“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, జనవరి 2016, గురువారం

నేటి గతం...

చిన్నప్పటినుంచీ - నాలో నేనుగా ఉన్న క్షణాలలో - నన్ను నేను మరచిపోయి ప్రకృతిలో ఒక భాగంగా మిగిలిన సమయాలలో - అకస్మాత్తుగా సహజంగా spontaneous గా నాలో కలిగిన అనుభవాలను ఈ కవితలలో అక్షరబద్ధం గావించే ప్రయత్నం చేశాను.అంతేగాక - పడిన బాధలనూ,ఎదురైన వంచనలనూ, గురైన మోసాలనూ,దిగమ్రింగిన అవమానాలనూ కూడా కలగా పులగంగా వ్రాసే ప్రయత్నం చేశాను.

అనుభవం ఎన్నటికీ పూర్తిగా అక్షరంగా మారదు.కానీ నావంతుగా కొంత ప్రయత్నం చేశాను.ఇవన్నీ అంతరికానుభవాలు. అందుకోగలిగిన వారికే ఇవి అర్ధమౌతాయి.అలాంటి వారికోసమే ఈ గతస్మృతుల కవితావల్లరి.
------------------------------------
ఏ లోకపువో తెలియక
వినిపించిన శబ్దాలు
గుర్తొచ్చీ రాకుండా
విసిగించిన స్వప్నాలు

మాసిపోని గతకాలపు  మాయలు
జ్ఞాపకాల కలల మేని ఛాయలు
వర్తమానపు ఏకాంతసౌధం లోకి
మౌనంగా అడుగేసిన గతకాలపు నీరెండ

సూర్యుని కిరణాలపైన
ఏనాటివో గాలి ఊసులు
సుతారంగా జారి దిగిన
అర్దమవని మౌనభాషలు

గాలీ నీరూ ఎండా వానా
చెప్పాయి ఏవేవో మాటలు
అర్ధం చేసుకునే ప్రయత్నంలో
ఎదురొచ్చాయి గతపు బాటలు

తెలియని గమ్యపు పిలుపులు
తెలిసీ తెలియని అడుగులు
దిగంతాల అంచులలో
దేన్నో వెదికిన చూపులు

కొత్త కొత్త మనుషులు
అవే అవే పాత్రలు
మరపురాక మరువలేక
రోదించిన వేదనలు
--------------------------

మంత్రసాధనలు ఇచ్చిన
మరపురాని అనుభవాలు
అలుపులేక అరిగిపోక
అరుదెంచిన జ్ఞాపకాలు

నడకలలో పాదాలకు
గుచ్చుకున్న కోసురాళ్ళు
దాహాలను తీర్చలేక
దైన్యంగా రాతిగుళ్ళు

దారీ తెన్నూ తెలియక
తిరిగిన తొలి జ్ఞాపకాలు
ప్రతిచోటా వెంటాడిన
ఎన్నెన్నో వ్యాపకాలు

మంత్రకట్టు మాయ నెరిగి
నవ్వుకున్న వైనాలు
మనసు గుట్టు లోయలలో
రివ్వుమన్న యానాలు
--------------------------

చెరువుగట్టు స్నేహంలో
తెరచుకున్న లోకాలు
ఒంటరి రోజులు నేర్పిన
ఓపలేని పరవశాలు

మండువేసవుల రోజుల
మహామౌన స్థావరాలు
చలిరాతురు లందించిన
తొలిజన్మల జ్ఞాపకాలు

తొలకరి ముసురులు తెచ్చిన
తీపి వేదనల జల్లులు
ఒంటరిగా నడయాడిన
అంతులేని పంటచేలు

మల్లియలై మదిదోచిన
చెలియ మేని సుగంధాలు
వెల్లువలై ఉబికొచ్చిన
గతకాలపు అనుభవాలు

అన్నీ గుర్తుకు తెచ్చిన
అందమైన పరిసరాలు
ఆప్తులెవరు కానరాక
విలపించిన వత్సరాలు
-----------------------------

చెదరిన గుండెకు తోడై
దరిచేరిన ప్రియురాలు
ఎడబాటును తలచితలచి
ఎగసిపడిన హృదయాలు

ఎవరూ పలకని శూన్యం
దారే తెలియని దైన్యం
మాకు మేము దీపాలం
మాటరాని శోకాలం


అనుకోకుండా ముగిసిన
ఆరోజుల బంధాలు
అనుకోడానికి మిగలని
నేటి ఓటి బంధుత్వాలు

వెల్లడైన వాస్తవాలు
అర్ధమైన మానసాలు
కళ్ళు తెరుచుకున్న రోజు
కనిపించిన కల్మషాలు
------------------------------

ఏం చెయ్యాలో ఎరుగక
తెగ ఏడ్చిన నిశిరాత్రులు
ఎలా కడగాలో తెలియక
వగ మిగిలిన మసిపాత్రలు

ఎన్నో జన్మల నుంచి
ఎగిరొచ్చిన వలపు విరులు
ఎవరికి చెప్పాలో తోచక
దిగమింగిన తలపు తెరలు

మందు లేని రోజులలో
మనసుకైన గాయాలు
విందులేవి లేకుండా
గడచినట్టి ప్రాయాలు

ఉప్పొంగిన ఆవేశం
ఓదార్చిన ఆకాశం
కన్నీరార్పిన ఆకలి
చెయ్యందించిన జాబిలి
---------------------------------

ధ్యానమిదని నేర్పించిన
చీకటి చుక్కల రాత్రులు
మౌనం విలువను తెలిపిన
ఒంటరి రోజుల యాత్రలు

ఒకరోజున స్పందించిన
తెలతెల్లని మేఘాలు
ఒక్కసారి స్తంభించిన
వెయ్యి కాలగమనాలు

ఏకాంతపు పరుగులలో
ఎగిరొచ్చిన అతీతాలు
అప్పటికపుడే మెరిసిన
అంతులేని అనుభవాలు

నన్ను ఒదిలి అడుగేసిన
ఇంకొక నేను
అన్ని మరచి నిలిచి ఉన్న
నాలో నేను
----------------------------

బరువునంత కడిగింది
మాటరాని చెరువు
మదిని తట్టి లేపింది
మనిషి కాని చెట్టు

ఆనందం నేర్పించిన
అంతులేని ఆకాశం
ఒంటరితనమే తానొక
అందమైన అవకాశం

మహామంత్రమై ఎగసిన
చెరువు నీటి గలగలలు
నీటిగాలిలో సోకిన
చెలియ మేని మిలమిలలు

చిరుగాలికి కదలాడిన
ఆకాశపు చిరుగంటలు
ఆ శబ్దంలో మెరిసిన
ఓంకారపు వింత ధ్వనులు

మనసు లయం అందించిన
సాయంకాలపు సంజెలు
వయసు పరుగు లాపించిన
ప్రాణమధన విద్యలు

భయమేలని ఓదార్చిన
చీకటిలో మర్రిచెట్టు
అర్ధరాత్రి అద్భుతాన
విడిపోయిన కనికట్టు

ప్రత్యాహారం నేర్పిన
పల్లెటూరి చెరువు గట్టు
మనసు మాయమైపోగా
జారిన లోకపు పట్టు

కృత్రిమ ధ్యానాల తోటి
కుదరనట్టి ఏకాగ్రత
స్వచ్చమైన ప్రకృతి ఒడి
అందించిన తాదాత్మ్యత

చీకటి రాత్రులు పలికిన
కీచురాళ్ళ శబ్దాలు
ఒంటరైన చెరువు నీరు
చూపించిన చిత్రాలు

మినుకు మినుకుమని మెరిసిన
చీకటిలో చిరు వెలుగులు
తేలియాడుతూ తాకిన
మధురమైన రాగాలు

నిశీధిలో ఎదురొచ్చిన
ఒక ఒంటరి యువతీ
ఈ లోకపు ధ్యాస లేని
ఏవో చూపుల పడతి

దేని కోసమో తెలియని
నిర్లిప్తపు ఎదురుచూపు
ఎదుట మనిషి నిలుచున్నా
గుర్తించని చింతతోపు

ఆత్మలతో ప్రయోగాలు
ఆ లోకపు అనుభవాలు
చీకటింట నడయాడిన
చీర చెంగు రెపరెపలు

అనుభవాలు పంచుకున్న
అశరీరుల ఆక్రందన
విసుగుపుట్టి చాలించిన
విగత జీవ విశ్లేషణ

కుప్ప నూర్చినట్టి చేలు
అస్తమించు వెలుగుతెరలు
అనంత లోకాల నుంచి
అలలు అలలుగా పిలుపులు
-----------------------------

ముసురున మునిగిన రోజులు
ఎదురొచ్చిన పాతగతం
చీకటి రాత్రుల మెరుపులు
కనుల ముందు చివరి నిజం

సడి చెయ్యని నడిరాతిరి
పెనుగాలై దరిచేరింది
భయమే భయపడి భయపడి
వీపు వెనుక దాక్కుంది

చుక్కల పందిరి క్రింద
చుట్టూ చీకటి ముసుగు
మధ్యలోన మాటలేని
మౌనంగా ఒక చూపు

నిశ్శబ్దపు పగటిపూట
నిర్ణిద్రపు మౌనంలో
సుదూరాల దిగంతాల
ఎలుగెత్తిన పొలికేక

మధ్యాహ్నపు మౌనంలో
మలిగిపోని చైతన్యం
నిద్రించే లోకంలో
నిద్రించని నిర్దుష్టం

ఉందోలేదో తెలియని
ఉట్టిమీది లోకంలో
ఉన్నా లేనట్టున్న
ఉలుకులేని ఒక్క ఉనికి

మౌన సముద్రపు అడుగున
ఒక శబ్దపు నాట్యం
గందరగోళపు మడుగున
నిశ్శబ్దపు లాస్యం

చలనంలో అచలత్వం
శబ్దంలో నిశ్శబ్దం
మాట చాటునే మౌనం
నిత్యం నడిచే ధ్యానం
----------------------------

ఉదయాన్నే ఉత్సాహం
మధ్యాహ్నపు ఏకాంతం
సాయంత్రపు వైరాగ్యం
రాత్రి మౌన చైతన్యం

మాటల ఎల్లలు దాటిన
మత్తుకళ్ళ చిన్నదాన్ని
మనసు అందిపుచ్చుకోని
మౌనపు జత కట్టింది

మనసు పడిన చిన్నదాని
సహవాసపు సంయోగం
మరపురాని అనుభవాలు
అందించిన ఉపదేశం

నిశిరాత్రుల మౌనంలో
వర్షపు చినుకుల శబ్దం
నిద్రను దూరం చేస్తూ
నన్నే నాకందించింది

ఎటూ ఎవరూలేని ఏకాంతం
సృష్టినే శూన్యంగా మార్చి
ఎప్పటినుంచో ఉన్న నేనును
నా ఎదుటే నిలిపింది
-----------------------------

ప్రయత్నాలెన్ని చేసినా కానిది
ప్రయాసలెన్ని పడినా రానిది
ప్రతిక్షణం నేనున్నానంటూ
ఒక్క క్షణంలో నాకందింది

ఎందఱో పిలిచినా పలకనిది
ఎందరు చేయిసాచినా దక్కనిది
ఒక్కడినే ఉన్న నా మదిలో
ఒక్కసారిగా తానై ఉబికింది

ఎన్నో చదవడమెందుకు
ఎచటో వెదకడమెందుకు
నీతోనే ఉన్నానని
తనే ఎదుట నిలిచింది

అన్ని ప్రశ్నలాగిపోయి
మనసు పొరలు జారిపోయి
చెప్పలేని దేదో ఒకటి
చెంతకు నను చేర్చుకుంది
-----------------------------

త్యాగధనుల చెంత నిలిచి
నేర్చుకున్న పాఠాలు
తిరుగుబోతు స్నేహితులే
నేర్పించిన వేదాలు

గురువర్యులు గావించిన
అద్వితీయ ఆత్మబోధ 
జీవితమంతా వదలక
వెంటాడే దివ్యగాథ

జీవితమంటే నేర్పిన
మహనీయుని వాక్కులు
వేదాలను వదలిపెట్టి
ఎగిరొచ్చిన ఋక్కులు

ప్రేమలేని లోకంలో
ప్రేమకొరకు వెదుకులాట
మరువలేని మనుషులకై
పాడినట్టి లాలిపాట

మనసును గమనించలేని
పిచ్చి మొద్దు మనసులు
మనిషిని గుర్తించలేని
మహా పెద్దమనుషులు

ప్రేమ ముసుగు వేసుకున్న
పచ్చి స్వార్ధ పిశాచాలు
ఆశల వలలో చిక్కిన
ఆధ్యాత్మిక నమూనాలు

లోకం మెప్పును కోరే
సాంప్రదాయ వేషాలు
కోరికలను దాటలేని
చాపక్రింద మోసాలు

పిల్లవాడిననుకున్న
పెద్దవారి దర్పాలు
హద్దులేని ప్రశ్నలతో
సర్దుకున్న సర్పాలు

ఇల్లు చక్క దిద్దలేని
ఇరు సంధ్యల వందనాలు
మనసులోన మార్పు తేని
గ్రంధపఠన బంధనాలు
----------------------------- 

ఆడవారి సావాసాలు
అడ్డదారి సాహసాలు
ఆధ్యాత్మిక ప్రహసనాలు
అందించిన అనుభవాలు

సాధనలో శాంతి కోరి
ఆహుతైన జీవితాలు
బ్రతుకంతా పణమైనా
అందరాని విజయాలు

పతివ్రతల జీవితాల
పరారైన ఔన్నత్యం
పతితల బ్రతుకుల మాటున
పరమ హృదయ వైశాల్యం

ఔన్నత్యపు తెరచాటున

నిమ్నత్వపు నీచత్వం
నేలబారు నడకలలో
నింగి వెలుగు నిత్యత్వం

అర్దమవని చాదస్తం
అచ్చిరాని వైదీకం
అసలు సిసలు వైరాగ్యం
అందించిన ఆనందం

నచ్చని పూజల తంతులు
పచ్చిక బయళ్ళ రాత్రులు
వెచ్చని నెచ్చెలి కౌగిలి
మెచ్చిన వేల్పుల లోగిలి

ఆలయాల గదులలోన
కానరాని దివ్యత్వం
ప్రతి ఊహకు స్పందించిన
ప్రకృతిమాత నవ్యత్వం
-----------------------------

పుస్తకాలు చదివి చదివి
నమ్మినట్టి రోజులు
అనుభవాల గీటురాయి
నవ్వుకున్న నవ్వులు

చీకాకును రప్పించిన
అల్పత్వపు బ్రతుకు వెతలు
చిన్ని చిన్ని మాటలలో
చిగురించిన వెలుగు లతలు

ఏనాడూ బోధపడని
జీవితాల ప్రహసనాలు
ఎందుకోసమో తెలియక
బ్రతుకొక్కటి బుగ్గిపాలు

బ్రతుకు మీద ఆశ చచ్చి
సిద్ధపడిన క్షణాలు
ముద్దు మాటలే నేర్పిన
ముఖ్యమైన నిజాలు

ప్రేయసి కౌగిలి నేర్పిన
అచ్చమైన శరణాగతి
తంతులన్ని వదిలించిన
అసలు సిసలు పై తరగతి

విలయ విలువ బోధించని
తొలి గురువుల సమూహాలు
చెలియ కలువ నేర్పించిన
హృదయ లయల సరాగాలు 
-----------------------------

బ్రతుకులనే నడిపించే

స్వార్ధపు సందర్శనాలు
మెతుకులు కూడా దొరకని
రోజుల నీ దర్శనాలు

కరగినట్టి మది ఆశలు
తరిగినట్టి తుది శ్వాసలు
మలిగిన ఒక హృదయంలో
వడలినట్టి కడచూపులు

నమ్మకాల సుడుల మధ్య
మునిగిందొక జీవితం
జన్మరహస్యం తెలియక
ముగిసిందొక జీవితం

ఆశల బంధాల మధ్య
నలిగిందొక జీవితం
ఆకలిదప్పుల బరిలో
ఆవిరొక్క జీవితం

అంతులేని పయనంలో
నావ ఒక్క జీవితం
ఎంత మింగినా తీరని
ఆకలొక్క జీవితం

సొంతవారి చేర్పు కోరి
వెదికిందొక జీవితం
పంతపు పట్టింపులలో
ముగిసిందొక జీవితం
--------------------------------

కనులముందు కదలాడిన
ఒక్కనాటి పాపాలు
ఆశలుడిగి మసిబారిన
లెక్కలేని దీపాలు

కపట ప్రేమలలో చిక్కి
కరిగిందొక కాలం
అన్నీ తెలిసే నాటికి
ఆవిరైందొక ప్రాణం

చేజారిన మధుపాత్రలు
చేయివిడిన మదవతులు
చెంత నిలిచినా కూడా
చేరలేని అభాగినులు

భయపు బరువుతో కొందరు
పొగరు మరుగునే కొందరు
స్వార్ధ పరులు ఇంకొందరు
దరికి రారు వీరెవ్వరు
-----------------------------

నువ్వు కోరుకున్నవారు
ఈ రోజున మిగిలిలేరు
నిన్ను కోరుకున్నవారు
ఏనాడో మలిగినారు

అన్నీ తెలిసే నాటికి
దేనిపైనా ఆశుండదు
అన్నీ అమరేనాటికి
ఆకలంటూ అసలుండదు

ఆశించినవన్నీ అందిన
అందమైన ఒక రోజున
ఎందుకివన్నీ అంటూ
నీ మనసే అడుగుతుంది

ఎందుకిలా జీవితాన్ని
వృధగా గడిపావంటూ
చరమాంకంలో నిన్ను
నీ ఆత్మే కడుగుతుంది

అన్నీ ఉన్నా ఏమీ లేకుండా
ఏదీ లేకున్నా ఏమీ కాకుండా
ఉండే విద్య తెలిసినపుడు
జీవితంలో భయమేముంటుంది?
--------------------------------

ఎన్నిలోకాలు తిరిగినా
నీలోకే నువ్వు తిరిగి రావాలి
ఎన్ని యుగాలు గడచినా
ఇక్కడే ఇంకొక జన్మనెత్తాలి

ఎన్నిసార్లు ఆడమన్నా
ఆడుతాను ఈ ఆటని
ఎన్నిసార్లు పాడమన్నా
పాడుతాను ఈ పాటని

చావే తావైనప్పుడు
చావంటే భయమెందుకు?
నీవే తానైనప్పుడు
నావై తేలడమెందుకు?

ఓటమి నెరుగని వాడికి
ఆటంటే భయమెందుకు?
నాటకమే తనదైనప్పుడు
నటనంటే విసుగెందుకు?

బంధమే లేనప్పుడు
మోక్షాన్ని కోరడమెందుకు?
అంతమే తానైనప్పుడు
అన్యంగా మారడమెందుకు?
--------------------------------