Pages - Menu

Pages

31, జులై 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 33 (గౌరీమా - ఊహాతీత తపోమయ జీవితం)

హరిద్వార్ నుంచి ఋషీకేశ్ కు అదే సాధువుల గుంపుతో కలసి ఆమె చేరుకుంది.ఆ తపోభూమికి చేరుకున్న తదుపరి వారినుంచి సెలవు తీసుకుని ఒంటరిగా హిమాలయ పర్వతాలలో సంచరించ సాగింది.

హిమాలయాలలో గడపిన మూడేళ్ళలో అనేక క్షేత్రాలను ఆమె దర్శించింది.బదరీనాథ్, కేదార్ నాద్,రుద్రప్రయాగ, అమర్నాథ్,ఉత్తరకాశీ వంటి లోతట్టు హిమాలయ ప్రాంతాలలో ఉన్న అన్ని క్షేత్రాలను ఆమె దర్శించింది.నిరంతరం ఆమె మనస్సు దైవధ్యానంలో మునిగి ఉండేది.

తనతో తెచ్చుకున్న గుడ్డసంచిలో - తనకు ప్రాణప్రదమైన దామోదర సాలగ్రామం,కాళీమాత చిత్రం, చైతన్యమహాప్రభువు చిత్రం, దుర్గాసప్తశతి, మహాభాగవతాలను మాత్రమే ఆమె తనతో ఉంచుకునేది. ఇవి తప్ప ఆమెదగ్గర ఇంకే వస్తువులూ ఉండేవి కావు.

తను ఆడపిల్లనన్న విషయం లోకులకు తెలియకుండా ఉండేందుకు ఆమె జుట్టును పొట్టిగా కత్తిరించి పారేసింది.అందవికారంగా కనిపించడానికి ముఖానికి ఒంటికి బురదను, బూడిదను పూసుకునేది.ఆ విధమైన బికారివేషంలో నిరంతరం కృష్ణధ్యానంలో తపిస్తూ, చలిని, ఆకలిదప్పులను సహిస్తూ,ఎక్కడో తింటూ ఎక్కడో నిద్రిస్తూ హిమాలయాలలో మూడేళ్ళపాటు ఘోరమైన తపస్సు చేసింది ఆ అమ్మాయి.

ఆ మూడేళ్ళలో ఆమె స్థిరంగా ఏ క్షేత్రంలోనూ పట్టుమని పదిరోజులు ఉండేది కాదు.బాగా అవసరం అయితే తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు. పూర్తిగా మౌనదీక్షలో ఉండేది.ఏ సాధుబృందంతోనూ ఎక్కువరోజులు కలసి ఉండేది కాదు. ఏం కట్టుకుందో ఏం తిన్నదో ఏ చెట్లక్రింద నిద్రించిందో ఆ పర్వతాలలో ఆ అడవులలో ఒక్కతే కాలినడకన అన్నన్ని వందల మైళ్ళు దైవం పైన భారం వేసి ఎలా నడిచిందో ఆమెకే తెలియాలి.

ఆమె మనస్సులో సర్వకాల సర్వావస్థలలోనూ కృష్ణుడే మెదులుతూ ఉండేవాడు.నిరంతరం ఆయన ధ్యాస తప్ప ఇంకేమీ ఆమెకు ఉండేది కాదు.

ఎప్పుడైనా రాత్రిపూట కొత్త ప్రదేశంలో ఒక్కతే ఉండవలసి వస్తే, రాత్రంతా నిద్రపోకుండా జపంలోనూ ధ్యానంలోనూ గడిపేది.లేదా గొంతెత్తి కీర్తనలు పాడుతూ తెల్లవార్లూ గడిపేది.

అప్పటివరకూ సుఖంగా తల్లిదండ్రుల చాటున ఉంటూ వేళకు తింటూ చీకూచింతా లేకుండా హాయిగా కాలం గడిపిన పిల్ల.ఒక్కసారిగా ఇటువంటి మార్పుకు ఆమె శరీరం తట్టుకోలేక పోయింది.కానీ అతి త్వరలోనే ఆమె హిమాలయాల చలికి, పస్తులుండటానికి, అనారోగ్యాలకు,మిగిలిన బాధలకు అలవాటు పడింది.

చాలామందికి ఒక సందేహం వస్తుంది. హాయిగా ఇంటి పట్టున ఉండకుండా ఇలాంటి జీవితాన్ని కోరి వరించడం,అందులోనూ వయసులో ఉన్న ఆడపిల్లకు,ఇవన్నీ అవసరమా? ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవచ్చు కదా? అని.

తీవ్రమైన వైరాగ్య జ్వాల మనసులో రగులుతున్నవారి అంతరంగం ఏమిటో అలాంటి స్థితిని అనుభవించిన వారికే అర్ధమౌతుంది గాని బయటనుంచి చూచేవారికి అర్ధంకాదు. ప్రపంచం పట్ల విరక్తీ, భగవంతుని పట్ల తీవ్రమైన తపనా ఉన్నవారి మానసిక స్థాయిని, ఎంతసేపూ తమ సుఖం తాము చూచుకుని,తమ స్వార్ధంకోసం ఎదుటిమనిషికి ఎలాంటి అన్యాయమైనా సరే చెయ్యడానికి ఏమాత్రమూ వెనుదియ్యని మనవంటి క్షుద్రులు ఎంతమాత్రమూ అర్ధం చేసుకోలేరు.

మరి ఆమూడేళ్ళూ ఆ అమ్మాయికి దిక్కెవరు అని అనుమానం వస్తుంది. 'దిక్కులేనివారికి దేవుడే దిక్కు' - అనే సామెత మనకు ఉన్నది.దిక్కులేనివారికే కాదు అందరికీ ఆ దేవుడే నిజమైన దిక్కు. ఎవరికైనా సరే, మనుషుల దిక్కు ఎంతవరకు? నిజంగా ఆలోచిస్తే మనిషికి ఇంకొక మనిషి ఎప్పటికైనా రక్షణ కల్పించగలడా?ఈ ప్రపంచాన్నీ ఈ సమస్తాన్నీ సృష్టించి రక్షిస్తున్న దైవమే ఎవరికైనా సరే నిజమైన దిక్కు.మనం అనుకునే ఇతర దిక్కులన్నీ నిజానికి దిక్కులు కావు. అవన్నీ పెద్ద భ్రమలు.

"అనన్యాశ్చింతయం తో మాం యే జనా: పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్"

"ఎవరైతే ఇతరములేవీ చింతించకుండా ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారి బాగోగులు నేనే చూచుకుంటాను."

అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు వాగ్దానం చెయ్యలేదా? దైవం ఇచ్చిన వాగ్దానం వృధాగా పోతుందా? కానీ ఆ విధంగా ఉండేవారేరి? కోటికి ఒకరైనా ఆవిధంగా ఉన్నవారున్నారా?అందరూ వారివారి అనుమానాలతో భయాలతో,స్వార్ధాలతో, అల్పమైన మనస్తత్వాలతో,అహంకారాలతో,కుళ్ళూ కుతంత్రాల తో కునారిల్లుతున్నవారేగాని చిత్తశుద్ధితో ఈ దైవ వాగ్దానాన్ని పరీక్షించి చూచిన వారెవరున్నారు? ఒకవేళ అలా ఉండి, ఆశాభంగం పొందిన వారు మాత్రం ఎవరున్నారు?

ఆ మూడేళ్ళలో మృడాని ఎన్నో దైవానుభూతులను పొందింది.నిరంతరమూ దైవం తనకు రక్షణగా ఉన్న అనుభూతిని ఆమె ఎన్నో సార్లు గమనించింది.చాలాసార్లు - ఊహించని మనుషుల నుంచీ ఊహించని పరిస్థితుల నుంచీ ఆమెకు సహాయం అందేది. ఎన్నో రోజులు తిండిలేక ఆమె పస్తులుంది.కానీ ఆకలిని లెక్కచెయ్యకుండా రోజంతా ధ్యానంలో కదలకుండా కూచుని ఉండేది.సాయంత్రానికి ఎవరో ఒకరు ఆహారం తెచ్చి ఆమె పక్కన ఉంచి పోయేవారు.కొన్నిసార్లు ఆ ఆహారాన్ని ఆమె తినేది.కొన్నిసార్లు కుక్కలు పిల్లులు మొదలైన జంతువులు ఆ ఆహారాన్ని తినేసేవి. తను మాత్రం దేహస్పృహ లేని ధ్యానంలో తన్మయురాలై ఉండేది.

ఈ విధమైన తపోదీక్షలో ఆ అమ్మాయి హిమాలయాలలో మూడేళ్ళు గడిపింది. ఈ మూడేళ్ళలో కృష్ణునిపైన ఆమె ప్రేమ ఊహించలేనన్ని రెట్లు పెరిగిపోయింది.నిరంతరం కృష్ణుని దర్శించాలని అతనిలో లీనం కావాలని తపించసాగింది.ఆ తపన ఆమెను హిమాలయాల నుంచి కృష్ణలీలా క్షేత్రమైన బృందావనం వైపు ఈడ్చుకొచ్చింది.కానీ అక్కడ యాత్రలకు వచ్చిన ఈమె బంధువు ఒకాయన ఈమెను గుర్తుపట్టి ఈ విషయాన్ని ఈమె తల్లిదండ్రులకు చేరవేశాడు.మళ్ళీ వాళ్ళు వచ్చి తనను ఇంటికి తీసుకుపోతారేమోనన్న భయంతో ఆమె బృందావనాన్ని వదలి పశ్చిమ దిక్కుగా ప్రయాణం సాగించింది.త్వరలోనే ఆమె ద్వారకా నగరాన్ని చేరుకుంది.

బృందావనం కృష్ణుని బాల్యక్రీడకు రంగస్థలం అయితే, ద్వారకా నగరం ఆయన రాజుగా రాజ్యం నడిపిన ప్రాంతం.తన రాజ్యం స్థాపించుకోవడానికి ఎక్కడా చోటు దొరకక, చివరకు సముద్రం వెనక్కు పోగా బయటపడిన ప్రాంతాన్ని తన రాజ్యంగా చేసుకుని అక్కడ ఉన్నాడాయన.అది కూడా ఆయన యొక్క దివ్యలీలకు భూమిక అయిన ప్రాంతమే.అక్కడ కూడా అనేక దేవాలయాలు ఆయనకు ఉన్నాయి.

అక్కడ రణచోడ్ జీ ఆలయంలో ఆమెకు ఒక దివ్యానుభవం కలిగింది.

ఆ ఆలయంలో ఉన్న కృష్ణుని విగ్రహం చాలా అందంగా ఉంటుంది.ఆ ఆలయానికి ఆమె చేరుకునే సరికి ఆరోజుకు కృష్ణునికి నైవేద్యం పెట్టడం అయిపొయింది.దేవాలయంలో కొంచం పక్కగా కూచుని ఆమె ధ్యానంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా ఆమె ఒక దృశ్యాన్ని చూచింది.

చాలా అందంగా ఉన్న ఒక నల్లని పిల్లవాడు అప్పుడే అన్నం తిని ఇంకా మూతి కడుక్కోకుండా,పెరుగన్నం అంటుకుని ఉన్న పెదవులతో నవ్వుతూ ఈమె ఎదురుగా నిలుచున్నట్లు హటాత్తుగా ఈమెకు కనిపించింది.మొదట్లో ఆ పిల్లవాడు కృష్ణుడని ఆమెకు తోచలేదు.ఎందుకంటే, దైవదర్శనాలలో సామాన్యంగా ఉండే వెలుగు మొదలైన లక్షణాలు ఆ దర్శనంలో లేవు.ఒక మామూలు పిల్లవానిలాగే కృష్ణుడు ఆమెకు కనిపించాడు.

ఇదేంటి? ఈ ఊరిలో పూజారులు తమ పిల్లలను గుడికి తీసుకువచ్చి వారికి ఇక్కడే అన్నం తినిపిస్తారేమో? ఇది ఇక్కడి పద్ధతేమో? అని ఆమె అనుకుంది.అలా అనుకుని చూస్తూ ఉండగానే ఆ పిల్లవానికి పూజారి నీళ్ళు ఇవ్వడమూ ఆ నీటితో మూతి కడుక్కున్న ఆ పిల్లవాడు పక్కనే ఉంచిన తన మురళిని తీసుకుని నవ్వుతూ గర్భగుడిలోని సింహాసనం మీద కూచోవడమూ ఆమె చూచింది.ఆ క్షణంలో - తాను చూస్తున్నది కృష్ణుడినే అన్న స్పృహ ఆమెకు కలిగింది. అలా ఆమెకు ఆ స్పృహ కలిగిన మరుక్షణమే ఆ దృశ్యం మాయమై పోయింది.

ఒక్క ఒదుటున లేచిన మృడాని పిచ్చిదానిలా పరుగెత్తుకుంటూ గర్భగుడి గడప వద్దకు వెళ్లి అక్కడ కూలిపోయి భోరుమంటూ ఏడవసాగింది. ఇదంతా చూస్తున్న పూజారులు ఆమె వద్దకు వచ్చి - 'పాపం ఈ పిల్లకు ఏం కష్టం వచ్చిందో?' - అంటూ ఓదార్చడానికి ప్రయత్నించసాగారు. కానీ ఆ ఏడుపు - కష్టాలనుంచి పుట్టిన మామూలు ఏడుపు కాదన్న సంగతి వారికెలా తెలుస్తుంది?

కృష్ణుడు చాలా అల్లరివాడు.తన ప్రేమికులను ఆయన భలే ఏడిపిస్తాడు.అలా ఆ గడప పైన పడి ఎంత ఏడ్చినా ఆ నల్లనివాడు మళ్ళీ మృడానికి కనిపించలేదు. ఎంత ఏడ్చినా ఉలకడు.పలకడు.తన గోపికలతో ఈ విధంగా దాగుడు మూతల ఆటలాడటం అంటే ఆయనకు భలే సరదాగా ఉంటుంది కాబోలు.

ద్వారకలో ఆ అనుభవం కలిగిన తదుపరి ఆమె మనస్సు మళ్ళీ బృందావనం వైపు బలంగా లాగబడింది.పగలూ రాత్రీ ఒకటే ఆలోచన ఆమెను వెంటాడి వేధించేది. నిరంతరం కృష్ణునితో ఎలా కలసి ఉండాలి? ఎప్పుడూ వీడిపోకుండా తన ప్రియునితో ఆనందసాగరంలో మునిగి రోజులు ఎలా గడపాలి? ఎల్లప్పుడూ ఇదే ఆలోచన ఆమెను భూతంగా వెంటాడేది. రేయింబవళ్ళు వేధిస్తున్న ఈ తపనను తట్టుకోలేక మళ్ళీ వెనక్కు తిరిగి బృందావనం చేరుకున్నది ఆమె.

ఒకసారి బృందావనం చేరుకున్నాక ఆమె తపన మరీ ఎక్కువైపోయింది.కృష్ణధ్యానంలో తనను తాను మరచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కదలకుండా కళ్ళు తెరవకుండా ఆమె ధ్యానంలో ఉండేది.తిండీ తిప్పలూ ఆమె దృష్టినుంచి మాయమై పోయాయి.ధ్యానం చెయ్యని రోజులలో బృందావనపు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉండేది.లేదా యమునా తీరంలో పిచ్చిదానిలా సంచరిస్తూ -' కృష్ణా ఎక్కడున్నావు? ఈ పిచ్చిదాన్ని కరుణించవా? కనిపించవా?నీకోసం ఇల్లూ వాకిలీ వదిలేసి ఇలా తిరుగుతున్నాను.నువ్వు కరుణామయుడవని అంటారు కదా. మరి నన్ను ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు?అన్నీ ఒదిలి నీకోసం ఇలా అలమటిస్తున్నాను.ఒక్కసారి కనిపించు. ఆనందమయమైన నీ దర్శనాన్ని ఒక్కసారి కలిగించు.' అని ఏడుస్తూ ఉండేది.

వేలసంవత్సరాల క్రితం రాధాదేవి ఎలాగైతే కృష్ణుని కోసం తపించిందో,పిచ్చిదానిలా చెట్లూ పుట్టలూ పట్టుకుని ఆయనకోసం యమునాతీరంలో వెదికిందో,పక్షులనూ మేఘాలనూ నదినీ మొక్కలనూ పువ్వులనూ తుమ్మెదలనూ ఆయన జాడ చెప్పమని ఏ విధంగా బ్రతిమాలిందో,అలా వెదికినప్పుడు ఆమెను ఏ ప్రేమోన్మాదం ఆవహించిందో,ఇప్పుడు మృడానిని అదే ఉన్మాదం ఆవహించింది.చూచేవారికి ఆమె ఒక అడుక్కుంటూ తిరిగే మతిస్థిమితం లేని పిచ్చిదానిలా తోచింది.

రోజులు గడిచే కొద్దీ ఆమె వేదన భరించలేనంతగా పెరిగి పోయింది.కానీ కృష్ణుని జాడా జవాబూ ఎక్కడా లేదు.అసలు తన గోడు ఆయన వింటున్నాడో లేదో కూడా తెలియడం లేదు.ఇలా కొన్ని నెలలు గడచే సరికి మృడానికి జీవితం మీద తీవ్రమైన విరక్తి వచ్చేసింది.ఈ పాడు బ్రతుకు బ్రతకకపోతే ఏం? తన కృష్ణుడు లేని జీవితం తనకెందుకు? ఎన్నాళ్ళు ఇలా వృధాగా బ్రతికినా ఉపయోగం ఏముంది?అన్న ఆలోచనలు ఆమెను చుట్టు ముట్టాయి.తీవ్రమైన విరక్తి నిండిన ఆమె తన జీవితాన్ని అంతం చేసుకుందామని నిశ్చయించుకుంది.

ఒకరోజు రాత్రి బాగా చీకటి పడిన తర్వాత దగ్గరలోనే ఉన్న "లలితాకుండం" అనబడే మడుగు దగ్గరకు ఆమె చేరుకుంది.చాలాసేపు ఆ నీటి మడుగు ఒడ్డునే ఆమె ఆ చీకట్లో మౌనంగా కూర్చుని ఉండిపోయింది.తన తల్లిదండ్రులను స్మరించింది.అనుకోకుండా తనకు తటస్థపడి మంత్రోపదేశం చేసి మళ్ళీ కనిపించకుండా పోయిన ఆ అజ్ఞాత యువక గురువును మనస్సులో తలుచుకుంది. తన ప్రాణానికి ప్రాణం అయిన కృష్ణుణ్ణి స్మరించింది.ఆయనతో ఇలా చెప్పింది.

'ప్రభూ.నీకోసం అన్నీ ఒదులుకున్నాను.ఎన్నో కష్టాలను భరిస్తూ సహిస్తూ నీ ధ్యానంలో ఇన్నేళ్ళు గడిపాను.నిరంతరం నిన్నే ప్రార్ధించాను.నీ ధ్యాసలోనే కాలం గడిపాను.కానీ నీ కరుణ నాకు అందలేదు.నీ దర్శనం నాకు నిరంతరం కలగడం లేదు. ఎప్పుడో నీకిష్టమైనప్పుడు ఒక్క క్షణకాలం కనిపిస్తున్నావు.మళ్ళీ మాయావిలా మాయమై పోతున్నావు.ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ కన్పించవు. ఎందుకు నన్నిలా వేధిస్తున్నావు? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు?ఈ వేదన నేను భరించలేను. నువ్వు లేని ఈ బ్రతుకు నాకొద్దు.ఈ శరీరమే కదా నీకూ నాకూ అడ్డంగా ఉన్నది?ఇదేకదా నిన్నూ నన్నూ వేరు చేస్తున్నది?అందుకే ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను.నేనూ నీ దగ్గరకే వస్తున్నాను.కనీసం ఇప్పుడైనా నన్ను కరుణించు.నన్ను నీ ఒడిలోకి చేర్చుకో.కనీసం ఇప్పుడైనా నన్ను అనుగ్రహించు.' - ఇలా ప్రార్ధిస్తూ చేతులు జోడించి నిశ్చలమైన మనస్సుతో కృష్ణుని ధ్యానిస్తూ ఆ మడుగులోకి నడుస్తూ వెళ్ళిపోయింది మృడాని.

అప్పుడొక మహాద్భుతం జరిగింది.

ఎంతో లోతైన ఆ మడుగులో ఎంతదూరం నడచినా ఆమెకు అడుగు తగలడం లేదు.ఇదేమి వింత? ఎంతో లోతుగా ఉండే ఆ చెరువు ఆరోజు హటాత్తుగా ఎండిపోయిందా?లేక, నడుస్తున్నానని భ్రమిస్తూ ఆమె అక్కడే నిలుచుండి పోయిందా?ఏది ఏమైనప్పటికీ, అలా నడుస్తూ ఆ మడుగులోకి పోతున్న ఆమె కళ్ళ ఎదురుగా హటాత్తుగా ఒక మహాద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

అప్పటివరకూ తన చుట్టూ ఉన్న చీకటి ఉన్నట్టుండి మాయమై పోగా, ఆ స్థానంలో తెల్లని పాలవెన్నెల పరుచుకుంది.ఆ చీకటి రాత్రి ఒక్క క్షణంలో పున్నమిరాత్రిగా మారిపోయింది.తన చుట్టూ ఉన్న చీకటి పరిసరాలు ఏదో తెలియని మంత్రం వేసినట్లు మాయమై పోయాయి.ఆ స్థానంలో మణుల కాంతులతో మెరుస్తున్న లతలూ పూపొదలూ వెన్నెలలో మెరిసిపోతూ దర్శనమిచ్చాయి.ఆ పొదలలో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి.చిలుకలు కోయిలలు మధురంగా కూస్తున్నాయి.తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ ఎగురుతూ పూల మకరందాలను గ్రోలుతున్నాయి.వాతావరణం అంతా మధురమైన పూల సువాసనలతో ఆహ్లాదంగా మనోహరంగా ఉన్నది.ఎటుచూచినా ఏదో తెలియని ఆనందం ప్రకృతిలో నిండి వెల్లువలా ప్రవహిస్తున్నది.

కళ్ళు విప్పార్చుకుని ఈ అద్భుతాన్ని చూస్తున్న మృడాని చెవులకు - 'ప్రియతమా! గౌరీ! ఇలా చూడు.నాకోసం ఎందుకు అంతలా వెదుకుతున్నావు?ఎందుకలా ఏడుస్తున్నావు?ఇదుగో చూడు.నేనిక్కడే ఉన్నాను.' అన్న మృదుమధురమైన స్వరం వినిపించి ఆమె శరీరాన్ని ఝల్లుమనిపించింది.

భయసంభ్రమాలతో ఆ స్వరం వినవచ్చిన దిక్కుగా చూచిన మృడానికి ఒక చెట్టుక్రింద విలాసంగా కూర్చుని,సిగలో నెమలిపించంతో, మెడలో పూలమాలతో, చేతిలో పిల్లనగ్రోవితో, కాళ్ళు విలాసంగా ఊపుతూ,చిరునవ్వుతో తననే చూస్తున్న పీతాంబరధారీ,గోపీజన మానసచోరుడూ, లీలానాటక సూత్రధారీ,భగవంతుని యొక్క పరిపూర్ణావతారమూ అయిన మురళీ మోహనుడు దర్శనమిచ్చాడు.

ఒక్కసారిగా మృడాని అంతరంగం కట్టలు త్రెంచుకుంది. సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకును ఊపినట్లు,అనేక యుగాల విరహం ఆమెను ఊపేసింది.పట్టలేనంత ఆనందం ఆమెలోకి ఒక వెల్లువలా దూసుకొచ్చింది. ఒళ్ళు తెలియని విహ్వలతలో పరుగెత్తుతూ ముందుకు దూకిన ఆమె నాలుగంగల్లో కృష్ణుని చేరుకొని ఆయనను తన చేతులతో చుట్టేసి తల్లి ఒడిని చేరుకున్న చిన్నారిలా ఆయన వడిలో వాలిపోయింది.తన కన్నీటితో ఆయన ఒడిని తడిపేస్తూ దివ్యమనోహరమైన ఆయన ముఖాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ అలా మైమరచి ఉండిపోయింది.

అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు తెలియదు.ఆ తర్వాత ఏం జరిగిందో అసలే తెలియదు.తానెవరో తెలియదు.ఎక్కడున్నదో తెలియదు.అసలు తాను ఉన్నదో లేదో తెలియదు.ప్రపంచం ఉందో ఏమై పోయిందో తెలియదు.తన ఉనికిని కూడా పూర్తిగా కోల్పోయిన మధుర పారవశ్య స్థితిలో ఆమె ఆ రాత్రంతా ఉండిపోయింది.

ఆ స్థితిలో తానూ కృష్ణుడూ వేర్వేరు కారు.ఇద్దరూ ఒకటే.ఒక్కటే అయిన అమితమైన ఆనందసముద్రంలో ఇద్దరూ కలసి కరిగిపోయారు.అప్పుడేమైంది?ఏమైందో తెలియడానికి 'తాను' అన్న స్పృహ విడిగా ఉంటేకదా?తానే కరిగి లేకుండా పోయినప్పుడు ఇక ఆ స్థితిలో ఎలా ఉంటుందో అర్ధం చేసుకునేవారెవరు?ఆ అనుభూతిని వివరించి చెప్పేవారెవరు?

అటువంటి దివ్యమైన ఆనంద సమాధిస్థితిలో మునిగి రాత్రంతా ఆ చీకట్లో ఆ చెరువునీళ్ళలో ఒళ్ళు తెలియని స్థితిలో ఆమె పడి ఉండిపోయింది.

తెల్లవారింది.

పొద్దున్నే చెరువు దగ్గరకు నీటికోసం వచ్చిన కొందరు స్త్రీలకు నీళ్ళలో పడి ఉన్న మృడాని శరీరం కనిపించింది.ఎవరో స్త్రీ నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుందని వారనుకున్నారు.కానీ పరిశీలించగా శ్వాస కొద్దిగా ఆడుతూ ఉన్నట్లు వారికి తోచింది.వెంటనే ఆమెను చేతులమీద ఇంటికి మోసుకుపోయి, ఉపచర్యలు చేసి ఆమెకు స్పృహ వచ్చేలా చేశారు ఆ స్త్రీలు.

కళ్ళు తెరిచిన మృడానిలో ఊహించని మార్పు వారికి కన్పించింది.ఆమెలో మునుపటి విషాదం లేదు.మునుపటి వైరాగ్యం లేదు. నిర్లిప్తతా, శూన్యదృక్కులూ లేవు.ఏదో తెలియని వెదుకులాట ఆ కళ్ళలో లేదు.వాటి స్థానంలో ఏదో తెలియని ఒక వెలుగూ,కారణం లేని ఒక చిరునవ్వూ, ఈ లోకానికి చెందని ఒక దర్పమూ,ఒక అమితమైన సంతృప్తీ వారికి దర్శనమిచ్చాయి.తను వెదుకుతున్న గమ్యాన్ని చేరుకున్న మనిషిలో ఉండే ఒక విధమైన నిండుదనమూ, ఒక విధమైన ప్రశాంతతా ఆమెలో వారికి కనిపించాయి.

ఆ రాత్రి ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి ఆమెను ఒక నూతన వ్యక్తిగా రూపుదిద్దింది.ఆ రాత్రితో ఆమె జీవితంలో ఒక క్రొత్త అధ్యాయం మొదలైంది. అప్పటివరకూ ఉన్న పాత మృడాని ఆ రాత్రితో మాయమై పోయింది.ఏదో తెలియని గమ్యంకోసం తపిస్తూ ఒక బిచ్చగత్తెలా దేశాలు పట్టుకుని తిరుగుతున్న పిచ్చిదాని స్థానంలో,విశ్వరహస్యాన్నీ మానవజీవిత గమ్యాన్నీ,అవగతం చేసుకున్న ఒక జ్ఞాని ఆవిర్భవించింది.ఆమె జీవితంలోనుంచి విషాదం శాశ్వతంగా అంతరించింది.దైవం కోసం ఆమె వెదుకులాట పరిసమాప్తమైంది.ఆమె జీవితం ధన్యమైపోయింది.

చదువరులారా! దైవదర్శనం పొందాలంటే ఎంతటి తపన ఉండాలో, ఎంతటి త్యాగం ఉండాలో, ఎంతటి నిర్మలమైన మనస్సు ఉండాలో అర్ధమైందా? ఊరకే తోచనప్పుడు కాసేపు గుడికి వెళ్లి అక్కడకూడా లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ,మన చెత్త కోరికలతో దైవాన్ని విసిగిస్తూ, మనం హుండీలో వేసే డబ్బులు అందరూ గమనిస్తున్నారో లేదో అని పక్కచూపులు చూచే మనం,ఇలాంటి పరమనీచ స్థితిలో ఉండికూడా చాలా గొప్ప భక్తులమని భావించుకుంటూ అహంకారంతో విర్రవీగే మనం, నిజానికి ఆ పదానికి తగుదుమా? అసలు మనం ఏంటని భగవంతుడు మన దగ్గరకు రావాలి? అలాంటి అవసరం ఆయనకు ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకోండి.

గౌరీమా వంటి మహనీయుల జీవితాలే మనకు నిజమైన గీటురాళ్ళు. నిజమైన భక్తులు ఎలా ఉంటారో,నిజమైన మహనీయులు ఎలా ఉంటారో ఇలాంటి మనుషులను చూచైనా కనీసం అర్ధం చేసుకోండి.

ఆ విధంగా బృందావనంలో కృష్ణ సాక్షాత్కారం పొందేసరికి ఆమెకు 22 ఏళ్ళు మాత్రమే.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక' - అంటూ పలికిన శ్రీరామకృష్ణుల అమోఘమైన నోటిమాట వృధాగా పోతుందా?

(ఇంకా ఉంది)