నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, మే 2015, శనివారం

శ్రీశైలం సాధనా సమ్మేళనం-ఆంధ్రా తెలంగాణా గొడవలు-పరాకాష్టకు చేరుతున్న పిచ్చి





అక్కమహాదేవి గుహలు,కదళీవనం అనేవి శ్రీశైలంలో కొన్నికోట్ల ఏళ్ళ నాటి పవిత్ర స్థలాలు.వెయ్యేళ్ళ క్రితం అక్కమహాదేవి ఆ స్థలాలలో తపస్సు చేసి పరమేశ్వరునిలో ఐక్యం అయ్యింది.కానీ ఆ ప్రదేశాలు అంతకంటే ఇంకా ఎంతో ప్రాచీనమైనవి.కొన్ని కోట్ల సంవత్సరాల నాడే అవి ఏర్పడ్డాయి.అప్పటినుంచీ ఎందఱో మహర్షులు, సిద్ధులు అక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతున్నది. వారిలో దత్తాత్రేయులు కూడా ఒకరు.

తిరుపతిలోని శిలాతోరణం కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది.అలాగే కదలీవనంలోని గుహ కూడా కోట్ల సంవత్సరాల నాటిదే.ఇవన్నీ భూమి పుట్టిన కొత్తల్లో ఏర్పడిన శిలారూపాలు.

మొన్న శ్రీశైలం సాధనాసమ్మేళనం సమయంలో రెండవరోజున అక్కమహాదేవి గుహలను కదలీ వనాన్ని దర్శించాలని ముందుగా అనుకున్నాం.కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.దానికి కారణాలేమిటో వింటే చాలా వింతగా అనిపించడం తో బాటు,మనుషుల మనస్తత్వాల మీద అసహ్యం తప్పకుండా వేస్తుంది.

అక్కమహాదేవి గుహలకు వెళ్ళాలంటే కృష్ణానది మీదుగా ఎగువకు 10 కి.మీ బోటులో వెళ్ళాలి.అక్కడ ఆ గుహలు ఉన్నాయి.అక్కడనుంచి ఒక 6 కి.మీ. కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎక్కితే అప్పుడు కదలీ వనానికి చేరుకోవచ్చు.అంత కష్టపడి అక్కడకు ఎందుకు వెళతాం?అది మహాసిద్ధక్షేత్రమనీ అక్కడ మహనీయులైన ఋషులు,సిద్ధులు తపస్సు చేశారనీ,ఆ స్పందనలను మనం కూడా ఆస్వాదించి వారి అనుగ్రహాన్ని పొందుదామనే కదా?

కానీ మా ప్రయత్నం ఫలించలేదు.కారణం?

మనం పాతాళగంగ దగ్గర నిలబడి డ్యాం వైపు చూస్తె, కుడివైపు ఉన్న కొండలు ఆంధ్రాలో ఉన్నాయట.నదికి ఎడమవైపున మనకు కనిపించే కొండ ప్రాంతం,ముఖ్యంగా కదళీవనం ఉన్న ప్రాంతం తెలంగాణలో ఉన్నదట.ఆంధ్రా టూరిజంవారు మా ప్రాంతాలకు వచ్చి పోవడం ఏమిటి? దానివల్ల మా రెవెన్యూ అంతా వారికి పోతున్నది,అంటూ వారు అభ్యంతరం చెప్పడమే గాక,ఆంధ్రా వైపునుంచి టూరిస్టులు రాకుండా ఆ అడవిలో ఒక గోడను కడుతున్నారట. అందుకని శ్రీశైలం నుంచి పడవలు ఆ ప్రదేశానికి పోవడానికి అనుమతి లేదని తేల్చి చెప్పాడు శ్రీశైలం ఈవో.

కావాలంటే హైదరాబాద్ నుంచి మినిస్టర్ గారి అనుమతి తెచ్చుకోండి అప్పుడు అనుమతి ఇస్తానన్నాడు.అనుకుంటే ఆ పని చెయ్యడం పెద్ద విషయం కాదు. కానీ ఇదంతా విని నాకు పరమ అసహ్యం అనిపించింది.గొడవపడి మరీ అక్కడకు వెళ్ళవలసినంత అవసరం లేదనిపించింది.

చైనా,టిబెట్ లలో విస్తరించి ఉన్న మానస సరోవరానికి పోవడానికి మనకు అనుమతి లభిస్తున్నది.కానీ మన రాష్ట్రంలోనే ఉన్న శ్రీశైలంలో కొన్ని ప్రదేశాలకు పోవడానికి మనకు అనుమతి లేదు.

భలే విచిత్రం కదూ?

తెలంగాణా అంటే అదేదో పాకిస్తానో చైనానో కాదుగా? అది కూడా మన రాష్ట్రంలో ఒక భాగమేగా నిన్న మొన్నటిదాకా? నేడు కూడా అది భారతదేశంలో భాగమేగా? లేక పరాయి దేశమా?

పాకిస్తాన్ మన దేశం నుంచి ద్వేషభావంతో పుట్టింది.దాని గతి ఎలా అఘోరిస్తున్నదో చూస్తున్నాం.తెలంగాణా కూడా అలాంటి ద్వేషభావంతో పుట్టి ఉంటే, అర్జంటుగా ఆ ద్వేషాన్ని వారి మనసులో నుంచి తుడిఛి పెట్టవలసిన అవసరం ఉన్నది.ఎందుకంటే ద్వేషంతో మొదలైన పనులు ఒక మంచి సాఫల్యత వైపు ఎన్నటికీ ప్రయాణం సాగించలేవు.వాటి గమ్యస్థానం కూడా అంత అందంగా ఏమీ ఉండదు.

మానసిక దిగజారుడు తనానికి ఇంతకంటే పరాకాష్ట ఇంకెక్కడుంటుంది?