“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, డిసెంబర్ 2015, శుక్రవారం

అసలైన క్రైస్తవం

ఈరోజు క్రీస్తు జన్మదినంగా ప్రపంచం భావిస్తున్నది.అది నిజమో కాదో ఎవరికీ తెలియదు.అదొక నమ్మకం అంతే.ప్రపంచం నమ్మకాల మీదనే నడుస్తున్నది గాని సత్యాన్ని అనుసరిస్తూ నడవడం లేదు.ఏ మతమైనా నమ్మకాల నీడలోనే నిద్రిస్తున్నది గాని సత్యపు వెలుగులో నడవడం లేదు.ఆ విషయాన్ని అలా ఉంచుదాం.

క్రిస్మస్ సందర్భంగా ఆసలైన క్రైస్తవం ఏం చెబుతున్నదో చూద్దాం.అసలిదంతా ఎందుకంటే - అసలైన క్రైస్తవానికీ అసలైన హిందూమతానికీ ఏమీ భేదం లేదు.రెండూ ఒకటే.ఈ విషయాన్ని చెప్పడానికే ఈ టాపిక్ మీద వ్రాస్తున్నాను.ఈ ప్రయత్నాన్ని స్వామి యుక్తెశ్వర్ గిరిగారు కూడా చేశారు.అలా చెయ్యమని ఆయనకు బాబాజీ ఆదేశించారని తన "The Holy Science" అనే పుస్తకంలో వ్రాశారు.

అయితే తనకు అప్పటికి అందుబాటులో ఉన్న పురాణాలు బైబిలు ప్రతుల ఆధారంగా ఆయన ఆపనిని చేసే ప్రయత్నం చేశాడు. ఆయన తర్వాత చాలా నిజాలు క్రైస్తవ ప్రపంచంలో వెలుగుచూశాయి.వాటిని ఉపయోగించుకునే అవకాశం ఆయనకు రాలేదు.ఇప్పుడు గనుక ఆయన ఆపని చేస్తే ఇంకా అధికారికంగా వ్రాయగలిగి ఉండేవారు.


కైరోలో జరిగిన పురావస్తు తవ్వకాలలో 
'నాగ్ హమ్మడి' తాళపత్రాలు,వెస్ట్ బ్యాంక్ లోని కొన్ని గుహలలో "Dead Sea Scrolls"బయటపడటమే ఆ నవీన ఆవిష్కరణ.ఈ తాళపత్రాలలో ఉన్న విషయాలు ఇప్పటివరకూ క్రైస్తవులు నమ్ముతున్న సిద్ధాంతాల మౌలికత్వాన్నే ప్రశ్నించేటట్లు చేస్తున్నాయి.

హిందూమతమూ క్రైస్తవమూ ఒకటే విషయాన్ని చెబుతున్నపుడు ఇన్ని భేదాలెందుకని ప్రశ్న వస్తుంది? విషయం ఏమంటే, అసలైన హిందూమతం గురించి హిందువులకూ తెలియదు.అసలైన క్రైస్తవం గురించి క్రైస్తవులకూ తెలియదు.వీరిద్దరికీ తెలిసినదేమంటే - పాపులర్ హిందూమతమూ పాపులర్ క్రైస్తవమూ మాత్రమే.నిజానికి పాపులర్ హిందూమతం అసలైన హిందూమతమూ కాదు. పాపులర్ క్రైస్తవం అసలైన క్రైస్తవమూ కాదు.రెండూ పూర్తిగా అజ్ఞానపూరితాలే.

19 వ శతాబ్దపు ఆఖరులో ఈజిప్టు, వెస్ట్ బ్యాంక్ లలో జరిగిన త్రవ్వకాలలో "Dead Sea Scrolls" మరియు 'నాగ హమ్మడి' తాళపత్రాలు బయట పడేంతవరకూ క్రైస్తవమతంలో రహస్య జ్ఞానభాగం ఒకటి ఉన్నదన్న విషయం ప్రపంచానికి తెలియదు. ఈనాటికీ ఆ తాళపత్రాలలో ఉన్న విషయాలను ఆర్దోడాక్స్ చర్చి ఒప్పుకోవడం లేదు.అలా ఒప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా గత 2000 సంవత్సరాలుగా ప్రచారం కాబడుతున్న క్రైస్తవం అబద్దం కాకపోయినా పూర్తిసత్యం మాత్రం కాదు అని తేలుతుంది.అలా జరిగేపనైతే చర్చి ఆధిపత్యానికి గండి పడుతుంది.అందుకని ఆర్దోడాక్స్ చర్చి వర్గాలు ఈ నూతనంగా వెలుగుచూచిన ప్రాచీన విషయాలను ఒప్పుకోవటం లేదు.చర్చి దానిని ఒప్పుకోనంత మాత్రాన ఆ తాళపత్రాలు అబద్దమూ కావు.వాటిలోని విషయాలూ అబద్దాలు కావు.అవి సత్యాలే.

నిజానికి అవే అసలైన క్రైస్తవ జ్ఞాన భాగాలు.


నాగ్ హమ్మడి అనేది ఈజిప్ట్ లోని ఒక ప్రాంతం.1945 లో జరిగిన పురావస్తు త్రవ్వకాలలో ఒక సమాధిలో కొన్ని తాళపత్రాలు బయటపడ్డాయి.వాటిలో క్రీ శ.2 వ శతాబ్ది నాటి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. వాటిని చదివిన పరిశోధకులు నిర్ఘాంతపోయారు.అవి క్రైస్తవ మత సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు.దాదాపు 2000 సంవత్సరాల నాడు ఆ ప్రాంతంలో నివసించిన "ఎస్సీన్స్" అనబడే తెగకు చెందిన వ్రాతప్రతులు అవి.

ఈ తాళపత్రాలలో బయల్పడిన గ్రంధాలలో ఒకటి - "గాస్పెల్ ఆఫ్ మేరీ". ఇప్పటివరకూ ప్రపంచానికి తెలిసినవి నాలుగు గాస్పెల్సే.

అవి.

గాస్పెల్ ఆఫ్ జాన్
గాస్పెల్ ఆఫ్ మేథ్యూ 
గాస్పెల్ ఆఫ్ లూక్
గాస్పెల్ ఆఫ్ మార్క్

కానీ వీటికి భిన్నంగా 'గాస్పెల్ ఆఫ్ మేరీ' అని ఒకటున్నది ఇది కైరో త్రవ్వకాలలో బయటపడింది.ఇందులో ఇప్పటివరకూ క్రైస్తవమతానికి తెలిసిన సిద్ధాంతాలకు పూర్తిగా విభిన్నమైన భావాలు చాలా ఉన్నాయి.


గాస్పెల్ ఆఫ్  మేరీ నుంచి కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

శిష్యులు జీసస్ ను ఇలా ప్రశ్నించారు.

ప్రశ్న:--భౌతిక పదార్ధం అంతం అవుతుందా?
జవాబు:--ప్రపంచంలోని అన్నీ,చరాచర సమస్తమూ,జీవులూ అన్నీకూడా ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి.అవన్నీ అంతిమంగా వాటివాటి మూలాలుగా మారిపోతాయి.

భౌతిక పదార్ధం అంతా పంచభూతాలతో నిండి ఉన్నదనీ అవి వాటి వాటి తన్మాత్రలుగా చివరకు లయం అవుతాయనీ హిందూమతం చెబుతున్నది.ఇదే విషయాన్ని జీసస్ తన శిష్యులకు చెప్పాడు.

పీటర్ ఇలా ప్రశ్నించాడు.

ప్రశ్న:-- పాపం అంటే ఏమిటి? ఏది పాపం?
జవాబు:--ఈ ప్రపంచంలో పాపం అంటూ ఏదీ లేదు.కానీ మీరు చేసే వ్యభిచారం వంటి పనులవల్ల పాపాన్ని మీరే సృష్టిస్తున్నారు.

మామూలుగా క్రైస్తవ మతం అంతా 'పాపం' అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది.కానీ 'గాస్పెల్ ఆఫ్ మేరీ' ప్రకారం - పాపమనేదే లేదని జీసస్ అంటున్నాడు.ఇది కూడా హిందూమతపు భావనయే. వేదాంతం ప్రకారం అజ్ఞానం అనేది ఉన్నది కాని పాపం అనేది లేదు.వేదాంత భావననే ఇక్కడ జీసస్ చెప్పాడు.

ఆ తర్వాత ఒక సందర్భంలో మిగతా శిష్యులు అందరూ మేరీని ఇలా అడిగారు.

'నీవు జీసస్ తో చాలా సన్నిహితంగా ఉన్నావు కదా.మాకు చెప్పని విషయాలు నీకు ఏమేం చెప్పాడో అవన్నీ మాకు తెలియచెప్పు.'

దానికి మేరీ ఇలా జవాబిచ్చింది.

ఒకరోజున నేను ఆయన్ను ఒక దర్శనంలో చూచాను.ఆ విషయం ఆయనకు చెప్పాను.అప్పుడాయన ఇలా అన్నారు.

'మంచిది.నీ మనస్సు ఎక్కడుంటే అక్కడే నీ నిధి కూడా ఉంటుంది. (అంటే నీ మనస్సేదో నువ్వు అదే)'- అని అర్ధం.

వేదాంతం కూడా ఇదే మాట అంటుంది.శుద్ధ వేదాంత భావననే జీసస్ ఇక్కడ చెప్పాడు.

"మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో:" మనిషి యొక్క బంధానికి గానీ మోక్షానికి గానీ మనస్సే కారణం అవుతున్నది - అని ఉపనిషత్తులూ భగవద్గీతా అంటున్నాయి.

అప్పుడు నేను(అంటే మేరీ) ఆయన్ను ఇలా అడిగాను.

"ఒక వ్యక్తి ఒక దివ్యదృశ్యాన్ని చూచినప్పుడు దేనిద్వారా అతను ఆ దృశ్యాన్ని చూస్తాడు. ప్రాణం ద్వారానా? ఆత్మద్వారానా?"

దానికి జీసస్ ఇలా చెప్పాడు.

"ప్రాణం ద్వారానో ఆత్మ ద్వారానో  ఈ దర్శనాలు కనిపించవు.ఈ రెంటి మధ్యన ఉన్న మనస్సే ఆ దర్శనాలను చూస్తుంది."

ఇది కూడా శుద్ధ వేదాంత భావనయే.

ఇలాంటి అనేక వేదాంత భావాలు 'గాస్పెల్ ఆఫ్ మేరీ' లో ఉన్నాయి. ఆ భావాలను జీసస్ తనతో చెప్పినట్లు మేరీ మిగతా శిష్యులతో చెప్పింది.వాటిని వాళ్ళు నమ్మలేదు.వారిలో ఆండ్రూ,పీటర్ మొదలైన వారు ఆమెను ఖండించారు.కానీ వారందరిలో 'లెవీ' ఒక్కడే ఆమెకు వత్తాసుగా మాట్లాడాడు.

ఇలాంటి విషయాలు అందులో ఉన్నాయి గనుకనే ఈ గాస్పెల్ ను చర్చి ఒప్పుకోవడం లేదు.ఆనాడూ మేరీ ఈ విషయాలను చెబితే జీసస్ శిష్యులు ఒప్పుకోలేదు.ఈనాడూ చర్చి ఒప్పుకోవడం లేదు.అజ్ఞానం అంత త్వరగా సమసిపోతే అది అజ్ఞానం ఎందుకౌతుంది?

ఈ మేరి జీసస్ తల్లి కాదు. ఈమె మేగ్దలిన్ మేరి (Mary of Magdalene). న్యూ టెస్టమెంట్ ఈమెను ఒక వేశ్యగా చిత్రీకరిస్తుంది.కానీ సత్యం వేరు.

ఈమె వేశ్య కాదు.ఈమె ధనికురాలే గాక ఆప్రాంతంలో కొన్ని ఊళ్లమీద ఆధిపత్యం కలిగిన ఒక జమీందారిణి వంటి వ్యక్తి.ఈమె జీసస్ కు ప్రియురాలేగాక ప్రధాన శిష్యురాలు కూడా.ఈ ఇతివృత్తం మీద 'డావిన్సీ కోడ్' సినిమా వచ్చింది.ఆ విషయాలన్నీ నేను మళ్ళీ చెప్పబోవడం లేదు.

జీసస్ పరిచయం కాకముందు నుంచే మేరీ ఒక జిజ్ఞాసాపరురాలైన సాధకురాలు.ఆమె ఎన్నో మార్మిక గ్రంధాలు చదివింది.అలెగ్జాండ్రియా గ్రంధాలయంలో ఉన్న అనేక జ్ఞానగ్రంధాలను ఆమె శ్రద్దగా అధ్యయనం చేసింది.ప్రాచీన హిందూ బౌద్ధ మతాల జ్ఞానమంతా ఆ లైబ్రరీలో భద్రపరచబడి ఉన్నది.వాటన్నిటినీ ఆమె చదివింది.అనేక మార్మిక సాంప్రదాయాల జ్ఞానాన్ని,ఉపాసనా మార్గాలనూ ఆమె ఆకళింపు చేసుకున్నది. 

కానీ పుస్తకాల జ్ఞానం ఆత్మదాహాన్ని ఎప్పటికీ తీర్చలేదు. ఆత్మదాహం ఇంకొక ఆత్మద్వారానే తీరుతుంది. జీసస్ పరిచయంతో ఆమెలోని ఆత్మదాహం తీరింది.

తాను పుస్తకాలలో చదివిన జ్ఞానాన్ని ఆమె జీసస్ లో ప్రత్యక్షంగా చూచింది. ఎందుకంటే జీసస్ ఇండియా,టిబెట్ లలో ఏళ్ళ తరబడి సంచరించి అక్కడి వేదాలు ఉపనిషత్తులు బౌద్ధమతాల రహస్యజ్ఞానాన్ని సాధన చేసి అనుభవాలు పొంది సిద్ధపురుషుడై తిరిగి తమ దేశానికి వచ్చి ఉన్నాడు. తాను పుస్తకాలలో చదివిన విషయాలను ఆయన అనుభవంలో సంపాదించి ఉన్నాడు.

జీసస్ తన పన్నెండవ ఏట నుంచి ముప్పై ఏళ్ళు వచ్చేవరకూ, 18 ఏళ్ళపాటు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.క్రైస్తవ చరిత్రలో ఈ ఘట్టం ఎక్కడా రికార్డ్ కాబడి లేదు.దానిని వాళ్ళు "మిస్సింగ్ యియర్స్" అంటారు. అన్నేళ్ళు ఆయన ఏమైపోయాడో ఎవరికీ తెలియదు.మామూలు క్రైస్తవులు ఆయనా సమయంలో గెలీలీ లో ఒక వడ్రంగిగా పనిచేస్తున్నాడని భావిస్తారు.కానీ అసలు జరిగింది వేరు.


సత్యమేమంటే - ఆ 18 ఏళ్ళూ ఆయన ఇండియాలోని కాశీ పూరీ మొదలైన క్షేత్రాలలో నివసించాడు.దక్షిణాదికి కూడా వచ్చాడేమో మనకు తెలియదు.కానీ ఉత్తరాదిలో ఆయన నివసించినట్లు ఆధారాలున్నాయి.ఎందుకంటే ఆ రోజుల్లో దైవిక మార్మిక విజ్ఞానానికి భారత దేశమూ ఈజిప్తూ కేంద్రాలుగా ఉండేవి.ఈజిప్టుకు కూడా ఈ జ్ఞానం మన దేశంనుంచే పోయింది.కనుక ధార్మిక దైవ విజ్ఞానానికి మూలకేంద్రమైన మన దేశాన్ని సందర్శించి ప్రాక్టికల్ గా ఆ విషయాలు నేర్చుకోవాలని ఆయన అనుకోవడంలో వింత ఏమీ లేదు.


ఆ విధంగా మన దేశంలో ఉన్న సమయంలో వేదజ్ఞానాన్నీ ఉపనిషద్ జ్ఞానాన్నీ మాత్రమేగాక యోగతంత్ర సాంప్రదాయాల మార్మికజ్ఞానాన్ని ఆయన ఔపోసన పట్టినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత ఆయన టిబెట్ లోని బౌద్ధారామాల్లో ముఖ్యంగా 'హెమిస్ మొనాస్టరీ' లో చాలాకాలం నివసించినట్లు ఆ మొనాస్టరీ లైబ్రరీలో జాగ్రత్తగా భద్రపరచబడి ఉన్న తాళపత్రాలలో స్పష్టంగా వ్రాసి ఉన్నది.


ఈ విషయాలన్నింటినీ పరిశోధించిన వారు కొందరున్నారు.


వీరిలో లూయిస్ జాకోలియట్(1869), నికొలాస్ నోటోవిచ్(1887), లెవి డౌలింగ్(1908),హోల్జర్ కేర్స్టెయిన్ (1981) మొదలైనవారు ప్రముఖులు.వీరంతా కూడా జీసస్ ఆ 18 ఏళ్ళూ ఇండియాలో ఉన్నాడని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.

  
నోటోవిచ్ తన "సీక్రెట్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రీస్ట్" అన్న పుస్తకంలో చాలా ఆధారాలను ఉటంకించాడు.ఆ తర్వాత ఎందఱో పరిశోధకులు పరిశోధించి అది నిజమే అని తేల్చారు.ఎందఱో అహంమదీయా శాఖానుయాయులూ ఇదే చెప్పారు.చివరికి మెహర్ బాబా కూడా ఇదే భావాన్ని నిర్ధారించాడు.జీసస్ సిలువమీద చనిపోలేదనే వీరందరూ చెప్పారు.ఖురాన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించిందని అహంమదీయా శాఖను అనుసరించేవారు ఖురాన్ లోని శ్లోకాలను ఉటంకిస్తూ నొక్కివక్కాణిస్తారు.జీసస్ సమాధి ప్రస్తుత కాష్మీరులోని 'పహల్ గావ్' లో ఉన్నదని కూడా చాలామంది పరిశోధకులు నిర్ధారించారు.

కానీ క్రైస్తవ సమాజం ఈ విషయాలను ఒప్పుకోవడం లేదు.అలా ఒప్పుకోకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి.అలా ఒప్పుకుంటే వాళ్ళ ఐడెంటిటీ పోతుందేమో అన్న భయం దానిలో ప్రధానమైనది.వాళ్ళ భయాలు ఎలా ఉన్నప్పటికీ జీసస్ తనను శిలువ వెయ్యడానికి ముందూ వెనుకా కూడా ఇండియాలో నివసించాడనేది వాస్తవం.అక్కడే కాష్మీరులో మామూలుగా అందరిలాగే చనిపోయాడనేది కూడా వాస్తవం. వ్యాసమహర్షి వ్రాసిన మన "భవిష్యపురాణం" లో కూడా దీనికి ఆధారాలున్నాయి.


ఆ విషయాలన్నీ ప్రస్తుతానికి అలా ఉంచుదాం.


ఆ విధంగా ఇండియా టిబెట్ లలో 18 సంవత్సరాల పాటు సంచరించి జ్ఞానిగా మారి తిరిగి వచ్చిన జీసస్ ను కలుసుకుని ఆయన వద్ద ఉన్న మార్మికజ్ఞానాన్ని పొందిన అదృష్టవంతులలో ప్రధమురాలు మేగ్దలీన్ మేరీ.ఆమె అప్పటికే ఎన్నో మార్మికగ్రంధాలను చదివి,అయినా తన ఆధ్యాత్మిక దాహం తీరక తపిస్తున్న ఒక స్వచ్చమైన ఆత్మ. జీసస్ పరిచయంతో ఆమెకు స్వర్గద్వారాలు ఒక్కసారిగా తెరుచుకున్నట్లు అయింది.తను ఇన్నాళ్ళు వెదుకుతున్న గురువు తన ఎదుట కన్పించాడు.ఆ ఆనందంలో ఆయనకు సర్వార్పణం గావించి ప్రియతమ శిష్యురాలిగా మారింది.


జీసస్ కూడా మిగిలిన పన్నెండుమంది శిష్యులకంటే మేరీని ఎక్కువగా ప్రేమించాడు.ఇందులో దాపరికం ఏమీ లేదు.ఈ విషయాన్ని ఆయన శిష్యులు కూడా ఒప్పుకున్నారు.ఎందుకంటే మిగిలినవారిలో కొంచం అనుమానం, తర్కం,వాదించే గుణం,అహం ఇలాంటి లక్షణాలుండేవి. కానీ మేరీలో అవి లేవు.ఆమె పూర్తిగా జీసస్ తో మమేకం అయిపొయింది.శరణాగతికి మారుపేరుగా మారింది.కనుక తన శక్తిని ఆమెకు ప్రసారం చెయ్యడం సులభమని జీసస్ భావించాడు.


అందుకని, తను ఇండియా టిబెట్ ఈజిప్టులలో సంపాదించిన మార్మిక జ్ఞానాన్ని మొత్తం ఆమెకు నేర్పాడు.మార్మిక దీక్షలిచ్చి ఆమెను అంతరిక ఆత్మమార్గంలో ముందుకు నడిపించాడు. ఆ క్రమంలో ఆమె మిగిలిన పన్నెండుమంది శిష్యులకంటే దైవమార్గంలో ఎంతో ముందుకు వెళ్ళిపోయింది. అది వారిలో కొందరికి రుచించేది కాదు. ముఖ్యంగా సెయింట్ పీటర్, సెయింట్ థామస్ లకు ఈమె వ్యవహారం నచ్చేది కాదు. మగవారైన తమను వదిలేసి ఒక మామూలు స్త్రీ అయిన ఈమెకు జీసస్ అంత విలువనివ్వడం వాళ్లకు మింగుడు పడేది కాదు.ఆ రోజుల్లో స్త్రీలంటే ఆధ్యాత్మిక గ్రూపులలో కూడా చాలా చిన్నచూపు ఉండేది.


స్త్రీలు నోరుతెరిస్తే అబద్దాలు ఆడతారనీ,వాళ్లకు మోరల్స్ ఉండవనీ,వాళ్లకు అసూయ ఎక్కువనీ,వాళ్ళు పుట్టింది మగవాడి ఆనందం కోసమేననే భావనలు ఆనాటి సమాజంలో ఉండేవి.కనుక స్త్రీలకు ఆనాటి సమాజంలో పెద్దగా విలువ ఉండేది కాదు.

జీసస్ శిలువ వెయ్యబడిన తర్వాత జరిగిన కొన్ని చర్చలలో కూడా ఆయా శిష్యులతో బాటు మేరీ కూడా ఉంటుంది.జీసస్ తనకు చెప్పిన బోధలను ఆమె వారికి చెబుతుంది.వారిలో కొందరు ఆమె భావాలతో తీవ్రంగా విభేదిస్తారు.


"ఈ బోధలు చాలా కొత్తగా ఉన్నాయి.ఇవి మనవి కావు.వీటిని జీసస్ ఎప్పుడూ మాకు చెప్పలేదు.నీకెలా చెప్పాడు?వీటిని మేము నమ్మాలా?"- అంటూ ఆమెను ధిక్కరిస్తారు.ఆమె చాలా బాధపడి,కన్నీటి పర్యంతమైపోయి 'నేను అబద్ధాలు చెబుతానని మీరెలా భావిస్తున్నారు?ఆయన ఈ విషయాలను నాతో చెప్పినది నిజమే.' అని నమ్మకంగా చెబుతుంది. అయినా సరే వాళ్ళు నమ్మరు.


అసలు విషయం ఏమంటే - జీసస్ తనకు తెల్సిన విషయాలను అన్నింటినీ ఒకేసారి ఉపన్యాసంలాగా అందరికీ సమానంగా చెప్పలేదు. నిజమైన ఏ గురువూ ఆ విధంగా చెప్పడు. ఎవరెవరి స్థాయిని, రిసీవింగ్ కేపాసిటీనీ బట్టి వారివారికి తగిన బోధను గావిస్తాడు.అది నిజమైన గురులక్షణం. అదే విధంగా జీసస్ కూడా సామాన్య జనానికి "విశ్వాసం" అనే బోధను మాత్రమె ఇచ్చాడు.తనను నమ్మమనీ,తనకు దైవాదేశం ఉన్నదనీ, దైవానుభూతి ఉన్నదనీ,తనయందు విశ్వాసం ఉంచి నిష్కల్మషమైన హృదయంతో ప్రార్ధిస్తే వారికి కూడా తనద్వారా తేలికగా దైవానుభూతి కలుగుతుందనీ చెప్పాడు.అదే నేడు చర్చి బోధనగా మారింది.ప్రపంచం మొత్తం ఈ "విశ్వాస" మార్గాన్నే ఇప్పుడు అనుసరిస్తున్నది.


కానీ అర్హులైన కొద్దిమంది అంతరంగికులకు మాత్రం ఆయన తన వద్దనున్న మార్మిక జ్ఞానాన్ని డైరెక్ట్ గా పంచిపెట్టాడు.వారికి రహస్యమైన మార్మిక దీక్షలిచ్చాడు. అంతరిక ప్రపంచంలో ఎలా ముందుకు నడవాలో దగ్గరుండి వారికి నేర్పించాడు.వారిని చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించాడు.ఆ దీక్షలన్నీ తాను ఇండియా టిబెట్ లలో నేర్చుకున్న యోగతంత్రమార్గాలే.వాటిని జనసామాన్యానికి ఆయన ఓపన్ గా బోధించలేదు.అలా చేస్తే - ఏదో విదేశీ మతాలను ఆయా పద్ధతులను తమమీద రుద్దుతున్నాదన్న కోపంలో ఆయన్ను వెంటనే చంపుతారని ఆయనకు తెలుసు. అప్పటికీ పైపైనే ఆయన వైదిక బౌద్ధమతాల బోధనలను ఆ దేశంలో చెప్పాడు.ఆ కొద్దిమాత్రానికే ఆయన్ను శిలువ వేశారు.ఇక ఆయా మతాల రహస్య సాధనలను బాహాటంగా బోధిస్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు.కనుక వాటిని తనకు బాగా దగ్గరైన ఇన్నర్ సర్కిల్ శిష్యులకు మాత్రమె బోధించాడు.


మళ్ళీ వాటిల్లో కూడా బాగా శక్తివంతములైన రహస్యములైన సాధనా విధానాలను మేరీ వంటి తన అంతరంగిక శిష్యులకు మాత్రమే నేర్పించాడు గాని అందరికీ నేర్పలేదు.


ఈ విధంగా ఆయన తన శిష్యులలో కూడా తరతమ భేదాలను బట్టీ వారివారి వ్యక్తిత్వాలను బట్టీ రిసీవింగ్ కెపాసిటీని బట్టీ బోధనలు మార్చుకుంటూ వెళ్ళాడు. ఆయనే కాదు ఏ సద్గురువైనా ఇదే చేస్తాడు.


నేను 1982-87 మధ్యలో గుంతకల్ లో ఉన్న రోజుల్లో నా శిష్యులలో కొందరు క్రిష్టియన్స్ ఉండేవారు.నేను హైస్కూలు రోజుల్నుంచే బైబిలు బాగా చదివాను.బైబుల్లో ఏ చాప్టర్ లో ఏముందో నేను చూడకుండా చెప్పేవాడిని.న్యూ టెస్టమెంటులో చాలాభాగం నాకు నోటికి వచ్చు.అంతగా ఆ పుస్తకాన్ని తిరగా మరగా చదివాను.


ఆరోజులలో నా శిష్యులను ఒక మాట అడిగాను.

'తన శిష్యులకు జీసస్ ఏ సాధనా విధానాన్నీ బోధించినట్లు బైబుల్లో ఎక్కడా కనబడదు.తనను నమ్మమని మాత్రమె ఆయన చెప్పాడు.కాకపోతే జీవితంలో పాటించవలసిన నీతినియమాలను గురించి మాత్రం "కొండమీద చేసిన ప్రసంగం"లో చెప్పాడు.అంతేగాని మార్మికమైన సాధనా విధానాలను తన శిష్యులలో ఎవరికీ ఎక్కడా ఉపదేశించినట్లుగా కనబడదు.ఏమిటీ వింత?అంత గొప్ప మహనీయుడు అలాంటివి ఏవీ చెప్పకుండా ఎలా ఉంటాడు?తన శిష్యులకు తనను నమ్మి అనుసరించినవారికీ ఏ ఉపదేశమూ ఇవ్వకుండా ఎలా ఉంటాడు? కనుక ఇందులో ఏదో మర్మం ఉన్నది.ఒకవేళ ఆయన చెప్పినా కూడా అవి చరిత్రవెలుగును చూడలేదా? కప్పబడిపోయాయా?లేదా ధ్వంసం చెయ్యబడ్డాయా?ఎందుకంటే తనకు నచ్చని ఎంతో మెటీరియల్ ను ఆవిధంగా చర్చి ధ్వంసం చేసినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి.ఈ విషయంలో మీకేమైనా తెలుసా?'


ఈ ప్రశ్నలకు వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళేదో మామూలు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాళ్ళు,వారానికొకసారి చర్చికెళ్ళి ప్రార్ధన చేసుకుని వచ్చే బాపతు మామూలు మనుషులు, వాళ్ళకీ లోతుపాతులు అర్ధం కాలేదు. అందుకని నేనడిగిన ప్రశ్నలకు వాళ్ళు బిక్కమొహం వేశారు.వాళ్లకు విషయం తెలియదని అర్ధమై నేనూ మౌనం వహించాను.


నిజమేమంటే -- జీసస్ తన మార్మికజ్ఞానాన్ని అత్యంత అర్హులైన అతి కొద్దిమందికి మాత్రమే అందించాడు.మిగతా శిష్యులకు 'విశ్వాసం' అన్నదాన్ని మాత్రమే ఇచ్చాడు,రెండవదైన "మార్మికజ్ఞానం"అన్నదానిని కొందరికే రుచిచూపించాడు.వారిలో ఆయన ప్రియశిష్యురాలైన మేరి ఒకతి. ఆమెకూడా తనకు తెలిసిన విషయాలను 'గాస్పెల్ ఆఫ్ మేరీ' గా వ్రాసింది.కానీ పురుషాధిక్య అపోస్తలుల ప్రభావం ముందు ఒక స్త్రీ వ్రాసిన గాస్పెల్ భూస్థాపితమై పోయింది.


దాదాపు 2000 సంవత్సరాల తర్వాత కైరో త్రవ్వకాలలో బయటపడేసరికి మేరీ గాస్పెల్ కొన్ని పేజీలు ధ్వంసమై ఉన్నాయి.లేదా వాటిని ముందుగా చదివిన క్రైస్తవులు వాటిని కావాలని ధ్వంసం చేసి ఉండవచ్చు.ఎందుకంటే తమ నమ్మకాలకు వ్యతిరకంగా ఉన్నట్టి విషయాలను అవి క్రైస్తవం అయినా సరే తట్టుకోలేని మనస్తత్వం వారిలో ఉంటుంది.


నమ్మకానికీ సత్యానికీ యుద్ధం జరిగితే నమ్మకమే గెలుస్తుంది గాని సత్యం గెలవలేదు. ఎందుకంటే నమ్మకం మూర్ఖంగా ఉంటుంది.సత్యం చాలా సున్నితమైనది.కనుక గెలుపు ఎప్పుడూ నమ్మకానిదే అవుతుంది.


జీసస్ తన అంతరంగశిష్యులతో చెప్పిన బోధనలలో పునర్జన్మ ఉన్నదనీ, ఆత్మ జననమరణ చక్రంలో తిరుగుతుందనీ,తనలోని మాలిన్యాన్ని వదిలించుకునేవరకూ ఆత్మకు జన్మలు తప్పవనీ,సాధనామార్గంలో తనను తాను ప్రక్షాళన చేసుకుని దైవాన్ని చేరుకునేవరకూ ఈ చక్రభ్రమణం తప్పదనీ చెప్పాడు.అయితే మిగతా బయటవారికి చెప్పిన బోధలలో మాత్రం ఇవే విషయాలను సూచనాప్రాయంగా మార్మికంగా మాత్రమె చెప్పాడు.వాటిని వారి నమ్మకాలకు తగినట్లుగా
వారు  అన్వయించుకున్నారు.అదే పాపులర్ క్రైస్తవం అయి కూచుంది.ప్రపంచం దీనినే అనుసరిస్తున్నది.

క్రీస్తు చెప్పిన రహస్యబోధలలో కర్మ ఉన్నది.పునర్జన్మ ఉన్నది.ఆయన మూడుశక్తులు(త్రిమూర్తులు) ఉన్నాయని చెప్పాడు.వాటినే Wisdom (బ్రహ్మ),Love(విష్ణు),Strength(రుద్ర) అన్నాడు.ఇవే ఇండియాలో ప్రసిద్ధి గాంచిన జ్ఞానమార్గం,భక్తిమార్గం,యోగ(తంత్ర)మార్గం అనబడే మూడు దారులు.


ఆత్మను గురించి,అంతరిక సాధన గురించి,ముక్తిని గురించి చెప్పాడు.క్రీస్తు చెప్పిన ఈ రహస్యబోధనలకూ హిందూమతపు మౌలికబోధలకూ ఏమీ భేదం లేదు.రెండూ ఒకటే.కారణం ఏమంటే జీసస్ మన దేశంనుంచే ఈ భావాలను గ్రహించాడు.

అయితే మేరీ చెప్పిన ఈ విషయాలతో విభేదించిన జీసస్ శిష్యులు ఆమెను గద్దించి నోరు మూయించారు.తమకు ఆయన చెప్పిన "విశ్వాసపరమైన" బోధలను మాత్రమె వారు లోకంలో ప్రచారం గావించారు.ఆ విధంగా జీసస్ కు తెలిసిన రహస్య మార్మికవిజ్ఞానం కొందరికే పరిమితం అయిపొయింది.ఆ తర్వాత మేరీ ఏమైందో ఎక్కడా రికార్డు లేదు.


కానీ జీసస్,తన తల్లి మేరీతోనూ,తన ప్రధాన శిష్యురాలూ ప్రియురాలూ అయిన మేరీతోనూ  తన శిష్యులు సెయింట్ బార్తోలోము (నతానియేల్), సెయింట్ ధామస్ లతో కలసి ఇండియాకు వచ్చేసి కాశ్మీరులో చాలాకాలం నివసించి తన నూట ఇరవయ్యవ ఏట అక్కడే కన్నుమూశాడు.ఇది నిజం. వీరిలో సెయింట్ బార్తోలోమును పర్షియాకు పంపించాడు.సెయింట్ ధామస్ ను ఇండియాలో దక్షిణాదికి పంపించాడు.ఆయన దక్షిణాదికి వచ్చి మద్రాసు మైలాపూరులో ఒక కొండ మీద నివాసం ఏర్పాటు చేసుకుని తమ భావాలను ప్రచారం చేస్తూ మద్రాసు లోనే కన్నుమూశాడు.ఆయన చనిపోయిన ప్రదేశమే ప్రస్తుతం 'సెయింట్ థామస్ మౌంట్' గా మద్రాసులో భాగంగా ఉన్నది.


జీసస్ చెప్పిన అసలైన రహస్య బోధలకు నేటి క్రైస్తవం పూర్తిగా విరుద్ధమైన భావాలను నమ్ముతున్నది.అనుసరిస్తున్నది.కానీ క్రైస్తవంలో ఒక శాఖ అయిన Gnostic Church మాత్రం జీసస్ యొక్క అసలైన ఈ రహస్య బోధలనూ భావాలనూ నమ్ముతున్నది.అనుసరిస్తున్నది.వీరి భావాలు మన హిందూమతపు  మౌలిక భావాలకు చాలా దగ్గరగా ఉంటాయి.వీరు కర్మను నమ్ముతారు.పునర్జన్మను నమ్ముతారు.త్రిమూర్తులను (రూపాలతో కాకుండా) నమ్ముతారు.శక్తిని నమ్ముతారు. ఇవన్నీ మన భావాలే.


కానీ మెజారిటీ క్రైస్తవులు వీటిని ఇంకా ఒప్పుకోవడం లేదు. Gnostic Church నీ,Nag Hammadi Tradition నూ,Dead Sea Scrolls నూ వాళ్ళు విశ్వసించడం లేదు.అలా ఒప్పుకుంటే వేలాది సంవత్సరాలుగా వాళ్ళు నమ్ముతున్న భావాలను వాళ్ళు సమూలంగా మార్చుకోవలసి వస్తుంది.అది వాళ్ళ మతానికి మౌలికమైన దెబ్బ అవుతుంది.


నమ్మకం ముఖ్యమా? లేక  సత్యం ముఖ్యమా? వాళ్ళు తేల్చుకోవాలి.


మన నమ్మకం అసత్యం అని తెలినప్పుడు ఆ నమ్మకాన్ని వదులుకొని సత్యాన్ని అనుసరించడమే ఉత్తమమైన పని.కానీ మనుషుల అహం వారిని అలా చెయ్యనివ్వదు.


ఒక ఉదాహరణ !!

మకర సంక్రాంతి నాడు శబరిమల కొండపైన కనిపించే జ్యోతిని చూడాలని వేలాదిజనం వేలంవెర్రిగా ఎగబడి కొంగల్లాగా మెడలు నిక్కించి చూచే ప్రయత్నంలో ఆ తొక్కిడిలో లోయల్లో పడి అనేకమంది ఇప్పటికి కన్ను మూశారు.ఆ తర్వాత జరిగిన గొడవల్లో-"అక్కడ మనుషుల్ని పెట్టి ఆ పనిని మేమే చేయిస్తున్నాము,అక్కడ బస్తాలలో కర్పూరం పోసి వెలిగిస్తున్నది మేమే" అని కేరళ గవర్నమెంట్ పబ్లిగ్గా కోర్టులో ఒప్పుకుంది.కనుక మకరజ్యోతి పచ్చిఅబద్ధం అని తేలిపోయింది.

అయినా సరే కరుడుగట్టిన అయ్యప్ప భక్తులు ఈనాటికీ ఆ జ్యోతి బూటకమని తెలిసినా సరే దానికోసం ఎగబడుతూనే ఉన్నారు. "ప్రభుత్వం వెలిగించకపోతే మేమే వెలిగించుకుంటాం.ఆ జ్యోతి బూటకం అయినా సరే.దానిని మేం చూడాల్సిందే."- అని అంటున్నారు.మనుషుల మూర్ఖత్వమూ అజ్ఞానమూ ఆ స్థాయిలో ఉంటాయి.

నమ్మకాలను - అవి నిరాధారాలూ అబద్ధాలూ అని తెలిసినా సరే - మనుషులు మార్చుకోలేరు.క్రైస్తవులకూ అయ్యప్ప భక్తులకూ అజ్ఞానంలో ఏమీ తేడా లేదు. దొందూ దొందే.

అన్నిమతాలూ అజ్ఞానపు నమ్మకాలనే అనుసరిస్తున్నాయి గాని నిజమైన దైవజ్ఞానాన్ని అవి అనుసరించడం లేదన్నది స్పష్టం.


ప్రపంచం తమ అసత్య నమ్మకాలను మార్చుకోగలిగిన పరిపక్వస్థితికి ఎదిగినప్పుడు మాత్రమే, నిజమైన క్రీస్తు బోధనలను అది అనుసరిస్తుంది. అప్పుడది సనాతనధర్మాన్నే అనుసరిస్తున్నట్లు అవుతుంది.

ఏదో నాటికి సత్యాన్ని అనుసరించడం ఎవరికైనా తప్పదుగా మరి !!