్మం.

నేడు బ్రాహ్మణులను విమర్శించేవారు ఈ ఉదాత్తమైన విలువలను ఒక్కసారి అర్ధం చేసుకుని తమకు ఈ విలువలలో కనీసం ఒక లక్షో శాతం అయినా ఉన్నాయా లేవా ఆలోచించుకుంటే ఆ విమర్శించే నోళ్ళు మూతపడతాయి.

అనుక్షణం స్వార్ధంతో దురాశతో అసూయతో ధనాశతో ఇంద్రియలాలసత్వంతో కుళ్లిపోతూ స్వలాభం కోసం ఎవరినైనా వంచించడానికి వెనుదియ్యని నేటి మనుషులు ప్రాచీన బ్రాహ్మణఋషుల నియమపూరిత జీవితాన్నీ నిత్యజీవితంలో వారు పాటించిన విలువలనూ ఊహించనుకూడా ఊహించలేరు.

ఇటువంటి ఉదాత్తమైన నియమయుతమైన జీవితాన్ని గడిపాడు గనుకనే తన కుమారునికి చిరంజీవిత్వాన్ని వరంగా ఇవ్వగలిగాడు ద్రోణాచార్యుడు.

ఋషులు శాపానుగ్రహ సమర్ధులు కదా!

'ఈ అస్త్రాన్ని ప్రయోగించడమే నాకు తెలుసు.దానిని ఉపసంహరించే విద్య నాకు తెలియదు.నా తండ్రి దానిని నాకు నేర్పలేదు.' చెప్పాడు అశ్వత్థామ.

అప్పుడు వ్యాసమునీంద్రుడు ఒక సూచన చేసాడు.

'అయితే ఒక పని చెయ్యి.ఆ అస్త్రాన్ని దారి మళ్ళించు.ఏ ప్రాణీ లేని ఒక నిర్జనభూమిలోకి దానిని ప్రయోగించు.అప్పుడు సరిపోతుంది.' అన్నాడు వ్యాసమునీంద్రుడు.

'అది వీలుకాదు మహాత్మా!! ఒక్కసారి పాండవనిర్వంశం చెయ్యమని నేను సంకల్పించి ఆ అస్త్రాన్ని వదిలాను.అస్త్రసంకల్పాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు.ఒకవేళ నేను అలా చెప్పినా ఆ అస్త్రం దాని దిక్కు మార్చుకోదు.కాని మీ ఆజ్ఞను కూడా నేను ధిక్కరించలేను.కనుక ఉభయతారకంగా ఒకపని చేస్తున్నాను.ఈ అస్త్రాన్ని గర్భవతి అయిన ఉత్తరలో పెరుగుతున్న పిండం మీదకు పంపడమే ప్రస్తుతం నేను చెయ్యగల పని.ఎందుకంటే అదికూడా ఒకరకంగా పాండవనిర్వంశం చెయ్యడమే గనుక, అలా చేస్తే నా అస్త్రప్రయోగ సంకల్పమూ సిద్ధిస్తుంది.మీరు చెప్పినట్లు పాండవుల నుంచి ఆ అస్త్రాన్ని దారిమళ్లించినట్లూ అవుతుంది.ఇంతకంటే ప్రస్తుతం మార్గం లేదు.' వివరించాడు అశ్వత్థామ.

ఈ పరిణామానికి అందరూ నిశ్చేష్టులైనారు.

నిజమే!

అదితప్ప ఆ పరిస్థితిలో ఇక మార్గం లేదు.ఒక సంకల్పసహితంగా ప్రయోగింపబడిన మహాస్త్రం ఎట్టి పరిస్థితిలోనూ దాని పనిని అది చెయ్యకుండా ఊరుకోదు.దాని దారి మళ్ళించడం అసాధ్యం.

పాండవులా పాండవబీజమా ఏదో ఒకటి మాత్రమే మిగిలి ఉండటానికి ఆ క్షణంలో అవకాశం ఉన్నది.

చూస్తుండగానే అశ్వత్థామ మళ్ళీ సంకల్పసహితంగా ఆ అస్త్రాన్ని దారి మళ్లించి ఉత్తరాగర్భం వైపు దానికి దారిచూపించాడు.మహోగ్రంగా నిప్పులు కక్కుతున్న ఆ అస్త్రం ఉత్తరాగర్భంలో పెరుగుతున్న అభిమన్యుని బిడ్డను క్షణాలలో విగతజీవిని గావించి మాయమై పోయింది.

ఈ ఊహించని పరిణామానికి పాండవులు నోటమాటరాక నిలబడి పోయారు.

ఒకటి చెయ్యబోతే ఇంకొకటి అయ్యింది.

ఈ మొత్తం ప్రహసనానికి అమాయకురాలైన ఉత్తర బలైపోయింది.

వారిలో కోపం కట్టలు తెంచుకుంది.

"భ్రష్టుడా! నీవు గురుపుత్రుడవని గౌరవిస్తుంటే ఇదా నీవు చేసేది? నీకు ఈ క్షణమే చావు మూడింది."అని అందరూ కలసి ఒక్కుమ్మడిగా అశ్వత్థామను చుట్టుముట్టి అతన్ని రకరకాల ఆయుధాలతో తీవ్రంగా కొట్టి వధించ బోయారు.అశ్వత్థామ శరీరం అంతా గాయాలతో రక్తశిక్తమైంది.

'ఆగండి' గద్దించాడు వ్యాసమహర్షి.

ఎక్కడివారక్కడే ఆగిపోయారు.మహర్షి ఎందుకు తమను ఆపుతున్నాడో వారికి అర్ధం కాలేదు.

''పాండుపుత్రులారా! వినండి.అశ్వత్థామను మీరు కొట్టి బాధించవచ్చు.కాని అతనిని మీరు చంపలేరు.ఎందుకంటే అతడు చిరంజీవి.ఆ వరం అతనికి మీ గురువైన ద్రోణాచార్యుడు ఇచ్చాడు.అతనికి చావు లేదు.కనుక మీ ప్రయత్నాలు వృధా అన్న విషయం ముందుగా గ్రహించండి.

ఆ తర్వాత ఇంకొక్క విషయం చెబుతాను.శ్రద్ధగా వినండి.కర్మరహస్యం మీకు విశదం చేస్తాను.ఈ ప్రపంచంలో ఏదీ కారణం లేకుండా జరగదు.ప్రతి కర్మ వెనుకా ఒక కారణం ఉంటుంది.కారణమే కర్మకు కారణం అవుతుంది.మళ్ళీ ఆ కర్మ ఇంకొక కర్మకు కారణాన్ని సృష్టిస్తుంది.ఈ వలయం నిరంతరమైనది. ఇదే సృష్టి వలయం.దీనికి ఎవ్వరూ అతీతులు కారు.

గురువు అంటే తండ్రితో సమానం.తండ్రికంటే కూడా ఎక్కువ.ఎందుకంటే తండ్రి శరీరాన్ని ఇస్తాడు.గురువు జన్మరాహిత్యాన్ని ఇచ్చి దైవాన్ని చేరే మార్గం చూపిస్తాడు.కనుక తండ్రి కంటే గురువు అధికుడు.కానీ మీరేం చేశారు? మీకు సమస్త విద్యలూ నేర్పించి,తన కుమారుడైన ఈ అశ్వత్థామకు కూడా నేర్పించని రహస్య అస్త్రాలను మీకు నేర్పించిన బ్రాహ్మణోత్తముడైన ద్రోణాచార్యుని మీరు వధించారు.బ్రాహ్మణహత్య అనేది మహా పాతకం.అది తరతరాలు వెంటనంటి వంశనాశనం  గావిస్తుంది.అది కూడా ఆయన్ను మీరు ఎలా వధించారు?మోసంతోనూ అబద్దపు కుట్రతోనూ ఆ పనిని చేశారు.కనుక ఆ పాపమే ఇప్పుడు మీ పిల్లల చావులకు కారణమైంది. 

శాంతంగా వినండి.బ్రహ్మహత్యాపాతకమూ గురుహత్యా పాతకమూ ఎంతటివారినీ ఎన్నటికీ వదలవు.మీరు రెండూ చేశారు.మీ వంశం నాశనం కాకుండా ఎందుకు బాగుంటుంది?ఆలోచించండి. 

ఇప్పుడు ఈ కోపంలో ఇంకొక ఘోరమైన పాపం చేసి నిష్కృతి లేనంత పాపం మూటగట్టుకోకండి.కోపమూ అసూయా సమస్త పాపాలకూ హేతువులు. గురుపుత్రుడు గురువుతో సమానుడే.ఈ విషయం మీకు తెలియనిది కాదు.మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్రహ్మహత్య చేస్తారా?ఇది తగునా?

ధర్మజా!నీవు సమస్తధర్మాలనూ ఎరిగినవాడవు.నీవు చెప్పు.ఇది ధర్మమేనా?' ప్రశ్నించాడు వ్యాసభగవానుడు.

యుధిష్ఠిరుడు మౌనం వహించాడు.

వ్యాసమహర్షికి ఎదురు నిలిచి ఆయన ఏమి చెప్పగలడు?

'మరి మేము చేసిన తప్పుకు ఉత్తర ఎందుకు బలికావాలి?ఆమె చేసిన తప్పేమిటి? మా కోడలు కావడమే ఆమె చేసిన నేరమా?చిన్నపిల్లలను బలిచేసిన ఈ దుష్టుడిని ఇలా వదలవలసినదేనా?' ప్రశ్నించాడు అర్జునుడు.

'వదలమని నేనూ చెప్పడం లేదు.దీనిని ఒక పరిష్కారం నేను చెబుతాను.' అంటూ అప్పటిదాకా మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ముందుకు వచ్చాడు.

'జాతిసర్పానికి తన శిరస్సుపైన ఉన్న మణియే ప్రాణం.అది పోతే ఆ పాము జీవచ్చవం అయిపోతుంది.అది బ్రతికీ చచ్చినదానితో సమానమే.అశ్వత్థామ నొసటిలో ధగధగా మెరుస్తున్న మణిని చూచారా?అదే అతని వరం.ఆ మణిని పెకలించండి.అతను బ్రతికినా శవంతో సమానుడే అవుతాడు.ఆ మణి వల్లనే అతడు అన్ని భయాలకూ అతీతుడుగా ఉంటున్నాడు.అది ఉన్నంతవరకూ అతన్ని సర్పవిషం ఏమీ చెయ్యలేదు.అలాగే భూత ప్రేత రాక్షస గ్రహాలూ ఏవీ కూడా అతని దరిదాపులకు రాలేవు.పరమశివుని కటాక్షంతో అది అతనికి ప్రాప్తించింది.పరమేశ్వరునికి మూడవనేత్రం ఎలాంటిదో ఇది ఇతనికి అలాంటిది.కనుక దానిని పెకలించండి.అదే అతనికి తగిన శిక్ష' ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడు.

శిక్ష అమలు జరిగింది.

అశ్వత్థామ జీవచ్చవం అయిపోయాడు.

అప్పుడు కృష్ణుడు నోరు విప్పాడు.


'అశ్వత్థామా!నీవు గురుపుత్రుడవనిన ఒకే ఒక్క కారణంతో మేము నిన్నుపేక్షిస్తున్నాము.అక్కడ నిద్రిస్తున్న శిబిరంపైన దాడి చేసి చిన్న పిల్లలను రాత్రిపూట రాక్షసునివలె వధించావు.ఇప్పుడు అన్నెం పున్నెం తెలియని అమాయకురాలైన ఉత్తరాగర్భంలో పెరుగుతున్న పిండం మీదకు నీ మారణాస్త్రాన్ని ప్రయోగించావు.బాలహత్యకూ భ్రూణహత్యకూ పాల్పడ్డావు. చిన్నపాపలమీదా నిస్సహాయులైన ఆడవారిమీదనా నీ ప్రతాపం?

నీకున్న చిరంజీవిత్వ వరం చూచుకునే కదా నీ గర్వం?నీవు ప్రయోగించిన అస్త్రాన్ని నీవు తెలివిగా ఎలాగైతే దారిమళ్ళించినా కూడా దానిపనిని అది చేసేటట్లు ఎలా చేశావో,అలాగే నేనూ చేస్తాను చూడు.నీ చిరంజీవిత్వ వరాన్నే నీకు శాపంగా మారుస్తాను.

సక్రమంగా బ్రతికితే కదా చిరంజీవిత్వం వరమయ్యేది? నీ తండ్రి నీకు చిరజీవితాన్ని ఇచ్చాడు.కాని ఆ జీవితాన్ని అనుక్షణమూ దుర్భరంగా ఎలా గడపాలో నేను నిర్దేశిస్తాను.

నిన్ను పాండవులు ఉపేక్షించినా వ్యాసుడు నిన్ను రక్షించబూనుకున్నా నేను వదలను.నా కోపం నుంచి నిన్ను ఈ ప్రపంచంలోని ఏశక్తీ రక్షించలేదు.

ఇదిగో విను నా శాపం.

శ్లో||'త్వాం తు కాపురుషం పాపం విదు: సర్వే మనీషిణ:
అసకృత్ పాపకర్మాణం బాలజీవితఘాతకమ్

శ్లో||తస్మాత్త్వమస్య పాపస్య కర్మణ: ఫలమాప్నుహి:
త్రీణి వర్ష సహస్రాణి చరిష్యసి మహీమిమాం
అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిదం జాతు కేనచిత్

శ్లో||నిర్జనాన్ అసహాయస్త్వం దేశాన్ ప్రవిచరిష్యసి
భవిత్రీ నహితే క్షుద్రజన మధ్యేషు సంస్థితి

శ్లో||పూయ శోణిత గంధీచ దుర్గకాంతార సంశ్రయ:
విచరిష్యసి పాపాత్మన్ సర్వవ్యాధి సమన్విత:

(సంస్కృత మహాభారతం- సౌప్తికపర్వం)

(నిన్ను దుర్మార్గుడవని పాపాత్ముడవని చిన్నపిల్లలను చంపినవాడవని లోకం అంతా అసహ్యించుకుంటుంది.నీచాత్ముడా! నీ పాపానికి ఫలం విను. 

ఎక్కడా శాంతి అనేది లేకుండా మూడువేల సంవత్సరాలు ఈ భూమిపైన సంచరించు.ఎవరూ లేని నిర్జన ప్రదేశాలలోనూ క్షుద్రులైన మనుష్యుల దేశంలోనూ సంచరించు.నీకు ఏ సహాయమూ ఎవ్వరూ చెయ్యకుందురు గాక.నీకు ఇప్పుడు తగిలిన ఈ గాయాలూ నీ నొసటను చెయ్యబడిన పెద్ద గాయమూ ఈ మూడువేల ఏండ్లూ మానవు.

ఆ గాయాలనుంచి కారుతున్న చీమూ నెత్తురులతో కారడవులలో ఏకాకిగా తిరుగుతూ సమస్త వ్యాధులతో పీడింపబడుతూ మూడువేల సంవత్సరాలు దుర్భరంగా బ్రతుకు. ఇదే నా శాపం.)'

అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుని నోటివెంట వెలువడిన ఆ భయంకరమైన శాపాన్ని విని వాసమహర్షితో సహా అందరూ అప్రతిభులై నోటమాట రాక శిలాప్రతిమల వలె నిలబడిపోయారు.

అశ్వత్థామ దారుణమైన కృష్ణశాపానికి గురియై,తన నొసటిమణిని పోగొట్టుకుని నిర్భాగ్యుడిగా రోగిష్టిగా నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. మిత్రధర్మానికి కట్టుబడిన పాపానికీ తండ్రివధకు ప్రతీకారం చేసిన పాపానికీ ఆ విధంగా దారుణ శాపానికి గురయ్యాడు.

ఆయన కధ అలా ముగిసింది.
----------------------------------------------------------

మనం మాట్లాడుకుంటున్నది అశ్వత్థామ గురించే గనుక మిగిలిన మహాభారత కధ గురించి మనకు అవసరం లేదు.ఉత్తరా గర్భంలో ఉన్న మృతపిండాన్ని కృష్ణుడు మళ్ళీ ప్రాణం పోసి బ్రతికించగా ఆ బాలుడే పరీక్షిత్ మహారాజుగా పాండవుల తర్వాత రాజ్యం చేశాడు.

పాండవులు దాదాపు 30 ఏళ్ళు రాజ్యం చేసి హిమాలయాలలో సంచరిస్తూ స్వర్గారోహణం చేశారు.ఆ తర్వాత పరీక్షిత్ చక్రవర్తీ,జనమేజయ చక్రవర్తీ ఆయన సంతతి వారూ రాజ్యం చేశారు.

ఇది అందరికీ తెలిసిన కధే.  

కానీ ఎవరికీ తెలియని కధ ఒకటి ఇప్పటికీ జరుగుతున్నది.

అశ్వత్థామ నేటికీ బ్రతికి ఉండటమే ఆ కధ.

నర్మదాతీరంలోని గుజరాత్ అడవులలోనూ మధ్యప్రదేశ్ లోని అడవీప్రాంతపు శివాలయాల్లోనూ వాటి సమీపంలోనూ చాలామందికి నేటికీ ఆయన కనిపిస్తూ ఉండటమే ఆ కధ.

దానిని గురించి వచ్చే పోస్ట్ లో చూద్దాం.

(ఇంకా ఉన్నది)
read more " అశ్వత్థామ--కృష్ణుని శాపం "