నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, జూన్ 2015, బుధవారం

ఎందుకు?















పశ్చాత్తాపంలో కాలే మనసుకు
పంచాగ్ని తపపు
ప్రయోగాలెందుకు?

వంచనా వైతరణిని మీరిన మనిషికి
అంచనాలలో తేలే
ఆలోచనలెందుకు?

ద్వంద్వాలను దాటిన వీక్షణకు
అందాల కొలుపుల
బంధాలెందుకు?

ఆశను వదలిన అమోఘ చక్షువు
అలవాట్ల వలలో
అల్లాడడమెందుకు?

మోహపు పాశం త్రుంచినవానికి
మోసగాళ్ళ ముంగిట
మ్రొక్కులెందుకు?

అన్నీ తెలిసిన అమలినాత్మకు
అరిషడ్వర్గపు అంగళ్ళలో
అరువు బేరాలెందుకు?

ఇంద్రియదాస్యం త్రెంచినవానికి
ఇంద్రపదవిపై
ఇచ్చకమెందుకు?

లోకాన్నే తిరస్కరించే వాడికి
లౌకిక వాంఛల
లౌల్యమెందుకు?

దేనిపైనా మనసు నిల్పనివానికి
ధనపు మాయలలో చిక్కే
దరిద్రమెందుకు?

దేహభ్రాంతిలో చిక్కని వానికి
ధరణీదాస్యపు
దైన్యమెందుకు?

సుదూర తీరాలనే చూచేవానికి
శూన్యాలాపాల
సుద్దులెందుకు?

తనలో తానై మిగిలేవానికి
తాపత్రయాలలో జారే
తప్పటడుగు లెందుకు?