“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, జులై 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 30 (గౌరీమా అద్భుత జీవితం)

'గౌరీ' అనే పేరు చాలా అద్భుతమైన పేరు. గౌర వర్ణం అంటే తెల్లని రంగు అని అర్ధం. హిమవంత మహారాజు పుత్రికగా పార్వతి జన్మించినపుడు ఆమె తెల్లని స్వచ్చమైన రంగులో చాలా అందంగా ఉండేది.అందుకే ఆమెకు 'గౌరి' అనే పేరు వచ్చింది.

నేను మొదటిసారిగా గౌరీమా గురించి నా చిన్నప్పుడు అంటే 13 ఏళ్ళ వయసులో (1976 లో) చదివాను. శ్రీ రామకృష్ణుల ప్రత్యక్షశిష్యుల గురించి చదువుతున్నప్పుడే గౌరీమా గురించి కూడా నేను తెలుసుకున్నాను.నా ప్రధమ గురువైన రాధమ్మగారి వద్ద ఆ సమయంలో నేను ఒకటిన్నర ఏళ్ళు ఉండవలసిన పరిస్థితులు ఆ సమయంలో జగజ్జనని చేత కల్పించబడ్డాయి. అప్పుడే నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది.

రాధమ్మగారు శ్రీరామకృష్ణులకు, జగన్మాతకు భక్తురాలైన గృహస్థ యోగిని. ఆ సమయంలో రాధమ్మ గారికి అనేక దర్శనాలు కలుగుతూ ఉండేవి.అమ్మ ఇస్తున్న కొన్నికొన్ని దర్శనాలను మాకు అప్పుడప్పుడూ ఆమె వివరించి చెబుతూ ఉండేది.

ఒకరోజున ఆమె నాతో ఇలా అన్నారు.

'ఈరోజు అమ్మ నన్ను 'గౌరీ' అని పిలిచిందిరా సత్యం. ఎందుకలా అందో తెలియడం లేదు.'

'ఎందుకై ఉంటుంది?' అని నేను అడిగాను.

'తెలియదు.శ్రీ రామకృష్ణులవారికి 'గౌరీమా' అని ఒక శిష్యురాలున్నది. బహుశా ఆమెకూ నాకూ ఏదో సంబంధం ఉన్నదేమో?' అని తాను సాలోచనగా అంది.

ఆ విషయం అంతటితో ఆగిపోయింది. ఇది జరిగిన కొన్నేళ్ళ తర్వాత మాత్రమే ఆ దర్శనానికి అర్ధం ఏమిటో నాకర్ధమైంది.

ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచి, గౌరీమా గురించి మాట్లాడుకుందాం.

1857 లో కలకత్తాకు చెందిన ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో గౌరీమా జన్మించింది.నాన్నగారి పేరు పార్వతీ చరణ్ చట్టోపాధ్యాయ.అమ్మగారిపేరు గిరిబాల.వీరి పేర్లను బట్టి ఇద్దరూ జగజ్జనని భక్తుల కుటుంబాలలో పుట్టిన వారని తెలిసిపోతూ ఉన్నది. ఆమెకు తల్లిదండ్రులు 'మృడాని' అనే పేరు పెట్టారు.ఇది జగన్మాత పేర్లలో ఒకటి. ఆమెను వారు 'రుద్రాణి' అని కూడా పిలిచేవారు.ఇదీ అమ్మవారి పేరే.

శివ సహస్రనామాలు - శివాయ నమ, హరాయ నమ, మృడాయ నమ, రుద్రాయ నమ ,,, -  అంటూ మొదలౌతాయి. వీటిలో 'మృడ' అనే పేరుకు అర్ధం 'మట్టి' అని. అలాగే రుద్ర అనే పేరుకు - కోపంతో ఉన్న, శిక్షించు, రోదనము కలుగజేయు అనే అర్ధాలున్నాయి.

పరమ శివునకు అష్టమూర్తి అని పేరుంది. ఆయనకున్న ఎనిమిది రూపాలలో భూమి కూడా ఒకటి. భూమి రూపంలో లోకాన్ని పోషిస్తున్నది ఈశ్వరుడే. ఆ భూమికి ఉన్న శక్తే మృడాని. సహనానికి భూమి ప్రతీక. ముందు ముందు జీవితమంతా ఎన్నో బాధలను కష్టాలను దైవం కోసం నవ్వుతూ సహించాలని కాబోలు తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఆ పేరును పెట్టారు !!

శివుని పేర్లకు 'ని' చేరిస్తే అమ్మవారి పేరుగా మారుతుంది. శివ - శివాని, మృడ - మృడాని, రుద్ర - రుద్రాణి, భవ-భవాని, శర్వ - శర్వాణి ఇలాగన్న మాట. ఈ విధంగా 'ని' అనే అక్షరం చేర్చి ఆ పేరును స్త్రీలింగంగా మార్చే ప్రక్రియ ఇండో యూరోపియన్ భాషలు అనేకాలలో ఉన్నది.

మహనీయులు చిన్నప్పటి నుంచే విలక్షణమైన జీవితం గడుపుతారు.వాళ్ళ తీరుతెన్నులు కూడా మిగిలిన వారికంటే విభిన్నంగా ఉంటాయి.ఎందుకంటే మనలాగా నిరర్ధకంగా జీవితాలు గడిపి చివర్లో ఏడుస్తూ చనిపోవడానికి వాళ్ళు పుట్టరు.వారి పుట్టుకను ఒక పరమార్ధం ఉంటుంది.

ఒక మామూలు మనిషి చనిపోతే ఆ మరుసటి రోజున అతని బంధువులే అతన్ని తలుచుకోరు.ఈరోజు మనం పోతే, రేపటికి ఎవరికీ కనీసం గుర్తు కూడా ఉండము. అలాంటిది, గౌరీమా చనిపోయిన 75 ఏళ్ళ తర్వాత నేడు మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నామంటే,లోకం ఆమెను స్మరిస్తోందంటే ఆమె ఎలాంటి మనిషో అర్ధం చేసుకోవచ్చు.

చిన్నప్పటి నుంచీ గౌరి చాలా ధైర్యసాహసాలు కలిగిన పిల్లగా ఉండేది. ప్రవర్తనలో చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ముక్కుసూటిగా ఉండేది. అనవసరమైన మాటలు మాట్లాడటం, అబద్దాలు చెప్పడం, అల్లరి చెయ్యడం మొదలైన చేష్టలు ఆమెలో మచ్చుకైనా కనిపించేవి కావు. ఒకవిధమైన గంభీరత్వం అంత చిన్నపిల్లలో కూడా కనిపిస్తూ ఉండేది. మిగిలిన పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటే, ఈ అమ్మాయి మౌనంగా కూచుని వాళ్ళను చూస్తూ ఉండేదిగాని తను ఆటలు ఆడేది కాదు.

శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులందరూ విలక్షణములైన వ్యక్తిత్వాలు కలిగినవారే. వాళ్ళు మనలా మామూలు మనుషులు కారు. భగవంతుని అవతారంతో బాటు ఈ భూమి మీదకు వచ్చినవారు ఆషామాషీ మనుషులు ఎలా అవుతారు? వారందరూ దేవతా స్వరూపాలే.భగవత్కార్య నిమిత్తమై ఈ భూమిమీద కొన్నాళ్ళు నివసించారు.అంతేగాని వారు మనలా కర్మజీవులు కారు.

గౌరీమాలో చిన్నప్పటి నుంచీ కొన్నికొన్ని వ్యక్తిత్వ లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉండేవి.ఆమెకు స్వార్ధం ఉండేది కాదు. దాచుకోవాలి అన్న ఊహ ఆమెలో కనిపించేది కాదు.సామాన్యంగా ఒక కుటుంబంలో పిల్లల్లో కూడా, అన్నకు ఏదైనా ఇస్తే చెల్లెలు ఏడవడం,లేదా తమ్ముడికి ఏదైనా ఇస్తే అన్న అలగడం ఇలాంటి క్షుద్ర పోకడలు ఉంటాయి.ఇలాంటి పోకడలు మామూలు చవకబారు జీన్స్ తో పుట్టిన పిల్లల్లో ఉంటాయి. ఉత్తమ సంస్కారాలతో జన్మించిన పిల్లలలో అవి ఉండవు. వారి తీరు వేరుగా ఉంటుంది.

గౌరీమాలో స్వార్ధం ఎక్కడా కన్పించక పోగా, ఎదుటి వారి బాధలను చూచి చలించే గుణం చిన్నప్పటినుంచే ఆమెలో దర్శనమిచ్చేది.ఎవరైనా బాధల్లో ఉంటే, తన దగ్గరున్న ఏ వస్తువైనా సరే, వెనకా ముందూ ఆలోచించకుండా వారికి ఇచ్చేసేది.తాను చిన్నపిల్ల అయి ఉండికూడా వారిని ఓదార్చాలని ప్రయత్నించేది.ఇది స్ఫుటమైన దైవీ లక్షణం.

ఎప్పుడైనా సరే, తల్లిదండ్రులను బట్టే పిల్లలు ఉంటారు.వారి జీన్సే వీరికి వస్తాయి.నేడు మనం చాలామంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం.' మా పిల్లలు చెడిపోయారు.మేం చెప్పినమాట వినటం లేదు.' అని బాధపడి ఏడుస్తూ ఉంటారు.అలాంటి వారిని చూస్తె నాకు నవ్వొస్తూ ఉంటుంది.

విత్తనం ఎలాంటిదో మొక్క అలాంటిదే వస్తుంది.నువ్వు వేప విత్తనానివి.నీకు పారిజాతం చెట్టు ఎలా వస్తుంది? సువాసనతో కూడిన పూలు ఎలా పూస్తుంది? పెళ్ళికి ముందు, నీ జీవితం నువ్వు సక్రమంగా గడిపి, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఉండి ఉంటే, అలాగే నీ భార్య కూడా ఉండి ఉంటే, అప్పుడు మాత్రమే మీకు పుట్టే పిల్లలు ఉన్నతమైన వాళ్ళుగా ఉంటారు.మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండి, ఇప్పుడు 'మా పిల్లలు చెడిపోయారు' అంటే దానికి బాధ్యులు ఎవరు? మీరే.

అందుకనే పాతకాలంలో కులానికి గుణానికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. మనకు ఒక సామెత ఉన్నది."కులమైనా ఉండాలి గుణమైనా ఉండాలి" అని.కులమంటే అదేదో తప్పు మాట ఏమీ కాదు. Clan అని దానర్ధం.నిజానికి 'కులం' అనే సంస్కృత పదం నుంచే Clan అనే ఇంగ్లీషు పదం పుట్టింది.

ఈరోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా నిశ్చయింపబడుతున్నాయి? నేటి పెళ్ళిళ్ళలో వ్యక్తిత్వం ముఖ్యం కాదు.కుటుంబం ఎలాంటిది అన్నది ముఖ్యం కాదు.తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అన్నది ముఖ్యం కాదు.డబ్బును ఒక్కదాన్ని చూస్తున్నారు. అంతే. అందుకనే నేటి పెళ్ళిళ్ళు త్వరలోనే పెటాకులై పోతున్నాయి. కొన్నాళ్ళు కలిసున్నాక తమకు సరిపడదని తెలుసుకొని, ధైర్యం ఉంటే విడిపోతున్నారు. అంత ధైర్యం లేకపోతే, తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసి బ్రతుకుతున్నారు.ఆ పుట్టే పిల్లలు కూడా అలాంటి వాళ్ళే పుడుతున్నారు.నేటి పిల్లల్లో ఎవరికీ ఉన్నతమైన వ్యక్తిత్వాలు లేవంటే ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అలాంటివాళ్ళే, ఇక పిల్లలు ఉన్నతులుగా ఎలా ఉంటారు?

మృడాని తల్లిదండ్రులు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు. నాన్నగారైన పార్వతీ చరణ్ మంచి దైవభక్తి పరుడు.నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన ఒక యూరోపియన్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు.పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళేవాడు.అక్కడి ఉద్యోగులు ఈ బొట్టు చూచి ఆయన్ను ఎగతాళి చేసేవారు.ఉద్యోగం మానెయ్యడానికైనా ఆయన సిద్ధమయినాడు గాని బొట్టు తీసెయ్యమంటే మాత్రం ఒప్పుకోలేదు. అలాంటి నిక్కచ్చి మనస్తత్వం ఆయకుండేది.

అమ్మగారైన గిరిబాలను చూద్దామంటే ఆమెది ఇంకొక రకమైన విలక్షణ వ్యక్తిత్వం.దైవభక్తికి తోడు ఆమెకు చాలా జాలిగుండె ఉండేది.తన గుమ్మంలోకి వచ్చిన ఆర్తుడిని ఉత్త చేతులలో ఆమె వెనక్కు పంపేది కాదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి సాయం చేసేది.ఆ ఊరిలోని పేదవారికి,కష్టాలలో ఉన్నవారికి, ఎప్పుడూ ఏదో ఒక సాయం చేస్తూనే ఉండేది ఆమె.ఆరోజుల్లోనే ఆమె బెంగాలీ,సంస్కృతాలలో మంచి ప్రవేశం ఉన్నవ్యక్తి. అంతేగాక ఆమెకు ఇంగ్లీషు, పర్షియన్ కూడా కొద్ది కొద్దిగా వచ్చేవి.ఆమె స్వరం చాలా చక్కగా వినసొంపుగా ఉండేది.అంతేగాక ఆమె గేయాలనూ స్తోత్రాలనూ వ్రాస్తూ ఉండేది. ఆమె వ్రాసిన అలాంటి స్తోత్రాలు -'నామసారం', వైరాగ్య గీతమాల' అనే రెండు పుస్తకాలుగా ప్రచురింపబడ్డాయి.

మొత్తం మీద మృడాని తల్లిదండ్రులిద్దరూ కూడా చాలా ఉన్నత వ్యక్తిత్వాలు కలిగినవారు,ఉత్తమ తరగతికి చెందిన గృహస్తులు, మంచి సంస్కారవంతులు, కష్టాలలో ఉన్నవారంటే జాలి దయ కలిగిన మంచి మనుషులై ఉండేవారు.

ఇలాంటి తల్లి దండ్రులకు పుట్టిన సంతానమైన మృడాని ఇంక అలా ఉండక ఇంకెలా ఉంటుంది?

మృడానికి ఆనందాన్నిచ్చే ఆట దైవాన్ని పూజించటం ఒక్కటే. తన చిట్టి చేతులతో,వచ్చీ రాని పూజలతో ఆ చిన్నపిల్ల శివుణ్ణి అర్చిస్తూ ఉండేది.అంత చిన్న వయసులో కూడా ఆమెలో ఒకవిధమైన నిర్లిప్తతా భావమూ, మౌనమూ ఉండేవి.ఒకరోజున ఆమె పడవలో గంగానదిని దాటుతూ ఉన్నది.ఆ సమయంలో ఆ చిన్నపిల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు రేకెత్తాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.

'ఆడవాళ్ళలో బంగారం అంటే ఎందుకంత మోజు? ఏముంది ఈ బంగారంలో? ఈ ఆభరణాలలో ఏముంది? ఎందుకు ఇవంటే స్త్రీలకు ఇంత వ్యామోహం? ఇవి లేకపోతే నేను బ్రతకలేనా?' - అన్న ఆలోచనలు ఆ అమ్మాయికి కలిగాయి. వెంటనే తన చేతికున్న బంగారు గాజులను తీసి గంగానదిలోకి విసిరేసింది ఆ అమ్మాయి.

నగలంటే ఆ పిల్లకు ఏ విధమైన మోజూ ఉండేది కాదు.అంతేకాదు సామాన్యంగా తన వయసు ఆడపిల్లల్లో ఉండే దుస్తులపట్ల మోజూ, అలంకరణ పట్ల శ్రద్ధా కూడా ఆమెలో ఉండేవి కావు. ఆమె మనస్సు ఎప్పుడూ ఈ చవకబారు ప్రపంచం కంటే, ఈ ప్రపంచాకర్షణల కంటే ఎంతో ఎత్తులో విహరిస్తూ ఉండేది.తక్కువ స్థాయికి చెందిన ఆలోచనలు ఆమెకు కలిగేవి కావు.

ఈరోజుల్లో డెబ్భై ఏళ్ళు వచ్చినా బ్యూటీపార్లర్ల వెంట తిరిగే ఆడవాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. మరి పదేళ్ళు కూడా నిండని అంత చిన్నపిల్లలో అంత వైరాగ్యమూ నిర్లిప్తతా ఉన్నాయంటే మన జన్మలు ఎలాంటివి? ఆమె జన్మ ఎలాంటిదో తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

వాళ్ళ ఇంటి పక్కనే 'చండీ మామ' అనే ఒక మంచి జ్యోతిష్కుడు ఉండేవాడు. ఒకరోజున అతను మృడాని చెయ్యి పరిశీలించాడు.అందులో ఆయనకు ఏయే రేఖలు కనిపించాయో? ఆయన ఇలా అన్నాడు.

'ఈ అమ్మాయి ముందు ముందు ఒక మహాయోగిని అవుతుంది'. 

(ఇంకా ఉంది)