గోసాయి పదాలు,బైరాగి చిటికెలు అనే మాటలు ఈ తరానికి తెలియవు.కానీ నా చిన్నప్పుడు ఈ పదాలు తరచుగా వినేవాళ్ళం.పల్లెటూళ్ళలో అడుక్కుంటూ తిరిగే బైరాగుల నోళ్ళలో ఇవి వినబడుతూ ఉండేవి.
నేను హైస్కూలు చదివే రోజుల్లో ఒక బైరాగి ఈ గోసాయి తత్త్వాన్ని పాడుతూ తంబురా మీటుతూ అడుక్కోవడానికి వచ్చేవాడు. అతన్ని వెంటబడి బ్రతిమాలి ఈ తత్త్వాన్ని నా తెలుగు నోట్సులో వ్రాసుకున్నాను.ఆ నోట్సు పోయినా, ఎప్పటికప్పుడు ఎత్తి వ్రాసుకుంటూ ఇన్నేళ్ళ తర్వాత కూడా భద్రంగా దీనిని బ్రతికిస్తూ ఇప్పటిదాకా తెచ్చాను.
పాత కాగితాల త్రవ్వకాలలో బయటపడిన వాటిలో ఇదీ ఒకటి.
చదవండి.
--------------------------
రాగం :-- కదనకుతూహల రాగం
తాళం :-- ఆదితాళం
--------------------------
ఆడదాన్ని నమ్మబోకు నరుడాఅగచాట్లను పొందబోకు నరుడా
అడుసు తొక్కి కడుగనేల గురుడా
అలుపు దెచ్చు పరుగులేల గురుడా ||ఆడదాన్ని||
నంగనాచి నాటకాలు నరుడా
నమ్మినావ నరకమేర నరుడా ||ఆడదాన్ని||
సంసారపు సుద్దులేల గురుడా
సన్యాసం సుఖమిచ్చును గురుడా ||ఆడదాన్ని||
నమ్మితేను నాంచారిని నరుడా
నెత్తికెక్కి నాట్యమాడు నరుడా ||ఆడదాన్ని||
వయ్యారని వెంటబోకు గురుడా
సయ్యాటలు చావుదెచ్చు గురుడా ||ఆడదాన్ని||
ముండమోపి మోహమేల నరుడా
బండదాని భ్రమల బడకు నరుడా ||ఆడదాన్ని||
వగలు జూచి వీగిపోకు గురుడా
పగలు రేయి పాడుజేయు గురుడా ||ఆడదాన్ని||
రంగు జూచి మోసపోకు నరుడా
రక్తమాంస పంజరమ్ము నరుడా ||ఆడదాన్ని||
ఒంపుసొంపు లంటినంత గురుడా
వైతరణిని దాటలేవు గురుడా ||ఆడదాన్ని||
మెరమెచ్చుల బడినావా నరుడా
మరమనిషై పోతావుర నరుడా ||ఆడదాన్ని||
కొంగుబట్టి తిరుగబోకు గురుడా
కొండముచ్చు బ్రతుకౌరా గురుడా ||ఆడదాన్ని||
పడతి మేను పట్టిజూడ నరుడా
చీమునెత్తురుల చెరువే నరుడా ||ఆడదాన్ని||
శుక్లశోణితాల జూచి గురుడా
శోషదెచ్చు కొబోకుర గురుడా ||ఆడదాన్ని||
సిగ్గుబోవు సరసమేల నరుడా
ఒగ్గు వగల జిక్కబోకు నరుడా ||ఆడదాన్ని||
ఆడదంటె నరకమేర గురుడా
అందులోన సుఖము లేదు గురుడా ||ఆడదాన్ని||
కోరచూపు కాటుకన్న నరుడా
కోడెత్రాచు కాటుమేలు నరుడా ||ఆడదాన్ని||
ఆడదాని మాటలెపుడు గురుడా
అబద్దాల మూటలేర గురుడా ||ఆడదాన్ని||
ఆడదాన్ని దరిజేర్చకు నరుడా
ఆమడ దూరానబెట్టు నరుడా ||ఆడదాన్ని||
గొగ్గెర వేషాల నమ్మి గురుడా
గోచిపాత జారనీకు గురుడా ||ఆడదాన్ని||
ఓయంటూ సరసమాడ నరుడా
ఓజస్సే క్షీణించును నరుడా ||ఆడదాన్ని||
పడతి చెంత జేరినావ గురుడా
పనికిరాక పోతావుర గురుడా ||ఆడదాన్ని||
ఇచ్చకాల బడినావా నరుడా
ఇహపరముల చెడిపోదువు నరుడా ||ఆడదాన్ని||
వనితల దూరాననుంచి గురుడా
విష్ణువునే ధ్యానించర గురుడా ||ఆడదాన్ని||
బైరాగుల మాటలన్ని నరుడా
బంగారపు మూటలేర నరుడా ||ఆడదాన్ని||
గురుబోధను చక్కగాను నరుడా
గుండెలోన నిలుపుకోర నరుడా ||ఆడదాన్ని||
ఆడదాన్ని నమ్మబోకు నరుడా
అగచాట్లను పొందబోకు నరుడా