నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, జులై 2016, బుధవారం

IAF -32 విమానం ఏమైంది? - ప్రశ్న శాస్త్రం ఏమంటోంది?

మొన్న శుక్రవారం నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం IAF - 32 చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళుతూ మధ్యలో మాయమై పోయింది. అందులో 29 మంది మనుషులున్నారు. ఇప్పటివరకూ దీని జాడా జవాబూ లేవు. ఇది ఏమైందో ఎక్కడుందో ప్రశ్న శాస్త్ర సహాయంతో చూద్దాం.

ఈరోజు ఉదయం 10.59 కి ప్రశ్నను చూడటం జరిగింది.ఆ సమయానికి వేసిన చార్ట్ పైన ఇస్తున్నాను.

ద్విస్వభావ లగ్నం ఉదయిస్తూ విషయంలో ఉన్న సందిగ్ధతను సూచిస్తున్నది.మన:కారకుడైన చంద్రుడు లగ్నాత్ అష్టమంలో ఉంటూ నాశనాన్ని సూచిస్తున్నాడు.అంటే ఈ విమానం నాశనమై పోయింది,ఇందులోని ప్రయాణీకులు అందరూ చనిపోయారన్న సూచనను చంద్రుడు ఇస్తున్నాడు.

చంద్రుడు అశ్వనీ నక్షత్రంలో ఉండి కేతుప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు.అంటే, హటాత్తుగా జరిగిన మాయవంటి ఒక సంఘటన వల్ల ఈ విమానం దారితప్పి అదృశ్యం అయిందని అర్ధమౌతోంది.

ఈరోజు బుధవారం. లగ్నం బుధునిదైన కన్య అయింది.విమానం నంబరు కూడా 32=5 అవుతూ బుధుడినే సూచిస్తున్నది. లగ్నాధిపతి బుధుడు ఖచ్చితమైన రాశిసంధిలో పడి ఉన్నాడు.ఈ రాశిసంధి కర్కాటక సింహ రాశుల మధ్యలో ఉన్నది.అంటే జలతత్వ అగ్నితత్వ రాశుల మధ్యలో ఉన్నది.అంటే ఈ విమానం నీళ్ళలో కూలిపోయి మంటల్లో కాలిపోయిందని అర్ధం. బుధుడు బుద్ధి కారకుడు గనుక, ఏం చెయ్యాలో దిక్కు తెలియని పరిస్థితిలో పైలట్ పడిపోయాడని, అతని బుద్ది అయోమయానికి లోనైనదని తెలుస్తున్నది.

ప్రశ్న సమయానికి సూర్యహోర ఉదయిస్తున్నది.సూర్యుడు అగ్నితత్వ గ్రహం.ఈయన జలతత్వ రాశి అయిన కర్కాటకంలో ఇంకొక జలతత్వ గ్రహమైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఆరూఢలగ్నం కూడా ఇదే అయింది.కనుక విమానం నీటిలో జలసమాధి అయిందని రూడిగా తెలుస్తున్నది.

విక్రమస్థానంలోని శనికుజుల వల్ల,ఈ విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం క్లియర్ గా కనిపిస్తున్నది.శనికుజుల కలయిక యాక్సిడెంట్లను ఇస్తుందని గతంలో లెక్కలేనన్ని సార్లు ఉదాహరణలతో సహా నిరూపించి ఉన్నాను.వీరిద్దరూ మళ్ళీ జలతత్వ రాశిలో ఉండటం వల్ల యాక్సిడెంట్ జరిగి జలసమాధి అవడం సూచితం అవుతున్నది.అలాగే లగ్నాధిపతి బుధుని రాశిసంధి స్థితివల్ల విమానం ఫిట్ కండిషన్ లో లేదని అర్ధమౌతున్నది.

సూర్యుడు తూర్పుదిక్కుకు అధిపతి.శుక్రుడు ఆగ్నేయానికి అధిపతి.కనుక ఈ విమానం బయలుదేరిన చోటినుంచి తూర్పు ఆగ్నేయ దిక్కులో పడి ఉన్నదని అర్ధమౌతున్నది.

ఇప్పుడు నవాంశ చక్రాన్ని పరిశీలిద్దాం.

నవాంశలో జలతత్వ రాశి అయిన కర్కాటక లగ్నం ఉదయిస్తున్నది.జలతత్వ గ్రహమైన చంద్రుడు అక్కడే ఉన్నాడు.వక్రించి ఉన్న శనీశ్వరుని కోణదృష్టి చంద్రుని మీద ఉన్నది.ఆ శనీశ్వరుడు సప్తమ మారక,అష్టమ నాశన భావాలకు అధిపతిగా ఉండి, మళ్ళీ నాశనాన్నే సూచిస్తున్నాడు.అష్టమ భావంలో విమానాలకు సూచకుడైన శుక్రుడు (మళ్ళీ ఇంకొక జలగ్రహం) ఉండి ఈ విమానం నీళ్ళలో కూలిపోయిందని తెలియజేస్తున్నాడు.

చతుర్ధంలోని రవి రాహువుల వల్ల ఈ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిసిపోతున్నది.అందులోనూ కుటుంబ స్థానాదిపతిగా రవి నీచలో ఉన్నాడు.కనుక విమాన వ్యవస్థలో అంతర్గత లోపాలు ఖచ్చితంగా ఉన్నాయని తెలుస్తున్నది.రవి గుండెకాయకు సూచకుడు గనుకా, ఆ రవి నీచస్థితిలో ఉన్నాడు గనుకా, విమానానికి గుండెకాయ అంటే ఇంజనే గనుకా, ఈ విమానం ఇంజన్లు సరియైన కండిషన్ లో లేవని స్పష్టంగా తెలుస్తున్నది.

కనుక,పై విశ్లేషణను బట్టి ఈ విమానం ఫిట్ కండిషన్ లో లేదనీ, సాంకేతిక వ్యవస్థలో లోపాలున్నాయనీ,అందువల్ల గాలిలో ఉండగానే ప్రమాదానికి గురైన ఈ విమానం ముక్కలు ప్రస్తుతం సముద్రపు అడుగు భాగంలో చేరుకొని ఉన్నట్లు మనం ఊహించవచ్చు.

అంతేగాక, లగ్నాధిపతి అయిన బుధుడు ఏకాదశస్థానాన్ని వదలి ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉండటాన్ని బట్టి, విమానం ముక్కలు సముద్రంలో పడినచోట లేకుండా స్థానభ్రంశం చెందుతూ ఉన్నాయనీ, బయలుదేరిన ప్రదేశానికి దగ్గరగా కదులుతూ వస్తున్నాయనీ ఊహించవచ్చు.

ఈ ప్రదేశం ఎక్కడుందో జ్యోతిశ్శాస్త్ర సాయంతో లెక్కిద్దాం.

లగ్నం కన్య - 23 డిగ్రీలు.
దుర్ఘటనా స్థలం - శని నక్షత్రంలో ఉన్న కుజుడు
కుజుని స్థితి - వృశ్చికం 3 డిగ్రీలు.
రెంటి మధ్య దూరం - 40 డిగ్రీలు.
దీనిని శని అంకె అయిన 8 చేత హెచ్చించగా 40x8=320 అవుతుంది.
కనుక తీరం నుంచి దాదాపు 320 కి.మీ దూరంలో తూర్పు ఆగ్నేయ దిక్కుగా సముద్రంలో వెదికితే ఫలితం ఉంటుంది.

వెదుకులాట జరుగుతోంది.

చూద్దాం ఏం బయట పడుతుందో?