నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, జనవరి 2015, గురువారం

స్వైన్ ఫ్లూ--హోమియో చికిత్స

అంటువ్యాధులూ సాంక్రామిక వ్యాధులూ ప్రబలినప్పుడే జనం హోమియోపతిని గురించి మాట్లాడుకుంటారు. కలియుగ సమాజంలో ఇదొక వింత.ఇలాంటి సమయాలలో సమర్ధవంతంగా పనిచేసే హోమియో మందులు మరి మిగతా రోగాలకు కూడా ఇంతే సమర్ధవంతంగా పనిచేస్తాయని ప్రజలకు ఎందుకు తోచదో అర్ధం కాదు.ఒకవేళ తోచినా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బు ఏదో ఒక డాక్టరు పాలు గాక తప్పదు గనుక అల్లోపతీ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారేమో తెలియదు.

ప్రస్తుతం స్వైన్ ఫ్లూ బూచి మళ్ళీ తెరమీదకు వచ్చింది.అక్కడక్కడా కేసులు వినిపిస్తున్నాయి.ఎక్కడ చూచినా 'ఆర్సెనికం ఆల్బం' మందును బటానీల లాగా పంచి పెడుతున్నారు.ఇంతకు ముందు మెదడు వాపు వ్యాధిలో 'బెల్లడోనా' మందును ఇలాగే పప్పు బెల్లాల లాగా వాడారు.ఆ వ్యాధి పుణ్యమాని 'బెల్లడోనా' పేరు చదువు రానివారి నోళ్ళలో కూడా నానింది.ఇప్పుడు 'ఆర్సెనికం ఆల్బం' పేరు నానుతోంది.

స్వైన్ ఫ్లూ రాకుండా నివారక ఔషధంగా (prophylactic) 'ఆర్సెనికం ఆల్బం' పనిచేస్తుంది అని ప్రచారం జరుగుతున్నది.నిజమే కావచ్చు.కానీ దానితో బాటే -'ఇన్ఫ్లూయంజినం' కూడా ఉపయోగపడుతుంది.వ్యాధి వచ్చిన తర్వాత బాధించే ఒళ్ళు నొప్పులను చలినీ తగ్గించదానికి 'యూపటోరియం పర్ఫోలియేటం' కూడా పనిచేస్తుంది.

"ఫలానా వ్యాధికి హోమియోలో మందు ఉన్నదా?" అని కొందరు అడుగుతూ ఉంటారు.అన్ని రోగాలకూ హోమియోలో ఔషధాలు ఉన్నాయి.ఈ విషయం అన్నీ తెలుసనుకునే నేటి నాగరికులకు ఎందుకు అర్ధం కాదో తెలియదు.

బహుశా దీనికి కూడా కారణం ఖర్మే అని నేననుకుంటాను.

మనకు డబ్బు వదిలించుకుని,బాధ తగ్గక,అవస్థపడే యోగం ఉన్నపుడు,హోమియోపతి వాడదామని తోచదు.అక్రమసంపాదన అంతా వదిలి,ఒళ్ళు గుల్ల అయిన లాస్ట్ స్టేజిలో మాత్రమే హోమియో వైపు జనం చూస్తారు.అప్పుడెలాగూ ఉపయోగం ఉండదు.'మేము హోమియో కూడా వాడాము'- అని చెప్పుకోడానికి తప్ప ఇంక దేనికీ అది ఉపయోగపడదు.

ఖర్మ తీరే సమయం ఇంకా రాకపోతే,ఒకవేళ హోమియోపతి వాడుదామని తోచినా,సరియైన హోమియో వైద్యుడు దొరకక ఎవరో ఒకరి దగ్గర హోమియో మందులు వాడి,రోగం తగ్గక,బాధపడుతూ ఉంటారు.తగ్గలేదని హోమియోపతి వైద్యాన్ని నిందిస్తూ ఉంటారు.ఇలాంటి వారిని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం.

అంటువ్యాధులు ప్రబలినప్పుడే కాదు మామూలు సమయాలలో వచ్చే రకరకాల రోగాలకు కూడా హోమియోపతి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.సరియైన వైద్యుని వద్ద మందులు వాడితే ఈ విషయం అతికొద్ది రోజులలోనే అర్ధమౌతుంది.

జ్యోతిష్య ఫలితం తప్పితే, జ్యోతిష్యశాస్త్రాన్ని నిందించకూడదు.అది జ్యోతిష్కుని చాతకానితనం.అలాగే,హోమియో మందులు పనిచెయ్యకపోతే ఆ శాస్త్రాన్నే నిందించడం తప్పు.ఆ వైద్యునికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాతకాలేదని తెలుసుకోవాలి.

ప్రస్తుతం మనకు తెలిసిన అన్ని రోగాలకూ(ఏవో ఒకటి రెండు తప్పించి) హోమియోపతిలో సమర్ధవంతమైన మందులు ఉన్నాయన్నది వాస్తవం.అవి ఇంగ్లీషు మందుల కంటే బ్రహ్మాండంగా పని చేస్తాయన్నదీ వాస్తవమే.

ఈ విషయం అనుభవంలో మాత్రమే తెలుస్తుంది.

అంటువ్యాధులను హోమియో ఔషధాలు చాలా వేగంగా సమర్ధవంతంగా తగ్గించడమే దీనికి ఋజువు.