ఈ రోజు ఉదయం పంచవటి సభ్యుడు గిరిధర్ మా ఇంటికి వచ్చాడు. విజయవాడలో 7 గంటలకు బయల్దేరి తొమ్మిదిలోపే ఇంటికి వచ్చి చేరుకున్నాడు.
అప్పటికే నా కార్యక్రమాలు అన్నీ ముగించుకుని నేను శాంతంగా కూచుని ఉన్నాను.
కాసేపు కూర్చుని సేదదీరిన తర్వాత, సంభాషణ మొదలైంది.
'మన పరిచయం అయ్యి ఎన్నాళ్ళు అయింది?' అడిగాను.
'మొదటిసారి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో పద్మజ గారింట్లో జరిగిన రిట్రీట్ లో మిమ్మల్ని చూశాను.' అన్నాడు.
'అవును.పంచవటి మొదలై అయిదేళ్ళు అవుతోంది కదా' అన్నాను.
'కానీ అంతకు ముందే ఒకసారి గుంటూరుకు వచ్చాను' అన్నాడు.
'ఎందుకు?' ప్రశ్నించాను.
'ఇక్కడ ఉన్న ఒక స్వామీజీని( పేరు చెప్పడం బాగుండదు) కలుద్దామని వచ్చాను.' అన్నాడు.
'ఎందుకు? ఆయన్ను కలుద్దామనుకున్నావు?' అడిగాను.
'తెలిసిన ప్రెండ్ ఎవరో ఆయన చాలా గొప్పవాడని చెబితే విని కలిశాను.' అన్నాడు.
'ఏమడిగావు ఆయన్ను?' ప్రశ్నించాను.
'దైవ సాక్షాత్కారానికి దారి చూపమని అడిగాను.నాకు దైవాన్ని చేరుకోవాలని ఉంది.దానికి మార్గనిర్దేశనం చెయ్యమని ప్రార్ధించాను.' అన్నాడు.
'ఏమన్నాడు ఆయన?' అడిగాను.
'అరగంట సేపు ఆపకుండా తిట్టాడు' అన్నాడు.
నాకాశ్చర్యం వేసింది.
'అదేంటి?ఆ మాటలో తప్పేముంది?ఆ మాట అడిగితే,ఒక స్వామీజీ అయ్యుండి,దారి చూపవలసింది పోయి తిట్టాడా? పైగా అరగంట సేపా? ఏమని తిట్టాడు?' అడిగాను.
'ప్రతివాడికీ దైవదర్శనం అవుతుందనుకున్నావా?దానికి ఒక స్థాయీ సంస్కారమూ ఉండాలి.నీకు ఈ రెంటిలో ఏమున్నాయని నీవు దైవదర్శనం కోరుకుంటున్నావు?' అంటూ ఏమేమో తిడుతూనే ఉన్నాడు.అవన్నీ నాకు గుర్తులేవు గాని,చివరకు నాకు ఏడుపొచ్చేసింది.చుట్టూ ఆయన అనుచరులూ భక్తులూ ఉన్నారు.నేనేమీ మాట్లాడలేదు.అదొక్కటే అడిగాను.' అన్నాడు.
'అదేంటి అంతలా తిట్టాల్సిన పనేముంది?' అడిగాను.
'ఏమో? నేనా మాట అడగడం తోనే ఆయన ఫైర్ అయిపోయాడు.'అన్నాడు.
'బహుశా ఆయనకు తెలియని విషయాన్ని అడిగావని కోపం వచ్చిందేమోలే' అన్నాను నవ్వుతూ.
తనూ నవ్వుతూ - 'ఏమో మరి? అలా అరగంట సేపు తిట్టి,చివరకు 'నీ ఇష్టదైవం ఎవరు?' అని అడిగాడు.ఈశ్వరుడు అని చెప్పాను.అలా అయితే పంచాక్షరీ మంత్రం ఒక లక్ష జపం చేసి ఆ తర్వాత కనబడు.అప్పుడొక హోమం చెయ్యాలి.ఆ తర్వాత చూద్దాం.అనన్నాడు.నేనవేవీ చెయ్యలేదు. మాట్లాడకుండా అక్కడ ఒక ప్లేట్ లో దక్షిణ ఉంచి వచ్చేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు మీ పరిచయం అయింది' అన్నాడు.
'మరి ఆ దక్షిణ తీసుకున్నాడా?అంతసేపూ తిట్టి ఆ డబ్బులు ఎలా తీసుకో బుద్దయిందో ఆయనకు?' అడిగాను.
'ఆయన చేతితో తీసుకోలేదు.అక్కడ ప్లేట్ లో పెట్టమన్నాడు.ఉపదేశం ఇచ్చాడుగా బహుశా దాని ఫీజు అయ్యి ఉంటుంది.'
నాకు చాలా బాధేసింది.
'అదేం ఉపదేశం? నిజమైన ఉపదేశం అలా ఉండదు.అయినా ఉపదేశానికి ఫీజెందుకు?' అన్నాను.
'అదేం ఉపదేశం? నిజమైన ఉపదేశం అలా ఉండదు.అయినా ఉపదేశానికి ఫీజెందుకు?' అన్నాను.
ఇలాంటి స్వాములు తయారై, పాపం అమాయకులను ఇలా తప్పు దారి పట్టిస్తూ ఉండటం వల్లే హిందూమతం ఇలా నానాటికీ అధోగతి పాలౌతున్నది.
కాసేపు మౌనంగా ఉన్నాను.
'చూడు గిరిధర్.మానవుడుగా పుట్టిన ప్రతివాడికీ దైవ దర్శనానికి అర్హత ఉన్నది.దానికి కులం,గోత్రం,దేశం,వయస్సు ఇలాంటివేవీ అడ్డంకాదు. హృదయపూర్వకమైన తపన ఒక్కటే ప్రధానం.ఈ మాట నేను చెప్పడం లేదు.అవతారమూర్తి అయిన శ్రీరామకృష్ణులు చెప్పారు.దైవం నీ హృదయాన్ని మాత్రమే చూస్తుంది.ఇంకేమీ పట్టించుకోదు.నీకు శుద్ధమైన హృదయం ఉన్నదా లేదా అన్నదే ప్రధానం గాని నీకులమేంటి? నీ గోత్రమేంటి? నీదగ్గర ఎంత డబ్బుంది?నీదే దేశం? ఇవేవీ ముఖ్యమైన విషయాలు కానేకావు.
స్థాయీ సంస్కారమూ అన్నాడా? సంస్కారం ఉండబట్టే అలాంటి ప్రశ్న అడిగావు.లేకుంటే అందరిలాగా తేరగా డబ్బు ఎలా వస్తుందని అడిగేవాడివి. ఇక స్థాయి అంటావా అది సాధనతో వస్తుంది.ఈ మాత్రం ఆయనకు తెలియలేదన్న మాట???
సత్యం ఏమిటో నేను చెబుతాను విను.ఈ జపాలద్వారా హోమాలద్వారా దైవదర్శనం ఎన్నటికీ కాదు.దాని దారి వేరు.మనిషి ఎన్ని లక్షల కోట్ల జపం చేసినా,ఎన్నెన్ని హోమాలు చేసినా-ఉండాల్సిన చెడు అంతా లోపల ఉంటె- అవన్నీ వృధా అవుతాయి.
శ్రీ రామకృష్ణులు ఒక కధ చెప్పేవారు నీకు తెలుసుకదా.
ఒక రైతు పగలంతా పొలానికి నీరు పెడుతూనే ఉన్నాడు.సాయంత్రానికి చూస్తే పొలంలో ఒక్క చుక్క కూడా మిగలకుండా పోయాయి.కారణం ఏమంటే ఆ పొలానికి ఆరు ఎలుక బోరియలున్నాయి.అవే కామక్రోధాది అరిషడ్వర్గాలు. ముందు అవి నిగ్రహింప బడకుండా నీవు ఎన్ని జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా,ఎన్ని గుళ్ళూ గోపురాలూ తిరిగినా అవన్నీ పరమదండగ మారి పనులు మాత్రమే.
ఇదే విషయాన్ని 'శ్రీవిద్యా రహస్యం'లో కూడా వ్రాశాను.
వింటున్న గిరిధర్ అవునన్నట్లు తలూపాడు.
'ఆ స్వామీజీకి దైవదర్శనం అయితే కదా నీకు ఆ మాత్రం చెప్పేదానికి? ఒక మనిషి తానే గుంటలో పీకలదాకా కూరుకుపోయి ఉన్నాడనుకో.అతను ఇంకొకరిని ఏం ఉద్ధరించగలడు? ఇదీ అంతే.ఊరకే కాషాయ వస్త్రాలు కట్టినంత మాత్రాన ఎవరూ స్వామీజీలు కాలేరు.ఈ విషయం కూడా మన పుస్తకంలో వ్రాశాను.నీవు చదివే ఉంటావు.
మనిషిని అడ్డుకునే కొన్ని దుష్టశక్తులున్నాయి.ముందుగా వాటిని నీ హృదయంలో నుంచి వెళ్ళగొట్టి శుభ్రం చెయ్యాలి.అవే అహంకారం-స్వార్ధం-భయం-దురాశ-కపటం.ఈ అయిదుశక్తులూ నీలో ఉన్నంతవరకూ నీవు దైవమార్గంలో ఏనాటికీ అడుగుపెట్టలేవు.ముందుగా వీటిని నీవు జయించాలి. అంతేగాని,వీటిని నీ లోపల ఉంచుకుని,ఎన్ని లక్షలు జపం చేసినా ఎన్ని హోమాలు చేసినా,ఎన్ని దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా అవన్నీ వృధా అని గ్రహించు.
ఈరోజుల్లో ప్రతివాడూ గురువై కూచుంటున్నాడు.ఇది ఎంతో బాధపడవలసిన విషయం.గురువైన వాడు తాను గురువునని విర్రవీగకూడదు.ఎంతగా తనలో అహంకారం మాయమౌతూ ఉంటుందో అంతగా దైవశక్తి తనలో పనిచెయ్యడం మొదలుపెడుతుంది.అతనిద్వారా అప్పుడు అద్భుతాలు వాటంతట అవే జరుగుతూ ఉంటాయి.అది తన గొప్ప కాదు.అది దైవానుగ్రహం.
ఈ విషయం గ్రహించి,తన ద్వారా పనిచేస్తున్న దైవశక్తికి తానూ సంపూర్ణ సమర్పణ కాగలిగినవాడే సద్గురువు అనబడతాడు.
ఒక్క విషయం విను.గరిటెతో గిన్నెలో తిప్పుతూ గృహిణి వంట చేస్తున్నది. తానే వంట చేస్తున్నానని గరిటె అహంకరిస్తే ఏమౌతుంది? నిజానికి వంట చేస్తున్నది గరిటా లేక గృహిణియా? గరిటె అనేది గురువు.గృహిణి దైవం. కనుక గరిటకు అహంకారం పనికిరాదు.ఎంతవరకూ గరిటలో అహంకారం ఉండదో అంతవరకూ గృహిణి ఆ గరిటను వాడుతుంది.ఆ గరిటకు పొగరెక్కిన మరుక్షణం దానిని చెత్తకుప్ప మీదకు విసరికొట్టి ఇంకొక గరిటను అందుకుంటుంది.
ఇంకొక ఉదాహరణ చెప్తాను విను.
ట్రాన్స్ ఫార్మర్ లోంచి మనకు కరెంట్ వస్తున్నది.ట్రాన్స్ ఫార్మర్ అనేది గురువు.కరెంట్ అనేది దైవం.మన దృష్టి కరెంట్ మీద ఉండాలి.ట్రాన్స్ ఫార్మర్ మీద కాదు.మనం కరెంట్ ను సరాసరి పట్టుకోలెం కాబట్టి ఒక మీడియం అవసరం అవుతుంది.అదే ట్రాన్స్ ఫార్మర్, లేదా మెయిన్స్.అదే గురువు అంటే. లోపల కరెంట్ లేకపోతే అది ఉత్త బొమ్మే.అలాగే లోపల దైవశక్తి లేకుంటే గురువు అనేవాడూ మానవమాత్రుడే.
'కామాఖ్యా తంత్రం' ఏమంటున్నదో చూడు.
శ్లో|| గురు: సదాశివ ప్రోక్త: ఆదినాధస్య ఉచ్యతే
మహాకాళ్యాయుతో దేవ: సచ్చిదానంద విగ్రహ:
నిజమైన గురువు సదాశివుడే.ఆయనే ఆదినాధుడు.మహాకాళీ సమేతుడు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు.
శ్లో|| అతే ఏవ గురుర్నైవ మనుజ: కింతు కల్పనా
దీక్షాయై సాధకానాంచ వృక్షాదౌ పూజనం యధా
ఒక మనుష్యుని గురువు అనుకోవడం కల్పన మాత్రమే.అది దీక్ష కొరకే గాని అసలైన పరమసత్యం కాదు.అది వృక్షానికి పూజ చెయ్యడం వంటిది.పూజ అనేది ఆ చెట్టును ఆవహింఛి ఉన్నట్టి యక్షిణీదేవతకే గాని చెట్టుకు కాదు. అలాగే గురువును గౌరవించేది ఆయనలోని దైవశక్తిని చూచి మాత్రమే.ఆ శక్తి లోపించిన మరుక్షణం అతడూ మానవమాత్రుడే.
శ్లో|| మానుషా గురుతా దేవి కల్పనా నతు ముఖ్యతా
'మనుష్యుని గురువు అనుకోవడం ఒక కల్పనా మాత్రమేగాని నిజం కాదు. అది అంత ముఖ్యమైన విషయం కాదు.' అని స్వయంగా పరమేశ్వరుడే చెప్పినట్లు కామాఖ్యా తంత్రం చెబుతున్నది.
శ్రీ రామకృష్ణులు కూడా ఇదే అనేవారు.
'భగవంతుడే నిజమైన జగద్గురువు.అందరు గురువులకూ అతడే అసలైన గురువు.మానవమాత్రులు గురువులు కాలేరు.'
ఈ విషయాన్ని నేటి గురువులు అందరూ పూర్తిగా మరచిపోయారు.అందుకే వారి శిష్యులూ అలాగే అఘోరిస్తున్నారు.నీవు చెప్పిన గురువు యొక్క శిష్యులలో ఒక్కడంటే ఒక్కడిని దైవమార్గంలో పురోగమించిన వాడిని నాకు చూపించు.చూపలేవు.
నిజమైన గురువైనవాడు ఉత్తమ శిష్యుణ్ణి వెంటనే గుర్తిస్తాడు.నిజంగా నీకు దైవ సాక్షాత్కారం పొందాలన్న తపన ఉంటే సద్గురువైనవాడు దానికి మార్గం చూపగలడు.సంతోషంగా ఆ దారిని నీకు చూపిస్తాడు.అంతేగాని నిన్ను హేళన చేసి నిరుత్సాహపరచడు.అలా చేసాడంటే అతను సద్గురువు కాడని వెంటనే అర్ధం చేసుకో.
నిజమైన గురువైనవాడు ఉత్తమ శిష్యుణ్ణి వెంటనే గుర్తిస్తాడు.నిజంగా నీకు దైవ సాక్షాత్కారం పొందాలన్న తపన ఉంటే సద్గురువైనవాడు దానికి మార్గం చూపగలడు.సంతోషంగా ఆ దారిని నీకు చూపిస్తాడు.అంతేగాని నిన్ను హేళన చేసి నిరుత్సాహపరచడు.అలా చేసాడంటే అతను సద్గురువు కాడని వెంటనే అర్ధం చేసుకో.
జపం చెయ్యమనీ హోమం చేద్దామనీ ఆయనన్నాడంటే కామ్యకర్మ విధానాన్ని నీకు చెప్పబోయాడన్నమాట.దైవమార్గం కామ్యకర్మ విధానం కాదు.అన్ని కామాలనూ అంతం చేసే అంతరికసాధనా మార్గమే దైవమార్గం. అది ఇలాంటి స్వామీజీలకు తెలియదు.కానీ తెలిసినట్లు చెప్పబోతారు. అమాయకులైన భక్తులు నమ్ముతారు.చివరకు ఇద్దరూ గోతిలో పడతారు. పడిన సంగతి ఇద్దరికీ తెలుస్తుంది.కానీ అలా పడిన విషయాన్ని గురువు ఒప్పుకోలేడు.అలా ఒప్పుకోడానికి చుట్టూ ఉన్న మందీమార్బలం, శిష్యగణం, హోదా మొదలైనవి అడ్డోస్తాయి.అంతే.
'నాతో బాటు అక్కడున్న కొందరు డబ్బులోచ్చే మార్గాలు చెప్పమనీ ఇతరత్రా కోరికలు తీరే మార్గాలు చెప్పమనీ అడుగుతున్నారు.వారితో నవ్వుతూ మాట్లాడి వారికి మార్గాలు చెప్పాడు.కానీ నన్నే తిట్టాడు.' అన్నాడు గిరిధర్.
'అదేకదా మరి.ఆయనకు తెలిసినవి అవే.అందుకని వారికి నవ్వుతూ జవాబులు చెప్పాడు.తెలియని దానిని నీవు అడిగావు.అందుకని నీమీద కోపం వచ్చింది.వెరీ సింపుల్.మొత్తంమీద ఆయన వలలో పడకుండా నీవు తప్పించుకున్నావు.అదృష్టవంతుడివి.'-అన్నాను.
త్వరలో జరుగబోతున్న శ్రీశైలం రిట్రీట్ వివరాలు తెలుసుకుని,ఇంకాసేపు మిగతా కొన్ని విషయాలు మాట్లాడి గిరిధర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.