రామా మా మధ్యకు రాకు
నవ్వులాటకు గురికాకు
నీ అయోధ్య ఇప్పుడిక్కడ లేదు
ఏ సయోధ్యా నీకిక్కడ దొరకదు
ఒకవేళ నామాట వినకుండా
ప్రేమా దోమా అంటూ
మా మధ్యకు వచ్చావో
తీవ్రమైన ఆశాభంగం చెందుతావు
ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ
నిన్నెవరూ గుర్తించరు
ఒకవేళ గుర్తించినా
గౌరవించరు
ఎందుకంటే ఇప్పటికే జనం
నిన్ను బాగా వాడేసుకున్నారు
ఇక నీ అవసరం మనుషులకు
ఎంతమాత్రమూ లేదు
అప్పుడు పిచ్చికాలం గనుక
అది రామరాజ్యం గనుక
కిడ్నాపైన సీత తిరిగి దొరికింది
అప్పుడు పిచ్చికాలం గనుక
అది రామరాజ్యం గనుక
కిడ్నాపైన సీత తిరిగి దొరికింది
ఇప్పుడైతే ఆమె అడ్రసు కూడా దొరకదు
ఒకప్పుడు సీతను
రాక్షసులు కిడ్నాప్ చేశారు
ఇప్పుడు నిన్ను
మనుషులే కిడ్నాప్ చేస్తారు
ఒకప్పుడు కోతులు
నీకు సాయం చేశాయి
ఇప్పుడు మనుషులే
నిన్ను కోతిని చేసి ఆడిస్తారు
ముందు నీ నగలు కాజేసి
అమ్ముకుంటారు
ఆ తర్వాత నిన్నే ఎవరికో
బానిసగా అమ్మేస్తారు
ముందు నీ నగలు కాజేసి
అమ్ముకుంటారు
ఆ తర్వాత నిన్నే ఎవరికో
బానిసగా అమ్మేస్తారు
నీకు తెలిసిన దండకారణ్యం
నీ రాజ్యంలో కొంత భాగమే
ఇప్పుడు భూమి నిండుగా
ఎక్కడ చూచినా అదే
ఒకప్పుడు రాక్షసులు
అడవిలోనే ఉండేవారు
ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ
ఎంతోమంది ఉన్నారు
ఇప్పుడు ఇంటికొక రావణుడు
ఇంటికొక శూర్పణఖ
సందుకొక మారీచుడు
గొందికొక సుబాహుడు ఉన్నారు
ఎంతమందితో నీవు పోరాడగలవు?
ఎంతమందితో నీవు వేగగలవు?
ఎంతమందితో నీవు వేగగలవు?
ప్రస్తుతం వారి శక్తి ముందు
నీ శక్తి ఏమాత్రమూ చాలదు
పైగా వాళ్ళే నీకు గుళ్ళు కట్టి
పూజలు చేస్తున్నారు
ఉత్సవాలూ కల్యాణాలూ
అట్టహాసంగా చేస్తున్నారు
అసలు నీవారెవరో
రాక్షసులెవరో
ఈ ప్రపంచంలో నీవే
ఇప్పుడు గుర్తించలేవు
నీ వేషం వేసి లాభపడేవారే గాని
నీలా బ్రతికే వారు ఎవ్వరూ లేరు
నీ బొమ్మ పెట్టి బ్రతికేవారే గాని
నిన్ను నమ్మినవారు ఎక్కడా లేరు
పందిళ్ళు వేసి మైకులు పెట్టి
చేతులు దులుపుకోవడమే గాని
నిజంగా నీ పండుగ చేసేవారు
ఒక్కరూ లేరు
నీ నామంతో పానకం త్రాగి
సేదదీరేవారే గాని
నీ ధ్యానంతో పూనకం తెచ్చుకునేవారు
ఎవ్వరూ లేరు
నీ నామంతో పానకం త్రాగి
సేదదీరేవారే గాని
నీ ధ్యానంతో పూనకం తెచ్చుకునేవారు
ఎవ్వరూ లేరు
ఎందుకు నీకు అనవసర శ్రమ?
నీలోకంలో నువ్వు హాయిగా ఉండు
ఎవరి ఖర్మే వారిని అంతం చేస్తుంది
ప్రస్తుతం నీవు రానవసరం లేదు
నీ అవసరం మాకెంత మాత్రమూ లేదు
నీ అవసరం మాకెంత మాత్రమూ లేదు
అందుకే
రామా మా మధ్యకు రాకు
నవ్వులాటకు గురికాకు
నీ అయోధ్య ఇప్పుడిక్కడ లేదు
ఏ సయోధ్యా నీకిక్కడ దొరకదు