Once you stop learning, you start dying

1, ఏప్రిల్ 2016, శుక్రవారం

ద్వంద్వాతీతం...

వయాగరైనా
నయాగరైనా
తయారుగుంటే
తిరుగేది?

సరాగమైనా
విరాగమైనా
సమానమైతే
తరుగేది?

వినోదమైనా
విషాదమైనా
నిషాలనిస్తే
వంకేది?

ఎడారినైనా
గుడారమేసే
గుండే ఉంటే
జంకేది?

సుఖాల సారం
సుదూర తీరం 
ఒకటైనప్పుడు
మరుపేది?

ఎదురేమైనా
బెదురే లేక
కుదురుగ ఉంటే
ఒరుపేది?

మహా ప్రయాణం
మనస్సు భారం
తొలగిస్తుంటే
భయమేది?

ప్రతి మజిలీలో
ఉషస్సు నీవై
ఉదయిస్తుంటే
లయమేది?

మనోవికల్పం
మరునిముషంలో
మసియౌతుంటే
మరుగేది?

మరాళమౌనం
కరాళధ్వానం
సరియనిపిస్తే
పరుగేది?

ఏదీ కోరక
ఏదీ వీడక
ఎదురే పోతే
అడ్డేది?

బ్రతుకంటే ఒక
భయమే లేక
బలియౌతుంటే
ఆపేది?

అన్నీ మ్రింగే
అగ్నివి నీవై
అంబరమంటితె
అంటేది?

అసహాయుడవై
అనాది శిఖరం
అధిరోహిస్తే
సొంటేది?

మరణాచ్చాదం
ముసిరిన కొలదీ
ముసుగులు విడితే
కట్టేది?

మహాశ్మశానం
మనసున నిలిచి
మండుతు ఉంటే
ముట్టేది?

విపంచి నాదం
విలాప సౌధం
ఒకటై తోస్తే
ఇహమేది?

ప్రపంచ మోహం
ప్రచండ త్యాగం
ఒకటై పోతే
అహమేది?