“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

22, అక్టోబర్ 2015, గురువారం

నవరాత్రులలో గుడికి వెళ్ళారా??

నిన్న మా కొలీగ్ ఒకాయన ఇలా ప్రశ్నించాడు.

'నవరాత్రులు కదా? అమ్మవారి గుడికి వెళ్ళారా?'

'ఏ అమ్మవారి గుడికి?' అడిగాను.

'అదే మన విజయవాడ కనకదుర్గమ్మవారి గుడికి'

'వెళ్ళలేదు' అన్నాను.

అతను నావైపు జాలిగా చూచాడు. "బ్రాహ్మణుడివై ఉండి గుడికి కూడా వెళ్ళవా? దుర్మార్గుడా" - అన్నట్లు ఉందా చూపు.

ఆ చూపు గమనించిన తర్వాత అసలైన డైలాగ్ వదిలాను.

'వెళ్ళను.వెళ్ళవలసిన అవసరం లేదు'

అతని ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి.

'అదేంటి?' అడిగాడు.

'ఈ తొమ్మిది రోజులలో ఒకరోజు వెళితే సరిపోతుందా? ఆ తరువాత ఏం చెయ్యాలి? అప్పుడు వెళ్లకపోయినా పరవాలేదా?అప్పుడు అమ్మవారు ఏమైపోతుంది? అక్కణ్ణించి మాయమై పోతుందా?' అడిగాను.

'అది కాదు.గురుచరిత్రలో చెప్పబడి ఉంది.పర్వదినాలలో పుణ్యక్షేత్రాలలో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి.మహనీయులు సూక్ష్మ రూపాలలో అక్కడకు వస్తారు.అందుకని మనమూ అక్కడకు వెళితే ఆ వైబ్రేషన్స్ మనం అందుకోవచ్చు.' అన్నాడు.

'ఎవరి వైబ్రేషన్సో అందుకుని బ్రతకాల్సినంత ఖర్మ నాకేమీ లేదు.అంత దురాశా నాకు లేదు.అయినా పర్వదినాలలో మంచి వైబ్రేషన్స్ ఉండి మిగతా దినాలలో ఛండాలపు వైబ్రేషన్స్ ఉంటాయా అక్కడ?అదేనా దానర్ధం?అయినా మీరక్కడికెళ్ళేది అమ్మవారి కోసమా లేక సూక్ష్మరూపాలలో వచ్చే మహనీయుల కోసమా?' అన్నాను.

అతనికి అర్ధం కాలేదు.

'మరి గురుచరిత్రలో అలా ఎందుకు వ్రాశారు?' అన్నాడు.

"వ్రాసినోడినడుగు"- అందామని నోటిదాకా వచ్చింది.అలా అంటే బాధపడతాడని - 'గురుచరిత్ర వ్రాసింది మనుషులా, దేవుడా?' అడిగాను.

జవాబు లేదు.

'అది మనుషులు వ్రాసిన పుస్తకమే.అందులో ఉన్నవి వారి అభిప్రాయాలు మాత్రమే.అవి ఎల్లప్పుడూ నిజాలే కావాలని రూలేమీ లేదు.అవి ఎవరికి అవసరమో వారు పాటిస్తారు.మిగతా వారికి అవసరం లేదు.' అన్నాను.

'అందరూ పాటించాలని వ్రాశారు' అన్నాడు.

'అందరూ పాటించాలని చెప్పడానికి ఆయనెవరు? అక్కడే ఆ వ్రాసినాయన అహంకారం కనిపిస్తున్నది.అసలు విషయం చెప్పనా? మీ గుండె చిక్కబట్టుకోండి.సమాజాన్ని ఆధ్యాత్మికంగా పాడుచేసిన కొన్ని పుస్తకాలున్నాయి.వాటిలో గురుచరిత్ర ఒకటి.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం' అన్నాను.

'అదేంటి అంత మాట అన్నారు?' అడిగాడు.

'నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది.అంతమాట అనకపోతే ఇంకేమనాలి? ఈ పని కావడానికి ఈ కధ చదవండి.ఈ పని కావడానికి ఈ అధ్యాయం పారాయణ చెయ్యండి అని చెప్పే చవకబారు పుస్తకాలకు అంతకంటే విలువనివ్వను.' చెప్పాను.

'మీరా పుస్తకం అసలు చదివారా?' అడిగాడు.

'మీరెప్పుడు చదివారు?' అడిగాను.

'నేను పదేళ్ళ క్రితం చదివాను.అప్పటినుంచీ రోజూ పారాయణం చేస్తూనే ఉన్నాను' అన్నాడు.

'నేనా పుస్తకాన్ని 37 ఏళ్ళ క్రితం చదివాను.ఆ తర్వాత మళ్ళీ చదవవలసిన అవసరం రాలేదు.' అన్నాను.

'మీకిప్పుడు ఎన్నేళ్ళు?' అడిగాడు.

"52" చెప్పాను.

'మరి మీకు 14 ఏళ్ళున్నప్పుడే అది చదివారా? అడిగాడు.

'అవును.మీరెప్పుడు నేర్చుకున్నారో నాకు తెలీదుగాని, నేనుమాత్రం అక్షరాలను సరియైన వయసులోనే నేర్చుకున్నాను.ఆ తర్వాత కనిపించిన పుస్తకమల్లా చదివేవాడిని.ఆ క్రమంలోనే అదీ చదివాను.ఏం? మీరు 45 వచ్చేదాకా ఆ పుస్తకాన్ని చదవలేకపోయారు కాబట్టి అందరూ అలాగే ఉండాలా? అదేమైనా రూలా?' అడిగాను.

'అబ్బే.అదేమీ లేదు.అయినా పండగల్లో ఒకసారి గుడికి వెళ్లి వస్తే బాగుంటుంది కదా?' అన్నాడు.

'ఎవరికి బాగుంటుంది?మీకా నాకా? మీకు బాగుంటే మీరు వెళ్లి రండి. నాకెందుకు చెప్పడం?' అడిగాను.

ఏమనుకున్నాడో ఏమో - 'అదికాదు సార్.నాక్కొంచం అర్ధం అయ్యేలా చెప్పండి ప్లీజ్' అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా.

'అలా రండి దారికి.తెలియకపోతే తెలియనట్లు ఉండాలి.అడిగి తెలుసుకోవాలి. అంతేగాని అహం చూపిస్తే మాడు పగులుతుంది.' అంటూ ఇలా చెప్పాను.

'గుళ్ళకు తిరగడం ఎవరికయ్యా అంటే ఆధ్యాత్మికంగా చాలా ప్రాధమిక స్థాయిలో ఉన్నవారికి మాత్రమే.ఎదిగిన వారికి ఏ గుడీ అవసరం లేదు. వారెక్కడుంటే అదే గుడి.వారేం చేస్తే అదే పూజ.మీరు గుళ్ళూ గోపురాలూ తిరిగి కూడా ఎప్పట్లాగే ఉంటారు.మీలో ఏ ఔన్నత్యమూ రాదు.నేను ఉన్నచోటే ఉండికూడా రోజురోజుకూ ఎంతో మార్పుకు లోనవుతూ ఉంటాను.

ఉపాసనా మార్గంలో అడుగుపెట్టి నడిచేవాడికి మీ గురుచరిత్రలూ, మనుచరిత్రలూ,వరూధినీ ప్రహసనాలూ,ఊర్వశీ ఉపాఖ్యానాలూ ఏమీ అవసరం లేదు.మీరింతవరకూ ఉపాసనా మార్గంలో అడుగుపెట్టనే లేదు.నేను నా చిన్నప్పుడే దానిలో అడుగుపెట్టాను.ఇప్పటికే ఎన్నో మైళ్ళు అందులో నడిచాను.అందుకే నా భావాలు మీ భావాలకు చాలా దూరంలో ఉంటాయి.నేను మీకర్ధం కాను.అలా కావాలంటే, మీరు కూడా నా దారిలోకి వచ్చి నేను నడిచినంత దూరం నడిస్తే అప్పుడు అర్ధం అవుతుంది.కానీ అంత అదృష్టం మీకు లేదు.మీకూ నాకూ వయస్సులో ఒక అయిదేళ్ళు తేడా ఉండవచ్చు.కానీ ఉపాసనా మార్గపరంగా చూస్తే మీకూ నాకూ కొన్ని జన్మల తేడా ఉన్నది.మీరు కనీసం ఇంకో అయిదారు జన్మలు ఎత్తితేనే కానీ ప్రస్తుతం నేనున్న స్థాయిని అందుకోలేరు.అందుకే నేను చెబుతున్న విషయాలు మీకు ఎక్కవు.అర్ధం కావు.' అన్నాను.

ఆయన బిత్తరపోయి అలాగే చూస్తున్నాడు.

'చివరగా ఇంకోమాట చెబుతాను వినండి.గుళ్ళు తిరిగినంత మాత్రాన ఆధ్యాత్మికంగా ఏమీ మీకు అందదు. అసలైన మార్గం వేరే ఉన్నది.దానిని అందుకునే ప్రయత్నం చెయ్యాలి.మీకు ఎంతో అదృష్టం ఉంటేగాని ఆ మార్గం మీకు అందదు.నేను మీ కళ్ళెదురుగానే ఉన్నాను.మనం కలిసి గత 20 ఏళ్ళుగా పనిచేస్తూనే ఉన్నాము.కానీ అసలైన 'నేను' ఏమిటో మీకు ఇప్పటికీ తెలియదు.ఖర్మంటే ఇదే.ఇదే నేను చెప్పేదానికి ఋజువు.మీకా అదృష్టం కలిగేదాకా అది సాధ్యంకాదు.ఒక్కోసారి మీ జన్మంతా అయిపోయినా సరే మీకా అదృష్టం కలగక పోవచ్చు'.

నేను వ్రాసిన ఒక పద్యాన్ని వినండి.

గుడుల దిరిగినంత గుణవంతు లవబోరు
నీళ్ళ మునిగినంత నిక్కు బోదు
పూజలెన్నొ జేయ పుణ్యాత్ము లగుదురా?
అంతరంగ శుద్ధి నందకున్న?

అంతరిక ఉపాసనా రహస్యాలు తెలిసినవారికి గుడులూ గోపురాలూ అవసరం లేదు.అదీ సంగతి.అదీగాక నాకు ఈ మనుషుల గోలా వీళ్ళ నీచప్రవర్తనా నచ్చవు.ఏ గుడికి పోయినా ఏముంది గనుక? అదే మనుషులు. అదే గోల.అదే నీచ ప్రవర్తన.అందుకే పర్వదినాలలో నేనే గుడికీ పోను రాను. ఇక దేవుడంటారా? దేవుడు గుడిలో మాత్రమే ఉన్నాడా? ఇంకెక్కడా లేడా? పర్వదినాలలో అక్కడికి పోయి,అక్కడ తేరగా దొరికే పుణ్యాన్ని, శవం దగ్గర చిల్లర ఏరుకున్నట్లు ఏరుకోవాల్సిన ఖర్మ నాకు లేదు.మీక్కావాలంటే మీరేరుకోండి.

గురుచరిత్ర ప్రామాణిక గ్రంధం ఏమీ కాదు.దానిని వ్రాసినది మీ స్థాయిలో ఉన్న మనిషే.అందుకే అది మీకు నచ్చుతున్నది.పర్వదినాలలో మహనీయులు పుణ్యక్షేత్రాలకు వస్తారని మీ గురుచరిత్రలో వ్రాసి ఉన్నదేమో.అది అబద్దం. దానిని మార్చుకోండి.ఈ కలియుగంలో ఏ మహనీయుడూ పర్వదినాలలో పుణ్యక్షేత్రాలకు రాడు.వాటికి ఆమడదూరంలో ఉంటాడు.ఈ చౌకబారు మనుషుల ఆరాలు వారిని రిపల్స్ చేసేస్తాయి.పుణ్యక్షేత్రాల అసలైన రూలు చెబుతాను వినండి.

"మామూలు రోజుల్లో మహనీయులు వెళతారు.పర్వదినాలలో పనికిమాలిన మనుషులు వెళతారు"

ఇదే అసలైన నిజం.మీకు చేతనైతే నేను చెప్పిన ఈ నిజాన్ని కలిపి మీ గురుచరిత్రను మార్చుకోండి.కానీ మీకంత ధైర్యం ఉన్నదని నేననుకోను.' అని చెప్పి ముగించాను.

అతను ఏమీ మాట్లాడకుండా నిష్క్రమించాడు.