“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

1, మే 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 6

ఫ్లోరిడా లోని 'టంపా' నుంచి మణిబాబు వచ్చి మాతో బాటు ఒకరోజు ఉన్నారు. ఈయన పంచవటి సభ్యుడే గాక నన్ను చాలా ఇష్టపడే వ్యక్తులలో ఒకరు.కొన్నేళ్ళ క్రితం, ఒక ప్రసిద్ధ టీవీ ఉపన్యాసక గురువు దగ్గర ఈయన శ్రీవిద్యాదీక్షను స్వీకరించారు.కానీ ఆ తర్వాత ఆ గురువుగారు ఈయన్ను సరిగ్గా గైడ్ చెయ్యలేక పోయారు.నా భావాలు బాగా నచ్చడంతో,ఆ తర్వాత, ఈయన పంచవటి గ్రూప్ లో ప్రవేశించారు. అప్పటినుంచీ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో నా మార్గదర్శనంలో ముందుకు నడుస్తున్నారు.

ఈయన చాలా సంప్రదాయమైన పద్ధతులను పాటించే సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి.ఈయన పూర్వీకులలోనేగాక ఇప్పటికి కూడా బంధువర్గంలో వేదపండితులూ ఘనాపాటీలూ ఉన్నారు.అమెరికాలో గత ఇరవై ఏళ్ళనుంచీ ఉంటూ కూడా మన మడీ ఆచారాలను తూచా తప్పకుండా పాటించే విశిష్టవ్యక్తులలో ఈయనొకరు.నేనేమో,బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ,పూర్తిగా సాంప్రదాయ విరుద్ధమైన పద్ధతులలో ఉండేవాడిని. ఈయనేమో ఫక్తు సాంప్రదాయవాది. మరి నేను ఈయనకు  ఎలా నచ్చానో? భగవంతుడు ఈయన్ను నాదగ్గరకు తెచ్చాడు.ఇంకా చెప్పాలంటే - నా male followers లో మొదటిసారి నాకు 'I love you' చెప్పిన వ్యక్తి - మణిబాబే. అంతగా ఆయనకు నేను నచ్చానట.

వచ్చీ రావడం తోనే కాసేపు సేదదీరి భోజనానికి కూచున్నాము.ఆయనకు ఉల్లిపాయ నిషిద్ధం.దాని వాసన కూడా ఆయనకు పడదు.ఇక వెల్లుల్లిపాయ సంగతి చెప్పనే అక్కర్లేదు.నేనేమో ఆయన పక్కనే కూచుని చక్కగా వేడివేడి అన్నంలో గుంటూరు గోంగూర పచ్చడి కలిపి,ఆవు నెయ్యి దట్టించి, అమెరికా పచ్చి ఉల్లిపాయను ఆయన ముందే కరకరా నముల్తున్నాను.


పాపం లోలోపల ఏమనుకున్నాడో గాని బయటకు ఏమీ అనలేదు.


మరుసటి రోజున పొద్దున్నే మూడు గంటలకు నిద్ర లేచాడు.ఆరోజున బయటంతా నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నది.మా ఇంట్లో హీటింగ్ సిస్టం పనిచెయ్యడం లేదు.నేను లేచేసరికి, ఆ వణికించే చలిలో స్నానం చేసి పంచె కట్టుకుని కూచుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు.నేనేమో నిదానంగా ఆరున్నరకు లేచాను.అప్పటికే ఆయన కూచుని సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు.నేనేమో కాలకృత్యాలు తీర్చుకుని, ముఖం కడుక్కుని, స్నానం గీనం ఏమీ చెయ్యకుండా హాల్లో కూచుని పాలు త్రాగుతూ , రూములోంచి వణుక్కుంటూ బయటకు వచ్చిన ఆయన్ను -'ఏం మణిబాబుగారు !! గాయత్రీ జపం బాగా కుదిరిందా?' అని నవ్వుతూ ప్రశ్నించాను.ఇంకొకరైతే చిర్రెత్తి పోయేవారు.కానీ ఆయనకు మన సంగతి తెలుసు గనుక ఏమీ మాట్లాడలేదు.

ఆ రోజంతా కూచుని తీరికగా మాట్లాడుకున్నాము.తన సాధనా మార్గంలో కలిగిన,కలుగుతున్న అనుభవాలను నాతో చర్చించాడాయన.వాటిలో ఆయనకొస్తున్న సందేహాలకు నాకు తోచిన జవాబులిచ్చాను. మా మధ్య జరిగిన సంభాషణలో - ఆయన యొక్క వ్యక్తిగత సాధనా విషయాలను పక్కన పెట్టి - వ్రాయగలిగిన మిగతా విషయాలను కొన్నింటిని మాత్రమే ఇక్కడ వ్రాస్తున్నాను.

'మీ వ్రాతలు చదివేవాళ్ళలో చాలామంది మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు శర్మగారు! ' అన్నాడాయన.

అది నిజమే కావడంతో నేనేమీ జవాబివ్వలేదు.


'చాలామంది నాతో ఇలా అన్నారు - 'గుళ్ళూ గోపురాలూ తిరగవద్దని శర్మగారు అనడం,మన  హిందూధర్మాన్ని అదేపనిగా విమర్శించడం మాకేమీ నచ్చలేదు'. అలా అన్నవాళ్ళతో నేనిలా అన్నాను - 'మీరాయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.గుళ్ళూ గోపురాలూ వద్దని ఆయనెపుడూ చెప్పలేదు.అదే సర్వస్వం కాదనీ ఆపైన ఇంకా చాలా ఉందనే ఆయన చెబుతున్నాడు.గుడికి ఎలా వెళ్ళాలో మాత్రమే చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా ఒక్కసారి గుడికి వెళ్లి చూడండి.ఇంక రెండోసారి గుడికి వెళ్ళవలసిన అవసరం మీకు ఎప్పటికీ రాదు.'


'అందుకే మనిషిని ముఖాముఖీ కలిసి మాట్లాడాలని నేనెప్పుడూ చెబుతాను.నా వ్రాతలు చదివితే నేనేమిటో సరిగ్గా అర్ధం కాను.కాకపోగా, పూర్తిగా తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం చాలా ఉంది.నన్ను అపార్ధం చేసుకున్న వారందరూ ఊరకే నా వ్రాతలు చదివినవారే.నన్ను కలిసి మాట్లాడినవారు మాత్రం ఎప్పటికీ నన్ను వదిలి పోలేరు.ఒకవేళ పోతే - అది వాళ్ళ ఖర్మ. జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళు చేజేతులా పోగొట్టుకున్నట్లే.


బయటకు ఎలా కన్పించినా, లోలోపల నేను పక్కా సాంప్రదాయవాదిని.కానీ, నేను 
మన సనాతన ధర్మపు లెటర్ కంటే స్పిరిట్ నే ఫాలో అవుతాను.మన ఆచారాలను పాటిస్తున్నట్లు నేను బయటకు కనిపించకపోయినా, దాని ఆత్మను దాటి నేనెప్పుడూ బయటకు పోను.ఈ విషయం నాతో ఒక్క పదినిముషాలు మాట్లాడితే మీకు తేలికగా అర్ధమౌతుంది.' అన్నాను.

'జనాలు మిమ్మల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకేపోతున్నారు.అదే నా బాధ.' అన్నాడాయన.


'దానికి మీరు బాధ పడకండి.ఎవరు అర్ధం చేసుకున్నా చేసుకోకపోయినా నాకొచ్చే నష్టం ఏమీ లేదు.నాకు లేని బాధ మీకెందుకు? అసలు విషయం ఏమంటే  - వారివారి కర్మ పరిపక్వానికి రానిదే ఎవ్వరూ నన్ను కలవలేరు.దగ్గరకు రాలేరు.వచ్చినా నాతో నిలవలేరు.అదంతే.దానిని ఇంతటితో వదిలెయ్యండి.జనాల గోల మనకెందుకు? మీరు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోండి.నా దారిలో నడవండి.అనుభూతిని పొందండి.అది చాలు.' అన్నాను.


'నేను ఎంతో మంది స్వాములను చూచాను.ఇండియానుంచి 'టంపా'కు  ఏ స్వామి వచ్చినా మా ఇంట్లోనే దిగుతారు.ఎందుకంటే మా ఇంట్లో అయితే మడీ ఆచారమూ ఎక్కువగా ఉంటాయని వాళ్ళ నమ్మకం.అందుకని ఇండియా నుంచి ఏ స్వామి వచ్చినా మా ఇంట్లోనే ఆతిధ్యం ఇచ్చేవాడిని.కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు.ఎందుకంటే వాళ్ళ వేషాలు అవీ నాకు నచ్చడం లేదు.అందరూ కమర్షియల్ స్వాములే.శిష్యులకూ భక్తులకూ మాత్రం అనేక వరాలు ఇస్తుంటారు.తాంత్రిక సిద్దులమని చెప్పుకుంటూ ఉంటారు.కానీ,అసలు నిజం వేరు.అదే స్వాములకు జాతకంలో దశలు బాగా లేకున్నా, లేదా ఏవైనా రోగాలు గట్రా వచ్చినా, వాళ్లకు మా వాళ్ళే పాశుపతం వంటి హోమాలూ శాంతులూ చేస్తారు.మా కుటుంబంలో వేదం చదువుకున్న ఘనాపాటీలు చాలామంది ఉన్నారు.ఈ స్వాములవార్లు అందరూ, మా వేదపండితుల దగ్గరకే రహస్యంగా వచ్చి ఆయా హోమాలూ శాంతులూ అవీ చేయించుకుంటారు.ఈ విషయం ఆ పండితులే నాకు స్వయంగా చెప్పారు.మీ ఊర్లో ఉన్న ఫలానా స్వామి అయితే మరీ ఘోరం.ఆయనకు విపరీతమైన గ్యాసు ఉన్నది.ఆయనకు షుగర్ జబ్బు ఎక్కువైపోతే  మా వాళ్ళదగ్గరకు వచ్చి పాశుపత  ప్రయోగం ఈ మధ్యనే చేయించుకున్నాడు.ఆ శాంతి చేసేటప్పుడు దాదాపు మూడు గంటలు కదలకుండా కూచోవాలి.ఆ మూడు గంటలూ ఆయన మాటమాటకీ గ్యాసు వదులుతూనే ఉన్నాడు.మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్న మావాళ్ళు ఆ వాసన భరించలేకా, మధ్యలో జపం ఆపేసి లేచి పోలేకా నరకం అనుభవించారు.' అన్నాడాయన నవ్వుతూ.


వింటున్న నాకు కూడా చచ్చే నవ్వొచ్చింది - 
'పాశుపత ప్రయోగాన్ని ఆయనే వాళ్ళమీద ప్రయోగించాడన్నమాట !' అన్నాను.

[ఇలా అంటూ ఆయా స్వాముల పేర్లన్నీ ఉటంకించాడాయన.వాళ్ళందరూ ప్రస్తుతం టీవీలలో కనిపిస్తూ మాటమాటకీ అమెరికా వస్తూ మంచి బిజినెస్ చేసుకుంటున్న పాపులర్ స్వాములే.వాళ్ళ పేర్లు వ్రాస్తే ఆయా భక్తులకు కోపాలు రావచ్చు.అందుకే వాళ్ళ పేర్లు వ్రాయడం లేదు.]


'మీరు వ్రాసిన 'నేటిగతం' అనే కవిత నాకు బాగా నచ్చింది శర్మగారు.అయితే ఈ కవితను పైపైన చదివితే అర్ధం కాదు.అదంతా కోడెడ్ లాంగ్వేజిలో ఉన్నది. ఆ కవిత అంతరార్ధాల గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను.' అన్నాడాయన.

'అలాగే.ఆ కవితలో మీకెక్కడ ఏం కావాలో చెప్పండి.వివరిస్తాను.' అన్నాను.

'నేటి గతం' కవిత మీద చర్చ మొదలైంది.

ఆ కవితలో - నా చిన్నప్పటినుంచీ నాకు కలిగిన కలుగుతున్న ఆధ్యాత్మిక అనుభవాలను మార్మికభాషలో వ్రాసుకుంటూ వచ్చాను.వాటిల్లో ఒక్కొక్క కవితాపంక్తిని గురించీ వివరంగా మాట్లాడటం మొదలుపెట్టాము.వాటిల్లోని ఒక్కొక్క అనుభవాన్నీ వివరిస్తూ వచ్చే సమయంలో,అప్పట్లో నేను ఎదుర్కొన్న సమస్యలగురించీ, నేను చూచిన కొంతమంది నిజమైన మహనీయులగురించి మాట్లాడే సమయంలో నేను ఎమోషనల్ అయిపోయాను.ఇది చూచి - ఇదంతా వింటున్న మిగతావాళ్ళు 'ఇక ఈ చర్చ వద్దు.ఇంతటితో ఆపేద్దాం' అన్నారు. నేనుకూడా 'సరే' అంటూ విరమించాను.

ఆ తర్వాత ఆయనిలా అన్నాడు.

'మీరెప్పుడూ కర్మ గురించీ దానిని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అన్న విషయం గురించీ మాట్లాడుతూ ఉంటారు కదా.కర్మ గురించి నాకొక్క సందేహం ఉన్నది.మనం బ్రతికి ఉన్నపుడు కర్మ చెయ్యగలం కదా.అలాగే పోయిన తర్వాత కూడా కర్మను చెయ్యగలమా? అప్పుడు కూడా కర్మను ప్రక్షాళన చేసుకోగలమా? ఈ విషయం గురించి కాస్త చెప్పండి?'

ఈ ప్రశ్నకు ఇలా వివరించాను.

'మనిషి చనిపోయిన తర్వాత కర్మ చేసే శక్తి అతనికి ఉండదు.అప్పుడు అతను ఒక బందీగా ఉంటాడు.కోర్టులో న్యాయాధిపతి ముందు చేతులు కట్టుకుని బోనులో నిలబడిన పరిస్థితిలో అతనా సమయంలో ఉంటాడు.కొత్తగా కర్మ చేసే స్వాతంత్ర్యం ఆ సమయంలో ఆ జీవికి ఉండదు.ఈ శరీరంలో ఉన్నంతవరకే మనిషికి కర్మను చేసే అధికారమూ వెసులుబాటూ ఉంటాయి. మరణించిన మరుక్షణం అతనా స్వాతంత్ర్యాన్ని పూర్తిగా కోల్పోతాడు.అప్పుడా జీవి పూర్తిగా ప్రకృతి యొక్క స్వాధీనం లోకి వచ్చేస్తుంది.చాలామందికి అదొక 'కోమా' లాంటి స్థితిలాగా ఉంటుంది. తన పూర్వకర్మ ఎటు లాక్కుపోతే అటు పోవడమే తప్ప ఆ స్థితిలో జీవి ఇంకేమీ చెయ్యలేదు.కనుకనే తనకు ఇష్టంలేని పశువులూ పక్షులూ క్రిమికీటకాదులూ వంటి జన్మలలో ప్రకృతి తనను విసరివేస్తున్నా కూడా తానేమీ చెయ్యలేని పరిస్థితిలో జీవుడా సమయంలో పడిపోతాడు.అందుకే - మరణానంతరం జీవుడు ఏ కర్మనూ చెయ్యలేడు.

అయితే ఇది జెనరల్ రూల్ మాత్రమే. దీనికి మినహాయింపులు కూడా ఉన్నాయి.సాధనా మార్గంలో బాగా పురోగమించి, వికాసాన్నీ, వెలుగునూ, బ్రతికి ఉన్నపుడే అనుభవంలో తెలుసుకున్న జీవులు, మరణానంతరం కూడా అదే స్వాతంత్ర్యాన్నీ శక్తినీ కలిగి ఉంటారు.వాళ్లకు మాత్రమే అప్పుడు కూడా కర్మ చేసే శక్తి ఉంటుంది.అందరికీ ఉండదు.

మనం బ్రతికి ఉన్నపుడు ఏ స్థితిలో ఉంటామో అదే స్థితిలో చనిపోయాక కూడా ఉంటాము.మరణం అనేది జీవితానికి కంటిన్యూటీ మాత్రమే.జీవించి ఉన్నపుడు మనం ఆధ్యాత్మిక శక్తి సంపన్నులమైతే, చనిపోయాక కూడా మనం అలాగే ఉంటాము.అప్పుడు మనకు ప్రకృతిలో కొన్ని వెసులుబాట్లు వస్తాయి.అప్పుడు మామూలు జీవులను హింసపెట్టినట్లు ప్రకృతి మనల్ని హింసపెట్టదు.పెట్టలేదు.విదేశీ రాయబారులకూ, కాన్సులేట్ ఉద్యోగులకూ, పరాయిదేశాలలో ఉండే diplomatic immunity వంటిది ఈ స్థితి.

మీరు చదివే ఉంటారు.ముక్తిలో క్రమముక్తి, జీవన్ముక్తి అని రెండు విధాలున్నాయి.క్రమముక్తి అంటే - ఒక నిచ్చెన ఎక్కినట్లుగా, పరిణామ క్రమం (evolutionary ladder) లో మెట్టుమెట్టు ఎక్కుతూ క్రమంగా ఈ బాధలనుంచీ కర్మలనుంచీ జననమరణ చక్రం నుంచీ ముక్తిని పొందటం.జీవితాన్ని వేదవిహితమైన కర్మలలో గడపినవాడు, మరణానంతరం పితృలోకాన్నీ,ఆ తర్వాత బ్రహ్మలోకాన్నీ పొంది, బ్రహ్మలోకంలో తపస్సులో ఉంటాడనీ, బ్రహ్మ జీవితకాలం అయిపోయాక ఆయనతో బాటుగా, పరబ్రహ్మలో లీనం అవుతాడనీ మన శాస్త్రాలు చెప్పాయి.

అలా కాకుండా, జీవించి ఉన్న సమయంలోనే సాధనా మయమైన జీవితాన్ని గడిపితే, జననమరణ చక్రాన్ని ఇక్కడే అధిగమించి, అతడు బ్రతికి ఉన్నప్పుడే ముక్తిని పొందుతాడు.దానినే జీవన్ముక్తి అంటారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, బ్రహ్మలోకంలో కూడా తపస్సు సాధ్యమే అని మన శాస్త్రాలు వివరించాయి.అయితే ఆ స్థితి మన స్వప్నావస్థ లాగా ఉంటుంది.ఆ అనుభవంలో concreteness ఉండదు.కానీ అక్కడ కూడా కర్మ సాధ్యమే.అయితే అందరికీ ఆ శక్తి ఉండదు.బాగా evolve అయిన జీవులు మాత్రమే అక్కడ కర్మను చెయ్యగలవు.మిగతా మామూలు జీవులన్నీ చనిపోయాక, తీర్పును ఎదురుచూచే ముద్దాయిలే.

అంతేకాదు.ఇంకో విషయం వినండి.మీరనుకుంటున్నట్లుగా, బ్రతికి ఉన్నపుడు కూడా మనిషికి కర్మ చేసే శక్తి లేదు.ఇప్పుడు కూడా అతడు ప్రకృతికీ, తన పూర్వకర్మకూ బానిసే.తన ఇష్టానుసారం చెయ్యగలను అని మనిషి అనుకుంటాడు.ఇది పెద్ద భ్రమ.నిజానికి మనిషి కర్మ అతని చేతుల్లో లేదు. 'చేతలు చేతుల్లో లేవు నాన్నా!'- అని అమ్మ చెప్పింది దీనినే. ఇంద్రియాతీత భూమికలను బ్రతికి ఉండగా స్పర్శించినవాడికే, చనిపోయాకకూడా కర్మ చేసే అధికారం ఉంటుంది.అది లేనివాడు కర్మకు కట్టుబానిస.మామూలు మనిషైనవాడు స్వతంత్రించి తనంతట తానుగా కర్మ ఇప్పుడూ చెయ్యలేడు చనిపోయాకా చెయ్యలేడు.ఆధ్యాత్మిక చైతన్యం లేని మామూలు మనిషి ఎప్పుడూ అస్వతంత్రుడే.అది బ్రతికినప్పుడైనా కావచ్చు,చనిపోయాకైనా కావచ్చు.ఇది సత్యం.

కావాలంటే మీ జీవితాన్ని మీరే గమనించుకోండి.మీలో ఎంతమంది మీరు చెయ్యాలనుకున్న పనులను చెయ్యగలుగుతున్నారు? మీకు మీరే చూచుకోండి. కర్మ మీ చేతులలో లేదని మీకే అర్ధమౌతుంది.' - అని వివరించాను.

'ఈ విషయాలన్నీ ఏ పుస్తకంలోనూ దొరకలేదు శర్మగారు' అన్నాడాయన.

'ఇవి పుస్తకాలలో దొరికే సంగతులు కావు.అనుభవంలో మాత్రమే తెలిసేవి. తెలుసుకోవలసినవి.' అన్నాను.

(ఇంకా ఉంది)