మొన్నొకరోజు సాయంత్రం అందరం కలసి ఆబర్న్ హిల్స్ నుంచి కేంటన్ కు కారులో బయలుదేరాము.అక్కడ పంచవటి సభ్యుడైన ఆనంద్ ఉంటారు.ఈయన miindia.com సైట్ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళింట్లో డిన్నర్ కు రమ్మని ఆహ్వానిస్తే అందరం కలసి వాళ్ళింటికి బయలుదేరాము.
వాతావరణం బాగా చలిగా ఉన్నది.ఇక్కడ సమ్మర్లో కూడా తొమ్మిది పది డిగ్రీల చలి ఉంటున్నది.దానికి తోడు రెండు మూడు రోజులకొకసారి ముసురుపట్టి వానలు పడుతున్నాయి. అలాగే వానలోనే బయలుదేరాము.వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది.
చూస్తుండగానే చీకటి పడింది.హైవే మీద ఒకటీ రెండూ కార్లు తప్ప పెద్దగా ట్రాఫిక్కు లేదు.విశాలమైన రోడ్లమీద, ఆ వానలో ప్రయాణం చేస్తుంటే ఎక్కడికో అనంతంలోకి ఒంటరిగా అలా సాగిపోతూ ఉన్న ఫీలింగ్ కలుగుతున్నది.
అందరూ కార్లో మౌనంగా కూచుని ఉన్నారు.నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మొబైల్ ఫోన్ మ్రోగింది.మాతో బాటు కేంటన్ రావాలనుకుని కారణాంతరాల వల్ల రాలేకపోయిన ఒక అమెరికా శిష్యురాలు ఫోన్లో కొచ్చింది.
కాసేపు అదీ ఇదీ మాట్లాడిన తర్వాత, "వానలో అలా ప్రయాణం చేస్తుంటే మీకు ఏం చెయ్యాలనిపిస్తున్నది?" అంటూ తను ప్రశ్నించింది.
"చెప్తానుండు" - అంటూ కార్లో నాతోబాటు ఉన్నవారికి అదే ప్రశ్న సంధించాను.
'ఈ చలి వాతావరణంలో, ఈ వానలో ప్రయాణం చేస్తుంటే - ఇప్పుడు మీమీ మనసులలో ఏమేం చెయ్యాలని అనిపిస్తున్నదో తడుముకోకుండా చెప్పాలి.మీకు ఏది అనిపిస్తే అది మొహమాటం లేకుండా వెంటనే చెప్పెయ్యాలి.చెప్పండి.'
నా శిష్యులకు అప్పుడపుడూ ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాను.
ఒకరేమో - 'మాకు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తినాలని ఉంది' - అన్నారు.
'గుడ్' అన్నాను.
ఇంకొకరేమో - 'మాకు వేడివేడిగా ఏదన్నా త్రాగాలని ఉంది' - అన్నారు.
వారికీ - 'గుడ్' - అన్నాను.
ఇంకొకరేమో - 'ఈ వానలో తడుస్తూ ఐస్ క్రీం తినాలని ఉంది' - అన్నారు.
'వెరీ గుడ్' - అన్నాను.
ఇంకొకరేమో - 'ఈ సమయంలో గర్ల్ ఫ్రెండ్ పక్కనుంటే బాగుంటుంది' - అన్నారు.
వీరికి - 'ఎక్సలెంట్' - అన్నాను.
ఇంకొకరేమో - "మెడిటేషన్ చెయ్యాలనిపిస్తున్నది" అన్నారు.
'సూపర్' - అన్నాను.
చివరకి అందరూ కలిసి - 'మీకేం అనిపిస్తున్నదో చెప్పండి?' అంటూ నన్నే ఎదురు ప్రశ్నించారు.
నా ఫీల్ ను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే - అందరూ గొల్లున నవ్వేశారు. "మమ్మల్నేమో టక్కున చెప్పమని, మీరేమో వెంటనే చెప్పకుండా - నిదానంగా ఆలోచించుకుంటున్నారా?" - అన్నట్లు.
నా అవస్థకు నాకూ నవ్వొచ్చింది. తమాయించుకుని ఇలా చెప్పాను.
'నాకు - నన్ను దాటి expand అయ్యి ఈ ప్రకృతిలో కలిసిపోవాలనిపిస్తున్నది.'
నవ్వులు ఆగిపోయి కార్లో నిశ్శబ్దం ఆవహించింది.
ఫోన్లో ఇదంతా వింటున్న శిష్యురాలు - 'అదెలా సాధ్యం? మీకెందుకు అలా అనిపిస్తుంది?' - అంటూ ప్రశ్నించింది.
'ఎందుకలా అనిపిస్తుంది? అనడిగితే నేను చెప్పలేనుగాని 'ఇది సాధ్యమే' అని మాత్రం చెప్పగలను.ఇలాంటి సమయంలో ఎవరికైనా ప్రకృతిలో కరిగిపోవాలనే అనిపిస్తుంది.కానీ ఆ విషయం స్పష్టంగా అర్ధం కాక - ఎవరికిష్టమైన వస్తువునో మనిషినో వారు కోరుకుంటూ ఉంటారు.అసలు విషయం అదికాదు.ఈ వస్తువులూ మనుషులూ మనిషికి అమేయమైన ఆనందాన్ని ఇవ్వలేవు.ఆ సంగతి ఎవరికి వారికే అంతరాంతరాలలో తెలుసు.కానీ వేరే మార్గం తెలియక - వాటిలోనే శాశ్వతమైన ఆనందాన్ని వెదుక్కుంటూ ఉంటారు.కానీ ప్రతిసారీ దాన్ని మిస్ అవుతూ ఉంటారు.ఎందుకంటే - ఎక్కడ వెదకాలో తెలియక రాంగ్ ప్లేస్ లో వెదకడమే ఈ మిస్ అవడానికి కారణం.
ఇదంతా Being and Becoming అనే విద్య తెలిస్తే అర్ధమైపోతుంది.మొదట మనం Being అంటే ఏమిటో అనుభవంలో తెలుసుకోవాలి.ఈ Being అనేది శరీరానికీ మనస్సుకూ బుద్ధికీ అహంకారానికీ అతీతంగా ప్రతిమనిషిలోనూ ఒకేవిధంగా ఉన్నది.అందులోకి జారిపోవడం మొదట తెలియాలి.దీనికి సాధన అవసరం.ఉత్త పాండిత్యం వల్ల ఇది రాదు.
Being అనేది అర్ధమైన తర్వాత,Becoming అనేది మొదలౌతుంది.ఎందుకంటే నీలోపల ఏది ఉన్నదో అదే బయట ప్రకృతిలో కూడా నిండి ఉన్నది. అది నిన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది.కానీ నీకు మాయ కప్పేసి ఉండటంతో దాని ఆకర్షణను నువ్వు ఫీల్ కాలేవు.కొందరు భావుకులు కవులు మాత్రం ఈ ప్రకృతి ఆకర్షణను కొద్దిగా ఫీల్ కాగలుగుతారు.వాళ్ళు కూడా పూర్తిగా కాలేరు.ఎందుకంటే వారికి అంతరిక ధ్యానసాధన అలవాటు ఉండదు గనుక.
కానీ ఎప్పుడైతే నీకు Being అనేది అనుభవంలో తెలుస్తుందో - అప్పుడు నీ చుట్టూ ప్రకృతిలో ఉన్న ఇంకా పెద్ద Being నిన్ను అమితంగా ఆకర్షిస్తుంది.నీ being ఆ Being లో కరగిపోవడం మొదలౌతుంది.అప్పుడు మాత్రమే Becoming అంటే ఏమిటో నీకు అనుభవంలో అర్ధమౌతుంది.
ఒక చిన్న గిన్నెలో ఉన్న చేప, దానిలోనుంచి ఎగిరి తన చుట్టూ ఉన్న పెద్ద నదిలోకి దూకాలని ప్రయత్నించినట్లుగా ఈ ఫీలింగ్ ఉంటుంది.అప్పుడు నీకు నిన్ను దాటి expand అవాలనిపిస్తుంది.నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో కలిసిపోవాలని - కరగిపోవాలని- అనిపిస్తుంది.ఈ ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.నిజంగా కరగిపోగలిగితే - ఆ అనుభవం మాటలకు అతీతంగా పరమాద్భుతంగా ఉంటుంది.మనిషికి తెలిసిన అన్ని అనుభవాలలోకీ ఇదే అత్యున్నతమైన ఆనందాన్ని ఇచ్చే అనుభవం.దీనినే యోగపరిభాషలో "సమాధిస్థితి" అంటారు. ప్రస్తుతం నాకు అలాగే కరగిపోవాలని అనిపిస్తున్నది.' అన్నాను.
ఒక చిన్న గిన్నెలో ఉన్న చేప, దానిలోనుంచి ఎగిరి తన చుట్టూ ఉన్న పెద్ద నదిలోకి దూకాలని ప్రయత్నించినట్లుగా ఈ ఫీలింగ్ ఉంటుంది.అప్పుడు నీకు నిన్ను దాటి expand అవాలనిపిస్తుంది.నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో కలిసిపోవాలని - కరగిపోవాలని- అనిపిస్తుంది.ఈ ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.నిజంగా కరగిపోగలిగితే - ఆ అనుభవం మాటలకు అతీతంగా పరమాద్భుతంగా ఉంటుంది.మనిషికి తెలిసిన అన్ని అనుభవాలలోకీ ఇదే అత్యున్నతమైన ఆనందాన్ని ఇచ్చే అనుభవం.దీనినే యోగపరిభాషలో "సమాధిస్థితి" అంటారు. ప్రస్తుతం నాకు అలాగే కరగిపోవాలని అనిపిస్తున్నది.' అన్నాను.
నేను వివరించి చెబుతూ ఉన్నప్పుడే అందరికీ ఆ వైబ్రేషన్స్ పట్టేశాయి.నా మాటల్లోని నిజాన్ని వాళ్ళు కూడా ఫీల్ అవడం మొదలు పెట్టారు.
సడెన్ గా కార్లో నిశ్శబ్దం ఆవహించింది.
వాన ఆగకుండా పడుతూనే ఉన్నది.మెత్తటి రోడ్డుమీద కారు ఇంకా మెత్తగా సాగిపోతున్నది.చుట్టూ చీకటి. హైవే లైట్లు తప్ప ఎక్కడా ఏ విధమైన లైటింగూ లేదు.ఎక్కడా జనసంచారం లేదు.రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ళన్నీ దూరదూరంగా విసిరేసినట్లుగా ఉండి,వానలో ముద్దగా తడుస్తూ,ఎక్కడో కొండచరియలలో ధ్యానావస్థలో ఉన్న యోగుల్లా నిశ్శబ్దంగా ఉన్నాయి.
ప్రకృతిలోని ప్రశాంత నిశ్శబ్దం కార్లో ఉన్న మమ్మల్ని అందరినీ ఒక భూతంలా ఆవహించింది.అందరూ మౌనంగా విండోలలో నుంచి ఆ వానను చూస్తూ ఉండిపోయాము.
గమ్యం చేరేవరకూ ఎవరమూ ఏమీ మాట్లాడుకోలేదు. అద్భుతమైన ఆ ఫీల్ లో ఉన్నప్పుడు ఇక మాటల అవసరం ఏముంటుంది?
(ఇంకా ఉంది)