నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, జూన్ 2015, ఆదివారం

స్వచ్చ భారత్-యోగా క్యాంప్

"స్వచ్చ రైల్ - స్వచ్చ భారత్" ఉద్యమంలో భాగంగా నిన్న ఉదయం రైల్వే అధికారులు ఉద్యోగుల చేత ఒక గంటసేపు యోగాభ్యాసం చేయించాను. ముందుగా పదిహేను నిముషాల పాటు వామప్ వ్యాయామాలు చేయించి ఆ తర్వాత ఈ క్రింది ఆసనాలు వారిచేత చేయించాను.

  • తాడాసనం
  • త్రికోణాసనం 1&2
  • కటిచక్రాసనం
  • వీరభద్రాసనం
  • సర్వాంగాసనం
  • మత్స్యాసనం
  • భుజంగాసనం
  • శలభాసనం
  • ధనురాసనం
  • భద్రాసనం
  • యోగముద్ర
  • పాదహస్తాసనం
  • మహాముద్ర
  • సేతుబంధాసనం
  • జానుశిరాసనం
  • నౌకాసనం
  • ఊర్ధ్వపాదాసనం
  • ఉష్ట్రాసనం
  • చక్రాసనం
శీర్షాసనం,మయూరాసనం,హలాసనం,వృశ్చికాసనం,మత్స్యెంద్రాసనం వంటి కష్టమైన ఆసనాల జోలికి పోకుండా సులభమైన ఆసనాలు మాత్రమే వారిచేత చేయించాను.వారిలో చాలామందికి ఒళ్ళు పట్లు తప్పి ఉన్నది.అస్సలు వంగటం లేదు.ఈ సంగతి వారికి వారికే ప్రత్యక్షంగా చూపించి,తాము ఫిజికల్ గా చాలా ఫిట్ అనుకుంటున్న వారి అభిప్రాయాలు మార్చుకొమ్మని,రోజూ యోగ వ్యాయామం చెయ్యమని చెప్పాను.ఆ తరువాత వినడం వినకపోవడం వారి ఇష్టం.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారే స్వయంగా ట్విట్టర్ లో యోగాసనాలను వివరిస్తూ మన ప్రాచీన యోగవిజ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తూ జాతిని జాగృతం చేస్తున్నారు.ఆయన చూపిన చొరవ వల్లే, జూన్ 21 తేదీని International Yoga day గా U.N.O కూడా ఆమోదించింది.

యోగవిజ్ఞానం చాలా అద్భుతమైనది.ఈనాడు అమెరికాలో మాంసాహారాన్ని మానేసి,కనీసం జంతు ఉత్పత్తులైన పాలు పెరుగులు కూడా తీసుకోకుండా ఉండే Vegans గా అనేకమంది మారిపొతున్నారు.మాంసాహారాన్ని తినేవారిలో ఉదరకోశ కేన్సర్లూ, పెద్దపేగు కేన్సర్లూ ఎక్కువగా రావడమే ఈ మార్పుకు కారణం.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులందరూ యోగా చేస్తున్నారు.హాలీవుడ్ సెలెబ్రిటీ లందరూ యోగవ్యాయామం చేసేవారే.అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఆయన భార్యా యోగాభిమానులే.ఇంకా చెప్పాలంటే నేడు ఇండియాలో కంటే అమెరికాలోనే యోగాను ఎక్కువగా చేస్తున్నారు.

మార్షల్ ఆర్ట్స్ నిండా యోగవ్యాయామాలే ఉంటాయి.ఉన్నతస్థాయిలలో అయితే మార్షల్ ఆర్ట్స్ కూ యోగాకూ ఏమీ భేదం లేదు.

ఈ సందర్భంగా యోగవ్యాయామానికీ,ఇతర వ్యాయామాలకూ ఉన్న తేడాలను ముందుగా వారికి ఒక పదినిముషాల పాటు వివరించాను.

నడక,జాగింగ్,రన్నింగ్,ఈత,అథ్లెటిక్స్,బాడీ బిల్డింగ్,వెయిట్ లిఫ్టింగ్,స్పోర్ట్స్ ఇలా రకరకాలైన వ్యాయామాలు లోకంలో ఉన్నాయి.కానీ అన్నింటిలోకీ యోగవ్యాయామాలు ప్రత్యేకమైనవి, విలక్షణమైనవి, ఉత్తమమైనవి.

ఎందుకో మీకూ ఇక్కడ క్లుప్తంగా వివరిస్తాను.
  • ఇతర వ్యాయామాలలో కండర సముదాయం(muscular system) మాత్రమే శక్తివంతం అవుతుంది.కానీ,యోగ వ్యాయామాలలో రోగనిరోధక శక్తి (disease resistance power) కూడా పుంజుకుంటుంది.
  • యోగ వ్యాయామాలు, శరీరంలో ఉన్న గ్రంధులను (ductless glands) జాగృతం చేస్తాయి.దాని ఫలితంగా ఆయా గ్రంధుల స్రావాలు (glandular secretions) క్రమబద్ధీకరించబడతాయి.దానివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.మామూలు వ్యాయామాలు ఈ పనిని చెయ్యలేవు.
  • ఇంకొక ముఖ్యమైన తేడా ఏమంటే -- యోగ వ్యాయామాలలో అంతర్భాగమైన ప్రాణాయామం.ఇది ఇతర వ్యాయామాలలో లేదు. ప్రాణాయామం అనేది కేంద్రీకృత నాడీవ్యవస్థను(Central Nervous system) సూటిగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల అద్భుతమైన మార్పులు యోగి దేహంలో కలుగుతాయి.
  • ఇతర వ్యాయామాలలో ముందుగా శక్తిని ఖర్చు చేసి, ఆ తర్వాత ఆహారం,విశ్రాంతి ద్వారా దానిని మళ్ళీ పుంజుకోవడం జరుగుతుంది.కానీ యోగాలో శక్తి ఖర్చు కాదు.మొదటిరోజు (day one)నుంచీ శరీరంలో ప్రాణశక్తి పెరగడమే జరుగుతుంది.ఇది ఈ రెంటికీ గల అతి ముఖ్యమైన భేదం.
  • ఇంకొక ముఖ్యమైన భేదం ఏమంటే- యోగా వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది.మానసికంగా బేలెన్స్ గా ఉండే లక్షణం మనిషిలో పెరుగుతుంది.ఇతర వ్యాయామాల వల్ల ఇది జరగదు.
  • శరీరాన్ని కష్టపెట్టే ఇతరరకాల వ్యాయామాలను అందరూ చెయ్యలేరు. క్రీడాకారులూ,అధ్లెట్లూ కూడా కొంత వయసు వచ్చాక ఆ వ్యాయామాలను చెయ్యలేరు.వాటిని చచ్చినట్లు ఆపవలసి వస్తుంది.ఎందుకంటే వయసుతో బాటు మజిల్ టోన్ తగ్గుతూ ఉంటుంది. కనుక వ్యాయామాలను ఆపినతర్వాత ఆయా క్రీడాకారుల శరీరాలలో చాలా ఘోరమైన మార్పులు వస్తాయి.ఇంతకు ముందున్న ఫిట్నెస్ లెవల్స్ వేగంగా తగ్గిపోతాయి.కానీ యోగవ్యాయామాలను చిన్నపిల్లల నుంచీ ముసలివారి వరకూ అందరూ లక్షణంగా చెయ్యగలరు.ఎంత వయసొచ్చినా వీటిని చక్కగా చేసుకోవచ్చు.దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మనకు ఉన్న ఒక పెద్ద రోగం ఏమంటే,విదేశీయులు చెబితే గాని మనవాటి విలువ మనకు తెలియదు.మన పెరళ్ళలో ఉండే తులసి,వేప వంటి చెట్ల మహత్యం కూడా మనకు తెల్లవాడే చెప్పాలి.అప్పుడే మనకు ఎక్కుతుంది. అంతేకాదు,వీటితో వాడొక ప్రాడక్ట్ తయారు చేసి,పేటెంట్ తీసుకుని,మంచి సుందరాంగులైన మోడల్స్ తో ఒక యాడ్ నిర్మించి మనమీద ఆ ప్రాడక్ట్ రుద్దితే వేలం వెర్రిగా ఎగబడి కొనుక్కుని వాడతాము.అంతేగాని మనవాళ్ళు మంచిగా చెబితే మనకు ఎక్కదు.తరతరాలుగా మనలో జీర్ణించుకు పోయిన బానిసత్వమూ,ఆత్మన్యూనతా భావములే దీనికి కారణాలు.

దేశంలో యోగవ్యాయామ అభ్యాసం ఒక ఉద్యమంలా రావాలి.యోగా అంటే అదేదో సైతాన్ అనీ,ఇతర మతాలకు వ్యతిరేకమనీ చెప్పే తప్పుడు భావాలు మాయం కావాలి.అప్పుడే ఆరోగ్యకరమైన భారతజాతి నిర్మాణం జరుగుతుంది.

ప్రపంచమంతా మన యోగాను చేస్తున్నది.మనం దానిని మర్చిపోతే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు.