గాంగెస్ లో మేమున్న అయిదురోజులలో నా శిష్యులలో చాలామందికి ఎన్నో అతీతానుభవాలు కలిగాయి.నిజాయితీగా సక్రమమైన మార్గంలో సాధన చేసేవారికి ఇంద్రియాలకు అతీతమైన అద్భుతానుభవాలు కలగడం వింతేమీ కాదు.అది చాలా సహజంగా జరుగుతుంది.
ఈ పోస్ట్ లో అలాంటి అనుభవాలను కొన్నింటిని ప్రస్తావిస్తాను (కొన్నింటిని,అందులోనూ వ్రాయదగినవాటిని మాత్రమే).
గాంగెస్ లో ఉన్నన్ని రోజులూ, నావరకూ నేను, నాకలవాటైన అంతరిక స్థితులలో నిరంతరం ఉన్నాను.కానీ అవి బయటి వారికి ఏమాత్రం కనపడవు. అర్ధం కావు.నలభై ఏళ్ళ సాధనతో ఆ విధంగా ఉండగల కంట్రోల్ ను నేను సాధించాను.
నా సంగతి అలా ఉంచితే - మిగతావారి అనుభవాలు కొన్ని వినండి.
మొదటి రోజున మేము అక్కడకు వెళ్ళేసరికి - మాకంటే ముందు అక్కడకు చేరుకున్న మాధవ్, రాజూ రిట్రీట్ హోం వెనుక ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గర చెట్లక్రింద కూచుని ధ్యానంలో మాకు కనిపించారు.ఆ తర్వాత - ఆ ప్రదేశంలో ఆధ్యాత్మిక తరంగాలు చాలా బలంగా ఉన్నాయనీ వాటి ప్రభావంతో ధ్యానస్థితి దానంతట అదే వస్తున్నదనీ మా అబ్బాయి మాధవ్ నాతో అన్నాడు.
నాలుగేళ్ల క్రితం మేమందరం కలకత్తా వెళ్ళినపుడు అక్కడ దక్షిణేశ్వర్ కాళికాలయ ప్రాంగణంలో మా అబ్బాయికీ అమ్మాయికీ దీక్షలిచ్చాను.నా నుంచి మొదటగా దీక్షలు తీసుకున్నది వాళ్ళే.అప్పటినుంచీ వాళ్ళు సాధన చేస్తున్నారు. అమెరికా వెళ్ళి, చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, మా వాడు క్రమం తప్పకుండా సాధన చేస్తూనే ఉన్నాడు.ఈ నాలుగేళ్ళలో తను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలను క్రమంగా అందుకుంటున్నాడు.ఎప్పటికప్పుడు తన అనుభవాలను నాకు చెప్పి నా సలహాలు తీసుకుంటూ ఉంటాడు.కనుకనే గాంగెస్ లో అడుగు పెట్టడంతోనే అక్కడి ఆధ్యాత్మిక తరంగాలను ఫీల్ అవగలిగాడు.
అక్కడ ఉన్న అయిదు రోజులలో తను చాలా సమయం ట్రాన్స్ లో ఉన్నాడు.కానీ అన్ని పనులూ చేస్తూనే ఉన్నాడు.ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ వారిని దింపడం, షాపింగ్ మాల్ కు వెళ్లి వస్తువులు కొనడం వగైరా అన్ని పనులూ చేస్తూనే, లోపల్లోపల ట్రాన్స్ లో ఉండగలుగుతున్నాడు.ఇది గమనించి నేను చాలా సంతోషించాను.
ఈ నాలుగేళ్ళలో తనకు చాలా అనుభవాలు కలిగాయి. వాటినన్నిటినీ ఇక్కడ వ్రాయను గాని, తనకు గాంగెస్ లో కలిగిన ఒక్క అనుభవాన్ని మాత్రం ఇక్కడ అక్షరబద్ధం చెయ్యదలచుకున్నాను.ఎందుకంటే ఇది అద్భుతమైన Out Of The Body Experience కనుక.
Para Normal ప్రపంచంలో దీనినే క్లుప్తంగా OBE అంటారు.
Para Normal ప్రపంచంలో దీనినే క్లుప్తంగా OBE అంటారు.
చీకటి పడిన తర్వాత రిట్రీట్ హోం వెనుక ఉన్న ఓపెన్ ఫైర్ ప్లేస్ చుట్టూ పాతి ఉన్న చెట్ల మొద్దుల మీద కూచుని అందరం ధ్యానం చేసేవాళ్ళం.అలా రెండు మూడు సార్లు చేశాం.
ఒకరోజున సాయంత్రం నుంచీ తను ట్రాన్స్ లో ఉండటం నేను గమనించాను.ఆ రోజున చీకటి పడిన తర్వాత అందరం ఫైర్ ప్లేస్ దగ్గర మౌనంగా ధ్యానం చేస్తున్నాం.
అక్కడున్న అందరినీ నేను గమనిస్తూనే ఉన్నాను.ఎవరెవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలుస్తూనే ఉన్నది.ఊరకే కళ్ళు మూసుకుని ఆలోచనల సుడిలో కొట్టుకుపోతున్న వాళ్ళు కొందరు, ఏవేవో ప్లాన్స్ వేస్తున్న వాళ్ళు కొందరు,చెదిరిపోతున్న ఆలోచనలను కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కొందరు,నిద్రమత్తులో ఉంటూ అదే ధ్యానం అనుకుంటున్న వారు కొందరు,కలల్లో తేలిపోతూ అవే అనుభవాలని అనుకుంటున్నవారు కొందరు,ఊరకే చలికాచుకుంటున్న వారు కొందరు - ఇలా ఉన్న రకరకాలైన వారిమధ్య ఒకరిద్దరు మాత్రమే ధ్యాన స్థితి నిజంగా కుదిరిన వారు కనిపించారు.వారిలో మాధవ్ ఒకడు.
ఇలా ధ్యానం చేస్తున్న తనకు అకస్మాత్తుగా ఒక అనుభవం కలిగింది.మా చుట్టూ చాలా పొడవైన చెట్లు ఉన్నాయి.అవి పైన్ వృక్షాలో లేక మరే చెట్లో నాకైతే తెలీదు. మాతోనే కూర్చుని ధ్యానిస్తున్న తను, అకస్మాత్తుగా చెట్ల పైన ఆకాశంలో తేలుతూ ఉన్నట్లుగా ఫీల్ అయ్యాడు.అక్కడ తేలుతూ, క్రింద ఉన్న మంటనూ,దాని చుట్టూ కూచుని ఉన్న మమ్మల్నందరినీ, మాతోబాటు "తనను" కూడా bird's eye view లో చూస్తున్నాడు.ఆ సమయంలో చాలా తేలికగా, చాలా సంతోషంగా, దూదిలా గాలిలో తేలుతున్నట్లు ఫీలింగ్ తనకు కలిగిందని నాకు తర్వాత చెప్పాడు.ఆ సమయంలో ప్రపంచమూ,జీవితమూ,దాని బాధలూ సమస్యలూ ఏవీ తనకు గుర్తు రాలేదట.
సరిగ్గా అప్పుడే, మా గ్రూప్ లో ఉన్న కొందరికి మెంటల్ పట్టింది. వాళ్ళేదో పిచ్చి చేష్టలు చెయ్యబోవడమూ, నేను వారిని గదమడమూ జరిగాయి.అప్పటివరకూ గాలిలో చెట్లపైన తేలుతున్న తను, నా గద్దింపుతో, ఒకే ఒక్క సెకండ్లో శరీరంలోకి వచ్చేశాడు.తన OBE state ఆ విధంగా చెదిరిపోయింది.
అందుకే - ధ్యానుల చుట్టు పక్కల, మామూలు మనుషులు ఉండకూడదు.తెలిసీ తెలియక వాళ్ళు ఆలోచించే పిచ్చి ఆలోచనలతో, వాళ్ళు చేసే పిచ్చి చేష్టలతో ధ్యానులకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది.వారి ధ్యానం పాడైపోతుంది.ఇలాంటి వాటిని ఎవాయిడ్ చెయ్యడానికే ధ్యానులు మౌనులు కొండల్లో అడవుల్లో జనసంచారానికి దూరంగా ఉంటూ ఉంటారు. మామూలు మనుషులకూ ధ్యానులకూ అందుకే - ఎప్పుడూ పడదు.వీరిని వారూ భరించలేరు.వారిని వీరూ భరించలేరు.
ఆ తర్వాత అందరం లేచి రిట్రీట్ హోం లోకి వచ్చాం.తను కూడా మాతోబాటు నిదానంగా నడుచుకుంటూ వచ్చి క్రింద హాల్లో ఉన్న సోఫాలో కళ్ళు మూసుకుని మత్తుగా పడుకున్నాడు. ఆ అనుభవం సడన్ గా పోయినా, అది కలిగించే మత్తు అంత త్వరగా పోదని నాకు తెలుసు,ఆ స్థితిలో చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. అందుకని నేనూ తనని డిస్టర్బ్ చెయ్యకుండా ఊరుకున్నాను.ఆ రాత్రంతా తను అదే స్థితిలో ఉన్నాడు.
ఆ తర్వాత - ఈ స్థితి కలిగినప్పుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో,ఎలా దానిని నిలుపుకోవాలో - ఈ రహస్యాలన్నీ తనకు వివరించి చెప్పాను.
ఆ తర్వాత - ఈ స్థితి కలిగినప్పుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో,ఎలా దానిని నిలుపుకోవాలో - ఈ రహస్యాలన్నీ తనకు వివరించి చెప్పాను.
ఇకపోతే - ఉదయం పూట ధ్యాన సమయంలో నాతో ఉన్న చాలామందికి చాలా అనుభవాలు కలిగాయి.
కొందరికి కనులముందు వెలుగు కనిపించింది.కొందరికి రకరకాలైన రంగులు కనిపించాయి.ఇంకొందరికి చెవులలో నిరంతరం మ్రోగుతున్న హమ్మింగ్ సౌండ్ వినిపించింది. ఒకరిద్దరికి మాత్రం దేవతా స్వరూపాలు దర్శనం ఇచ్చాయి.మొత్తం మీద అందరికీ ఏదో తెలియని ఆనందం కలిగింది.ఆ కొద్ది రోజులపాటు - ఇంటి గొడవలు, నిత్యజీవితపు సమస్యలు ఏవీ ఎవరికీ గుర్తు రాలేదు.అందరం కలసిపోయి ఒకే కుటుంబంలా సరదాగా ఆనందంగా ఆ రిట్రీట్ హోం లో గడిపాము.
మాధవ్ కు కలిగిన OBE హటాత్తుగా చెడిపోయిన సందర్భంగా నేనూ ఒక గుణపాఠం నేర్చుకున్నాను.నాతో రిట్రీట్ కు ఇకమీదట ఎవరిని బడితే వారిని పిలవకూడదని, నాతో పూర్తిగా సింక్ అయ్యి,మౌనంగా ఉంటూ,తూచా తప్పకుండా నేను చెప్పినట్లు ఆచరించే,అతి కొద్దిమందిని మాత్రమే నాతో స్పిరిచ్యువల్ రిట్రీట్లకు ఇకమీదట పిలవాలనేదే నేను నేర్చుకున్న ఆ పాఠం.
ఈ క్రమంలో - ఇప్పటివరకూ నాతో ఎంత సన్నిహితంగా ఉన్నవారినైనా సరే - వారు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉండే పనైతే - అలాంటి వారిని దూరంగా ఉంచాలన్న నిశ్చయానికి నేను వచ్చేశాను.
ఈ క్రమంలో - ఇప్పటివరకూ నాతో ఎంత సన్నిహితంగా ఉన్నవారినైనా సరే - వారు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉండే పనైతే - అలాంటి వారిని దూరంగా ఉంచాలన్న నిశ్చయానికి నేను వచ్చేశాను.
లౌకిక జీవితంలో కూడా - నానుంచి ఎవరికీ ఏ విధమైన ఇబ్బందీ కలగకూడదని భావించేవాడిని నేను.ఇక - మనవల్ల మన ఆప్తులకు ఆధ్యాత్మికంగా హాని జరుగుతూ ఉంటే దానిని ఎలా సహించగలం?
మనోనిగ్రహమూ ఆత్మనిగ్రహమూ లేకుండా,ఇలా అర్ధం పర్ధం లేని ఆవేశ కావేషాలకు లోనైపోతూ, లోపల్లోపల ఏవేవో ఊహించుకుంటూ,మనం అక్కడకు ఎందుకొచ్చాం అన్న స్పృహకూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారు,వారివారి భావనా పరంపర వల్లా,నా మాట వినని ప్రవర్తన వల్లా,తమతో ఉన్న ఇతర ధ్యానుల నిష్ఠకు భంగం కలిగించిన వారౌతారు.వీరు ఇటువంటి రిట్రీట్లకు ఎంతమాత్రం పనికిరారు.
కనుక ఇకమీద అందరినీ నాతో స్పిరిచ్యువల్ రిట్రీట్లకు పిలవకూడదని నిర్ణయం తీసుకున్నాను.
ఎందుకంటే నాకు క్వాంటిటీ ముఖ్యం కాదు.క్వాలిటీయే ముఖ్యం.నాకు నూరుమందో వెయ్యిమందో శిష్యులు అక్కర్లేదు. నాతోబాటు నా దారిలో త్రికరణ శుద్ధిగా నడవగలిగే ఒక్కరో ఇద్దరో నాకు చాలు.
(ఇంకా ఉంది)