“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

6, జనవరి 2016, బుధవారం

ఈ పచ్చని పల్లెచేలు...

ఈ కాలపు పిల్లలు కోల్పోతున్నవి ఎన్నో ఉన్నాయి.వారికి పుట్టుకతోనే మొబైలూ,కంప్యూటరూ, అంతర్జాలమూ, మేసేజిలూ, సమాచార బదిలీలూ తెలిసి ఉండవచ్చు.కానీ ఇవేవీ తెలియని పాత తరాల పల్లెటూళ్ళలో ఎంత అందమైన జీవితం ఉండేదో వారికి తెలియదు.

డబ్బూ,భవనాలూ,హంగులూ,కార్లూ,హోటళ్ళ చుట్టూ షికార్లూ ఇవేవీ తెలియకపోయినా ఎంత ఆనందంగా ఆనాటి జీవితాలు గడిచేవో వారు ఊహించలేరు.గుడిసెలలో,మట్టిమిద్దెలలో, కుగ్రామాలలో ఉన్నా,ఆరోజుల ఆత్మీయతలు, అనుబంధాలు ఎంత మధురంగా ఉండేవో,గంజినీళ్ళు మాత్రమే త్రాగినా ఆ జీవితాలు ఎంత తృప్తిగా గడిచేవో  ఈనాటి తరానికి అర్ధం కాదు.

అందుకే - ఆనాటి పల్లెటూళ్ళ జీవితాలను గుర్తు తెచ్చుకుంటూ, ఆరోజులలోకి ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి వ్రాస్తున్న ఈ కవిత.
-----------------------------------

ఈ పచ్చని పల్లెచేలు
ఈ గాలుల పరిమళాలు
ముసినవ్వుల గడ్డిపూలు
గలగలమను నీటివాలు

పల్లెపడుచు సోయగాలు
మచ్చలేని మానసాలు
నశ్వరమౌ లోకంలో
భగవంతుని చేతివ్రాలు

మిద్దె ఇళ్ళ సౌందర్యం
మనసులలో ఐశ్వర్యం
మంచితనపు మల్లెపూలు
మరపురాని మురిపాలు

సద్దులేని సంతసాలు
ముద్దులొలుకు జీవితాలు
గతితప్పిన లోకానికి
అందరాని సుదూరాలు

అమ్మచేతి చిరుముద్దలు
కమ్మనైన తొలిప్రేమలు
చెట్టుపుట్ట స్నేహాలు
మట్టిమనసు మోహాలు

తొలియవ్వన పరిమళాలు
నిదురించని జ్ఞాపకాలు
వెన్నెల రాత్రుల మాటున
వెంటాడే అనుభవాలు

మట్టివాసనలు మోసే
మధురమైన చల్లగాలి
మనసు విప్పి చెప్పలేక
ఒదిగిపోవు చెలి కౌగిలి

చెలిచూపుల విరితూపులు
అరవిరిసిన మరుమాలలు
కల్మషమెరుగని వలపులు
కలల తేలియాడు తలపులు

మాయమర్మమెరుగనట్టి
మరపురాని వదనాలు
చెట్లనీడలను మెట్టిన
స్వర్గతుల్య సదనాలు

పట్నవాస మసిసోకని
పల్లెవాటు జీవితాలు
ప్రకృతిమాత లాలనలో
పరవశించు పావురాలు

నాగరికతలే ఎరుగని
నాణ్యమైన మనసులు
సోమరితనమే తెలియని
స్వచ్చమైన మనుషులు

భూమిమీద స్వర్గమంటె
ఎక్కడనో లేదంటా
గతకాలపు పల్లెటూళ్ళ
ముంగిటనే ఉందంటా...