నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, జూన్ 2015, మంగళవారం

నాలుగు ఋణములు -- పంచ శ్రాద్ధములు

ఈరోజు జ్యేష్ట అమావాస్య.పితృ తర్పణం చెయ్యవలసిన రోజులలో ఒకటి.

కనుక మనిషికున్న నాలుగు ఋణాల గురించీ,అందులో ముఖ్యంగా పితృఋణం గురించీ,శ్రాద్ధకర్మ గురించీ,వాటిలోని భేదాలగురించీ కొంత వివరించదలచుకున్నాను.

ప్రతి మనిషీ, పుట్టుకతో కొన్ని రుణాలతో భూమిపైకి వస్తాడు. ఋణం లేకుంటే జన్మ లేదు.రాదు.ఋణానుబంధాల వల్లనే మనిషికి ఫలానా కుటుంబంలో పుట్టటం,ఫలానా చదువు,ఫలానా ఉద్యోగం,ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం ఇదంతా జరుగుతుంది.

అయితే--ప్రతిమనిషీ కూడా తన ఇష్టప్రకారమే ఇదంతా జరుగుతున్నదన్న భ్రమలో ఉంటాడు.కాని అది నిజం కాదు.పుట్టుకతోనే మనకున్న కర్మ బేలెన్స్ వల్ల,ఆయా ఋణానుబంధాల వల్ల ఇవన్నీ జీవితంలో జరుగుతాయి.కానీ ఆ విషయాన్ని అర్ధం చేసుకునే సూక్ష్మదృష్టి మనిషికి ఉండదు.

మనిషికి పుట్టుకతోనే దేవఋణం,ఋషిఋణం,పితృఋణం అని మూడు ఋణాలున్నాయని వేదం అంటుంది.

కృష్ణ యజుర్వేదంలో భాగమైన తైత్తిరీయ సంహిత ప్రకారం --

"జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్ ఋణవా జాయతే
బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవభ్య:
ప్రజయా పితృభ్య ఏష వా అనృణో య:..."
.......

కనుక మనిషికి ఉన్న మూడు ఋణాలనూ ఈ విధంగా విభజించవచ్చు.

1.దేవఋణం- దైవం పట్ల మనకున్న ఋణం.

దైవం అంటే ప్రకృతి శక్తులు.ప్రకృతి శక్తులైన పంచభూతాలు సహాయం చెయ్యకపోతే మనిషి జీవితం లేదు.

"యజ్ఞేన దేవభ్య:.." అనే పదంలో - యజ్ఞం వల్ల దేవరుణం తీరుతుందని వేదం అంటున్నది.పాతకాలంలో ప్రతి ఇంటిలోనూ నిత్యం యజ్ఞాలు జరిగేవి. యజ్ఞమంటే,దైవం ఇచ్చినదానిలో కొంతభాగాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ దైవానికే అర్పించడం.

ఒకే దైవాన్నే మనం అనేక దేవతారూపాలలో పూజిస్తాం. అలా అర్చించడం వల్ల దేవఋణం తీరుతుంది.నేటి కాలానుగుణంగా యజ్ఞ యాగాదులు చెయ్యకపోయినా,భగవద్భక్తిని కలిగి ఉండటం,జపధ్యానాదులు చెయ్యడం వల్ల దేవఋణం తీరుతుంది.

అంటే -- పంచభూతాల రూపంలో నిరంతరం మనల్ని పోషిస్తున్న దైవానికి మనం కృతజ్ఞత చూపడం అన్నమాట.

2.ఋషి ఋణం--మన పూర్వీకులూ జ్ఞానసంపన్నులూ అయిన రుషులపట్ల మనకున్న ఋణం.

"బ్రహ్మచర్యేణ ఋషిభ్యో.."- అనే పదంతో ఆ ఋణం ఎలా తీర్చుకోవాలో వేదం సూచించింది.వివాహానికి ముందు బ్రహ్మచర్యం పాటించడం వల్ల, ఆయా ఋషులు చెప్పిన శాస్త్రాలను అధ్యయనం చెయ్యడం వల్ల,పద్దతిగా జీవించడం వల్ల ఋషిఋణం తీరుతుంది.

మన పూర్వీకులు మహర్షులు.మన గోత్రాలలో ఆయా ఋషులు స్మరింపబడుతూ ఉంటారు.ఆయా ఋషులు వారివారి తపస్సుతో కనుగొన్న సత్యాలు వేదాల రూపంలో ఉపనిషత్తుల రూపంలో మన ముందున్నాయి. ఆయా మార్గాలలో నడచి ఆయా సత్యాలను మనం సాక్షాత్కరించుకోవడం వల్లనే మనకున్న ఋషి ఋణం తీరుతుంది.

3.పితృఋణం--అంటే,మన పూర్వీకులైన పితృదేవతలపట్ల మనకున్న ఋణం.

"ప్రజయా పితృభ్య.." -- సంతానం కనడం వల్ల పితృఋణం తీరుతుంది.

అంటే,వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల పూర్వీకులైన పితృదేవతల ఋణం తీరుతుంది.వారు మనకెలా జన్మనిచ్చారో,మనమూ మన పిల్లలకు జన్మనిచ్చి,మన ధార్మికసంపదను వారికి ధారాదత్తం చెయ్యడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు.ఆ రూపంగా వారి ఋణం తీరుతుంది.

శతపధబ్రాహ్మణం ప్రకారం మనుష్యఋణం అనే నాలుగో ఋణం కూడా మనిషికి ఉన్నది.

4.మనుష్యఋణం-- సమాజంలో మనతో బాటు నివసిస్తున్న సాటి మనుష్యులతో మనకున్న ఋణం.

సమాజం పట్ల మన బాధ్యతను చక్కగా నిర్వర్తించడం ద్వారా ఈ ఋణం తీరుతుంది.అంటే,సాటివారితో చక్కని ప్రవర్తన కలిగిఉండటం,మనకున్నంతలో ఇతరులకు సాయం చెయ్యడం,మన జ్ఞానసంపదను అర్హులైన ఇతరులకు అందించడం,ఇతరులను మోసం చెయ్యకుండా జీవించడం మొదలైనవి.

ఈ నాలుగు ఋణాలూ తీరకపోతే, మనిషికి మళ్ళీ జన్మ ఉంటూనే ఉంటుంది. జన్మరాహిత్యం కలగదు.ఈ జన్మలో మన ప్రవర్తనను బట్టి,మనం చేసుకున్న కర్మను బట్టి, వచ్చే జన్మలో మనిషిగానో,జంతువుగానో,క్రిమికీటకాలగానో, చెట్లూ పుట్టలగానో పుట్టడం జరుగుతుంది. ఆయా ఋణాలను మనం తీర్చుకుంటున్నామా లేక ఇంకా ఇంకా పెంచుకుంటున్నామా అనేదానిని బట్టి అంతా జరుగుతుంది.

దేవరుణం తీరడానికి యజ్ఞం ఎలాగో, పితృదేవతల ఋణం తీరడానికి శ్రాద్ధకర్మ కూడా అలాంటిదే.మన పితృదేవతలను స్మరిస్తూ ఆ రోజున మనం పితృకర్మను( శ్రాద్దాన్ని) తప్పకుండా ఆచరించాలి.దీనిని ఒదిలెయ్యడం మహాదోషమే గాక క్షమించరాని పాపం కూడా.

పితృ శ్రాధ్ధంలో అయిదు రకాలున్నాయి.

ఆపస్తంబ గృహ్య సూత్రములలోని ఆచారకాండ భాగంలో ఉన్న శ్రాద్ధకాండ ప్రకారం--

"సాపిండీ,సంకల్ప,బ్రాహ్మణభోజన,ఉపాదాన,ఆశ్రుతశ్రాద్దేషు పంచశ్రాధ్ధా: ప్రకీర్తితా"- అని ప్రమాణం ఉన్నది.

వీనిలో,

1. సాపిండీ -- అంటే, పిండ ప్రదానంతో కూడిన పూర్ణ శ్రాద్ధం.

2.సంకల్ప -- అంటే,ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెడుతూ,పిండరహితంగా చేసే శ్రాద్దకర్మ.

3.బ్రాహ్మణభోజన -- ఒక బ్రాహ్మణునితో, తర్పణం,సంకల్పసహితంగా చేసే శ్రాద్ధకర్మ.

4.ఉపాదానం -- అంటే, వంట చేసుకోవడానికి కావలసిన బియ్యం, పప్పు, కూరలు మొదలైన వస్తువులను ఒక బ్రాహ్మణునికి ఇచ్చి నమస్కారం చేసి ఊరుకోవడం.

5.ఆశ్రుతమ్ -- అంటే అశ్రువులు లేదా కన్నీళ్ళతో చేసే శ్రాద్దకర్మ.
పై నాలుగూ కూడా చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు,నదీ తీరానికి గాని, అటవీప్రాంతానికిగాని పోయి,నిర్జనప్రదేశంలో, తన పితృదేవతలను తలచుకొని కన్నీరు విడుస్తూ - 'నేను అశక్తుడను.నా ఖర్మ కొద్దీ మీకు ఈనాడు ఏమీ చెయ్యలేకపోతున్నాను.ఈ నిర్భాగ్యుడిని క్షమించండి' --అని వారిని ప్రార్ధించి, ఆరోజున భోజనం చెయ్యకుండా నిరాహారంగా ఉండటం.ఇదికూడా ఒక రకమైన శ్రాద్ధకర్మే అని వేదమే చెప్పింది.

ఈ అయిదు రకాల శ్రాద్ధకర్మలూ ఒకదాని కంటే ఇంకొకటి తక్కువ తరగతివి. మొదటిది చెయ్యలేని పరిస్థితులలో ఉన్నపుడు,రెండోది,అది కూడా చెయ్యలేనప్పుడు మూడోది,ఇలా కనీసం ఆఖరుదైనా చెయ్యాలి గాని,పితృ శ్రాద్దాన్ని పూర్తిగా వదలిపెట్టకూడదు.

మనకు జన్మనిచ్చిన పితృదేవతలను కనీసం ఆ ఒక్కరోజైనా తలచుకోవడం, వారి పేరుతో కొందరికి భోజనం పెట్టడం,బట్టలు పెట్టడం మొదలైన పనులు మనం ఆచరించవలసిన కనీసధర్మాలలో ముఖ్యమైనట్టివి.