నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, జులై 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 32 (గౌరీమా అద్భుత జీవితం: పురుషుడా - పురుషోత్తముడా?)

తన సాధనకు ఇంట్లో భార్యనుంచి సహకారం లేదని చెప్పి బాధపడిన ఒక భక్తునితో శ్రీ రామకృష్ణులు ఇలా అంటారు.

'సాధనలో నీకు నిజంగా నిజాయితీ ఉంటే,నీ మనస్సు శుద్ధమైనదే అయితే - అన్నీ కాలక్రమేణా సర్దుకుంటాయి.నీకు సరిపోయే విధంగా అన్ని పరిస్థితులనూ అమ్మే సరిదిద్దుతుంది.నీ బాధను ఒదిలి పెట్టి సంతోషంగా నీ సాధనను కొనసాగించు. పరిస్థితులు ఎలా మారుతాయో నువ్వే చూస్తావు.'


ఈ మాటలు అక్షరాలా నిజాలు. ఇవి ఈనాటికీ అనేక మంది నా శిష్యుల జీవితాలలో నిజం కావడం నేను కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే,ముందే చెప్పినట్లుగా, మనలో నిజాయితీ చిత్తశుద్ధి అనేవి ఉన్నప్పుడు దైవం మనకు తప్పకుండా సాయం చేస్తుంది.అనేక రకాలైన అనుకూల పరిస్థితులను మనకోసం కల్పిస్తుంది.ఆ పరిస్థితులనేవి మనం ఊహించలేనట్లుగా ఉంటాయి.ఒక్క రోజులో మన జీవితం మొత్తం మారిపోతుంది.


గౌరీమాకు కూడా అలాగే జరిగింది.


భక్తునికి ఎప్పుడూ కూడా దైవం యొక్క మనోహరమైన రూపం కావాలి.ఒక జ్ఞానిలాగా, రూపరహితమైన తత్త్వం మీద భక్తుడు ఎప్పుడూ దృష్టి పెట్టడు. సుందరమూ, మనోహరమూ, ఆనంద స్వరూపమూ అయిన దైవం యొక్క రూపాన్నే అతడు నిత్యమూ ధ్యానిస్తాడు.ఎందుకంటే భక్తుని మనస్సు రసహీనం కాదు. అది రసమయం.తన సమస్త ఇంద్రియాలతోనూ అతడు భగవదానందాన్ని గ్రోలాలని వాంఛిస్తాడు.


శ్రీరామకృష్ణుల నుండి దీక్షా స్వీకారం చేసిన కొద్ది రోజులలో మృడానికి ఇంకొక అనుభవం కలిగింది.


గౌరీమా తల్లిదండ్రులు ఉత్తమ గృహస్థులు గనుక ఎప్పుడూ వారి ఇంట్లో ఎవరో ఒక సంచార సాధువులు కొన్నాళ్ళ పాటు ఉండి, ఆశ్రయం తీసుకుని,ఆ తర్వాత వారి దారిన వారు పోతూ ఉండేవారు.


ఆ విధంగా వారి ఇంటికి ఉన్నట్టుండి ఒక సన్యాసిని వచ్చి చేరుకుంది.ఆమె కృష్ణ భక్తురాలు.ఆమె దగ్గర ఒక దామోదర సాలగ్రామం ఉండేది.అదే ఆమె సర్వస్వం.అదే ఆమె ఆస్తి.అది ఆమె దగ్గరకు ఎలా వచ్చిందో తెలియదు. ఆ సాలగ్రామ శిలను ఆమె ఎంతో భక్తిగా రోజూ పూజ చేస్తూ ఆరాధిస్తూ ఉండేది. అది సాక్షాత్తూ కృష్ణస్వరూపమే. కృష్ణుడే తనతో ఉన్నట్లుగా ఆ సాధ్వి భావిస్తూ ఆ శిలను ఆరాధిస్తూ ఉండేది.అలా ఆమె ఎన్నేళ్ళ నుంచీ చేస్తున్నదో మనకు తెలియదు.


ఆ విధంగా కొన్నాళ్ళు వీరి ఇంట్లో ఉండి తన దారిన తాను పోయే ముందురోజు రాత్రి ఆమెకు నిద్రలో ఒక స్వప్నం వచ్చింది.


ఆ స్వప్నంలో - అమిత అందంగా ఉన్న ఒక పదేళ్ళ నల్లని పిల్లవాడు సిగలో నెమలి పించం ధరించి చేతిలో పిల్లనగ్రోవితో ఆమె ఎదురుగా కనిపించాడు.అతని చుట్టూ అద్భుతమైన కాంతి పరివేషం వెలుగుతున్నది.అతని సమక్షంలో మధురమైన ఓంకారనాదం అలలు అలలుగా ప్రతిధ్వనిస్తున్నది.ఆ పిల్లవాడిని చూస్తూనే ఆమె కలలోనే పరవశించి పోయింది. అప్రయత్నంగా చేతులెత్తి ప్రణామం చేసింది. కలలోనే ఆమెకు ఆనందబాష్పాలు కారిపోతున్నాయి.ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది కానీ ఏమీ మాట్లాడలేకపోతోంది.కదలాలని అనుకుంటోంది.కానీ కదలలేక పోతోంది.అంతకంటే ఏమీ చెయ్యలేని స్థితిలో నిశ్చేష్టురాలై అతన్నలా చూస్తూ ఉండిపోయింది.


అప్పుడా పిల్లవాడు మృదు మధురమైన తన స్వరంతో ఇలా అన్నాడు.

'చూడు.ఇన్నాళ్ళూ నన్ను చక్కగా చూచుకున్నావు. నేను సంతోషించాను.ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరకు పోవాలనుకుంటున్నాను. నన్ను ఆ అమ్మాయికి ఇచ్చెయ్యి. నేను నీ దగ్గర లేనని అనుకోకు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను.ఈ శిలారూపంలో నీ వద్ద లేకపోయినా ఎల్లప్పుడూ నీ మనస్సులోనే నేను కొలువుంటాను.కనుక ఏ సంకోచమూ పెట్టుకోకుండా నన్ను ఆ అమ్మాయికి అప్పగించు.నాకు ఆ అమ్మాయి దగ్గర ఉండాలని ఉంది.'

'ఏ అమ్మాయికి నిన్ను ఇవ్వాలి?' అన్న సంశయం నిద్రలోనే ఆ సన్యాసినికి ఆలోచనారూపంలో కలిగింది.

లోకాలనన్నిటినీ వెలిగిస్తున్న ఒక చిరునవ్వును నవ్వాడు ఆ పిల్లవాడు.

అలా నవ్వుతూ పిల్లనగ్రోవిని పట్టుకున్న తన చెయ్యిని సాచి  ఒక వైపుగా చూపించాడు.

ఆ దిక్కుగా చూచిన సన్యాసినికి,  నిద్రపోతున్న మృడాని కనిపించింది.

కల చెదిరిపోయింది.

మర్నాడు ఉదయమే తన దారిన తను బయలుదేరి వెళ్ళడానికి సిద్ధమౌతూ,మృడానిని తన దగ్గరకు రమ్మని పిలిచింది ఆ సన్యాసిని.

మృడాని ఆమె దగ్గరకు వచ్చింది.

దామోదర సాలగ్రామాన్ని తన రెండు దోసిళ్ళ మధ్యన జాగ్రత్తగా పట్టుకుని ఉన్నది ఆ సన్యాసిని.ఆమె చేతులు రెండూ వణుకుతున్నాయి.ఆమె కనుల నుంచి నీళ్ళు ధారలుగా కారి చెంపలను తడిపేస్తున్నాయి. గద్గద స్వరంతో ఆమె ఇలా అన్నది.

'చూడు అమ్మాయీ ! ఇది ఉత్త రాయి కాదు. శక్తివంతమైన జాగృత దామోదర సాలగ్రామం.దీని విలువ అనంతం. ఇది సాక్షాత్తూ కృష్ణుడే.ఇది నీతో ఉండాలని కోరుకుంటోంది. కనుక దీనిని నీకిస్తున్నాను.నీ దగ్గర దీనిని భద్రంగా ఉంచుకో. ఇది నీతో ఉన్నంతసేపూ భగవంతుడే నీతో ఉన్నట్లు లెక్క.దీనిని జాగ్రత్తగా చూచుకో.'

ఇలా చెప్పి, ప్రతిరోజూ ఆ సాలగ్రామానికి ఏయే పూజలు చెయ్యాలో,ఎలా దానిని జాగ్రత్తగా చూచుకోవాలో వివరించి, ఆ సన్యాసిని తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆమె ఎవరో, ఆ తర్వాత ఏమై  పోయిందో ఎవరికీ తెలియదు.ఆమె మళ్ళీ వారింటికి తిరిగి రాలేదు.

శ్రీరామకృష్ణుని లీలలు చాలా అద్భుతంగా,చాలా ఊహాతీతంగా ఉంటాయి.

ఒక ఊహించని అద్భుతం జరిగినట్లుగా అవి ఉండవు. నిత్యజీవితంలో చాలా సాధారణంగా జరిగిన సంఘటనలలాగే అవి ఉంటాయి.అవి జరిగినప్పుడు అద్భుతాలని మనకు అనిపించవు కూడా.కానీ కొన్నేళ్ళ తర్వాత వెనక్కు తిరిగి చూచుకుంటే, ఆ అద్భుతాలు నిజంగా ఎంత అద్భుతమైనవో, వాటివల్ల మన జీవితాలలో ఎంతటి ఊహించలేని మార్పులు కలిగాయో, కలుగుతున్నాయో, అప్పుడర్ధమౌతుంది.

ఆయన చేసే అద్భుతాలు లౌకికమైనవి కావు.మనసును దైవోన్ముఖంగా మార్చేటట్లు అవి ఉంటాయి.వాటితో పోల్చుకుంటే 'పనులు కావడం, రోగాలు తగ్గడం' మొదలైన లౌకిక అద్భుతాలు అసలు అద్భుతాలే కావు.అవి చిల్లర గారడీలు.మనస్సును దైవోన్ముఖంగా మార్చడమూ జీవితాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడమే అసలైన అద్భుతం.

మృడాని జీవితంలో జరిగిన ఈ అద్భుతం కూడా అలాంటిదే.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక' అని శ్రీరామకృష్ణులు అనడమేమిటి? తర్వాత కొన్నాళ్ళకు రాసపూర్ణిమ రోజున ఆమే వెదుక్కుంటూ వెళ్లి అరటితోటలో ఉన్న ఆయన్ను కలుసుకుని దీక్షను పొందటం ఏమిటి? ఆ వెనువెంటనే శ్రీకృష్ణుని ప్రతిరూపమైన జాగృత దామోదర సాలగ్రామం ఆమెను వెదుక్కుంటూ రావడమేమిటి? అన్నీ చకచకా జరిగిపోయాయి.

శ్రీ రామకృష్ణుల చిన్నమాట కున్న శక్తి అది !! అది జీవితాన్నే మార్చేస్తుంది.


ఆ విధంగా కృష్ణరూపమైన సాలగ్రామం తనవద్దకు వచ్చినప్పటి నుంచీ మృడాని తదేక దీక్షతో దానిని ఆరాధిస్తూ,కృష్ణుని ధ్యానిస్తూ ఉండేది.


ఈ విధంగా కొన్నేళ్ళు గడిచిపోయాయి.


మృడానికి పదమూడేళ్ళు వచ్చాయి.అప్పట్లో ఆడపిల్లలకు పెళ్లి ఈడంటే అదే.ఇంకా చెప్పాలంటే అప్పటికే చాలా ఆలస్యం అయినట్లుగా ఆకాలంలో భావించేవారు.అప్పటికి పెళ్లి చెయ్యకపోతే ఇరుగూ పొరుగుల సూటీపోటీ మాటలూ బంధువుల దెప్పులూ,ఇంకా ఆలస్యమైతే వ్యక్తిత్వం మీద నిందలూ భరించవలసి వచ్చేది. అందుకని తల్లిదండ్రులు మృడానికి పెళ్లిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు.


చిన్నప్పటినుంచీ వైరాగ్య మనస్కురాలైన ఈ పిల్లకు పెళ్లి అంటే సుతరామూ ఇష్టం లేదు.తాను పెళ్లి చేసుకోనని తల్లితో తరచూ చెప్పేది.


కూతురి పోకడ చిన్నప్పటినుంచీ తెలిసినా, వయసులో ఉన్న పిల్లలు మామూలుగా మాట్లాడే చపల సంభాషణగా ఆ మాటలను భావించి తల్లి పెద్దగా పట్టించుకునేది కాదు.వారి మానాన ఆ తల్లిదండ్రులు తమ కూతురికి సంబంధాలు చూస్తూ ఉండేవారు.


ఈ అమ్మాయి అభ్యంతరాలను ఏమీ పట్టించుకోకుండా,చివరకు ఈమె అక్కగారి భర్తయైన భోలానాద్ ముఖోపాధ్యాయ కు ఈమెనిచ్చి పెళ్లి చెయ్యాలని అందరూ కలసి నిశ్చయం చేశేశారు.ముహూర్తం కూడా పెట్టేశారు.


చివరకు పెళ్లి రోజు రానే వచ్చేసింది.


అప్పటిదాకా అక్కడే ఉన్న మృడాని ఉన్నట్టుండి మాయం అయిపోయింది.ఎంత వెదికినా ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలియడం లేదు.వెదుకగా వెదుకగా మారుమూల కొట్టుగది లోపలనుంచి గడియ పెట్టబడి కనిపించింది.

వాళ్ళింట్లో మారుమూల గది ఒకటి ఉండేది.దానిని సామాన్లు దాచే కొట్టుగదిగా వాడేవారు.
మృడాని పోయి ఆ గదిలో దూరి లోపలనుంచి తలుపు గడియ వేసేసుకుంది.తనతో బాటు తన కృష్ణుడిని (దామోదర సాలగ్రామాన్ని) తోడుగా ఉంచుకుంది.

ఎవరు ఎన్ని రకాలుగా తలుపు కొట్టినా బతిమాలినా భయపెట్టినా ఆ పిల్ల తలుపు తియ్యడం లేదు.చివరకు అందరూ కలసి ఆమె తల్లియైన గిరిబాలను అస్త్రంగా ప్రయోగించారు.ఆమె వచ్చి తలుపు దగ్గర ఏడుస్తూ ప్రాధేయపడింది. తల్లి ఏడుపు విని కరిగిపోయిన 
మృడాని తలుపు ఓరగా తీసి తల్లిని మాత్రం లోనికి రానిచ్చింది.ఈ పెళ్లిని తాను ఎట్టి పరిస్థితులలోనూ చేసుకోనని ఖరాఖండిగా తల్లితో చెప్పేసింది మృడాని.

పోనీ ఎవరిని చేసుకుంటావో చెప్పమని అడిగిన తల్లితో - తాను మామూలు మనిషిని పెళ్లి చేసుకోననీ,తనకు శ్రీకృష్ణుడే చెలికాడనీ,ఈరోజు ఉండి రేపు పోయే పురుషులకంటే, శాశ్వతుడైన పురుషోత్తముడే కోరదగినవాడనీ,తల్లితో స్పష్టంగా చెప్పేసింది ఆ పదమూడేళ్ళ అమ్మాయి.

అంత చిన్నవయసులో ఏమిటా పరిపక్వత !! ఏమిటా వైరాగ్యం !! మనలాంటి క్షుద్రులకు అసలు ఊహకైనా అందుతుందా ఆ మానసిక స్థాయి?


ఎన్నో వందల ఏళ్ళ క్రితం ఒక పార్వతి, ఒక రాధ, ఒక మీరా,ఒక అక్కమహాదేవి అన్న మాటలనే 140 ఏళ్ళ క్రితం మృడాని మళ్ళీ అన్నది.

"కాలమనే వంటింటిలో ఆహారంగా మారే అల్పులైన మగవాళ్ళు నాకొద్దు. కాలాతీతుడై మరణం లేకుండా నిత్యమూ వెలిగే పరమేశ్వరుడే నా భర్తగా కావాలి." అని అక్కమహాదేవి ఎప్పుడో అన్నమాటలను మృడాని ఈరోజు మళ్ళీ అన్నది.

ఈ రక్తం భారతదేశంలో ఉన్నంతవరకూ ఈ దేశానికి చ్యుతి లేదు.ఇలాంటి మాటలు ఈ దేశపు పౌరులలో కనీసం కొద్దిమంది నుంచైనా వినపడుతూ ఉన్నంత వరకూ ఈ దేశానికి పతనం లేదు.ఈ జీన్స్ ఈ దేశంలో ఉన్నంతవరకూ ఈ దేశానికి భగవంతుని అనుగ్రహం ఉంటూనే ఉంటుంది.ఇలాంటి మనుషులు పుడుతూ ఉన్నంత వరకూ ఈ దేశంలో నిజమైన ఆధ్యాత్మిక పవనాలు వీస్తూనే ఉంటాయి. దైవాన్ని చేరుకునే మార్గం తేటతెల్లం అవుతూనే ఉంటుంది.

కూతురి మాటలు విన్న గిరిబాలకు ఒకవైపు ఆనందం, ఒకవైపు భయం,ఒకవైపు బాధ కలిగాయి.ఇలా పరస్పర విభిన్న భావాలతో సతమతమై పోయిందా తల్లి.కూతురు సరదాకి ఈ మాటలు చెప్పడం లేదనీ,తన సంకల్పం చాలా దృఢమైనదే అనీ ఆమెకు నమ్మకం కుదిరింది.

'సరేనమ్మా! నీ సంకల్పం నాకర్ధమైంది. నువ్వు మామూలు మనిషివి కావు.
నీవు కారణ జన్మురాలవు. సరే ఒకపని చెయ్యి. నీవు వెంటనే ఈ కిటికీలోంచి దూకి వేరే ఊరిలో ఉన్న మన మేనత్త గారి ఇంటికి పారిపో.నువ్వు ఇక్కడే ఉంటే, ఇదే ముహూర్తానికి నీకు ఈ పెళ్లి తప్పకుండా చేసేస్తారు ఈ బంధుజనం.ఒక తల్లిగా నీకు నేను చెయ్యగల సహాయం ఇదే.' అని చెప్పిన గిరిబాల కిటికీ తలుపు తెరిచి అందులోనుంచి మృడాని పారిపోవడానికి సహాయం చేసింది.

కిటికీ లోనుంచి దూకిన 
మృడాని తన దామోదర సాలగ్రామ శిలను భద్రంగా పట్టుకుని ఆ చీకట్లో పరిగెత్తుకుంటూ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న తన మేనత్త గారి ఊరికి చేరుకుంది. అంత రాత్రి పూట ఆ చిన్న పిల్ల ఒంటరిగా ఆ చీకట్లో ఒక ఊరినుంచి ఇంకొక ఊరికి దారీ తెన్నూ లేని పొలం గట్లవెంట పరుగెత్తుకుంటూ ఎలా వెళ్లిందో ఆ దేవుడికే ఎరుక !!

తలుపు తెరిచి బయటకొచ్చిన గిరిబాల ఏ కధను వారికి వినిపించిందో,బంధువులందరూ ఎన్నెన్ని మాటలన్నారో పెళ్లి ఆగిపోయి పిల్ల మాయమైందని తండ్రి ఎంత బాధపడ్డాడో ఎవరికీ తెలియదు.


ఆ విధంగా మేనత్త ఇంటికి చేరిన 
మృడాని కొన్నాళ్ళు అక్కడ తన సాధన చేసుకుంటూ స్థిరంగా ఉంది.ఆ తర్వాత అక్కడ నుంచి హిమాలయాలకు పారిపోదామని ఎత్తు వేసింది.కానీ ఇలాంటి పనేదో చేస్తుందని పసిగట్టిన మేనత్త,నిరంతరం కళ్ళలో వత్తులు వేసుకుని మృడానికి కాపలా కాస్తూ ఉండేది. అందుకని మృడాని ప్రయత్నాలు ఫలించలేదు.

గొడవ కాస్త సద్దు మణిగాక తల్లి దండ్రులు వచ్చి 
మృడానిని ఒప్పించి మళ్ళీ తమతో ఇంటికి తీసుకెళ్ళారు.

ఆ విధంగా కొన్నేళ్ళు తమ ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవడానికి 
మృడానికి అవకాశం లభించింది.కానీ ఇంటిలోని లౌకిక వాతావరణంలో ఉంటూ సాధన చెయ్యడం ఆమెకు నచ్చేది కాదు.ఆమె మనసు ఎంతసేపూ హిమాలయాల వైపు సాగిపోతూ ఉండేది.అక్కడ అన్నింటినీ త్యజించిన సాధువులు, సన్యాసులు,ఏకదీక్షతో భగవంతుని కోసం ఎలా తపస్సు చేస్తూ పునీతులౌతూ ఉంటారో ఆమె విన్న కధలన్నీ ఆమెను శాంతిగా ఉండనిచ్చేవి కావు. అనుక్షణం ఆమె హిమాలయాలకు వెళ్లాలని తపిస్తూ ఉండేది.కానీ నిరంతరం కనిపెట్టి చూచుకుంటున్న తల్లిదండ్రుల కళ్లుగప్పి పారిపోవడం ఆమెకు కుదిరేది కాదు.

ఇలా కొన్నేళ్ళు గడిచాక,ఒకరోజున తెలతెలవారే సమయంలో అందరి కళ్ళు గప్పి 
మృడాని ఇంట్లోనుంచి బయటపడింది. గంగానదికి స్నానానికి పోతున్నదేమోలే అనుకుని వాకిట్లో ఉన్న కాపలాదారు మౌనంగా చూచీ చూడనట్లు ఊరుకున్నాడు. కానీ మృడాని గంగానది వైపు కాకుండా ఊరిబైటకు పోయే దారిపట్టుకునే సరికి అతనికి అనుమానం వచ్చి పెద్దగా కేకలు పెట్టి అందర్నీ నిద్రలేపేశాడు.అందరూ వచ్చి మృడానిని పట్టుకుని మళ్ళీ ఇంటిలో బంధించారు.

ఈ పిల్లను ఇలా గృహఖైదు చెయ్యడం కష్టం అనీ, ఎన్నో ఏళ్ళు ఇలా చెయ్యలేమనీ గ్రహించిన తల్లి దండ్రులు, బంధువులతో కలసి దగ్గర దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఆ అమ్మాయికి అనుమతి ఇచ్చారు.ఆ విధంగా ఆమె దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలను చూడగలిగింది.


కానీ ఆమెలో ఏదో తెలియని తపన నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండేది.అది ఆమెను శాంతిగా ఉండనిచ్చేది కాదు.ఏదో తెలియని గమ్యం ఆమెను ఎక్కడనుంచో పిలుస్తున్నట్లు తోచేది.ఆ పిలుపు ఫలితంగా ఇంట్లో ఉండటం ఆ అమ్మాయికి అసాధ్యం అయ్యేది.


ఈ విధంగా ఏళ్ళు గడుస్తూ ఉండగా ఈమెకు పద్దెనిమిదేళ్ళు వచ్చాయి.ఒకరోజున మేనత్త మేనమామ ఇంకా కొందరు బంధువులు గంగాసాగర్ యాత్రకు బయలుదేరారు.వాళ్ళ గుంపు దాదాపు ముప్పై మంది ఉండటంతో వాళ్ళతో బాటు 
మృడాని, గిరిబాలా కూడా బయలుదేరారు.కానీ చివరి క్షణంలో ఏదో అనారోగ్యం వల్ల గిరిబాల ప్రయాణం మానుకోవలసి వచ్చింది.పెద్ద బలగమే ఉన్నది కదా అన్న నమ్మకంతో మృడానిని ఒక్కదాన్నే వాళ్ళతో పంపడానికి ఒప్పుకున్నారు తల్లిదండ్రులు.

గంగాసాగర్ చేరాక కొన్నాళ్ళు ఆమె ఆనందంగా ఉన్నది.తన సాలగ్రామానికి పూజ చేసుకుంటూ,దానిని ఆరాధిస్తూ కృష్ణధ్యానంలో ఉంటూ హాయిగా కాలం గడిపేది.పాతకాలంలో తీర్ధ యాత్ర అంటే,పొద్దున్న పోయి సాయంత్రానికి తిరిగి వచ్చే పిక్నికు లాగా ఉండేది కాదు.కనీసం మూడురోజులు అక్కడ ఉండి,జపధ్యానాది అనుష్టానాలు చేసి, ఆ క్షేత్రదేవతానుగ్రహం పొంది వెనక్కు వచ్చేవారు చాలామంది.అసలైన తీర్ధయాత్ర అంటే అలాగే చెయ్యాలి.అంతేగాని నేటివారి వలె పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ యాత్రలు చెయ్యకూడదు.


అంతా బాగానే ఉన్నది కదా అని ఆమె మీద నిఘాను కొంచం తగ్గించారు బంధువులు. అదే అదనుగా భావించి ఒకరోజున ఉన్నట్టుండి దామోదర శిలతో సహా చెప్పాపెట్టకుండా మాయమై పోయింది
మృడాని.ఒక గిరిజన యువతిలా వేషం మార్చేసిన ఆమె హరిద్వార్ వెళుతున్న ఒక సాధువుల గుంపులో కలసిపోయి హిమాలయాల వైపు సాగిపోయింది.

ఆమెకోసం చాలా గాలించారు బంధువులు.కానీ ఆమె జాడా జవాబూ ఎక్కడా లేదు. ఇక చేసేది లేక ఈసురోమంటూ కలకత్తాకు వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పేశారు.


వయసులో ఉన్న పిల్ల.ఒంటరిది.ఎక్కడుందో ఏమైపోయిందో? అన్న భయంతో నిర్ఘాంతపోయిన గిరిబాల బెంగతో మంచం పట్టేసింది.కానీ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆమెను చల్లగా కాపాడాలని ప్రార్ధిస్తూ మౌనంగా రోదిస్తూ ఉండిపోయింది ఆ పిచ్చితల్లి.


ఇక్కడ - సాధు బృందంతో హిమాలయాలకు బయల్దేరిన మృడాని ఎట్టకేలకు తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. కాలినడకన ప్రయాణిస్తూ,దారిలో భిక్షాటనం చేత కడుపు నింపుకుంటూ,కృష్ణధ్యానంలో తపిస్తూ, తనదగ్గరున్న దామోదర శిలను నిరంతరం భద్రంగా చూచుకుంటూ,దానిని నిత్యమూ ఆరాధిస్తూ,నాలుగు నెలల కాలినడక తర్వాత కలకత్తా నుంచి తపోభూమి అయిన హిమాలయాలకు  చేరుకుంది ఆ పిల్ల.


హిమాలయాలు కనిపించే సరికి ఆ అమ్మాయి పులకించి పోయింది.పరమశివుడు నిరంతరం కొలువుండే కొండలు తన కెదురుగా కన్పించే సరికి అన్నీ మరచిపోయింది.ఎక్కడ చూచినా,అన్నీ వదిలేసి నిరంతరం దైవం కోసం తపిస్తూ ధ్యానంలో మునిగి ఉన్న సాధువులు తపస్వులు ఆమెకు కనిపించారు.వారిని చూచి మైమరచి పోయింది.ఇన్నాళ్ళకు తన స్వప్నం సాకారం అయింది, ఇక తను కూడా తన ప్రాణేశ్వరుడైన కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నిరంతరం ఆయనకోసం తపిస్తూ,ఏ విధమైన బాదరబందీలు లేకుండా హాయిగా తపస్సు చేసుకోవచ్చని ఉప్పొంగి పోయింది.

అప్పటికి ఆమెకు సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు.


(ఇంకా ఉంది)