“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, జూన్ 2015, శనివారం

ప్రతిరోజూ యోగాభ్యాసం చెయ్యండి - ఆనందంగా జీవించండి

ప్రపంచానికి మన దేశం ఇచ్చిన కానుకలు ఎన్నోరంగాలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మాత్రం -- యోగశాస్త్రమే.

యోగశాస్త్రం షడ్ దర్శనాలలో ఒకటి.

దైవాన్ని చేరే మార్గాలుగా మన దేశం ఆరుమార్గాలను సూచించింది.వాటినే షడ్ దర్శనాలంటారు.వీటినే "భారతీయ తాత్త్వికచింతనలో ఆరు పద్ధతులు" (six systems of Hindu Philosophy) అని కూడా పిలుస్తారు.

అవి:--
న్యాయ,వైశేషిక,సాంఖ్య,యోగ,పూర్వ మీమాంస,ఉత్తర మీమాంస -- అని ఆరు దర్శనాలుగా ఉన్నవి.

వీటిలో ముఖ్యంగా నాలుగు రకాలైన విషయాలు వివరించ బడ్డాయి.

1.బ్రహ్మము లేదా దైవం.
దీనినే మనం నేటి వ్యావహారిక భాషలో దేవుడు అంటున్నాం.ఆ బ్రహ్మము ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? దాని లక్షణాలేమిటి?గుణగణాలేమిటి? మొదలైన వివరాలు.

2. జీవుడు--అంటే ప్రతి ప్రాణిలోనూ ఉండే జీవాత్మ.
ఈ జీవాత్మ ఎలా పుట్టింది? జననమరణ చక్రంలో ఎలా పడింది?దీని స్వభావం, స్వరూపం ఏమిటి? మొదలైన వివరాలు.

3. జగత్తు -- లేదా ప్రపంచం.
దాని సృష్టి,స్థితి,లయం ఎలా జరుగుతుంది? ఎవరు దీనిని చేస్తారు? చివరకు ఈ ప్రపంచం ఏమౌతుంది? మొదలైన వివరాలు.

4. మోక్షం -- లేదా ముక్తి అంటే ఏంటి?అది ఎన్ని రకాలుగా ఉంటుంది?దానిని పొందే మార్గాలేమిటి? మొదలైన వివరాలు.

ఈ ఆరు దర్శనాలలో మిగిలిన అయిదూ పాండిత్యంతో కూడుకున్నట్టివి. కర్మకాండతోనూ జ్ఞానకాండతోనూ కూడుకున్నట్టివి.కనుక అందరూ అన్నింటినీ అర్ధం చేసుకోలేరు.ఆచరించలేరు.

కానీ ఒక్క యోగదర్శనం మాత్రం అందరూ ఆచరించదగినది.

అంతే కాదు.మిగిలిన అయిదూ ఇచ్చే ఫలితాలు ఎప్పుడో మరణానంతరం మాత్రమే దక్కుతాయి.కానీ యోగమార్గంలో మాత్రం ఇప్పుడే ఇక్కడే ఫలితాలు వెంటనే కనిపిస్తాయి.అదీ యోగమార్గపు గొప్పతనాలలో ఒకటి.

యోగమార్గంలో కూడా అనేక శాఖోపశాఖలు ఉన్నప్పటికీ సాంప్రదాయపరంగా అంగీకరించబడేది మాత్రం పతంజలి మహర్షి ప్రణీతమైన రాజయోగమే.

యోగం అంటే ఆసనాలు ఒక్కటే కాదు.ఆసనాలనేవి అందులో చాలా ప్రాధమికమైన భాగం మాత్రమే.అసలైన మెట్లు దాని పైన చాలా ఉన్నాయి.

ఈనాడు మనం చేస్తున్న ఆసనాలన్నీ హఠయోగానికి చెందినవి.హఠయోగం అనేది రాజయోగానికి పునాది లాంటిది.దాని మూలగ్రంధాలు--హఠయోగ ప్రదీపిక,ఘేరండ సంహిత,యోగ రత్నావళి,శివసంహిత మొదలైనవి.

హఠయోగంలోని ఆసనాలు,ప్రాణాయామం,క్రియలు చెయ్యడం వల్ల మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాలూ మన యోగాన్ని ఆచరిస్తున్నాయి. క్రైస్తవదేశాలు,ముస్లిందేశాలు యోగాకు బ్రహ్మరధం పడుతున్నాయి.ఎక్కడో కొందరు పిడివాదులు,తీవ్రవాదులు మాత్రం ఇది వారి మతాలకు వ్యతిరేకం అని దుష్ప్రచారం చేస్తున్నారు.వారి అజ్ఞానమే వారిచేత ఆ విధంగా మాట్లాడిస్తున్నది.

'ఓం'- అని ఉచ్చరించడం మా మతానికి వ్యతిరేకమని కొందరు అంటున్నారు. ఈ ఓంకారం వెనుక ఉన్న రహస్యం తెలిస్తే వారు ఆ మాటను అనరు.సూర్యుని నుంచి వెలువడుతున్న ధ్వనిని విన్న శాస్త్రవేత్తలు ఈ మధ్యన నిర్ఘాంతపోయారు.ఎందుకంటే ఆ ధ్వని ఖచ్చితమైన --ఓమ్--అన్న ధ్వనిగానే విశ్వంలో వినిపిస్తున్నది.దీనిని సైన్స్ పరికరాలు రికార్డ్ చేశాయి. కావాలనుకున్న వారు నెట్లో  వెతికి చూచుకోవచ్చు.వినవచ్చు.

'దైవం యొక్క నామం --ఓంకారమే--' అని పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో అన్నారు.

'తస్య వాచక ప్రణవ:'--పాతంజల యోగసూత్రాలు (1:27)

ప్రపంచంలో ఏ మతంలో నైనా దేవునికి ఉన్న పేర్లు నిజమైనవి కావు.అవన్నీ మనిషి దైవానికి పెట్టిన పేర్లే.కానీ, ఒక్క "ఓమ్"-- అన్న పేరే దైవానికి ఉన్న అసలైన పేరు.ఈ శబ్దం సృష్టిలో నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉన్నది.దీనిని వేదం శబ్దబ్రహ్మం (God in sound form) అని పిలిచింది.ఇది మనిషి పెట్టిన పేరు కాదు.సృష్టిలో నిరంతరం తనంతట తానుగా మ్రోగుతున్న నాదం ఇది.అందుకే దీనిని ప్రణవనాదం అన్నారు.

ఈ నాదమే సూర్యుని నుంచి వెలువడుతున్నది.ఈ శక్తే భూమిని,భూమిపైన ఉన్న జీవులని పోషిస్తున్నది.కనుక ఆ నామాన్ని జపించడం, ఆ శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల మనిషి తన సృష్టికర్త నామాన్నే జపిస్తున్నాడు. ధ్యానిస్తున్నాడు.దైవంతో మమేకం కాగలుగుతున్నాడు.తానే ఒక దివ్యాత్మగా మారుతున్నాడు.

"ఓంకారాన్ని ఉచ్చరించకూడదు"- అని చెప్పడం దైవద్రోహం మాత్రమే కాదు. సృష్టి ద్రోహం కూడా.

ఓంకారజపం వల్ల ప్రేతాత్మలు మొదలైన దుష్టశక్తులు పారిపోతాయి. ఎందుకంటే, ఆ వైబ్రేషన్ ను అవి భరించలేవు.ఓంకారాన్ని ద్వేషించేవారు కూడా దుష్టశక్తుల అదుపులో ఉన్నవారే.అందుకే వారు దానిని వినడానికి అనడానికీ ఇష్టపడరు.వారి ద్వారా మాట్లాడేది దుష్టశక్తులే.

ఓంకార జపాన్ని పక్కన ఉంచితే, ఆసనాలు మనకేం అన్యాయం చేశాయి?ప్రాణాయామం ఏం తప్పు చేసింది? వాటిని దూరం ఉంచడం ఎందుకు? వాటిని చెయ్యడంవల్ల మనిషి నిండునూరేళ్ళూ ఆరోగ్యంగా బ్రతుకుతాడు.అంతే కాదు,మనస్సులో ఏ టెన్షనూ లేకుండా హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతాడు. ప్రపంచంలో అన్ని దేశాలూ దీనిని ఒప్పుకున్నాయి.మెడికల్ సైన్సు దీనిని ఒప్పుకున్నది.మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి?

యోగదర్శనం అనేది మానవాళికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరాలలో అత్యంత గొప్పది.

యోగశాస్త్రాన్ని ఆమూలాగ్రం అర్ధం చేసుకుని ఆచరిస్తే చాలా మంచిదే.కానీ అంత చెయ్యలేకపోయినా కనీసం ప్రతిరోజూ కొన్ని ఆసనాలు,సూర్య నమస్కారాలు,ప్రాణాయామం చేస్తే చాలు.మనిషి నూరేళ్ళపాటు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఒకరిని బాధపెట్టకుండా తాను బాధపడకుండా జీవిస్తాడు.

స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకు మనదైన  యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.ఇది ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితమే జరగాల్సింది.నకిలీ నాయకుల వల్ల, కుహనా ప్రభుత్వాల వల్ల ఇన్నాళ్ళు ఆలస్యం అయింది.కనీసం ఇప్పుడైనా ప్రపంచం మనల్ని,మన యోగానూ అనుసరిస్తున్నది.

ఇది చాలా సంతోషపడవలసిన సమయం.

భారతీయులందరికీ రేపు పండుగరోజు.

"మనది" అయిన యోగాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి.

ప్రతిరోజూ యోగాభ్యాసం చెయ్యండి.

రేపు--"అంతర్జాతీయ యోగ దినోత్సవం".

రేపే మీ అభ్యాసాన్ని ప్రారంభించండి. ప్రతిరోజూ కొనసాగించండి.ఆనందంగా జీవించండి.

"మేం భారతీయులం. అనంతమైన విజ్ఞానం మా సొత్తు"-- అని గర్వంగా చెప్పండి.

భారతీయులుగా గర్వంగా బ్రతకండి.

Long live the movement of YOGA.

Let us celebrate tomorrow on a grand scale by practicing Yoga and continue to do it as long as we live.