“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, అక్టోబర్ 2014, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు -5

మొన్నొక రోజున చరణ్ నుంచి ఫోనొచ్చింది.

'అన్నగారూ రేపు జిల్లెళ్ళమూడి వెళ్దామనుకుంటున్నాను.మీరూ వస్తారా?' అడిగాడు.

'సరే.వెళదాం.'అన్నాను.

'ఉదయం ఎనిమిది కల్లా మీ ఇంటిదగ్గర ఉంటాను.రెడీగా ఉండండి.'అన్నాడు.

చరణ్ తో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను.ఎవరో వచ్చినట్లై వాకిలివైపు చూస్తే మదన్ లోనికి వస్తూ కనిపించాడు. మేమిద్దరం ఒకచోటే పనిచేసేది గనుక మదన్ అప్పుడప్పుడూ నాదగ్గరకు వస్తూ ఉంటాడు.

సంగతి చెప్పి-'నీవూ రా మదన్.వెళ్లి వద్దాం.'అన్నాను.

'సరే' అన్నాడు మదన్.

అలా అనుకోకుండా ఒక్క నిముషంలో జిల్లెళ్ళమూడి ప్రయాణం నిశ్చితం అయిపోయింది. అమ్మకు సంబంధించినవి అలాగే జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా హటాత్తుగా అన్నీ అయిపోతూ ఉంటాయి.అవి మన ప్లాన్ ప్రకారం జరగవు. జరుగుతున్నదానిని మనం ఒప్పుకొని అనుసరించడమే. అంతకంటే మనం ఇంకేమీ చెయ్యలేం.

మర్నాడు ఉదయమే చెప్పిన సమయానికి మదన్ తన శ్రీమతిని తీసుకుని మా ఇంటికి వచ్చి రెడీగా ఉన్నాడు.ఎనిమిదింటికి వస్తానన్న చరణ్ ఎనిమిదిన్నరకు గానీ రాలేదు.రైల్వేవాళ్ళం కదా మనం లేట్ గురించి మాట్లాడకూడదని మనస్సులో అనుకుంటూ వెయిట్ చేస్తున్నాం.ఇంతలో చరణ్ రానే వచ్చాడు.

'దారిలో రైల్వే గేట్ పడింది అన్నగారు.అందుకే కొంచం లేటైంది.'అన్నాడు.

పొరపాటున నాలుక కొరుక్కుంటే పళ్ళను నిందిస్తామా? అందుకని మాట్లాడకుండా ఊరుకున్నాను.

'బయలుదేరదాం.ఒక్క నిముషం కూర్చో' అన్నాను.

కూచుంటూ 'అన్నగారు.ఈ మధ్యన నాకు ఒక ఆలోచన తీవ్రంగా స్ఫురిస్తున్నది.' అన్నాడు.

మౌనంగా అతనివైపు చూచాను.

చాలామంది మాట్లాడే మాటలూ,చెప్పే ముచ్చట్లూ నాకు అస్సలు నచ్చవు. మామూలు లౌకిక కబుర్లు చెప్పేవారిని నేను ఒక్క క్షణం కూడా భరించలేను. నేనైనా అక్కడనుంచి వెళ్ళిపోతాను.లేదా వారే నా మౌనాన్ని తట్టుకోలేక పారిపోతూ ఉంటారు.కానీ చరణ్ వంటి కొందరు వ్యక్తులు మాత్రం నేను ఆశించే స్థాయిలో మాట్లాడగలరు.అతనెప్పుడూ మౌలికమైన ఆధ్యాత్మిక విషయాలపైన ప్రశ్నలు అడుగుతాడు.అవి నాకు బాగా నచ్చుతాయి.

అందుకని అతనితో సంభాషణ నాకు బాగుంటుంది.

'గృహస్థ సన్యాసం' అనే భావన ఈ మధ్య నాకు బాగా కొడుతున్నది.' అన్నాడు.

నవ్వాను.

'అంతేకాదు.'సన్యాస గార్హస్థ్యం' అనేది కూడా.కానీ మొదటిది వీలౌతుంది. రెండవది వీలవదని నా అభిప్రాయం.' మీరేమంటారు?-అడిగాడు.

'రెండూ వీలౌతాయి.మొదటిది కష్టం.రెండవది చాలా సులభం.ప్రస్తుతం ఎక్కడచూచినా అనేక ఆశ్రమాలలో జరిగేది రెండోదే.'అన్నాను.

'అదెలా అన్నగారు?ప్రస్తుతం జరుగుతున్నది కాదు నేనడిగేది? అసలు నిర్వచనం ఏమిటో సెలవివ్వండి.' అన్నాడు.

'నిర్వచనం కావాలంటే నిర్-వచనమే నా జవాబు' అంటూ 'మనం ప్రయాణంలో మాట్లాడుకుందాం.బయలుదేరండి.'అంటూ లేచాను.

ఊరుదాటి కారు పెదనందిపాడు రోడ్డులో పరిగెత్తుతున్నది.అప్పటిదాకా అందరం మళ్ళీ ఆ టాపిక్ ఎత్తలేదు.

'ఇప్పుడు చెప్పండి అన్నగారు.' మొదలు పెట్టాడు చరణ్.

'గృహస్థ సన్యాసం'అనేది ఉదాత్తమైన భావన.దీనినే శ్రీరామకృష్ణులు "కోటలో ఉండి యుద్ధం చెయ్యడం"అన్నారు.నిజానికి అందరూ సన్యాసం స్వీకరించలేరు.చాలామంది ఆధ్యాత్మికపరులకు కూడా వారివారి పూర్వకర్మానుసారం పెళ్లి చేసుకోవలసి వస్తుంది. అంతమాత్రం చేత వారిలోని ఆధ్యాత్మిక భావాలు సమసిపోవు. అటువంటి వారు చివరకు గృహస్థ సన్యాసులు గానే మారుతారు.అంటే సంసారజీవితం గడుపుతారు.కానీ అది లోకులనుకునే సంసారజీవితం కాదు.అది తపోమయమైన యోగజీవితమే. మన పూర్వ ఋషులందరూ గృహస్థులే.కానీ వారి తపశ్శక్తికి లోటేమి వచ్చింది?" అడిగాను.

"మరి సన్యాస గృహస్థమో?" అడిగాడు కారు డ్రైవ్ చేస్తున్న చరణ్.

తనకు నేను చెప్పబోయే చాలా విషయాలు ముందే తెలుసు.కానీ మళ్ళీ నన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు.ఆ సంగతి నాకూ తెలుసు.అయినా సరే నేను మళ్ళీ చెబుతూనే ఉంటాను.ఇదొక సరదా.

"అది మరీ సులువు.ఇందాకే చెప్పా కదా.ప్రస్తుతం అనేక ఆశ్రమాలలో జరుగుతున్నది అదేనని. అదొక భ్రష్టత్వం. అది చాలదన్నట్లు ఈ మధ్యన పాపం కొందరు స్వామీజీలకు పురుషత్వ నిర్ధారణ పరీక్షలు కూడా చెయ్యబడుతున్నాయి చూచావా?" అడిగాను నవ్వుతూ.

"అమ్మో!అది మరీ ఘోరం అన్నగారు.అయినా అలాంటివాళ్ళతో మనకెందుకు లెండి" అన్నాడు చరణ్.

"సరేలే వాళ్ళతో మనకనవసరం అనుకో.ఊరకే మాటవరసకన్నాను.నేను చెబుతున్నది ఆ సంసారం గురించి కాదు. కొందరు ఇంటినీ సంసారాన్నీ వదలిపెట్టి ఆశ్రమాలు పెడతారు.అక్కడ ఇంకొక పెద్దసంసారం వారిని పట్టుకుంటుంది. ఇంట్లో అయితే నలుగురో అయిదుగురో కుటుంబ సభ్యులు ఉంటారు.ఆశ్రమంలో అయితే ఎంతమంది ఉంటారో చెప్పలేం.అక్కడా ఫండ్ రైజింగ్ ఉంటుంది. అక్కడా ఆదాయవ్యయాల లెక్కలుంటాయి. అక్కడా ఈగో ప్రాబ్లంస్ ఉంటాయి.అక్కడా కుట్రలూ కుతంత్రాలూ ఉంటాయి. అక్కడా జెలసీ ఉంటుంది. ఈ విధంగా అక్కడకూడా అన్నీ ఉంటాయి.దీనినే నేను "సంసారం" అంటాను. ఆడామగా చేసే సంసారం గురించి నేను చెప్పడం లేదు. వ్యవహారం గురించి చెబుతున్నాను. రోజువారీ వ్యవహారం కూడా ఒక విధమైన సంసారమే. నిజం చెప్పాలంటే అదే అసలైన సంసారం.

అంటే స్వామీజీలు చిన్న సంసారాన్ని వదలిపెట్టి పెద్ద సంసారంలో చిక్కుకుంటున్నారన్న మాట." అన్నాను నవ్వుతూ.

చరణ్ చాలాసేపు మాట్లాడలేదు.

వెనక సీట్లో కూచుని ఉన్న మదనూ,అతని శ్రీమతీ,మా శ్రీమతీ మౌనంగా వింటున్నారు.

కాసేపు మౌనం రాజ్యమేలింది.

ఆ మౌనాన్ని భగ్నం చేస్తూ చరణ్ ప్రశ్న ధ్వనించింది.

"అన్నగారు? సృష్టి అవసరమా కోరికా?"

చరణ్ ఎప్పుడూ ఇంతే.చాలా abstract విషయాలు లేవదీస్తూ ఉంటాడు. అతను అడిగే ప్రశ్నలు చాలా మౌలికమైన సీరియస్ విషయాలను స్పర్శిస్తూ సాగుతాయి.

వాతావరణం చాలా సీరియస్ గా ఉన్నదికదా కొంచం లైటర్ మోడ్ లోకి తెద్దామని అనుకున్నా.

"ఒకరికి కోరిక ఇంకొకరికి అవసరం.అప్పుడేగా సృష్టి జరిగేది" అన్నాను సీరియస్ గా గొంతు పెట్టి.

కార్లో నవ్వులు విరబూశాయి.

"అదికాదన్నగారు.మన చుట్టూఉన్న సృష్టి గురించి నేనడుగుతున్నాను." అన్నాడు చరణ్.

చరణ్ కు తను అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు ముందే తెలిసి ఉంటాయని నాకొక అనుమానం చాలారోజుల నుంచీ ఉన్నది.ఆ ప్రశ్నలకు తాననుకుంటున్న జవాబులు మన చేత చెప్పించాలని ప్రయత్నిస్తాడని కూడా ఇంకో బలమైన అనుమానం నాకెప్పటినుంచో ఉన్నది.

ఈసారి ఇలా కాకుండా నేననుకుంటున్న జవాబులు తనచేతే చెప్పించాలని అనుకున్నా.

"మన చుట్టూ ఉన్న సృష్టి అయినా,మన లోపల సృష్టి అయినా,మనల్ని సృష్టించిన సృష్టి అయినా అన్నీ ఒకే సూత్రాల మీద నడుస్తాయి.అసలు అవసరం అంటే ఏమిటి? కోరిక అంటే ఏమిటి?ముందు అవేంటో తెలిస్తే ఆ తర్వాత సృష్టి గురించి ఆలోచిద్దాం.ముందు అవేంటో నాకు అర్ధమయ్యేలా చెప్పు"అన్నాను నేనూ సీరియస్ మోడ్ లోకి మారిపోతూ.

ఇంతలో వెనుక సీట్లోనుంచి "మీ మాటలు సరేగాని, ఎక్కడైనా హోటల్ ఉంటె ఆపండి. ఏదైనా టిఫిన్ తిందాం.ఆకలేస్తున్నది." అని మా శ్రీమతి స్వరం పలికింది.
 
ఆకలీ హోటలూ టిఫినూ అనేసరికి ఏదో ఫ్లాష్ వచ్చిందేమో-"ఆకలేస్తే ఇడ్లీ తినాలని అనిపించడం అవసరం.ఉల్లి పెసరట్టు తినాలని అనిపించడం కోరిక" అని మళ్ళీ ఆ స్వరమే వెనకనుంచి చెప్పింది.

'అద్భుతం అమోఘం"- అంటూ అందరం చప్పట్లు చరిచాం.

"కోరికను అదుపు చేసుకోవచ్చు గాని అవసరాన్ని ఆపలేం కదా అన్నగారు?" అన్నాడు చరణ్.

'నిర్వచనంగా ఉండకుండా ముందుగా నిర్వచనం చెప్పు నాయనా.'అన్నాను.

చరణ్ కాసేపు ఆలోచించాడు.

"అవసరం తీరకపోతే గడవదు.కోరిక తీరకపోయినా నడుస్తుంది."అన్నాడు.

"అసలు అవేంటో చెప్పమని నేను అడుగుతున్నా.వాటి ఉదాహరణలు కాదు. "అన్నాను.

మళ్ళీ కాసేపు ఆలోచించాడు.

"ఒక మనిషి రోడ్డుమీద పోతున్నాడనుకోండి.ఉన్నట్టుండి ఎండ బాగా వచ్చింది.కాళ్ళకు చెప్పులు లేవు.అప్పుడేమనిపిస్తుంది?" అడిగాడు.

"ఏమో?వాడికేమనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది?" అన్నాను.

"కాళ్ళకు చెప్పులుంటే బాగుండు అనిపిస్తుంది." అన్నాడు.

"అది అవసరమా కోరికా?" అడిగాను.

"అవసరమే.చెప్పులవరకూ అవసరమే.ఏసీ కారుంటే బాగుండు అనిపిస్తే అది కోరిక" అన్నాడు.

"రెండూకాదు. అది బుద్ధిలేనితనం. ఇంట్లోనుంచి బయలుదేరేముందు చెప్పులు వేసుకోవాలని వాడికి తెలియదా? అలా మరచిపోవడమే వాడి బాధకి అసలు కారణం." మళ్ళీ వెనక సీట్లోంచి స్వరం వినిపించింది.

"సరే వదినగారు.ఎండయితే సరే.మరి వానొచ్చిందనుకోండి.అప్పుడేం చెయ్యాలి?" అడిగాడు చరణ్.

"ఇంట్లోనుంచి బయలుదేరేటప్పుడే గొడుగు కూడా చంకలో పెట్టుకుని బయలుదేరాలి.అలా మర్చిపోవడం వాడి బుద్ధిలేనితనం" నవ్వుతూ నేను జవాబిచ్చాను.

"దారిలో వానొస్తుందని వాడికి ముందే ఎలా తెలుస్తుంది?" అడిగాడు చరణ్.

"అదికూడా తెలుసుకోవాలి.ముందేం జరుగుతుందో తెలుసుకోలేక పోవడమే వాడి అసలైన బుద్ధిలేనితనం" మళ్ళీ నేనే జవాబిచ్చాను.

"అంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడు అవసరం ఉన్నా లేకపోయినా ఒక గొడుగూ,ఒక టోపీ,రెయిన్ కోటూ ఇంకా ఏవైనా ఉంటె అవన్నీ ధరించి బయటకు రావాలన్నమాట." అన్నాడు చరణ్.

"అవును.వీలుంటే ఒక కిరీటం పెట్టుకుని,కవచం తొడుక్కుని,ఒక చేతిలో కత్తీ ఒక చేతిలో డాలూ పట్టుకుని బయల్దేరితే ఇంకా మంచిది." అన్నాను.

"అప్పుడుగాని కుక్కలు వెంటపడవు" అంది వెనకసీటు స్వరం.

మళ్ళీ నవ్వులు విరబూశాయి.

అలా నవ్వులతో సరదాగా ప్రయాణం నడుస్తున్నది.

(ఇంకా ఉన్నది)