నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, మార్చి 2016, మంగళవారం

VIP దర్శనం

నిన్న ఉదయం మా కొలీగ్ ఒకాయన ఫోన్ చేశాడు.అతనికి గతంలో నేనొక హెల్ప్ చేసి ఉన్నాను.అందుకని కృతజ్ఞతతో అలా అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉంటాడు.

'రాత్రికి కోటప్పకొండకు వస్తున్నారా?' అడిగాడు.

'లేదు.నరసరావు పేట స్టేషన్ కు మాత్రం వస్తే వస్తాను.కొంచం పనుంది.' చెప్పాను.

'అక్కడిదాకా వస్తూ కొండకు రారా?అలా చెయ్యకండి.స్టేషన్లో కారు పెడతాను. మీ పని అయిపోయాక కొండకు రండి.దగ్గరుండి VIP దర్శనం చేయిస్తాను. అర్ధరాత్రి పన్నెండు సమయంలో అయితే మంచిది.లింగోద్భవ కాలంలో దర్శనం చేసుకోవచ్చు.' అన్నాడు.

'నేను చాలాసార్లు కోటప్పకొండ వచ్చాను.దర్శనం చేసుకున్నాను.' చెప్పాను.

'అలాకాదు.ఇవాళ అలంకరణ చాలా బాగుంటుంది.తప్పకుండా రండి.నేను కొండమీదే ఉంటాను.మీరు స్టేషన్లో బయలుదేరగానే ఫోన్ చెయ్యండి.' అన్నాడు.

'నాకు అలంకరణ మీద ఇంట్రెస్ట్ లేదు.అలంకరణ చూడటం కోసం అంత దూరం రాలేను.అయినా మనకు కావలసింది అలంకరణా లేక దేవుడా?' అడిగాను.

'అలంకరణతో కూడిన దేవుడు' అంటూ నవ్వేశాడు.

'అలాకాద్సార్.ఈరోజు ఇక్కడకు ఎన్నో ప్రభలు వస్తున్నాయి.వేలాది జనం ఉంటారు. చాలా సంబరంగా కోలాహలంగా ఉంటుంది కదా.సరదాగా రండి' అన్నాడు మళ్ళీ.

'అందుకనే నేను రానంటున్నాను.అందులో సరదా ఏముంది? అయినా అక్కడకు వచ్చి ఏం చూడాలి?ఆ జనాన్నీ వాళ్ళ గోలనే కదా? అది నాకిష్టం లేదు.దయచేసి నన్ను బలవంత పెట్టవద్దు.' చెప్పాను.

'మరి శివరాత్రి ఎక్కడికీ వెళ్ళరా?' అడిగాడు.

'ఎక్కడో ఒకచోటకు వెళతాను.ఎవరూ లేని, ఎవరూ రాలేని చోటుకు వెళతాను. అక్కడా నాకు VIP దర్శనం రెడీగా ఉంటుంది' అన్నాను.

'పోనీ నరసరావుపేటలో మీరు ఎక్కడికి వెళతారో చెప్పండి.నేనూ మీతో వస్తాను.' అన్నాడు.

'నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకండి.నేను వెళ్ళే చోటుకు మీరు రాలేరు' అన్నాను.

'అదేంటి సార్? చేతిలో కారుంది.వెళ్లోద్దాం. దూరమా?లేక కారు అక్కడకు పోలేని కుగ్రామమా?' అడిగాడు.

'అవును.కారు అక్కడకు పోలేదు.' చెప్పాను.

'మరెలా?నడచి వెళతారా?రాత్రిపూట అలాంటి సాహసాలు చెయ్యకండి. పురుగూ పుట్రా ఉంటాయి.' అన్నాడు.

నేను కొండల్లోకీ అడవుల్లోకీ ఒక్కడినే పోతూ ఉంటానని అతనికి తెలుసు. రెండేళ్ళ క్రితం ఒక కొండమీదకు నాతో అలా వచ్చాడు.

'అదేమీ లేదు.ఈరాత్రికి నేను వెళ్ళే దారి వేరు.కాళ్ళతో నడిచే బాట కాదది. అందులో నడవాలంటే చాలా ట్రెయినింగ్ కావాలి.' చెప్పాను.

అప్పటికీ అతనికి అర్ధం కాలేదు.

'సర్లెండి సార్. ఎక్కడో ఒకచోట లింగోద్భవ సమయానికి దర్శనం చేసుకోండి. మంచిది.' అన్నాడు.

'లింగోద్భవం అయ్యాక ఇంక దర్శనమేముంటుంది చేసుకోడానికి?అయినా అది జరిగేది బయట కాదుగా?' అన్నాను.

'ఏంటో అర్ధం కావడం లేదు సార్' అన్నాడు.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది.అర్ధమైనప్పటి నుంచీ అన్నీ ఇబ్బందులే. నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్. ఇంకోసారి ఎప్పుడైనా తీరికగా కలుద్దాం.' అని ఫోన్ పెట్టేశాను.

రాత్రి నేనెక్కడికీ పోలేదు.

కానీ VIP దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది.