నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, ఫిబ్రవరి 2016, సోమవారం

ఊహ

సాయంత్రం వచ్చింది
చీకటి పడింది
నీ జ్ఞాపకాలు
నన్నావరించాయి

వెలుగుతో కూడిన

పగటి కంటే
చిమ్మ చీకటి
రాత్రే ఆనందం

కనిపించే నీకంటే
కనరాని నీ ఊహే
ఆమోదం

చెంత చేరినా
అర్ధం చేసుకోని నీకంటే
నిజం కాకున్నా అలరించే
నీ జ్ఞాపకమే మనోజ్ఞం

చేదు వాస్తవం కంటే
తియ్యని స్వప్నమే ఉత్తమం
ఏడిపించే నిజం కంటే
అలరించే అబద్ధమే ఉన్నతం

అందుకే
నాకెప్పుడూ కనిపించకు
అలా కనిపించి
నా ఊహలలోని నిన్ను దిగజార్చకు

మధురమైన నీ ఊహను
మలినమైన నీ స్పర్శతో
మట్టిలో కలపకు

నీ ఊహలతో మత్తెక్కిన
నా అంతరంగంలో
వాస్తవపు అల్పత్వాన్ని ఆవిష్కరించకు

నా మానసాలయంలో
నీ అడుగుల బురదను మోపి
నీ విగ్రహాన్ని నీవే మలినం చేసి
నిరాశకు నన్ను గురిచెయ్యకు

నిన్ను ఊహిస్తూ
నిర్మించుకున్న నా స్వప్నాన్ని
నిద్రలేపి నాశనం చెయ్యకు

నిన్ను స్మరిస్తూ
ఆనందంగా ఉన్న నన్ను
నీ రాక ద్వారా ఏడిపించకు

ఎందుకంటే...

కనిపించే నీకంటే
కనరాని నీ ఊహే
మధురం

ఊపిరి తీసే నీకంటే
ఊపిరితో ఊసులు చెప్పే
నీ ఊహే నా నేస్తం

ఎదురుపడి
ఏడిపించే నీ కంటే
అదృశ్యంగా ప్రేమించే
నీ ఊహే ఉన్నతం

అందుకే...

ఎప్పటికీ ఇలాగే 
నాకు దూరంగానే ఉండిపో
నాలోనే నాతోనే
నా ఊహగానే ఎప్పటికీ నిలిచిపో...
read more " ఊహ "

27, ఫిబ్రవరి 2016, శనివారం

ఆరాటం

ప్రియుని కోసం ఆరాటపడుతున్నావు
అతడు నీ ఎదుట నిలిస్తే
గుర్తించలేకున్నావు

సముద్రాన్ని త్రాగాలని ఆశిస్తున్నావు
నీ దాహమెంతో దాని తాహతెంతో
తెలుసుకోలేకున్నావు

ఆకసాన్ని అరచేతిలో పట్టుకుంటానంటావు
నీ అరచెయ్యి వైశాల్యమెంతో
నీవే గ్రహించలేకున్నావు

బండెడు అన్నం తిందామని ఊగుతున్నావు
నీ ఆకలి తీరడానికి ఒక్కముద్ద చాలని
అర్ధం చేసుకోలేకున్నావు

నిజంగా నీలో అంత ప్రేమే ఉంటే
నిన్ను ఆపగలవారెవ్వరు?
నిజంగా నీకంత ఆకలే ఉంటే
నిన్ను ఒద్దనేవారెవ్వరు?

నిజంగా నీ గొంతెండి పోతుంటే
నీకడ్డుగా వచ్చేవారెవ్వరు?
నిజంగా నీకంత తపనే ఉంటే
నీ హద్దుగా నిలిచేవారెవ్వరు?

అతనిని చూడకుండా
బ్రతకలేనంటే
నీకెదురు చెప్పేవారెవ్వరు? 

అతనిలో కలవకుండా
ఉండలేనంటే
కుదరదనే వారెవ్వరు?

నీ ప్రేమ నిజమైనదే అయితే
నిన్ను బంధించగల వారెవ్వరు?
నీ దీక్ష స్వచ్చమైనదే అయితే
దాన్ని విరమింపజేసే వారెవ్వరు?

అసలు విషయం అది కాదు
నీ ప్రేమలో బలమే లేదు 
నీ ఆశకు నువ్వొక బందీవి
నీ మనసుకు నువ్వొక అంగీవి

నీ తాహతును మించి
ఎక్కువగా ఆశిస్తున్నావు
నీ శక్తిని మించి
ఎక్కువగా కోరుతున్నావు

ప్రియుని నీవు కోరడం కాదు
అతనిలో నీవు కరగిపోవాలి
సముద్రాన్ని నీవు త్రాగడం కాదు
దానిలోనే నువ్వు మునిగిపోవాలి

ఆకసాన్ని అందుకోవడం కాదు
నీ పిడికిలిని నీవే విప్పాలి
అన్నాన్ని నీవు తినడం కాదు
నువ్వే ఆహారంగా మారాలి

ఆశించడం ఆపాలి
నువ్వే ఆహుతి కావాలి
ఆక్రోశం అణగాలి
ఆత్మార్పణ చెయ్యాలి

ఆ ధైర్యం నీకుందా?
ఆ స్థైర్యం నీకుందా?
ఏ ముగింపుకూ వెరవని
తెగింపు నీలో ఉందా?

ఉంటే --

అడుగో నీ ప్రియుడు
నీ ఎదుటే..
నీలోనే...
నువ్వే...
read more " ఆరాటం "

18, ఫిబ్రవరి 2016, గురువారం

దేశద్రోహం

గత కొద్ది రోజులుగా మన యూనివర్సిటీలలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే కొన్ని విషయాలు చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యేలా ఉన్నాయి.

1971-72 యుద్ధంలో ఓడిపోయిన దగ్గర నుంచీ పాకిస్తాన్ మనమీద పరోక్ష యుద్ధం చేస్తూనే ఉన్నది.సరాసరి తలపడితే మనమీద గెలవడం కష్టం అన్న సంగతి గ్రహించిన అది, అప్పటినుంచీ గెరిల్లా యుద్ధానికి సిద్ధమైంది.గెరిల్లా యుద్ధంలో hit and run అనేదే మూలసూత్రం.చాటుగా దొంగదెబ్బ తియ్యడం బయటకేమో అమాయకంగా నటించడాలే దీని వ్యూహాలు.

దీనికి మద్దతుగా అది అనేక రకాలైన వ్యూహాలను అమలుచేస్తున్నది.

1.కాశ్మీరులో ముస్లిములను హిందువులు హింసకు గురిచేస్తున్నారు అని ప్రచారం చేస్తూ నిజానికి అక్కడి కాశ్మీరీ పండిట్లను నిర్దాక్షణ్యంగా చంపడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేసి కాశ్మీరు నుంచి వారిని ఖాళీ చేయించడం.అప్పుడు అక్కడెలాగూ ముస్లిం మెజారిటీ ఉంటుంది గనుక వారిచేత మాకు ఇండియాలో ఉండటం ఇష్టం లేదు.మాకు స్వతంత్రం కావాలి అని గొడవ చేయించి ఒకవేళ ఆ స్వతంత్రం అంటూ గనుక వస్తే మరుక్షణంలో చక్కగా పాకిస్తాన్లో కలసిపోవడం.

2. ఇండియాలో ఉన్న ముస్లిములను పధకం ప్రకారం తరతరానికీ విపరీతంగా సంఖ్యాబలం పెంచుకుంటూ పోవడం. ఆ తర్వాత వారిచేత పార్టీలు పెట్టించి ప్రస్తుతం ఒక రాష్ట్రంలో జరుగుతున్నట్లు భయోత్పాతం సృష్టించడం. చివరకు ఇస్లామిక్ రాజ్యాన్ని స్తాపించడం.

3. ఈ లోపల ఇండియాలో ఉన్న కాలేజీలు యూనివర్సిటీలలో హిందూవ్యతిరేక భావజాలాలున్న కులగ్రూపులతోనూ,వామపక్ష గ్రూపులతోనూ జతకట్టడం.మెల్లిగా పాకిస్తాన్ అనుకూల భావాలను ప్రచారం చేసి సాధ్యమైనంత విషాన్ని వారి తలల కెక్కించడం.

4. మరో పక్కన చాపకింద నీరులా మదరసాలలో తీవ్రవాదాన్ని చొప్పించడం.

5. ఈలోపల సాధమైనన్ని తీవ్రవాద స్లీపింగ్ సెల్స్ ను ఇండియాలో నలుమూలలా ఏర్పాటు చెయ్యడం.దీనికోసం తెలికగా వలలో చిక్కే చేపల్ని పట్టుకుని రిక్రూట్ చేసుకుని వారిని లోకల్  లాగిస్టిక్ సపోర్ట్ కోసం వాడుకోవడం.

6. తీవ్రవాదులను సాధ్యమైనన్ని మార్గాల గుండా ఇండియాలో ప్రవేశపెట్టి విధ్వంసం సృష్టించడం.ఇక్కడి స్లీపింగ్ సెల్స్ ద్వారా వారికి కావలసిన సహాయం అందేట్లు చెయ్యడం.

7. కొన్నికొన్ని రాష్ట్రాలలో బలం పుంజుకుంటున్న ముస్లిం పార్టీల ద్వారా కోవర్టుగా పనిచెయ్యడం.

8. మెల్లిగా సాధ్యమైనన్ని రాష్ట్రాలను 'మాకు స్వతంత్రం కావాలి. మేం ఇండియాలో భాగంగా ఉండం.' అన్న నినాదం వైపు మళ్లేలా చెయ్యడం.తద్వారా బంగ్లాదేశ్ ను స్థాపించినందుకు ఇండియాపైన పగ తీర్చుకోవడం.

9. ఏదో రకంగా అణ్వాయుధాలను సమకూర్చుకుని - 'జాగ్రత్త. మీరేదైనా చేస్తే మీమీద ఆటం బాంబ్ ప్రయోగిస్తాం.' అని మనల్ని బెదిరించడం.ఇంకోపక్క చెయ్యాల్సినవన్నీ వాళ్ళే చేస్తూ ఉండటం.

ఈ రకంగా అన్ని విధానాల ద్వారా ఇండియాను ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టి విధ్వంసం సృష్టించడమే పాకిస్తాన్ అజెండా. మన దేశానికి వ్యతిరేకంగా multi pronged strategy ని అది అమలు చేస్తున్నది.ఇది వాస్తవం.దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ కు వత్తాసు పలికే దేశద్రోహులు మన దేశంలోనూ దండిగానే ఉన్నారు.ఇదీ వాస్తవమే.

మొదటినుంచీ మన దేశం విదేశీయులకు బానిసగా మారడం వెనుక ఎన్నో కారణాలున్నప్పటికీ ముఖ్యకారణం మాత్రం ఒకటే.మన సొసైటీ లోపలనుంచే బయటి వారికి వత్తాసు పలికి, వారికి సహాయ సహకారాలందించిన ఇంటిదొంగలు ఉండబట్టే అన్నీ ఉండికూడా ఏమీ లేనివారిలా మనం 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయాం.ప్రపంచంలోని ప్రతిజాతి చేతా దోచుకోబడ్డాం. 

ప్రస్తుతం కూడా ఇదే తంతు జరుగుతున్నది.

పార్లమెంట్ మీద దాడి చేసినవారికి మన సొసైటీలో సానుభూతేమిటి? మన దేశంలో ఉగ్రవాద దాడులు చేసిన వారికి వత్తాసు పలకడం ఏమిటి?నినాదాలేమిటి?వారిని సమర్ధిస్తూ మీటింగులు పెట్టడం ఏమిటి?అదికూడా విద్యాలయాలలో ఈ విపరీత పోకడలేమిటి?అసలు విద్యార్ధులకు రాజకీయ పక్షాల అండదండలెందుకు?వాళ్ళు అక్కడకు వెళుతున్నది చదువు కోసమా లేక రాజకీయుల చేతిలో పావులుగా మారి విద్యా సంవత్సరాలూ చదువూ పాడు చేసుకోవడానికా?

కొంతమంది విద్యార్దులేమో - వామపక్ష భావాల ఉచ్చులో పడి నక్సలైట్లుగా మారి అడవుల్లో హతమై పోతుంటారు. ఇంకొందరేమో పాకిస్తాన్ చైనా దేశాల భావజాలపు వలలో చిక్కి తమ చదువులనే గాక పక్కవాళ్ళ చదువులు కూడా పాడు చేస్తుంటారు.అదేమంటే - వాక్స్వాతంత్రానికి భంగం అంటారు.

వాక్స్వాతంత్రానికి కూడా పరిమితులున్నాయి.భారత రాజ్యాంగం పార్ట్-III లో మనకు ఇస్తున్న ప్రాధమిక హక్కులలో   వాక్స్వాతంత్రం కూడా ఒకటి.Fundamental rights మొదట్లో 6 గా ఉండేవి.తరువాత right to living and right to education కలపగా 8 అయ్యాయి.

అధికరణం 19 లో ఉన్న ఆరు స్వాతంత్రాలలో వాక్స్వాతంత్రం కూడా ఒకటి.కానీ దీనిపైన ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు.అందుకు చూపే కారణాలలో 'in the interest of Sovereignty and integrity of India and the security of the state కూడా ఒకటి.రాజ్యాంగం నాకు వాక్స్వాతంత్రం ఇచ్చింది అంటూ ఏది పడితే అది వాగడానికి వీలుకాదు.పక్కమనిషిని అనవసరంగా దూషించడమే నేరం అవుతుంటే ఇంక దేశవ్యతిరేక నినాదాలు ఇవ్వడం నేరం కాకపోతే ఇంకేమౌతుంది?

దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు జేజేలు పలకడం దేశవిద్రోహం కాకుంటే మరేమిటి? అలా జేజేలు కొడుతున్న వారికి కొన్ని వర్గాలూ పార్టీలూ వత్తాసు రావడం ఏమిటి?ఇలా చెయ్యడం వాక్స్వాతంత్రం అంటారా?దానిని వద్దంటే ప్రాధమిక హక్కులను కాలరాచినట్లా? ఇదేమి వింత?

ఇలాంటి వింతలు ఒక్క మన దేశంలో మాత్రమే జరుగుతాయేమో? It happens only in India కి ఇది కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చా?

అతుకుల బొంత లాంటి రాజ్యాంగాన్ని తయారు చేసి దేశానికి ఇచ్చిన ఘనులది అసలు తప్పు.దేశద్రోహులనూ ఉగ్రవాద స్లీపింగ్ సెల్స్ నూ ఓట్లకోసం ఇన్నేళ్ళుగా పోషిస్తూ వస్తున్న పార్టీలది రెండో తప్పు.ఆ తప్పుల ఫలితాలే ఇప్పుడు విశ్వరూపం ధరించి కాటు వేస్తున్నాయి.ఇప్పటికైనా కళ్ళు తెరవక పోతే, మన దేశం పని అధోగతే.

ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు,ఇప్పుడు వత్తాసు పలుకుతున్న వీరందరూ ఏదో ఒక విదేశానికి పోయి హాయిగా తలదాచుకుంటారు. చచ్చేది మాత్రం ఇక్కడి ప్రజలే.

లాహోర్ దాకా వెళ్ళిన మన సైన్యాన్ని వెనక్కు రప్పించడం అప్పటి నాయకుల మొట్టమొదటి క్షమించరాని నేరం.పాకిస్తాన్ ఆక్రమించిన మన భూభాగాన్ని క్లెయిం చెయ్యకుండా వదిలెయ్యడం రెండో క్షమించరాని నేరం.కఠినమైన వైఖరి అవలంబించకుండా కాశ్మీర్ అంశాన్ని నానబెట్టి నానబెట్టి ఇంతవరకూ తేవడం మూడో క్షమించరాని నేరం.తీవ్రవాదులను వారి సపోర్టర్స్ నూ ఇన్నాళ్ళూ బుజ్జగిస్తూ రావడం నాలుగో క్షమించరాని నేరం.ఇంకా ఇంకా ఎన్ని నేరాలు చేద్దామని మీ ఉద్దేశ్యం?


పాకిస్తాన్ లగ్నం మేషం. ఇండియా లగ్నం వృషభం. మేషం నుంచి పంచమంలో ప్రస్తుతం గురుచండాల యోగం ఉన్నది. కనుక పాకిస్తాన్ దుర్బుద్ధితో అనేక కుట్రలు కుతంత్రాలను చేస్తుంది.ఆ యోగం మనకు చతుర్దంలో పడుతుంది గనుక మన ప్రజాజీవనంలో ఆ కుట్రల ఫలితాలను మనం అనుభవించవలసి వస్తుంది.ప్రస్తుతం జరుగుతున్నది అదే. గమనించండి.

ఈ యోగం వల్ల - విద్యార్ధులకు బుద్ధి చెప్పాల్సిన గురువులూ పెద్దలూ నాయకులూ కూడా భ్రష్టులై వాళ్ళ నేరపూరిత ప్రవర్తనకు వత్తాసు వస్తున్నారు.తప్పు అని చెప్పవలసిన వారే దగ్గరుండి తప్పు చేయిస్తున్నారు.వీరు చేస్తున్నది మామూలు తప్పుకాదు.తను కూచున్న కొమ్మను తానే నరుక్కోవడం ఇది.తన ఇంటికి తానే నిప్పు పెట్టుకోవడం ఇది.

ఇదంతా రాహు గురువుల సంయోగమూ + గురువు యొక్క వక్రతల ఫలితం. గురువు యొక్క ఈ వక్రత మే 10 వరకూ ఉన్నది.కనుక ప్రస్తుత సంక్షోభం ఆ సమయం వరకూ కొనసాగుతుంది.ఒకవేళ ఇది సమసిపోయినా ఇలాంటివి ఇంకొన్ని తయారౌతాయి.ఆ తర్వాత ఆగస్ట్ 11 గురువు గారు కన్యారాశిలో ప్రవేశించే వరకూ ఇలాంటి ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి.ఆ తరువాత మాత్రం అసలైన ఉపద్రవాలూ ఉగ్రవాద చర్యలూ జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు గురువు యొక్క రక్షణ వలయం తప్పుకుంటుంది కనుక రాహువుకు ఫ్రీ హ్యాండ్ వస్తుంది.రాహువును కట్టడి చేసేవారు అప్పుడు ఎవరూ ఉండరు.అందుకని అప్పుడు ఉగ్రవాద చర్యలు ఇంకా ఎక్కువౌతాయి.

మోడీ ప్రధానమంత్రి అయ్యాక విదేశీ సంబంధాలు మెరుగు పడుతున్నాయి. అంతర్జాతీయంగా మన దేశప్రతిష్ట చాలా పుంజుకుంటున్నది. అది చూచి సహించలేని దుష్టశక్తులు ఇంటా బయటా రకరకాల కుయుక్తుల ద్వారా ఆ పురోగతిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసేవారు దేశభక్తులెలా అవుతారు?మన దేశంలో ఉంటూ ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడి నీరు త్రాగుతూ ఇక్కడి తిండి తింటూ ఈ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడేవారినీ, వ్యవహరించే వారినీ దేశద్రోహ నేరం క్రింద అరెస్ట్ చేస్తే తప్పేముంది?ఖచ్చితంగా ఆపని జరగాల్సిందే.

పోనీలే అని ఇప్పుడు ఊరుకుంటే 'తోటకూర నాడే బుద్ధి చెబితే ఇంతవరకూ వచ్చేది కాదు కదమ్మా?' అన్నట్లుగా అవుతుంది.

మన దేశాన్ని ద్వేషించడమూ దేశద్రోహమే,మన శత్రువులకు జేజేలు కొట్టడమూ దేశద్రోహమే.అలా జేజేలు కొట్టినవారిని సమర్ధించడం కూడా దేశద్రోహమే అవుతుంది.అసలు అలా సమర్దిస్తున్నవారిని కూడా దేశద్రోహ నేరం క్రింద బుక్ చెయ్యాలి.ఈ తప్పులకు గట్టి శిక్షలు పడాలి.అలా చెయ్యకుండా వెనుకంజ వెయ్యడం కూడా చాలా తప్పే అవుతుంది.

ఇటువంటి దేశద్రోహ పోకడల్ని మొగ్గలోనే కఠినంగా త్రుంచెయ్యాలి.లేకుంటే ముందు ముందు పెద్ద పెద్ద అనర్ధాలు జరిగే ప్రమాదం ఖచ్చితంగా ఉన్నది.

మనం సీరియస్ గా ఉన్నామని పాకిస్తాన్ కు తెలియ జెయ్యాలి. అప్పుడే కొన్నాళ్ళకు కాకుంటే కొన్నేళ్ళకైనా ఘనత వహించిన జాతిపీతలూ శాంతిదూతలూ చేసిన ఘోరమైన తప్పులను కనీసం కొద్దిగానైనా సరిదిద్దుకోగలుగుతాం.

లేకుంటే ఆనాడు వారు చేసిన తప్పులకు ఈనాటి అమాయకప్రజలో లేక ముందుతరం అమాయకప్రజలో తమతమ ప్రాణాలతో మూల్యం చెల్లించక తప్పదు.
read more " దేశద్రోహం "

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

మీకు జంధ్యం ఉందా?

చాలాకాలం ఇక్కడే పనిచేసి ఒక ఏడాది క్రితం సికింద్రాబాద్ కు బదిలీలో వెళ్ళిన ఒక కొలీగ్ ఆఫీసర్ మొన్న ఒక సందర్భంలో మళ్ళీ కలిశాడు.అతను సిగ్నల్ అండ్ టెలీకాం విభాగంలో ఇంజనీరు.యూపీ రాష్ట్రానికి చెందినవాడు.చాలా తెలివైనవాడు. ఒక స్టేషన్లో ఒక స్పెషల్ వర్క్ సందర్భంగా ఒకరోజు కలిసి పనిచేశాం,ప్రయాణమూ చేశాం.

ప్రయాణం పొడుగూతా అతను చాలాసేపు అవీ ఇవీ మాట్లాడుతూ ఉన్నాడు.వాటిల్లో దేశ రాజకీయాలూ,పే కమీషన్ విషయాలూ, షేర్ మార్కెట్ కబుర్లూ,ట్రేడ్ యూనియన్ల చేతగానితనమూ, ప్రభుత్వసర్వీసులోని కష్టాలూ అన్నీ దొర్లాయి.నేను యధావిధిగా మౌనంగా ఉండి వినీ వినకుండా మధ్యమధ్యలో వింటూ క్లుప్తంగా జవాబులు ఇస్తూ ఉన్నాను.

సంభాషణ అంతా ఇంగ్లీషూ హిందీలలో జరిగింది.

అన్ని టాపిక్సూ అయిపోయాక హటాత్తుగా తన మెడలో ఉన్న జంధ్యాన్ని చూపిస్తూ ఇలా ప్రశ్నించాడు.

'మీరు దీనిని ధరిస్తున్నారా?"

టాపిక్ ఇటువైపు మళ్ళుతున్నందుకు కుతూహలపడుతూ 'ఎందుకు?' అంటూ అడిగాను.అప్పటివరకూ అతను యూపీ బ్రాహ్మణుడని నాకు తెలియదు.

'అలా కాదు మీరు ధరిస్తున్నారా లేదా?' మళ్ళీ రెట్టించాడు.

'ప్రస్తుతానికి లేదు' జవాబిచ్చాను.

'ఎందుకని?' అడిగాడు.

'మొన్న ఒక డ్రామా వేసేటప్పుడు తొలగించాను.ఆ తర్వాత మళ్ళీ వేసుకోలేదు.వేసుకోవాలి.' చెప్పాను.

'అలా ఉండకూడదు.' అన్నాడు.

నేనేమీ మాట్లాడకుండా చూస్తున్నాను.

'ఇది ఒంటిమీద ఉంటేనే మీరు చేసే ఏ దీక్ష అయినా ఫలిస్తుంది.లేకుంటే ఫలించదు.' అన్నాడు.

నానుంచి మళ్ళీ అదే మౌనం ఎదురయ్యేసరికి - 'నేనీ మధ్యనే దీక్ష తీసుకున్నాను.' అన్నాడు.

'ఓ అదా సంగతి ! కొత్త బిచ్చగాడన్నమాట!' అనుకుంటూ - 'ఎవరి దగ్గర?' అని అడిగాను.

'ఘజియాబాద్ లో ఒక గురువు దగ్గర' అన్నాడు.

'ఆయనదేం సాంప్రదాయం?ఆయన మీ కులగురువా?ఆయనకేమైనా ఆశ్రమాలున్నాయా?' అడిగాను.

'అదేమీ లేదు.గురుత్వం ఆయన వృత్తి కాదు.ఆయన అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్.మామూలుగా లోకానికి తెలిసిన ప్రసిద్ధ గురువు కాదు.కానీ నిజమైన శక్తివంతుడు.ఆయన ఎవరికీ బడితే వారికి దీక్ష ఇవ్వడు.అలా ఆయన దగ్గర దీక్ష స్వీకరించాలంటే మనలో కొన్ని అర్హతలుండాలి' అన్నాడు.

నేనేమీ జవాబివ్వలేదు.

'మనం బ్రతుకుతున్న ఈ జీవితం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం.కానీ చనిపోయిన తర్వాత ఇవేవీ మన వెంట రావు.ఆ తర్వాతి జీవితం కోసం మాత్రం మనం ఏమీ చెయ్యం.అదే మనం చేసే పెద్ద పొరపాటు.' అన్నాడు మళ్ళీ.

అప్పటికీ నేను మౌనంగానే ఉన్నాను.

'మా గురువు గారు చాలా శక్తివంతుడు.కావాలంటే ఈ రైలును కూడా ఇప్పటికిప్పుడు ఆపెయ్యగలడు.కానీ అలాంటి మహిమలు ఊరకనే ప్రదర్శించరు.' అన్నాడు.

'అలాగా !' అన్నాను నిర్లిప్తంగా.

'ఆయన గురించి మీకు తెలుసుకోవాలని లేదా?' అడిగాడు.

'ఉంది.ఆయన గురువెవరు? అసలు మీది ఏం సాంప్రదాయం?' అడిగాను.

'మాది కబీర్ పంథా.మా గురువు గారి గురువు ఒక సూఫీ మహాత్ముడు.' అన్నాడు.

'అదేంటి మీ గురువు గారు బ్రాహ్మణుడై ఉండి ఒక ముస్లిం ను గురువుగా స్వీకరించాడా?' అడిగాను ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'మీకొక విషయం చెప్పనా?' అన్నాడు గొంతు తగ్గిస్తూ -'మన హిందూ మహాత్ముల దగ్గర నిజమైన సిద్ధి లేదు.అసలైన సిద్ధులు సూఫీ మహాత్ముల దగ్గరే ఉంటాయి.కొన్ని తరాల క్రితం ఉత్తర ప్రదేశ్ లో ఈ సూఫీ మహాత్ముడు ఉండేవాడు.తన వద్ద ఉన్నదానిని స్వీకరించే అర్హతలున్న ముస్లిం ఎవరూ అతనికి కనిపించలేదు.అందుకని ఒక హిందువును తన శిష్యునిగా స్వీకరించాడు.ఆయన దగ్గరనుంచి మా గురువుగారు తీసుకున్నారు.అలా మా సాంప్రదాయం మొదలైంది.' అన్నాడు.

నార్త్ ఇండియాలో హిందువులూ ముస్లిములూ కలసి మెలసి జీవించడం వల్ల వీటిలోని కొన్నికొన్ని ఆచరణాత్మక శాఖలు ఈ విధంగా కలసిపోయి కొత్తకొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఇది మధ్యయుగాలలో ఎక్కువగా జరిగింది.కబీర్ పంధా ఇలాంటిదే.

'కబీర్ పంథా మంచిదే.మీ సాధనా విధానం ఎలా ఉంటుంది? అది సాకారమా నిరాకారమా?మీ గురువుగారు మసీదులు సందర్శిస్తాడా?' అడిగాను.

'మేము మసీదుకూ వెళ్ళము.మందిరానికీ వెళ్ళము.మేము జపమూ ధ్యానమూ మాత్రమే ఎక్కువగా చేస్తాము.మాకు దైవం కంటే గురువే ముఖ్యం.మీకొక్క విషయం తెలుసా?సరియైన గురువు లేనిదే దైవానుగ్రహం కలగడం కల్ల.' అన్నాడు గొంతు బాగా తగ్గించి.

'అవునా?' అడిగాను ఆశ్చర్యంగా.

'అవును.అందరూ అనుకున్నట్లు దైవం మన ప్రార్ధనలు వినడు. దైవానికి వినిపించేటంతగా ప్రార్ధించే బలం మనకు ఉండదు. అందుకని ఒక సద్గురువు ద్వారా మాత్రమే దైవాన్ని మనం సమీపించాలి. గురువు అంటే మనిషి రూపంలో మనకోసం ఉన్న దైవమే.' అన్నాడు.

చిరునవ్వుతో అలాగే అతన్ని చూస్తున్నాను.

'మీరు తీసేసిన జంధ్యాన్ని వెంటనే మళ్ళీ వేసుకోండి.అప్పుడే మీరు చేసే జపమూ ధ్యానమూ ఫలిస్తాయి.లేకుంటే అన్నీ వృధా' అన్నాడు మళ్ళీ సీరియస్ గా.

'అలాగే చూద్దాంలే గాని,నాకొక సందేహం. సమాజంలో ఇతరకులాల వాళ్ళు ఎంతోమంది జంధ్యం లేకుండా ఉన్నారు కదా? మరి వాళ్ళ సంగతి ఏమిటి? వారికి సాధనార్హత లేదా?' అడిగాను.

'లేదు.నిజం చెప్పాలంటే ఈ నియమనిష్టలన్నీ బ్రాహ్మణుల కోసమే ఉద్దేశించబడ్డాయి.మిగతా కులాల వారికి అంత అవసరం లేదు.వారికి తగిన సులువైన నియమాలు సాధనలు వారికి ఉన్నాయి.కానీ వీరు చేసేవి వారు చెయ్యరాదు.అసలైన కష్టమైన నియమాలన్నీ బ్రాహ్మణుల కొరకే చెప్పబడ్డాయి.' అన్నాడు.

'అవునా?' అన్నాను నవ్వుతూ.

ఇంతలో మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది.

రైలు దిగిన తర్వాత నావైపు జాలిగా చూస్తూ - 'మళ్ళీ కలిసినప్పుడు ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్తాను.మీకు చాలా విషయాలు అర్ధమయ్యేటట్లు చెప్పాలి.మొదట్నించీ చెబితే కాని మీకివి అర్ధం కావు.' అన్నాడు.

'సరే అలాగే ! ఈ సారి కలిసినప్పుడు మీనుంచి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాను.' అన్నాను.

ఆనందంగా చెయ్యూపుతూ తన పనిమీద తను వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోతున్న అతనివైపు కాసేపు అలాగే చూచి, నవ్వుకుంటూ నా పని నేను మొదలు పెట్టాను.
read more " మీకు జంధ్యం ఉందా? "

Amay Proshno Kore Remix - Satya Narayana Sarma



హేమంత్ ముఖర్జీ పాడిన "అమాయ్ ప్రోశ్నో కొరే" బెంగాలీ పాటకు ఇది రీమిక్స్ సాంగ్.

పాత మధురగీతాలను ఎలెక్ట్రానిక్ బీట్ తో మోడరన్ సాంగ్స్ గా తెచ్చే ప్రయత్నం చాలా భాషల్లో చాలా పాటల్లో జరిగింది. వాటిల్లో కొన్ని బాగుంటాయి.కొన్ని బాగుండవు.

ఒక పాత పాటను పాడే విధానం వేరు.అదే పాటను ఒక రీమిక్స్ పాటగా పాడే విధానం వేరు.అదే రాగమే అయినా బీట్ కు తగినట్లుగా దానిని కొంత విరుస్తూ పాడవలసి వస్తుంది.దీనివల్ల శాస్త్రీయ రాగం చెడిపోయే మాట వాస్తవమే.కానీ రక్కెస పొదల్లో కూడా ఒక విధమైన అందం ఉన్నట్లు మోడరన్ బీట్ సాంగ్స్ లో కూడా ఒక రకమైన బ్యూటీ ఉంటుంది.

పాత పాటల్లో రాగానికి ప్రాధాన్యత ఉంటుంది.రీమిక్స్ పాటల్లో బీట్ కు ప్రాధాన్యం ఉంటుంది. పాతా కొత్త పాటల మధ్యన తేడాను చూపడం కోసమే ఈ రీమిక్స్ సాంగ్ ను పాడాను.

వినండి మరి.
read more " Amay Proshno Kore Remix - Satya Narayana Sarma "

4, ఫిబ్రవరి 2016, గురువారం

Waha Koun Hai Tera - S.D.Burman


వహా కౌన్ హై తేరా ముసాఫిర్ జాయేగా కహా..

దేవానంద్ నిర్మించిన "గైడ్" అనే చిత్రం తెలియని వారు ఉండరు.ఆ రోజులలో ఇదొక పెద్ద మ్యూజికల్ హిట్.ఆ సినిమాలో అన్నీ హిట్ సాంగ్సే ఉన్నప్పటికీ వాటిల్లో ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే,దీనిని పాడినది ఎవరో కాదు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన S.D.Burman స్వయంగా దీనిని పాడాడు. అదీ ఈపాట ప్రత్యేకత. రాగంలో గాని అర్ధగాంభీర్యంలో గాని ఈ పాట చాలా గొప్పది.ఇదొక వేదాంతతత్త్వం లాగా ఉండి చాలా మంది తమను తాము ఈపాటతో తాదాత్మ్యం చెందటానికి తేలికగా సరిపోతుంది. పైగా ఈ పాటను వ్రాసినది నా అభిమాన గీత రచయిత శైలేంద్ర కావడంతో ఎంత అద్భుతంగా ఈ పాట రూపు దిద్దుకుందో చెప్పనవసరం లేదు.సినిమాలో ఇది టైటిల్ సాంగ్ గా వస్తుంది. వినండి.

Movie:--Guide (1965)
Lyrics:--Shailendra
Music and Singer:--S.D.Burman
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------
Waha koun hai tera - Musafir Jayega kahaa
Dam lele ghadi bhar - Ye Chaiyya Payega kahaa
Waha koun hai tera - Musafir Jayega kahaa
Waha koun hai tera

Beeet gaye din Pyar ke palchin
Sapna bani vo raate.....
Bhool gaye vo - Tu bhi bhula de
Pyar ki vo mulakaaten-2
Sab door andhera-2
Musafir, Jayega kahaa
Dam lele - dam lele –dam lele ghadi bhar - Ye Chaiyya Payega kahaa
Waha koun hai tera...

Koi bhi teri - raah na dekhe
Nain bichayena koyee......
Dard se tere - koi na tadpa
Aankh kisi ki na royee-2
Kahe kisko tu mera - 2
Musafir, Jayega kahaa
Dam lele – dam lele – dam lele ghadi bhar - Ye Chaiyya Payega kahaa
Waha koun hai tera

Tune to sabko - raah bataayi
Tu apni manzil kyu bhoolaaaa
Suljha ke raajaa ha ha ha ha Auron ki uljhan
Kyu kachche dhagon me jhoola-2
Kyu nache saphera-2
Musafir, Jayega kahaa
Dam lele ghadi bhar - Ye Chaiyya Payega kahaa
Waha koun hai teraa.....

Oo Oo ...Musafir......Tu Jayega Kahaa.....

Kehte hai gyani – Duniya hai faani
Paani pe likhi likhayee.....
Hai sabki dekhi – hai sabki jaani
Haath kisike na aayee-2
Kuch... tera na meraa-2
Musafir, Jayega kahaa
Dam lele –dam lele- dam lele ghadi bhar
Ye chaiyyaa Payega kahaa
Wahaa koun hai teraa......

Meaning

There is no one to call your own
O traveller
Take a breath here
You may not get this cool shade again
There is no one to call your own
O traveller...

Those days are gone
those moments of love
Those nights are dreams now
they forgot them
You too should forget
those love filled meetings
It is all very dark in all directions
So where will you go now?
O traveller...

No one waits for your arrival
No body fees your pain
and no body sheds a tear for you
Whom can you call your own?
And where can you go now?
O traveller...

You showed the path to others
How come you lost your own destination?
Having solved the problems of others
Why are you swinging on the swing of threads?
Why is the snake charmer dancing
to his own tune?
Where will you go now?
O traveller...

The enlightened people say
that this world is but a mirage
It is like writing on water
It is seen by all,experienced by all
but no one could take it into his hands
Here nothing is yours
nothing is mine
So where will you go now?
O traveller...

Better to take a good breath here
For you may not get this cool shade again
There is no one to call your own
O traveller..
No one to call your own....

తెలుగు స్వేచ్చానువాదం

ఓ బాటసారీ
ఎక్కడకు పోతున్నావు?
అక్కడ నీవారెవరూ లేరు
ఇక్కడే ఆగి కాసేపు విశ్రమించు
మళ్ళీ నీకు ఇలాంటి చల్లని నీడ దొరకదు

ఆ రోజులు గతించాయి
ప్రేమతో నిండిన ఆ క్షణాలూ గతించాయి
ఆ రాత్రులు ఇప్పుడు కలలయ్యాయి
ప్రేమతో నిండిన ఆ ముచ్చట్లను
వాళ్ళు మరచిపోయారు
నీవూ మరచిపో
నీ దారి అంతా చీకటితో నిండి ఉన్నది
ఈ చీకటిలో ఎక్కడకు పోతున్నావు?
అక్కడ నీవారెవరూ లేరు

నీకోసం ఎదురు చూచేవారు ఎవరూ లేరు
ఎవరికీ నీ బాధ పట్టదు
నీకోసం ఒక కన్నీటి చుక్క రాల్చేవారు కూడా ఎవరూ లేరు
నీవారని ఎవరి గురించి చెప్పుకోగలవు?
ఎక్కడకు పోతున్నావు?
అక్కడ నీవారెవరూ లేరు

ఎంతోమందికి దారిని చూపించావు
కానీ నీ గమ్యాన్ని నీవే మర్చిపోయావు
ఎందరివో సమస్యలు తీర్చావు
ఇప్పుడు నువ్వే దారాలతో కట్టబడ్డావు
పామును ఆడించేవాడు
తన రాగానికి తానే నృత్యం చేస్తున్నాడు?
ఏమిటీ వింత?
ఓ బాటసారీ! ఎక్కడకు పోతున్నావు?
అక్కడ నీవారెవరూ లేరు

ఈ ప్రపంచం ఒక ఎండమావి అని
జ్ఞానులు అంటున్నారు
ఈలోకం నీటిమీద వ్రాత వంటిది
దానిని అందరూ చూస్తారు
కానీ ఎవరూ దానిని అందుకోలేరు
ఇక్కడ నీదీ నాదీ అంటూ ఏదీ లేదు
ఇక నీవు పోయేదెక్కడికి?
అక్కడ నీవారెవరూ లేరు

ఓ బాటసారి ! ఎక్కడకు పోతున్నావు?
అక్కడ నీవారెవ్వరూ లేరు.....
read more " Waha Koun Hai Tera - S.D.Burman "

తెలంగాణా ఆంధ్రా రాష్ట్రాల శాపాలు

ఆంధ్రాలోనూ తెలంగాణాలోనూ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కొన్ని విషయాలు స్ఫురిస్తున్నాయి.సమాజంలో ఏదో మంచి మార్పు వస్తుంది అని ఆశించి ఈ రెండు ప్రభుత్వాలకూ ఓట్లేసిన అందరికీ మళ్ళీ ఆశాభంగం యధావిధిగా కలుగుతున్నది.వీరి పరిపాలన చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ బాగుపడే యోగం ఉన్నట్లుగా కన్పించడం లేదు.

కులగోలతో ఆంధ్రా, మతవిద్వేషంతో తెలంగాణా - వెరసి రండు రాష్ట్రాలూ రెండు అగ్నిపర్వతాల మీద కూచుని ఉన్నట్లు భవిష్యదర్శనం చెబుతున్నది. ఈ అగ్నిపర్వతాలు ఏదో రోజున తప్పకుండా పేలుతాయి. అప్పుడు జరిగే విధ్వంసంలో అమాయక ప్రజలు మిడతల్లా మాడిపోక తప్పదు.ఆరోజు ఎంతో దూరంలో లేదు.

తెలంగాణలో జరిగిన ఎన్నికలలో 45% మాత్రమే ఓట్లు పోలయ్యాయంటే దానర్ధం ఏమిటి? మిగతా అందరూ ఎందుకు ఒట్లేయ్యలేదు? ఇళ్ళలోనుంచి బయటకు రావడానికి భయపడి ఊరుకున్నారా?అలా భయపెట్టిన వారు ఎవరు? పౌరులు భయంతో ఒట్లేయ్యకుండా ఊరుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ రాష్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా?

పాతబస్తీలో నిన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే అది హైదరాబాద్ లో భాగమేనా లేక పాకిస్తాన్ లో భాగమా అనేది అర్ధం కావడం లెదు.రెండోదే కరెక్ట్ అనిపిస్తున్నది.ఈ మతోన్మాదం ముందుముందు విశ్వరూపం దాలిస్తే అప్పుడు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతాయో ఊహించడానికే భయం వేస్తున్నది.దేశానికి మరో పార్టిషన్ వస్తుందేమో?

అటుమొన్న తునిలో జరిగిన అరాచక చర్యలను చూచినా, మొన్న పాతబస్తీలో హైదరాబాద్ లో జరిగిన దౌర్జన్యాలు చూచినా ఒక్క విషయం స్పష్టంగా అర్ధమౌతున్నది.ఈ రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు లేవు. ఒకవేళ ఉన్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి తప్ప ధర్మంగా న్యాయంగా క్రియాశీలంగా వ్యవహరించడం లేదు.ప్రభుత్వాలే ఇంత పిరికితనంగా ఉంటే ఎలా?

ఒక వందమంది గుంపు నీ వెనుక ఉంటే చాలు, ఇక నువ్వేం చేసినా అడిగేవారు ఉండరు. నువ్వేం మాట్లాడినా ఎదురు చెప్పేవారు ఉండరు. అప్పుడు నువ్వు చెప్పినదే న్యాయం.నువ్వు చేసినదే ధర్మం.ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం చెల్లుబాటు అవుతున్న న్యాయం ఇదే. ఇది ఆటవిక న్యాయమేగాని అసలైన న్యాయం కాదు. బలవంతుడు చేసినదే న్యాయం అయినప్పుడు ఇక రాజ్యాంగం ఎందుకు? చట్టాలు ఎందుకు? పోలీసు వ్యవస్థ ఎందుకు? న్యాయవ్యవస్థ ఎందుకు?

కులమూ మతమూ ఉగ్రవాదమూ అనేవి మూడూ మూడు విషసర్పాలు.ఈ విషసర్పాలను పెంచుకునేటప్పుడు అవి చాలా ముద్దుగా కనిపిస్తాయి.కానీ అవి పెరిగి పెద్దవై మన అదుపు తప్పినపుడు మన మాట వినవు. అప్పుడు అవి వేసే కాట్లు చాలా దారుణంగా ఉంటాయి.

గతంలో అనేకమంది నాయకులు ఈ విషసర్పాల కాట్లకు బలైపోయారు. ఇందిరా గాంధీ ఇలాగే బలైంది. రాజీవ్ గాంధీ ఇలాగే బలయ్యాడు.వారిని చూసైనా మన నాయకులు బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా?మళ్ళీమళ్ళీ అవే విషసర్పాలను పాలుపోసి పెంచుతుంటే ఎలా?

నాయకుల్లారా !! మీ సంకుచిత దృష్టిని పక్కన పెట్టండి. విశాలదృష్టితో దూరదృష్టితో ఆలోచించండి.మీరు ఇప్పుడు నాటుతున్న విషబీజాలు ముందుముందు మీ సంతతినే నాశనం చేస్తాయి.అంతేగాక అమాయకులైన ప్రజలను కూడా నాశనం చేస్తాయి.ఆ పాపం మిమ్మల్నీ మీ వంశాలనూ ఖచ్చితంగా వెంటాడుతుంది.

మీ సంకుచిత స్వార్ధాల కోసం ఆలోచించకండి. దేశం కోసం నిష్పక్షపాతంగా న్యాయంగా ఆలోచించండి.ధర్మంగా పరిపాలన చెయ్యండి.కుళ్ళు రాజకీయాలను,స్వార్ధ రాజకీయాలను,వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టండి. న్యాయాన్ని నిలబెట్టండి.ఈ దేశాన్ని పరిపాలించే మహత్తరమైన అవకాశాన్ని దేవుడు మీకిచ్చాడు.దానిని దుర్వినియోగం చెయ్యకండి.మీకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని పాడుచేసుకుంటే,విశ్వశక్తులు మిమ్మల్ని క్షమించవు.అవి కళ్ళు తెరిచిన రోజున కలిగే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి.మనకేం కాదులే అనుకోకండి.ప్రకృతి ముందూ దైవం ముందూ మనిషి ఎల్లప్పుడూ అల్పుడే అన్న విషయాన్ని మర్చిపోకండి.మనల్ని కొన్ని అతీత శక్తులు గమనిస్తున్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోకండి.

మీరు చేస్తున్న ప్రతి పనీ రికార్డ్ అవుతున్నది.ఎవరూ చూడటం లేదని అనుకోవద్దు.ప్రకృతి గమనిస్తున్నది.మీరు కొలుస్తున్న దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు.ఒకరోజున మీ ఖర్మను మీరు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. మర్చిపోకండి.

నేను చెబుతున్నవి పనికిరాని నీతుల్లాగా అనిపించి ప్రస్తుతం మీకు నవ్వు రావచ్చు.కానీ,మీరు చేస్తున్న తప్పుడు పనులకు దైవం ఇచ్చే ఫలితాలు ఎదురైన రోజున మాత్రం మీకు నవ్వు రాదు.అప్పుడు ఏడుపు వస్తుంది.కానీ ఎంత ఏడ్చినా అప్పుడు ఫలితం ఉండదు.

చేతులు పూర్తిగా కాల్చుకోకముందే కళ్ళు తెరవండి.ధర్మసందేశాన్ని వినిపించుకోండి.ఎందుకంటే మీరు సృష్టించిన పరిస్థితులు మీ చేతులు కూడా దాటిన రోజున మీరు కూడా ఏమీ చెయ్యలేరు.ఆ రోజు రాకముందే జాగ్రత్త పడండి.నేరస్తుల మీద కఠినచర్యలు తీసుకోడానికి భయపడకండి.ఓట్లకోసం దిగజారి ప్రవర్తించకండి.ఉగ్రవాదాన్ని, ఆయా వర్గాలనూ ప్రోత్సహించకండి. 

చెప్పడం వరకే నా ధర్మం. వినకపోతే --- మీ ఖర్మం.

ఎందుకంటే,మంచి చెప్పినపుడు విననివాడికి,ఆపత్సమయంలో దేవుడు కూడా సాయం చెయ్యడు మరి.
read more " తెలంగాణా ఆంధ్రా రాష్ట్రాల శాపాలు "

1, ఫిబ్రవరి 2016, సోమవారం

మనది అతి పెద్ద ప్రజాస్వామ్యమా? ఎవరన్నారు?

తగలబడుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్
మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని అనేక వేదికలపైన చాలా గొప్పగా మనవాళ్ళు చెబుతూ ఉంటారు. నిజానికి మనది ఎంత గొప్ప ప్రజాస్వామ్యమో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే అర్ధమౌతుంది.

తీవ్రవాదం వైపు వెళ్ళవద్దని మంచి చెప్పినందుకు మొన్నటికి మొన్న నెల్లూరులో పోలీస్ స్టేషన్ ను ఎటాక్ చేసి వాహనాలు తగలబెట్టి పోలీసులను కొట్టారు.కులగోలతో నిన్నటికి నిన్న తుని దగ్గర రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టి,పోలీస్ స్టేషన్ ను ఎటాక్ చేసి,పోలీస్ ఆఫీసర్స్ ను కొట్టి,బస్సులూ కార్లూ పగలగొట్టి తగలబెట్టారు.పైగా దీనిని దగ్గరుండి రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రజాప్రతినిధులూ ఇంతకుముందు మంత్రులుగా చేసినవారూ? ఎంత సిగ్గుచేటో? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుందేమో మరి?

మాకు తెలిసిన కొంతమంది,సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కారేసుకుని గుంటూరు నుంచి అన్నవరం వెళ్ళారు.క్రిమినల్స్ కొంతమంది దారిలో హైవే మీద కార్లన్నీ ఆపి అద్దాలను విచక్షణా రహితంగా పగలగొట్టుకుంటూ పోతున్నారు.వీరి కారు అద్దాలను కూడా పగలగొట్టారు. లోపలున్న ఆడవాళ్ళకూ పిల్లలకూ ఆ గాజుముక్కలు తగిలి ముఖమూ గొంతూ చీరుకుపోయి గాయాలయ్యాయి.వీళ్ళు నోర్మూసుకుని కారు అక్కడే ఒదిలేసి బ్రతుకుజీవుడా అని పారిపోయి గుంటూరుకు తిరిగి వచ్చారు. అసలెక్కడున్నాం మనం?

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ చాలా కొత్తది.లేటెస్ట్ కంప్యూటర్ టెక్నాలజీతో తయారైనది.పోయిన నెలలోనే అది కమీషన్ అయింది.దాని విలువ 65 కోట్లు. అనవసరంగా ఆ ఇంజన్ను ధ్వంసం చేశారు.రైలు బోగీలకు నిప్పు పెట్టారు. రైల్లో ప్రయాణిస్తున్న ఆడవాళ్ళూ పిల్లలూ తీవ్రంగా భయపడి రైల్లోంచి దూకి పొలాల్లో పరుగులు పెట్టారు. చాలామంది అయితే,ప్రాణాలు దక్కితే చాలని, వారి లగేజిని రైల్లోనే వదిలేసి కిందకు దూకేశారు.వాటిల్లో పాసుపోర్టులూ డిగ్రీ సర్టిఫికేట్లూ మొదలైన ఇంపార్టెంటు డాక్యుమెంట్లు ఏమేం ఉన్నాయో? ఏ ముఖ్యమైన వస్తువులున్నాయో? అవన్నీ మళ్ళీ తిరిగి పొందాలంటే ఎంత కష్టం? అసలేమిటిదంతా? మనం ఉన్నది నాగరిక సమాజంలోనా లేక అడవిలోనా? మనకు లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా లేనట్లా? అని సందేహం కలుగుతున్నది.

నాకే గనుక అధికారం చేతులో ఉంటే ఈ క్రిమినల్స్ నూ, ఆ మాబ్ నూ జలియన్ వాలాబాగ్ లో చేసినట్లు స్పాట్లో షూట్ చేయించి పారేసి ఉండేవాడిని. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులను క్షమించి వదలకూడదు.అలా చేస్తే సమాజానికే ప్రమాదం.ఇలాంటి వారిని ఊరకే వదిలేస్తే సమాజంలో శాంతి మృగ్యమై పోతుంది.జనజీవనం అస్తవ్యస్తమై పోతుంది.కనుక కఠిన చర్యలు చాలా అవసరం.ఆ చర్యలు ఎలా ఉండాలంటే, తిరిగి ఇంకొకరు అలాంటి పనులు చెయ్యాలంటే భయపడి వణికిపోయేలా ఉండాలి.అప్పుడే సమాజంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది.

చైనాలో చేసినట్లు - కనీసం ఒక ఏభైమంది క్రిమినల్స్ ను ఈ సంఘటనలో గుర్తించి,వారి సోషల్ స్టేటస్ ఎంత పెద్దదైనా సరే,ఒక వారం లోపల వాళ్ళందరినీ అదే రైల్వే ట్రాక్ పక్కన పబ్లిగ్గా ఉరి తియ్యాలి. అప్పుడు గాని జనంలో భయం కలగదు.

అసలు కులానికి ప్రాధాన్యత ఏమిటి? దానికి రిజర్వేషన్లు ఏమిటి? కులం పేరుతో ఇన్ని గొడవలేమిటి? పేదవాడికి సహాయం అందాలి.అంతే.దానికి కులంతో పనేముంది? పేదవారు అన్ని కులాలలోనూ ఉన్నారు.వారిని గుర్తించి వారికి సాయం చేస్తే సరిపోతుంది. ఇంతమాత్రానికి కులం కులం అంటూ ఇంత గోల ఎందుకో నాకు ఎప్పటికీ అర్ధం కాదు.

నాకెప్పుడూ ఒకటి అనిపిస్తూ ఉంటుంది.మన దేశం ఒక సోషల్ డిజాస్టర్ వైపు వేగంగా ప్రయాణిస్తున్నది.అంతా బాగానే ఉంది అని మనం అనుకుంటున్నాం గాని అది నిజం కాదు.సమాజంలో స్లీపింగ్ సెల్స్ లాగా అనేక సంఘవిద్రోహ శక్తులు ఊపిరిపోసుకుంటున్నాయి. దానికి తగినట్లు ప్రభుత్వ విధానాలు కూడా బుజ్జగింపు ధోరణిలో లోపభూయిష్టంగా ఉంటున్నాయి.ఈ ధోరణులు ఎంతమాత్రం మంచివి కావు.ఇవి ముందుముందు సివిల్ అన్ రెస్ట్ కు ఖచ్చితంగా దారి తీస్తాయి.

మాటమాటకీ ప్రభుత్వ ఆస్తులను ప్రజలే ధ్వంసం చెయ్యడం ఏమిటో,అలా చెయ్యమని నాయకులే రెచ్చగొట్టడం ఏమిటో,వారిని ప్రభుత్వం ఏమీ అనకపోవడం ఏమిటో నాకు అర్ధంకాని ఇంకొక విషయం.అలా చేస్తే నష్టపోయేది మనమేగా?మనం కడుతున్న టాక్స్ తోనే కదా ఆ ఆస్తులు తయారౌతాయి?వాటిని ధ్వంసం చేసుకుంటే మన ఇంటికి మనం నిప్పు పెట్టుకున్నట్లే కదా?పైగా అమాయకులైన ప్రయాణీకులు ఏం తప్పు చేశారు? వాళ్ళెందుకు ఇలా భయపడి వణికిపోయి పరుగులు పెట్టాలి?ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే?ఓట్ల కోసం మరీ ఇంత దిగజారుడుతనమా?

ప్రతిదీ జరిగిన తర్వాత బాధపడటం తప్ప ఇంటలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నట్లు?ఈ ప్లాన్ ను ముందే పసి గట్టలేకపోవడం ఇంటలిజెన్స్ వారి వైఫల్యం కాదా? పోలీసుల మీదా పోలీస్ స్టేషన్ మీదా దాడులు జరిగినా కూడా ఏమీ చర్యలు లేకపోవడం కులవర్గాల బుజ్జగింపు చర్య కాదా? ఇదెంత తప్పు సంకేతాలను ప్రజల్లోకి ఇస్తుందో,ఇలా ఊరుకుంటూ పోతే సమాజంలో  క్రైం రేట్ ఎంత పెరుగుతుందో ఆలోచించనవసరం లేదా? ఇదేనా సరియైన నాయకత్వం?

మొత్తం మీద రాహుప్రభావం సమాజం మీద చాలా బలంగానే పనిచేస్తున్నది. తిరుగుబాటు ధోరణులూ ఉగ్రవాద చర్యలూ హటాత్తుగా ఎక్కువౌతాయని అనుకున్నట్లే అంతా జరుగుతున్నది.తెలంగాణా రాష్ట్రం కంటే ఆంధ్రరాష్ట్రం అన్నింట్లోనూ వెనుకబడుతుందని చెప్పిన ప్రిడిక్షన్ కూడా నిజమౌతున్నది. దానికి తగినట్లే ప్రతిదానిలోనూ మన చేతగానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

అయితే,విషయాన్ని గ్రహాల మీదకు నెట్టకుండా ఈ సంఘటనలకు కారకులైన దుష్టగ్రహాల పని పట్టే విధంగా ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలి. రైలు తగలబడటం వల్ల కలిగిన దాదాపు 100 కోట్ల నష్టాన్ని ఆ మీటింగ్ పెట్టినవారి నుంచి వెంటనే వసూలు చెయ్యాలి.లేదా కాపు కార్పోరేషన్ నుంచి ఆ డబ్బును వెంటనే వసూలు చేసి ఇండియన్ రైల్వేకు జమ చెయ్యాలి.అలా చెయ్యకుండా,నాలుగురోజుల్లో ప్రజలే మర్చిపోతారులే అని ఊరుకుంటే మాత్రం,సమీప భవిష్యత్తులో రాష్ట్ర పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.
read more " మనది అతి పెద్ద ప్రజాస్వామ్యమా? ఎవరన్నారు? "

క్షుద్ర పూజలు

మనుషులు అబద్దపు నీడలో బ్రతకడానికే ఎప్పుడూ ఇష్టపడతారు గాని సత్యం యొక్క వెలుగులోకి రావడానికి ఏమాత్రం ఇష్టపడరు.కానీ సత్యాన్ని ప్రేమిస్తున్నట్లు మాత్రం బయటకు చక్కగా నటిస్తుంటారు. మనుషులలో ఎక్కువశాతం  మంది ఇలాగే ఉంటారు.మానవ మనస్తత్వంలో ఇదొక మౌలికమైన లోపం.

ఒకప్పుడు కర్ణపిశాచి మంత్రమూ ఇంకా అలాంటి మంత్రాలు కొన్నింటిని సాధన చేసిన ఒకాయన ప్రస్తుతం నన్ను అనుసరిస్తున్నాడు. అలాంటి పిచ్చి సాధనలు మానుకొమ్మని అతనికి నేను చెప్పాను.నేను సూచించే అసలైన తంత్రమార్గాన్ని అనుసరించమని చెప్పాను.

మొన్న ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో అతను నాకు కొన్ని వాట్సప్ మెసేజీలు పంపాడు.వాటి సారాంశం ఏమంటే - తంత్రం మీద నేను వ్రాసిన కొన్ని పోస్ట్ లను ఎవరో తస్కరించి తన ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడుట. అంతేగాక తను వ్రాసిన ఒక E-Book లో కూడా ఆ పోస్ట్ లు తనవిగా ప్రచురించుకున్నాడట. ఇది మనవాడు గమనించి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే - అతను ఏమాత్రం సిగ్గుపడకుండా రివర్స్ లో - 'అది నా మేటర్. మీ గురువే నా మేటర్ కాజేశాడు.నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నాకేం భయం లేదు.నాదగ్గర ఎన్ని విద్యలున్నాయో నీకు తెలీదు.నేను తలచుకుంటే నిన్నే అంతం చేస్తాను'- అని ఇంకేమేమో వాగాడని ఈ అర్ధరాత్రి మెసేజిల సారాంశం.

నాకు భలే నవ్వు వచ్చింది.

తనదిగా చెప్పుకున్నంత మాత్రాన తనది కానిది తనదెలా అవుతుందో నాకైతే అర్ధం కాలేదు. పైగా అతను గుంటూరుకు చెందిన ఒక కుహనా తాంత్రికస్వామి శిష్యుడట.అదీ సంగతి !!! వీళ్ళ స్థాయి ఎంతటిదో నాకు బాగా తెలుసు. యధాగురు తధాశిష్య: విషవృక్షానికి మధురఫలాలెలా కాస్తాయి? జుట్టుకు రంగేసుకున్నత మాత్రాన యవ్వనం ఎలా తిరిగి వస్తుంది? ఇదీ అంతే.ఎవరిదో తెచ్చి మనదని చెప్పుకున్నంత మాత్రాన మనదౌతుందా?నవ్వొచ్చింది. ఇలాంటి మనుషులను ఏమాత్రం పట్టించుకోవద్దు అతని అజ్ఞానానికి అతన్ని వదిలెయ్యమని చెప్పాను.

ఏవేవో మంత్రాలూ తంత్రాలూ సాధన చేసున్నామని చెప్పుకునే ఇలాంటి బాపతు మనుషులలో కనీసపు నైతిక విలువలు కూడా కనిపించక పోవడం నన్నెపుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.ఇక వీళ్ళు చేసేవి ఎలాంటి సాధనలో వీళ్ళ గురువులు ఎలాంటి వాళ్ళో తేలికగా మనం అర్ధం చేసుకోవచ్చు. మినిమం కేరక్టర్ లేని ఇలాంటి వాళ్ళను వాళ్ళ ఖర్మకే వదిలేద్దాం.

మొన్న స్పోర్ట్స్ మీట్ లో ఇలాంటిదే ఇంకొక సంఘటన జరిగింది.

దాంట్లో ఒక కొలీగ్ ఆఫీసర్ కలిశాడు.ఆయన శుద్ధ సాంప్రదాయ వైష్ణవుడు. ఆయన చేతిలో రమణమహర్షి పుస్తకం ఒకటి హస్తభూషణంలా ఉన్నది. అక్కడకు అలాంటి పుస్తకాన్ని ప్రదర్శిస్తూ రావడమే నా దృష్టిలో ఒక హేయమైన సంగతి. అదలా ఉంచితే - మాటల మధ్యలో ఆయనేం చెప్పాడంటే - జడ్జీల పక్షపాతం వల్ల ముగ్గుల పోటీలో వాళ్ళావిడకు రావలసిన ప్రైజు రాకుండా పోయిందని, లోకం పాడైపోయిందని, న్యాయానికి విలువ లేదని,ఈ ధోరణిలో ఒక పావుగంట సేపు ఒకటే ఊదరగొట్టాడు.నాకు మళ్ళీ నవ్వొచ్చింది.

ఈ మధ్యకాలంలో ఇలాంటి మనుషులు ఎదురైతే నాకు కోపం రావడం లేదు.నవ్వు మాత్రమే వస్తున్నది.అప్పుడప్పుడూ జాలి కలుగుతున్నది.

అంతా ఓపికగా విని ఆయనతో ఇలా చెప్పాను.

'నువ్వేమో సెంట్రల్ గవర్నమెంట్ లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో హాయిగా ఉన్నావు.మీ ఆవిడకు ముగ్గుల పోటీలో ప్రైజు రాకపోతే అది అంతసేపు చర్చించవలసిన విషయమా? మీరంతగా బాధ పడటానికి ఇవేమన్నా ఆస్కార్ అవార్డులా లేక నోబుల్ ప్రైజులా?ఈ ప్రైజులు వస్తే ఎంత? రాకుంటే ఎంత?ఒకవేళ ప్రైజు వస్తే దానితో ఏం చేస్తావు?మీ ఇంటిముందు శిలాశాసనం వేయించుకుంటావా?కావాలంటే నాకు యోగాలో వచ్చిన ప్రైజు మీకిస్తాను తీసుకోండి.అయినా మీ చేతిలో ఉన్న పుస్తకం ఏమిటి? మీరు చెబుతున్న మాటలేమిటి? రమణ మహర్షి చెప్పినది ఇదేనా? లేక ఆయన చెబుతున్న దానిలో మీరు అర్ధం చేసుకున్నది ఇంతేనా?'

నా మాటలతో ఆయన డంగై పోయాడు.

'నిజమే."ఆత్మజ్ఞాని అయినవాడు జయాపజయాలకు చెదరడు. అసలు వాటిని ఆశించడు".అని మహర్షి చెప్పారు అంటూ ఆ పుస్తకాన్ని తెరచి ఒక పేజీలో ఒక లైన్ చూపించాడు.

'మరి అది నిజమే అయితే ఇందాకటి నుంచీ మీ ఘోషకు అర్ధం ఏమిటి?' అన్నాను.

ఆయన నాకంటే తెలివైనవాడు.

'నేనింకా ఆత్మజ్ఞానిని కాలేదుగా.అందుకే ఈ ఘోష' అని నవ్వేశాడు.

నేనూ నవ్వుతూ -' కనీసం ప్రయత్నం చెయ్యండి.అప్పుడు ఇలా పుస్తకాలను అందరికీ ప్రదర్శిస్తూ తిరిగే బాధ తప్పుతుంది. అప్పుడు మీరే ఒక నడిచే పుస్తకం అవుతారు.' అని చెప్పాను.

ఆ తాంత్రికస్వామి శిష్యునికీ ఈ వైష్ణవ భక్తునికీ మధ్య నాకేమీ తేడా కనిపించలేదు.నిత్యజీవితంలోకి రాని బోధలూ వేదాంతమూ అసలెందుకు పనికొస్తాయి?

మనకు 'క్షుద్రపూజ' అని ఒక మాట ఉన్నది.నిషిద్ధ వస్తువులతో రాత్రిపూట శ్మశానాలలో చేసే పూజలనే క్షుద్రపూజలని సామాన్యంగా అంటారు.నా దృష్టిలో అసలైన క్షుద్రపూజలు అవి కావు.

పైన చెప్పిన తాంత్రికస్వామి శిష్యులూ, మా కొలీగ్ ఆఫీసర్ వంటి వారూ రోజూ ఇళ్ళల్లో చేసే పనికిమాలిన పూజలనే క్షుద్రపూజలని నేను భావిస్తాను. ఎందుకంటే వారు చేస్తున్న పూజల ఫలితాలు నిత్యజీవితంలోకి అనువదించ బడటం లేదు. ఆయా పూజల అసలైన అర్ధం వారి బుర్రలకు ఎక్కడం లేదు. పూజల దారి పూజలదే.జీవితం దారి జీవితానిదే.కనుక అవి క్షుద్రపూజల కంటే ఉన్నతమైనవి కానేకావు.వీటినే అసలైన 'క్షుద్రపూజలు' అని నేనంటాను.

మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం.

రోజుకు గంటలు గంటలు పూజలు చేస్తూ ఉంటారు.ఆ పూజల నుంచి లేచీ లేవకముందే భార్యను తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటారు.ఒక్కోసారి పూజ చేసే సమయంలోనే మధ్యమధ్యలో భార్యనూ పిల్లలనూ తిడుతూ విసుక్కుంటూ ఉంటారు.లేదా ఉద్యోగం సద్యోగం లేకుండా భార్య సంపాదన మీద ఆధారపడి జల్సాగా బ్రతుకుతూ ఉంటారు.లేదా తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు.లేదా అవినీతి సొమ్ము గడిస్తూ,అందులో కొంత వాటాను దేవుడి హుండీలో కూడా వేస్తూ ఉంటారు.

చాలామంది ఇలాంటివాళ్ళు గురుస్వాముల మంటూ దొంగవేషాలు వేస్తూ ఉంటారు.వీళ్ళకు సమస్త వ్యసనాలూ ఉంటాయి.లేదా ఏవో దొంగ వ్యాపారాలూ,దొంగ వ్యవహారాలూ చేస్తూ ఉంటారు.ఆయా వ్యాపారాలలో వ్యవహారాలలో తాము అనుకున్న లాభాలు అప్పనంగా రావడానికి వారి గురువులను ఉపాయాలు అడుగుతారు.వారేవో హోమాలూ యాగాలూ చెయ్యమని చెబుతూ ఉంటారు.వీరు చేస్తూ ఉంటారు.వెరసి అవి చాలా గొప్ప సాధనలని వారు భావిస్తూ అహంతో విర్రవీగుతూ ఉంటారు.

ఇలాంటి వాళ్ళను చూస్తే నాకు చాలా అసహ్యం కలుగుతుంది.ఒక గజ్జికుక్కనైనా దగ్గరకు తీస్తానేమో గాని ఇలాంటి మనుషులను నేను నా ఛాయలకు కూడా రానివ్వలేను.

గుంటూరులో ప్రతి ఏడాదీ ఒక తంతు జరుగుతుంది.అదేమంటే లక్ష హనుమాన్ చాలీసా పారాయణ.కొన్ని వేలమంది కలిసి రోజంతా కూచుని ఈ పారాయణ నిర్వహిస్తారు.అందులో రెగ్యులర్ గా పాల్గొనే ఒకాయన నన్నూ దీనికి రమ్మని ఒకసారి అడిగాడు.

'లక్షసార్లు పారాయణ చేస్తే ఏమౌతుంది?' ఆయన్ను అడిగాను.

'అంతమంది కలిసి పిలిస్తే అప్పుడు మన పిలుపు ఆంజనేయస్వామికి వినిపిస్తుంది.స్వామి సంతోషిస్తాడు.మనకు మంచి జరుగుతుంది.' అంటూ జవాబొచ్చింది.

'అవునా? అంతమంది అలా అరుస్తూ అన్నిసార్లు పిలిస్తే గాని వినపడక పోవడానికి ఆంజనేయస్వామికి నీలాగా ఏమైనా చెవుడని అనుకుంటున్నావా?' అడిగాను.

అతను కోపంగా చూచి వెళ్ళిపోయాడు.

అసలైన మంత్రమూ ఇది కాదు.అసలైన తంత్రమూ ఇది కాదు.అసలైన ఆధ్యాత్మిక మార్గమూ ఇది కాదు.సత్యమైన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తుంటే ముందుగా మనిషిలో ఉన్నతమైన మార్పు రావాలి.అతనిలో ఉన్నతమైన నైతిక విలువలు కనిపించాలి.అవి మాటల్లోనే కాకుండా చేతల్లో నిత్యజీవితంలో దర్శనం ఇవ్వాలి.అతనిలో కోరికలు బాగా తగ్గిపోవాలి.అహం అణగారిపోవాలి. అసత్యం మాయం కావాలి.దివ్యత్వం అతనిలో వికసించాలి.అప్పుడే అది అసలైన సాధన అవుతుంది.అవి నిజమైన పూజలూ అవుతాయి.

అలా కాకుండా,పూజల దారి పూజలదే,జీవితం దారి జీవితానిదే అయినప్పుడు,ఆయా హోమాలనూ యాగాలనూ సాధనలనూ పూజలనూ "క్షుద్రపూజలు" అనడం కరెక్టే కదూ?అలాంటి వాళ్ళను 'క్షుద్ర పూజారులు' అనడం కూడా కరెక్టే.ఈ రకంగా చూస్తె మన చుట్టూ ప్రతి ఇంట్లోనూ ఎంతమంది క్షుద్రపూజారులు కనిపిస్తారో?

మేం సరిగ్గానే ఉన్నాం అనుకుంటూ తప్పుదారిలో నడచే వాళ్ళతోనే ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నది.సోకాల్డ్ ఆధ్యాత్మిక ప్రపంచంలో అయితే ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూచినా కుప్పలు తెప్పలుగా ఉన్నారు.ఇలాంటి మనుషులతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని పెద్దపెద్ద వాళ్ళే మార్చలేక పోయారు.ఇక మనమెంత?

ఇలాంటి వారిని చూచి సరదాగా నవ్వుకోవడమే మనం ప్రస్తుతానికి చెయ్యగలిగిన అసలైన పని.
read more " క్షుద్ర పూజలు "