Pages - Menu

Pages

2, జులై 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 27 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు)















 







'మీరు నిన్న దేవాలయానికి వచ్చి ఠాకూర్ మరియు శ్రీశ్రీమా దర్శనం చేసుకున్నారా? ' అడిగారు స్వామి ఆత్మలోకానంద.

'బెంగాల్లో శ్రీరామకృష్ణులను 'ఠాకూర్' అని సగౌరవంగా పిలుస్తారు. అలాగే శారదామాతను శ్రీమా అనీ శ్రీశ్రీమా అనీ ఎంతో మర్యాదగా పిలుస్తారు.అదే మర్యాదను అమెరికన్ అయిన ఈయనకూడా పాటించడం ఎంతో ముచ్చటగా అనిపించింది.

'అవును.మేమిక్కడకు వచ్చీ రావడం తోనే చేసిన మొదటి పని అదే.ఆలయంలో స్పందనలు మాకు చాలా బాగా నచ్చేశాయి.మాలో కొంతమందికి ఇక్కడ అడుగుపెడుతూనే ధ్యానస్థితి దానంతట అది వచ్చేసింది.' అన్నాను.

మా అందరివైపూ ఒక్కసారి పరికించి సంతృప్తిగా చూచారాయన.

'ఇక్కడకు ఎంతోమంది గ్రూపులు వచ్చి రిట్రీట్లు చేసుకుంటూ ఉంటారు.కానీ మీలాంటి క్రమశిక్షణతో కూడిన అద్భుతమైన గ్రూపును నేనిప్పటివరకూ చూడలేదు.' అన్నారాయన.

మాకు చాలా సంతోషం అనిపించింది.

'ఆలయం వెనుక ఉన్న చెక్క కుటీరం చూచారా?' అడిగారాయన.

'చూచాము.దాని ప్రత్యేకత ఏమిటో వినాలని ఉంది' అన్నాను నేను.

'చెప్తాను.1990 ప్రాంతాలలో ఇక్కడ ఏ ఇళ్ళూ లేవు.ఇప్పుడు చెక్క కుటీరం ఉన్న ప్రదేశంలోనే తన గురువైన స్వామి భాష్యానంద గారితో కలసి గౌరీమా 'పంచతప దీక్ష' ను ఆచరించారు.ఆ తర్వాత క్రమేణా ఈ ఆశ్రమమూ ఈ రిట్రీట్ హోమూ ఇవన్నీ వచ్చాయి.' అన్నారాయన.

'పంచతపం' అంటే ఏమిటి?' - అదేంటో నాకు తెలిసినా వింటున్న మిగతా వారికోసం అడిగాను నేను.

'ఇది అయిదు పగళ్ళు అయిదు రాత్రులు ఏకధాటిగా ధ్యానంలో ఉంటూ చెయ్యవలసిన దీక్ష. దీనిని ఆకాశం క్రింద మాత్రమే చెయ్యాలి. నేలమీద మనం కూచోవాలి. మనకు నాలుగు వైపులా దగ్గరలో నాలుగు గుండాలు త్రవ్వి వాటిల్లో అగ్నిని వెలిగించి ఈ అయిదురోజులూ నిరంతరం అవి మండుతూ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ వేడి మనకు బాగా తగుల్తూ ఉండాలి.ఇవి నాలుగు అగ్నులు.అయిదో అగ్ని ఆకాశంలో వెలిగే సూర్యుడు.ఈ అయిదు అగ్నుల వేడీ మనకు తగుల్తూ ఉండగా, అయిదు రోజుల పాటు నిద్ర, ఆహారం, నీరు లేకుండా, నిరంతరం మంత్రజపం ధ్యానం చేస్తూ, కదలకుండా ఒకే ఆసనంలో కూచుని దీక్షగా సాధన చెయ్యడమే - పంచతపం అనే దీక్ష.' అన్నారు స్వామీజీ.

'మాతాజీ గౌరీమా' ఈ దీక్షను చేశారా?' ఆశ్చర్యంగా అడిగాను నేను.

'అవును 1990 లో ఆమె ఈ దీక్షను ఆచరించారు.నాలుగు వైపులా అగ్నులు ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూ ఉండే బాధ్యతను నేనే చూచుకున్నాను.ఆ డ్యూటీ నాకిచ్చారు. అందుకని ఈ విషయం నేను కళ్ళారా చూచినవాణ్ని' అన్నారాయన.

మాకు నోటమాట రాలేదు.

'ఈ దీక్షలో మాతాజీ, ఆమె గురువైన స్వామి భాష్యానంద, ఇంకొక స్వామీజీ కూర్చున్నారు. మూడో రోజు దాటేసరికి వాళ్ళ కాళ్ళు కీళ్ళు అన్నీ లాక్ అయిపోయినట్లుగా బిగిసిపోయాయి.కొంచం కూడా వాళ్ళు కదలలేకపోయారు.ఎవరో తాళాలు వేసినట్లుగా 'టక్..టక్' మంటూ కీళ్ళలోనుంచి శబ్దాలు వచ్చి అన్నీ లాక్ అయిపోయాయి.ఆ తర్వాత కాసేపటికి ఉజ్జ్వలంగా వెలిగిపోతున్న 'శ్రీయంత్రం' వారి ఎదురుగా ప్రత్యక్షమైంది. ముగ్గురికీ అది ఒకేసారి దర్శనం ఇచ్చింది.

అప్పుడు భాష్యానంద గారు ఇలా అడిగారు.

'గౌరీమా. నీకేం కనిపిస్తున్నదో చెప్పు?'

'నాకు 'స్టార్ ఆఫ్ డేవిడ్' కనిపిస్తున్నది' అని ఆమె జవాబు చెప్పారు. ఎందుకంటే యూదు వనిత అయిన ఆమెకు తెలిసిన ఆకారం అదొక్కటే.అందుకని ఆమె ఆ యంత్రాన్ని 'స్టార్ ఆఫ్ డేవిడ్' అనుకుంది.

స్వామి భాష్యానంద నవ్వారు.

'అది స్టార్ ఆఫ్ డేవిడ్ కాదు.సరిగా చూడు. స్టార్ ఆఫ్ డేవిడ్ లో రెండు త్రిభుజాలు ఒకదానిని ఒకటి ఖండిస్తూ ఉంటాయి.దానిని మేము షట్కోణ యంత్రమనీ,షణ్ముఖ యంత్రమనీ పిలుస్తాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అది కాదు.దీనిలో చాలా త్రిభుజాలూ  చాలా కోణాలూ ఉన్నాయి చూడు.ఇది శ్రీయంత్రం. సాక్షాత్తూ జగన్మాతకు సంకేతం.' అన్నారాయన.

అప్పుడు వారి ఎదురుగా కనిపిస్తున్న శ్రీయంత్రం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది.

'నాకు ఇక్కడ ఒక ఆలయం నిర్మించండి.నేను ఇక్కడ నివసిస్తాను. నా కుమార్తెలకోసం నాకోసం ఇక్కడ ఒక ఆలయం నిర్మించండి.'

చూస్తూ ఉండగానే ఆ శ్రీయంత్రం వారి దృష్టి నుంచి మాయమై పోయింది.

వింటున్న మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

'అందుకనే ఈ ఆలయం ముఖద్వారం లోనే శ్రీయంత్రం మీకు కనిపిస్తుంది.అలాగే, గర్భగుడిలో ఠాకూర్ ఫోటో పైన స్టెయిండ్ గ్లాస్ మీద కూడా మీకు శ్రీయంత్రం కనిపిస్తుంది.ఆ విధంగా ఈ ప్రదేశానికి శ్రీయంత్రానికి సంబంధం ఉన్నది.' అన్నారాయన.

వింటున్న నాలో ఈ భావాలు తలెత్తాయి.

'అతి ప్రాచీన కాలంలో అమెరికాను పాతాళం అనేవారు.ఇక్కడ రాక్షసరాజులు ఉన్నారనీ,ఇది బలిచక్రవర్తి రాజ్యం అనీ మన పురాణాలు చెబుతున్నాయి. అనేక మంది వేదకాలపు ఋషులు ఇక్కడ నివసించారు.వారి ఆశ్రమాలు కూడా ఇక్కడ ఉండేవి.అందుకనే ఇప్పుడు అమెరికా యూరప్ ఆస్ట్రేలియా ఆఫ్రికాలలో అనేకచోట్ల త్రవ్వకాలలో శివలింగాలూ, వినాయకుడూ,ఇంద్రుడు, విష్ణువు మొదలైన ప్రతిమలూ బయట పడుతున్నాయి.ప్రాచీన కాలంలో ప్రపంచం అంతటా వైదిక సంస్కృతి ఉండేదనదానికి చాలా రుజువులున్నాయి. కంచి పరమాచార్య కూడా ఈ విషయాన్ని చాలాసార్లు తమ ఉపన్యాసాలలో చెప్పి ఉన్నారు.బహుశా చరిత్రకందని అతి ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఏదో ఒక ఋష్యాశ్రమం అయి ఉంటుంది.ఇక్కడ లలితా పరమేశ్వరీ ఆరాధనా ఉపాసనా జరిగి ఉంటుంది. అందుకే ఇన్ని వేల ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ఇక్కడ జరుగుతున్నది. అందుకే ఇక్కడ మళ్ళీ శ్రీచక్రం ప్రత్యక్షమైంది.అప్పటి ఆ ఋషులూ వారి శిష్యులే ఇప్పుడు అమెరికన్స్ గా పుట్టినా మళ్ళీ అదే ఆరాధనను కొనసాగిస్తున్నారు.' అని నాకు లోలోపల అనిపించింది.

'స్వామీజీ. ఇదుగో నేను వ్రాసిన 'శ్రీవిద్యా రహస్యం' అనే పుస్తకం. ఇదంతా శ్రీయంత్రం గురించీ,వేదోపనిషత్తుల ప్రమాణాలతో శ్రీచక్ర అంతరిక పూజ ఎలా చెయ్యాలి? అనే విషయం గురించే ఉంటుంది.' అంటూ నేను వ్రాసిన పుస్తకాలను కొన్నింటిని ఆయనకు ఇచ్చాను.

'ఒక కాపీని మీ లైబ్రరీలోని పుస్తకాలలో ఉంచండి.' అని ఆయనకు చెప్పాను.

ఆయన చాలా ఆశ్చర్యంగా చూచారు.

'విచిత్రంగా ఉందే. శ్రీవిద్య మీద సాధికారిక గ్రంధం వ్రాసిన మీరు, మీ దేశానికి ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి వెదుక్కుంటూ రావడమూ, ఇక్కడ శ్రీయంత్రం మీకోసం వేచిచూస్తూ ఉండటమూ అంతా ఏదో వింతలా ఉంది.' అన్నారాయన.

'అవును స్వామీజీ' అన్నాను నేను.

మిగతా అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఈ సంభాషణ అంతా వింటున్నారు.

'మీరిచ్చిన పుస్తకాన్ని గౌరీమా కు అందజేస్తాను.ఒక పని చెయ్యండి.రేపు ఆదివారం నాడు,ఆలయంలో మీరు ఒక స్పీచ్ ఇవ్వండి.ప్రతి ఆదివారం ఇక్కడ యూనివర్సల్ ప్రేయర్ జరుగుతుంది.దానికి మా అమెరికన్స్ చాలామంది వస్తారు.మీరు మాట్లాడితే వినడానికి వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు.' అన్నారాయన.

'అలాగే స్వామీజీ. ఏ టాపిక్ మీద మాట్లాడమంటారు?' అడిగాను.

'వేరే టాపిక్ ఎందుకు? శ్రీయంత్రం గురించి మాట్లాడండి.నేను ఇప్పుడే మావాళ్ళకు ఈ విషయం ఎనౌన్స్ చేస్తాను.' అని ఉత్సాహంగా లేచారాయన.

'అలాగే స్వామీజీ. అలాగే మాట్లాడతాను.' అన్నాను నేనూ లేస్తూ.

'మంచిది.నమస్తే.వెళ్లి వస్తాను.మిమ్మల్ని కలసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది' అన్నారాయన.

'స్వామీజీ ఒక్కమాట.గౌరీమాను కలవడానికి వీలౌతుందా?'అడిగాను.

'లేదు.ఎందుకంటే ఆమె అదిగో ఆ ఇంట్లోనే ఉంటారు గాని,ఆమెకు తీరిక ఉండదు.ఆమె ఎప్పుడూ ఎమర్జెన్సీ కాల్స్ లో బిజీగా ఉంటారు.ఒక్క క్షణం కూడా తల పక్కకు తిప్పరు.ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో ఉన్న వ్యభిచార మాఫియాతో ఆమె పోరాడుతున్నారు.వాళ్ళ చెరలో ఉన్న ఏ అమ్మాయి నుంచైనా ఆమెకు ఏ క్షణమైనా ఫోన్ రావచ్చు.వెంటనే ఆమె పోలీసులతో సంధానమై ఆ పిల్లను మాఫియా చెరనుంచి విడిపించే పనిలో ఉంటారు.కనుక మీతో ఆమె కలవలేక పోవచ్చు.ఆమె ప్రతిక్షణమూ అత్యంత విలువైనది.ఎందుకంటే ఏ క్షణంలో ఆమె హెల్ప్ లైన్ కు అమెరికాలో ఏ మూలనుంచి ఫోన్ వస్తుందో తెలియదు.అందుకని ఆమె రాత్రుళ్ళు కూడా సరిగా నిద్రపోకుండా ఆ ఫోన్ పక్కనే ఉంటారు.అయినా ఆమెను అడుగుతాను.ఆమె సమయం ఇస్తే మీరు కలసి మాట్లాడవచ్చు.' అన్నారాయన.

'మాకు ఎక్కువ సమయం వద్దు.ఒక పది నిముషాలు చాలు.ఊరకే ఆమె దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకుంటాము.అంతే.' అన్నాను నేను.

'ప్రయత్నిస్తాను.ఉంటాను మరి' - అంటూ మావద్ద సెలవు తీసుకుని, రెండు సీట్లు మాత్రమే ఉన్న ఒక చిన్న లాన్ జీప్ లో ఎక్కి, ఆయన వెనక్కు బయలుదేరారు.

(ఇంకా ఉంది)