Pages - Menu

Pages

12, జూన్ 2016, ఆదివారం

చంద్రశేఖర సరస్వతి -3 (హిమాలయ జీవితం)





బాబోయ్ !!

నాకే కాదు నా శిష్యురాళ్ళకు కూడా శక్తులు ఒచ్చేస్తున్నాయి. ముందు జరగబోయేది వారికి కూడా తెలిసిపోతోంది.

తమాషా కాదు.

నిజం !!

రెండు వారాల క్రితం అమెరికాలో కొందరు శిష్యురాళ్ళకు శ్రీవిద్యాదీక్ష ఇచ్చాను. వారిలో ఒకామె అటుమొన్న ఫోన్ చేసింది. ఆమాటా ఈ మాటా మాట్లాడాక, - 'చంద్రశేఖర్ ఎక్కడున్నారు?' అని ప్రశ్నించింది.

నా వ్రాతలు చదివేవారికి చంద్రశేఖర్ బాగా పరిచయమే.ఒక MNC లో మంచి మేనేజర్ పోస్ట్ లో ఉంటూ, తీవ్రమైన వైరాగ్యసంపన్నుడై,ఆ ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి ఒక సామాన్యుడిగా అరుణాచలంలోని రమణాశ్రమంలో సాధన చేసుకుంటూ ఉంటున్నాడు.

'ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియదు.ఆర్నెల్ల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నానని ఫోన్ చేశాడు.ఆ తర్వాత ఎక్కడున్నాడో తెలియదు.బహుశా రమణాశ్రమంలో ఉన్నాడేమో కనుక్కుంటా ఉండు.' అన్నాను.

'సరే' అని తను వేరే టాపిక్ లోకి వెళ్ళిపోయింది.

మొన్న రాత్రంతా నల్గొండ దగ్గర కొత్తగా వస్తున్న 'రాయనగూడ' స్టేషన్ లైన్ లేయింగ్ వర్క్స్ చూచుకుంటూ ఆరుబయట టెంట్ లో గడిచింది.రాత్రంతా నిద్రపోలేదు.పగలంతా కూడా నిద్ర రాలేదు.మరుసటిరోజు సాయంత్రానికి కొంచం నిద్ర వస్తున్నట్లు అనిపించింది.పడుకుందామని అనుకుంటూ ఉండగా ఫోన్ మ్రోగింది.

ఎవరా అని చూస్తే -'అన్నగారు.నేను! ప్రస్తుతం గుంటూరు లోనే ఉన్నాను.' అంటూ చంద్రశేఖర్ స్వరం వినిపించింది.

నిద్రమత్తు ఎగిరిపోయింది.

'అమ్మో !! శిష్యురాలు చాలా వేగంగా ఎదుగుతోంది. ఇంట్యూషన్ వికసిస్తోంది.గుడ్!!' అనుకుంటూ 'ఎక్కడున్నావ్ తమ్ముడూ' అన్నా.

'నేనూ గిరిగారూ నరేంద్రా కలసి స్వీట్ మాజిక్ లో కాఫీ త్రాగుతున్నాం. మీరూ రండి.' అన్నాడు చంద్రశేఖర్.

'పది నిముషాల్లో అక్కడుంటా' అని గబగబా పక్కమీద నుంచి లేచి, ముఖం కడుక్కుని, బైక్ తీసుకుని బయల్దేరాను.

దారిలోనే మళ్ళీ ఫోనొచ్చింది.

'అన్నగారు.కాఫీ త్రాగడం అయిపొయింది.ఇప్పుడు గిరిగారి షాపు దగ్గర ఉన్నాం.అక్కడకొచ్చేయండి' అన్నాడు చంద్ర.

'ఓకే' అంటూ బైక్ ను అటు మళ్ళించాను.

నేను అక్కడకు చేరేసరికి గిరిగారి షాపు బయట నరేంద్రా, గిరిగారూ, చంద్రశేఖరూ కూచుని నవ్వుతూ చేతులూపారు.

గిరిగారు మంచి సంగీతవేత్త.కర్నాటక సంగీతంలో మంచి లోతైన జ్ఞానం ఉన్నవాడు.అనుష్టాన వేదాంతి. పెళ్ళిచేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయి ఆధ్యాత్మిక జీవితం గడపుతున్న సత్పురుషుడు.గుంటూరు త్యాగరాజ ఆలయంలో ఈయనకూడా యాక్టివ్ మెంబర్ గా ఉంటూ అక్కడ కచేరీలూ అవీ చూచుకుంటూ ఉంటాడు.ఈయనకు 'సిందూరీ శారీస్' అంటూ బట్టల వ్యాపారం ఉన్నది.ఆ షాపు 'శంకర్ విలాస్' దగ్గరే ఉంటుంది.మేమంతా అప్పుడప్పుడూ అక్కడ కలుస్తూ ఉంటాం.అది మా ఆధ్యాత్మిక 'అడ్డా' అన్నమాట.

నన్ను చూస్తూనే, నరేంద్ర - 'ఏంటన్నయ్యా అమెరికా వెళ్లి వచ్చాక వేషం మారిపోయింది?' అన్నాడు చనువుగా.

'ఏం మారింది?' అడిగాను నేనూ నవ్వుతూ.

'మీసం తీసేశావు.మగాడికి మీసమే కదా అందం! ఇలా చూస్తుంటే ఏదో తేడాగా ఉంది.' అన్నాడు గునుస్తూ.

'ఏంటా తేడా?' అడిగాను.

'అదే. ఆడా కాకుండా మగా కాకుండా...' అంటూ నసిగాడు.

'ఊ! చెప్పు. సంశయం ఎందుకు?ఆడా మగా కాని మాడాలా కనిపిస్తున్నానా?' అడిగాను నవ్వుతూ.

'అబ్బే అదేం లేదులే అన్నయ్యా. కాకపోతే ఏదో తేడాగా ఉన్నావు.' అన్నాడు.

'ఆత్మ ఆడా? మగా? చెప్పు తమ్ముడూ?' - అడిగాను షాపు బయట స్టూలు మీద కూచుంటూ.

చేతులు జోడించాడు నరేంద్ర.

'నీ సంగతి తెలిసీ నీతో ఇలా మాట్లాడటం తప్పే. మన్నించన్నయ్యా' అన్నాడు నవ్వుతూ.

'లోపల ఏసీలో కూచుందాం.రండి.' అన్నారు గిరిగారు లేస్తూ.

'ఒద్దు కూచోండి గిరిగారు.మనకు ఏసిగది కంటే ఫుట్ పాత్ మీదే బాగుంటుంది.హాయిగా ఉంది.కూచోండి.' అన్నాను.

అందరం షాపు బయట స్టూల్స్ మీద కూచున్నాం.

చంద్రశేఖర్ వైపు పరికించి చూచాను.

మనిషిలో ఇంతకు మునుపటి అలజడి లేదు. ముఖం ప్రశాంతంగా ఉంది.గడ్డం పెంచాడు.చూపుల్లో లోతు పెరిగింది.

సంతృప్తిగా అనిపించింది.

'ఏంటి తమ్ముడూ ఎక్కడున్నావ్?' అడిగాను.  

చెప్పడం మొదలు పెట్టాడు చంద్రుడు.

'ఉద్యోగం వదిలేసి ఆర్నెల్లు అయింది అన్నగారు.అరుణాచలం చేరాను.రెండునెలలు పూర్తి మౌనంలో ఉంటూ అక్కడ ధ్యానంలో గడిపాను.శేషాద్రిస్వామి ఆశ్రమంలో బస తీసుకున్నాను. ఇంతలో హిమాలయలనుంచి పిలుపొచ్చింది. గత మూడు నెలలుగా గంగోత్రి, ఉత్తరకాశీలలో ఉండి, మిమ్మల్నందరినీ చూద్దామని డైరెక్ట్ గా అక్కడనుంచి గుంటూరుకే వచ్చాను. ఇవాళా రేపూ ఇక్కడ ఉండి అరుణాచలం వెళ్ళిపోతున్నాను.' అన్నాడు.

'ఏంటి సంగతి?' అడిగాను.

'మా గురువుగారు హిమాలయాస్ లో రిట్రీట్ పెట్టారు.దానికి అటెండ్ అయి వస్తున్నాను.'అన్నాడు.

తను దయానంద సరస్వతి శిష్యుడు.ఈయన ఆర్య సమాజమాయన కాదు.స్వామి చిన్మయానంద సాంప్రదాయం. అక్కడ దీక్ష తీసుకున్నాడు చంద్రశేఖర్.

'ఇంకా చెప్పు' అన్నాను.

'ఏం చెప్పమంటారన్నగారు? నేను ఊహించని మరో లోకాన్ని చూచాను.భూమిమీద స్వర్గాన్ని చూచాను.ఆ ప్లేన్ పూర్తిగా వేరు. మనం ఆ ప్లేన్ ను అసలు ఊహించలేం. దానితో పోలిస్తే మనం ఇక్కడ బురదలో పందుల్లా బ్రతుకుతున్నాం.అద్భుతమైన ఆనందంలో ఈ మూడు నెలలూ గడిపాను అన్నగారు' అన్నాడు తన్మయత్వంలో.

అది అతని ముఖం చూస్తుంటేనే అర్ధమౌతోంది.

చిరునవ్వుతో వింటున్నాం అందరం.

చంద్రశేఖర్ చెప్పడం సాగించాడు.

(ఇంకా ఉంది)