“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, ఏప్రిల్ 2016, గురువారం

ఎలాంటి లోకంరా బాబు?

ఎలాంటి లోకంరా బాబు?
ఎలాంటి మనుషులురా బాబు?

నువ్వు చెప్పినట్లే

వెలలేని మణులను
అమూల్య రత్నాలను
నీ ఖజానానుంచి సేకరించాను
అంగడి నడివీధిలో నిలుచున్నాను

దారిన పోయే అందరినీ

ప్రాధేయపడుతున్నాను
బ్రతిమాలుతున్నాను
ఊరకనే వాటిని మీకిస్తానని
వారి వెంట పడుతున్నాను

అందరూ ఎగాదిగా చూస్తున్నారు
కొందరేమో ఇవి రంగురాళ్ళన్నారు

కొందరేమో అసలు నువ్వెవరన్నారు
కొందరేమో నీకేంటి లాభమన్నారు

కొందరేమో నేనొక మోసగాడినన్నారు
కొందరేమో నేనొక జులాయిననుకున్నారు

కొందరేమో అసలీ నిధి నీకెలా వచ్చిందన్నారు
వెరసి అందరూ అనుమానిస్తున్నారు

ఆ నిధికి దారి నాకు తెలుసు
నాతో రండి చూపిస్తానన్నాను
అనుమానపు చూపులు
నన్ను చుట్టుముట్టాయి

కొందరేమో నన్ను దొంగవన్నారు

కొందరేమో కాముకుడినన్నారు

కొందరేమో అసహ్యంగా చూచారు
కొందరేమో నానా తిట్లూ తిట్టారు
కొందరు ఉదాసీనత వహించారు

ఎవరూ నీ రత్నాలను స్వీకరించడం లేదు
మళ్ళీ నిన్ను పూజించడం మానడమూ లేదు

వాళ్ళు నీ మాట వినిపించుకోరు
నువ్వు చెప్పడం ఆపవు

వాళ్ళు వినరని నీకూ తెలుసు
అయినా చెబుతూనే ఉంటావు
భలే నాటకం ఆడిస్తున్నావ్ కదూ?
భలే శిక్షను నాకు విధిస్తున్నావ్ కదూ?

నీ మాట కోసం అన్నీ భరించాను

నీ ఆజ్ఞ కోసం అన్నీ చేస్తున్నాను

మనుషులను జల్లెడ పడుతున్నాను
వందకు ఒక్కరు మిగులుతున్నారు

నీతో రాము పొమ్మంటున్నారు
అసలు మాకు చెప్పడానికి నువ్వెవరంటున్నారు

నువ్వేమో చెప్పమంటావు
వాళ్ళేమో వినరు

నువ్వేదో చెయ్యమంటావు
వాళ్ళేమో కదలరు

నా పనేమో సాగదు
నీ పనేమో ముగియదు

నీ మాట నేను వినక తప్పదు
నా పాటేమో నేను పడక తప్పదు

నా పని భలేగా ఉంది
నీకేమో సరదాగా ఉంది

ఎలాంటి లోకంరా బాబు?
ఎలాంటి మనుషులురా బాబు?