నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, మే 2015, బుధవారం

హోమియో అద్భుతాలు-ప్రేతాత్మ పిలుస్తోంది

హోమియోవైద్య విధానం గురించి ఇంకా ప్రజల్లో అపోహలు ఉండటం కూడా సామూహిక కర్మప్రభావమే.ఎవరికైతే రోగాలు తగ్గే కర్మ లేదో వారు హోమియో వైద్యవిధానం వైపు తొంగి కూడా చూడరు.చూడలేరు.ఈ విషయాన్ని చెప్పినా వారు ఒప్పుకోలేరు.

ఎవరికైతే రోగం తగ్గే మంచికర్మ కొద్దో గోప్పో వారి జీవితంలో ఉన్నదో వారుమాత్రమే ఒక మంచి హోమియోవైద్యుని సంప్రదించగలుగుతారు. చెప్పినట్లు మందు వాడగలుగుతారు.రోగాన్ని తగ్గించుకోగలుగుతారు.

డా||హన్నేమాన్ కాలంలో హోమియోలో దాదాపు 300 మందులు ఉండేవి. ఇప్పుడో ఆ సంఖ్య 3000 దాటింది.నేడు కొత్తగా ప్రూవ్ అయిన మందులతో హోమియో వైద్యవిధానం ఒక పరిపూర్ణమైన వైద్యవిధానంగా రూపు దిద్దుకుంటున్నది.దీనిలో నయంకాని రోగం లేదంటే ప్రస్తుతం అతిశయోక్తి కాబోదు.అయితే రోగి వయసూ,అతని ప్రాణశక్తి పరిస్థితీ,రోగం ముదిరిన తీరూ మొదలైన విషయాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

ఈ మధ్యనే మేము డీల్ చేసిన ఒక కేస్ గురించి వింటే,మానసిక రోగాలంటూ సైకియాట్రీ ట్రీట్మెంట్ అంటూ,భూతవైద్యాలంటూ హింసకు గురయ్యే కేసులు కూడా సరియైన హోమియోపతి ట్రీట్మెంట్ తో ఎంత సులువుగా,నొప్పి లేకుండా,సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, హాయిగా, వెంటనే తగ్గుతాయో అర్ధమౌతుంది.

పేషంట్ ఒక అమ్మాయి.ఆమె వయసు 23 సం||సామాన్యమైన ఎత్తులో బలంగా కొంచం బొద్దుగా ఉంటుంది.బీ టెక్ పాసయింది.ఉండటం పెద్ద సిటీలోనే ఉంటుంది.కానీ ఉద్యోగం చెయ్యడం లేదు.

వీళ్ళ నాన్న బిజినెస్ మాన్ కావడంతో,బ్రతికున్న రోజులలో రాత్రి 2 దాటాక మాత్రమే ఇంటికొచ్చి బెల్ కొట్టేవాడు.వాళ్ళమ్మను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని ఈ అమ్మాయే వెళ్లి తలుపు తీసేది.ఇలా కొన్నేళ్ళు జరిగింది. ఇంతలో రెండేళ్ళక్రితం ఒకరోజున హార్ట్ ఎటాక్ తో ఆయన హటాత్తుగా చనిపోయాడు.

అప్పటినుంచీ ఈ అమ్మాయి తీవ్రమైన డిప్రెషన్కి గురయింది. క్రమంగా నిద్రపట్టని ఒక విచిత్రపరిస్థితి మొదలైంది.ఎప్పుడో అర్ధరాత్రికి నిద్రపడుతుంది.కానీ రెండున్నరకు హటాత్తుగా మెలకువ వస్తుంది.కాలింగ్ బెల్ మోగుతూ ఈ అమ్మాయికి వినిపిస్తుంది.పక్కనున్న వారికి వినిపించదు.

'నాన్నొచ్చాడు'- అని ఉలిక్కిపడి లేచి నిద్రలో నడుస్తున్నట్లుగా ఈ అమ్మాయి వెళ్లి తలుపు తీస్తుంది.అక్కడే శూన్యంలోకి చూస్తూ,ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా తనలో తాను గొణుక్కుంటూ కొంచంసేపు నిలబడుతుంది.ఆ తర్వాత అక్కడే కుప్పకూలిపోతుంది.తెచ్చి బెడ్ పైన పడుకోబెడతారు.ప్రతిరాత్రీ ఇలా జరగడం మొదలై నేటికి రెండేళ్ళు దాటింది. పగటిపూట కూడా వాళ్ళ నాన్న తనకు కనిపిస్తున్నాడంటూ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది.

దీనితోడు విపరీతమైన తలనొప్పి మొదలైంది.ఆ నొప్పి షూటింగ్ పెయిన్ లా ఉంటుంది.మాడులోనూ నుదురులోనూ వస్తుంది.పెయిన్ కిల్లర్స్ వాడితే కాసేపు ఉపశమిస్తుంది.మళ్ళీ వస్తుంది.

ఇదిలా ఉండగా, నాన్నగారు పోయిన కొత్తలో ఒకబ్బాయితో ప్రేమ మొదలైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఏవో సిల్లీ రీజన్స్ తో ఆ ప్రేమ చట్టుబండలైంది. కొన్నాళ్ళ తర్వాత ఆ అబ్బాయే మళ్ళీ వచ్చి ప్రాధేయపడి మాట్లాడబోతే తను విసుక్కుని అతన్ని దూరం పెట్టింది.

ఎప్పుడూ ఒక రూంలో కూచుని తనలో తను గొణుక్కోవడమో,లేక శూన్యంలోకి చూస్తూ కూచోడమో చేస్తుంది.ఆకలి మందగించింది.నిద్రపట్టని ఇన్ సోమ్నియా రోగం పట్టుకుంది.విసుగు చిరాకు ఎక్కువయ్యాయి.డిప్రెషన్ బాధిస్తున్నది.దీనికి తోడుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బాధపెడుతున్నాయి.ఏదో అంతుబట్టని రోగంతో బాధపడుతున్నట్లుగా పరిస్థితి తయారైంది.

మామూలుగా అయితే,ఆ అమ్మాయిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళేవారు.అక్కడ అడుగు పెట్టాక ఏయే ట్రీట్మెంట్లు జరుగుతాయో మనకు తెలుసుకదా.ముందుగా మత్తుమందు (tranquilizers) లిస్తారు.ఆ దెబ్బతో పేషంటు మత్తుగా పడి ఉంటుంది.కానీ రోగం తగ్గదు.ఆ తర్వాత నరాల మీద పనిచేసే మరికొన్ని మందులిస్తారు.ఉన్నరోగం తగ్గకపోగా పేషంటు నీరసపడి నిజంగా పిచ్చిదై పోతుంది.ఆ తర్వాత కరెంట్ షాకులు ఇవ్వడం మొదలు పెడతారు.సంకెళ్ళతో కట్టెయ్యడం మొదలుపెడతారు.ఒక రూంలో బంధిస్తారు.

చివరకు మా వల్లకాదని,ఈ మందులు జీవితాంతం  వాడమని చెప్పి చేతులెత్తేస్తారు.అవి వాడుతూ ఉంటె సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువై ఇతర అవయవాలు దెబ్బతినడం మొదలౌతుంది.చివరకు ఒక బంగారుజీవితం అర్ధాంతరంగా విషాదాంతంగా ముగుస్తుంది.ఈ లోపల కొన్ని లక్షలు ఆవిరై పోయేవి.పోనీ డబ్బు పోయినా పరవాలేదు.రోగం మాత్రం తగ్గకపోగా ఇంకా ఇంకా ముదిరేది.

మూఢనమ్మకాలను నమ్మే ఇంకోరకం మనుషులైతే, ఏ భూతమాంత్రికుని దగ్గరకో తనను తీసుకెళతారు.ఇక అక్కడ జరిగే హింస నేను వర్ణించలేను.ఆ క్రమంలో ఆ అమ్మాయికూడా తనకు ఏదో దయ్యం పట్టిందని నమ్మే స్థితిలోకి నెట్టబడి చివరకు తానే ఒక పిశాచంలా మారిపోతుంది.

ఈ అమ్మాయి అదృష్టం బాగుండి, తన బంధువుల అబ్బాయి మా అమ్మాయికి సీనియర్ క్లాస్ మేట్ అయ్యాడు.ఈ కేస్ వివరాలు చెప్పి,కొంచం తనను ట్రీట్ చెయ్యమని అడిగాడు.ఎక్యూటైనా,క్రానిక్ అయినా కేసులను చక్కగా డీల్ చేస్తుందని మా అమ్మాయికి వాళ్ళ కాలేజీలో మంచి పేరుంది.కేస్ తీసుకోనా?ట్రీట్మెంట్ లో సాయం చేస్తావా?అని తను నన్నడిగింది. సామాన్యంగా నేను ఫోన్లో ట్రీట్మెంట్ ఇవ్వను.పాపం ఆడపిల్ల కదా అని జాలేసి సరే కేస్ తీసుకొమ్మని చెప్పాను.

పేరెంటల్ హిస్టరీ, పేషంట్ హిస్టరీ,మానసిక శారీరక లక్షణాలన్నీ సేకరించి, వాటిని మూడు గంటలపాటు బేరీజు వేసి,ఆ అమ్మాయి తత్త్వమేమిటో గ్రహించి,తులనాత్మకంగా ఒకే ఒక్క హోమియో ఔషధాన్ని ఎంపిక చేసి రెండురోజుల వ్యవధిలో మూడే మూడు డోసులు ఇవ్వడం జరిగింది.

మొదటిసారిగా మందు వేసుకున్న రోజున రాత్రి పదిగంటలకు పడుకున్న ఆ అమ్మాయి మర్నాడు ఉదయం వరకూ నిద్రనుండి లేవలేదు.కాలింగ్ బెల్ వినిపించలేదు.రెండవరోజు కూడా మందు రిపీట్ చెయ్యమని చెప్పాము.ఆ రోజూ నిద్ర బాగా పట్టింది. కాలింగ్ బెల్ వినపడలేదు.వాళ్ళ నాన్నగారి ఆత్మ రాలేదు.ఇక మందు ఆపెయ్యమని సూచించాము.

ఇది జరిగి ఇప్పటికి రెండువారాలు అవుతున్నది.అప్పటినుంచీ ఈరోజువరకూ తనకు నిద్ర బాగా పడుతున్నది.రాత్రిళ్ళు రెండున్నరకు ఉలిక్కిపడి లేవడం లేదు.వాళ్ళ నాన్నగారి ఆత్మకూడా రావడం లేదు.ఈ అమ్మాయికి ఆకలి మామూలుగా వేస్తున్నది.తలనొప్పి మాత్రం ఒక 5% ఇంకా ఉన్నది.కానీ పెద్దగా బాధించడం లేదు.ఇతర రోగలక్షణాలన్నీ మంత్రం వేసినట్లు పూర్తిగా తగ్గిపోయాయి.

వాళ్ళ ఇంటిలో వారు,ఈ కేస్ రిఫర్ చేసిన అబ్బాయీ,అందరూ, హోమియోపతి చేసిన ఈ అద్భుతానికి మాటా పలుకూ లేకుండా అయిపోయారు.ఈ ట్రీట్మెంట్ కు అయిన ఖర్చు Rs 100/- మాత్రమే.మేమేం ఫీజు తీసుకోలేదు.మందులు మాత్రం కొనుక్కుని వేసుకోమని చెప్పాము. అంతే.

ఇంతా చేస్తే మేమా అమ్మాయిని చూడనే లేదు.ఫోన్లో వివరాలు తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.తనిప్పుడు హాయిగా ఉంది.ఒకే ఒక్క సింగిల్ డోస్ ఇంత అద్భుతాన్ని చేసింది.

కేస్ సరిగ్గా తీసుకుని,లక్షణాలన్నీ క్రోడీకరించి,తత్త్వపరంగా సెలెక్ట్ చెయ్యబడిన హోమియో ఔషధం ఎంత అమోఘంగా పని చేస్తుందో--అది కూడా సింగిల్ మినిమం డోస్ తోనే ఎంత అద్భుతం జరుగుతుందో--చెప్పినా ఎవరూ నమ్మరు.కానీ ట్రీట్మెంట్ ఇచ్చిన మాకు తెలుసు.తీసుకున్న ఆ అమ్మాయికి తెలుసు,చూచిన ఆమె బంధువులకు తెలుసు--ఇదంతా నమ్మలేని నిజమని.

మా ఇంటిపక్కనే ఉన్నవారైనా సరే, వివరించి చెప్పినా కూడా దీనిని చస్తే నమ్మరు.వాళ్ళ ఖర్మ అలా నమ్మనివ్వదు.కానీ ఎక్కడో వందల మైళ్ళ దూరంలో ఉన్న ఆ అమ్మాయికి రోగం తగ్గే యోగం ఉంది.కనుక మాద్వారా ఇది జరిగింది-అదికూడా మమ్మల్ని తను చూడకుండా - తనను మేము చూడకుండా.అదీ వింత.

హోమియో అద్భుతాలు ఇలా ఉంటాయి.