నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, జూన్ 2015, మంగళవారం

ఎవరికి చెప్పాలి?











ఎవరికి చెప్పాలి ?
మెరిసే నా కిరీటం వెనుక
తలలో దిగిన
ముళ్ళున్నాయని

వరికి చెప్పాలి ?
విరిసే నా చిరునవ్వు వెనుక
విషాదభారంతో వర్షించే
కళ్ళున్నాయని

వరికి చెప్పాలి ?
స్వచ్చమైన నా అరచేతులలో
ఆరిన రక్తపు
మరకలున్నాయని

వరికి చెప్పాలి ?
అచ్చంగా కనిపించే నా మనసులో
రచ్చకెక్కని మచ్చలెన్నో
దాగున్నాయని 

వరికి చెప్పాలి ?
ఉత్సాహపు నా చేతల వెనుక
నిశీధపు నైరాశ్యం
ఘూర్ణిస్తోందని

వరికి చెప్పాలి ?
వెలుగుల ఆశయాల మాటున
వెలిసిన వైరాగ్యం
నిద్రిస్తోందని

వరికి చెప్పాలి ?
నేటి పగటి పవిత్రత మాటున
ఒకనాటి చీకటి కోరిక
చిందులున్నాయని

వరికి చెప్పాలి ?
ప్రకాశించే దివ్యత్వం చాటున
అంధకారపు దీనత్వం
దిగాలుగా చూస్తోందని

వరికి చెప్పాలి ?
లోకపు మెప్పుల లోపల
చీకటి తప్పుల చిట్టా
బూజు పట్టిందని

వరికి చెప్పాలి ?
ఈనాటి నీతి సూర్యుడు
ఒకనాటి రాహువు పట్టు నుంచి
బ్రతికి బట్ట కట్టాడని

వరికి చెప్పాలి ?
నేటి ఆనందపు నాట్యం వెనుక
భరింపరాని బాధల
భారం నిండి ఉందని

వరికి చెప్పాలి ?
కారుణ్యపు వెల్లువ వెనుక
కాఠిన్యపు ఎడారి
ఏడుస్తోందని

వరికి చెప్పాలి ?
దయతో మెత్తనైన మదిలో
ఒకనాటి కర్కశత్వపు
మరకలున్నాయని

వరికి చెప్పాలి ?
ఎన్నో జన్మల తప్పులన్నీ
కన్నుమూసినా తెరిచినా
వెన్నులో పాకుతున్నాయని

వరికి చెప్పాలి ?
సన్మానాల హోరుల చాటున
శిక్షల సంకెళ్ళు
సలుపుతున్నాయని

వరికి చెప్పాలి ?
కాలం మొదటి నుంచీ
చేసిన తప్పులు గుర్తొచ్చి
చిత్రవధ చేస్తున్నాయని

వరికి చెప్పాలి ?
అనుబంధాల కోలాహలం మధ్యన
ఒంటరితనపు నిట్టూర్పే
నా ఓదార్పని 

వరికి చెప్పాలి ?
చేతనున్న అమృత భాండం వెనుక
గొంతులోని హాలాహలం
మంటలు రేపుతోందని

వరికి చెప్పాలి ?
అందరూ నాతో నడుస్తున్నా
ఎవరూ నావారు కాని 
ఒంటరిని నేనని

వరికి చెప్పాలి ?
అలుపెరుగని అడుగుల మాటున
నిలువెత్తు నీరసం
నీడలు పరుస్తోందని

వరికి చెప్పాలి ?
వింత వింత దారులలో
అంతులేని ఈ పయనం
అమితంగా విసిగిస్తోందని

వరికి చెప్పాలి ?
రంగురంగుల ఈ లోకం
భంగపడిన నా మనసుకు
మింగుడు పడటం లేదని

వరికి చెప్పాలి ?
విపరీత పోకడల ప్రపంచం
విసిగిన నా మదిలో
విషాదాన్ని వెల్లువెత్తిస్తోందని

వరికి చెప్పాలి ?
బానిసత్వపు గానుగలో
నలిగిన ఈ హృదయం
నాటకాలింక చాలంటోందని

వరికి చెప్పాలి?
బ్రద్దలౌతున్న ఈ హృదయం
భరింపరాని బ్రతుకు భారం
లేకుంటే మేలంటోందని

వరికి చెప్పాలి ?
అలసిపోతున్న నా ప్రాణం
ఎన్నటికీ తిరిగిరాని
విశ్రాంతిని కోరుతోందని...