Once you stop learning, you start dying

30, మార్చి 2016, బుధవారం

గంధర్వ సంగీతం..

నిశీధ నిబిడాంధకార
సముద్రపు లోతుల్లోకి
సడిలేకుండా దిగివచ్చిందొక
సూర్యుని కాంతిపుంజం

యుగాలుగా కదలిక లేని
మరణాల మత్తుల్లోకి
వడిగా అరుదెంచిందొక
అమృత దివ్యధామం

మసిబారిన మస్తిష్కపు
చీకటి గదుల్లోకి
తానై ప్రసరించిందొక
వెలుగుల ప్రవాహం

కర్మరోదనా భరిత
కారడవుల మూలల్లోకి
అడుగు మోపిందొక
ఆనందపు ఆకాశం

కష్టాల కన్నీళ్ళ కట్లను
తుత్తునియలు గావిస్తూ
ఒళ్ళు విరుచుకుందొక
మహిమా విలాసం

మాయా మోహాలనన్నింటినీ
మసిచేసి పారేస్తూ
కళ్ళు తెరిచిందొక
ప్రజ్ఞా ప్రకాశం

అయోమయపు అట్టడుగుల్లో
వియోగాల వింత వీధుల్లో
వినసొంపుగా వినిపించిందొక
గంధర్వ సంగీతం...