Once you stop learning, you start dying

11, ఏప్రిల్ 2016, సోమవారం

లయనాద సుయోగం...

విన్యాసం అంతమైతే
సన్యాసం సొంతమౌతుంది
విడ్డూరం విసుగు పుడితే
వడ్డాణం వదలి పోతుంది

ఆకాశం అడుగు పెడితే
అమరత్వం ఆక్రమిస్తుంది
అవరోధపు అడ్డు తెగితే
ఆహ్లాదం ఆశ్రయిస్తుంది

అనురాగం అంజలిస్తే
ఆనందపు అవధి తెగుతుంది
అహమన్నది ఆవిరైతే
అలుపన్నది అంతమౌతుంది

ఆమోదపు తలుపు తెరిస్తే
అనుభూతే అల్లుకుంటుంది
ప్రేమోదయ కాంతి విరిస్తే
అనుదినమూ వెన్నెలౌతుంది

ఆనందపు జల్లు కురిస్తే
అణువణువూ పల్లవిస్తుంది
అలుపెరుగని ఈ పయనం
అమరత్వపు అంచునిస్తుంది

మెచ్చిన నెచ్చెలి స్నేహం
మదివీణను పలికిస్తుంది
ఎన్నడు ముగియని రాగం
ఎదలోతుల వినవస్తుంది

హృదయపు లోతుల ఎగసే
నవజీవన వేదం
మదితలుపుల మాటున మెరసే
అతి కోమల నాదం

మెలమెల్లని సడులను రేపే
ప్రియపాద పరాగం
పసి మనసును గుడిగా చేసే
లయనాద సుయోగం...