నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, మే 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 15 (లలితా సహస్రనామ భాష్యం)

నా శిష్యులతో నేను పిచ్చాపాటీగా మాట్లాడే సమయంలో వేదాంత యోగ తంత్ర ఆధ్యాత్మిక విషయాలు అనేకములు సునాయాసంగా దొర్లుతూ ఉంటాయి.నాతో ఏ సంభాషణ ఎక్కడ మొదలైనా,వినేవారు సరియైన మనుషులైతే,అది వీటిలోకే దారితీస్తూ ఉంటుంది.ఈ క్రమంలో లలితా సహస్రం నుంచి, లలితా త్రిశతి నుంచి,శక్తి ఉపాసన గురించిన అనేక భావార్ధ వివరణలు ప్రవాహంలా వచ్చేస్తూ ఉంటాయి.నా సంభాషణలు విన్నవారికి ఇదంతా సుపరిచితమే.

నేను లలితా సహస్ర నామాలను చదివి నేర్చుకోలేదు.మా అమ్మగారు తన జీవిత కాలంలో ఎన్ని వేల సార్లు ఆ స్తోత్రాన్ని పారాయణ చేశారో లెక్కేలేదు.ప్రతిరోజూ ఆ స్తోత్రాన్ని పైకే చదువుకుంటూ ఇంటి పనులను ఆమె చేసుకునేవారు.ఆ విధంగా రోజుకు ఎన్ని సార్లు పారాయణ జరిగేదో లెక్కే లేదు. అలా ప్రతిరోజూ అమ్మ నోటివెంట వినీ వినీ ఆ స్తోత్రం నాకు నోటికి వచ్చేసింది.అంతేగాని ప్రత్యేకంగా బట్టీపట్టి నేనా స్తోత్రాన్ని నేర్చుకోలేదు.తల్లే తొలిగురువని మన సాంప్రదాయంలో అంటారు.ఆ విధంగా అమ్మ నోటివెంట ఈ స్తోత్రాన్ని అమ్మలగన్న అమ్మయే నాకు ఉపదేశం చేసింది.

ఆ తర్వాత నా సాధనాక్రమంలో ఆ అద్భుతస్తోత్రపు అంతరార్ధాలను మళ్ళీ ఆ అమ్మలగన్న అమ్మయే అనుభవపూర్వకంగా (వ్యాకరణ పూర్వకంగా కాదు) అవగతం గావించింది.

వ్యాకరణార్ధాలను,ప్రతిపదార్ధాలను ఏ పండితుడైనా చెబుతాడు. అంతరార్ధాలను ఒక్క సాధకుడే చెప్పగలడు.

ఇలాంటి ఒక సంభాషణ అమెరికాలో జరుగుతున్న సమయంలో ఒక శిష్యురాలు ఈ విధంగా అడిగింది.

'మీరు లలితా సహస్రనామాలకు భాష్యం వ్రాస్తే చదవాలని ఉంది.వీటి మీద చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు.మీ అనుభవం నుంచి అవగాహన నుంచి మీరు ఆ నామాలను ఎలా వ్యాఖ్యానిస్తారో తెలుసుకోవాలని ఉంది.'

లలితా సహస్రనామాలకు భాష్యం వ్రాయాలన్నది ఎప్పటినుంచో నాకున్న సంకల్పం.కానీ దానికి సమయం రావాలి గనుక వేచి చూస్తున్నాను.ఆ సమయం ఇప్పటికి వచ్చింది.ఆమె నోటి నుంచి అమ్మే ఈ విధంగా అనుజ్ఞ ఇస్తున్నదని భావించి 'అలాగే వ్రాస్తాను.' అని చెప్పాను. అయితే ఇప్పటికే మూడు పుస్తకాలు ఒకేసారి నడుస్తూ ఉన్నాయి గనుక నిదానంగా వ్రాస్తానని చెప్పాను.నేను చెబుతుంటే మీలో ఎవరైనా వ్రాయగలిగితే బాగుంటుందని సూచించాను.

'మీరు చెప్పండి నేను వ్రాస్తాను' - అని ఇంకొక శిష్యురాలు ముందుకొచ్చింది.తను లలితా సహస్రనామాల పారాయణం అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది.వాటిమీద ఇప్పటికే ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ,నా ఆలోచనలు అనుభవాల ఆధారంగా వాటి అంతరార్ధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని తనకూ ఉంది.

కానీ తను ఉండేది అమెరికాలో.నేను ఉండేది ఇండియాలో. అయితేనేం? ఇప్పుడు కమ్యూనికేషన్ కు ఏమీ లోటు లేదు గనుక నిరాఘాటంగా ఈ పని సాగించవచ్చు అని నిశ్చయించాము.

ఈ సంకల్పంలో భాగంగా, నిన్న శుక్రవారం మంచిరోజు గనుక,నేను ఇక్కడ నుంచి ఫోన్ లో చెబుతుంటే తను అక్కడనుంచి వ్రాసుకునే కార్యక్రమం మొదలైంది.

మొదటి రోజున 'శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ' అనే నామాలకు నాదైన పద్ధతిలో వివరణను ఇవ్వడం జరిగింది.ఇండియాలో ఇంతమంది శిష్యులు ఉన్నప్పటికీ, అమెరికా వంటి దూరదేశంలో ఉంటూ కూడా, అరుదైన ఈ అవకాశాన్ని అమ్మ అనుగ్రహంగా అంది పుచ్చుకున్న ఈ ధన్యురాలిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.

ఎవరి అదృష్టం వారిది!!

అర్హతను అమ్మ చూస్తుంది.ఇచ్చేది కూడా అమ్మే ఇస్తుంది.ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అమ్మకే తెలుసు. అల్పబుద్దులమైన మనకు అమ్మ చర్యలు అమిత దురూహ్యములుగా ఉంటాయి.మన అహంకారాన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ, అమ్మ అనుగ్రహానికి పాత్రులమయ్యే విధంగా మనల్ని మనం ప్రతిరోజూ మలచుకుంటూ ఉండటమే మనం చెయ్యవలసిన అసలైన పని.అది మరచిపోతే మాత్రం, అమ్మ పెట్టే అంతుతెలియని పరీక్షలలో మనం ఫెయిల్ కాక తప్పదు.

అమ్మ అనుగ్రహంతో, వేదాంత యోగ తంత్ర రహస్యభావాలతో కూడిన వివరణలతో, అతి త్వరలోనే ఈ పుస్తకం రిలీజ్ అవుతుందని తెలియజెయ్యడానికి సంతోషిస్తున్నాను.శక్తి ఉపాసనకు సంబంధించిన ఈ స్తోత్రపు భాష్యం వెనుక ఒక స్త్రీ సంకల్పం ఉండటం, దానిని వ్రాసే పని కూడా ఇంకొక స్త్రీ ద్వారానే జరగడం అంతా ఆద్యాశక్తి కరుణకు సంకేతం.ఈ పనికి ప్రారంభం కూడా ఇండియాలో కాకుండా అమెరికాలోనే జరగడం విచిత్రం కదూ!. ఇదంతా అమెరికా శిష్యుల దీక్షకు,అంకిత భావానికి సంకేతంగా కనిపిస్తున్నది.

పుస్తకం రిలీజ్ కు సమయం పట్టినా, ఎప్పటికప్పుడు ఈ నామార్ధాలను వ్యాఖ్యానాన్ని, 'పంచవటి'లో పోస్ట్ చెయ్యడం ద్వారా మా సభ్యులకు మాత్రం తెలియజెయ్యడం జరుగుతుంది.

మిగతా వారు పుస్తకం రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడక తప్పదు మరి.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 15 (లలితా సహస్రనామ భాష్యం) "

26, మే 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 14 (అమెరికాలో ఏమేం చూచారు?)

అమ్మయ్య !

ఇండియాకు తిరిగి వచ్చేశాము.

ఇక తీరికగా అమెరికా అనుభవాలను నెమరు వేసుకోవచ్చు. వ్రాసుకోవచ్చు.

నేను అమెరికాలో ఉన్నప్పుడు మాటల సందర్భంలో చాలామంది నన్ను ఇలా అడిగారు.

'ఇక్కడ ఏమేం చూచారు? ఎక్కడెక్కడ తిరిగారు?ఇంతదూరం వచ్చారు కదా అమెరికాలో ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్స్ కొన్నైనా చూచారా?'

వారందరికీ దాదాపుగా ఇదే సమాధానం చెప్పాను.

'ఈ ట్రిప్ లో మూడే ముఖ్యమైన ప్రదేశాలు చూచాను.ఒకటి - పాంటియాక్ పరాశక్తి టెంపుల్. అక్కడ అమ్మను చూచాను. రెండు - డెట్రాయిట్ డౌన్ టౌన్ లో ఉన్న ఫ్రీర్ హౌస్. ఈ ఇంటికి వివేకానందస్వామి వచ్చి అతిధిగా ఉన్నారు.అక్కడ స్వామి కూర్చున్న డైనింగ్ టేబుల్ చూచాను.మూడు - గాంగెస్ మిషిగన్ లో మదర్స్ ట్రస్ట్ ఆశ్రమం చూచాను.అక్కడ శ్రీరామకృష్ణ శారదామాతల చితాభస్మాలు ఉన్నాయి.ఈ మూడింటి కంటే అమెరికాలో ప్రస్తుతానికి చూడవలసినవి నాకు ఇంకేమీ కనిపించలేదు.'

'అదేంటి? ఇక్కడ దాకా వచ్చి ఇవా మీరు చూచింది?' అన్నట్లుగా కొందరు చూపుల ద్వారా అడిగారు.

'ఎక్కడ చూచినా ఏముంది? అవే పంచభూతాలు..అదే మనుషులు.అదే ఈషణాత్రయం.ఇంకేంటి చూచేది?' - అంటూ "శ్రీవిద్యా రహస్యం" నుంచి ఈ పద్యాన్ని కొందరికి కోట్ చేశాను.

కం||అవియే పర్వత సీమలు
అవియే నదులును తరువులు నవియే పధముల్
భువినెంత దిరిగి జూచిన
చవి బుట్టదు లోకమెల్ల సమమే యగుచున్

ఎక్కడ చూచినా అవే కొండలు.అవే నదులు.అవే చెట్లు.అవే దారులు.భూమిమీద ఎంత చూచినా వింత అనేది ఏముంది? ఏమీ లేదు.కనుక లోకమంతా పంచభూతాత్మకంగా సమంగానే ఉంటుంది.కనుక ప్రత్యేకంగా దేన్నో చూద్దామన్న దాహం ఏమీ ఉండదు.దాహం లేనప్పుడు అటూ ఇటూ తిరగడం ఏముంటుంది?

ప్రదేశాలలో ఏమీ లేదు.ఉన్నదంతా మనుషులలోనూ వారి మనస్తత్వాలలోనూ ఉన్నది.నాకు మనుషులతోనూ వారి మనసులతోనూ ఆడుకోవడం సరదాగా ఉంటుంది.ప్రదేశాలు తిరగడం నాకు నచ్చదు.మనసులతో గారడీ చెయ్యడం నాకిష్టం.దాని ద్వారానే వారిని దైవమార్గంలోకి మళ్ళించగలం. వారికి సరియైన దారి చూపించగలం.దానిలో నడిపించగలం.ఈ లోకంలో మనం చెయ్యగలిగిన అతి ముఖ్యమైన పని ఇదే అని నా నమ్మకం.ఇది ఉత్త నమ్మకం మాత్రమే కాదు.నా జీవితానుభవాలు కూడా దీనినే చెబుతున్నాయి.వాటి ప్రకారమే నేను వెళతాను.ఎవరైనా ఇంతే కదా.వారివారి జీవితానుభవాల ద్వారానే వాళ్ళు వెళతారు.అలాగే వెళ్ళాలి కూడా.'

ఈ జవాబును విన్న కొందరు నన్నొక పిచ్చివాణ్ని చూచినట్లు చూచారు.చూస్తే చూడనీ.అది వాళ్ళ ఖర్మ. నా దృష్టిలో వాళ్ళూ పిచ్చివాళ్ళే.నిజానికి నాకంటే వాళ్ళే అసలైన పిచ్చోళ్ళు.

లోకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పిచ్చి.

శ్రీ రామకృష్ణులను కూడా అందరూ పిచ్చివాడని గేలి చేశారు.ఇదే విషయాన్ని ఆయన భైరవీ బ్రాహ్మణితో ఇలా చెప్పారు.

'చూడమ్మా.అందరూనన్ను పిచ్చివాడినని అంటున్నారు.నేను నిజంగా పిచ్చివాడినా? నాకు పిచ్చి ఉందా?'

భైరవిమాత ఇలా జవాబిచ్చింది.

'అవును నాయనా.ఈ లోకంలో అందరూ పిచ్చివాళ్ళే.ఇక్కడ కొందరికి డబ్బు పిచ్చి.కొందరికి అధికారపు పిచ్చి.ఇంకొందరికి విలాసాల పిచ్చి.మరికొందరికి ఇంకొక పిచ్చి.నీకేమో భగవంతుడి పిచ్చి.వాళ్ళ పిచ్చి కంటే నీ పిచ్చి చాలా ఉన్నతమైనది.వాళ్ళ మాటలకు నీవేం బాధపడకు. పిచ్చివాళ్ళ వాగుడును నువ్వు లెక్క చెయ్యవలసిన పని ఏమాత్రం లేదు.'

నయాగరా జలపాతం, గ్రాండ్ కాన్యన్,స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, మొదలైన ప్రదేశాలే అమెరికాలో చూడదగినవని కొందరి భావన.మరి కొందరేమో లాస్ వెగాస్ లాంటి చోట్లు చూడాలని కోరుకుంటారు. వీటిల్లో దేనిలోనూ ఏమీ లేదని నేను భావిస్తాను. నేను చూచిన ఈ మూడే, డెట్రాయిట్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలని నేను భావించాను.అవే చూచాను.

వీటన్నిటినీ మించి - నన్ను ప్రాణంగా ప్రేమించే మనుషులను కలుసుకోగలిగాను.వాళ్ళతో అనుబంధాలు పెంచుకోగలిగాను. వారికి వెలుగు బాటను చూపగలిగాను.వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురాగలిగాను.

సొంత డబ్బాలాగా అనిపించినా సరే, నేను తరచుగా ఒకమాట అంటూ ఉంటాను.

'నాతో ఒక్కసారి పరిచయం అయితే ఇక మీ జీవితాలు మునుపటిలా ఉండవు.ఒకవేళ ఉంటేమాత్రం - మీ పంచేంద్రియాలు సరిగ్గా పనిచెయ్యడం లేదని అర్ధం.'

ఈ విషయం నా ఇండియా శిష్యులకు బాగా తెలుసు.ఇప్పుడు అమెరికా శిష్యులకు కూడా ఈ విషయం సరిగ్గా అర్ధం అయిందని భావిస్తున్నాను.

అందరూ గొప్పగా భావించే ప్రదేశాలు ఏమీ చూడకపోయినా, గొప్ప ఆత్మ సంతృప్తితో నేను ఇండియాకు తిరిగి వచ్చాను.

నన్ను నన్నుగా ప్రేమించి,నాకోసం,దైవానుభూతి కోసం, జీవితంలో ఒక అర్ధం కోసం, కలవరించే కొన్ని ఆత్మలను నేను ఈ ట్రిప్ లో కలుసుకోగలిగాను.నాతోబాటు వెలుగుదారిలో వారిని నాలుగడుగులు వేయించగలిగాను.

ఇంతకంటే ఇంకేం కావాలి?

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 14 (అమెరికాలో ఏమేం చూచారు?) "

22, మే 2016, ఆదివారం

గుడ్ బై అమెరికా - ప్రస్తుతానికి

నెలరోజులుగా అమెరికా నివాసం చాలా బాగా జరిగింది.

శిష్యులతో మాటామంతీ, నిరంతర ధ్యానం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సరదాగా తిరగడాలు, షాపింగ్లు,రెస్టారెంట్లు, ఆశ్రమ జీవితం, స్పిరిచ్యువల్ రిట్రీట్లు,పాటలు,యోగా,తాయ్ ఛీ ప్రాక్టీస్, జోకులు, నవ్వులతో చాలా బాగా గడిచింది.

నెలరోజులు ఇలా హాయిగా గడిచాక, ఇండియాకు బయలు దేరాలంటే ఒక ఇంగ్లీష్ డైలాగు గుర్తుకొస్తోంది.

All experiences,even pleasant ones,eventually end.Its time to leave the party, honey.All good things must end. We've had a lovely visit,but all good things must come to an end.

వాళ్ళ పనులన్నీ మానుకుని, ఈ ట్రిప్ లో నాతో నిరంతరం ఉండి, సహకరించిన నా అమెరికా శిష్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఎంత మంచి అనుభవమైనా, అది ఒకనాటికి అంతం కాక తప్పదు.ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.ఏదీ మనతో నిరంతరం ఉండదు.ఇది ఒక చేదు వాస్తవం.ఈ రియాలిటీని అర్ధం చేసుకోవడం జీవితంలో చాలా అవసరం.మనతో నిరంతరం ఉండేది మన సాధన ఒక్కటే.మనతోడుగా వచ్చేది మన కర్మ ఒక్కటే.కనుక, ఈ ట్రిప్ లో నేను నేర్పిన సాధనలు ప్రతిరోజూ శ్రద్ధగా చెయ్యమని వారిని కోరుతున్నాను.సాధన వల్లనే మనం గమ్యం చేరగలుగుతాం. ఉత్త మాటలవల్లా, పుస్తకాలు చదవడంవల్లా, ప్రవచనాలు వినడం వల్లా ఏమీ సాధించలేము.వాటివల్ల దమ్మిడీ కూడా ఉపయోగం లేదని వారికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.

త్వరలో మళ్ళీ కలుసుకుందాం.

ప్రస్తుతానికి గుడ్ బై.
read more " గుడ్ బై అమెరికా - ప్రస్తుతానికి "

20, మే 2016, శుక్రవారం

మా అమెరికా యాత్ర - 13 (సందేహాలు సమాధానాలు)

పరాశక్తి టెంపుల్ లో నా ఉపన్యాసం విన్న రామకృష్ణగారు, వాణిగారు అనే దంపతులు నిన్న నేనున్న చోటకు వచ్చి కాసేపు మాట్లాడారు.వాణిగారికి 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పాను.ఆ పుస్తకం కోసం వచ్చి,కాసేపు కూచుని మాట్లాడి వెళ్ళారు.

'రిచువల్ వర్షిప్' మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?' అని వాణిగారు అడిగారు.

'అది ఎల్కేజీ స్థాయి మాత్రమే.దానిపైన చాలా స్థాయులున్నాయి.మనిషి ఎంతసేపూ పూజలు గుళ్ళు వీటితోనే కాలం గడపకూడదు.సాధనలో పై స్థాయులకు ఎదిగినప్పుడు వీటితో పని ఉండదు.ఉదాహరణకు చెప్పాలంటే - మా ఇంటి పక్కనే ఒక గుడి ఉంది.కానీ నేను గత పదిహేడు ఏళ్ళగా ఒక్కసారి కూడా ఆ గుడిలోకి పోలేదు.ఇది మీకు వినడానికి వింతగా ఉంటుంది.కానీ నేను దైవానికి దూరంగా ఏమీ లేను.నా పుస్తకంలో ఇవన్నీ వివరంగా వ్రాశాను.చదవండి.మీకు విషయం అర్ధమౌతుంది' అన్నాను.

'నేను గత పదిహేనేళ్ళుగా రెగ్యులర్ గా దేవాలయాలకు వెళుతున్నాను.కానీ ఈమధ్య ఒక ఆర్నెల్లుగా ఈ పూజలూ వాటిమీద నాకు మనసు పోవడం లేదు.అవి నాకిప్పుడు నచ్చడం  లేదు.ఇవి కాకుండా ఇంకేదో ఉంది.అదేమిటో తెలుసుకోవాలని అనిపిస్తున్నది.ఎందుకిలా?' అన్నారామె.

'నేను ఇక్కడకు రాబోతున్నాను కదా అందుకే బహుశా మీకు అలా అనిపించి ఉంటుంది.అందుకే ఈ పుస్తకం కూడా మీ చేతికి వచ్చింది.అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఈ పుస్తకంలో మీకు తెలుస్తుంది.చదవండి.' అన్నాను.

'శ్రీచక్రాన్ని నేను కొన్నేళ్లుగా ఇంటిలో ఉంచుకుని పూజిస్తున్నాను.కానీ దాని అంతరార్ధాలు,సాధనా విధానాలు నాకు తెలీవు.వాటిని తెలుసుకోవాలని ఉంది.'అన్నారు వాణిగారు.

'నా పుస్తకం చదవండి.అవి మీకు కొంతవరకూ అర్ధమౌతాయి. కానీ అసలైన సాధనా విషయాలు ఏ పుస్తకంలోనూ దొరకవు.అవి గురుశిష్య పరంపరగా మాత్రమే వస్తుంటాయి.మీరు ఉపదేశం తీసుకుని సాధన మొదలు పెడితే అప్పుడు మాత్రమె అవి మీకు అర్ధమౌతాయి.బయట ఎక్కడా అవి మీకు దొరకవు.'అన్నాను.

'అలా ఎందుకు అన్నీ రహస్యంగా ఉంచాలి?' అని ప్రశ్న వచ్చింది.

'కొన్ని అలాగే ఉండాలి.అన్నీ అందరికీ తెలియకూడదు.తెలియవు కూడా.అత్యంత విలువైనవి ప్రపంచంలో ఎక్కడో ఒకటి రెండుచోట్ల మాత్రమే ఉంటాయి.కోహినూర్ వజ్రం మీకు ఎక్కడ బడితే అక్కడ దొరకదు.అది ఎక్కడో ఒకచోటే ఉంటుంది.అలాగే ఏ విలువైన వస్తువైనా విషయమైనా ఎక్కడో కొద్దిమంది దగ్గర మాత్రమే ఉంటుంది.దానిని అప్రోచ్ అయ్యే విధానంలో అప్రోచ్ అయితే మాత్రమే అది దొరుకుతుంది.లేకుంటే దొరకదు.ఆ విధానం తెలుసుకుని ఆ దారిలో నడిస్తే అప్పుడు మాత్రమే అది దక్కుతుంది.ఇదీ అంతే' అన్నాను. 

మాటల సందర్భంలో రామక్రిష్ణగారు ఇలా అన్నారు.

'మీరేమీ అనుకోకపోతే, జస్ట్ డిస్కషన్ కోసం నేను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను.' అన్నాడాయన.

'అడగండి.ప్రశ్నలను నేను స్వాగతిస్తాను.' అన్నాను.

'మోక్షం పొందాలని కోరుకోవడం కూడా ఒక కోరికే కదా? మోక్షమంటే కోరికలను చంపడం అయినప్పుడు, ఈ కోరికను ఎంటర్ టెయిన్ చెయ్యడం మాత్రం ఎలా కరెక్ట్ అవుతుంది?' అంటూ తన మొదటి సందేహాన్ని వెలిబుచ్చాడాయన.

'మీ ప్రశ్నకు జవాబు చెప్పేముందు నాదొక ప్రశ్న. ఒక మనిషిని చంపడం నేరమేగాక తప్పు కూడా కదా? మరి యుద్ధంలో మనదేశపు సైనికుడు మరొక దేశపు సైనికుడిని చంపినప్పుడు అతడిని శిక్షించక పోగా, మెడల్స్ ఇచ్చి మరీ గౌరవిస్తున్నాము కదా? ఇదేంటి? ఒకరికి తప్పయినది ఇంకొకరికి ఒప్పెలా అవుతున్నది? ముందు మీరు ఇది వివరించండి.ఆ తర్వాత మీ ప్రశ్నకు నేను జవాబిస్తాను.' అని నేనన్నాను.

'నేచర్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇంకొక మనిషిని చంపడం తప్పు.కానీ మనిషి ఏర్పాటు చేసుకున్న సోషల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం అది తప్పు కాకపోవచ్చు.' అన్నాడాయన.

'అంటే రెండు రకాలైన కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఉన్నాయని మీరు ఒప్పుకున్నారు కదా?' అడిగాను.

'అవును' అన్నాడాయన.

'ఇదే లాజిక్ ప్రకారం - నా జవాబులో కూడా రెండున్నాయి. కోరికలను అనుభవిస్తూ జీవించాలని మనిషి కోరుకుంటాడు. అదే పరమార్ధం కాదనీ,నిమ్నవాసనలను అధిగమించాలనీ, మనిషి దైవంగా మారాలనీ ప్రకృతి కోరుకుంటుంది.మనిషి ఏనాటికైనా తన కోడ్ ను వదిలేసి ప్రకృతి కోడ్ ను అనుసరించక తప్పదు.

మనిషిని ఒక ఉద్దేశ్యంతో ప్రకృతి సృష్టించింది.ప్రకృతిలో ఎవల్యూషన్ ఉన్నది.అనేక లోయర్ స్పీశీస్ నుంచి ఇవాల్వ్ అవుతూ జీవి ఒక మనిషిగా తయారయ్యాడు.కానీ అంతటితో ఆ ఎవల్యూషన్ ఆగలేదు.ఆగకూడదు కూడా.

మనం ఎంత చదువుకుని, ఎన్ని ఉద్యోగాలూ వ్యాపారాలూ చేసి, ఎంత సంపాదించి ఎన్ని చేసినా - లోలోపల మనం ఆటవికులమే.'మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్' అన్నాడు అరిస్టాటిల్.ఈనాటికీ మనం జంతువులలానే బ్రతుకుతున్నాం. కాకుంటే - నాగరిక జంతువులం అంతే.ఆటవిక జీవితంలో మానవుడు జంతువులను వేటాడేవాడు.ఇప్పుడు మనం పక్క మనిషిని వేటాడుతున్నాం.అప్పుడు బాణం బల్లెం గొడ్డలి వంటి అనాగరిక ఆయుధాలతో మనిషి జంతువులను చంపేవాడు. ఇప్పుడు మనం కలం, మెదడు, తెలివి,సైన్సు వంటి ఆయుధాలతో ఎదుటి మనిషిని దోచుకుంటున్నాం.కనుక లక్షల ఏళ్ళనాడు అడవిలో బ్రతికిన ఆటవికునికీ నేటి మనకూ స్వభావంలో పెద్ద భేదం లేదు.డ్రస్సులో, చదువులో, ఉండే ఇళ్ళలో, తిరిగే వాహనాలలో మార్పులు వచ్చి ఉండవచ్చు.కానీ మన మనస్తత్వంలో మార్పు రాలేదు.మనిషి ఈ అంతరిక ఆటవిక స్థితినుంచి ఎదగాలి.తనను తాను అధిగమించి దైవంగా మారాలి. అదే ప్రకృతి ఊహ.

కనుక మానవుడు తనలోని నిమ్నవాసనలను ఎప్పటికైనా అధిగమించే తీరాలి.నేడు కాకపోతే రేపు - అంతే తేడా.' అన్నాను.

'కోరికలను చంపడమే మోక్షం అయితే - జిహాద్ అంటూ సాటి మనుషులను చంపుతున్న ముస్లిములు కూడా వాళ్ళనుకుంటున్నట్లుగా మోక్షానికే పోతారా? అప్పుడు అది కూడా కరెక్ట్ అనుకోవచ్చు కదా?' అన్నాడాయన.

'అది కరెక్ట్ కాదు.అదెలా కరెక్ట్ అవుతుంది? నేను చెబుతున్న దానికీ ఈ విషయానికీ సంబంధం లేదు.ఎదుటి మనిషిని చంపితే మోక్షం వస్తుందని ఏ మత గ్రంధంలోనూ చెప్పబడి లేదు.ఒక్క ఖురాన్లో మాత్రం అలాంటి కొన్ని శ్లోకాలున్నాయేమో, అవికూడా వ్రాసినవారికి ఎలా స్ఫురించాయో నాకు మాత్రం తెలీదు.కానీ ఒక్క విషయం చెప్పగలను.ఖురాన్ ఒక్కటే దైవగ్రంధం కాదు.అన్ని దేశాలకూ అన్ని కాలాలకూ దైవం ఒక్కొక్క గ్రంధాన్ని ఇస్తూనే ఉన్నది.మరి ఎదుటి మనిషిని చంపడం వల్ల మోక్షం వస్తుందన్నదే దైవాదేశం అయితే మిగతా అన్ని గ్రంధాలలో కూడా దైవం అదే ఆదేశాన్ని ఇవ్వాలి కదా? అలా ఏ ఇతర గ్రంధం లోనూ లేదు.మిగతా అన్ని గ్రంధాలలోనూ - 'ఎదుటి మనిషిని చంపడం తప్పు' - అనే చెప్పబడి ఉన్నది.కనుక ఖురాన్ లో ఉన్న ఈ రకమైన హింసను ప్రేరేపించే ఆదేశాలు పూర్తిగా తప్పుడువి.అవి మహమ్మద్ యొక్క కపోల కల్పితాలే గాని దైవాదేశాలు కావని సింపుల్ లాజిక్ తో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇంకో విషయం ఏమంటే - కోరికలను చంపడమే మోక్షమని మీరన్నారు.అది కరెక్ట్ కాదు.మీరే కోరికనూ చంపలేరు.అది అసాధ్యం.ఎందుకంటే కోరికలనేవీ ప్రకృతి శక్తులు.అవి చావవు. కానీ వాటిని మీరు అధిగమించవచ్చు.దాటిపోవచ్చు.అదే మానవుడు చెయ్యవలసిన పని.

ఈ క్రమంలో - ఒక పెద్ద కోరికకోసం చిన్న చిన్న కోరికలను పక్కన పెట్టవలసి వస్తుంది.మోక్షం అనేది ఒక పెద్ద కోరిక దానికోసం చిన్నచిన్న కోరికలను మనం వాలంటరీగా వదులుకుంటాం.

ఉదాహరణకు - మీరొక సివిల్  సర్వీస్ ఎగ్జాం కోసం చదువుతుంటే - మీ జీవితాన్ని యధావిధిగా నడుపుకుంటూ,ఎంజాయ్ చేస్తూ ఉంటే,మీరాపనిని చెయ్యలేరు. మీ షెడ్యూల్ ను దానికి తగినట్లుగా మార్చుకోవాలి. స్నేహితులు,సరదాలు మొదలైన కొన్నికొన్నింటిని వాలంటరీగా వదులుకోవాలి.తప్పదు.అప్పుడే మీరా గమ్యాన్ని చేరుకోగలుగుతారు.లౌకిక జీవితంలో కూడా ఇటువంటి డిసిప్లిన్ అవసరమే కదా. ఇదీ అంతే.నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో కోరికలను చంపడం అంటూ ఏమీ ఉండదు.నిజానికి కోరికలను మనం ఏనాటికీ చంపలేము.వాటికి మనమొక హయ్యర్ టర్న్ ఇస్తాం.అంతే.

ఇంకొక ఉదాహరణ చెప్తాను వినండి.ఇది శ్రీరామక్రిష్ణులు చెప్పిన ఉదాహరణే.కలకండ స్వయానా స్వీట్ అయినప్పటికీ, అది స్వీట్ లెక్కలోకి రాదు.మామూలు స్వీట్లు తింటే రోగం వస్తుంది.కానీ కలకండ అనేది అలాకాదు.అది నిషిద్ధం కాకపోగా, దానిని ఆయుర్వేద ఔషధాలలో అనుపానంగా కూడా వాడతారు. అలాగే - కోరికలను దాటడానికి ఇంకొక పెద్ద కోరిక అయిన మోక్షేచ్చ ఉండటం తప్పు కాదు.అది చాలా అవసరం.అంతరిక మార్గంలో నడవడానికి అదొక ముఖ్యమైన అర్హత.

రమణమహర్షి చెప్పిన ఇంకొక ఉదాహరణ వినండి. శవాన్ని కాల్చడానికి చితిని ముట్టించేటప్పుడు ఒక కట్టెను వెలిగించి ఆ కట్టెతో చితిని ముట్టిస్తారు.ఆ తర్వాత ఆ కట్టెను కూడా చితిలోనే పారవేస్తారు.అదే విధంగా - నిమ్న వాసనలను దాటడానికి మోక్షేచ్చ అవసరం.ఆ తర్వాత అదే సాధనాగ్నిలో ఆ కోరిక కూడా ఆహుతై పోతుంది.అప్పుడు అదికూడా మిగిలి ఉండదు. ' అన్నాను.

'ఈ విషయం నేను కొత్తగా వింటున్నాను.ఇంతకు ముందు ఎవరూ ఇలా చెప్పలేదు.కోరికలను చంపడమే మోక్షం అని చాలామంది గతంలో చెప్పారు.' అన్నాడాయన/

'అదే పాండిత్యానికీ అనుభవజ్ఞానానికీ ఉన్న తేడా.పుస్తకాలు చదివిన పండితులు అనుభవజ్ఞానం లేక ఏదేదో వాగుతూ ఉంటారు.కానీ ఈ విషయాలను అనుభవపూర్వకంగా తెలిసినవారు అసలైన విషయాలు చెప్పగలుగుతారు.నేనూ ఎన్నో వేల పుస్తకాలు చదివాను.చదవలేదని నేను చెప్పడం లేదు.కానీ అలా చదవడంతో తృప్తిపడి నేను ఊరుకోలేదు.అవి ఏం చెయ్యమని చెప్పాయో అది నేను చేశాను. ఆచరణలో నేను అనుభవజ్ఞానాన్ని పొందాను.కనుక నేను చెప్పేవి పండితుల ప్రవచనాలకు భిన్నంగా ఉండటంలో వింత లేదు.

అసలీ సృష్టిని దైవం కోరికతోనే చేసిందని వేదం చెబుతున్నది.దైవంలోనే కోరిక ఉన్నపుడు మనలోనుంచి అదెలా లేకుండా పోతుంది? మీరు వేదంలోని సృష్టిసూక్తం చదివితే - మొదట్లో అంతా చీకటిగా శూన్యంగా ఉన్నది.అక్కడ ఏమీ లేదు.కానీ ఏదో ఉన్నది.ఆ ఉన్నదానిలో 'నేను సృష్టిస్తాను' అన్న కోరిక కలిగింది.ఆ కోరికనుంచి సృష్టి ఉద్భవించింది.' అని వేదం చేప్పినట్లు మనం గమనించవచ్చు.

కనుక సృష్టిలో కోరిక అనేది ఉన్నది.కోరికను మీరు నిర్మూలించలేరు.మీరు చెయ్యగలిగినదల్లా దానికి ఒక హయ్యర్ టర్న్ ఇవ్వడం మాత్రమే.' అన్నాను.

'మోక్షం కోసం కొన్ని కోరికలను వదులుకోవాల్సి వస్తే, అది బాధగా అనిపించదా?' అన్నాడాయన.

'ఇందులో బాధేమీ ఉండదు.మన దృష్టి ఒక పెద్దదానిమీద ఉన్నపుడు చిన్నవి వదులుకోవడం బాధ అనిపించదు.మీరు బిజినెస్ పనిమీద ఒక ఊరికి వెళ్లి ఒక వారం ఉండవలసి వస్తుంది.ఫేమిలీని వదిలేసి వచ్చానని మీరు బాధపడతారా?లేదు కదా? ఎందుకని? ఎందుకంటే - మీ ఫేమిలీని ఇంకా బాగా చూచుకోవదానికే మీరు అలా దూరంగా ఉన్నారు.కనుక బాధ ఉండదు.అలాగే - జీవితాన్ని ఇంకా ఎంతో ఉన్నతంగా మలచుకోవదానికే మీరు జీవితంలోని కొన్ని కొన్ని చిన్న ఆనందాలను మీ అంతట మీరు వదులుకుంటున్నారు.అది మీకు బాధ అనిపించదు.

ఉదాహరణకు - మీ ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్ లో మీకేదో పని ఉంది.మెట్లెక్కి పైకి వెళ్ళాలి.క్రింద మెట్టును వదిలేశానని మీరెప్పుడైనా బాధపడి అక్కడే ఆగిపోతున్నారా? లేదుకదా? క్రింది మెట్టు అనేది అక్కడే ఉండిపోవడానికి ఉద్దేశించబడినది కాదు.పై మెట్టును చేరడానికి అదొక మార్గం మాత్రమే.కనుక మెట్లెక్కి పైకి పోయేటప్పుడు మీకేమీ బాధ ఉండదు.ఇదీ అంతే.' అన్నాను.

'మీ అమెరికా ట్రిప్ బాగా జరిగిందా?' అడిగాడాయన.

'చాలా బాగా జరిగింది.ఆనుకున్న దానికంటే బాగా జరిగింది.నన్ను కలుసుకోవాలని చాలా ఏళ్ళనుంచీ అనుకుంటున్న ఎంతోమంది ఇక్కడి శిష్యులను కలుసుకోగలిగాను.ఎవరికి కావలసిన దీక్షలు వారికిచ్చాను. కొంతమంది అమెరికన్స్ కూడా నా శిష్యులయ్యారు.వారి సందేహాలు కూడా తీర్చాను.ముఖ్యంగా గాంగేస్ మిచిగాన్ లో జరిగిన స్పిరిచ్యువల్ రిట్రీట్ చాలా బాగా జరిగింది.వారు కూడా నన్ను బాగా అభిమానించారు.ఆ ఆశ్రమం చూచుకుంటూ అక్కడే ఉండిపొమ్మని మాతా గౌరీమా నన్ను కోరారు.నాలాంటి మనిషే తనకు కావాలని ఆమె అన్నారు.అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుందామని మేం కూడా అనుకుంటున్నాం.త్వరలోనే నేను నా ఉద్యోగానికి గుడ్ బై చెప్పబోతున్నాను.అప్పుడు ఇక్కడ ఆర్నెల్లు ఇండియాలో ఆర్నెల్లు ఉంటాను.అప్పుడు అమెరికాలో మాకొక ఆశ్రమం కావాలి.దానికోసం ప్లానింగ్ మొదలు పెట్టాం.త్వరలోనే అది నిజం అవుతుంది.ఈ విధంగా - అన్ని రకాలుగా నా అమెరికా ట్రిప్ సక్సెస్ అయింది' అన్నాను.

'ఫేమిలీ లైఫ్ కీ, ఆధ్యాత్మిక జీవితానికీ సమన్వయం ఎలా చెయ్యాలి? మీరెలా చెయ్యగలుగుతున్నారు?ఇవి రెండూ ఒకదానికొకటి యాంటగోనిస్టిక్ అంటారు కదా? మీకు బాధ్యతలు ఉన్నాయి.ఫేమిలీ ఉంది.ఇవన్నీ పెట్టుకుని ఆశ్రమం ఇదంతా ఏమిటి? ఎలా మేనేజ్ చెయ్యాలని అనుకుంటున్నారు?' మూడో ప్రశ్నను సంధించాడాయన.

'ఇది కూడా మీరడిగిన మొదటి ప్రశ్న వంటిదే.సంసారానికీ ఆధ్యాత్మికానికీ సంఘర్షణ ఏమీ లేదు.తెలియనివారు అలా అనుకుంటారు.నిజానికి సంసారంలో ఉంటేనే ఆధ్యాత్మిక సాధన ఇంకా బాగా చెయ్యవచ్చు.నేను సంసారినే. మొదట్నించీ నా ఉద్యోగంతో సహా అన్ని పనులూ చేసుకుంటూనే నేను సాధన చేశాను.నేను నేర్చుకున్నవన్నీ సంసారంలో ఉంటూనే నేర్చుకున్నాను.ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సన్యాసం తీసుకోవలసిన అవసరం ఏమీ లేదు.'పెళ్ళిలో పెద్దపులి ఏమీ లేదని మీకు చెప్పడానికే నేను పెళ్లి చేసుకున్నాను నాన్నా' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అన్నారు.నేనూ అదే చెబుతున్నాను. ఎలా సమన్వయం చేసుకోవాలో తెలిస్తే, సంసారం అనేది దైవమార్గానికి ఆటంకం ఏమీ కాదు.పైగా ఇంకా సహాయపడుతుంది.సంసారం అంటే కోటలోనుంచి యుద్ధం చెయ్యడం వంటిది.దాని వెసులుబాట్లు దానికున్నాయి. సన్యాసం అంటే కోట బయటకు వచ్చి యుద్ధం చెయ్యడం వంటిది. దానిలో రిస్క్ ఎక్కువ.ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులే చెప్పారు.ఆ సులువులు తెలుసుకుంటే అంతా బానే ఉంటుంది. కనుక సంసారానికీ సాధనకూ ఘర్షణ ఏమీ లేదు.' అన్నాను.

ఇదంతా వింటున్న వాణిగారు -'మీరు ఎవరి మార్గాన్ని ఫాలో అవుతారు?' అంటూ అడిగారు.

'నేను శ్రీరామకృష్ణుల భక్తుడిని.ఆయనే నా దైవం.అందరు దేవతలూ ఆయనలోనే ఉన్నారు.నేను ఆయన్నే పూజిస్తాను. ధ్యానిస్తాను.కానీ జిల్లెళ్ళమూడి అమ్మగారినీ రమణ మహర్షినీ కూడా ఆరాధిస్తాను.కొంతవరకూ అరవిందుల పూర్ణయోగ తత్వాన్నీ స్వీకరిస్తాను.కానీ ప్రాధమికంగా నేను శ్రీ రామకృష్ణుల బిడ్డను' అని జవాబిచ్చాను.

'నాకింకా ప్రశ్నలు చాలా ఉన్నాయి.మళ్ళీ తీరికగా అడుగుతానులెండి.మా ఆవిడ బయలు దేరదామని అంటోంది.' అన్నాడాయన.

నేనావిడ వైపు చూచాను. ఆమెలో అలాంటి ఆలోచన ఏమీ కనిపించలేదు.మా సంభాషణ అంతా శ్రద్ధగా వింటోంది ఆమె.

'అదేమీ లేదు.మీ ప్రశ్నలన్నీ ఇప్పుడే అడగండి.సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.' అన్నాను.

'అసలు ఈ విధంగా ప్రశ్నించడం మంచిదా కాదా? ఎవరైనా పెద్ద గురువుల దగ్గరకు పోయినప్పుడు వాదించకుండా చెప్పింది వినమని నా భార్య ఎప్పుడూ నన్ను మందలిస్తూ ఉంటుంది.' అన్నాడాయన.

'వారి మీద గౌరవంతో ఆమె అలా అని ఉండవచ్చు.నేను అలాటి 'పెద్ద' గురువును ఏమీ కాదు.కావాలని కూడా నాకు కోరిక ఏమీ లేదు. నేనేమీ కాషాయ వస్త్రాలు వేసుకోలేదు.నేటి కార్పోరేట్ గురువులలాగా మతాన్ని వ్యాపారంగా మార్చడం లేదు.కనుక మీరు నాతో ఫ్రీగా మాట్లాడవచ్చు.

పైగా - ప్రశ్నించడం అనేది మన హిందూమతంలో ఒక భాగం. ఉపనిషత్తులన్నీ గురుశిష్య సంవాదం నుంచి పుట్టిన భాండాగారాలే.ప్రశ్నించడాన్ని ఇతర మతాలు ఒప్పుకోవు. 'నోర్మూసుకుని చెప్పినది నమ్ము' అని అవి అంటాయి. దానికి విరుద్ధంగా 'ప్రశ్నించు' అని మనం అంటాం.కనుక మీరు ప్రశ్నించండి.నన్ను ఎవరైనా ప్రశ్నిస్తేనే నాకు బాగుంటుంది. ఎందుకంటే ప్రశ్న వల్లనే డిస్కషన్ అనేది వస్తుంది.డిస్కషన్ నుంచే విషయాలు అర్ధమౌతాయి.కనుక ప్రశ్నించడం చాలా అవసరం. నేను దాన్ని లైక్ చేస్తాను.' అన్నాను.

వారికేదో పని ఉన్నట్లుంది. అందుకని -'ఇక వెళతాం' అంటూ బయల్దేరారు.'శ్రీవిద్యా రహస్యం', 'తారా స్తోత్రం' - పుస్తకాలను వారికి ఇచ్చి నేనూ వారినుంచి సెలవు తీసుకున్నాను.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 13 (సందేహాలు సమాధానాలు) "

మా అమెరికా యాత్ర -12 (మదర్స్ ట్రస్ట్ మదర్స్ ప్లేస్ - గాంగెస్ మిచిగాన్ లో ఆశ్రమ జీవితం)

















13-5-2016 శుక్రవారం నుంచి 18 -5 -2016 బుధవారం వరకూ గాంగెస్ మిచిగాన్ లోని మదర్స్ ట్రస్ట్ ఆశ్రమంలో స్పిరిచ్యువల్ రిట్రీట్ నిర్వహించాను.దీనికి దాదాపు 35 మంది సభ్యులు అమెరికాలోని పలు రాష్ట్రాలనుంచి వచ్చి పాల్గొన్నారు.అక్కడ ఉన్న యూనివర్సల్ టెంపుల్ లో - శ్రీవిద్య శీచక్ర ఉపాసన - మీద ఆదివారం నాడు ఒక అరగంట సేపు మాట్లాడాను.ఈ ఉపన్యాసాన్ని మనవాళ్ళతో బాటు అక్కడ ఉన్న ఒక పదిమంది అమెరికన్స్ కూడా విన్నారు.వాళ్ళందరూ మన సాంప్రదాయం అంటే చాలా ఇష్టం ఉన్నవాళ్ళు, దాని లోతుపాతులు తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉన్నవారు.

స్వామి ఆత్మలోకానంద, మాతా గౌరీ  మా, శక్తివ్రత పురీజీ, శివవ్రత పురీజీ అనే అమెరికన్స్ మన హిందూ మతం ప్రకారం సన్యాసం స్వీకరించి నలభై ఏళ్ళనుంచీ అక్కడ ఉంటూ ఆశ్రమ జీవితం గడుపుతూ శ్రీ రామకృష్ణ, శారదామాత, వివేకానంద స్వాముల అడుగుజాడలలో నడుస్తూ ధన్యములైన జీవితాలను గడుపుతున్న మహనీయులు. వాళ్ళను చూస్తే మన భారతీయులు సిగ్గుపడాలి.మన మతం గురించి అంత ఎక్కువగా తెలుసు వాళ్లకు.

నా ఉపన్యాసం విన్న, మైకేల్, జూలియా అనే ఇద్దరు అమెరికన్ దంపతులు చాలా ముగ్దులై, నా దగ్గర శ్రీవిద్యాదీక్ష తీసుకుంటామని, వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించమని అడిగారు. వాళ్లకు దీక్ష ఇవ్వమని మాతా గౌరీమా కూడా నన్ను ఆదేశించారు.కనుక వారిద్దరికీ నిన్న ఉదయం శ్రీరామకృష్ణ దేవాలయంలో శ్రీవిద్యాదీక్ష ఇచ్చి వారిని రహస్య తాంత్రిక సాధనామార్గంలోకి ప్రవేశింపజేశాను.దీక్షా సమయంలో వారిద్దరూ ఆనందంతో పొంగిపోయి చాలాసేపు కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు.నా దగ్గరనుంచి శ్రీవిద్యాదీక్ష స్వీకరించి నాకు శిష్యులైన మొదటి అమెరికన్ జంట వీరే.

అయిదురోజులూ చాలా ఆనందంగా గడిచాయి.ప్రతిరోజూ యోగాభ్యాసం, ప్రాణాయామం,ధ్యాన సాధనలు,చర్చలలో కాలం గడిచింది.మధ్య మధ్యలో చుట్టూ ఉన్న అడవిలోకి వాకింగ్ కు వెళ్ళడం, దగ్గరలోనే ఉన్న లేక్ మిచిగాన్ ఒడ్డుకు వెళ్లి రావడం,సరదాగా మాట్లాడుకుంటూ,పాటలు పాడుకుంటూ నవ్వులతో కాలక్షేపం చేశాము.

ఈ రిట్రీట్ కు వచ్చిన పంచవటి సభ్యులలో అందరికీ యోగదీక్ష ఇచ్చాను.ఇద్దరికి మాత్రం వారివారి కోరిక మేరకు శక్తి ఉపాసనలో మంత్రదీక్ష ఇవ్వడం జరిగింది.రిట్రీట్ తర్వాత అందరూ సంతోషంగా వారి వారి ఇళ్ళకు చేరుకున్నారు.

రిట్రీట్ సందర్భంగా జరిగిన చర్చలు,ఇతర వివరాలు,ఇండియా వచ్చాక నిదానంగా పోస్ట్ చేస్తాను.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర -12 (మదర్స్ ట్రస్ట్ మదర్స్ ప్లేస్ - గాంగెస్ మిచిగాన్ లో ఆశ్రమ జీవితం) "

11, మే 2016, బుధవారం

మా అమెరికా యాత్ర - 11 (బ్రహ్మచర్య మహిమ)

ఆశ్రమానికి కావలసిన సరుకులు కొందామని ఇండియన్ స్టోర్స్ కు బయలుదేరాము.గుజరాత్ నుంచి వచ్చిన పటేల్స్ అమెరికాలో బిజినెస్ రంగంలో మంచిగా స్థిరపడ్డారు. హోటల్స్,మాల్స్,ప్రొవిజన్ స్టోర్స్ మొదలైన రంగాలలో వాళ్ళు బాగా నిలదొక్కుకున్నారు.వాళ్ళదే ఒక స్టోర్ ఇక్కడ ఉంటే దానికని బయల్దేరాము.

దారిలో కారులో సంభాషణ ఈ విధంగా జరిగింది.


'మన గ్రూపు సభ్యుడైన 'A' ఒక ఏడాదిన్నర నుంచీ బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు.చూచారా అతని ముఖంలో ఎంత వెలుగు ఉన్నదో?' - అన్నారు ఒకరు.


అందరూ -'అవునవును అతని ముఖంలో వెలుగుకు కారణం అదా?' అంటూ ఒప్పేసుకున్నారు.


ఇంకొకరు ఇలా అన్నారు.


'ఈ విషయం నేనూ గమనించాను.కొద్ది నెలలు బ్రహ్మచర్యం పాటిస్తే, సాధన చాలా బాగా జరుగుతుంది.అప్పుడు త్వరగా 'ట్రాన్స్' లోకి వెళ్ళగలుగుతున్నాను.లేకుంటే 'ట్రాన్స్' త్వరగా రావడం లేదు.'


వింటున్న నేను ఇలా అన్నాను.


'మీరు చెబుతున్నది నిజమే.యోగాభ్యాసంలో - బ్రహ్మచర్యం - అనేది చాలా ముఖ్యమైనది.కుండలినీ యోగ సాధకులకు ఇది అత్యంత ఆవశ్యకమైన నియమం.బ్రహ్మచర్యం పాటించకుండా కుండలినీ సాధన గావిస్తే మెదడులోని నరాలు దెబ్బతిని పిచ్చి పుడుతుంది.పాతకాలంలో చాలామంది సాధకులు ఇలాగే కుండలినితో ఆటలాడి చాలా దెబ్బతిన్నారు.వారి శేషజీవితం అంతా పిచ్చాసుపత్రిలోనే గడుస్తుంది.ఆ పిచ్చి - మందులకు లొంగదు.


వివేకానందస్వామి జీవితాంతం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు గనుకనే ప్రపంచాన్ని అజ్ఞానపు నిద్రలోనుంచి లేపగలిగినంత మహత్తరమైన శక్తి సంపన్నుడైనాడు.మన యోగులు తమంత తాము బ్రహ్మచర్య దీక్షలో ఉండేది పిచ్చివాళ్లై కాదు.వారికి మనకున్నన్ని తెలివితేటలు లేకా కాదు.ఒక పెద్ద ఆనందాన్ని పొందాలంటే చిన్నచిన్న ఆనందాలను వాలంటరీగా వదులుకోవాలి.తప్పదు.అలా వదలగలిగిన వారిలో అమితమైన శక్తి  గూడుకట్టుకుని ఉంటుంది.ఆ శక్తి వారికి చాలా గొప్పదైన ఆనందాన్నిస్తుంది.

'అమెరికా సోదర సోదరీమణులారా' - అని వివేకానందస్వామి చేసిన ఒక్క సంబోధనతో ఆ హాల్లో ఉన్న వందలాది మంది లేచి నిలబడి రెండు నిముషాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటే అది ఏ శక్తివల్ల జరిగిందని అనుకుంటున్నారు? స్వామిలో ఉన్నట్టి బ్రహ్మచర్య శక్తియే దానికి కారణం.అదే వారినలా కదిలించింది.

తన సోదరశిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒకసారి ఇలా అన్నారు.'ఒక్క క్షణం కూడా కామానికి లోనుకాకుండా నా చిన్నప్పటినుంచీ నా మనస్సును ఆలోచనలను - దానికి అతీతమైన స్థితిలో ఉంచుతూ వచ్చాను.అలా చెయ్యడం ద్వారా పోగైన శక్తితో అద్భుతాలు చెయ్యవచ్చు. ప్రపంచాన్ని కదిలించవచ్చు.'

అపవిత్రుల స్పర్శను కూడా భరించలేని శ్రీ రామకృష్ణులు - నరేంద్రుడు కనిపిస్తే చాలు - అతన్ని దగ్గరకు తీసుకుని కౌగలించుకోకుండా ఉండలేకపోయేవాడంటే - నరేంద్రుడు ఎంతటి పవిత్రమైన ఆత్మో తెలుసుకోండి.' అన్నాను.

'అవును.వయసులో ఉన్నపుడు కామాన్ని జయించడానికి ఆయనొకసారి కాలుతున్న పెనం మీద కూచున్నాడట కదా?' - వింటున్న ఒకరు అడిగారు.

'నిజమే.ఆయన జీవితంలో ఆ సంఘటన జరిగింది.ఇలా చేశానని ఆయన ఎవరికీ చెప్పలేదు.కానీ తరువాత కొన్నాళ్ళకు ఆయన దక్షిణేశ్వరం వెళ్ళాడు.నరేంద్రుని చూస్తూనే శ్రీరామకృష్ణులు గబగబా ఎదురువచ్చి అతన్ని కౌగలించుకుని కన్నీళ్లు కారుస్తూ అలా ఉండిపోయారు.కామజయం సాధించడానికి నరేంద్రుడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడో ఆయనకు తెలుసు.దైవం కోసం అంత తపన పడినవారి దగ్గరకు ఆయన పరిగెత్తుకుంటూ ఎదురు వస్తాడు.అందుకనే నరేంద్రుడంటే శ్రీరామకృష్ణులకు అంతటి ప్రేమ ఉండేది. మనం ఏం చేస్తున్నామో భగవంతునికి తెలుసు.ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు.మన అంతరంగం ఏమిటో మనకంటే ఆయనకే ఎక్కువ బాగా తెలుసు.

వివేకానందస్వామి ఒక్కరే కాదు.శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులందరూ అలాంటి జాతివజ్రాలే.వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అద్భుత జీవితం.వాళ్ళు మానవదేహంలో ఉన్నప్పటికీ మానవులు కారు.వారందరూ దేవతలే.దేవతలే మనుషుల రూపంలో భూమిమీద అలా నడిచారు.శ్రీ రామకృష్ణులతో బాటు ఈ భూమిమీదకు వచ్చిన ఆయన పరివార దేవతలు వారందరూనూ.

మన పరమగురువులైన శివానందస్వామి పరిపూర్ణమైన బ్రహ్మచర్య నిష్టాగరిష్టుడు.పన్నెండేళ్ళ పాటు ఆయన మనసులో ఒక్కసారి కూడా కామపరమైన ఆలోచన రాకుండా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించాడు.అంతటి మనోనిగ్రహం ఉన్నది గనుకనే ఆయన్ను వివేకానంద స్వామి 'నువ్వు మహాపురుషుడవు'. అంటూ - 'మహాపురుష మహారాజ్' అని పిలిచేవారు.ఆయనొక్కరే కాదు.మిగతా అందరూ అలాంటివారే.

'నాగమహాశయుని జీవితం ఎంత అద్భుతమో కదా?' అన్నారు ఇదంతా వింటున్న వారిలో ఒకరు.

'ఆయన జీవితం అత్యద్భుతం.గృహస్థ భక్తునిగా ఉంటూ సంన్యాసశిష్యులను మించి ఉన్నాడాయన.సాక్షాతూ వివేకానందస్వామి అంతటివాడు - నాగమహాశయుని పాదాలకు నమస్కారం చేశాడంటే - నాగమహాశయుడు ఎంతటి మహనీయుడో అర్ధం చేసుకోండి.' అన్నాను.

'నందానందస్వామి ఆజన్మ బ్రహ్మచారియే కదా?' అంటూ వింటున్న ఒకరు అడిగారు.

'అవును.ఆయన ఆజన్మ బ్రహ్మచారియే.అందుకే ఆయనలో అంతటి తపశ్శక్తి పోగుపడి ఉన్నది.అంతటి తపస్విని నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు.' అన్నాను.

సంభాషణ అమెరికా సమాజం వైపు మళ్ళింది.

'ఇదంతా భోగభూమి.ఇక్కడ సమస్త సుఖాలూ ఉన్నాయి. కన్సెంన్టింగ్ ఎడల్ట్స్ మధ్య లైంగికసుఖం అనేది ఇక్కడ తప్పు కాదు.ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇలాగే తయారైంది. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే అధ్వాన్నంగా తయారైంది. సామాజికపరంగా,ఇండివిడ్యువల్ హక్కుల పరంగా చూస్తె ఇవన్నీ తప్పులు కాకపోవచ్చు.కానీ ఆధ్యాత్మిక పరంగా మాత్రం - బ్రహ్మచర్యం లేనిదే ఎవ్వరూ ఎదగలేరు.అది అసాధ్యం. 

కాకపోతే ఇక్కడ కొన్ని వెసులుబాట్లున్నాయి.ఇరవై ఇరవై అయిదూ వచ్చేసరికి ఇక్కడ పిల్లలకు అన్నీ అయిపోతాయి. చూడవలసిన పీక్స్ అన్నీ చూసేస్తారు.కనుక త్వరగా బోరు మొదలౌతుంది.ఆ తర్వాత ఇంకేంటి? జీవితం అంటే ఇంతేనా? తినడం త్రాగడం సుఖించడం తప్ప ఇంకేమీ లేదా? అన్న అన్వేషణ మొదలౌతుంది.అదే నిజమైన ఆధ్యాత్మికతకు దారి చూపిస్తుంది.ఆ విధంగా చూస్తే, ఇక్కడి సోషల్ లైఫ్ మంచిదే.పైగా ఇక్కడివారికి ఇన్హిబిషన్స్ లేవు.హిపోక్రసీ లేదు.కనుక ఒకవిధంగా ఈ జీవనవిధానం కూడా మంచిదే.

కామాన్నే సాధనంగా మలుచుకుని ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిలకు ఎదిగే మార్గాలు కూడా తంత్రంలో కొన్ని ఉన్నాయి. కానీ ఆయా తాంత్రిక మార్గాలను అందరూ పాటించలేరు.వాటిని ఫాలో అవ్వాలంటే మనిషికి చాలా గొప్పవైన క్వాలిఫికేషన్లు ఉండాలి.అది అందరికీ సాధ్యమయ్యే మార్గం కాదు.

ఒకరిద్దరు పిల్లలు కలిగాక, భార్యాభర్తలు అన్నాచెల్లెళ్ళలాగా జీవించాలనీ సాధన చేస్తూ మిగిలిన జీవితాన్ని గడపాలనీ శ్రీరామకృష్ణులు అనేవారు. ఎందుకలా చెయ్యాలంటే - బ్రహ్మచర్యం వల్ల మనిషిలో అమితమైన ప్రాణశక్తి  నిలువ అవుతుంది.ఆధ్యాత్మిక జీవనానికి శిఖరమైన సమాధిస్థితిని పొందాలంటే మనిషి దేహంలో చాలా ప్రాణశక్తి నిలువ ఉండాలి. లేకుంటే ఆ స్థితి దక్కదు.దానికి బ్రహ్మచర్యం అత్యంత ముఖ్యమైన నియమం.ఇది సంన్యాసులకైనా సంసారులకైనా సమానమైన నియమమే.అందుకే తన యోగమార్గపు మెట్లలో మొదటి మెట్టైన 'యమం' లోనే బ్రహ్మచర్యాన్ని పతంజలి మహర్షి ఒక రూలుగా ఉంచాడు.ఈ విషయం బాగా గుర్తుంచుకోండి.' అని ముగించాను.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 11 (బ్రహ్మచర్య మహిమ) "

10, మే 2016, మంగళవారం

మా అమెరికా యాత్ర - 10 (పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం)

6-5-2016 న పాంటియాక్ మిచిగాన్ లోని పరాశక్తి ఆలయంలో "శ్రీవిద్య" మీద ఇచ్చిన ఉపన్యాసం ఇక్కడ వినండి.

read more " మా అమెరికా యాత్ర - 10 (పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం) "

9, మే 2016, సోమవారం

మా అమెరికా యాత్ర - 9 - పాంటియాక్ పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం - ఫోటోలు

ముందే ప్లాన్ చేసినట్లుగా ఆరో తేదీ సాయంత్రం 6.30 గంటలకు పాంటియాక్ పరాశక్తి ఆలయంలో 'శ్రీవిద్య' గురించి నేను మాట్లాడాను.ఆలయానికి రెగ్యులర్ గా వచ్చే ఇండియన్స్ తో బాటుగా నాకోసం టెక్సాస్, వర్జీనియా, చికాగో, షాంపేన్ లనుంచి కుటుంబాలతో వచ్చిన 'పంచవటి' సభ్యులతో సభ నిండింది. మొత్తమ్మీద 75 నుంచి 80 మంది దాకా ఆడియన్స్ ఓపికగా ఒక గంటసేపు కూచుని నా ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నారు.ఆ తర్వాత జరిగిన Q&A సెషన్ లో శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిచ్చాను.

అమెరికాలోని ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన పంచవటి సభ్యులకు, కుటుంబ సభ్యులతో వచ్చి ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్న లోకల్ సభ్యులకు,ఉపన్యాసం తర్వాత నన్ను సత్కరించిన దేవాలయ ట్రస్టీలలో ఒకరైన డాక్టర్ వెంకటహరిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మధ్యాహ్నం నుంచీ ఇంతమందికీ అవసరమైన డిన్నర్ పదార్ధాలను (ప్రసాదాన్ని) తయారు చేసిన పద్మజ, లక్ష్మి, శకుంతల, డాక్టర్ ప్రత్యూష,సరళ గార్లకు, వంటలో సహకరించిన నూకల శ్రీనివాస్,మాటూరి రవిగార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ ఈవెంట్ జరగడానికి మూలకారకుడైన శ్రీ ఆనంద్ కుమార్ (www.miindia.com) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈవెంట్ మొత్తాన్నీ ఆడియో మరియు వీడియో తీయడం జరిగింది.ఆ ఫైల్స్ ను అభిమానుల, శిష్యుల ఉపయోగార్ధం త్వరలో అప్లోడ్ చెయ్యడం జరుగుతుంది.

అప్పటివరకూ ఈ ఫోటోలు చూడండి మరి.




 


 












 




   








read more " మా అమెరికా యాత్ర - 9 - పాంటియాక్ పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం - ఫోటోలు "

4, మే 2016, బుధవారం

మా అమెరికా యాత్ర -8 (ఇప్పుడు మీకేమనిపిస్తోంది?)

మొన్నొకరోజు సాయంత్రం అందరం కలసి ఆబర్న్ హిల్స్ నుంచి కేంటన్ కు కారులో బయలుదేరాము.అక్కడ పంచవటి సభ్యుడైన ఆనంద్ ఉంటారు.ఈయన miindia.com సైట్ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళింట్లో డిన్నర్ కు రమ్మని ఆహ్వానిస్తే అందరం కలసి వాళ్ళింటికి బయలుదేరాము.

వాతావరణం బాగా చలిగా ఉన్నది.ఇక్కడ సమ్మర్లో కూడా తొమ్మిది పది డిగ్రీల చలి ఉంటున్నది.దానికి తోడు రెండు మూడు రోజులకొకసారి ముసురుపట్టి వానలు పడుతున్నాయి. అలాగే వానలోనే బయలుదేరాము.వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది.

చూస్తుండగానే చీకటి పడింది.హైవే మీద ఒకటీ రెండూ కార్లు తప్ప పెద్దగా ట్రాఫిక్కు లేదు.విశాలమైన రోడ్లమీద, ఆ వానలో ప్రయాణం చేస్తుంటే ఎక్కడికో అనంతంలోకి ఒంటరిగా అలా సాగిపోతూ ఉన్న ఫీలింగ్ కలుగుతున్నది.

అందరూ కార్లో మౌనంగా కూచుని ఉన్నారు.నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మొబైల్ ఫోన్ మ్రోగింది.మాతో బాటు కేంటన్ రావాలనుకుని కారణాంతరాల వల్ల రాలేకపోయిన  ఒక అమెరికా శిష్యురాలు ఫోన్లో కొచ్చింది.

కాసేపు అదీ ఇదీ మాట్లాడిన తర్వాత, "వానలో అలా ప్రయాణం చేస్తుంటే మీకు ఏం చెయ్యాలనిపిస్తున్నది?" అంటూ తను ప్రశ్నించింది.

"చెప్తానుండు" - అంటూ కార్లో నాతోబాటు ఉన్నవారికి అదే ప్రశ్న సంధించాను.

'ఈ చలి వాతావరణంలో, ఈ వానలో ప్రయాణం చేస్తుంటే - ఇప్పుడు మీమీ మనసులలో ఏమేం చెయ్యాలని అనిపిస్తున్నదో తడుముకోకుండా చెప్పాలి.మీకు ఏది అనిపిస్తే అది మొహమాటం లేకుండా వెంటనే చెప్పెయ్యాలి.చెప్పండి.'

నా శిష్యులకు అప్పుడపుడూ ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాను.

ఒకరేమో - 'మాకు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తినాలని ఉంది' - అన్నారు.

'గుడ్' అన్నాను.

ఇంకొకరేమో - 'మాకు వేడివేడిగా ఏదన్నా త్రాగాలని ఉంది' - అన్నారు.

వారికీ - 'గుడ్' - అన్నాను.

ఇంకొకరేమో - 'ఈ వానలో తడుస్తూ ఐస్ క్రీం తినాలని ఉంది' - అన్నారు.

'వెరీ గుడ్' - అన్నాను.

ఇంకొకరేమో - 'ఈ సమయంలో గర్ల్ ఫ్రెండ్ పక్కనుంటే బాగుంటుంది' - అన్నారు.

వీరికి  - 'ఎక్సలెంట్' -  అన్నాను.

ఇంకొకరేమో - "మెడిటేషన్ చెయ్యాలనిపిస్తున్నది" అన్నారు.

'సూపర్' - అన్నాను.

చివరకి అందరూ కలిసి - 'మీకేం అనిపిస్తున్నదో చెప్పండి?' అంటూ నన్నే ఎదురు ప్రశ్నించారు.

నా ఫీల్ ను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే - అందరూ గొల్లున నవ్వేశారు. "మమ్మల్నేమో టక్కున చెప్పమని, మీరేమో వెంటనే చెప్పకుండా - నిదానంగా ఆలోచించుకుంటున్నారా?" - అన్నట్లు.

నా అవస్థకు నాకూ నవ్వొచ్చింది. తమాయించుకుని ఇలా చెప్పాను.

'నాకు - నన్ను దాటి expand అయ్యి ఈ ప్రకృతిలో కలిసిపోవాలనిపిస్తున్నది.'

నవ్వులు ఆగిపోయి కార్లో నిశ్శబ్దం ఆవహించింది.

ఫోన్లో ఇదంతా వింటున్న శిష్యురాలు - 'అదెలా సాధ్యం? మీకెందుకు అలా అనిపిస్తుంది?' - అంటూ ప్రశ్నించింది.

'ఎందుకలా అనిపిస్తుంది? అనడిగితే నేను చెప్పలేనుగాని 'ఇది సాధ్యమే' అని మాత్రం చెప్పగలను.ఇలాంటి సమయంలో ఎవరికైనా ప్రకృతిలో కరిగిపోవాలనే అనిపిస్తుంది.కానీ ఆ విషయం స్పష్టంగా అర్ధం కాక - ఎవరికిష్టమైన వస్తువునో మనిషినో వారు కోరుకుంటూ ఉంటారు.అసలు విషయం అదికాదు.ఈ వస్తువులూ మనుషులూ మనిషికి అమేయమైన ఆనందాన్ని ఇవ్వలేవు.ఆ సంగతి ఎవరికి వారికే అంతరాంతరాలలో తెలుసు.కానీ వేరే మార్గం తెలియక - వాటిలోనే శాశ్వతమైన ఆనందాన్ని వెదుక్కుంటూ ఉంటారు.కానీ ప్రతిసారీ దాన్ని మిస్ అవుతూ ఉంటారు.ఎందుకంటే - ఎక్కడ వెదకాలో తెలియక రాంగ్ ప్లేస్ లో వెదకడమే ఈ మిస్ అవడానికి కారణం.

ఇదంతా Being and Becoming అనే విద్య తెలిస్తే అర్ధమైపోతుంది.మొదట మనం Being అంటే ఏమిటో అనుభవంలో తెలుసుకోవాలి.ఈ Being అనేది శరీరానికీ మనస్సుకూ బుద్ధికీ అహంకారానికీ అతీతంగా ప్రతిమనిషిలోనూ ఒకేవిధంగా ఉన్నది.అందులోకి జారిపోవడం మొదట తెలియాలి.దీనికి సాధన అవసరం.ఉత్త పాండిత్యం వల్ల ఇది రాదు.

Being అనేది అర్ధమైన తర్వాత,Becoming అనేది మొదలౌతుంది.ఎందుకంటే నీలోపల ఏది ఉన్నదో అదే బయట ప్రకృతిలో కూడా నిండి ఉన్నది. అది నిన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది.కానీ నీకు మాయ కప్పేసి ఉండటంతో దాని ఆకర్షణను నువ్వు ఫీల్ కాలేవు.కొందరు భావుకులు కవులు మాత్రం ఈ ప్రకృతి ఆకర్షణను కొద్దిగా ఫీల్ కాగలుగుతారు.వాళ్ళు కూడా పూర్తిగా కాలేరు.ఎందుకంటే వారికి అంతరిక ధ్యానసాధన అలవాటు ఉండదు గనుక.

కానీ ఎప్పుడైతే నీకు Being అనేది అనుభవంలో తెలుస్తుందో - అప్పుడు నీ చుట్టూ ప్రకృతిలో ఉన్న ఇంకా పెద్ద Being నిన్ను అమితంగా ఆకర్షిస్తుంది.నీ being ఆ Being లో కరగిపోవడం మొదలౌతుంది.అప్పుడు మాత్రమే Becoming అంటే ఏమిటో నీకు అనుభవంలో అర్ధమౌతుంది.

ఒక చిన్న గిన్నెలో ఉన్న చేప, దానిలోనుంచి ఎగిరి తన చుట్టూ ఉన్న పెద్ద నదిలోకి దూకాలని ప్రయత్నించినట్లుగా ఈ ఫీలింగ్ ఉంటుంది.అప్పుడు నీకు నిన్ను దాటి expand అవాలనిపిస్తుంది.నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో కలిసిపోవాలని - కరగిపోవాలని- అనిపిస్తుంది.ఈ ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.నిజంగా కరగిపోగలిగితే - ఆ అనుభవం మాటలకు అతీతంగా పరమాద్భుతంగా ఉంటుంది.మనిషికి తెలిసిన అన్ని అనుభవాలలోకీ ఇదే అత్యున్నతమైన ఆనందాన్ని ఇచ్చే అనుభవం.దీనినే యోగపరిభాషలో "సమాధిస్థితి" అంటారు. ప్రస్తుతం నాకు అలాగే కరగిపోవాలని అనిపిస్తున్నది.' అన్నాను.

నేను వివరించి చెబుతూ ఉన్నప్పుడే అందరికీ ఆ వైబ్రేషన్స్ పట్టేశాయి.నా మాటల్లోని నిజాన్ని వాళ్ళు కూడా ఫీల్ అవడం మొదలు పెట్టారు.

సడెన్ గా కార్లో నిశ్శబ్దం ఆవహించింది.

వాన ఆగకుండా పడుతూనే ఉన్నది.మెత్తటి రోడ్డుమీద కారు ఇంకా మెత్తగా సాగిపోతున్నది.చుట్టూ చీకటి. హైవే లైట్లు తప్ప ఎక్కడా ఏ విధమైన లైటింగూ లేదు.ఎక్కడా జనసంచారం లేదు.రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ళన్నీ దూరదూరంగా విసిరేసినట్లుగా ఉండి,వానలో ముద్దగా తడుస్తూ,ఎక్కడో కొండచరియలలో ధ్యానావస్థలో ఉన్న యోగుల్లా నిశ్శబ్దంగా ఉన్నాయి.

ప్రకృతిలోని ప్రశాంత నిశ్శబ్దం కార్లో ఉన్న మమ్మల్ని అందరినీ ఒక భూతంలా ఆవహించింది.అందరూ మౌనంగా విండోలలో నుంచి ఆ వానను చూస్తూ ఉండిపోయాము.

గమ్యం చేరేవరకూ ఎవరమూ ఏమీ మాట్లాడుకోలేదు. అద్భుతమైన ఆ ఫీల్ లో ఉన్నప్పుడు ఇక మాటల అవసరం ఏముంటుంది?

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర -8 (ఇప్పుడు మీకేమనిపిస్తోంది?) "

2, మే 2016, సోమవారం

మా అమెరికా యాత్ర - 7 (ఎగ్గోపాఖ్యానం)

చాలామంది వేదాంతులు - 'శరీరం మాయ' - అంటూ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు.కానీ తాంత్రికుల విధానం అది కాదు.వారికి శరీరం కూడా సత్యమే. నేను బయటకు వేదాంతినే అయినప్పటికీ లోలోపల ఒక తాంత్రికుడిని.'దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవి స్సదాశివ:' - శరీరమే ఒక దేవాలయం అని తంత్రం చెబుతుంది.కనుక దేవాలయాన్ని ఫిట్ కండిషన్ లో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.అందుకే దైనందిన జీవితంలో నేను శరీర వ్యాయామానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాను.అదే అలవాటు మా అబ్బాయికి కూడా వచ్చింది.

తను ఒకటి రెండేళ్ళ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను యోగా చేస్తుంటే చూస్తూ ఉండేవాడు.నేను చక్రాసనం వేస్తే క్రిందనుంచి పాక్కుంటూ ఈ పక్కనుంచి ఆ పక్కకు వచ్చేవాడు.నేను శీర్షాసనంలో ఉంటే తనుకూడా తల క్రిందకు పెట్టి నా ముఖంలోకి చూస్తూ 'ఈ..' అంటూ నవ్వేవాడు.

తను పెరుగుతూ వస్తున్న కొద్దీ నా దగ్గర యోగా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ వచ్చాడు.ప్రస్తుతం అమెరికాలో ఉన్నా వ్యాయామం మానుకోలేదు.జిమ్ కు వెళుతూ ఉంటాడు.Oakland University Cricket Team కు కెప్టెన్ గా ఉన్నాడు.ఇక్కడ తెలుగు వారందరినీ కూడగట్టి క్రికెట్ ఆడుతూ ఉంటాడు.

మరి ఈ వ్యాయామాలూ అవీ చేస్తే, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి కదా.తనకేమో మీట్ అలవాటు లేదు.అందుకని ఎగ్ లో పీనట్ బటర్,స్పినాచ్,ఆల్మండ్ మిల్క్,ఇంకా ఏవేవో కలిపి ప్రోటీన్ షేక్ తయారుచేసి తీసుకుంటూ ఉంటాడు.

మొన్నొక రోజున తనకోసం అది తయారు చేసుకుంటూ - 'నాన్నా నీకు కూడా తయారు చెయ్యనా?' అని అడిగాడు.నేను కాలేజి రోజుల్లో ఒక పదిసార్లో ఏమో ఆమ్లెట్ తిన్నాను.ఆ తర్వాత ఇప్పటివరకూ ఎగ్ జోలికి పోలేదు.సరే చూద్దాం అని, 'ఓకె చెయ్యి'. అన్నాను.

'ఎల్లో కలపనా? తీసెయ్యనా?' అడిగాడు.

కొంత వయసు వచ్చాక ఫ్యాట్ పెరుగుతుందని ఎల్లో చాలామంది తినరు. అందుకని తను అలా అడిగాడు.

'మనకా ఇబ్బంది ఏమీ లేదు నాయనా! అన్నీ ఉంచు.' అంటూ ఎగ్గోపాఖ్యానం ఇలా బోధించాను.

'చూడండి శిష్యులారా ! జాగ్రత్తగా వినండి.మీకు ఈరోజు ఒక పరమ రహస్యాన్ని బోధిస్తున్నాను.ఈ రహస్యం ఇంతవరకూ ఎవరికీ తెలియదు. మొదటిసారిగా నేనే ప్రపంచానికి దీనిని వెల్లడి గావిస్తున్నాను.ఇది పుస్తకాలలో ఎక్కడా దొరకదు.గురుశిష్య పరంపరగా మాత్రమే వస్తూ ఉంటుంది.అందుకని జాగ్రత్తగా వినండి.

ఎగ్ లో ఉన్న ఎల్లో అనేది గురువు.వైట్ అనేది చంద్రుడు.గురుచంద్రుల కలయిక గజకేసరి యోగం అనబడుతుంది.గజకేసరీ యోగం అంటే ఎగ్గే. కనుక ఆ రెంటినీ ఎప్పటికీ వేరు చెయ్యకూడదు.అలా చేసినవారు,గజకేసరీ యోగాన్ని భ్రష్టు పట్టించిన వారౌతారు.కలసి ఉన్న గురువునూ చంద్రుడినీ విడదీసిన వారౌతారు.వారిని గురువు చంద్రుడూ ఇద్దరూ శపిస్తారు.కనుక ఎగ్ ను మొత్తం స్వీకరించండి.విడదియ్యకండి.

ఇందులో ఇంకొక రహస్యం వినండి. మ్రింగడం అనేది రాహువు యొక్క చర్య.కనుక ఎగ్ ను త్రాగేవారు దేనిని సూచిస్తారంటే - గురుచంద్రులు రాహువు చేత మ్రింగబడడాన్ని సూచిస్తారు.అందుకే అలాంటివారి జీవితాలలో రాహువు ప్రధానపాత్ర వహిస్తూ ఉంటాడు.గురువునూ చంద్రుడినీ మ్రింగేస్తూ ఉంటాడు.సూక్ష్మంగా గమనిస్తే నేను చెబుతున్నదానిలో నిజం మీకు అర్ధమౌతుంది.

ఈ రహస్యబోధను ఎవరికిబడితే వారికి చెప్పకండి.అర్హత ఉన్నవారికి మాత్రమే దీనిని బోధించాలి.గుర్తుంచుకోండి.' అంటూ ముగించాను.

ఇదంతా అప్పటిదాకా సైలెంట్ గా వింటున్న రాజు - 'ఆహా! అండంలో బ్రహ్మాండం' అంటూ చమత్కరించాడు.

అందరం గొల్లున నవ్వుకున్నాం.

హాస్యాన్ని కాసేపు పక్కన ఉంచితే - సంతాన దోషాలు రావడానికి గల కారణాలలో ఒకటి - పాము గుడ్లను ధ్వంసం చెయ్యడం - అని ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలు చెబుతున్నాయి.సాధారణంగా రైతు కుటుంబాలలో ఇది జరుగుతూ ఉంటుంది.పొలాలలో ఉన్న పుట్టలను వాళ్ళు తవ్వేస్తూ ఉంటారు.ఆ క్రమంలో ఆ పుట్టలలో ఉన్న పాము గుడ్లను వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటారు.ఆ పాపమే వాళ్లకు సంతాన దోషంగా సంక్రమించి తరతరాలు వెంటాడి వేధిస్తూ ఉంటుంది.

సంతాన దోషాలున్నవారు ఎగ్స్ తింటూ ఉన్నంతకాలం వాళ్ళు చేసే రెమేడీలు ఏవీ పనిచెయ్యవు.దానివెనుక ఉన్న లాజిక్ ఏమంటే - ఇప్పటికే ఉన్న పాపఖర్మను ఈ పనిద్వారా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉండటమే.ఎగ్ ఈటింగ్ మానుకోకపోతే సంతాన దోషాలు పోవు.సంతాన దోషాలు అంటే - పిల్లలు పుట్టకపోవడం మాత్రమే కాదు, పిల్లలు రోగాలతో బాధపడటం, బలహీనంగా ఉండటం, చెప్పిన మాట వినకుండా మొండిగా తయారు కావడం,అప్రయోజకులుగా మిగిలిపోవడం,లేదా పెద్దవయసులో తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండటం, ఇంకా ఇలాంటివి ఎన్నో - ఇవన్నీ 'సంతాన దోషం' అనే పదానికి రకరకాల షేడ్స్ గా ఉంటాయి. వీటికి గల ఏకైక కారణం - ఎగ్ ఈటింగ్ కాకపోయినా - ఇప్పటికే ఉన్న ఆ దోషాన్ని ఇది ఎక్కువ చేస్తుంది.కనుక జాతకపరమైన రెమేడీలు చేసేవారు ఎగ్ జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది.

జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహం అనేది సంతాన కారకుడని మనకు తెలిసినదే.గురుకృప లేకుంటే మంచి సంతానం కలగదు.గురువుగారి రంగు పసుపు.కనుక ఎగ్ లోని గజకేసరీ యోగాన్ని విడదీస్తుంటే, గురుశాపాన్ని ఎన్నటికీ పోగొట్టుకోలేరు.చాలాసార్లు సంతాన దోషానికి గురుశాపమే కారణం అవుతూ ఉంటుంది.

ఎగ్ అనేది రాహువు.అందులోని ఎల్లో గురువు.వైట్ చంద్రుడు.సంతాన దోషం అనేది సర్ప(రాహు)శాపం వల్లా,గురుదోషం వల్లా, చంద్రదోషం వల్లా వస్తుంటుంది.ఇది పరమరహస్యం.రాహు దోషం ఉన్నవారికి వీర్యకణాలు తగినన్ని ఉండవు,లేదా వాటిలో (శక్తి) మొబిలిటీ తక్కువగా ఉంటుంది.గురుదోషం ఉన్నవారిలో అయితే - కన్సెప్షన్ లో ఆటంకాలు ఏర్పడతాయి. చంద్రదోషం ఉన్నవారికి ప్రసవంలో ఆటంకాలు కష్టాలు ఏర్పడతాయి. ఈ ముగ్గురి పరస్పర యోగాల (permutations and combinations) వల్ల - జనెటిక్ డిజార్డర్స్,అబార్షన్స్,శిశువు సరిగ్గా పెరగకపోవడం (malformation of fetus),లేదా గర్భంలో ఉన్న శిశువుకు హార్ట్ బీట్ లేకపోవడం,లేదా శీఘ్రప్రసూతి (premature delivery), పుట్టినప్పుడే హార్ట్ లో హోల్ ఉండటం,లేదా లివర్ దెబ్బదిని ఉండటం,లేదా శిశువుకు చర్మరోగాలు రావడం - మొదలైన రకరకాల సమస్యలు ఎదురౌతాయి.ఆయా గ్రహయోగాలను జాగ్రత్తగా గమనించి, వాటికి తగిన రెమెడీలను పాటిస్తే ఆయా దోషాలు పోతాయి. 

ఈ బోధ 'ఎగ్గోపాఖ్యానం' అనే పేరుతో సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుందని వేరే చెప్పాల్సిన పని లేదుగా?
read more " మా అమెరికా యాత్ర - 7 (ఎగ్గోపాఖ్యానం) "