ఈ మధ్య ఒక ప్రయాణంలో 'నా రమణాశ్రమ జీవితం' అనే పుస్తకాన్ని తెచ్చి ఇచ్చాడు రమణమూర్తి. ఇంతకుముందు దీనిని నేను చదవలేదు. రమణసాహిత్యం చాలావరకూ నేను చిన్నప్పుడే చదివాను.ఇదెలా మిస్సయిందా? అసలు దీని ప్రచురణ ఎప్పుడా? అని చూస్తే 2011 అని ఉన్నది.ఓహో అందుకా ఇది మిస్సయింది అనుకున్నాను.
ఈ పుస్తకంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది నాగమ్మగారి రచనాశైలి. ఆమె వ్రాసిన 'రమణాశ్రమ లేఖలు' ముముక్షువులకు సుపరిచితమే.అందులో కూడా ఇదే శైలి ఉంటుంది.అప్పట్లో బ్రాహ్మణ కుటుంబాలలో వాడే కొన్ని మాటలూ ఆ భాషా యధాతధంగా ఉండి చదవడానికి చాలా ఆహ్లాదంగా హాయిగా ఉంటుంది.
వీరి స్వగ్రామం కొలనుకొండ అన్న విషయం ఇప్పుడే నాకు తెలిసింది.అది విజయవాడ పక్కనే ఉన్న గ్రామం.ఈ గ్రామంలో ఒక కొండ మీద భోగేశ్వరాలయం అని ఉన్నదని ఆమె వ్రాశారు.విజయవాడ పోయి వచ్చేటప్పుడు కొలనుకొండ దగ్గర ఒక కొండమీద గుడి కనబడుతూ ఉంటుంది.అదే కావచ్చునేమో మరి.ఆ గుడిని చాలావరకూ బాగుచేయించినది వీరి కుటుంబమే అని ఈ పుస్తకంలో వ్రాశారు.ప్రస్తుతం ఆ కొండను చాలా వరకూ తవ్వి పారేశారు.ఇప్పుడది ఒక ఒంటిస్థంభం కొండలాగా కనిపిస్తూ ఉంటుంది.గుడి ఉన్నది గనుక అంతవరకూ అన్నా ఉంచారన్నమాట.లేకుంటే ఆ కాస్తా కూడా 'హరీ' మనేది. ఒకసారి వెళ్లి చూడాలి.
నరసరావుపేట పక్కనే ఇక్కుర్తి అని ఒక గ్రామం ఉంటుంది.అక్కడ ఇక్కుర్తి కొండ అని ఇలాగే ఒక కొండ ఉన్నది.దానిమీద రామాలయం ఉంటుంది. అక్కడే ఒక పెద్దగుహ లాంటి అమరిక సహజంగా ఏర్పడినది ఉంటుంది.దాదాపుగా నూరేళ్ళనాడు ఇక్కుర్తి రామయ్యగారని మా నాయనమ్మగారి తండ్రిగారు ఆ ఊరిలో ఉండేవారు.
1978-79 లలో నేను ఇంటర్ చదివే రోజుల్లో నర్సారావుపేట నుంచి సైకిలేసుకుని తరచుగా ఆ కొండకు వెళ్లి అక్కడ ఉన్న గుహలాంటి రాతిమంటపంలో కూచుని ధ్యానం చేసేవాడిని.అప్పట్లో ఆ కొండమీదకు ఎవరూ వచ్చేవారు కారు.వారానికొకరోజున అక్కడకు పోయి దాదాపు రోజంతా ఆ గుహలో కూచుని ఉండేవాడిని.ప్రస్తుతం చాలాసార్లు నరసరావుపేట మీదుగా రైల్లో పోయేటప్పుడు ఆ కొండా గుడీ దూరం నుంచి కనిపిస్తూనే ఉంటాయి.ఈమధ్య ఒకసారి నరసరావుపేట వెళ్ళినప్పుడు ఆ కొండ ఎలా ఉన్నదో చూద్దామని అక్కడకు వెళ్లాను.ఆ కొండను కూడా నాలుగుపక్కల నుంచీ తవ్వి పారేస్తున్నారు.కంకర కోసం జరుగుతున్న ఈ తవ్వులాటలో అనేక కొండలు ఇలాగే క్రమేణా అదృశ్యమై పోతున్నాయి.

మేము అక్కడకు వెళ్లేసరికి - కంకర కోసం వచ్చామేమో అని - ఒక పదిమంది చెట్టుకింద కూచుని పేకాట ఆడుతున్న పల్లెటూరివాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. మేమందుకోసం రాలేదని కొండను చూడ్డానికి వచ్చామని చెప్పాను.వాళ్ళు నమ్మలేదు.
'ఇప్పటికే ఇక్కడ చాలామంది గుప్తనిధులకోసం తవ్వారు.ఏమీ దొరకలేదు' అని అందులో ఒకడన్నాడు.అంటే మా వాలకం చూస్తే గుప్తనిధుల కోసం వెతికేవారిలా అగుపించామన్నమాట."ఇప్పటికే మేము చాలా తవ్వి చూచాము. మీరిప్పుడు త్రవ్వించినా ఏమీ దొరకదు."--అన్నట్లు ధ్వనించి, పిచ్చి నవ్వొచ్చింది.
మనుషులలో భావుకత రాన్రాను పూర్తిగా అదృశ్యమై పోతున్నది.ప్రకృతిని ఇష్టం వచ్చినట్లు కొల్లగొట్టడమూ తమ స్వార్ధానికి దానిని వాడుకోవడాలే ఎక్కడ చూచినా రాజ్యాలేలుతున్నాయి. "ప్రకృతిని ప్రేమించడం" అనే మాట ముందు ముందు ఎవరైనా మాట్లాడితే వాడినొక పిచ్చివాడిలా చూస్తారేమో ఈ జనం అనిపించింది."ప్రకృతిని ప్రేమించడం ఏమిటి?నీ ముఖం! దానిని వాడుకోవాలి గాని?" - అంటారేమోనని వారి మాటలు వింటే అనిపించింది.
ఎవరైనా సరే కొండలను గాని,చెట్లను గాని,నదులను గాని పాడు చేస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది.కానీ ఏం చేస్తాం? ప్రస్తుతం ఎక్కడ చూచినా ఇదే జరుగుతున్నది.మనిషి ప్రకృతిని నిర్లజ్జగా దోచి పారేస్తున్నాడు.దీని ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో అన్న ఆలోచనే వాడికి లేదు. వర్తమానం బాగుంటే చాలు.భవిష్యత్తు ఏమైపోయినా పరవాలేదు అనే భావం ఎక్కడ చూచినా కనిపిస్తున్నది.నవీనకాలపు గురువులు బోధిస్తున్న 'Living in the present' అంటే ఇదేనేమో?

సూరినాగమ్మ గారి పుస్తకం బాగానే ఉంది.జరిగినది జరిగినట్లుగా వ్రాయడం వల్ల చదువుతుంటే చక్కని ఫీల్ వస్తుంది.కానీ అక్కడక్కడా చాలా బోరు కొడుతుంది.ప్రయాణంలోనే ఆ పుస్తకాన్ని చదివేసి మూర్తికి తిరిగి ఇచ్చేశాను.
(ఇంకా ఉంది)