నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, మే 2016, శుక్రవారం

మా అమెరికా యాత్ర - 13 (సందేహాలు సమాధానాలు)

పరాశక్తి టెంపుల్ లో నా ఉపన్యాసం విన్న రామకృష్ణగారు, వాణిగారు అనే దంపతులు నిన్న నేనున్న చోటకు వచ్చి కాసేపు మాట్లాడారు.వాణిగారికి 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పాను.ఆ పుస్తకం కోసం వచ్చి,కాసేపు కూచుని మాట్లాడి వెళ్ళారు.

'రిచువల్ వర్షిప్' మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?' అని వాణిగారు అడిగారు.

'అది ఎల్కేజీ స్థాయి మాత్రమే.దానిపైన చాలా స్థాయులున్నాయి.మనిషి ఎంతసేపూ పూజలు గుళ్ళు వీటితోనే కాలం గడపకూడదు.సాధనలో పై స్థాయులకు ఎదిగినప్పుడు వీటితో పని ఉండదు.ఉదాహరణకు చెప్పాలంటే - మా ఇంటి పక్కనే ఒక గుడి ఉంది.కానీ నేను గత పదిహేడు ఏళ్ళగా ఒక్కసారి కూడా ఆ గుడిలోకి పోలేదు.ఇది మీకు వినడానికి వింతగా ఉంటుంది.కానీ నేను దైవానికి దూరంగా ఏమీ లేను.నా పుస్తకంలో ఇవన్నీ వివరంగా వ్రాశాను.చదవండి.మీకు విషయం అర్ధమౌతుంది' అన్నాను.

'నేను గత పదిహేనేళ్ళుగా రెగ్యులర్ గా దేవాలయాలకు వెళుతున్నాను.కానీ ఈమధ్య ఒక ఆర్నెల్లుగా ఈ పూజలూ వాటిమీద నాకు మనసు పోవడం లేదు.అవి నాకిప్పుడు నచ్చడం  లేదు.ఇవి కాకుండా ఇంకేదో ఉంది.అదేమిటో తెలుసుకోవాలని అనిపిస్తున్నది.ఎందుకిలా?' అన్నారామె.

'నేను ఇక్కడకు రాబోతున్నాను కదా అందుకే బహుశా మీకు అలా అనిపించి ఉంటుంది.అందుకే ఈ పుస్తకం కూడా మీ చేతికి వచ్చింది.అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఈ పుస్తకంలో మీకు తెలుస్తుంది.చదవండి.' అన్నాను.

'శ్రీచక్రాన్ని నేను కొన్నేళ్లుగా ఇంటిలో ఉంచుకుని పూజిస్తున్నాను.కానీ దాని అంతరార్ధాలు,సాధనా విధానాలు నాకు తెలీవు.వాటిని తెలుసుకోవాలని ఉంది.'అన్నారు వాణిగారు.

'నా పుస్తకం చదవండి.అవి మీకు కొంతవరకూ అర్ధమౌతాయి. కానీ అసలైన సాధనా విషయాలు ఏ పుస్తకంలోనూ దొరకవు.అవి గురుశిష్య పరంపరగా మాత్రమే వస్తుంటాయి.మీరు ఉపదేశం తీసుకుని సాధన మొదలు పెడితే అప్పుడు మాత్రమె అవి మీకు అర్ధమౌతాయి.బయట ఎక్కడా అవి మీకు దొరకవు.'అన్నాను.

'అలా ఎందుకు అన్నీ రహస్యంగా ఉంచాలి?' అని ప్రశ్న వచ్చింది.

'కొన్ని అలాగే ఉండాలి.అన్నీ అందరికీ తెలియకూడదు.తెలియవు కూడా.అత్యంత విలువైనవి ప్రపంచంలో ఎక్కడో ఒకటి రెండుచోట్ల మాత్రమే ఉంటాయి.కోహినూర్ వజ్రం మీకు ఎక్కడ బడితే అక్కడ దొరకదు.అది ఎక్కడో ఒకచోటే ఉంటుంది.అలాగే ఏ విలువైన వస్తువైనా విషయమైనా ఎక్కడో కొద్దిమంది దగ్గర మాత్రమే ఉంటుంది.దానిని అప్రోచ్ అయ్యే విధానంలో అప్రోచ్ అయితే మాత్రమే అది దొరుకుతుంది.లేకుంటే దొరకదు.ఆ విధానం తెలుసుకుని ఆ దారిలో నడిస్తే అప్పుడు మాత్రమే అది దక్కుతుంది.ఇదీ అంతే' అన్నాను. 

మాటల సందర్భంలో రామక్రిష్ణగారు ఇలా అన్నారు.

'మీరేమీ అనుకోకపోతే, జస్ట్ డిస్కషన్ కోసం నేను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను.' అన్నాడాయన.

'అడగండి.ప్రశ్నలను నేను స్వాగతిస్తాను.' అన్నాను.

'మోక్షం పొందాలని కోరుకోవడం కూడా ఒక కోరికే కదా? మోక్షమంటే కోరికలను చంపడం అయినప్పుడు, ఈ కోరికను ఎంటర్ టెయిన్ చెయ్యడం మాత్రం ఎలా కరెక్ట్ అవుతుంది?' అంటూ తన మొదటి సందేహాన్ని వెలిబుచ్చాడాయన.

'మీ ప్రశ్నకు జవాబు చెప్పేముందు నాదొక ప్రశ్న. ఒక మనిషిని చంపడం నేరమేగాక తప్పు కూడా కదా? మరి యుద్ధంలో మనదేశపు సైనికుడు మరొక దేశపు సైనికుడిని చంపినప్పుడు అతడిని శిక్షించక పోగా, మెడల్స్ ఇచ్చి మరీ గౌరవిస్తున్నాము కదా? ఇదేంటి? ఒకరికి తప్పయినది ఇంకొకరికి ఒప్పెలా అవుతున్నది? ముందు మీరు ఇది వివరించండి.ఆ తర్వాత మీ ప్రశ్నకు నేను జవాబిస్తాను.' అని నేనన్నాను.

'నేచర్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇంకొక మనిషిని చంపడం తప్పు.కానీ మనిషి ఏర్పాటు చేసుకున్న సోషల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం అది తప్పు కాకపోవచ్చు.' అన్నాడాయన.

'అంటే రెండు రకాలైన కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఉన్నాయని మీరు ఒప్పుకున్నారు కదా?' అడిగాను.

'అవును' అన్నాడాయన.

'ఇదే లాజిక్ ప్రకారం - నా జవాబులో కూడా రెండున్నాయి. కోరికలను అనుభవిస్తూ జీవించాలని మనిషి కోరుకుంటాడు. అదే పరమార్ధం కాదనీ,నిమ్నవాసనలను అధిగమించాలనీ, మనిషి దైవంగా మారాలనీ ప్రకృతి కోరుకుంటుంది.మనిషి ఏనాటికైనా తన కోడ్ ను వదిలేసి ప్రకృతి కోడ్ ను అనుసరించక తప్పదు.

మనిషిని ఒక ఉద్దేశ్యంతో ప్రకృతి సృష్టించింది.ప్రకృతిలో ఎవల్యూషన్ ఉన్నది.అనేక లోయర్ స్పీశీస్ నుంచి ఇవాల్వ్ అవుతూ జీవి ఒక మనిషిగా తయారయ్యాడు.కానీ అంతటితో ఆ ఎవల్యూషన్ ఆగలేదు.ఆగకూడదు కూడా.

మనం ఎంత చదువుకుని, ఎన్ని ఉద్యోగాలూ వ్యాపారాలూ చేసి, ఎంత సంపాదించి ఎన్ని చేసినా - లోలోపల మనం ఆటవికులమే.'మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్' అన్నాడు అరిస్టాటిల్.ఈనాటికీ మనం జంతువులలానే బ్రతుకుతున్నాం. కాకుంటే - నాగరిక జంతువులం అంతే.ఆటవిక జీవితంలో మానవుడు జంతువులను వేటాడేవాడు.ఇప్పుడు మనం పక్క మనిషిని వేటాడుతున్నాం.అప్పుడు బాణం బల్లెం గొడ్డలి వంటి అనాగరిక ఆయుధాలతో మనిషి జంతువులను చంపేవాడు. ఇప్పుడు మనం కలం, మెదడు, తెలివి,సైన్సు వంటి ఆయుధాలతో ఎదుటి మనిషిని దోచుకుంటున్నాం.కనుక లక్షల ఏళ్ళనాడు అడవిలో బ్రతికిన ఆటవికునికీ నేటి మనకూ స్వభావంలో పెద్ద భేదం లేదు.డ్రస్సులో, చదువులో, ఉండే ఇళ్ళలో, తిరిగే వాహనాలలో మార్పులు వచ్చి ఉండవచ్చు.కానీ మన మనస్తత్వంలో మార్పు రాలేదు.మనిషి ఈ అంతరిక ఆటవిక స్థితినుంచి ఎదగాలి.తనను తాను అధిగమించి దైవంగా మారాలి. అదే ప్రకృతి ఊహ.

కనుక మానవుడు తనలోని నిమ్నవాసనలను ఎప్పటికైనా అధిగమించే తీరాలి.నేడు కాకపోతే రేపు - అంతే తేడా.' అన్నాను.

'కోరికలను చంపడమే మోక్షం అయితే - జిహాద్ అంటూ సాటి మనుషులను చంపుతున్న ముస్లిములు కూడా వాళ్ళనుకుంటున్నట్లుగా మోక్షానికే పోతారా? అప్పుడు అది కూడా కరెక్ట్ అనుకోవచ్చు కదా?' అన్నాడాయన.

'అది కరెక్ట్ కాదు.అదెలా కరెక్ట్ అవుతుంది? నేను చెబుతున్న దానికీ ఈ విషయానికీ సంబంధం లేదు.ఎదుటి మనిషిని చంపితే మోక్షం వస్తుందని ఏ మత గ్రంధంలోనూ చెప్పబడి లేదు.ఒక్క ఖురాన్లో మాత్రం అలాంటి కొన్ని శ్లోకాలున్నాయేమో, అవికూడా వ్రాసినవారికి ఎలా స్ఫురించాయో నాకు మాత్రం తెలీదు.కానీ ఒక్క విషయం చెప్పగలను.ఖురాన్ ఒక్కటే దైవగ్రంధం కాదు.అన్ని దేశాలకూ అన్ని కాలాలకూ దైవం ఒక్కొక్క గ్రంధాన్ని ఇస్తూనే ఉన్నది.మరి ఎదుటి మనిషిని చంపడం వల్ల మోక్షం వస్తుందన్నదే దైవాదేశం అయితే మిగతా అన్ని గ్రంధాలలో కూడా దైవం అదే ఆదేశాన్ని ఇవ్వాలి కదా? అలా ఏ ఇతర గ్రంధం లోనూ లేదు.మిగతా అన్ని గ్రంధాలలోనూ - 'ఎదుటి మనిషిని చంపడం తప్పు' - అనే చెప్పబడి ఉన్నది.కనుక ఖురాన్ లో ఉన్న ఈ రకమైన హింసను ప్రేరేపించే ఆదేశాలు పూర్తిగా తప్పుడువి.అవి మహమ్మద్ యొక్క కపోల కల్పితాలే గాని దైవాదేశాలు కావని సింపుల్ లాజిక్ తో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇంకో విషయం ఏమంటే - కోరికలను చంపడమే మోక్షమని మీరన్నారు.అది కరెక్ట్ కాదు.మీరే కోరికనూ చంపలేరు.అది అసాధ్యం.ఎందుకంటే కోరికలనేవీ ప్రకృతి శక్తులు.అవి చావవు. కానీ వాటిని మీరు అధిగమించవచ్చు.దాటిపోవచ్చు.అదే మానవుడు చెయ్యవలసిన పని.

ఈ క్రమంలో - ఒక పెద్ద కోరికకోసం చిన్న చిన్న కోరికలను పక్కన పెట్టవలసి వస్తుంది.మోక్షం అనేది ఒక పెద్ద కోరిక దానికోసం చిన్నచిన్న కోరికలను మనం వాలంటరీగా వదులుకుంటాం.

ఉదాహరణకు - మీరొక సివిల్  సర్వీస్ ఎగ్జాం కోసం చదువుతుంటే - మీ జీవితాన్ని యధావిధిగా నడుపుకుంటూ,ఎంజాయ్ చేస్తూ ఉంటే,మీరాపనిని చెయ్యలేరు. మీ షెడ్యూల్ ను దానికి తగినట్లుగా మార్చుకోవాలి. స్నేహితులు,సరదాలు మొదలైన కొన్నికొన్నింటిని వాలంటరీగా వదులుకోవాలి.తప్పదు.అప్పుడే మీరా గమ్యాన్ని చేరుకోగలుగుతారు.లౌకిక జీవితంలో కూడా ఇటువంటి డిసిప్లిన్ అవసరమే కదా. ఇదీ అంతే.నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో కోరికలను చంపడం అంటూ ఏమీ ఉండదు.నిజానికి కోరికలను మనం ఏనాటికీ చంపలేము.వాటికి మనమొక హయ్యర్ టర్న్ ఇస్తాం.అంతే.

ఇంకొక ఉదాహరణ చెప్తాను వినండి.ఇది శ్రీరామక్రిష్ణులు చెప్పిన ఉదాహరణే.కలకండ స్వయానా స్వీట్ అయినప్పటికీ, అది స్వీట్ లెక్కలోకి రాదు.మామూలు స్వీట్లు తింటే రోగం వస్తుంది.కానీ కలకండ అనేది అలాకాదు.అది నిషిద్ధం కాకపోగా, దానిని ఆయుర్వేద ఔషధాలలో అనుపానంగా కూడా వాడతారు. అలాగే - కోరికలను దాటడానికి ఇంకొక పెద్ద కోరిక అయిన మోక్షేచ్చ ఉండటం తప్పు కాదు.అది చాలా అవసరం.అంతరిక మార్గంలో నడవడానికి అదొక ముఖ్యమైన అర్హత.

రమణమహర్షి చెప్పిన ఇంకొక ఉదాహరణ వినండి. శవాన్ని కాల్చడానికి చితిని ముట్టించేటప్పుడు ఒక కట్టెను వెలిగించి ఆ కట్టెతో చితిని ముట్టిస్తారు.ఆ తర్వాత ఆ కట్టెను కూడా చితిలోనే పారవేస్తారు.అదే విధంగా - నిమ్న వాసనలను దాటడానికి మోక్షేచ్చ అవసరం.ఆ తర్వాత అదే సాధనాగ్నిలో ఆ కోరిక కూడా ఆహుతై పోతుంది.అప్పుడు అదికూడా మిగిలి ఉండదు. ' అన్నాను.

'ఈ విషయం నేను కొత్తగా వింటున్నాను.ఇంతకు ముందు ఎవరూ ఇలా చెప్పలేదు.కోరికలను చంపడమే మోక్షం అని చాలామంది గతంలో చెప్పారు.' అన్నాడాయన/

'అదే పాండిత్యానికీ అనుభవజ్ఞానానికీ ఉన్న తేడా.పుస్తకాలు చదివిన పండితులు అనుభవజ్ఞానం లేక ఏదేదో వాగుతూ ఉంటారు.కానీ ఈ విషయాలను అనుభవపూర్వకంగా తెలిసినవారు అసలైన విషయాలు చెప్పగలుగుతారు.నేనూ ఎన్నో వేల పుస్తకాలు చదివాను.చదవలేదని నేను చెప్పడం లేదు.కానీ అలా చదవడంతో తృప్తిపడి నేను ఊరుకోలేదు.అవి ఏం చెయ్యమని చెప్పాయో అది నేను చేశాను. ఆచరణలో నేను అనుభవజ్ఞానాన్ని పొందాను.కనుక నేను చెప్పేవి పండితుల ప్రవచనాలకు భిన్నంగా ఉండటంలో వింత లేదు.

అసలీ సృష్టిని దైవం కోరికతోనే చేసిందని వేదం చెబుతున్నది.దైవంలోనే కోరిక ఉన్నపుడు మనలోనుంచి అదెలా లేకుండా పోతుంది? మీరు వేదంలోని సృష్టిసూక్తం చదివితే - మొదట్లో అంతా చీకటిగా శూన్యంగా ఉన్నది.అక్కడ ఏమీ లేదు.కానీ ఏదో ఉన్నది.ఆ ఉన్నదానిలో 'నేను సృష్టిస్తాను' అన్న కోరిక కలిగింది.ఆ కోరికనుంచి సృష్టి ఉద్భవించింది.' అని వేదం చేప్పినట్లు మనం గమనించవచ్చు.

కనుక సృష్టిలో కోరిక అనేది ఉన్నది.కోరికను మీరు నిర్మూలించలేరు.మీరు చెయ్యగలిగినదల్లా దానికి ఒక హయ్యర్ టర్న్ ఇవ్వడం మాత్రమే.' అన్నాను.

'మోక్షం కోసం కొన్ని కోరికలను వదులుకోవాల్సి వస్తే, అది బాధగా అనిపించదా?' అన్నాడాయన.

'ఇందులో బాధేమీ ఉండదు.మన దృష్టి ఒక పెద్దదానిమీద ఉన్నపుడు చిన్నవి వదులుకోవడం బాధ అనిపించదు.మీరు బిజినెస్ పనిమీద ఒక ఊరికి వెళ్లి ఒక వారం ఉండవలసి వస్తుంది.ఫేమిలీని వదిలేసి వచ్చానని మీరు బాధపడతారా?లేదు కదా? ఎందుకని? ఎందుకంటే - మీ ఫేమిలీని ఇంకా బాగా చూచుకోవదానికే మీరు అలా దూరంగా ఉన్నారు.కనుక బాధ ఉండదు.అలాగే - జీవితాన్ని ఇంకా ఎంతో ఉన్నతంగా మలచుకోవదానికే మీరు జీవితంలోని కొన్ని కొన్ని చిన్న ఆనందాలను మీ అంతట మీరు వదులుకుంటున్నారు.అది మీకు బాధ అనిపించదు.

ఉదాహరణకు - మీ ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్ లో మీకేదో పని ఉంది.మెట్లెక్కి పైకి వెళ్ళాలి.క్రింద మెట్టును వదిలేశానని మీరెప్పుడైనా బాధపడి అక్కడే ఆగిపోతున్నారా? లేదుకదా? క్రింది మెట్టు అనేది అక్కడే ఉండిపోవడానికి ఉద్దేశించబడినది కాదు.పై మెట్టును చేరడానికి అదొక మార్గం మాత్రమే.కనుక మెట్లెక్కి పైకి పోయేటప్పుడు మీకేమీ బాధ ఉండదు.ఇదీ అంతే.' అన్నాను.

'మీ అమెరికా ట్రిప్ బాగా జరిగిందా?' అడిగాడాయన.

'చాలా బాగా జరిగింది.ఆనుకున్న దానికంటే బాగా జరిగింది.నన్ను కలుసుకోవాలని చాలా ఏళ్ళనుంచీ అనుకుంటున్న ఎంతోమంది ఇక్కడి శిష్యులను కలుసుకోగలిగాను.ఎవరికి కావలసిన దీక్షలు వారికిచ్చాను. కొంతమంది అమెరికన్స్ కూడా నా శిష్యులయ్యారు.వారి సందేహాలు కూడా తీర్చాను.ముఖ్యంగా గాంగేస్ మిచిగాన్ లో జరిగిన స్పిరిచ్యువల్ రిట్రీట్ చాలా బాగా జరిగింది.వారు కూడా నన్ను బాగా అభిమానించారు.ఆ ఆశ్రమం చూచుకుంటూ అక్కడే ఉండిపొమ్మని మాతా గౌరీమా నన్ను కోరారు.నాలాంటి మనిషే తనకు కావాలని ఆమె అన్నారు.అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుందామని మేం కూడా అనుకుంటున్నాం.త్వరలోనే నేను నా ఉద్యోగానికి గుడ్ బై చెప్పబోతున్నాను.అప్పుడు ఇక్కడ ఆర్నెల్లు ఇండియాలో ఆర్నెల్లు ఉంటాను.అప్పుడు అమెరికాలో మాకొక ఆశ్రమం కావాలి.దానికోసం ప్లానింగ్ మొదలు పెట్టాం.త్వరలోనే అది నిజం అవుతుంది.ఈ విధంగా - అన్ని రకాలుగా నా అమెరికా ట్రిప్ సక్సెస్ అయింది' అన్నాను.

'ఫేమిలీ లైఫ్ కీ, ఆధ్యాత్మిక జీవితానికీ సమన్వయం ఎలా చెయ్యాలి? మీరెలా చెయ్యగలుగుతున్నారు?ఇవి రెండూ ఒకదానికొకటి యాంటగోనిస్టిక్ అంటారు కదా? మీకు బాధ్యతలు ఉన్నాయి.ఫేమిలీ ఉంది.ఇవన్నీ పెట్టుకుని ఆశ్రమం ఇదంతా ఏమిటి? ఎలా మేనేజ్ చెయ్యాలని అనుకుంటున్నారు?' మూడో ప్రశ్నను సంధించాడాయన.

'ఇది కూడా మీరడిగిన మొదటి ప్రశ్న వంటిదే.సంసారానికీ ఆధ్యాత్మికానికీ సంఘర్షణ ఏమీ లేదు.తెలియనివారు అలా అనుకుంటారు.నిజానికి సంసారంలో ఉంటేనే ఆధ్యాత్మిక సాధన ఇంకా బాగా చెయ్యవచ్చు.నేను సంసారినే. మొదట్నించీ నా ఉద్యోగంతో సహా అన్ని పనులూ చేసుకుంటూనే నేను సాధన చేశాను.నేను నేర్చుకున్నవన్నీ సంసారంలో ఉంటూనే నేర్చుకున్నాను.ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సన్యాసం తీసుకోవలసిన అవసరం ఏమీ లేదు.'పెళ్ళిలో పెద్దపులి ఏమీ లేదని మీకు చెప్పడానికే నేను పెళ్లి చేసుకున్నాను నాన్నా' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అన్నారు.నేనూ అదే చెబుతున్నాను. ఎలా సమన్వయం చేసుకోవాలో తెలిస్తే, సంసారం అనేది దైవమార్గానికి ఆటంకం ఏమీ కాదు.పైగా ఇంకా సహాయపడుతుంది.సంసారం అంటే కోటలోనుంచి యుద్ధం చెయ్యడం వంటిది.దాని వెసులుబాట్లు దానికున్నాయి. సన్యాసం అంటే కోట బయటకు వచ్చి యుద్ధం చెయ్యడం వంటిది. దానిలో రిస్క్ ఎక్కువ.ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులే చెప్పారు.ఆ సులువులు తెలుసుకుంటే అంతా బానే ఉంటుంది. కనుక సంసారానికీ సాధనకూ ఘర్షణ ఏమీ లేదు.' అన్నాను.

ఇదంతా వింటున్న వాణిగారు -'మీరు ఎవరి మార్గాన్ని ఫాలో అవుతారు?' అంటూ అడిగారు.

'నేను శ్రీరామకృష్ణుల భక్తుడిని.ఆయనే నా దైవం.అందరు దేవతలూ ఆయనలోనే ఉన్నారు.నేను ఆయన్నే పూజిస్తాను. ధ్యానిస్తాను.కానీ జిల్లెళ్ళమూడి అమ్మగారినీ రమణ మహర్షినీ కూడా ఆరాధిస్తాను.కొంతవరకూ అరవిందుల పూర్ణయోగ తత్వాన్నీ స్వీకరిస్తాను.కానీ ప్రాధమికంగా నేను శ్రీ రామకృష్ణుల బిడ్డను' అని జవాబిచ్చాను.

'నాకింకా ప్రశ్నలు చాలా ఉన్నాయి.మళ్ళీ తీరికగా అడుగుతానులెండి.మా ఆవిడ బయలు దేరదామని అంటోంది.' అన్నాడాయన.

నేనావిడ వైపు చూచాను. ఆమెలో అలాంటి ఆలోచన ఏమీ కనిపించలేదు.మా సంభాషణ అంతా శ్రద్ధగా వింటోంది ఆమె.

'అదేమీ లేదు.మీ ప్రశ్నలన్నీ ఇప్పుడే అడగండి.సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.' అన్నాను.

'అసలు ఈ విధంగా ప్రశ్నించడం మంచిదా కాదా? ఎవరైనా పెద్ద గురువుల దగ్గరకు పోయినప్పుడు వాదించకుండా చెప్పింది వినమని నా భార్య ఎప్పుడూ నన్ను మందలిస్తూ ఉంటుంది.' అన్నాడాయన.

'వారి మీద గౌరవంతో ఆమె అలా అని ఉండవచ్చు.నేను అలాటి 'పెద్ద' గురువును ఏమీ కాదు.కావాలని కూడా నాకు కోరిక ఏమీ లేదు. నేనేమీ కాషాయ వస్త్రాలు వేసుకోలేదు.నేటి కార్పోరేట్ గురువులలాగా మతాన్ని వ్యాపారంగా మార్చడం లేదు.కనుక మీరు నాతో ఫ్రీగా మాట్లాడవచ్చు.

పైగా - ప్రశ్నించడం అనేది మన హిందూమతంలో ఒక భాగం. ఉపనిషత్తులన్నీ గురుశిష్య సంవాదం నుంచి పుట్టిన భాండాగారాలే.ప్రశ్నించడాన్ని ఇతర మతాలు ఒప్పుకోవు. 'నోర్మూసుకుని చెప్పినది నమ్ము' అని అవి అంటాయి. దానికి విరుద్ధంగా 'ప్రశ్నించు' అని మనం అంటాం.కనుక మీరు ప్రశ్నించండి.నన్ను ఎవరైనా ప్రశ్నిస్తేనే నాకు బాగుంటుంది. ఎందుకంటే ప్రశ్న వల్లనే డిస్కషన్ అనేది వస్తుంది.డిస్కషన్ నుంచే విషయాలు అర్ధమౌతాయి.కనుక ప్రశ్నించడం చాలా అవసరం. నేను దాన్ని లైక్ చేస్తాను.' అన్నాను.

వారికేదో పని ఉన్నట్లుంది. అందుకని -'ఇక వెళతాం' అంటూ బయల్దేరారు.'శ్రీవిద్యా రహస్యం', 'తారా స్తోత్రం' - పుస్తకాలను వారికి ఇచ్చి నేనూ వారినుంచి సెలవు తీసుకున్నాను.

(ఇంకా ఉంది)