Pages - Menu

Pages

21, మార్చి 2016, సోమవారం

హోమియో అద్భుతాలు - అయిదు నిముషాల్లో మాయమైన మైగ్రెయిన్

హోమియోపతి అంటే అది చాలా నిదానంగా పని చేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.నేను వాళ్ళతో వాదించను. అది అబద్దం అని ప్రాక్టికల్ గా చూపిస్తాను.

మొన్నొక రోజున కొంతమంది నాతో ఏదో జ్యోతిష్యపరమైన పని ఉండి వచ్చారు.వాళ్ళతో మాటల సందర్భంలో - వాళ్ళు ఇదే మాట అన్నారు.నేను నవ్వి ఊరుకున్నాను.

చాలామంది ఇంతే.వాళ్ళొచ్చిన పని చూసుకుని పోకుండా ఏదేదో అనవసరమైన సోది మొదలు పెడతారు.నాకు మహా విసుగు పుడుతుంది.

హోమియో స్లోగా పనిచేసే సంగతి నిజమా కాదా అని వాళ్ళలో ఒకాయన అడిగాడు.

దానికీ నేనేమీ జవాబు చెప్పలేదు.ఈ మధ్యలో నేను ఎవ్వరితోటీ వాదించడం లేదు.సత్యం నాకు తెలుసు ఒకరికి నిరూపించ వలసిన పని లేదు.ఎవరికి ఆ సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉన్నదో వారే నా దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు.మిగతా వాళ్ళు రాలేరు.ఈ విషయం స్పష్టంగా అర్ధమయ్యాక నేను ఇతరులతో వాదించడం ఒకరిని ఒప్పించాలని ప్రయత్నించడం పూర్తిగా మానేశాను.ఎదుటి వ్యక్తులు నాతో వాదన పెట్టుకోవాలని చూస్తే సింపుల్ గా నవ్వేసి ఊరుకుంటాను.ఒంటి చేత్తో వాళ్ళు మాత్రం ఎంతసేపు చప్పట్లు కొట్టగలరు? విసుగు పుట్టి వాళ్ళూ ఊరుకుంటారు.

ఈ సంభాషణ సాగుతూ ఉండగా మా క్రింద ఇంట్లో పనిచేసే ఒక పాతికేళ్ళ అమ్మాయి మా ఇంటికి వచ్చింది.ఆ అమ్మాయి ముఖం చూస్తే నిస్తేజంగా ఏదో బాధపడుతూ ఉన్నట్లు చాలా డల్ గా కనిపించింది.

'ఏంటి అలా ఉన్నావు?' అని అడిగాను.

'వారం నుంచీ తలనొప్పి వస్తున్నది.తగ్గడం లేదు.ఇంతకు ముందు ఒకసారి జ్వరం వస్తే మీరు మందిచ్చారు.వెంటనే తగ్గింది.అందుకని తలనొప్పికి కూడా మందు కోసం మీ దగ్గరకు వచ్చాను.' అంది నీరసంగా కూలబడుతూ.

'మరి తలనొప్పికి ఏం చేశావు?' అడిగాను.

'ఆస్పత్రికి పోతే ఎక్స్ రే తియ్యమన్నారు.తీశాము.అందులో ఏమీ లేదని ఈసారి స్కానింగ్ చేయించమన్నారు.మా దగ్గర అంత డబ్బులు లేవు.అందుకని ఏదైతే అదౌతుందని ఊరుకున్నాము. ఈ నొప్పి మాత్రం తగ్గడం లేదు.' అన్నది ఏడుపు మొహంతో.

ఇలాంటి సన్నివేశాలు ఎదురుకావడం నాకు చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది.అప్పటిదాకా నాతో హోమియోపతి గురించి వాదిస్తున్న వాళ్లకు నిదర్శనం చూపడం కోసమే ఈ సన్నివేశం సృష్టింప బడిందని నాకర్ధమైంది.

అమ్మ ఇలాంటి సన్నివేశాలు నా చుట్టూ చాలా సృష్టిస్తూ ఉంటుంది.ఆమెకు అదొక ఆట.

'నీ తలనొప్పి ఎలా ఉంటుందో కాస్త వివరించు' అన్నాను.

'మొత్తం కుడివైపే వస్తుంది.అది ఎక్కువైనప్పుడు విపరీతమైన నీరసంగా ఉంటుంది.' అన్నది.

'తలమొత్తం ఉంటుందా? లేక ఏదైనా ఒక్కచోటేనా ? అడిగాను.

'కుడివైపే మొత్తం ఉంటుంది.ఒక వారం నుంచి ఎక్కువగా ఉంటున్నది.ఒంట్లో రక్తం కూడా ఉండవలసినంత లేదన్నారు.' అన్నది.

'ఏం చేస్తే ఎక్కువౌతుంది? ఏం చేస్తే తగ్గుతుంది?' అడిగాను.

'ఏమో అవన్నీ నాకు తెలీవు.కానీ ఒక్కటి చెప్పగలను.తల ముందుకు వంచినప్పుడు బాగా ఎక్కువౌతుంది.నిటారుగా కూచుంటే కాస్త మామూలుగా ఉంటుంది.' అన్నది.

ఒక వారం నుంచీ గుంటూరులో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల వల్ల చాలామంది రకరకాల బాధలతో అడ్డం పడుతూ ఉన్నారు. డాక్టర్లేమో బీదా బిక్కీ అని కూడా చూడకుండా స్కానింగులూ ఇంకా ఏవేవో టెస్టులూ వ్రాసి వాళ్ళను హింస పెడుతున్నారు.

తలలో ఏవైనా గడ్డలు ఉంటేనే స్కానింగ్ అవసరం అవుతుంది. కానీ అలా ఉన్నప్పుడు ఉండే లక్షణాలు వేరే ఉంటాయి.అవి ఈ అమ్మాయిలో లేనప్పుడు స్కానింగ్ ఎందుకో నాకైతే అర్ధం కాలేదు.బహుశా ఇవన్నీ వాళ్ళు కొన్న ఎక్విప్ మెంట్ డబ్బులు త్వరగా రాబట్టుకోడానికి చేసే జిమ్మిక్కులై ఉంటాయి.

ఆ అమ్మాయిని అడిగి ఆ తలనొప్పి గురించి ఇంకొన్ని లక్షణాలు సేకరించి 'శాంగ్వినేరియా-200' అనే మందు రెండు గుళికలు ఇచ్చి చప్పరించమన్నాను.ఆ తర్వాత ఒక గుక్క నీళ్ళు త్రాగమని చెప్పాను.ఒక్క పది నిముషాలు కూచోమని ఆ అమ్మాయికి చెప్పాను.

ఇదంతా ఆ వచ్చిన వాళ్ళు గమనిస్తూ ఉన్నారు.

ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఒక పది నిముషాలు గడిచాయి.

'తలనొప్పి పూర్తిగా మాయమైంది సార్.ఒంట్లో నీరసం కూడా తగ్గింది.నేను వెళతాను' అంటూ ఆ అమ్మాయి లేచింది.

ఆమె వైపు చూశాను.

ముఖం తేటగా మారింది.వచ్చినపుడు ఉన్న అలసట ఇప్పుడు తన ముఖంలో లేదు.స్వరంలో కూడా మార్పు వచ్చింది.

'పూర్తిగా తగ్గిందా? కొంచం ఉందా ఇంకా?' అడిగాను.

'పిసరంత కూడా లేదు.మొత్తం మాయమై పోయింది.వెళతాను సార్,పనికి పోవాలి.చేసుకుంటే గాని మాకు తిండి గడవదు.' అంది తను.

'సరే.వెళ్ళు.మళ్ళీ తలనొప్పి వస్తే రా.అంతేగాని ఆ ఇంగ్లీషు వైద్యానికి వెళ్ళకు.' అని చెప్పాను.

సరే నని నమస్కారం పెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.

'మీ కళ్ళతో మీరే చూచారుగా? ఇప్పుడేమంటారు?' అడిగాను అప్పటి వరకూ హోమియో స్లోగా పనిచేస్తుంది అని వాదిస్తున్న వారిని.

వాళ్ళు ఇదంతా నమ్మలేక పోతున్నట్లు నాకు అనిపించింది.ఆ అమ్మాయిని నేనే పిలిపించి వాళ్ళను నమ్మించడానికి అలా యాక్షన్ చెయ్యమని చెప్పానేమో అని వాళ్ళ అనుమానం.

ఆ విషయం వాళ్ళ మొహాలు చూస్తే నాకర్ధమైంది.

వాళ్ళ కళ్ళెదురుగా కనిపించిన ఈ నిజం గురించి ఇంకా మాట్లాడి వాళ్ళను ఒప్పించాలని నేనేమీ ప్రయత్నించలేదు.సత్యాన్ని గ్రహిస్తే వాళ్ళ అదృష్టం, లేకపోతే వాళ్ళ ఖర్మ. అంతే. కళ్ళెదురుగా కన్పిస్తున్నా కూడా నమ్మకపోతే మనమేం చెయ్యగలం?

సరియైన హోమియో ఔషధం పడితే నిముషాలు కూడా అక్కర్లేదు.సెకండ్లలో నొప్పులూ జ్వరాలూ ఆయాసాలూ తగ్గడం నేనెన్నో సార్లు కళ్ళారా చూశాను.అయితే చెబితే వీటిని ఎవరూ నమ్మరు.ఏదైనా అనుభవం మీదే అర్ధమౌతుంది కదా మరి.

జనంలో ఎన్నో మూఢనమ్మకాలుంటాయి.సత్యాన్ని కూడా నమ్మకపోవడమూ, దానినే మూఢనమ్మకం అనుకోవడమే ఒక పెద్ద మూఢనమ్మకం.

మేము చదువుకున్న వాళ్ళం మాకంతా తెలుసు అని గర్వంతో విర్రవీగే వాళ్ళకు సత్యం అందదు.అమాయకంగా నమ్మేవాళ్ళ చెంతనే అది ఎప్పుడూ ఉంటుంది.

కర్మ నెత్తిన కూచుని ఆడిస్తున్నపుడు మంచి చెప్పినా అర్ధం కాదుకదా. అదంతే.