Pages - Menu

Pages

11, ఏప్రిల్ 2016, సోమవారం

చెండుతున్న మండువేసవి

చెండుతున్న మండు వేసవి
ఎంతో ఆహ్లాదంగా ఉంది
ఎండుతున్న కృష్ణానది లాగే
నా తృష్ణానది కూడా...

ఈడ్చి కొడుతున్న గాడ్పు
పూడ్చి పెట్టిన వాసనల్ని
పుచ్చె పగలగొడుతోంది
నా మనసు గది కూడా...

పురుగులేని వీధి
పులకింతలు రేపుతోంది
శూన్యపు వసారాలాంటి
నా ఎద కూడా...

మంటల్లో కాలుతున్న గుడిసె
మనోహరంగా ఉంది
భస్మపు కాసారం లాంటి
నా మది కూడా...

బీటలు చీలుతున్న నేల
మహోల్లాసంగా ఉంది
ఇక ఏమాత్రం మెత్తబడని
నా హృది కూడా...

నిప్పులు చెరుగుతున్న ఎండ
మహోజ్జ్వలంగా ఉంది
మదిలో కళ్ళు తెరిచిన
మహాజ్ఞానం కూడా...

వడగాడ్పులు తీసే ప్రాణాలు
ఎక్కడో లయమౌతున్నాయి
వింతగా ఎగసే 
నా ధ్యానాలు కూడా...

గతిలేక దాక్కున్న ప్రజలు
బిక్కు బిక్కుమంటున్నారు
మతిలేని ఈ లోకంలో
నేను కూడా....