నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, జులై 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 33 (గౌరీమా - ఊహాతీత తపోమయ జీవితం)

హరిద్వార్ నుంచి ఋషీకేశ్ కు అదే సాధువుల గుంపుతో కలసి ఆమె చేరుకుంది.ఆ తపోభూమికి చేరుకున్న తదుపరి వారినుంచి సెలవు తీసుకుని ఒంటరిగా హిమాలయ పర్వతాలలో సంచరించ సాగింది.

హిమాలయాలలో గడపిన మూడేళ్ళలో అనేక క్షేత్రాలను ఆమె దర్శించింది.బదరీనాథ్, కేదార్ నాద్,రుద్రప్రయాగ, అమర్నాథ్,ఉత్తరకాశీ వంటి లోతట్టు హిమాలయ ప్రాంతాలలో ఉన్న అన్ని క్షేత్రాలను ఆమె దర్శించింది.నిరంతరం ఆమె మనస్సు దైవధ్యానంలో మునిగి ఉండేది.

తనతో తెచ్చుకున్న గుడ్డసంచిలో - తనకు ప్రాణప్రదమైన దామోదర సాలగ్రామం,కాళీమాత చిత్రం, చైతన్యమహాప్రభువు చిత్రం, దుర్గాసప్తశతి, మహాభాగవతాలను మాత్రమే ఆమె తనతో ఉంచుకునేది. ఇవి తప్ప ఆమెదగ్గర ఇంకే వస్తువులూ ఉండేవి కావు.

తను ఆడపిల్లనన్న విషయం లోకులకు తెలియకుండా ఉండేందుకు ఆమె జుట్టును పొట్టిగా కత్తిరించి పారేసింది.అందవికారంగా కనిపించడానికి ముఖానికి ఒంటికి బురదను, బూడిదను పూసుకునేది.ఆ విధమైన బికారివేషంలో నిరంతరం కృష్ణధ్యానంలో తపిస్తూ, చలిని, ఆకలిదప్పులను సహిస్తూ,ఎక్కడో తింటూ ఎక్కడో నిద్రిస్తూ హిమాలయాలలో మూడేళ్ళపాటు ఘోరమైన తపస్సు చేసింది ఆ అమ్మాయి.

ఆ మూడేళ్ళలో ఆమె స్థిరంగా ఏ క్షేత్రంలోనూ పట్టుమని పదిరోజులు ఉండేది కాదు.బాగా అవసరం అయితే తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు. పూర్తిగా మౌనదీక్షలో ఉండేది.ఏ సాధుబృందంతోనూ ఎక్కువరోజులు కలసి ఉండేది కాదు. ఏం కట్టుకుందో ఏం తిన్నదో ఏ చెట్లక్రింద నిద్రించిందో ఆ పర్వతాలలో ఆ అడవులలో ఒక్కతే కాలినడకన అన్నన్ని వందల మైళ్ళు దైవం పైన భారం వేసి ఎలా నడిచిందో ఆమెకే తెలియాలి.

ఆమె మనస్సులో సర్వకాల సర్వావస్థలలోనూ కృష్ణుడే మెదులుతూ ఉండేవాడు.నిరంతరం ఆయన ధ్యాస తప్ప ఇంకేమీ ఆమెకు ఉండేది కాదు.

ఎప్పుడైనా రాత్రిపూట కొత్త ప్రదేశంలో ఒక్కతే ఉండవలసి వస్తే, రాత్రంతా నిద్రపోకుండా జపంలోనూ ధ్యానంలోనూ గడిపేది.లేదా గొంతెత్తి కీర్తనలు పాడుతూ తెల్లవార్లూ గడిపేది.

అప్పటివరకూ సుఖంగా తల్లిదండ్రుల చాటున ఉంటూ వేళకు తింటూ చీకూచింతా లేకుండా హాయిగా కాలం గడిపిన పిల్ల.ఒక్కసారిగా ఇటువంటి మార్పుకు ఆమె శరీరం తట్టుకోలేక పోయింది.కానీ అతి త్వరలోనే ఆమె హిమాలయాల చలికి, పస్తులుండటానికి, అనారోగ్యాలకు,మిగిలిన బాధలకు అలవాటు పడింది.

చాలామందికి ఒక సందేహం వస్తుంది. హాయిగా ఇంటి పట్టున ఉండకుండా ఇలాంటి జీవితాన్ని కోరి వరించడం,అందులోనూ వయసులో ఉన్న ఆడపిల్లకు,ఇవన్నీ అవసరమా? ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవచ్చు కదా? అని.

తీవ్రమైన వైరాగ్య జ్వాల మనసులో రగులుతున్నవారి అంతరంగం ఏమిటో అలాంటి స్థితిని అనుభవించిన వారికే అర్ధమౌతుంది గాని బయటనుంచి చూచేవారికి అర్ధంకాదు. ప్రపంచం పట్ల విరక్తీ, భగవంతుని పట్ల తీవ్రమైన తపనా ఉన్నవారి మానసిక స్థాయిని, ఎంతసేపూ తమ సుఖం తాము చూచుకుని,తమ స్వార్ధంకోసం ఎదుటిమనిషికి ఎలాంటి అన్యాయమైనా సరే చెయ్యడానికి ఏమాత్రమూ వెనుదియ్యని మనవంటి క్షుద్రులు ఎంతమాత్రమూ అర్ధం చేసుకోలేరు.

మరి ఆమూడేళ్ళూ ఆ అమ్మాయికి దిక్కెవరు అని అనుమానం వస్తుంది. 'దిక్కులేనివారికి దేవుడే దిక్కు' - అనే సామెత మనకు ఉన్నది.దిక్కులేనివారికే కాదు అందరికీ ఆ దేవుడే నిజమైన దిక్కు. ఎవరికైనా సరే, మనుషుల దిక్కు ఎంతవరకు? నిజంగా ఆలోచిస్తే మనిషికి ఇంకొక మనిషి ఎప్పటికైనా రక్షణ కల్పించగలడా?ఈ ప్రపంచాన్నీ ఈ సమస్తాన్నీ సృష్టించి రక్షిస్తున్న దైవమే ఎవరికైనా సరే నిజమైన దిక్కు.మనం అనుకునే ఇతర దిక్కులన్నీ నిజానికి దిక్కులు కావు. అవన్నీ పెద్ద భ్రమలు.

"అనన్యాశ్చింతయం తో మాం యే జనా: పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్"

"ఎవరైతే ఇతరములేవీ చింతించకుండా ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారి బాగోగులు నేనే చూచుకుంటాను."

అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు వాగ్దానం చెయ్యలేదా? దైవం ఇచ్చిన వాగ్దానం వృధాగా పోతుందా? కానీ ఆ విధంగా ఉండేవారేరి? కోటికి ఒకరైనా ఆవిధంగా ఉన్నవారున్నారా?అందరూ వారివారి అనుమానాలతో భయాలతో,స్వార్ధాలతో, అల్పమైన మనస్తత్వాలతో,అహంకారాలతో,కుళ్ళూ కుతంత్రాల తో కునారిల్లుతున్నవారేగాని చిత్తశుద్ధితో ఈ దైవ వాగ్దానాన్ని పరీక్షించి చూచిన వారెవరున్నారు? ఒకవేళ అలా ఉండి, ఆశాభంగం పొందిన వారు మాత్రం ఎవరున్నారు?

ఆ మూడేళ్ళలో మృడాని ఎన్నో దైవానుభూతులను పొందింది.నిరంతరమూ దైవం తనకు రక్షణగా ఉన్న అనుభూతిని ఆమె ఎన్నో సార్లు గమనించింది.చాలాసార్లు - ఊహించని మనుషుల నుంచీ ఊహించని పరిస్థితుల నుంచీ ఆమెకు సహాయం అందేది. ఎన్నో రోజులు తిండిలేక ఆమె పస్తులుంది.కానీ ఆకలిని లెక్కచెయ్యకుండా రోజంతా ధ్యానంలో కదలకుండా కూచుని ఉండేది.సాయంత్రానికి ఎవరో ఒకరు ఆహారం తెచ్చి ఆమె పక్కన ఉంచి పోయేవారు.కొన్నిసార్లు ఆ ఆహారాన్ని ఆమె తినేది.కొన్నిసార్లు కుక్కలు పిల్లులు మొదలైన జంతువులు ఆ ఆహారాన్ని తినేసేవి. తను మాత్రం దేహస్పృహ లేని ధ్యానంలో తన్మయురాలై ఉండేది.

ఈ విధమైన తపోదీక్షలో ఆ అమ్మాయి హిమాలయాలలో మూడేళ్ళు గడిపింది. ఈ మూడేళ్ళలో కృష్ణునిపైన ఆమె ప్రేమ ఊహించలేనన్ని రెట్లు పెరిగిపోయింది.నిరంతరం కృష్ణుని దర్శించాలని అతనిలో లీనం కావాలని తపించసాగింది.ఆ తపన ఆమెను హిమాలయాల నుంచి కృష్ణలీలా క్షేత్రమైన బృందావనం వైపు ఈడ్చుకొచ్చింది.కానీ అక్కడ యాత్రలకు వచ్చిన ఈమె బంధువు ఒకాయన ఈమెను గుర్తుపట్టి ఈ విషయాన్ని ఈమె తల్లిదండ్రులకు చేరవేశాడు.మళ్ళీ వాళ్ళు వచ్చి తనను ఇంటికి తీసుకుపోతారేమోనన్న భయంతో ఆమె బృందావనాన్ని వదలి పశ్చిమ దిక్కుగా ప్రయాణం సాగించింది.త్వరలోనే ఆమె ద్వారకా నగరాన్ని చేరుకుంది.

బృందావనం కృష్ణుని బాల్యక్రీడకు రంగస్థలం అయితే, ద్వారకా నగరం ఆయన రాజుగా రాజ్యం నడిపిన ప్రాంతం.తన రాజ్యం స్థాపించుకోవడానికి ఎక్కడా చోటు దొరకక, చివరకు సముద్రం వెనక్కు పోగా బయటపడిన ప్రాంతాన్ని తన రాజ్యంగా చేసుకుని అక్కడ ఉన్నాడాయన.అది కూడా ఆయన యొక్క దివ్యలీలకు భూమిక అయిన ప్రాంతమే.అక్కడ కూడా అనేక దేవాలయాలు ఆయనకు ఉన్నాయి.

అక్కడ రణచోడ్ జీ ఆలయంలో ఆమెకు ఒక దివ్యానుభవం కలిగింది.

ఆ ఆలయంలో ఉన్న కృష్ణుని విగ్రహం చాలా అందంగా ఉంటుంది.ఆ ఆలయానికి ఆమె చేరుకునే సరికి ఆరోజుకు కృష్ణునికి నైవేద్యం పెట్టడం అయిపొయింది.దేవాలయంలో కొంచం పక్కగా కూచుని ఆమె ధ్యానంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా ఆమె ఒక దృశ్యాన్ని చూచింది.

చాలా అందంగా ఉన్న ఒక నల్లని పిల్లవాడు అప్పుడే అన్నం తిని ఇంకా మూతి కడుక్కోకుండా,పెరుగన్నం అంటుకుని ఉన్న పెదవులతో నవ్వుతూ ఈమె ఎదురుగా నిలుచున్నట్లు హటాత్తుగా ఈమెకు కనిపించింది.మొదట్లో ఆ పిల్లవాడు కృష్ణుడని ఆమెకు తోచలేదు.ఎందుకంటే, దైవదర్శనాలలో సామాన్యంగా ఉండే వెలుగు మొదలైన లక్షణాలు ఆ దర్శనంలో లేవు.ఒక మామూలు పిల్లవానిలాగే కృష్ణుడు ఆమెకు కనిపించాడు.

ఇదేంటి? ఈ ఊరిలో పూజారులు తమ పిల్లలను గుడికి తీసుకువచ్చి వారికి ఇక్కడే అన్నం తినిపిస్తారేమో? ఇది ఇక్కడి పద్ధతేమో? అని ఆమె అనుకుంది.అలా అనుకుని చూస్తూ ఉండగానే ఆ పిల్లవానికి పూజారి నీళ్ళు ఇవ్వడమూ ఆ నీటితో మూతి కడుక్కున్న ఆ పిల్లవాడు పక్కనే ఉంచిన తన మురళిని తీసుకుని నవ్వుతూ గర్భగుడిలోని సింహాసనం మీద కూచోవడమూ ఆమె చూచింది.ఆ క్షణంలో - తాను చూస్తున్నది కృష్ణుడినే అన్న స్పృహ ఆమెకు కలిగింది. అలా ఆమెకు ఆ స్పృహ కలిగిన మరుక్షణమే ఆ దృశ్యం మాయమై పోయింది.

ఒక్క ఒదుటున లేచిన మృడాని పిచ్చిదానిలా పరుగెత్తుకుంటూ గర్భగుడి గడప వద్దకు వెళ్లి అక్కడ కూలిపోయి భోరుమంటూ ఏడవసాగింది. ఇదంతా చూస్తున్న పూజారులు ఆమె వద్దకు వచ్చి - 'పాపం ఈ పిల్లకు ఏం కష్టం వచ్చిందో?' - అంటూ ఓదార్చడానికి ప్రయత్నించసాగారు. కానీ ఆ ఏడుపు - కష్టాలనుంచి పుట్టిన మామూలు ఏడుపు కాదన్న సంగతి వారికెలా తెలుస్తుంది?

కృష్ణుడు చాలా అల్లరివాడు.తన ప్రేమికులను ఆయన భలే ఏడిపిస్తాడు.అలా ఆ గడప పైన పడి ఎంత ఏడ్చినా ఆ నల్లనివాడు మళ్ళీ మృడానికి కనిపించలేదు. ఎంత ఏడ్చినా ఉలకడు.పలకడు.తన గోపికలతో ఈ విధంగా దాగుడు మూతల ఆటలాడటం అంటే ఆయనకు భలే సరదాగా ఉంటుంది కాబోలు.

ద్వారకలో ఆ అనుభవం కలిగిన తదుపరి ఆమె మనస్సు మళ్ళీ బృందావనం వైపు బలంగా లాగబడింది.పగలూ రాత్రీ ఒకటే ఆలోచన ఆమెను వెంటాడి వేధించేది. నిరంతరం కృష్ణునితో ఎలా కలసి ఉండాలి? ఎప్పుడూ వీడిపోకుండా తన ప్రియునితో ఆనందసాగరంలో మునిగి రోజులు ఎలా గడపాలి? ఎల్లప్పుడూ ఇదే ఆలోచన ఆమెను భూతంగా వెంటాడేది. రేయింబవళ్ళు వేధిస్తున్న ఈ తపనను తట్టుకోలేక మళ్ళీ వెనక్కు తిరిగి బృందావనం చేరుకున్నది ఆమె.

ఒకసారి బృందావనం చేరుకున్నాక ఆమె తపన మరీ ఎక్కువైపోయింది.కృష్ణధ్యానంలో తనను తాను మరచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కదలకుండా కళ్ళు తెరవకుండా ఆమె ధ్యానంలో ఉండేది.తిండీ తిప్పలూ ఆమె దృష్టినుంచి మాయమై పోయాయి.ధ్యానం చెయ్యని రోజులలో బృందావనపు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉండేది.లేదా యమునా తీరంలో పిచ్చిదానిలా సంచరిస్తూ -' కృష్ణా ఎక్కడున్నావు? ఈ పిచ్చిదాన్ని కరుణించవా? కనిపించవా?నీకోసం ఇల్లూ వాకిలీ వదిలేసి ఇలా తిరుగుతున్నాను.నువ్వు కరుణామయుడవని అంటారు కదా. మరి నన్ను ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు?అన్నీ ఒదిలి నీకోసం ఇలా అలమటిస్తున్నాను.ఒక్కసారి కనిపించు. ఆనందమయమైన నీ దర్శనాన్ని ఒక్కసారి కలిగించు.' అని ఏడుస్తూ ఉండేది.

వేలసంవత్సరాల క్రితం రాధాదేవి ఎలాగైతే కృష్ణుని కోసం తపించిందో,పిచ్చిదానిలా చెట్లూ పుట్టలూ పట్టుకుని ఆయనకోసం యమునాతీరంలో వెదికిందో,పక్షులనూ మేఘాలనూ నదినీ మొక్కలనూ పువ్వులనూ తుమ్మెదలనూ ఆయన జాడ చెప్పమని ఏ విధంగా బ్రతిమాలిందో,అలా వెదికినప్పుడు ఆమెను ఏ ప్రేమోన్మాదం ఆవహించిందో,ఇప్పుడు మృడానిని అదే ఉన్మాదం ఆవహించింది.చూచేవారికి ఆమె ఒక అడుక్కుంటూ తిరిగే మతిస్థిమితం లేని పిచ్చిదానిలా తోచింది.

రోజులు గడిచే కొద్దీ ఆమె వేదన భరించలేనంతగా పెరిగి పోయింది.కానీ కృష్ణుని జాడా జవాబూ ఎక్కడా లేదు.అసలు తన గోడు ఆయన వింటున్నాడో లేదో కూడా తెలియడం లేదు.ఇలా కొన్ని నెలలు గడచే సరికి మృడానికి జీవితం మీద తీవ్రమైన విరక్తి వచ్చేసింది.ఈ పాడు బ్రతుకు బ్రతకకపోతే ఏం? తన కృష్ణుడు లేని జీవితం తనకెందుకు? ఎన్నాళ్ళు ఇలా వృధాగా బ్రతికినా ఉపయోగం ఏముంది?అన్న ఆలోచనలు ఆమెను చుట్టు ముట్టాయి.తీవ్రమైన విరక్తి నిండిన ఆమె తన జీవితాన్ని అంతం చేసుకుందామని నిశ్చయించుకుంది.

ఒకరోజు రాత్రి బాగా చీకటి పడిన తర్వాత దగ్గరలోనే ఉన్న "లలితాకుండం" అనబడే మడుగు దగ్గరకు ఆమె చేరుకుంది.చాలాసేపు ఆ నీటి మడుగు ఒడ్డునే ఆమె ఆ చీకట్లో మౌనంగా కూర్చుని ఉండిపోయింది.తన తల్లిదండ్రులను స్మరించింది.అనుకోకుండా తనకు తటస్థపడి మంత్రోపదేశం చేసి మళ్ళీ కనిపించకుండా పోయిన ఆ అజ్ఞాత యువక గురువును మనస్సులో తలుచుకుంది. తన ప్రాణానికి ప్రాణం అయిన కృష్ణుణ్ణి స్మరించింది.ఆయనతో ఇలా చెప్పింది.

'ప్రభూ.నీకోసం అన్నీ ఒదులుకున్నాను.ఎన్నో కష్టాలను భరిస్తూ సహిస్తూ నీ ధ్యానంలో ఇన్నేళ్ళు గడిపాను.నిరంతరం నిన్నే ప్రార్ధించాను.నీ ధ్యాసలోనే కాలం గడిపాను.కానీ నీ కరుణ నాకు అందలేదు.నీ దర్శనం నాకు నిరంతరం కలగడం లేదు. ఎప్పుడో నీకిష్టమైనప్పుడు ఒక్క క్షణకాలం కనిపిస్తున్నావు.మళ్ళీ మాయావిలా మాయమై పోతున్నావు.ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ కన్పించవు. ఎందుకు నన్నిలా వేధిస్తున్నావు? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు?ఈ వేదన నేను భరించలేను. నువ్వు లేని ఈ బ్రతుకు నాకొద్దు.ఈ శరీరమే కదా నీకూ నాకూ అడ్డంగా ఉన్నది?ఇదేకదా నిన్నూ నన్నూ వేరు చేస్తున్నది?అందుకే ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను.నేనూ నీ దగ్గరకే వస్తున్నాను.కనీసం ఇప్పుడైనా నన్ను కరుణించు.నన్ను నీ ఒడిలోకి చేర్చుకో.కనీసం ఇప్పుడైనా నన్ను అనుగ్రహించు.' - ఇలా ప్రార్ధిస్తూ చేతులు జోడించి నిశ్చలమైన మనస్సుతో కృష్ణుని ధ్యానిస్తూ ఆ మడుగులోకి నడుస్తూ వెళ్ళిపోయింది మృడాని.

అప్పుడొక మహాద్భుతం జరిగింది.

ఎంతో లోతైన ఆ మడుగులో ఎంతదూరం నడచినా ఆమెకు అడుగు తగలడం లేదు.ఇదేమి వింత? ఎంతో లోతుగా ఉండే ఆ చెరువు ఆరోజు హటాత్తుగా ఎండిపోయిందా?లేక, నడుస్తున్నానని భ్రమిస్తూ ఆమె అక్కడే నిలుచుండి పోయిందా?ఏది ఏమైనప్పటికీ, అలా నడుస్తూ ఆ మడుగులోకి పోతున్న ఆమె కళ్ళ ఎదురుగా హటాత్తుగా ఒక మహాద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

అప్పటివరకూ తన చుట్టూ ఉన్న చీకటి ఉన్నట్టుండి మాయమై పోగా, ఆ స్థానంలో తెల్లని పాలవెన్నెల పరుచుకుంది.ఆ చీకటి రాత్రి ఒక్క క్షణంలో పున్నమిరాత్రిగా మారిపోయింది.తన చుట్టూ ఉన్న చీకటి పరిసరాలు ఏదో తెలియని మంత్రం వేసినట్లు మాయమై పోయాయి.ఆ స్థానంలో మణుల కాంతులతో మెరుస్తున్న లతలూ పూపొదలూ వెన్నెలలో మెరిసిపోతూ దర్శనమిచ్చాయి.ఆ పొదలలో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి.చిలుకలు కోయిలలు మధురంగా కూస్తున్నాయి.తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ ఎగురుతూ పూల మకరందాలను గ్రోలుతున్నాయి.వాతావరణం అంతా మధురమైన పూల సువాసనలతో ఆహ్లాదంగా మనోహరంగా ఉన్నది.ఎటుచూచినా ఏదో తెలియని ఆనందం ప్రకృతిలో నిండి వెల్లువలా ప్రవహిస్తున్నది.

కళ్ళు విప్పార్చుకుని ఈ అద్భుతాన్ని చూస్తున్న మృడాని చెవులకు - 'ప్రియతమా! గౌరీ! ఇలా చూడు.నాకోసం ఎందుకు అంతలా వెదుకుతున్నావు?ఎందుకలా ఏడుస్తున్నావు?ఇదుగో చూడు.నేనిక్కడే ఉన్నాను.' అన్న మృదుమధురమైన స్వరం వినిపించి ఆమె శరీరాన్ని ఝల్లుమనిపించింది.

భయసంభ్రమాలతో ఆ స్వరం వినవచ్చిన దిక్కుగా చూచిన మృడానికి ఒక చెట్టుక్రింద విలాసంగా కూర్చుని,సిగలో నెమలిపించంతో, మెడలో పూలమాలతో, చేతిలో పిల్లనగ్రోవితో, కాళ్ళు విలాసంగా ఊపుతూ,చిరునవ్వుతో తననే చూస్తున్న పీతాంబరధారీ,గోపీజన మానసచోరుడూ, లీలానాటక సూత్రధారీ,భగవంతుని యొక్క పరిపూర్ణావతారమూ అయిన మురళీ మోహనుడు దర్శనమిచ్చాడు.

ఒక్కసారిగా మృడాని అంతరంగం కట్టలు త్రెంచుకుంది. సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకును ఊపినట్లు,అనేక యుగాల విరహం ఆమెను ఊపేసింది.పట్టలేనంత ఆనందం ఆమెలోకి ఒక వెల్లువలా దూసుకొచ్చింది. ఒళ్ళు తెలియని విహ్వలతలో పరుగెత్తుతూ ముందుకు దూకిన ఆమె నాలుగంగల్లో కృష్ణుని చేరుకొని ఆయనను తన చేతులతో చుట్టేసి తల్లి ఒడిని చేరుకున్న చిన్నారిలా ఆయన వడిలో వాలిపోయింది.తన కన్నీటితో ఆయన ఒడిని తడిపేస్తూ దివ్యమనోహరమైన ఆయన ముఖాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ అలా మైమరచి ఉండిపోయింది.

అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు తెలియదు.ఆ తర్వాత ఏం జరిగిందో అసలే తెలియదు.తానెవరో తెలియదు.ఎక్కడున్నదో తెలియదు.అసలు తాను ఉన్నదో లేదో తెలియదు.ప్రపంచం ఉందో ఏమై పోయిందో తెలియదు.తన ఉనికిని కూడా పూర్తిగా కోల్పోయిన మధుర పారవశ్య స్థితిలో ఆమె ఆ రాత్రంతా ఉండిపోయింది.

ఆ స్థితిలో తానూ కృష్ణుడూ వేర్వేరు కారు.ఇద్దరూ ఒకటే.ఒక్కటే అయిన అమితమైన ఆనందసముద్రంలో ఇద్దరూ కలసి కరిగిపోయారు.అప్పుడేమైంది?ఏమైందో తెలియడానికి 'తాను' అన్న స్పృహ విడిగా ఉంటేకదా?తానే కరిగి లేకుండా పోయినప్పుడు ఇక ఆ స్థితిలో ఎలా ఉంటుందో అర్ధం చేసుకునేవారెవరు?ఆ అనుభూతిని వివరించి చెప్పేవారెవరు?

అటువంటి దివ్యమైన ఆనంద సమాధిస్థితిలో మునిగి రాత్రంతా ఆ చీకట్లో ఆ చెరువునీళ్ళలో ఒళ్ళు తెలియని స్థితిలో ఆమె పడి ఉండిపోయింది.

తెల్లవారింది.

పొద్దున్నే చెరువు దగ్గరకు నీటికోసం వచ్చిన కొందరు స్త్రీలకు నీళ్ళలో పడి ఉన్న మృడాని శరీరం కనిపించింది.ఎవరో స్త్రీ నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుందని వారనుకున్నారు.కానీ పరిశీలించగా శ్వాస కొద్దిగా ఆడుతూ ఉన్నట్లు వారికి తోచింది.వెంటనే ఆమెను చేతులమీద ఇంటికి మోసుకుపోయి, ఉపచర్యలు చేసి ఆమెకు స్పృహ వచ్చేలా చేశారు ఆ స్త్రీలు.

కళ్ళు తెరిచిన మృడానిలో ఊహించని మార్పు వారికి కన్పించింది.ఆమెలో మునుపటి విషాదం లేదు.మునుపటి వైరాగ్యం లేదు. నిర్లిప్తతా, శూన్యదృక్కులూ లేవు.ఏదో తెలియని వెదుకులాట ఆ కళ్ళలో లేదు.వాటి స్థానంలో ఏదో తెలియని ఒక వెలుగూ,కారణం లేని ఒక చిరునవ్వూ, ఈ లోకానికి చెందని ఒక దర్పమూ,ఒక అమితమైన సంతృప్తీ వారికి దర్శనమిచ్చాయి.తను వెదుకుతున్న గమ్యాన్ని చేరుకున్న మనిషిలో ఉండే ఒక విధమైన నిండుదనమూ, ఒక విధమైన ప్రశాంతతా ఆమెలో వారికి కనిపించాయి.

ఆ రాత్రి ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి ఆమెను ఒక నూతన వ్యక్తిగా రూపుదిద్దింది.ఆ రాత్రితో ఆమె జీవితంలో ఒక క్రొత్త అధ్యాయం మొదలైంది. అప్పటివరకూ ఉన్న పాత మృడాని ఆ రాత్రితో మాయమై పోయింది.ఏదో తెలియని గమ్యంకోసం తపిస్తూ ఒక బిచ్చగత్తెలా దేశాలు పట్టుకుని తిరుగుతున్న పిచ్చిదాని స్థానంలో,విశ్వరహస్యాన్నీ మానవజీవిత గమ్యాన్నీ,అవగతం చేసుకున్న ఒక జ్ఞాని ఆవిర్భవించింది.ఆమె జీవితంలోనుంచి విషాదం శాశ్వతంగా అంతరించింది.దైవం కోసం ఆమె వెదుకులాట పరిసమాప్తమైంది.ఆమె జీవితం ధన్యమైపోయింది.

చదువరులారా! దైవదర్శనం పొందాలంటే ఎంతటి తపన ఉండాలో, ఎంతటి త్యాగం ఉండాలో, ఎంతటి నిర్మలమైన మనస్సు ఉండాలో అర్ధమైందా? ఊరకే తోచనప్పుడు కాసేపు గుడికి వెళ్లి అక్కడకూడా లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ,మన చెత్త కోరికలతో దైవాన్ని విసిగిస్తూ, మనం హుండీలో వేసే డబ్బులు అందరూ గమనిస్తున్నారో లేదో అని పక్కచూపులు చూచే మనం,ఇలాంటి పరమనీచ స్థితిలో ఉండికూడా చాలా గొప్ప భక్తులమని భావించుకుంటూ అహంకారంతో విర్రవీగే మనం, నిజానికి ఆ పదానికి తగుదుమా? అసలు మనం ఏంటని భగవంతుడు మన దగ్గరకు రావాలి? అలాంటి అవసరం ఆయనకు ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకోండి.

గౌరీమా వంటి మహనీయుల జీవితాలే మనకు నిజమైన గీటురాళ్ళు. నిజమైన భక్తులు ఎలా ఉంటారో,నిజమైన మహనీయులు ఎలా ఉంటారో ఇలాంటి మనుషులను చూచైనా కనీసం అర్ధం చేసుకోండి.

ఆ విధంగా బృందావనంలో కృష్ణ సాక్షాత్కారం పొందేసరికి ఆమెకు 22 ఏళ్ళు మాత్రమే.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక' - అంటూ పలికిన శ్రీరామకృష్ణుల అమోఘమైన నోటిమాట వృధాగా పోతుందా?

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 33 (గౌరీమా - ఊహాతీత తపోమయ జీవితం) "

30, జులై 2016, శనివారం

Hoton Se Chulo Tum - Jagjit Singh



Hoton Se Chulo Tum Mera Geet Amar Kardo...

అంటూ జగ్జీత్ సింగ్ మధురంగా ఆలపించిన ఈ ఘజల్ Prem Geet అనే సినిమాలోనిది. ఈ సినిమా 1981 లో వచ్చింది.ఇది ఎప్పటికీ గుర్తుండే క్లాసిక్ ఘజల్ గా నిలిచిపోయిన మధురగీతం.

ఈ పాటను జగ్జీత్ సింగ్ ఎంత అద్భుతంగా పాడాడో చెప్పలేము. ఆయనంత గొప్పగా పాడలేకపోయినా నా చేతనైనంతలో పాడటానికి ప్రయత్నం చేశాను.నా అభిమానులకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను.

ఈ మధురగీతాన్ని నా గళంలో కూడా వినండి మరి.

Movie:--Prem Geet (1981)
Lyrics:--Indeevar
Music and Singer:-- Jagjit Singh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------
Hmm hmm hmm hmm
[Hoton se chulo tum – mera geet amar kardo]-2
Ban javo meet mere – meri preet amar kardo
Hoton se chulo tum – mera geet amar kardo

Na umr ki seema ho – na janm kaho bandhan-2
Jab pyar kare koyee – To dekhe keval mann
Nayee reet chalakar tum - ye reet amar kar do
Ye reet amar kardo - mera geet amar kardo

[Aakaash ka soona pan – mere tanha mann me] - 2
Paayal jhankaathee tum – aajavo Jeevan me
Saase dekar apnee – Sangeet amar kardo
Sangeet amar kardo – Mera geet amar kardo
Hotose chulo tum mera geet amar kardo

[Jagne cheena mujhse – mujhe jo bhi lagaa pyaara] - 2
Sab jeetha kiye mujhse – Mai har dam hee haara
Tum haar ke dil apna – meri jeet amar kardo – 2
Hoton se chulo tum – mera geet amar kardo
Ban javo meet mere – meri preet amar kardo

Meaning

Kiss my song with your lips
Make it immortal
Be my love
and make my love immortal

Love knows no age
nor it knows family bonds
When some one loves
He looks only at the mind (soul)
By carving a new trend
make that trend immortal

My thirsty mind
is full of aloneness of the sky
with the jingling of your anklets
Step into my life
By giving your breath, make my music immortal
Make music immortal, make my song immortal

This world took away from me
whatever I loved dearly
Everyone won over me
and I was defeated always
You lose your heart to me
and make my victory immortal

Kiss my song with your lips
Make it immortal
Be my love
and make my love immortal

తెలుగు స్వేచ్చానువాదం

నీ పెదవులతో ముద్దాడి
నా పాటను చావులేనిదిగా చెయ్యవూ
నా ప్రేయసిగా మారి
నా ప్రేమను అమరం చెయ్యవూ

ప్రేమకు వయసుతో సంబంధం లేదు
దానికి కులగోత్రాలూ తెలియవు
ఎవరైనా నిజంగా ప్రేమిస్తే
అవతలి వ్యక్తి యొక్క ఆత్మనే చూచి ప్రేమించాలి
ఒక కొత్త పంధాను సృష్టించి
దానిని అమరం చెయ్యవూ

దాహంతో నిండిన నా మనస్సులో
ఆకాశపు ఒంటరితనం నిండి ఉంది
నీ కాలిమువ్వల చిరుసవ్వడితో
నా జీవితంలో అడుగు పెట్టవూ
నీ శ్వాసను నింపి నా సంగీతాన్ని అమరం చెయ్యవూ
నా పాటను అమరం చెయ్యవూ

నేను ప్రేమించిన ప్రతిదానినీ
ఈ ప్రపంచం నానుంచి లాగేసుకుంది
ప్రతివారూ నానుండి గెలుచుకున్నారు
నేను ప్రతిచోటా ఓడిపోయాను
నీ హృదయాన్ని నాకు కోల్పోయి
నా విజయాన్ని అమరం చెయ్యవూ

నీ పెదవులతో ముద్దాడి
నా పాటను చావులేనిదిగా చెయ్యవూ
నా ప్రేయసిగా మారి
నా ప్రేమను అమరం చెయ్యవూ...
read more " Hoton Se Chulo Tum - Jagjit Singh "

27, జులై 2016, బుధవారం

IAF -32 విమానం ఏమైంది? - ప్రశ్న శాస్త్రం ఏమంటోంది?

మొన్న శుక్రవారం నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం IAF - 32 చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళుతూ మధ్యలో మాయమై పోయింది. అందులో 29 మంది మనుషులున్నారు. ఇప్పటివరకూ దీని జాడా జవాబూ లేవు. ఇది ఏమైందో ఎక్కడుందో ప్రశ్న శాస్త్ర సహాయంతో చూద్దాం.

ఈరోజు ఉదయం 10.59 కి ప్రశ్నను చూడటం జరిగింది.ఆ సమయానికి వేసిన చార్ట్ పైన ఇస్తున్నాను.

ద్విస్వభావ లగ్నం ఉదయిస్తూ విషయంలో ఉన్న సందిగ్ధతను సూచిస్తున్నది.మన:కారకుడైన చంద్రుడు లగ్నాత్ అష్టమంలో ఉంటూ నాశనాన్ని సూచిస్తున్నాడు.అంటే ఈ విమానం నాశనమై పోయింది,ఇందులోని ప్రయాణీకులు అందరూ చనిపోయారన్న సూచనను చంద్రుడు ఇస్తున్నాడు.

చంద్రుడు అశ్వనీ నక్షత్రంలో ఉండి కేతుప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు.అంటే, హటాత్తుగా జరిగిన మాయవంటి ఒక సంఘటన వల్ల ఈ విమానం దారితప్పి అదృశ్యం అయిందని అర్ధమౌతోంది.

ఈరోజు బుధవారం. లగ్నం బుధునిదైన కన్య అయింది.విమానం నంబరు కూడా 32=5 అవుతూ బుధుడినే సూచిస్తున్నది. లగ్నాధిపతి బుధుడు ఖచ్చితమైన రాశిసంధిలో పడి ఉన్నాడు.ఈ రాశిసంధి కర్కాటక సింహ రాశుల మధ్యలో ఉన్నది.అంటే జలతత్వ అగ్నితత్వ రాశుల మధ్యలో ఉన్నది.అంటే ఈ విమానం నీళ్ళలో కూలిపోయి మంటల్లో కాలిపోయిందని అర్ధం. బుధుడు బుద్ధి కారకుడు గనుక, ఏం చెయ్యాలో దిక్కు తెలియని పరిస్థితిలో పైలట్ పడిపోయాడని, అతని బుద్ది అయోమయానికి లోనైనదని తెలుస్తున్నది.

ప్రశ్న సమయానికి సూర్యహోర ఉదయిస్తున్నది.సూర్యుడు అగ్నితత్వ గ్రహం.ఈయన జలతత్వ రాశి అయిన కర్కాటకంలో ఇంకొక జలతత్వ గ్రహమైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఆరూఢలగ్నం కూడా ఇదే అయింది.కనుక విమానం నీటిలో జలసమాధి అయిందని రూడిగా తెలుస్తున్నది.

విక్రమస్థానంలోని శనికుజుల వల్ల,ఈ విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం క్లియర్ గా కనిపిస్తున్నది.శనికుజుల కలయిక యాక్సిడెంట్లను ఇస్తుందని గతంలో లెక్కలేనన్ని సార్లు ఉదాహరణలతో సహా నిరూపించి ఉన్నాను.వీరిద్దరూ మళ్ళీ జలతత్వ రాశిలో ఉండటం వల్ల యాక్సిడెంట్ జరిగి జలసమాధి అవడం సూచితం అవుతున్నది.అలాగే లగ్నాధిపతి బుధుని రాశిసంధి స్థితివల్ల విమానం ఫిట్ కండిషన్ లో లేదని అర్ధమౌతున్నది.

సూర్యుడు తూర్పుదిక్కుకు అధిపతి.శుక్రుడు ఆగ్నేయానికి అధిపతి.కనుక ఈ విమానం బయలుదేరిన చోటినుంచి తూర్పు ఆగ్నేయ దిక్కులో పడి ఉన్నదని అర్ధమౌతున్నది.

ఇప్పుడు నవాంశ చక్రాన్ని పరిశీలిద్దాం.

నవాంశలో జలతత్వ రాశి అయిన కర్కాటక లగ్నం ఉదయిస్తున్నది.జలతత్వ గ్రహమైన చంద్రుడు అక్కడే ఉన్నాడు.వక్రించి ఉన్న శనీశ్వరుని కోణదృష్టి చంద్రుని మీద ఉన్నది.ఆ శనీశ్వరుడు సప్తమ మారక,అష్టమ నాశన భావాలకు అధిపతిగా ఉండి, మళ్ళీ నాశనాన్నే సూచిస్తున్నాడు.అష్టమ భావంలో విమానాలకు సూచకుడైన శుక్రుడు (మళ్ళీ ఇంకొక జలగ్రహం) ఉండి ఈ విమానం నీళ్ళలో కూలిపోయిందని తెలియజేస్తున్నాడు.

చతుర్ధంలోని రవి రాహువుల వల్ల ఈ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిసిపోతున్నది.అందులోనూ కుటుంబ స్థానాదిపతిగా రవి నీచలో ఉన్నాడు.కనుక విమాన వ్యవస్థలో అంతర్గత లోపాలు ఖచ్చితంగా ఉన్నాయని తెలుస్తున్నది.రవి గుండెకాయకు సూచకుడు గనుకా, ఆ రవి నీచస్థితిలో ఉన్నాడు గనుకా, విమానానికి గుండెకాయ అంటే ఇంజనే గనుకా, ఈ విమానం ఇంజన్లు సరియైన కండిషన్ లో లేవని స్పష్టంగా తెలుస్తున్నది.

కనుక,పై విశ్లేషణను బట్టి ఈ విమానం ఫిట్ కండిషన్ లో లేదనీ, సాంకేతిక వ్యవస్థలో లోపాలున్నాయనీ,అందువల్ల గాలిలో ఉండగానే ప్రమాదానికి గురైన ఈ విమానం ముక్కలు ప్రస్తుతం సముద్రపు అడుగు భాగంలో చేరుకొని ఉన్నట్లు మనం ఊహించవచ్చు.

అంతేగాక, లగ్నాధిపతి అయిన బుధుడు ఏకాదశస్థానాన్ని వదలి ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉండటాన్ని బట్టి, విమానం ముక్కలు సముద్రంలో పడినచోట లేకుండా స్థానభ్రంశం చెందుతూ ఉన్నాయనీ, బయలుదేరిన ప్రదేశానికి దగ్గరగా కదులుతూ వస్తున్నాయనీ ఊహించవచ్చు.

ఈ ప్రదేశం ఎక్కడుందో జ్యోతిశ్శాస్త్ర సాయంతో లెక్కిద్దాం.

లగ్నం కన్య - 23 డిగ్రీలు.
దుర్ఘటనా స్థలం - శని నక్షత్రంలో ఉన్న కుజుడు
కుజుని స్థితి - వృశ్చికం 3 డిగ్రీలు.
రెంటి మధ్య దూరం - 40 డిగ్రీలు.
దీనిని శని అంకె అయిన 8 చేత హెచ్చించగా 40x8=320 అవుతుంది.
కనుక తీరం నుంచి దాదాపు 320 కి.మీ దూరంలో తూర్పు ఆగ్నేయ దిక్కుగా సముద్రంలో వెదికితే ఫలితం ఉంటుంది.

వెదుకులాట జరుగుతోంది.

చూద్దాం ఏం బయట పడుతుందో?
read more " IAF -32 విమానం ఏమైంది? - ప్రశ్న శాస్త్రం ఏమంటోంది? "

26, జులై 2016, మంగళవారం

శ్రీవిద్యా రహస్యం E Book ఈరోజు రిలీజైంది

నాచే వ్రాయబడిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం రిలీజై ఒకటిన్నర ఏళ్ళయింది. అప్పటినుంచీ చదివిన ప్రతివారినీ ఇది మంత్రముగ్ధులను చేసింది.ఇంకా చేస్తున్నది.ఇది చదివి ఎందఱో నాకు అభిమానులుగా మారారు.చాలామంది శిష్యులుగా మారి నిజమైన ఆధ్యాత్మిక పధంలో నడుస్తున్నారు.అయితే, ఈ పుస్తకాన్ని E Book రూపంలో కూడా విడుదల చెయ్యమని చాలామంది చాలారోజులనుంచీ నన్ను కోరుతున్నారు. ఆపని ఇప్పటికి అయింది.

తిధుల ప్రకారం ఈరోజు నా పుట్టినరోజు గనుక నేటి రోజున శ్రీవిద్యారహస్యం E Book రిలీజ్ చేస్తున్నాను. Google play books నుంచి "ఈ పుస్తకాన్ని" పొందవచ్చు. సైడ్ బార్ లో వస్తున్న పుస్తకం బొమ్మ మీద క్లిక్ చేసి కూడా ఈ పుస్తకాన్ని పొందవచ్చు.

పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకోలేని దూరదేశాలలో ఉన్న వారికి 'E - Book' చాలా ఉపయోగంగా ఉంటుంది.

త్వరలో 'తారాస్తోత్రం', 'లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక', 'దక్షిణేశ్వర మహాత్యం, 'శ్రీరామకృష్ణ సుధాలహరి', '300 Live Charts-Astro analysis in a most comprehensive way' మొదలైన నా మిగిలిన పుస్తకాలు కూడా 'ఈ బుక్స్' గా విడుదల చేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
read more " శ్రీవిద్యా రహస్యం E Book ఈరోజు రిలీజైంది "

22, జులై 2016, శుక్రవారం

Barkha Rani Zara Jamke Barso - Mukesh






ఈరోజు మధురగాయకుడు ముకేష్ జన్మదినం.


ముకేష్ చంద్ర మాధుర్ (ముకేష్) పాడినవి అనేక మధుర గీతాలున్నాయి.వాటిల్లోంచి ఏ పాట పాడదామా అని ఆలోచిస్తుంటే,' ప్రస్తుతం వర్షాకాలమేగా? వర్షాలు పడినా పడకపోయినా, ఆయన పాడిన ఒక మాంచి రొమాంటిక్ వానపాట ఉన్నది పాడతావా? సీజనూ మూడూ రెండూ కలిసొస్తాయి?' అంటూ చిలిపిగా అడిగింది కర్ణపిశాచి.

సాధ్యమైనంత సీరియస్ గా దానివైపో సారి చూచి - 'సరే అలాగే' అంటూ 'మరి ట్రాకో?' అన్నా ముక్తసరిగా. దానితో ఎక్కువ మాట్లాడకూడదు. మాటలు పొడిగిస్తే లేనిపోని తంటా వస్తుంది.

'ఇదుగో ఇప్పుడే క్షణంలో తెస్తా' అంటూ మాయమై పోయి అన్నట్లుగా ఒకే ఒక్క క్షణంలో ట్రాక్ తో వచ్చి ప్రత్యక్షమైంది కర్ణపిశాచి.ట్రాక్ రెడీగా ఉంటే మనం పాడటం ఎంతసేపు? ఒరిజినల్ ఒక్కసారి వినేశా. పాడేశా.

'వర్ష' అనే సంస్కృత పదానికి అపభ్రంశ రూపమే 'బర్ఖా'. అయితేనేం ఆ మాట కూడా మధురంగానే ఉంటుంది.

ఈ పాట అలా వచ్చిందన్నమాట.

బర్ఖా రానీ జరా జం కే బర్సో మేరా దిల్ బర్ జాన పాయే ఝూం కర్ బర్సో..

అంటూ ముకేష్ స్వరంలో మధురంగా పలికిన ఈ పాట SABAK అనే సినిమాలోది.ఈ సినిమా 1973 లో వచ్చింది.

వర్షాకాలం అనేది అతి ప్రాచీనకాలం నుంచీ కూడా ప్రేమకాలంగా కవులచేత వర్ణించబడుతూ వచ్చింది.ఇది మనకు జూన్ జూలై నెలలలో వస్తుంది.కాళిదాసు అంతటివాడే తన అమరకావ్యమైన 'మేఘదూతం'లో వర్షాకాలపు ప్రేమికుల విరహవేదనను మధురాతి మధురంగా వర్ణించాడు.

ఈ పాట రెండు చరణాల చిన్న పాటే.కానీ దీని భావం చాలా మనోజ్ఞమైనది.అందులోనూ దీనికి సావన్ కుమార్ తాక్ ఇచ్చిన సాహిత్యమూ, ఆ సాహిత్యానికి ఉషాఖన్నా ఇచ్చిన రాగమూ, దానిని ముకేష్ పాడిన తీరూ కలసి ఈ పాటను  ఒక మరపురాని మధురగీతంగా మలిచాయి.

అప్పట్లో ఈపాట ఒక సూపర్ హిట్ సాంగ్.

ఈ పాట మహత్యమో ఏమో గాని, దీనిలో నటించిన శత్రుఘ్న సిన్హా, పూనం ధిల్లాన్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.అలాగే - ఈపాటను వ్రాసిన సావన్ కుమార్, సంగీతం సమకూర్చిన ఉషా ఖన్నా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఆ విధంగా ఈ పాట నిజంగానే ఒక రొమాంటిక్ సాంగ్ గా నిలిచింది.

ఈ పాటను ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన జుగల్ కిషోర్,జయశ్రీల మీద మొదటగా చిత్రీకరించారు.కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో, మళ్ళీ ఒక వానపాటగా శత్రుఘ్న సిన్హా, పూనం ల మీద చిత్రీకరించారు.

అయితే, శత్రుఘ్నసిన్హా నిజంగా ప్రేమించిన వర్షరాణి - భార్యయైన పూనం కాదు.ప్రేయసి అయిన రీనారాయ్ అని చాలామంది అంటారు.నిజానిజాలు దేవుడికెరుక.మనకు తెలీదు.

పోతే - ఈ పాటను వింటేనే బాగుంటుంది. వీడియో చూస్తే అస్సలు బాగుండదు.

వీడియో చూడకుండా ఈ పాటను వింటే, ఒక చక్కని సీన్ మన మనసు ముందు సాక్షాత్కరిస్తుంది.

ప్రియుని ఇంటికి ప్రేయసి ఏదో పనిమీద వచ్చింది.వెంటనే వెళ్ళిపోతానని అంటోంది. కానీ ఆమె అలా వెళ్ళిపోవడం అతనికి ఇష్టం లేదు.తనతోనే ఉండిపోవాలని అతని బాధ.ఇంతలో వర్షం మొదలైంది.వర్షాన్ని చూచిన ప్రేయసి, తడుస్తూ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక, అక్కడే కూచుండి పోయింది. ఇదీ ఈ పాట వెనుక ఉన్న భావం.

వెంటనే వర్షరాణిని వేడుకోవడం మొదలు పెట్టాడు ప్రియుడు.

'నువ్వు ఆపకుండా అలా కురుస్తూనే ఉండు.ఈ వర్షంలో తడవడం ఇష్టంలేక నా ప్రేయసి నాతోనే ఎప్పటికీ ఉండిపోతుంది' అంటాడు. "యూ బరస్ బరసో బరస్ ఏ ఉమ్ర్ భర్ నా జాయెరే.."--అంటాడు.

కవులకు భలేభలే భావాలు కలుగుతాయి. ఎలా వ్రాస్తారో ఏమో?

ఈ పాటను ఏకాగ్రతగా వింటే మంచి ఫీల్ వస్తుంది. కానీ సినిమాలో చూస్తే మాత్రం ఆ ఫీల్ అంతా పోయి పరమ దరిద్రంగా అనిపిస్తుంది. ఈ పాటను మంచి సెట్టింగ్ లో ఎంత రొమాంటిక్ గా తియ్యవచ్చో? కానీ చండాలంగా ఒక మామూలు సాదాసీదా వానపాటగా చిత్రీకరించారు.

ఏం చేస్తాం? సినిమా పాటలలో చాలావరకూ ఇలాగే ఏడుస్తాయి.భావంలో గాని రాగంలో గాని పాట చాలా అద్భుతంగా ఉంటుంది.కానీ చిత్రీకరణలోకి ఆ భావాన్ని తేవడంలో మాత్రం ఫెయిల్ అవుతారు.ఇలాంటి పాటను అద్భుతంగా తియ్యాలంటే,దర్శకునికీ కెమెరా మాన్ కీ, చాలా మంచి రొమాంటిక్ టేస్ట్ ఉండాలి.కానీ చాలాసార్లు అవి ఉండవు. అందుకే,ఇలాంటి పాటలను విని ఆనందించాలేగాని చూడకూడదు.

మొత్తంమీద చాలా మంచిసాంగ్.

ఏడుపు పాటలే పాడగలడు అనుకునే ముకేష్ ఒక అద్భుతమైన ప్రేమభావాన్ని కూడా తన స్వరంలో చక్కగా పలికించగలడు అని నిరూపించిన పాట.

ముకేష్ జన్మదినం రోజున,  నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--SABAK (1973)
Lyrics:--Sawan Kumar Tak
Music:--Usha Khanna
Singer:--Mukesh Chandra Madhur aka MUKESH
Karaoke Singer:--Satya Narayana Sarma aka SATYA
Enjoy
----------------------------------------
[Barkha rani - Zara jam ke barso
Mera dilbar jaa na paaye - Jhumkar barso
Barkha rani] – 2

Ye abhi to aaye hai - Kahate hai ham jaae hai]-2
Yun baras baraso baras - Ye umr bhar na jaaye re
Barkha rani - Zara jam ke baraso
Mera dilabar jaa na paye - Jhumakar baraso
Barkha rani

Mast sawan kee ghata - Bijuriya chamka zara]-2
Yaar mera dar ke mere - Seene se lag jaaye re
Barkha rani - Zara jam ke barso
Mera dilbar jaa na paye - Jhumkar barso
Barkha rani] – 2

Meaning

Oh Rain queen
Just pour down left and right
Don’t let my sweetheart go home
Pour down more and more heavily

She has come just now
And says –‘I want to go home’
You keep raining for years and years
So that she cannot leave me for her lifetime

Oh dark monsoon clouds
You send out streaks of dazzling lightning
So that, my darling, frightened by your thunders
Rushes to my bosom and hugs me tight

O Rain queen
Just pour down left and right
Don’t let my sweetheart go home
Pour down more and more heavily

తెలుగు స్వేచ్చానువాదం

ఓ వర్ష రాణీ, ఇంకా గట్టిగా కురువు
నీ ధాటి చూచి నా ప్రేయసి ఇంటికి వెళ్ళలేక
నాతోనే ఉండిపోవాలి

తను ఇప్పుడే వచ్చింది
వెంటనే వెళ్ళిపోతానని అంటోంది
ఏళ్ళ తరబడి నువ్విలా కురుస్తూనే ఉండు
జీవితమంతా నా ప్రేయసి నాతో ఇలాగే ఉండిపోవాలి

ఓ వర్షాకాలపు మేఘాల్లారా
ఇంకా గట్టిగా మెరిసి ఉరమండి
ఆ ఉరుములు విని నా ప్రేయసి బెదిరిపోయి
నా ఛాతీపైన వాలిపోవాలి

ఓ వర్ష రాణీ, ఇంకా గట్టిగా కురువు
నీ ధాటి చూచి నా ప్రేయసి ఇంటికి వెళ్ళలేక
నాతోనే ఉండిపోవాలి...
read more " Barkha Rani Zara Jamke Barso - Mukesh "

రెండేళ్ళ క్రితం చెప్పిన జ్యోతిషం ఇప్పుడు అక్షరాలా నిజమౌతోంది

జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం.మనిషి జీవితంలోనే గాక,ప్రపంచంలో కూడా ముందు ముందు ఏమేం జరుగుతుంది?అన్న విషయాన్ని చెప్పగలిగేది ఈ ఒక్క శాస్త్రం మాత్రమే.అయితే దీనిని శుద్ధంగా నేర్చుకోవాలి.ఉపాసనా పూర్వకంగా నేర్చుకోవాలి.అప్పుడు అది ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి.ఇందులో ఏమీ అనుమానం లేదు.

నేను సెప్టెంబర్ 2014 లో 'రోహిణీ శకట భేదనం' అనే పోస్ట్ లు వ్రాస్తూ ఆ సీరీస్ చివరి పోస్ట్ లో ఎర్రని అక్షరాలతో ఇలా వ్రాశాను.
  • మార్చి-సెప్టెంబర్ 2016 ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే,ఒకటిన్నర నెల వ్యవధిలో రాశి మారే కుజుడు,ఆసమయంలో మాత్రం దాదాపు ఆరునెలల కాలం స్తంభన,వక్ర స్థితులలోకి ప్రవేశిస్తూ వృశ్చికంలో ఉన్న శనీశ్వరునితో కలసి ఉండబోతున్నాడు.ఆ సమయంలో వారిద్దరి భయంకరమైన సప్తమదృష్టి వృషభం మీద పడుతున్నది.కన్యారాశిలో ఉన్న రాహువు యొక్క పంచమదృష్టి కూడా ఆ సమయంలో వృషభం మీద పడుతున్నది.కనుక ఇదొక భయంకరమైన Compounding effect ను సృష్టించబోతున్నది.కాబట్టి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకర దుర్ఘటనలు ఖచ్చితంగా జరుగబోతున్నాయని నేను ఈరోజు(ఒకటిన్నర సంవత్సరం ముందుగా) చెబుతున్నాను.కావలసిన వారు వ్రాసి పెట్టుకోండి.అవి జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
ఆ పోస్ట్ లింక్ ఇక్కడ ఇస్తూ,ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రిడిక్షన్ ను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. కావాలంటే ఆ పోస్ట్ ను ఇక్కడ చూడండి.


గత కొన్ని నెలలుగా గమనిస్తున్నారా?ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని జరుగుతున్నాయో? ఏదో ఒక పెద్ద దుర్ఘటన జరగకుండా ఈ మధ్యలో ఒక్కరోజు కూడా ప్రపంచం ముందుకు కదలడం లేదు.

ఇస్లామిక్ ఉగ్రవాద రాక్షసి ప్రపంచానికే పీడగా తయారైంది.దీని ఫలితంగా ఇంకొక పోస్ట్ లో వ్రాసినట్లు, కొన్ని దేశాల మధ్యన ఏకంగా యుద్ధ వాతావరణమే మొదలైంది.

ఈరోజున అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఈ పీడను వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్ధమౌతుంది.నిజానికి వాళ్ళు మాత్రమే దీనిని నిర్మూలనం చెయ్యగలరు.దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా మన ప్రభుత్వాల నయవంచన వల్ల ఇది మన సమాజంలో బాగు చెయ్యలేనంత స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు అమెరికాకు కూడా పెద్ద తలనొప్పిగా తయారౌతోంది.

ఒకవేళ ట్రంప్ గనుక అమెరికా అధ్యక్షుడైతే ఖచ్చితంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తాడు.దాని ఫలితంగా వారు అమెరికాను ఎదుర్కోలేక, అక్కడనుంచి బిచాణా ఎత్తేసి ఆసియాలోని ఇతర చిన్న దేశాలలో తమ కార్యకలాపాలు ముమ్మరం చేస్తారు. ఇప్పుడు మనం అమెరికాకు స్నేహితులం గనుక,పాకిస్తాన్ కు శత్రువులం గనుక, వారు అమెరికాను ఏమీ చెయ్యలేరు గనుక,మనదేశంలో లా అండ్ ఆర్డర్ పూర్ గనుక, ఆ కసితో ఖచ్చితంగా మన దేశంలో ఇంకా విధ్వంసాలు సృష్టిస్తారు. ముందు ముందు ఇది జరగడం మీరు కళ్ళారా చూడబోతున్నారు.దానికి కేంద్ర బిందువులు దక్షిణాదిన హైదరాబాద్, కేరళ, కర్నాటకలు కాబోతున్నాయి.

ఈ విధంగా రెండేళ్ళ క్రితం చెప్పిన దుర్ఘటనలన్నీ ఇప్పుడు అక్షరాలా జరుగుతున్నాయి. ముందు ముందు ఇంకా జరుగుతాయి.

దీనిని బట్టి చూస్తే, జ్యోతిష్యశాస్త్రం అనేది ఎంత గొప్ప విజ్ఞాన భాండాగారమో ఇప్పుడైనా అర్ధమౌతోందా మీకు?
read more " రెండేళ్ళ క్రితం చెప్పిన జ్యోతిషం ఇప్పుడు అక్షరాలా నిజమౌతోంది "

21, జులై 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 32 (గౌరీమా అద్భుత జీవితం: పురుషుడా - పురుషోత్తముడా?)

తన సాధనకు ఇంట్లో భార్యనుంచి సహకారం లేదని చెప్పి బాధపడిన ఒక భక్తునితో శ్రీ రామకృష్ణులు ఇలా అంటారు.

'సాధనలో నీకు నిజంగా నిజాయితీ ఉంటే,నీ మనస్సు శుద్ధమైనదే అయితే - అన్నీ కాలక్రమేణా సర్దుకుంటాయి.నీకు సరిపోయే విధంగా అన్ని పరిస్థితులనూ అమ్మే సరిదిద్దుతుంది.నీ బాధను ఒదిలి పెట్టి సంతోషంగా నీ సాధనను కొనసాగించు. పరిస్థితులు ఎలా మారుతాయో నువ్వే చూస్తావు.'


ఈ మాటలు అక్షరాలా నిజాలు. ఇవి ఈనాటికీ అనేక మంది నా శిష్యుల జీవితాలలో నిజం కావడం నేను కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే,ముందే చెప్పినట్లుగా, మనలో నిజాయితీ చిత్తశుద్ధి అనేవి ఉన్నప్పుడు దైవం మనకు తప్పకుండా సాయం చేస్తుంది.అనేక రకాలైన అనుకూల పరిస్థితులను మనకోసం కల్పిస్తుంది.ఆ పరిస్థితులనేవి మనం ఊహించలేనట్లుగా ఉంటాయి.ఒక్క రోజులో మన జీవితం మొత్తం మారిపోతుంది.


గౌరీమాకు కూడా అలాగే జరిగింది.


భక్తునికి ఎప్పుడూ కూడా దైవం యొక్క మనోహరమైన రూపం కావాలి.ఒక జ్ఞానిలాగా, రూపరహితమైన తత్త్వం మీద భక్తుడు ఎప్పుడూ దృష్టి పెట్టడు. సుందరమూ, మనోహరమూ, ఆనంద స్వరూపమూ అయిన దైవం యొక్క రూపాన్నే అతడు నిత్యమూ ధ్యానిస్తాడు.ఎందుకంటే భక్తుని మనస్సు రసహీనం కాదు. అది రసమయం.తన సమస్త ఇంద్రియాలతోనూ అతడు భగవదానందాన్ని గ్రోలాలని వాంఛిస్తాడు.


శ్రీరామకృష్ణుల నుండి దీక్షా స్వీకారం చేసిన కొద్ది రోజులలో మృడానికి ఇంకొక అనుభవం కలిగింది.


గౌరీమా తల్లిదండ్రులు ఉత్తమ గృహస్థులు గనుక ఎప్పుడూ వారి ఇంట్లో ఎవరో ఒక సంచార సాధువులు కొన్నాళ్ళ పాటు ఉండి, ఆశ్రయం తీసుకుని,ఆ తర్వాత వారి దారిన వారు పోతూ ఉండేవారు.


ఆ విధంగా వారి ఇంటికి ఉన్నట్టుండి ఒక సన్యాసిని వచ్చి చేరుకుంది.ఆమె కృష్ణ భక్తురాలు.ఆమె దగ్గర ఒక దామోదర సాలగ్రామం ఉండేది.అదే ఆమె సర్వస్వం.అదే ఆమె ఆస్తి.అది ఆమె దగ్గరకు ఎలా వచ్చిందో తెలియదు. ఆ సాలగ్రామ శిలను ఆమె ఎంతో భక్తిగా రోజూ పూజ చేస్తూ ఆరాధిస్తూ ఉండేది. అది సాక్షాత్తూ కృష్ణస్వరూపమే. కృష్ణుడే తనతో ఉన్నట్లుగా ఆ సాధ్వి భావిస్తూ ఆ శిలను ఆరాధిస్తూ ఉండేది.అలా ఆమె ఎన్నేళ్ళ నుంచీ చేస్తున్నదో మనకు తెలియదు.


ఆ విధంగా కొన్నాళ్ళు వీరి ఇంట్లో ఉండి తన దారిన తాను పోయే ముందురోజు రాత్రి ఆమెకు నిద్రలో ఒక స్వప్నం వచ్చింది.


ఆ స్వప్నంలో - అమిత అందంగా ఉన్న ఒక పదేళ్ళ నల్లని పిల్లవాడు సిగలో నెమలి పించం ధరించి చేతిలో పిల్లనగ్రోవితో ఆమె ఎదురుగా కనిపించాడు.అతని చుట్టూ అద్భుతమైన కాంతి పరివేషం వెలుగుతున్నది.అతని సమక్షంలో మధురమైన ఓంకారనాదం అలలు అలలుగా ప్రతిధ్వనిస్తున్నది.ఆ పిల్లవాడిని చూస్తూనే ఆమె కలలోనే పరవశించి పోయింది. అప్రయత్నంగా చేతులెత్తి ప్రణామం చేసింది. కలలోనే ఆమెకు ఆనందబాష్పాలు కారిపోతున్నాయి.ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది కానీ ఏమీ మాట్లాడలేకపోతోంది.కదలాలని అనుకుంటోంది.కానీ కదలలేక పోతోంది.అంతకంటే ఏమీ చెయ్యలేని స్థితిలో నిశ్చేష్టురాలై అతన్నలా చూస్తూ ఉండిపోయింది.


అప్పుడా పిల్లవాడు మృదు మధురమైన తన స్వరంతో ఇలా అన్నాడు.

'చూడు.ఇన్నాళ్ళూ నన్ను చక్కగా చూచుకున్నావు. నేను సంతోషించాను.ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరకు పోవాలనుకుంటున్నాను. నన్ను ఆ అమ్మాయికి ఇచ్చెయ్యి. నేను నీ దగ్గర లేనని అనుకోకు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను.ఈ శిలారూపంలో నీ వద్ద లేకపోయినా ఎల్లప్పుడూ నీ మనస్సులోనే నేను కొలువుంటాను.కనుక ఏ సంకోచమూ పెట్టుకోకుండా నన్ను ఆ అమ్మాయికి అప్పగించు.నాకు ఆ అమ్మాయి దగ్గర ఉండాలని ఉంది.'

'ఏ అమ్మాయికి నిన్ను ఇవ్వాలి?' అన్న సంశయం నిద్రలోనే ఆ సన్యాసినికి ఆలోచనారూపంలో కలిగింది.

లోకాలనన్నిటినీ వెలిగిస్తున్న ఒక చిరునవ్వును నవ్వాడు ఆ పిల్లవాడు.

అలా నవ్వుతూ పిల్లనగ్రోవిని పట్టుకున్న తన చెయ్యిని సాచి  ఒక వైపుగా చూపించాడు.

ఆ దిక్కుగా చూచిన సన్యాసినికి,  నిద్రపోతున్న మృడాని కనిపించింది.

కల చెదిరిపోయింది.

మర్నాడు ఉదయమే తన దారిన తను బయలుదేరి వెళ్ళడానికి సిద్ధమౌతూ,మృడానిని తన దగ్గరకు రమ్మని పిలిచింది ఆ సన్యాసిని.

మృడాని ఆమె దగ్గరకు వచ్చింది.

దామోదర సాలగ్రామాన్ని తన రెండు దోసిళ్ళ మధ్యన జాగ్రత్తగా పట్టుకుని ఉన్నది ఆ సన్యాసిని.ఆమె చేతులు రెండూ వణుకుతున్నాయి.ఆమె కనుల నుంచి నీళ్ళు ధారలుగా కారి చెంపలను తడిపేస్తున్నాయి. గద్గద స్వరంతో ఆమె ఇలా అన్నది.

'చూడు అమ్మాయీ ! ఇది ఉత్త రాయి కాదు. శక్తివంతమైన జాగృత దామోదర సాలగ్రామం.దీని విలువ అనంతం. ఇది సాక్షాత్తూ కృష్ణుడే.ఇది నీతో ఉండాలని కోరుకుంటోంది. కనుక దీనిని నీకిస్తున్నాను.నీ దగ్గర దీనిని భద్రంగా ఉంచుకో. ఇది నీతో ఉన్నంతసేపూ భగవంతుడే నీతో ఉన్నట్లు లెక్క.దీనిని జాగ్రత్తగా చూచుకో.'

ఇలా చెప్పి, ప్రతిరోజూ ఆ సాలగ్రామానికి ఏయే పూజలు చెయ్యాలో,ఎలా దానిని జాగ్రత్తగా చూచుకోవాలో వివరించి, ఆ సన్యాసిని తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆమె ఎవరో, ఆ తర్వాత ఏమై  పోయిందో ఎవరికీ తెలియదు.ఆమె మళ్ళీ వారింటికి తిరిగి రాలేదు.

శ్రీరామకృష్ణుని లీలలు చాలా అద్భుతంగా,చాలా ఊహాతీతంగా ఉంటాయి.

ఒక ఊహించని అద్భుతం జరిగినట్లుగా అవి ఉండవు. నిత్యజీవితంలో చాలా సాధారణంగా జరిగిన సంఘటనలలాగే అవి ఉంటాయి.అవి జరిగినప్పుడు అద్భుతాలని మనకు అనిపించవు కూడా.కానీ కొన్నేళ్ళ తర్వాత వెనక్కు తిరిగి చూచుకుంటే, ఆ అద్భుతాలు నిజంగా ఎంత అద్భుతమైనవో, వాటివల్ల మన జీవితాలలో ఎంతటి ఊహించలేని మార్పులు కలిగాయో, కలుగుతున్నాయో, అప్పుడర్ధమౌతుంది.

ఆయన చేసే అద్భుతాలు లౌకికమైనవి కావు.మనసును దైవోన్ముఖంగా మార్చేటట్లు అవి ఉంటాయి.వాటితో పోల్చుకుంటే 'పనులు కావడం, రోగాలు తగ్గడం' మొదలైన లౌకిక అద్భుతాలు అసలు అద్భుతాలే కావు.అవి చిల్లర గారడీలు.మనస్సును దైవోన్ముఖంగా మార్చడమూ జీవితాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడమే అసలైన అద్భుతం.

మృడాని జీవితంలో జరిగిన ఈ అద్భుతం కూడా అలాంటిదే.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక' అని శ్రీరామకృష్ణులు అనడమేమిటి? తర్వాత కొన్నాళ్ళకు రాసపూర్ణిమ రోజున ఆమే వెదుక్కుంటూ వెళ్లి అరటితోటలో ఉన్న ఆయన్ను కలుసుకుని దీక్షను పొందటం ఏమిటి? ఆ వెనువెంటనే శ్రీకృష్ణుని ప్రతిరూపమైన జాగృత దామోదర సాలగ్రామం ఆమెను వెదుక్కుంటూ రావడమేమిటి? అన్నీ చకచకా జరిగిపోయాయి.

శ్రీ రామకృష్ణుల చిన్నమాట కున్న శక్తి అది !! అది జీవితాన్నే మార్చేస్తుంది.


ఆ విధంగా కృష్ణరూపమైన సాలగ్రామం తనవద్దకు వచ్చినప్పటి నుంచీ మృడాని తదేక దీక్షతో దానిని ఆరాధిస్తూ,కృష్ణుని ధ్యానిస్తూ ఉండేది.


ఈ విధంగా కొన్నేళ్ళు గడిచిపోయాయి.


మృడానికి పదమూడేళ్ళు వచ్చాయి.అప్పట్లో ఆడపిల్లలకు పెళ్లి ఈడంటే అదే.ఇంకా చెప్పాలంటే అప్పటికే చాలా ఆలస్యం అయినట్లుగా ఆకాలంలో భావించేవారు.అప్పటికి పెళ్లి చెయ్యకపోతే ఇరుగూ పొరుగుల సూటీపోటీ మాటలూ బంధువుల దెప్పులూ,ఇంకా ఆలస్యమైతే వ్యక్తిత్వం మీద నిందలూ భరించవలసి వచ్చేది. అందుకని తల్లిదండ్రులు మృడానికి పెళ్లిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు.


చిన్నప్పటినుంచీ వైరాగ్య మనస్కురాలైన ఈ పిల్లకు పెళ్లి అంటే సుతరామూ ఇష్టం లేదు.తాను పెళ్లి చేసుకోనని తల్లితో తరచూ చెప్పేది.


కూతురి పోకడ చిన్నప్పటినుంచీ తెలిసినా, వయసులో ఉన్న పిల్లలు మామూలుగా మాట్లాడే చపల సంభాషణగా ఆ మాటలను భావించి తల్లి పెద్దగా పట్టించుకునేది కాదు.వారి మానాన ఆ తల్లిదండ్రులు తమ కూతురికి సంబంధాలు చూస్తూ ఉండేవారు.


ఈ అమ్మాయి అభ్యంతరాలను ఏమీ పట్టించుకోకుండా,చివరకు ఈమె అక్కగారి భర్తయైన భోలానాద్ ముఖోపాధ్యాయ కు ఈమెనిచ్చి పెళ్లి చెయ్యాలని అందరూ కలసి నిశ్చయం చేశేశారు.ముహూర్తం కూడా పెట్టేశారు.


చివరకు పెళ్లి రోజు రానే వచ్చేసింది.


అప్పటిదాకా అక్కడే ఉన్న మృడాని ఉన్నట్టుండి మాయం అయిపోయింది.ఎంత వెదికినా ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలియడం లేదు.వెదుకగా వెదుకగా మారుమూల కొట్టుగది లోపలనుంచి గడియ పెట్టబడి కనిపించింది.

వాళ్ళింట్లో మారుమూల గది ఒకటి ఉండేది.దానిని సామాన్లు దాచే కొట్టుగదిగా వాడేవారు.
మృడాని పోయి ఆ గదిలో దూరి లోపలనుంచి తలుపు గడియ వేసేసుకుంది.తనతో బాటు తన కృష్ణుడిని (దామోదర సాలగ్రామాన్ని) తోడుగా ఉంచుకుంది.

ఎవరు ఎన్ని రకాలుగా తలుపు కొట్టినా బతిమాలినా భయపెట్టినా ఆ పిల్ల తలుపు తియ్యడం లేదు.చివరకు అందరూ కలసి ఆమె తల్లియైన గిరిబాలను అస్త్రంగా ప్రయోగించారు.ఆమె వచ్చి తలుపు దగ్గర ఏడుస్తూ ప్రాధేయపడింది. తల్లి ఏడుపు విని కరిగిపోయిన 
మృడాని తలుపు ఓరగా తీసి తల్లిని మాత్రం లోనికి రానిచ్చింది.ఈ పెళ్లిని తాను ఎట్టి పరిస్థితులలోనూ చేసుకోనని ఖరాఖండిగా తల్లితో చెప్పేసింది మృడాని.

పోనీ ఎవరిని చేసుకుంటావో చెప్పమని అడిగిన తల్లితో - తాను మామూలు మనిషిని పెళ్లి చేసుకోననీ,తనకు శ్రీకృష్ణుడే చెలికాడనీ,ఈరోజు ఉండి రేపు పోయే పురుషులకంటే, శాశ్వతుడైన పురుషోత్తముడే కోరదగినవాడనీ,తల్లితో స్పష్టంగా చెప్పేసింది ఆ పదమూడేళ్ళ అమ్మాయి.

అంత చిన్నవయసులో ఏమిటా పరిపక్వత !! ఏమిటా వైరాగ్యం !! మనలాంటి క్షుద్రులకు అసలు ఊహకైనా అందుతుందా ఆ మానసిక స్థాయి?


ఎన్నో వందల ఏళ్ళ క్రితం ఒక పార్వతి, ఒక రాధ, ఒక మీరా,ఒక అక్కమహాదేవి అన్న మాటలనే 140 ఏళ్ళ క్రితం మృడాని మళ్ళీ అన్నది.

"కాలమనే వంటింటిలో ఆహారంగా మారే అల్పులైన మగవాళ్ళు నాకొద్దు. కాలాతీతుడై మరణం లేకుండా నిత్యమూ వెలిగే పరమేశ్వరుడే నా భర్తగా కావాలి." అని అక్కమహాదేవి ఎప్పుడో అన్నమాటలను మృడాని ఈరోజు మళ్ళీ అన్నది.

ఈ రక్తం భారతదేశంలో ఉన్నంతవరకూ ఈ దేశానికి చ్యుతి లేదు.ఇలాంటి మాటలు ఈ దేశపు పౌరులలో కనీసం కొద్దిమంది నుంచైనా వినపడుతూ ఉన్నంత వరకూ ఈ దేశానికి పతనం లేదు.ఈ జీన్స్ ఈ దేశంలో ఉన్నంతవరకూ ఈ దేశానికి భగవంతుని అనుగ్రహం ఉంటూనే ఉంటుంది.ఇలాంటి మనుషులు పుడుతూ ఉన్నంత వరకూ ఈ దేశంలో నిజమైన ఆధ్యాత్మిక పవనాలు వీస్తూనే ఉంటాయి. దైవాన్ని చేరుకునే మార్గం తేటతెల్లం అవుతూనే ఉంటుంది.

కూతురి మాటలు విన్న గిరిబాలకు ఒకవైపు ఆనందం, ఒకవైపు భయం,ఒకవైపు బాధ కలిగాయి.ఇలా పరస్పర విభిన్న భావాలతో సతమతమై పోయిందా తల్లి.కూతురు సరదాకి ఈ మాటలు చెప్పడం లేదనీ,తన సంకల్పం చాలా దృఢమైనదే అనీ ఆమెకు నమ్మకం కుదిరింది.

'సరేనమ్మా! నీ సంకల్పం నాకర్ధమైంది. నువ్వు మామూలు మనిషివి కావు.
నీవు కారణ జన్మురాలవు. సరే ఒకపని చెయ్యి. నీవు వెంటనే ఈ కిటికీలోంచి దూకి వేరే ఊరిలో ఉన్న మన మేనత్త గారి ఇంటికి పారిపో.నువ్వు ఇక్కడే ఉంటే, ఇదే ముహూర్తానికి నీకు ఈ పెళ్లి తప్పకుండా చేసేస్తారు ఈ బంధుజనం.ఒక తల్లిగా నీకు నేను చెయ్యగల సహాయం ఇదే.' అని చెప్పిన గిరిబాల కిటికీ తలుపు తెరిచి అందులోనుంచి మృడాని పారిపోవడానికి సహాయం చేసింది.

కిటికీ లోనుంచి దూకిన 
మృడాని తన దామోదర సాలగ్రామ శిలను భద్రంగా పట్టుకుని ఆ చీకట్లో పరిగెత్తుకుంటూ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న తన మేనత్త గారి ఊరికి చేరుకుంది. అంత రాత్రి పూట ఆ చిన్న పిల్ల ఒంటరిగా ఆ చీకట్లో ఒక ఊరినుంచి ఇంకొక ఊరికి దారీ తెన్నూ లేని పొలం గట్లవెంట పరుగెత్తుకుంటూ ఎలా వెళ్లిందో ఆ దేవుడికే ఎరుక !!

తలుపు తెరిచి బయటకొచ్చిన గిరిబాల ఏ కధను వారికి వినిపించిందో,బంధువులందరూ ఎన్నెన్ని మాటలన్నారో పెళ్లి ఆగిపోయి పిల్ల మాయమైందని తండ్రి ఎంత బాధపడ్డాడో ఎవరికీ తెలియదు.


ఆ విధంగా మేనత్త ఇంటికి చేరిన 
మృడాని కొన్నాళ్ళు అక్కడ తన సాధన చేసుకుంటూ స్థిరంగా ఉంది.ఆ తర్వాత అక్కడ నుంచి హిమాలయాలకు పారిపోదామని ఎత్తు వేసింది.కానీ ఇలాంటి పనేదో చేస్తుందని పసిగట్టిన మేనత్త,నిరంతరం కళ్ళలో వత్తులు వేసుకుని మృడానికి కాపలా కాస్తూ ఉండేది. అందుకని మృడాని ప్రయత్నాలు ఫలించలేదు.

గొడవ కాస్త సద్దు మణిగాక తల్లి దండ్రులు వచ్చి 
మృడానిని ఒప్పించి మళ్ళీ తమతో ఇంటికి తీసుకెళ్ళారు.

ఆ విధంగా కొన్నేళ్ళు తమ ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవడానికి 
మృడానికి అవకాశం లభించింది.కానీ ఇంటిలోని లౌకిక వాతావరణంలో ఉంటూ సాధన చెయ్యడం ఆమెకు నచ్చేది కాదు.ఆమె మనసు ఎంతసేపూ హిమాలయాల వైపు సాగిపోతూ ఉండేది.అక్కడ అన్నింటినీ త్యజించిన సాధువులు, సన్యాసులు,ఏకదీక్షతో భగవంతుని కోసం ఎలా తపస్సు చేస్తూ పునీతులౌతూ ఉంటారో ఆమె విన్న కధలన్నీ ఆమెను శాంతిగా ఉండనిచ్చేవి కావు. అనుక్షణం ఆమె హిమాలయాలకు వెళ్లాలని తపిస్తూ ఉండేది.కానీ నిరంతరం కనిపెట్టి చూచుకుంటున్న తల్లిదండ్రుల కళ్లుగప్పి పారిపోవడం ఆమెకు కుదిరేది కాదు.

ఇలా కొన్నేళ్ళు గడిచాక,ఒకరోజున తెలతెలవారే సమయంలో అందరి కళ్ళు గప్పి 
మృడాని ఇంట్లోనుంచి బయటపడింది. గంగానదికి స్నానానికి పోతున్నదేమోలే అనుకుని వాకిట్లో ఉన్న కాపలాదారు మౌనంగా చూచీ చూడనట్లు ఊరుకున్నాడు. కానీ మృడాని గంగానది వైపు కాకుండా ఊరిబైటకు పోయే దారిపట్టుకునే సరికి అతనికి అనుమానం వచ్చి పెద్దగా కేకలు పెట్టి అందర్నీ నిద్రలేపేశాడు.అందరూ వచ్చి మృడానిని పట్టుకుని మళ్ళీ ఇంటిలో బంధించారు.

ఈ పిల్లను ఇలా గృహఖైదు చెయ్యడం కష్టం అనీ, ఎన్నో ఏళ్ళు ఇలా చెయ్యలేమనీ గ్రహించిన తల్లి దండ్రులు, బంధువులతో కలసి దగ్గర దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఆ అమ్మాయికి అనుమతి ఇచ్చారు.ఆ విధంగా ఆమె దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలను చూడగలిగింది.


కానీ ఆమెలో ఏదో తెలియని తపన నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండేది.అది ఆమెను శాంతిగా ఉండనిచ్చేది కాదు.ఏదో తెలియని గమ్యం ఆమెను ఎక్కడనుంచో పిలుస్తున్నట్లు తోచేది.ఆ పిలుపు ఫలితంగా ఇంట్లో ఉండటం ఆ అమ్మాయికి అసాధ్యం అయ్యేది.


ఈ విధంగా ఏళ్ళు గడుస్తూ ఉండగా ఈమెకు పద్దెనిమిదేళ్ళు వచ్చాయి.ఒకరోజున మేనత్త మేనమామ ఇంకా కొందరు బంధువులు గంగాసాగర్ యాత్రకు బయలుదేరారు.వాళ్ళ గుంపు దాదాపు ముప్పై మంది ఉండటంతో వాళ్ళతో బాటు 
మృడాని, గిరిబాలా కూడా బయలుదేరారు.కానీ చివరి క్షణంలో ఏదో అనారోగ్యం వల్ల గిరిబాల ప్రయాణం మానుకోవలసి వచ్చింది.పెద్ద బలగమే ఉన్నది కదా అన్న నమ్మకంతో మృడానిని ఒక్కదాన్నే వాళ్ళతో పంపడానికి ఒప్పుకున్నారు తల్లిదండ్రులు.

గంగాసాగర్ చేరాక కొన్నాళ్ళు ఆమె ఆనందంగా ఉన్నది.తన సాలగ్రామానికి పూజ చేసుకుంటూ,దానిని ఆరాధిస్తూ కృష్ణధ్యానంలో ఉంటూ హాయిగా కాలం గడిపేది.పాతకాలంలో తీర్ధ యాత్ర అంటే,పొద్దున్న పోయి సాయంత్రానికి తిరిగి వచ్చే పిక్నికు లాగా ఉండేది కాదు.కనీసం మూడురోజులు అక్కడ ఉండి,జపధ్యానాది అనుష్టానాలు చేసి, ఆ క్షేత్రదేవతానుగ్రహం పొంది వెనక్కు వచ్చేవారు చాలామంది.అసలైన తీర్ధయాత్ర అంటే అలాగే చెయ్యాలి.అంతేగాని నేటివారి వలె పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ యాత్రలు చెయ్యకూడదు.


అంతా బాగానే ఉన్నది కదా అని ఆమె మీద నిఘాను కొంచం తగ్గించారు బంధువులు. అదే అదనుగా భావించి ఒకరోజున ఉన్నట్టుండి దామోదర శిలతో సహా చెప్పాపెట్టకుండా మాయమై పోయింది
మృడాని.ఒక గిరిజన యువతిలా వేషం మార్చేసిన ఆమె హరిద్వార్ వెళుతున్న ఒక సాధువుల గుంపులో కలసిపోయి హిమాలయాల వైపు సాగిపోయింది.

ఆమెకోసం చాలా గాలించారు బంధువులు.కానీ ఆమె జాడా జవాబూ ఎక్కడా లేదు. ఇక చేసేది లేక ఈసురోమంటూ కలకత్తాకు వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పేశారు.


వయసులో ఉన్న పిల్ల.ఒంటరిది.ఎక్కడుందో ఏమైపోయిందో? అన్న భయంతో నిర్ఘాంతపోయిన గిరిబాల బెంగతో మంచం పట్టేసింది.కానీ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆమెను చల్లగా కాపాడాలని ప్రార్ధిస్తూ మౌనంగా రోదిస్తూ ఉండిపోయింది ఆ పిచ్చితల్లి.


ఇక్కడ - సాధు బృందంతో హిమాలయాలకు బయల్దేరిన మృడాని ఎట్టకేలకు తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. కాలినడకన ప్రయాణిస్తూ,దారిలో భిక్షాటనం చేత కడుపు నింపుకుంటూ,కృష్ణధ్యానంలో తపిస్తూ, తనదగ్గరున్న దామోదర శిలను నిరంతరం భద్రంగా చూచుకుంటూ,దానిని నిత్యమూ ఆరాధిస్తూ,నాలుగు నెలల కాలినడక తర్వాత కలకత్తా నుంచి తపోభూమి అయిన హిమాలయాలకు  చేరుకుంది ఆ పిల్ల.


హిమాలయాలు కనిపించే సరికి ఆ అమ్మాయి పులకించి పోయింది.పరమశివుడు నిరంతరం కొలువుండే కొండలు తన కెదురుగా కన్పించే సరికి అన్నీ మరచిపోయింది.ఎక్కడ చూచినా,అన్నీ వదిలేసి నిరంతరం దైవం కోసం తపిస్తూ ధ్యానంలో మునిగి ఉన్న సాధువులు తపస్వులు ఆమెకు కనిపించారు.వారిని చూచి మైమరచి పోయింది.ఇన్నాళ్ళకు తన స్వప్నం సాకారం అయింది, ఇక తను కూడా తన ప్రాణేశ్వరుడైన కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నిరంతరం ఆయనకోసం తపిస్తూ,ఏ విధమైన బాదరబందీలు లేకుండా హాయిగా తపస్సు చేసుకోవచ్చని ఉప్పొంగి పోయింది.

అప్పటికి ఆమెకు సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు.


(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 32 (గౌరీమా అద్భుత జీవితం: పురుషుడా - పురుషోత్తముడా?) "