Once you stop learning, you start dying

27, ఫిబ్రవరి 2016, శనివారం

ఆరాటం

ప్రియుని కోసం ఆరాటపడుతున్నావు
అతడు నీ ఎదుట నిలిస్తే
గుర్తించలేకున్నావు

సముద్రాన్ని త్రాగాలని ఆశిస్తున్నావు
నీ దాహమెంతో దాని తాహతెంతో
తెలుసుకోలేకున్నావు

ఆకసాన్ని అరచేతిలో పట్టుకుంటానంటావు
నీ అరచెయ్యి వైశాల్యమెంతో
నీవే గ్రహించలేకున్నావు

బండెడు అన్నం తిందామని ఊగుతున్నావు
నీ ఆకలి తీరడానికి ఒక్కముద్ద చాలని
అర్ధం చేసుకోలేకున్నావు

నిజంగా నీలో అంత ప్రేమే ఉంటే
నిన్ను ఆపగలవారెవ్వరు?
నిజంగా నీకంత ఆకలే ఉంటే
నిన్ను ఒద్దనేవారెవ్వరు?

నిజంగా నీ గొంతెండి పోతుంటే
నీకడ్డుగా వచ్చేవారెవ్వరు?
నిజంగా నీకంత తపనే ఉంటే
నీ హద్దుగా నిలిచేవారెవ్వరు?

అతనిని చూడకుండా
బ్రతకలేనంటే
నీకెదురు చెప్పేవారెవ్వరు? 

అతనిలో కలవకుండా
ఉండలేనంటే
కుదరదనే వారెవ్వరు?

నీ ప్రేమ నిజమైనదే అయితే
నిన్ను బంధించగల వారెవ్వరు?
నీ దీక్ష స్వచ్చమైనదే అయితే
దాన్ని విరమింపజేసే వారెవ్వరు?

అసలు విషయం అది కాదు
నీ ప్రేమలో బలమే లేదు 
నీ ఆశకు నువ్వొక బందీవి
నీ మనసుకు నువ్వొక అంగీవి

నీ తాహతును మించి
ఎక్కువగా ఆశిస్తున్నావు
నీ శక్తిని మించి
ఎక్కువగా కోరుతున్నావు

ప్రియుని నీవు కోరడం కాదు
అతనిలో నీవు కరగిపోవాలి
సముద్రాన్ని నీవు త్రాగడం కాదు
దానిలోనే నువ్వు మునిగిపోవాలి

ఆకసాన్ని అందుకోవడం కాదు
నీ పిడికిలిని నీవే విప్పాలి
అన్నాన్ని నీవు తినడం కాదు
నువ్వే ఆహారంగా మారాలి

ఆశించడం ఆపాలి
నువ్వే ఆహుతి కావాలి
ఆక్రోశం అణగాలి
ఆత్మార్పణ చెయ్యాలి

ఆ ధైర్యం నీకుందా?
ఆ స్థైర్యం నీకుందా?
ఏ ముగింపుకూ వెరవని
తెగింపు నీలో ఉందా?

ఉంటే --

అడుగో నీ ప్రియుడు
నీ ఎదుటే..
నీలోనే...
నువ్వే...