ఆశ్రమాలన్నీ మేడిపళ్ళే.
ఈ స్టేట్మెంట్ చాలామందికి మింగుడు పడకపోవచ్చు.కోపాన్ని తెప్పించవచ్చు. కానీ నేను చెప్పే అనేక ఇతర విషయాలలాగే ఇదీ నిజమే.నేటి నవీనకాలపు ఆశ్రమాలైతే సరే,మరి పాతకాలపు ఆశ్రమాలు కూడా ఇంతేనా? అన్న సందేహం చాలామందికి రావచ్చు.నవీన కాలమైనా పాతకాలమైనా మనుషుల మనస్తత్వాలలో ఏమీ మార్పు రాలేదు.అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మనుషులు ఒకేలా ఉన్నారు.
గత 10,000 ఏళ్ళుగా మనిషి యొక్క మౌలికమైన ఆటవిక మనస్తత్వంలో ఎలాంటి మార్పూ రాలేదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది నిజమే. మనిషి ఒకప్పుడు అడవిలో ఉండేవాడు.ఇప్పుడు జనాటవిలో ఉంటున్నాడు. అప్పుడు పాశవికంగా జంతువులను వేటాడేవాడు.ఇప్పుడు తెలివిగా సాటి మనిషిని వేటాడుతున్నాడు.అప్పుడు ఇంత సైన్సూ,టెక్నికల్ పరికరాలూ లేవు.ఇప్పుడున్నాయి.అయితే మనిషి చేసే పనిలో మాత్రం మౌలికమైన మార్పు ఏమీ రాలేదు.మనిషి అంతరంగంలో ఏమీ తేడా రాలేదు.
గత 10,000 ఏళ్ళుగా మనిషి యొక్క మౌలికమైన ఆటవిక మనస్తత్వంలో ఎలాంటి మార్పూ రాలేదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది నిజమే. మనిషి ఒకప్పుడు అడవిలో ఉండేవాడు.ఇప్పుడు జనాటవిలో ఉంటున్నాడు. అప్పుడు పాశవికంగా జంతువులను వేటాడేవాడు.ఇప్పుడు తెలివిగా సాటి మనిషిని వేటాడుతున్నాడు.అప్పుడు ఇంత సైన్సూ,టెక్నికల్ పరికరాలూ లేవు.ఇప్పుడున్నాయి.అయితే మనిషి చేసే పనిలో మాత్రం మౌలికమైన మార్పు ఏమీ రాలేదు.మనిషి అంతరంగంలో ఏమీ తేడా రాలేదు.
ఆటవిక సమాజంలో ఉన్న కక్షలూ కుళ్ళూ కుత్సితాలూ అసూయా దురాశా ఇప్పుడూ ఉన్నాయి.కాకుంటే అప్పుడు వాటిని దాచుకోవడం తెలియక వెంటనే ప్రదర్శించేవాడు.ఇప్పటి మనుషులు తెలివిగా వాటిని లోలోపల అణచిపెట్టి పైకి నవ్వుతూ మోసాలు చేస్తున్నారు.నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్నారు. అంతే తేడా.
మనిషిలో తెలివి పెరిగింది.దీనిని తెలివి అనడం కంటే నక్కజిత్తులు అంటే బాగుంటుందేమో?తెలివి పెరిగినా,అంతరిక పరివర్తన అనేది మనిషికి రాలేదు. అందుకే సామాజిక శాస్త్రవేత్తలు అంటారు - మనిషి ఇప్పటికీ ఆటవికుడే అని.
"మనిషి ఒక సామాజిక జంతువు"- అన్నాడు అరిస్టాటిల్.
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే - ఆ పుస్తకంలో నాగమ్మగారు వ్రాస్తారు. ఒకరోజున ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మహర్షి నాగమ్మతోనే మాట్లాడుతూ ఉన్నారట.అది చూచి, మహర్షి దర్శనార్ధమై వచ్చిన మిగతా భక్తులు ఎకసెక్కంగా కామెంట్ చేశారని ఆమే వ్రాశారు.ఆ వచ్చిన వారిలో ఒక తమిళ పండితుడు కూడా ఉన్నాడట.ఆయనిలా అన్నాడు.
మహర్షినుద్దేశించి వ్రాస్తూ గణపతిముని తన రచనలలో ఒకదానిలో - 'గణరాన్ముఖ సూరిసభా గురుణా' అని ఒకచోట అన్నారు.ఇవాళ కూడా సూరిసభేగా జరిగింది' అన్నాడట ఎగతాళిగా.నాగమ్మగారి ఇంటిపేరు కూడా 'సూరి' కాబట్టి ఎప్పుడో గణపతిముని వ్రాసిన ఒక ముక్కను తీసుకొచ్చి ఎగతాళిగా అలా అన్నాడట.ఆ పదానికి గణపతిముని వాడిన అర్ధం వేరు. "సూరిసభా గురుణా" అంటే పండితసమూహానికి గురువైనవాడవు అనీ, 'గణరాన్ముఖ" అంటే - "గణపతిచే నాయకత్వం వహించబడే" అనీ అర్ధాలు. కానీ ఆ పండితుడేమో - 'ఇవాళంతా మహర్షి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు' - అని ఎగతాళిగా అసూయగా అన్నాడట.
ఆ అర్ధాలు ఎలా ఉన్నప్పటికీ - అక్కడకు వచ్చే భక్తులలో కూడా పరస్పర అసూయలూ,ద్వేషాలూ,ఒకరినొకరు ఎగతాళి చేసుకోడాలూ,వెక్కిరింతలూ ఉండేవని దీనిని బట్టి అర్ధమౌతున్నది.అది సహజమే కదా ! మహర్షి జ్ఞాని అయినంత మాత్రాన ఆయన చుట్టూ చేరినవారు కూడా మహాజ్ఞానులు కావాలని ఎక్కడుంది? ప్రకృతిలో అది సాధ్యం కూడా కాదు.ఒక జ్ఞాని చుట్టూ అజ్ఞానులు చేరడమే ప్రకృతిధర్మం.వెలుతురు చుట్టూ చీకటేగా ఉండేది?వెలుగు చుట్టూ వెలుగు ఉంటే అది ప్రత్యేకంగా కనిపించదు.ఆ వెలుగులో ఈ వెలుగు కలసిపోతుంది.ప్రత్యేకంగా కన్పించింది అంటే అది చీకటి అనే అర్ధం. అలాగే ఒక మహనీయుని దగ్గర చేరిన వారిలో నిజంగా ఆయన్ను ప్రేమించి ఆయన్ను అనుసరించేవారు ఆయనలాగే తయారౌతారు.వారికీ ఆయనకూ ఏమీ భేదం లేనంతగా ఆయనతో వారు కలసిపోతారు.తద్రూపులే తద్గుణులే వారుకూడా అవుతారు. దీనినే 'భ్రమరకీట న్యాయం' అని వేదాంతంలో అంటారు.
కానీ అలా అయ్యేవారు ఎక్కడో నూటికి కోటికి ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగిలినవారు ఆయనపేరు చెప్పి తమతమ వేషాలు వేసేవారే ఉంటారు.ఏ ఆశ్రమంలో చూచినా,ఏ గురువు దగ్గర చూచినా ఇదే తంతు జరుగుతుంది. దీనికి ఎక్కడా మినహాయింపు ఏమీ ఉండదు.
నేను పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి 1979 లో మొదటిసారి వెళ్లాను.అప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయింది.డిగ్రీలో చేరుదామని ఉద్దేశ్యం.అక్కడైతే ఏదో ధార్మికమైన శిక్షణ కూడా ఉంటుంది,ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఉత్తమమైన పౌరుడిగా ఎదగవచ్చు.అన్న భ్రమలో మా పెద్దలు అక్కడ కాలేజీలో అడ్మిషన్ కోసం నన్ను అక్కడకు పంపించారు.పెద్దవాళ్ళ మాటకు ఎదురు చెప్పడం ఆ తరంలో లేదు గాబట్టి, నోర్మూసుకుని నేనూ అక్కడకు వెళ్లి ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాను.కానీ అక్కడ వాతావరణం చూస్తూనే నాకు అర్ధం అయిపోయింది - పుస్తకాలలో వ్రాసినంత ఆధ్యాత్మిక ఔన్నత్యం అక్కడ ఏమీ లేదని.అదంతా హైక్లాస్ మాఫియా వ్యవహారమని.
మా పెద్దలలో కొందరు సత్యసాయిబాబా భక్తులున్నారు.వారు చెబుతుంటే విన్న వాతావరణం అక్కడేమీ నాకు కన్పించలేదు.ఇంకా పైగా - దానికి పూర్తి వ్యతిరేకమైన ఒక ఇబ్బందికరమైన మాఫియా వాతావరణం దర్శనమిచ్చింది. అంత చిన్నవయసు లోనే నాకేంటో ఆ వాతావరణం అంతా చాలా అసహజంగా చాలా అసౌకర్యంగా ఉన్నట్లు ఫీలింగు కలిగింది.బైటకు ప్రొజెక్షన్ అయ్యే ప్రచారాలకూ,వాస్తవంగా ఆశ్రమాలలో ఉండే పరిస్థితులకూ ఎంత తేడా ఉంటుందో నాకు అదే ప్రధమానుభవం.అదృష్టవశాత్తూ అక్కడ నాకు సీటు రాలేదు.జీవితంలో సెటిలయ్యాక అఫిషియల్ పనులమీద చాలాసార్లు అక్కడకు వెళ్లాను.ప్రతిసారీ అక్కడ ఒకవిధమైన కృత్రిమ వాతావరణమే నాకు కనిపించింది.అక్కడ ఏ రకమైన దివ్యత్వమూ లేదని నా నిశ్చితాభిప్రాయం. ఇన్నేళ్ళ తర్వాత సత్యసాయిబాబా మరణం సమయంలో జరిగిన ప్రహసనం అంతా చూచాక చాలామంది హతాశులయ్యారు.కానీ నాకేమీ అనిపించలేదు. 36 ఏళ్ళ క్రితం నాకు కలిగిన ఫీలింగ్ నిజమేనని నాకు నిరూపణ అయింది.
ఆ తర్వాత రామకృష్ణా మఠాలతో సహా అనేక ఆశ్రమాలను నేను చాలా దగ్గరగా పరిశీలించాను.అన్నింటిలోనూ ఇవే లుకలుకలు దర్శనమిచ్చాయి.బయట పుస్తకాలలో ఉండేవి వేరు.ఆశ్రమాలలో జరిగేవి వేరు.కాకపోతే మిగతా అన్ని ఆశ్రమాలతో పోలిస్తే రామకృష్ణా మఠాలు చాలావరకూ నయం. మిగతా ఆశ్రమాలలో ఉండే రకరకాల మోసాలూ, ఘోరాలూ,వంచనలూ అక్కడ జరగవు.వాళ్ళు శుద్ధంగానే ఉంటారు.కానీ అక్కడ కూడా అహంకారాలూ గ్రూపు ఫీలింగులూ ప్రాంతీయ ఫీలింగులూ గర్వాలూ మొండితనాలూ ఉండటం నేను గమనించాను.తరాలు మారే కొద్దీ సాధువులలో క్వాలిటీ తగ్గిపోవడాన్ని కూడా నేను గమనించాను.
మిగతా ఆశ్రమాల గురించి ఇక నేను వ్రాయదలచుకోలేదు.ఎందుకంటే వాటి గురించి వ్రాయడం సంగతి అలా ఉంచి, ఆలోచించడం కూడా పరమ వేస్ట్ అన్న స్థాయిలో అవి ఉన్నాయి.అందుకే అన్నింటికీ ఆదర్శంగా ఉండే రామకృష్ణ మఠాల గురించే నేను వ్రాశాను.
ఓషో ఆశ్రమం కూడా నేను చూచాను.ఓషో తన పుస్తకాలలో వ్రాసినదానికీ అక్కడ జరిగేదానికీ ఏమీ సంబంధం లేదు.అది ఒక హైక్లాస్ క్లబ్బులాగా నాకు అనిపించింది.మిగతా ఆశ్రమాలకూ దానికీ నాకు తేడా ఏమీ కన్పించలేదు. కాకపోతే మన ఆశ్రమాలలో నల్లతోలు కనిపిస్తే అక్కడ ఎక్కువగా తెల్లతోలు కన్పిస్తుంది.అంతేతేడా.అది తప్ప మనుషుల మనస్తత్వాలలో గాని ప్రవర్తనలలో గాని ఏమీ భేదం నాకు కన్పించలేదు.ఓషో పుస్తకాలలో కన్పించే ఉన్నతమైన విషయాలు ప్రాక్టికల్ గా ఆ ఆశ్రమంలో నాకెక్కడా కన్పించలేదు. ఆ దెబ్బతో నాకు మళ్ళీ పూనా వెళ్ళాలన్న ధ్యాసే కలగలేదు.
గతించిన గురువులు గనుక నిజంగా ఉన్నతులైతే, ఆ బోధనలను ఇప్పుడున్నవారు ఎవరూ యధాతధంగా పాటించడం లేదు.వాటిని చాలా మార్చారు లేదా వక్రీకరించారు.ఇప్పుడు బ్రతికున్న గురువులను చూద్దామా అంటే వీరిలో ఎవరిలోనూ నిజమైన క్వాలిటీ లేదు.వీళ్ళందరూ పాతవాళ్లకు కాపీరాయుళ్ళే
గతించిన గురువులు గనుక నిజంగా ఉన్నతులైతే, ఆ బోధనలను ఇప్పుడున్నవారు ఎవరూ యధాతధంగా పాటించడం లేదు.వాటిని చాలా మార్చారు లేదా వక్రీకరించారు.ఇప్పుడు బ్రతికున్న గురువులను చూద్దామా అంటే వీరిలో ఎవరిలోనూ నిజమైన క్వాలిటీ లేదు.వీళ్ళందరూ పాతవాళ్లకు కాపీరాయుళ్ళే
ఉదాహరణ కోసం ఈ రెండు ఆశ్రమాల విషయం చెప్పానుగాని మిగతా ఆశ్రమాలన్నీ ఈ రెంటి మధ్యనున్న స్పెక్ట్రం లో ఇమిడిపోయేవే.ఆచరణ లోపాలలో స్థాయీభేదాలే గాని ఔన్నత్యంలో ఉన్నతస్తరాలు నాకెక్కడా కన్పించలేదు. అందుకే ఏ ఆశ్రమానికీ ఏ గురువుదగ్గరకూ వెళ్ళకూడదన్న నిశ్చయానికి నేను 25 సంవత్సరాల క్రితమే వచ్చేశాను.
పూర్ణసత్యం ఈ ప్రపంచంలోని ఏ ఆశ్రమంలోనూ లభించదు.ఏ గురువుదగ్గరా లభించదు.అలుపెరుగని అంతరికాన్వేషణ ద్వారానే అది లభ్యమౌతుందన్న విషయమూ,దానికోసం ఎక్కడికీ తిరగవలసిన అవసరం లేదన్న విషయమూ,ఏ గురువులనూ దేబిరించవలసిన అవసరం లేదన్న విషయమూ,అసలు వారికే ఆ సత్యజ్ఞానం లేదన్న విషయమూ - ఆ విధంగా నాకు ప్రాక్టికల్ గా అర్ధమైంది.