“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, ఆగస్టు 2014, ఆదివారం

అశ్వత్థామ - మహాభారతంలోని కొన్ని ధర్మసూక్ష్మాలు

మహాభారతం ఒక అద్భుతమైన చరిత్రగ్రంధం.

అంతేకాదు అది సమస్త ధర్మాల సమాహారం.సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రపంచం మొత్తంలో ఈ గ్రంధం ఒక్కటి చాలు.సమస్త ధర్మాలూ అవగతం అవుతాయి.

ఇటువంటి అద్భుతమైన గ్రంధరాజం ప్రపంచవాజ్మయ చరిత్రలోనే లేదు అనేది నిజం.

కానీ మనకు మన గ్రంధాల విలువ తెలియదు.

అది కలిప్రభావం.

అసలు మహాభారతాన్ని వ్యాస భగవానుడు ఇన్ని వందల పాత్రలతో ఎలా రచించాడో అన్నన్ని ఘట్టాలను అంత అద్భుతంగా ఎలా వర్ణించాడో, ఆయా పాత్రల ధర్మాలనూ స్వరూప స్వభావాలనూ వాళ్ళ మధ్యన నడిచిన భావోద్వేగాలనూ ఆవేశ కావేషాలనూ ఎలా అక్షరబద్ధం చేసినాడో ఊహిస్తే దిగ్భ్రమ కలుగుతుంది.వ్యాసమహర్షి యొక్క అద్భుతమైన మేధస్సుకు మన చేతులు అప్రయత్నంగా ఆయనను స్మరిస్తూ నమస్కార ముద్రలోని వెళ్ళిపోతాయి.మనస్సు ఆయనపట్ల అమితమైన భక్తిభావంతో నిండిపోతుంది.

'నానృషి కురుతే కావ్యమ్'-

ఋషి కానివాడు కవి కాలేడు.కావ్యాన్ని వ్రాయలేడు అంటుంది మన సంస్కృతి.

కవి అనే పదానికి ప్రాచీనమైన అర్ధం ఋషి,ద్రష్ట అని.అంతేగాని ఏవో రెండు కధలు వ్రాసేసినంత మాత్రాన ఎవ్వరూ కవులు కాలేరు.నేటి ప్రజలు వారి జీవితాలలాగే అన్ని పదాలను కూడా భ్రష్టు పట్టించారు.వాటి అసలు అర్ధాలు మాయమై ఆ అర్ధాల స్థానంలో వీరనుకుంటున్న అర్ధాలు వచ్చి చేరుకున్నాయి.అంటే కలిప్రజలు భాషను కూడా ఖూనీ చేసేశారన్నమాట.

కావ్యాలను అందరూ వ్రాయలేరు.కావ్యం అనబడే దానికి కొన్ని లక్షణాలుండాలి.

సరే ఆ సంగతులు ప్రస్తుతానికి అలా ఉంచుదాం.

మహాభారతంలోని పాత్రలు ఎంత గొప్పవంటే ప్రతి పాత్రా తానూ ధర్మాన్ని ఆచరిస్తున్నాననే అనుకుంటుంది.వారిలో ఎవరి లాజిక్ వారికుంటుంది.శకునీ దుర్యోధనుడూ వంటివారు కూడా ధర్మాన్ని అనుసరిస్తున్నామనే అనుకున్నారు.ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని చేస్తున్న దుశ్శాసనుడు కూడా తన అన్న ఆజ్ఞను పాటిస్తున్నాననీ అదే ధర్మమనీ అనుకున్నాడు.

ఈ ధర్మం అనేది చాలా విచిత్రమైనది.

విశ్వం మొత్తానికీ వర్తించే ధర్మం ఒకటి ఉన్నది.అది కాకుండా మానవ జీవితంలోని స్థితినిబట్టీ స్థాయినిబట్టీ కులాన్నిబట్టీ వృత్తినిబట్టీ సాంఘికమర్యాదను బట్టీ కుటుంబమర్యాదను బట్టీ ఇలా రకరకాలైన ధర్మాలు ఉన్నాయి.ఆయా ధర్మాలను విశ్వధర్మంతో అనుసంధానం చేసుకుంటూ జీవించడమే దైవధర్మం.అప్పుడు కర్మ తగ్గుతుంది.

ఈ నియమాన్ని తప్పి,ఎవరి ధర్మం వారిదే అనుకుంటూ,వారివారి ఆలోచనలన్నీ సరియైనవే అనుకుంటూ ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తే విశ్వధర్మం దూరమౌతుంది.అది కర్మ పెరగడానికి దారితీస్తుంది.ఆ కర్మ కొంత ఫలితాన్నిస్తుంది.మళ్ళీ అది ఇంకొక కర్మకు దారితీస్తుంది.ఈ వలయం ఇలా నిరంతం తిరుగుతూ మనిషిని జన్మవలయాలలో బంధించి పారేస్తుంది.

ఈ విషయాన్ని మహా భారతం కంటే చక్కగా చెప్పిన గ్రంధం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కానేరదు.

ఇందులోని పాత్రలకున్న ఇంకొక్క విచిత్రమైన లక్షణం ఏమంటే-వాటిలో మనల్ని మనమే చూచుకోవచ్చు.జాగ్రత్తగా గమనిస్తే మహాభారత పాత్రలు ప్రతిమనిషి లోనూ ఉన్న అనేక విభిన్న దృక్పధాలుగా మనకు దర్శనమిస్తాయి.

సంతానం చెడునడతలో ఉన్నాసరే వారిమీద ఉన్న అతిప్రేమకు నిదర్శనాలుగా ధృతరాష్ట్రునివద్ద నుంచీ అనేకులు మనకు దర్శనమిస్తారు.

పతులు ఎలాంటివారైనా కూడా వారిని తూచా తప్పక అనుసరించే పాతివ్రత్య ధర్మం కలిగిన గాంధారి వంటి ఎందఱో వనితలు కనిపిస్తారు.

మంత్రములవంటి అతీత శక్తులతో ఆటలాడి తద్వారా ఎంతోమందికి ఎన్నోరకాల క్షోభలు కలగడానికి కారణమైన కుంతీదేవి వంటివారూ దర్శనమిస్తారు.

పాండవుల ప్రతాపానికి అసూయతో వారిని అంతం చెయ్యాలన్న దుగ్ధతో చివరికి అన్ని కోట్ల మంది చావుకు కారకుడైన దుర్యోధనుడు కనిపిస్తాడు.

పగతీర్చుకోవడం కోసం చాపకింద నీరులా కౌరవుల పక్షాన ఉంటూ చివరకు వారి వినాశానాన్నే కొనితెచ్చిన శకుని వంటి వారూ కనిపిస్తారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ఇంకొక ప్రత్యేకవ్యాసం అవుతుంది.అందుకని ఇంతటితో ఆపి మన విషయంలోకి వద్దాము.

అశ్వత్థామ కూడా మహాభారతంలోని మరుగున పడిన పాత్రలలో ఒకడు. సాహిత్యకారులు గానీ చరిత్రకారులు గానీ ఆయనకు పూర్తి న్యాయం చెయ్యలేకపోయారన్నది వాస్తవం.అందుకు ఒక కారణం ఏమంటే,ఆయన ఒక దుష్టుడూ దుర్మార్గుడూ అనుకోవడమే.

'పంచమవేదం' అని ఎంతో గౌరవంగా పిలువబడిన మహాభారతం వంటి ఒక ఉద్గ్రంధాన్నీ మహాకావ్యాన్నీ అర్ధం చేసుకోవాలంటే సంకుచితమైన దృష్టి ఉంటె ఏమాత్రం చాలదు.విషయాన్ని ఒకే ఒక్క కోణంలో చూస్తే అలాంటివారికి ఆ విషయపు లోతులూ ధర్మసూక్ష్మాలూ అర్ధం కావు.

ఒక విషయాన్ని అనేక కోణాలలో చూస్తూ తాను మాత్రం దేనివైపూ మొగ్గకుండా ప్రభావితుడు కాకుండా చూచే దృష్టినే 'సమగ్రదృష్టి' అంటాము. అలాంటి సమగ్రదృష్టి ఉన్నప్పుడే మహాభారతంలోని ధర్మసూక్ష్మాలు అర్ధమౌతాయి.లేకుంటే అర్ధం కావు.అటువంటి కధను రకరకాల ఘట్టాలలో మన ఎదుట సాక్షాత్కరింప చెయ్యడంలోనే వ్యాసమునీంద్రుని యొక్క అద్భుతమైన ప్రతిభ మనకు గోచరిస్తుంది.

ఉదాహరణకు--

పాండవులు మంచివారు.కౌరవులు చెడ్డవారు.అన్న ప్రాధమిక అవగాహన మనం ముందే ఏర్పరచుకుని భారతాన్ని చదివితే అది మనకు ఏమీ అర్ధం కాదు.పాండవులు మంచిగానే కనిపిస్తారు.కౌరవులు చెడ్డవారుగానే కనిపిస్తారు.కానీ అసలు విషయం అది కాదు.

ఇరుపక్షాలలోనూ ధర్మం ఉన్నది.ఇరుపక్షాలలోనూ అధర్మం ఉన్నది.ఆ ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసుకోవాలంటే భారతాన్ని pre-conceived ideas తో చదవకూడదు.ఉన్నదాన్ని ఉన్నట్లుగా నిష్పక్ష పాతంగా చదవాలి.అర్ధం చేసుకోవాలి.అప్పుడే దానిలోని సౌందర్యం అర్ధమౌతుంది.

మహాభారతం లోని ప్రతిపాత్రకూ ఒక ఆత్మ ఉన్నది.ఆ ఆత్మను మనలోకి ఆవహింప చేసుకోవాలి.దాని ఆరాటాన్నీ ఆలోచనలనూ బాధలనూ మానసిక సంక్షోభాన్నీ మనం 'ఫీల్' అవాలి.అలా చెయ్యగలిగితే అప్పుడు మాత్రమే మనకు ఆ పాత్ర పూర్తిగా అర్ధమౌతుంది.అప్పుడే వ్యాస మహాభారతం ఎంతటి గొప్ప గ్రంధమో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది.

ఇక మన ప్రస్తుత విషయం లోకి వద్దాం.

మహాభారతం చదివినవారికి అనేక సందేహాలు తేనెటీగలవలె ముసురుకుంటాయి(మనసు పెట్టి చదివితే).ఆ సందేహాలు అన్నీ నేను ఇక్కడ చర్చించ బోవడం లేదు.ఒక్క అశ్వత్థామ కథలో వచ్చే సందేహాలను మాత్రమె ఇక్కడ చర్చిస్తాను.

1.
అశ్వత్థామకు చిరంజీవిత్వ వరాన్ని ఇచ్చిన ద్రోణాచార్యుడు 'అశ్వత్థామ హత:' అన్న మాటను నమ్మి నిండు యుద్ధభూమిలో ఎలా అస్త్రసన్యాసం చేశాడు?

నిజమే.ఈ వరం ఇచ్చినది తానే.వ్యాసమునీంద్రుని అత్యద్భుతమైన ప్రతిభ ఇలాంటి చోట్లనే మనకు దర్శనమిస్తుంది.మానవ సహజములైన బలహీనతలను అంత చక్కగా వర్ణించడం బహుశా ఆయనకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాకపోవచ్చు.'ప్రమాదో ధీమతామపి' అంటారు.అలాగే ధీమంతులు నిగ్రహపరులు అయినవారికి కూడా ఆపత్కాలంలో మనస్సు చెదిరిపోతుంది అనడానికి ఇదే రుజువు.

తాను చిరంజీవినన్న విషయం తెలిసినా కూడా అశ్వత్థామ ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసినాడు.అంటే కూడా ఇదే సమాధానం.


ధృతరాష్ట్రునికి ఎంత పుత్రవ్యామోహం ఉన్నదో ద్రోణునికీ అంత ఉన్నది. ఎందుకంటే అశ్వత్థామ ఎంతో తపస్సు అనంతరం పుట్టినవాడు. కనుక లేకలేక కలిగిన పుత్రుడంటే అమితమైన ప్రేమ ద్రోణునికి ఉండటం సహజం.

యుద్ధమధ్యంలో మన తర్కం పనిచెయ్యదు.అక్కడ ఆవేశమే ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి అది మంత్రాంగ మందిరం కాదు.అలా ఆలోచిస్తూ కూచుంటే అక్కడ ప్రాణాలు క్షణంలో గాలిలో కలసి పోతాయి.మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకుంటూ విజ్రుమ్భిస్తేనే అక్కడ నిలవడం సాధ్యమౌతుంది.

ఇంకొక్క విషయం.

ఆ మాట చెప్పినది ఎవరు?ఎట్టి పరిస్తితుల్లోనూ అబద్ధం చెప్పడని పేరుపొందిన ధర్మరాజు.అతను ప్రాణం పోయినా కూడా అబద్ధం ఆడడని గురువైన ద్రోణునికి తెలుసు.కనుక అతను చెప్పినపుడు నమ్మకపోవడం అంటూ ఉండదు.ఈ విషయం తెలిసే కృష్ణుడు ధర్మరాజు చేత ద్రోణునికి వినబడేటట్లుగా ఆ అబద్ధం పలికిస్తాడు.

కనుక యుద్ధభూమిలో ద్రోణుడు అటువంటి హటాత్ నిర్ణయం తీసుకుని అస్త్రసన్యాసం చెయ్యడం సమంజసమే.

2.
ఋషి పుత్రుడైన అశ్వత్థామ యుద్ధ న్యాయాన్ని విస్మరించి రాత్రిపూట పాండవ శిబిరం మీదకు దాడి చెయ్యడం సబబేనా?

దీనికి సమాధానం ఇప్పటివరకూ వ్రాసిన పోస్ట్ లలో వివరంగానే చెప్పినాను.

అశ్వత్థామకు ధర్మం తెలుసు.కానీ మిత్రధర్మం ఒకవైపూ,తండ్రి వధకు ప్రతీకారం చెయ్యడం ఒకవైపూ,పాండవులు చేసిన అధర్మయుద్ధాలు ఒకవైపూ కనిపిస్తూ ఆయన్ని పురికొల్పాయి.తాను చేస్తున్నది తప్పు కాదు అన్న బలమైన భావంతోనే ఆయన ఆ పని చేశాడు.పైగా తనను ఆవహించి ఉన్న రుద్రశక్తి ఆయనను కుదురుగా ఉండనివ్వదు.అందుకే ఆయనలా చెయ్యవలసి వచ్చింది.

3.
అన్నీ తెలిసి కృష్ణుడు ఆ రాత్రి పూట పాండవులను ఎక్కడికో తీసుకుపోవడం ఏంటి?అంటే ఆయన కూడా ఈ పనిలో అశ్వత్థామకు సహకరించినట్లే కదా?

అంతే.అసలు ఈ యుద్ధాన్ని నడిపించినదే ఇద్దరు.ఒకరు కృష్ణుడు ఇంకొకరు శకుని.ఒకరు స్క్రిప్ట్ రైటర్ అనుకుంటే ఇంకొకరు డైరెక్టర్ అనుకోవచ్చు.

ఆ మాటకొస్తే అభిమన్య సంహార సమయంలో కూడా కృష్ణుడికి అన్నీ తెలిసే అర్జునుడిని దూరంగా తీసుకువెళ్ళాడు.ఈ యుద్ధంలో అంతా సర్వనాశనం అవుతుందని కృష్ణుడు తన వంతుగా ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు.కర్మ బలీయంగా ఉన్నపుడు మంచి చెప్పినా తలకెక్కదు అంటే ఇదే.

అన్నీ దగ్గరుండి చేయించినది ఆయనే.కానీ ఆయనకు ఏమీ అంటలేదు.అందుకే గీతలో ఆయన ఇలా అంటాడు."నేను అన్నీ చేసినా ఏమీ చెయ్యనివాడనే.ఎందుకంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం నాకు లేదు.'

4.
అలాంటప్పుడు మరి అశ్వత్థామను తాను శపించడం ఎందుకు?

అశ్వత్థామ చిరంజీవి.అతను చేసిన కర్మను అనుభవించడానికి అతనికి మరొక మానవజన్మ లేదు.రాబోయే జన్మలో అతడు వేదవ్యాసునిగా జన్మిస్తాడని అంటారు.ఆ తర్వాత సప్తఋషులలో ఒకరౌతాడని అంటారు. కనుక ఈ మానవకర్మను కుదించడానికి కృష్ణుడు అలా శపించాడు.తద్వారా అతనికి చివరకు ఇంకా ఉత్తమగతే కలిగింది.కృష్ణుడు సరాసరి శాపం ఇచ్చిన సన్నివేశాలు ఇది తప్ప ఇంకెక్కడా నాకు తెలిసినంతవరకూ లేవు.

భగవంతుని శాపం కూడా వరమే(అర్ధం చేసుకోగలిగితే).

5.
మహాభారత  యుద్ధంలో ఎన్నో అన్యాయాలు కృష్ణుడే దగ్గరుండి మరీ చేయించాడు.ఇది ధర్మం ఎలా అవుతుంది?

సామాన్య దృష్టికి అది ధర్మం కాకపోవచ్చు.కానీ సూక్ష్మ దృష్టితో ఆయా కర్మలనూ వాటి ఫలాలనూ అర్ధం చేసుకుంటే అది న్యాయమే అవుతుంది.వారు వారు అలా ఎందుకు చంపబడ్డారో ప్రతిదానికీ ఒక హేతువున్నది.అది కృష్ణునకు తెలుసు.

ఒకవేళ అలా ఏమీ హేతువులు లేవు అనుకున్నప్పటికీ,ధర్మాధర్మములను సృష్టించిన భగవంతునికి వాటి కట్టుబాటు ఏమున్నది?సాధారణంగా ఆయన కూడా వాటిని ఉల్లంఘించడు.కానీ ప్రత్యేక పరిస్తితులలో ఆయన ఒకవేళ మనం అనుకునే అధర్మం చేసినా అది ధర్మమే అవుతుంది.ఎందుకంటే ధర్మమూ తానే అధర్మమూ తానే,రెండూ అవడం ద్వారా రెంటికీ అతీతుడూ తానె గనుక.

ఒకదేశపు చట్టం ఇంకొక దేశంలో పనికిరాదు.ఒకచోట నేరం ఇంకోచోట కాకపోవచ్చు.ఇతర దేశాలలో లిట్టరింగ్ నేరం.మన దేశంలో అది సర్వసాధారణం.ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే అది నేరం.అతనికి ఉరిశిక్ష పడుతుంది.కానీ యుద్ధంలో శత్రుదేశ సైనికులను చంపినవాడికి అవార్డులూ పతకాలూ ఇవ్వబడతాయి.ఇద్దరూ చేసినది హత్యే.ఒకరికి ఉరేమిటి?ఇంకొకరికి అవార్డులేమిటి?

కనుక న్యాయమూ ధర్మమూ అనేవి దేశకాలపాత్రతలను బట్టి మారిపోతూ ఉంటాయి.ఒకరికి ధర్మం అయినది ఇంకొకరికి కాకపోవచ్చు.

ఒక్కొక్కసారి పెద్ద నేరాన్ని నివారించడానికి చిన్న నేరం చెయ్యవలసి వస్తుంది.ఆ చిన్న నేరం అప్పుడు ధర్మమే అవుతుంది.పెద్దప్రాణమా చిన్న ప్రాణమా ఏదో ఒకటే కాపాడగలం అనిన పరిస్తితిలో వైద్యుడు తల్లి ప్రాణాన్ని రక్షించి పిల్ల ప్రాణాన్ని బలిచేస్తాడు.అది నేరం కాదా?అంటే ఏం చెప్పగలం? ఆ పరిస్థితిలో అది న్యాయమే.కానీ మామూలు దృష్టికి అది న్యాయం కాకపోవచ్చు.ప్రాణ విత్త మాన భంగములయందు అబద్ధం చెప్పడం తప్పుకాదు అని ధర్మశాస్త్రం అంటుంది.

కనుక మూడు కాలములూ తెలిసిన భగవంతుని చర్యలను మన సంకుచితమైన ధర్మాధర్మ దృష్టితో చూడటానికి మనమెవరం?దైవం ఏది చేసినా అది ధర్మమే.ఒకవేళ మనం అనుకునే అధర్మం ఆయన చేసినా కూడా అదీ ధర్మమే.కాకపోతే దానిలోతుపాతులు మనకు తెలియక మనం అలా అనుకోవచ్చు.

6.
వ్యాసుడూ పరశురాముడూ ఎందుకు అశ్వత్థామను రక్షించాలని ప్రయత్నించారు?

ఋషులు కారుణ్యమూర్తులు.శరణాగత రక్షకులు.అందులోనూ పరశురాముడు విష్ణు అవతారం.ఆయన సాక్షాత్తూ భగవంతుడే.

చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి తమను శరణు కోరిన వారిని రక్షించడం దైవధర్మం.వారికి తగిన దారి చూపించడమూ అందులో భాగమే.యుద్ధం చివరలో కూడా ఇప్పుడైనా ఈ పద్ధతి మానుకొని దారికి వస్తే మంచిదని కృష్ణుడు దుర్యోధనునికి ఎంతో చెబుతాడు.అప్పుడు కూడా ఆయన ఇంకా ఒక అవకాశం ఇస్తూనే ఉన్నాడు.

దైవసృష్టిలో శాశ్వతస్వర్గం గానీ శాశ్వతనరకం గానీ లేవు.తప్పును దిద్దుకోనడానికి ఇక్కడ ప్రతిక్షణమూ అవకాశం ఇవ్వబడుతూనే ఉంటుంది. అదే దైవన్యాయం.ఆ న్యాయానుసారమే వారు అశ్వత్థామను రక్షించ బూనుకున్నారు.పైగా వ్యాసమహర్షి కూడా చిరంజీవి.ఆయన కూడా విష్ణు భగవానుని అంశావతారమే.కనుక వారిలో దైవసహజమైన క్షమాగుణం ఉండటం సహజం.

(సంపూర్ణం)