నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, మే 2016, బుధవారం

మా అమెరికా యాత్ర - 11 (బ్రహ్మచర్య మహిమ)

ఆశ్రమానికి కావలసిన సరుకులు కొందామని ఇండియన్ స్టోర్స్ కు బయలుదేరాము.గుజరాత్ నుంచి వచ్చిన పటేల్స్ అమెరికాలో బిజినెస్ రంగంలో మంచిగా స్థిరపడ్డారు. హోటల్స్,మాల్స్,ప్రొవిజన్ స్టోర్స్ మొదలైన రంగాలలో వాళ్ళు బాగా నిలదొక్కుకున్నారు.వాళ్ళదే ఒక స్టోర్ ఇక్కడ ఉంటే దానికని బయల్దేరాము.

దారిలో కారులో సంభాషణ ఈ విధంగా జరిగింది.


'మన గ్రూపు సభ్యుడైన 'A' ఒక ఏడాదిన్నర నుంచీ బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు.చూచారా అతని ముఖంలో ఎంత వెలుగు ఉన్నదో?' - అన్నారు ఒకరు.


అందరూ -'అవునవును అతని ముఖంలో వెలుగుకు కారణం అదా?' అంటూ ఒప్పేసుకున్నారు.


ఇంకొకరు ఇలా అన్నారు.


'ఈ విషయం నేనూ గమనించాను.కొద్ది నెలలు బ్రహ్మచర్యం పాటిస్తే, సాధన చాలా బాగా జరుగుతుంది.అప్పుడు త్వరగా 'ట్రాన్స్' లోకి వెళ్ళగలుగుతున్నాను.లేకుంటే 'ట్రాన్స్' త్వరగా రావడం లేదు.'


వింటున్న నేను ఇలా అన్నాను.


'మీరు చెబుతున్నది నిజమే.యోగాభ్యాసంలో - బ్రహ్మచర్యం - అనేది చాలా ముఖ్యమైనది.కుండలినీ యోగ సాధకులకు ఇది అత్యంత ఆవశ్యకమైన నియమం.బ్రహ్మచర్యం పాటించకుండా కుండలినీ సాధన గావిస్తే మెదడులోని నరాలు దెబ్బతిని పిచ్చి పుడుతుంది.పాతకాలంలో చాలామంది సాధకులు ఇలాగే కుండలినితో ఆటలాడి చాలా దెబ్బతిన్నారు.వారి శేషజీవితం అంతా పిచ్చాసుపత్రిలోనే గడుస్తుంది.ఆ పిచ్చి - మందులకు లొంగదు.


వివేకానందస్వామి జీవితాంతం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు గనుకనే ప్రపంచాన్ని అజ్ఞానపు నిద్రలోనుంచి లేపగలిగినంత మహత్తరమైన శక్తి సంపన్నుడైనాడు.మన యోగులు తమంత తాము బ్రహ్మచర్య దీక్షలో ఉండేది పిచ్చివాళ్లై కాదు.వారికి మనకున్నన్ని తెలివితేటలు లేకా కాదు.ఒక పెద్ద ఆనందాన్ని పొందాలంటే చిన్నచిన్న ఆనందాలను వాలంటరీగా వదులుకోవాలి.తప్పదు.అలా వదలగలిగిన వారిలో అమితమైన శక్తి  గూడుకట్టుకుని ఉంటుంది.ఆ శక్తి వారికి చాలా గొప్పదైన ఆనందాన్నిస్తుంది.

'అమెరికా సోదర సోదరీమణులారా' - అని వివేకానందస్వామి చేసిన ఒక్క సంబోధనతో ఆ హాల్లో ఉన్న వందలాది మంది లేచి నిలబడి రెండు నిముషాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటే అది ఏ శక్తివల్ల జరిగిందని అనుకుంటున్నారు? స్వామిలో ఉన్నట్టి బ్రహ్మచర్య శక్తియే దానికి కారణం.అదే వారినలా కదిలించింది.

తన సోదరశిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒకసారి ఇలా అన్నారు.'ఒక్క క్షణం కూడా కామానికి లోనుకాకుండా నా చిన్నప్పటినుంచీ నా మనస్సును ఆలోచనలను - దానికి అతీతమైన స్థితిలో ఉంచుతూ వచ్చాను.అలా చెయ్యడం ద్వారా పోగైన శక్తితో అద్భుతాలు చెయ్యవచ్చు. ప్రపంచాన్ని కదిలించవచ్చు.'

అపవిత్రుల స్పర్శను కూడా భరించలేని శ్రీ రామకృష్ణులు - నరేంద్రుడు కనిపిస్తే చాలు - అతన్ని దగ్గరకు తీసుకుని కౌగలించుకోకుండా ఉండలేకపోయేవాడంటే - నరేంద్రుడు ఎంతటి పవిత్రమైన ఆత్మో తెలుసుకోండి.' అన్నాను.

'అవును.వయసులో ఉన్నపుడు కామాన్ని జయించడానికి ఆయనొకసారి కాలుతున్న పెనం మీద కూచున్నాడట కదా?' - వింటున్న ఒకరు అడిగారు.

'నిజమే.ఆయన జీవితంలో ఆ సంఘటన జరిగింది.ఇలా చేశానని ఆయన ఎవరికీ చెప్పలేదు.కానీ తరువాత కొన్నాళ్ళకు ఆయన దక్షిణేశ్వరం వెళ్ళాడు.నరేంద్రుని చూస్తూనే శ్రీరామకృష్ణులు గబగబా ఎదురువచ్చి అతన్ని కౌగలించుకుని కన్నీళ్లు కారుస్తూ అలా ఉండిపోయారు.కామజయం సాధించడానికి నరేంద్రుడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడో ఆయనకు తెలుసు.దైవం కోసం అంత తపన పడినవారి దగ్గరకు ఆయన పరిగెత్తుకుంటూ ఎదురు వస్తాడు.అందుకనే నరేంద్రుడంటే శ్రీరామకృష్ణులకు అంతటి ప్రేమ ఉండేది. మనం ఏం చేస్తున్నామో భగవంతునికి తెలుసు.ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు.మన అంతరంగం ఏమిటో మనకంటే ఆయనకే ఎక్కువ బాగా తెలుసు.

వివేకానందస్వామి ఒక్కరే కాదు.శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులందరూ అలాంటి జాతివజ్రాలే.వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అద్భుత జీవితం.వాళ్ళు మానవదేహంలో ఉన్నప్పటికీ మానవులు కారు.వారందరూ దేవతలే.దేవతలే మనుషుల రూపంలో భూమిమీద అలా నడిచారు.శ్రీ రామకృష్ణులతో బాటు ఈ భూమిమీదకు వచ్చిన ఆయన పరివార దేవతలు వారందరూనూ.

మన పరమగురువులైన శివానందస్వామి పరిపూర్ణమైన బ్రహ్మచర్య నిష్టాగరిష్టుడు.పన్నెండేళ్ళ పాటు ఆయన మనసులో ఒక్కసారి కూడా కామపరమైన ఆలోచన రాకుండా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించాడు.అంతటి మనోనిగ్రహం ఉన్నది గనుకనే ఆయన్ను వివేకానంద స్వామి 'నువ్వు మహాపురుషుడవు'. అంటూ - 'మహాపురుష మహారాజ్' అని పిలిచేవారు.ఆయనొక్కరే కాదు.మిగతా అందరూ అలాంటివారే.

'నాగమహాశయుని జీవితం ఎంత అద్భుతమో కదా?' అన్నారు ఇదంతా వింటున్న వారిలో ఒకరు.

'ఆయన జీవితం అత్యద్భుతం.గృహస్థ భక్తునిగా ఉంటూ సంన్యాసశిష్యులను మించి ఉన్నాడాయన.సాక్షాతూ వివేకానందస్వామి అంతటివాడు - నాగమహాశయుని పాదాలకు నమస్కారం చేశాడంటే - నాగమహాశయుడు ఎంతటి మహనీయుడో అర్ధం చేసుకోండి.' అన్నాను.

'నందానందస్వామి ఆజన్మ బ్రహ్మచారియే కదా?' అంటూ వింటున్న ఒకరు అడిగారు.

'అవును.ఆయన ఆజన్మ బ్రహ్మచారియే.అందుకే ఆయనలో అంతటి తపశ్శక్తి పోగుపడి ఉన్నది.అంతటి తపస్విని నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు.' అన్నాను.

సంభాషణ అమెరికా సమాజం వైపు మళ్ళింది.

'ఇదంతా భోగభూమి.ఇక్కడ సమస్త సుఖాలూ ఉన్నాయి. కన్సెంన్టింగ్ ఎడల్ట్స్ మధ్య లైంగికసుఖం అనేది ఇక్కడ తప్పు కాదు.ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇలాగే తయారైంది. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే అధ్వాన్నంగా తయారైంది. సామాజికపరంగా,ఇండివిడ్యువల్ హక్కుల పరంగా చూస్తె ఇవన్నీ తప్పులు కాకపోవచ్చు.కానీ ఆధ్యాత్మిక పరంగా మాత్రం - బ్రహ్మచర్యం లేనిదే ఎవ్వరూ ఎదగలేరు.అది అసాధ్యం. 

కాకపోతే ఇక్కడ కొన్ని వెసులుబాట్లున్నాయి.ఇరవై ఇరవై అయిదూ వచ్చేసరికి ఇక్కడ పిల్లలకు అన్నీ అయిపోతాయి. చూడవలసిన పీక్స్ అన్నీ చూసేస్తారు.కనుక త్వరగా బోరు మొదలౌతుంది.ఆ తర్వాత ఇంకేంటి? జీవితం అంటే ఇంతేనా? తినడం త్రాగడం సుఖించడం తప్ప ఇంకేమీ లేదా? అన్న అన్వేషణ మొదలౌతుంది.అదే నిజమైన ఆధ్యాత్మికతకు దారి చూపిస్తుంది.ఆ విధంగా చూస్తే, ఇక్కడి సోషల్ లైఫ్ మంచిదే.పైగా ఇక్కడివారికి ఇన్హిబిషన్స్ లేవు.హిపోక్రసీ లేదు.కనుక ఒకవిధంగా ఈ జీవనవిధానం కూడా మంచిదే.

కామాన్నే సాధనంగా మలుచుకుని ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిలకు ఎదిగే మార్గాలు కూడా తంత్రంలో కొన్ని ఉన్నాయి. కానీ ఆయా తాంత్రిక మార్గాలను అందరూ పాటించలేరు.వాటిని ఫాలో అవ్వాలంటే మనిషికి చాలా గొప్పవైన క్వాలిఫికేషన్లు ఉండాలి.అది అందరికీ సాధ్యమయ్యే మార్గం కాదు.

ఒకరిద్దరు పిల్లలు కలిగాక, భార్యాభర్తలు అన్నాచెల్లెళ్ళలాగా జీవించాలనీ సాధన చేస్తూ మిగిలిన జీవితాన్ని గడపాలనీ శ్రీరామకృష్ణులు అనేవారు. ఎందుకలా చెయ్యాలంటే - బ్రహ్మచర్యం వల్ల మనిషిలో అమితమైన ప్రాణశక్తి  నిలువ అవుతుంది.ఆధ్యాత్మిక జీవనానికి శిఖరమైన సమాధిస్థితిని పొందాలంటే మనిషి దేహంలో చాలా ప్రాణశక్తి నిలువ ఉండాలి. లేకుంటే ఆ స్థితి దక్కదు.దానికి బ్రహ్మచర్యం అత్యంత ముఖ్యమైన నియమం.ఇది సంన్యాసులకైనా సంసారులకైనా సమానమైన నియమమే.అందుకే తన యోగమార్గపు మెట్లలో మొదటి మెట్టైన 'యమం' లోనే బ్రహ్మచర్యాన్ని పతంజలి మహర్షి ఒక రూలుగా ఉంచాడు.ఈ విషయం బాగా గుర్తుంచుకోండి.' అని ముగించాను.

(ఇంకా ఉంది)