నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, మే 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 15 (లలితా సహస్రనామ భాష్యం)

నా శిష్యులతో నేను పిచ్చాపాటీగా మాట్లాడే సమయంలో వేదాంత యోగ తంత్ర ఆధ్యాత్మిక విషయాలు అనేకములు సునాయాసంగా దొర్లుతూ ఉంటాయి.నాతో ఏ సంభాషణ ఎక్కడ మొదలైనా,వినేవారు సరియైన మనుషులైతే,అది వీటిలోకే దారితీస్తూ ఉంటుంది.ఈ క్రమంలో లలితా సహస్రం నుంచి, లలితా త్రిశతి నుంచి,శక్తి ఉపాసన గురించిన అనేక భావార్ధ వివరణలు ప్రవాహంలా వచ్చేస్తూ ఉంటాయి.నా సంభాషణలు విన్నవారికి ఇదంతా సుపరిచితమే.

నేను లలితా సహస్ర నామాలను చదివి నేర్చుకోలేదు.మా అమ్మగారు తన జీవిత కాలంలో ఎన్ని వేల సార్లు ఆ స్తోత్రాన్ని పారాయణ చేశారో లెక్కేలేదు.ప్రతిరోజూ ఆ స్తోత్రాన్ని పైకే చదువుకుంటూ ఇంటి పనులను ఆమె చేసుకునేవారు.ఆ విధంగా రోజుకు ఎన్ని సార్లు పారాయణ జరిగేదో లెక్కే లేదు. అలా ప్రతిరోజూ అమ్మ నోటివెంట వినీ వినీ ఆ స్తోత్రం నాకు నోటికి వచ్చేసింది.అంతేగాని ప్రత్యేకంగా బట్టీపట్టి నేనా స్తోత్రాన్ని నేర్చుకోలేదు.తల్లే తొలిగురువని మన సాంప్రదాయంలో అంటారు.ఆ విధంగా అమ్మ నోటివెంట ఈ స్తోత్రాన్ని అమ్మలగన్న అమ్మయే నాకు ఉపదేశం చేసింది.

ఆ తర్వాత నా సాధనాక్రమంలో ఆ అద్భుతస్తోత్రపు అంతరార్ధాలను మళ్ళీ ఆ అమ్మలగన్న అమ్మయే అనుభవపూర్వకంగా (వ్యాకరణ పూర్వకంగా కాదు) అవగతం గావించింది.

వ్యాకరణార్ధాలను,ప్రతిపదార్ధాలను ఏ పండితుడైనా చెబుతాడు. అంతరార్ధాలను ఒక్క సాధకుడే చెప్పగలడు.

ఇలాంటి ఒక సంభాషణ అమెరికాలో జరుగుతున్న సమయంలో ఒక శిష్యురాలు ఈ విధంగా అడిగింది.

'మీరు లలితా సహస్రనామాలకు భాష్యం వ్రాస్తే చదవాలని ఉంది.వీటి మీద చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు.మీ అనుభవం నుంచి అవగాహన నుంచి మీరు ఆ నామాలను ఎలా వ్యాఖ్యానిస్తారో తెలుసుకోవాలని ఉంది.'

లలితా సహస్రనామాలకు భాష్యం వ్రాయాలన్నది ఎప్పటినుంచో నాకున్న సంకల్పం.కానీ దానికి సమయం రావాలి గనుక వేచి చూస్తున్నాను.ఆ సమయం ఇప్పటికి వచ్చింది.ఆమె నోటి నుంచి అమ్మే ఈ విధంగా అనుజ్ఞ ఇస్తున్నదని భావించి 'అలాగే వ్రాస్తాను.' అని చెప్పాను. అయితే ఇప్పటికే మూడు పుస్తకాలు ఒకేసారి నడుస్తూ ఉన్నాయి గనుక నిదానంగా వ్రాస్తానని చెప్పాను.నేను చెబుతుంటే మీలో ఎవరైనా వ్రాయగలిగితే బాగుంటుందని సూచించాను.

'మీరు చెప్పండి నేను వ్రాస్తాను' - అని ఇంకొక శిష్యురాలు ముందుకొచ్చింది.తను లలితా సహస్రనామాల పారాయణం అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది.వాటిమీద ఇప్పటికే ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ,నా ఆలోచనలు అనుభవాల ఆధారంగా వాటి అంతరార్ధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని తనకూ ఉంది.

కానీ తను ఉండేది అమెరికాలో.నేను ఉండేది ఇండియాలో. అయితేనేం? ఇప్పుడు కమ్యూనికేషన్ కు ఏమీ లోటు లేదు గనుక నిరాఘాటంగా ఈ పని సాగించవచ్చు అని నిశ్చయించాము.

ఈ సంకల్పంలో భాగంగా, నిన్న శుక్రవారం మంచిరోజు గనుక,నేను ఇక్కడ నుంచి ఫోన్ లో చెబుతుంటే తను అక్కడనుంచి వ్రాసుకునే కార్యక్రమం మొదలైంది.

మొదటి రోజున 'శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ' అనే నామాలకు నాదైన పద్ధతిలో వివరణను ఇవ్వడం జరిగింది.ఇండియాలో ఇంతమంది శిష్యులు ఉన్నప్పటికీ, అమెరికా వంటి దూరదేశంలో ఉంటూ కూడా, అరుదైన ఈ అవకాశాన్ని అమ్మ అనుగ్రహంగా అంది పుచ్చుకున్న ఈ ధన్యురాలిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.

ఎవరి అదృష్టం వారిది!!

అర్హతను అమ్మ చూస్తుంది.ఇచ్చేది కూడా అమ్మే ఇస్తుంది.ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అమ్మకే తెలుసు. అల్పబుద్దులమైన మనకు అమ్మ చర్యలు అమిత దురూహ్యములుగా ఉంటాయి.మన అహంకారాన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ, అమ్మ అనుగ్రహానికి పాత్రులమయ్యే విధంగా మనల్ని మనం ప్రతిరోజూ మలచుకుంటూ ఉండటమే మనం చెయ్యవలసిన అసలైన పని.అది మరచిపోతే మాత్రం, అమ్మ పెట్టే అంతుతెలియని పరీక్షలలో మనం ఫెయిల్ కాక తప్పదు.

అమ్మ అనుగ్రహంతో, వేదాంత యోగ తంత్ర రహస్యభావాలతో కూడిన వివరణలతో, అతి త్వరలోనే ఈ పుస్తకం రిలీజ్ అవుతుందని తెలియజెయ్యడానికి సంతోషిస్తున్నాను.శక్తి ఉపాసనకు సంబంధించిన ఈ స్తోత్రపు భాష్యం వెనుక ఒక స్త్రీ సంకల్పం ఉండటం, దానిని వ్రాసే పని కూడా ఇంకొక స్త్రీ ద్వారానే జరగడం అంతా ఆద్యాశక్తి కరుణకు సంకేతం.ఈ పనికి ప్రారంభం కూడా ఇండియాలో కాకుండా అమెరికాలోనే జరగడం విచిత్రం కదూ!. ఇదంతా అమెరికా శిష్యుల దీక్షకు,అంకిత భావానికి సంకేతంగా కనిపిస్తున్నది.

పుస్తకం రిలీజ్ కు సమయం పట్టినా, ఎప్పటికప్పుడు ఈ నామార్ధాలను వ్యాఖ్యానాన్ని, 'పంచవటి'లో పోస్ట్ చెయ్యడం ద్వారా మా సభ్యులకు మాత్రం తెలియజెయ్యడం జరుగుతుంది.

మిగతా వారు పుస్తకం రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడక తప్పదు మరి.

(ఇంకా ఉంది)