“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

16, ఏప్రిల్ 2016, శనివారం

తేనె తుట్టెను కదిలించు

తేనె తుట్టెను కదిలిస్తేనే తేనె దొరుకుతుంది.దానిని ఎలా కదిలించాలో మనకు తెలియాలి. తుట్టె పక్కన కూచుని నేలమీద దుమ్ము రేపుతుంటే మనకు దుమ్మే మిగులుతుంది. దానిని కదిలిస్తే మాత్రం తేనె దొరుకుతుంది.

చాలామంది నన్ను ఎన్నో అడుగుతూ ఉంటారు.ఎవరి ప్రశ్నను బట్టి ఎవరి టాపిక్ ను బట్టి వారికి ఆయా స్థాయులలో జవాబులు వస్తూ ఉంటాయి. ఎవరికి తోచిన విషయాలతో వాళ్ళు నన్ను కదిలిస్తూ ఉంటారు. సంభాషణలు నడుస్తూ ఉంటాయి.వాళ్ళతో విసుక్కోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాను.కానీ నా మనస్సుకు నచ్చిన స్థాయిలో మాట్లాడేవాళ్ళు మాత్రం అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు.అలాంటి వారిలో చరణ్ ఒకడని చెప్పనవసరం లేదుగా?

నిన్న చరణ్ వచ్చాడు.తనొచ్చిన పని గురించి మాట్లాడిన తర్వాత అసలు మాటలు మొదలయ్యాయి.

'అమెరికా ప్రోగ్రాం ఏమిటి అన్నగారు?' అడిగాడు చరణ్.

'అంతా ఫిక్స్ అయింది చరణ్.మే ఆరో తేదీన డెట్రాయిట్ పరాశక్తి టెంపుల్ లో 'శ్రీవిద్య' గురించి మాట్లాడబోతున్నాను.ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం. అమ్మ అనుగ్రహంతోనే ఇది సాధ్యమౌతోంది.తను ఇచ్చిన శక్తితో తనగురించి చెప్పబోతున్నాను.' అన్నాను.

'అవునన్నగారు - "నువ్వు కోరితే కోరినది మాత్రమె ఇస్తాను. ఏదీ కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను" - అని అమ్మ అన్నారు కదా.అది అక్షరాలా నిజం - అంటూ గోడకు ఉన్న జిల్లెళ్ళమూడి అమ్మ ఫోటో వంక చూచాడు చరణ్.

'అవును తమ్ముడూ మనకు ఎప్పుడేది అవసరమో అమ్మకు తెలిసినంతగా మనకు కూడా తెలియదు.ప్రస్తుతం ఈ విధంగా నాచేత చేయిస్తున్నది.తన అనుగ్రహం కాకుంటే ఎక్కడ డెట్రాయిట్ పరాశక్తి టెంపుల్?ఎక్కడ గుంటూరు? అక్కడ "శ్రీవిద్యాతంత్రం" గురించి నేను మాట్లాడటం ఏమిటి?అమ్మ అనుగ్రహం కాకుంటే ఇది మరేమిటి?' అన్నాను.

అవునన్నట్లు తలాడించాడు చరణ్.

'రికార్డ్ చెయ్యండి అన్నగారు.మేమందరం కూడా వినాలి మీ స్పీచ్,' అన్నాడు.

'అలాగే చేయిస్తాలే' -  అన్నాను.

'ఆ తర్వాత ఏమిటి ప్రోగ్రాం?' అడిగాడు.

'మే 13 నుంచి 16 వరకూ అక్కడ దగ్గరలోనే ఉన్న 'గాంగెస్' రామకృష్ణా ఆశ్రమంలో స్పిరిచ్యువల్ రిట్రీట్ చేస్తున్నాము. మనవాళ్ళంతా అక్కడకు వస్తున్నారు. ఆ నాలుగు రోజులూ అక్కడే మనతో ఉంటారు.నాలుగు రోజులూ పూర్తిగా ఆధ్యాత్మిక వ్యాసంగాలలో జరపాలని ప్లాన్ చేస్తున్నాము.' అన్నాను.

'గాంగెస్' అంటే ఎక్కడుంది అన్నగారు?' అడిగాడు చరణ్.

'అది డెట్రాయిట్ కు దాదాపు మూడు గంటల డ్రైవ్ దూరంలో ఉన్నది.అక్కడొక విశాలమైన మంచినీటి సరస్సు ఉంది. వివేకానంద స్వామి అమెరికాకు వెళ్ళినపుడు అక్కడకు వెళ్ళారు.ఈ మంచినీటి సరస్సు దగ్గరే స్వామికి మళ్ళీ నిర్వికల్ప సమాధి స్థితి కలిగింది.ఆ సరస్సును చూచిన స్వామి, దానికి 'గాంగెస్' అని నామకరణం చేశారు.భవిష్యత్తులో ఇది 'వారణాసి' అంత పుణ్యక్షేత్రం అవుతుంది అని అన్నారట.

ఆయన పాదాలు సోకిన మహత్యమేమో గాని, ఇప్పుడక్కడ ఒక ఆశ్రమం వచ్చింది. గౌరీ మా, స్వామి ఆత్మలోకానంద అనే ఇద్దరు అమెరికన్స్ అక్కడ ఆశ్రమాన్ని స్థాపించి సాధుజీవితాన్ని గడుపుతున్నారు.వారిలో గౌరీమా చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ.పాశ్చాత్యురాలు అయి ఉండి కూడా శ్రీ రామకృష్ణ భక్తురాలై సన్యాసం స్వీకరించింది.అమెరికాలో చైల్డ్ ప్రాస్టిస్త్యూషన్ చేయిస్తున్న మాఫియాతో ప్రాణాలకు తెగించి పోరాడి అనేకమంది బాలబాలికలను ఆ నరకం నుంచి విముక్తుల్ని గావించింది. ఇంకా ఆ మాఫియాతో ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నది.అంత గొప్ప వ్యక్తిత్వం ఆమెది.

అసలా ఆశ్రమ పునాదులే అత్యద్భుతమైనవి. శ్రీ రామకృష్ణుల చితాభస్మం, శారదామాత చితాభస్మం, గౌరీమా(శ్రీ రామకృష్ణుల శిష్యురాలు) చితాభస్మాలను ఫౌండేషన్ లో ఉంచి ఆ ఆశ్రమం కట్టారు.ఇక అక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగాలు ఉండక ఏం చేస్తాయి? ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని 'వారణాశి ఆఫ్ ది వెస్ట్' అంటున్నారు.అన్ని మతాలవాళ్ళూ అన్ని దేశాలవాళ్ళూ అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణుల పాదాలను పూజిస్తున్నారు.' అన్నాను.

(ఆశ్రమం వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు)
http://www.motherstrust.org

వింటున్న చరణ్ నిర్ఘాంత పోయాడు - 'ఎంత గొప్ప విషయం అన్నగారు?' అన్నాడు.

'అవును చరణ్.అలాంటి చోట మనం రిట్రీట్ చెయ్యబోతున్నాం.ఈ రిట్రీట్ సందర్భంగా అక్కడ మనవాళ్ళకు దీక్ష ఇవ్వబోతున్నాను.ఇది కూడా అమ్మ అనుగ్రహమేగా?అసలు మనకేం అర్హత ఉంది చరణ్? అయినా సరే, అమ్మ మనచేత ఇవన్నీ చేయిస్తున్నది చూడు.' అన్నాను.

'ఒకసారి ఎవరో ఇలాగే అర్హతల గురించి మాట్లాడుతుంటే, అమ్మ విని - 'అర్హత చూచేది, ఇచ్చేది,మీరు కాదురా. నేను. ఎవరి అర్హత ఏమిటో నాకు బాగా తెలుసు.ఎవరికి ఏమివ్వాలో కూడా నాకు బాగా తెలుసు. ' అని అన్నది అన్నగారు" అన్నాడు చరణ్.

నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి.తమాయించుకుంటూ చాలాసేపు మౌనంగా ఉన్నాను.

'అవును చరణ్. మహనీయులు అంతరంగాన్నే చూస్తారు.అది స్వచ్చంగా ఉంటే వారు తప్పకుండా దగ్గరకు తీసుకుంటారు. నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తున్నది.స్వామి తురీయానంద గారి జీవితంలో చరమదశలో ఇది జరిగింది. ఒకసారి ఒక భక్తుడు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.

'స్వామీ నేను చాలా ఘోరమైన తప్పు చేశాను.చెప్పలేను.మీకు ముఖం కూడా చూపించలేను.మీ పాదాలు పట్టుకోడానికి కూడా నాకు అర్హత లేదు.నేను పతనం అయిపోయాను. పడిపోయాను. నన్ను క్షమించండి' అని ఏడ్చాడు.

తన చివరి రోజులలో,దయకు కరుణకు సాక్షాత్తూ ప్రతిరూపంలా స్వామి ఉండేవారు.శ్రీరామకృష్ణుల కరుణాస్వరూపం ఆయనలో ప్రత్యక్షంగా కనిపించేది.

'నువ్వేం తప్పు చేశావు?' అని కనీసం ఒక్కమాట కూడా స్వామి అతన్ని అడగలేదు.

చాలా సేపు మౌనంగా ఉన్న స్వామి చివరకు ఆ భక్తుడిని దగ్గరకు తీసుకుని ఇలా అన్నారు.

'ఎక్కడకు పడతావు? ఎక్కడకు పడగలవు? నువ్వు అమ్మ ఒడిలోనే పడ్డావు.ఆ ఒడిని దాటి బయటకు ఎలా పోగలవు?ఎక్కడకు పోగలవు?' అన్నారాయన.

అంతకు మించి ఇంకేమీ అనలేదు.

ఎంత అద్భుతమైన క్షమాగుణమో చూడు !! ఎంత అద్భుతమైన దయాస్వభావమో చూడు !! కనుకనే వారు శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైనారు.ఆయన అనుగ్రహపాత్రులైనారు.ఆయన స్పర్శను పొందే అదృష్టానికి నోచుకోగలిగారు.

ప్రపంచమంతా అమ్మయొక్క శక్తివిలాసమే అయినప్పుడు ఇంక మనం దానిని దాటి ఎక్కడకు పోగలం?మనమేం చేసినా అందులో చెయ్యవలసిందే.ఎన్ని ఆటలు ఆడినా ఆ ఒడిలో ఆడుకోవలసిందే.

అమ్మ కూడా ఇదే అనేవారు.'అందరూ ఈ ఒడిలోనే ఉన్నార్రా. ఈ ఒడి దాటి ఎవరూ లేరు.' అని అమ్మ తరచూ అనేవారు.అదే నిజం కాకుంటే నేనేంటి? ఈ పనులు నాద్వారా జరగడమేంటి?ఈ రకంగా అమ్మ మనల్ని అనుక్షణం చూస్తున్నదని మళ్ళీ మళ్ళీ రుజువు అవుతూనే ఉన్నది.' -  అన్నాను.

'అవునన్నగారు అది నిజం.నాకూ ఇది ఎన్నో సార్లు అనుభవం అయింది.అయితే అమెరికాకు వెళ్ళినా మన ఆధ్యాత్మికతనే అక్కడకు తీసుకెళుతున్నారన్న మాట.' అన్నాడు చరణ్.

'అంతేకదా చరణ్? ఎక్కడకు పోయినా మనమేదో అదే మనతో ఉంటుంది.కొత్తది ఎలా వస్తుంది?' అన్నాను.

వాతావరణం ఆధ్యాత్మిక స్పందనలతో చాలా భారంగా తయారైంది.ఇద్దరమూ మౌనంగా ఉండిపోయాము.ఎవ్వరమూ చాలాసేపు మాట్లాడలేదు.

తేరుకున్న చరణ్ లేచి ' వస్తానన్నగారు.హ్యాపీ జర్నీ.అక్కడకు వెళ్ళాక మాట్లాడండి.మనవాళ్ళందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా పద్మజక్కయ్యగారికి నా నమస్కారాలు తెలియ జేయండి.' అన్నాడు.

'అలాగే చరణ్.తప్పకుండా చెబుతాను.' అన్నాను.

చరణ్ శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

నేను, అతను వెళ్ళినవైపు చూస్తూ ఉండిపోయాను.