“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

13, అక్టోబర్ 2015, మంగళవారం

నా రమణాశ్రమ జీవితం -3 (విధి)

రమణమహర్షి జీవితంలో 'కేన్సర్' ఘట్టం ఒక దయనీయమైన ఘట్టం.ఆ ఘట్టం ఎలా జరిగిందో దాదాపు రోజువారీగా నాగమ్మ గారు వర్ణించారు.

ఎడమ మోచేయి దగ్గర పుండు లేచి అది రోజురోజుకీ ఎదుగుతూ ఉన్నప్పుడు అది కేన్సరా కాదా అనేది చూచుకోకుండా  దానిని కోసేయాలని నిర్ణయించిన సర్జన్ భక్తులదే మొదటి పాపం.కేన్సర్ మీద కత్తి పెట్టరాదు.అలా పెడితే అది పదిరెట్లు వేగంగా మళ్ళీ పెరుగుతుంది.సరియైన డయాగ్నైసిస్ చెయ్యకుండా ఆ పుండును ఆపరేట్ చెయ్యాలని కొందరు పేరున్న డాక్టర్ భక్తులు నిర్ణయించారు.కనీసం నాటువైద్యుడైన 'మూసు' అనే ఆయనకు తెలిసినంతగా పేరు మోసిన సర్జన్లకు తెలీలేదంటే వింతగా ఉంటుంది.మొదటిసారి కంటితో చూచినప్పుడే అది 'పుట్టపుండు' అని మూసు చెప్పేశాడు.కానీ పెద్దపెద్ద డాక్టర్లు దానిని గ్రహించలేకపోయారు.

అది కేన్సర్ అని వారికి తెలియక పోవచ్చు.మహర్షికి తెలుసుకదా.కానీ ఆయన కూడా వారిని వద్దని చెప్పలేదు.కోయిస్తే కోయించుకున్నారు.ఆ తర్వాత అది ప్రాణాంతకం అవుతుందని ఆయనకు తెలీదా?ఆత్మజ్ఞానికి తెలియని భవిష్యత్తు ఉంటుందా? మరి తెలిస్తే, తెలిసి తెలిసీ ఆయన ఎందుకు మరణాన్ని ఆహ్వానించారు?ఆపరేషన్ చెయ్యడం ద్వారా అది ఇంకా ముదిరి మరణం వరకూ తీసుకుపోతుందని ఆయనకు తెలీదా? ఇవన్నీ ప్రశ్నలే.

మహర్షి ఏ వైద్యాన్నీ వద్దనేవారు కారు.పసర్లు ఇస్తే త్రాగేవారు.ఆయుర్వేదం ఇస్తే తీసుకునేవారు.హోమియో ఇస్తే తీసుకునేవారు.పూజలు చేసి ప్రసాదాలు తెస్తే తీసుకునేవారు.తైల మర్దనాలు చేస్తే చెయ్యమనేవారు.అలాగే ఆపరేషన్ చేస్తామంటే చేయించుకున్నారు.మత్తు ఇవ్వలేము అలాగే కోస్తాము అంటే సరే కొయ్యమని మత్తు లేకుండానే కోయించుకున్నారు.

అసలు ప్రశ్న ఏమంటే - అన్నీ తెలిసిన ఆయనకు ఇవన్నీ పనికిరావని ఉపయోగపడవని తెలియదా? తెల్సినప్పుడు ఎందుకు ఇవన్నీ ఆమోదించారు?

నాగమ్మ అడగనే అడుగుతారు - 'ఏ వైద్యం చేస్తే మంచిదో మీకు తెలుసుకదా చెప్పి చేయించుకోరాదా?' అని. మహర్షి జవాబు చెప్పరు.నవ్వి మౌనంగా ఊరుకుంటారు.

ఇవన్నీ చెయ్యక తప్పకపోవడమూ చేసినా కూడా చివరకు పోవడమే 'విధి' అని ఆయనకు తెలుసేమో? ఆయన పూర్వకర్మ అదేనేమో? అందుకే ఆయనలా ప్రవర్తించారేమో? ఇది తప్ప ఆయన ప్రవర్తనకు ఇంకే కారణమూ కనిపించదు.

భక్తుల దృష్టిలో మహర్షి అంటే ఎదురుగా కనిపిస్తున్న శరీరమే.కానీ మహర్షికి ఆ శరీరమే పెద్ద జైలు.అదెప్పుడు వదిలిపోతుందా అని ఆయన ఎదురుచూపు.అది ఉండాలని వీరి ప్రయత్నం.శరీరధ్యాస వద్దనీ ఆత్మభావనలో ఉండమనీ ఆయన బోధ.తమకు అంత జ్ఞానభిక్ష పెట్టిన ఆ మహనీయుని శరీరాన్ని వదలలేక వారి బాధ.ఈ ఘర్షణయే ఆ సమయంలో ప్రతిదినం ఆశ్రమ దినచర్యగా ఉండింది.

తనకు కేన్సర్ వస్తుందని ఆయనకు తెలుసు.దానిని అనుభవించక తప్పదనీ తెలుసు.పోగొట్టుకోవడం వల్ల పోదనీ, మళ్ళీ ఇంకోసారి తప్పదనీ తెలుసు. కర్మక్షాళనామార్గం అనుభవించడమేగాని,వాయిదా వెయ్యడం కాదనీ ఆయనకు తెలుసు.అందుకే ఏమి జరిగినా ఆయన మౌనంగా స్వీకరించి చూస్తూ ఉండిపోయాడు.తాను చెప్పిన బోధనే తాను ఆచరించి చూపాడు.అంతేగాని ఒకటి చెప్పి ఇంకొకటి చెయ్యలేదు.

'జరిగేది ఎలాగూ జరుగుతుంది.జరుగనిది ఎలాగూ జరుగదు.నీవు శాంతంగా ఉండు.' అనేదే మహర్షి బోధ. జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ' అనుకున్నది జరుగదు.తనకున్నది తప్పదు' అని ఎన్నోసార్లు అనేవారు.మనం అనుకున్నట్లు జరగడమే 'మంచి' అని మామూలు మనిషి అనుకుంటాడు. జరిగినట్లు జరగడమే విధి అని జ్ఞాని దర్శిస్తాడు.అసలా ఊహనే మామూలు మనిషి భరించలేడు.అందుకే అతను ఎప్పటికీ మామూలు మనిషిగానే ఉంటాడుగాని జ్ఞానిగా మారలేడు.

పూర్వకర్మ పరిపాకమే నేటి విధి.అది అనుభవానికి వచ్చినపుడు మౌనంగా స్వీకరించగల ధైర్యం ఉన్నవాడే నిజమైన ఆధ్యాత్మికుడు.దానిని తప్పించుకోవాలని చూచేవాడు మామూలు మనిషి.అలాంటివాడొక దొంగ. చేసిన తప్పుకు శిక్ష పడకుండా తప్పించుకోవాలని ఆశించేవాడు దొంగేకదా. ప్రపంచంలోని ప్రజలంతా దొంగలే.పూజలు చేసి శిక్షలు మాఫీ చేసుకుందామని ఆశిస్తారు.రెమేడీలు చేసి కర్మ ఉచ్చు నుంచి తప్పుకుందామని ఆశిస్తారు. ఇలాంటివారంతా నిజానికి దొంగలే.ఈ ప్రపంచంలో ఒక జ్ఞాని మాత్రమే దొర. మిగిలిన అందరూ దొంగలే.

జ్ఞానికి ప్రత్యేకమైన ఇచ్చ (will) అంటూ ఉండదు.దానిని ఎప్పుడో దైవేచ్చ (divine will) లో ఆయన కరిగించి పారేసి ఉంటాడు.కనుక ఏది జరిగినా అది తనకు సమ్మతమే అంటాడు జ్ఞాని.మనమో-మన ఇష్టప్రకారమే ఏదైనా జరగాలని ఆశిస్తాం.భక్తులు కూడా అదే ఆశిస్తారు.వారి కోరికంతా ఒకటే - మహర్షి వారి ఎదురుగా ఆరోగ్యంగా ఉండాలి.విధి అందుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారు అర్ధం చేసుకోలేరు.తట్టుకోలేరు.కానీ విధి వీరి ఫీలింగ్స్ కు అనుగుణంగా నడవదు.దాని దారిలో అది పోతూ ఉంటుంది.దానిని ఒప్పుకుంటే వీరు ధన్యులు లేకపోతే బాధ తప్పదు.ఒప్పుకోవడం అంత తేలిక కాదు.హృదయంలో నిండిన భక్తి అలా ఒప్పుకోనివ్వదు.అక్కడే అసలైన ఘర్షణ ఏర్పడుతుంది.

మహర్షి చుట్టూ చేరిన భక్తులలో ఒక్కరంటే ఒక్కరు కూడా(గణపతిమునితో సహా) ఆయన బోధను సరిగ్గా పాటించినవారు లేరని నా ఊహ.ఎందుకంటే మనుషులు బోధను వినడానికే ప్రాధాన్యతనిస్తారు గాని ఆచరణకు ఇవ్వరు.మహర్షిది సంపూర్ణ జ్ఞానమార్గం.ఈ భక్తులది సెంటిమెంటల్ భక్తిమార్గం.ఆ సెంటిమెంటల్ గోలతోనే ఆయన్ను వీరంతా ఇంకా ఇంకా బాధ పెట్టారు.

'అయ్యో పుండు ఇంకా ఎదుగుతున్నదే? బాగా రక్తం కారుతున్నదే? మీరు నీరసించి పోతున్నారే? ఇక తగ్గదా? మమ్మల్ని ఒదిలేసి పోతారా?' మొదలైన ఏడుపులతో ఆయన్ను చికాకు చేసేవారు భక్తులు.మహర్షి వినీ వినీ చివరకు ఇలా అనేవారు.

'మీరంతా చెబుతుంటే నాకొక దేహం ఉన్నదనీ దానికొక చెయ్యి ఉన్నదనీ ఆ చేతికొక పుండు ఉన్నదనీ దానినుంచి రక్తం కారుతున్నదనీ లీలగా అనిపిస్తున్నది కాని లేకుంటే నాకేమీ తోచడం లేదే? ఎలా మరి?'

ఆయన స్థితి అది. వీరి స్థితి ఇది.ఇద్దరూ ఒకచోట చేరాలని దైవసంకల్పం. ఇదేగా విధి అంటే?

ఒక సద్గురువును ఆశ్రయించిన భక్తులు గానీ శిష్యులు గానీ ఆయన చెప్పిన దానిని ఆచరించాలి.ఆయన చూపిన మార్గంలో నడవాలి.అంతేగాని ఆయన్నొక బొమ్మను చేసి కూచోబెట్టి పూజలు చెయ్యకూడదు.మా పద్ధతిలో మేముంటాం మా వరాలు మాత్రం మాకివ్వండి అనకూడదు.అలా చెయ్యడం వల్ల ఆయనకు ఇంకా బాధ ఎక్కువౌతుందిగాని తగ్గదు.మనవల్ల గురువుకు సంతోషం కలగాలి గాని బాధ పెరగకూడదు.నిజమైన శిష్యులనేవారు ఆ విధంగా ఉండాలి.

కర్మ ఉన్నంత కాలం దేహం ఉంటుందని జ్ఞానికి తెలుసు.అది తీరిన మరుక్షణం దేహం ఇక ఉండదనీ తెలుసు. ఆ సమయం కోసమే జ్ఞాని అయినవాడు ఎదురుచూస్తూ ఉంటాడు.ఈ దేహం అనే జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతానా అని ఆయన ఎదురుచూస్తూ ఉంటాడు.వీరేమో ఆ భావననే భరించలేరు.ఆ క్రమంలో ఏడుపులు పెడబొబ్బలు గోలా చేస్తారు. వారిది కూడా తప్పుకాదు.ఆయనంటే వారికున్న బంధం ఎలా అనిపింపజేస్తుంది.నిజమైన జ్ఞానమార్గంలో నడక చాలాచాలా కష్టం అనేది అందుకే. అందులో కోటికొకరు కూడా నడవలేరు. 

వారి సెంటిమెంటల్ భక్తిని చూచి ఆయన జాలిపడి మౌనంగా వీరి హింసను భరిస్తూ ఉండేవాడు.అది అర్ధం చేసుకోలేని వీరు తమ పిచ్చి భక్తితో ఆయన్ను ఇంకాఇంకా హింసిస్తూ ఉండేవారు.వీరిదేమో ఆరాధన.ఆయనదేమో పూర్ణజ్ఞానం.రెండూ వేటికవి సరియైనవే.ఎవరి పట్టు వారిదే.ఈ సమస్యకు పరిష్కారం లేదు.కర్మ తీరడమూ మహర్షి శరీరం రాలిపోవడమే ఈ సమస్యకు పరిష్కారం.

తామాశించిన విధంగా విధి నడవాలని భక్తుల తాపత్రయం.విధికి అనుగుణంగా మీరు నడవండి అని ఆయన బోధ.ఆయన మాట వీరికి అర్ధం కాదు.వీరి పద్దతి ఆయన చెప్పినట్లుగా మారదు.ఆ విషయం ఆయనకు తెలుసు.అందుకే చెప్పినా అర్ధం చేసుకోలేని వీరి స్థితిని చూచి ఆయనలో కరుణ అనేది పెల్లుబుకుతూ ఉండేది.

మహర్షిని అలాంటి స్థితిలో చూస్తూ కూడా నిబ్బరంగా ఉండగలగడం వీరికి పరీక్ష.వారి భక్తిహింసను భరిస్తూ కూడా చెక్కుచెదరకుండా ఉండటం ఆయనకు పరీక్ష.అనేకమంది సద్గురువులకు ఇలాంటి పరీక్షలే ఎదురౌతూ ఉంటాయి.రకరకాలుగా పరీక్షించకుండా అమ్మ ఎంత పెద్దవారినైనా అంత తేలికగా వదలదు.

అయినా, విధిని యధాతధంగా స్వీకరించలేనివారు అసలేమి ఆధ్యాత్మికులైనట్లు?