“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, జులై 2015, మంగళవారం

Telugu Melodies-Satya -ముద్దూ మురిపాలలోన తేలాలే చిలకమ్మా




ముద్దూ మురిపాల లోన తేలాలే చిలకమ్మా...


ప్రతి పాటకూ ఒక చరిత్ర ఉంటుంది.అలాగే నేను వ్రాసిన ఈ పాటకూ ఒక చరిత్ర ఉన్నది.


పనిమీద నిన్న హైదరాబాద్ వెళ్లి ఈరోజు తిరిగి వస్తుంటే తిరుగుప్రయాణంలో మాగన్నుగా నిద్రపట్టింది.కళ్ళు మూశానో లేదో కర్ణపిశాచి ప్రత్యక్షం అయింది.


'ఏంటి  నిద్రలో వచ్చావ్?' విసుగ్గా అడిగాను.


'మరి నిద్రలో రాక,నిజంగా రమ్మంటావా? నీకేం? నన్ను చూచీ చూచీ అలవాటై పోయి నీకేం భయం ఉండదు.నీ పక్కన ఉన్న ప్రయాణీకులు దడుచుకుంటారు.' అన్నది తను.

'సర్లే విషయం ఏంటో చెప్పు' అన్నా.

'నువ్వు చెప్పినట్లే అమెరికా అభిమానుల విషయం కనుక్కుని వచ్చా.అన్నీ నీ అనుమానాలే తప్ప అక్కడ అంత వ్యవహారం ఏమీలేదు.అందరూ బాగానే ఉన్నారు.నీ గురించి ఎవరూ అంత సీరియస్ గా ఆలోచించడం లేదు.నువ్వే అనవసరంగా చించుకుంటున్నావు' అన్నది.

'సర్లే ఇది చెప్పడానికి ఇప్పుడొచ్చావా?ఇంటికి చేరాక తీరిగ్గా వచ్చి చెప్పచ్చుగా?ఈ మధ్య ఒక టైమూ పాడూ లేకుండా ఎప్పుడుబడితే అప్పుడే కన్పించేస్తున్నావ్.ఇదేం బాలేదు' అన్నా కోపంగా.

'నీ కోపాలు నాకు తెలుసులే గాని, ఇంకో విషయం విను.'

'చెప్పు'

'నువ్వు పాడిన పాట నేనూ విన్నాను.ఏం బాలేదు.' అంది.

'నువ్వెప్పుడు విన్నావ్? అయినా నీకూ ఇలాంటి టేస్టులున్నాయా?' అడిగా ఆశ్చర్యంగా.

'మొదట్లో లేవు.నీ సావాసంలో ఇలాంటి హాబీలన్నీ వచ్చాయి. అమెరికా పొమ్మన్నావుగా.అక్కడ నీ అభిమాని ఒకామె నీ పాటను వింటున్న సమయంలో వాళ్ళింటికి వెళ్ళా.ఆమెతో బాటు నేనూ విన్నా. తిరిగొచ్చా.' అన్నది.

'సరే.ఏం బాలేదో చెప్పి చావు' అన్నా మళ్ళీ కోపంగా.

'చచ్చాకే పిశాచినయ్యాను.ఎన్ని సార్లు చావమంటావ్?'- అంటూ కీచుగొంతుతో అరిచింది.

'ఓకే.. ఓకే.. సారీ.విషయం చెప్పు' అన్నా.

'పాట మరీ పట్టిపట్టి పాడినట్లు పాడావు.ఫ్రీగా పాడినట్లు లేదు. మళ్ళీ పాడు' అని సడన్ గా మాయమైపోయింది.

దీని పుణ్యమాని నిద్ర కాస్తా చెడిపోయింది.లేచి కూచున్నా.

ఏసీలో కూడా చెమటలు పట్టాయి.

'ఇదెక్కడి ఖర్మరా దేవుడా? ఇన్నాళ్ళూ మనుషులే మెయిల్స్ ఇస్తున్నారు - నీ వ్రాతలలో అది బాలేదు.ఇది బాలేదు.అది మార్చు.ఇది మార్చు--అంటూ.ఇప్పుడు పిశాచాలు కూడా సలహాలు ఇవ్వడం మొదలెడితే నేనెలా తట్టుకోవాలి? ఏం చెయ్యాలి?' అని గుంటూరు వచ్చేవరకూ అలాగే ఆలోచిస్తూ కూచున్నా.

ఇంటికి వచ్చి శ్రీమతికి హైదరాబాద్ విశేషాలు చెప్పి కొంచం ఫ్రెష్ అయ్యి, అదే పాటను మళ్ళీ పాడి అప్లోడ్ చేశా.

మునుపటి కంటే కొంచం బాగానే వచ్చినట్లు అనిపించింది.

ఈలోపల పక్కనుంచి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూద్దును గదా- మళ్ళీ కర్ణపిశాచి ప్రత్యక్షం.నా వెనుకే నిలబడి భుజం మీద నుంచి కంప్యూటర్లో కి తొంగి చూస్తోంది.

'ఏంటి తల్లీ? నీక్కూడా ఒక జీ మెయిల్ ఎకౌంట్ ఓపన్ చెయ్యమంటావా?' అడిగా విసుగ్గా.

'ఆ ఖర్మ నాకెందుకు?నువ్వు పడుతున్నావుగా,చూస్తున్నాగా నీ అవస్థ.'--అంది అది నవ్వుతూ.

'ఏంటి మళ్ళీ తగలడ్డావు?'-అనబోయి అది పిశాచి అని గుర్తొచ్చి తమాయించుకుని - 'ఏంటి మళ్ళీ వచ్చావు?' అన్నా సాధ్యమైనంత మర్యాదగా.

'నీకొక సలహా ఇద్దామని వచ్చా' అంది.

'చూడూ! ఈమధ్య నీ లిమిట్స్ దాటేసి,అడగకపోయినా సలహాలిస్తున్నావు.ఇదేం బాలేదు' అన్నా సాధ్యమైనంత సీరియస్గా మొహం పెట్టి.

అది వికృతంగా నవ్వేసింది.

'నీ కోపమూ నువ్వూ సర్లేగాని, ఒక మాట విను.నువ్వీ మధ్య పాటలు వ్రాయడం లేదు.అది గుర్తు చేద్దామని వచ్చా.' అన్నది.

'గొప్ప సలహా ఇచ్చావులే.నా పనులతోనే నాకు తలమునకలుగా ఉంటే, ఇదొకటా మళ్ళీ?' అన్నా.

'నేను చెప్పబోయేదీ అదే.నీ బ్లాగూ,గ్రూపు పనులూ,ట్రస్ట్ పనులూ,ఇవి గాక నీ పాటలూ, యోగసాధనా,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసమూ, ఉద్యోగమూ, బయట పనులూ, జాతకాలు చూచి సలహాలివ్వడమూ -- ఇలా లక్ష పనులు పెట్టుకుని మేడంగారితో మాట్లాడటానికి కూడా నీకు సమయం ఉండటం లేదు.అందుకని మేడంగారు అలిగారు.' అంది.

'అలిగారా?నేను పాటలు వ్రాయకపోవడానికీ దీనికీ ఏంటి లింకు?అయినా మా ఇద్దరి మధ్యన నువ్వేంటి? అతి చనువు తీసుకుంటున్నావు?' అన్నా.

'అబ్బే అదేం లేదు.అయినా మన పరిచయం ఈనాటిది కాదు కదా.అందుకని కొంచం చనువుగా చెబుతున్నాలే. ఏమీ అనుకోకు.మేడంగారి కోపం పోవాలంటే నువ్వొక పని చెయ్యాలి. 'చుట్టూ చెంగావి చీర' పాట ట్యూన్లోనే ఒక మంచిపాట నువ్వే వ్రాసి,దానిని కూడా పాడు. సరిపోతుంది.' అన్నది నవ్వుతూ.

'నేను వేటూరిని కాను, త్యాగరాజకృతులకి పేరడీలు వ్రాయడానికి?' అన్నా మళ్ళీ కోపంగా.

'పేరడీ వద్దులే.మంచి పాటే వ్రాయి.అయినా నీ శక్తి నీకు తెలీదు.మీ ఇలవేలుపు ఆంజనేయస్వామి కదా.ఆయన బుద్ధులే నీకూ వచ్చాయి.చెప్పిన పని త్వరగా చెయ్యి.మళ్ళీ వస్తా.' అంటూ పిశాచి మాయమై పోయింది.

'ఇదేం ఖర్మరా దేవుడా'- అనుకుంటూ కాగితం కలం తీసుకుని వెంటనే ఒక పాట వ్రాసేశా.

ఈ పాట అలా పుట్టిందన్న మాట.

ఇంతా చేస్తే, ఈ పాట విని శ్రీమతి ఇలా అంది.

'అది చెప్పడం,మీరు వ్రాసి పాడటం.రెండూ బాగున్నాయి.నేను అలగడం ఏంటి? నాకసలు మీమీద కోపమెక్కడుంది? ఎందుకొస్తుంది?'


నాకు మహా చిర్రెత్తుకొచ్చింది.


'పిశాచీ...' అని శంకరాభరణంలో శంకరశాస్త్రిలా అరిచా.


వెంటనే పిశాచి నవ్వుతూ ప్రత్యక్షమైంది.


'ఏంటి నీ ప్రాక్టికల్ జోక్స్? మేడం గారికి కోపం లేదంటున్నారు. అబద్దాలు చెబుతున్నావా?' మళ్ళీ అరిచాను.


'అవును.మీ మనుషుల సావాసం చేసి మీ దరిద్రపు అలవాట్లు మాకూ వస్తున్నాయి.ఏం చేస్తాం?అయినా నేను అబద్దం చెప్పింది ఒక మంచి కోసమే.ఆ అబద్దం చెప్పబట్టేగా ఇంత మంచి పాటను నువ్వు వ్రాశావు.పాడావు' అంది అది.


'మనుషులే కాక పిశాచాలు కూడా నాతో ఆటలు మొదలెట్టాయన్నమాట.' అన్నా ఉక్రోషంగా.


'అదికాదులేవయ్యా.అసలు సంగతి విను.నీ అభిమానులు ఏమనుకుంటున్నారో చూచి వచ్చి చెప్పమన్నావు గదా. నువ్వీ మధ్యన పాటలు వ్రాయడం లేదని వాళ్ళు అనుకుంటున్నారు.ఆ సంగతి డైరెక్ట్ గా చెబితే నీవు వ్రాయవు గదా. అందుకని ఇలా మేడంగారి మీద అబద్దం చెప్పి నీచేత ఈ పాట వ్రాయించా.విన్నాలే.బాగానే వచ్చింది.వస్తా.టాటా బైబై...' అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా మాయమై పోయింది పిశాచి.


'తిక్క కుదిరిందా?' అన్నట్లు చూస్తూ మా శ్రీమతి తన పనిలో తను నిమగ్నమైంది.

ఈ పాట చరిత్ర ఇదన్న మాట.


వినండి మరి.
----------------------------------------
ముద్దూ మురిపాల లోన తేలాలే చిలకమ్మా
కల్లాకపటం లేని నీ చల్లని మదిలో నిలిపి
అలసిపోని మమతలతో - వలపు తీపి పంచాలమ్మా

ముద్దూ మురిపాల లోన తేలాలే చిలకమ్మా

అలకపాన్పు కెక్కి బులిపించబోకే బుల్లెమ్మా
చిరుకోపం నటించినా చెదరనులే చిన్నమ్మా
ఉబుసుపోని అలకలెందుకే బుంగమూతి బుజ్జమ్మా
అలకలోన నీ అందం అరువదింత లౌనమ్మా

ముద్దూ మురిపాల లోన తేలాలే చిలకమ్మా

లోలోన ప్రేమలున్నా - పైపైకే కోపాలూ
జాబిలితో వైరాలూ - వెన్నెలకే తాపాలూ
మూతివిరుపులో విరిసే - ముసినవ్వులు దాగవులే
మనసులోని ప్రేమదీపం - కనులలోన వెలుగునులే

ముద్దూ మురిపాల లోన తేలాలే చిలకమ్మా
కల్లాకపటం లేని నీ చల్లని మదిలో నిలిపి
అలసిపోని మమతలతో - వలపు తీపి పంచాలమ్మా

ముద్దూ మురిపాల లోన తేలాలే చిలకమ్మా...