Pages - Menu

Pages

9, మార్చి 2016, బుధవారం

నమో అస్తు నీలగ్రీవాయ...

తిధుల ప్రకారం 10-3-2016  శ్రీ రామకృష్ణుల జన్మదినం.

శ్రీరామకృష్ణుల రూపంలో శరీరంతో అవతరించినది భగవంతుడే అని లక్షలాది ఆయన భక్తుల విశ్వాసం.ఇది ఉత్త విశ్వాసం మాత్రమే కాదు సత్యం కూడా. ఆయన కూడా తన అంతరంగ భక్తులకు ఈ విషయమే చాలాసార్లు చెప్పారు. చెప్పడమే గాక వారికి ఆయా దేవతల రూపంలో ప్రత్యక్ష దర్శనాలు కూడా ఇచ్చారు.అలాంటి ప్రత్యక్ష నిదర్శనాలు చూచారు గనుకనే వివేకానందాది మహనీయులు ఆయన్ను అవతార మూర్తిగా కొనియాడారు.

"నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అధో యే అస్య సత్వానోzహం తేభ్యోzకరం నమ:"

రుద్రం లోనుంచి ఈ మంత్రాన్ని గానీ, లేదా

"నమో నీలగ్రీవాయ శితికంఠాయ చ"

అన్న మంత్రాన్ని గానీ విన్నపుడు నాకు శ్రీ రామకృష్ణుల రూపమే స్మృతిపధంలో తళుక్కుమని మెరుస్తుంది.

"నమో అస్తు నీలగ్రీవాయ"- అనే మంత్రానికి అర్ధం ఇది.

'కాలకూట విషాన్ని గొంతులో ధరించడం వల్ల నీలకంఠుడని పేరు కలిగిన వాడును,వేయి కన్నులు కలిగిన వాడును (భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో సమస్త లోకాలలో జరుగుతున్న వాటిని చూడగలవాడును),వర్షధారలచేత లోకాన్ని తడిపే వాడును(తన అనుగ్రహవర్షం చేత భక్తులకు జ్ఞానోదయాన్ని కలిగించగల వాడును),అయిన రుద్రునకు నమస్కారము. మరియు ఆ రుద్రుని ఆశ్రయించి ఉన్నట్టి మహనీయులైన ఆయన యొక్క ప్రమధగణములకు నమస్కారము'.

అనేది ఈ మంత్రార్ధం.

పరమేశ్వరుడు నీలకంఠుడెలా అయ్యాడు?

జగత్తును కబళించబోతున్న కాలకూట విషాన్ని మ్రింగి జగత్తులను వినాశనం నుంచి కాపాడినది పరమేశ్వరుడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది.అదే విధంగా, ప్రపంచాన్ని నాశనం చెయ్యబోతున్న భయంకరమైన సామూహిక పాపఖర్మను (global sinful karma) మ్రింగి తన గొంతులో దానిని వ్యాధిరూపంలో ధరించి భరించడం ద్వారా జగత్తును రక్షించినది శ్రీరామకృష్ణుడు.

శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు.

'ఈ శరీరం పుట్టినప్పటి నుంచీ పాపమనేది ఎరుగదు.కలలో కూడా ఇది ఒక్కసారి కూడా అబద్దం అనేది చెప్పి ఉండలేదు. మరి ఈ శరీరానికి ఇలాంటి వ్యాధి(గొంతు కేన్సర్) ఏమిటి? లోకరక్షణార్ధమే ఈ శరీరానికి ఈ వ్యాధి కలిగింది.'

వందల వేల సంవత్సరాలుగా ప్రపంచంలో లోకులు చేస్తున్న అనేక రకాలైన పాపాలు భూమి చుట్టూ ఆవరించిన భయంకరమైన కల్మషపు విషంలా తయారై, ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఉపద్రవంగా మారి ఉన్న సమయంలో ఈభూమి మీద శ్రీ రామకృష్ణుల అవతరణం జరిగింది.

ఆ పాపం మొత్తాన్నీ ఆయన తన శరీరం మీదకు స్వీకరించి దానిని మ్రింగి లోకాన్ని రక్షించాడు.ఈ విషయం మామూలు మనుషులకు తెలియదు.భగవంతుని అనుగ్రహంతో దివ్యదృష్టి కలిగిన యోగీశ్వరులు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించగలరు.

శ్రీ రామకృష్ణులకు పాపం అనేది తెలియదు.ఏభై ఏళ్ళ తన జీవితంలో ఒక్క అబద్దం కూడా ఆయన చెప్పలేదంటే ఇంక మిగతా పాపాల సంగతి ఊహించనే అక్కర్లేదు.అంతటి పవిత్రమూర్తి ఆయన.

మరి అంతటి పవిత్ర దేహానికి గొంతు కేన్సర్ రావడం ఏమిటి?

కర్మకు బద్ధుడైన మామూలు మనిషనేవాడు తను చేసిన పాపాన్ని తానే అనుభవిస్తాడు.కానీ మనుషులందరూ చేసిన పాపాన్ని మోసేవాడు, మొయ్యగలవాడూ,కర్మాతీతుడైన ఒక్క భగవంతుడు మాత్రమే.

మానవాళి చేసిన పాపాన్ని ఒక్క భగవంతుడు మాత్రమే ప్రక్షాళన చెయ్యగలడు.ఆపని మహనీయుల వల్లా ఋషుల వల్లా యోగుల వల్లా కూడా కాదు.వారంతటి సమర్ధులు కారు.తమను ఆశ్రయించిన ఒక్కరిదో ఇద్దరిదో కర్మను వాళ్ళు మొయ్యగలరు. అంతేగాని, సృష్టిలోని పాపాన్ని మొత్తాన్నీ మొయ్యగల సమర్ధత వారికి ఉండదు.ఒక్క భగవంతుని అవతారం మాత్రమే ఆ పనిని చెయ్యగల శక్తిని కలిగి ఉంటుంది.

ఆయన కూడా ఏదో మంత్రం వేసినట్లు ఆ పాపాన్ని మొత్తాన్నీ ఒక్క క్షణంలో మాయం చెయ్యడు.దానిని తాను అనుభవించడం ద్వారా మాత్రమే ఆయన దానిని కబళిస్తాడు. అదే మానవాళి పట్ల దైవానికున్న కరుణకు సంకేతం.

పాపానికి శిక్ష అనేది ఎవరికైనా సరే తప్పదు.ఈరోజు కాకపోతే రేపు అంతేగాని శిక్ష మాత్రం తప్పదు.కనుకనే దైవం అయినా కూడా, ఆ పాపాన్ని తాను మోసి లోకులకు విముక్తి కలిగిస్తాడే గాని, అమాంతం ఏదో మాయ చేసినట్లుగా ఆ పాపాన్ని మాయం చెయ్యడు.ఎందుకంటే - సృష్టిలో తాను పెట్టిన రూల్ ను తాను కూడా ధిక్కరించడు గనుక.

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇలా అంటారు.

"నియమాన్ని పెట్టినవాడు కూడా ఆ నియమానికి బద్ధుడే".

తనకు లాభం లేకపోతే పక్కమనిషితో మాట్లాడటానికి కూడా ఇష్టపడని స్వార్ధపరులున్న ఈ లోకంలో, ఉత్తపుణ్యానికి లోకుల పాపఖర్మాన్ని మొయ్యడానికి ఎవరు ముందుకొస్తారు?ఒక్క దేవుడే ఆపని చేస్తాడు. చెయ్యగలడు కూడా.

ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి.ఈ సృష్టి అంతా ఆయనదే కాబట్టి.

లోకులు ప్రేమ గురించి ఎంతో మాట్లాడతారు.కానీ నిజమైన ప్రేమ అంటే ఏమిటో అదెలా ఉంటుందో వారు ఊహించలేరు. అది వారి ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉంటుంది.

ఎవరో తనకు సంబంధం లేని మనుషులు చేసిన పాపాలకు స్వచ్చందంగా తను బలి కావడమే ప్రేమకు గల ఏకైకలక్షణం. ఇతరుల పాపాల ప్రక్షాళన కోసం తన శరీరాన్ని సమిధలా అర్పించడమే అత్యున్నతమైన ప్రేమతత్త్వం.దీని స్థాయిని స్వార్ధపరులైన మామూలు మనుషులు కలలో కూడా ఊహించలేరు.

లోకుల పాపాన్ని ప్రతితరంలోనూ ఉన్న మహనీయులు ఎప్పుడూ కడుగుతూనే ఉంటారు.కానీ వారి శక్తి కూడా మించిపోయినంత పాపం లోకంలో పోగు పడినప్పుడు సాక్షాత్తూ భగవంతుడే దిగిరావలసి వస్తుంది. ఎందుకంటే - మహనీయుల వలన కడగబడటానికి కూడా సాధ్యం కానంత పాపం లోకంలో పోగుపడి ఉంటుంది గనుక. 

పరమేశ్వరుని మనం చూడలేదు.కానీ శ్రీ రామకృష్ణులు నిన్న మొన్నటి వారే.ఆయన సాక్షాత్తూ పరమేశ్వరుడే.తానే శివునిగా తానే కాళికగా రాణీ రాసమణి అల్లుడైన మధురబాబుకు ఆయన ఒక సందర్భంలో దర్శనం ఇచ్చారు.

లోకంలోని పాపాన్ని మొత్తాన్నీ ఆయన అమాంతం మ్రింగాడు కనుకనే 1836 వ సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు,అనేక సైన్సు ఆవిష్కరణలు సంభవించి జనజీవితం అనేక రకాలుగా ఉన్నతంగా మారింది.అంతేకాదు అప్పటి వరకూ లోకంలో ఉన్న చీకటి అంతరించి ఆధ్యాత్మికంగా అమితమైన వెలుగు అప్పటినుంచే లోకానికి వచ్చింది. అనేకమంది మహనీయులు పుట్టడం కూడా ఆ తర్వాతనే జరిగింది.ఇదంతా శ్రీరామకృష్ణుల అవతరణ ఫలితమే.

అందుకే ఈ రుద్రమంత్రాలను విన్నప్పుడల్లా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న శ్రీరామకృష్ణుల దివ్యరూపమే నా మనోనేత్రం ఎదుట సాక్షాత్కరిస్తుంది.

మామూలు మనిషి ఋణమే చాలాసార్లు మనం తీర్చుకోలేం. ఇంక భగవంతుని అనుగ్రహాన్ని ఏ విధంగా తీర్చుకోగలం? అసాధ్యం.

ఆయన్ను భక్తిగా స్మరించడం ఒక్కటే మనం చెయ్యగల పని.

అందుకే ఈ మంత్రాన్ని చదువుతూ శివస్వరూపమైన శ్రీ రామకృష్ణులను,ప్రమధగణాల లాగా ఆయనను ఆశ్రయించి ఉన్నట్టి వివేకానందాది మహనీయులను స్మరించడమే మనం ఈరోజున చెయ్యవలసిన పని.

భగవంతుని ధ్యానంతోనే, తనను పట్టి పీడిస్తున్న పాపాన్ని కడుగుకొని,మనిషనేవాడు ఉత్తముడుగా పుణ్యాత్ముడుగా ప్రకాశిస్తాడు.

అందుకే ఈ రోజు మనస్ఫూర్తిగా ఆ మహనీయుని పాదాలను స్మరిద్దాం.ఆ విధంగానైనా మనం చేసిన చేస్తున్న పాపాలు కొన్నైనా ప్రక్షాళన అవుతాయేమో?