“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

21, సెప్టెంబర్ 2016, బుధవారం

టీ కప్పులో చినుకు...



ఈరోజు ప్రమాదవశాత్తూ ఒక రైలుపెట్టె డిరైల్ అయింది.

దానిని మళ్ళీ రీరైల్ చేసే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది.స్పాట్ లో నేనూ ఉన్నాను.రీరైల్ చేసే టీం మెంబర్స్ తమ పనిని తాము చకచకా చేసుకుంటున్నారు.వర్షం జల్లులు జల్లులుగా పడుతున్నది.కొందరు గొడుగులు వేసుకుని తడవకుండా పనిని సూపర్ వైజ్ చేస్తున్నారు.నాకు మాత్రం వానలోనే హాయిగా అనిపించి అలాగే తడుస్తూ, చినుకుల స్పర్శను ఆస్వాదిస్తూ నిలబడ్డాను.

ఇంతలో టీ సర్వ్ చెయ్యబడింది. టీ కప్పును చేతిలోకి తీసుకుని సిప్ చెయ్యబోతూ ఉండగా ఆకాశంలోనుంచి ఒక చినుకు ఆ కప్పులో పడి టీలో కలసిపోయింది.సిప్ చేసిన నాలోకి చేరిపోయింది.

ప్రకృతి ఎంత అద్భుతమైనది !!!

కొన్ని క్షణాల క్రితంవరకూ ఎన్నో మైళ్ళ దూరంలో ఆకాశంలో ఉన్న మేఘాలలో ఒక భాగంగా ఉన్న నీటిచుక్క ఇప్పుడు నాలో ఒక భాగంగా మారింది !!!

గమనిస్తే అద్భుతాలు మనతోనే లేవూ?

పరికిస్తే అద్వైతాలు మనలోనే లేవూ?

ఈరోజు జరిగిన ఈ చిన్న సంఘటన (insignificant event) నా మనోవీధిలో మెరుపులు మెరిపించింది. 

ఆ నీటిచుక్కతో మాట్లాడించింది.

ఈ కవితకు ప్రాణం పోసింది.

చదవండి మరి.
--------------------------------------

సుదూర శూన్యంలో అనంత కాలంగా
సుతారంగా తేలుతున్న నీటిచుక్కవు
ఎందుకు నన్నిలా కోరావు?

విశాల గగనంలో విలాస సౌధంలో
విశోకంగా ఉన్న వర్షపు బిందువువు
ఎందుకిలా నాలోకి చేరావు?

నాలో ఏముందని?
నా ప్రాణంలో ప్రాణంగా మారావు?
నీకేమివ్వగలనని?
నను కోరి ఇంతదూరం వచ్చావు?

మేఘాలలో తేలియాడే నీకోసం
నేను రాలేనని కదూ
మట్టిలో నడయాడే నాకోసం
నువ్వే దిగి వచ్చావు?

ఎన్ని జన్మలెత్తినా
నిను చేరుకోలేనని కదూ
ఈ జన్మలోనే నువ్వొచ్చి 
నన్నిలా వరించావు?

కొంచం గురితప్పితే చాలు
ఏ బురదలోనో కలుస్తానని తెలిసీ
నాకోసం ఎంత సాహసం చేశావు?

అనేక యోజనాల నీ ప్రయాణంలో
ఎక్కడైనా నువ్వు ఆవిరి కావచ్చని తెలిసీ
నాకోసం ఎంత తెగువను చూపావు?

నా సావాసం కోరి నీ ఆవాసం వదలి
ఇంత దూరం జారి నాలో వచ్చి చేరి
నిన్ను నువ్వు కోల్పోయావు

నీ ప్రేమకు ప్రతిగా ఏ బహుమతి నివ్వగలను?
నీ కోసం శ్రుతినై ఏ గీతిని పాడగలను?
అమాయకమైన నీ తపనకు ఏమిచ్చి
నీ ఋణం తీర్చుకోగలను?
భయానకమైన ఈ లోకంలోకి
నాకోసం పిచ్చిగా వచ్చిన నిన్ను
ఏ విధంగా ప్రేమించగలను?

లోకపు శాపాలకు చీకటి పాపాలకు 
అతీతంగా వెలిగే లోకంలో గాలికి తేలే ప్రియురాలివి
ఈ బికారి నెందుకు వలచావు?

మానవ చేతనకు మరణపు యాతనకు
ఊహలకందని భూమికలో ఊయలలూగే జవరాలివి
ఈ మట్టిలో ఎందుకు కలిశావు?

దిగంత దూరాలను చిదిమి వేస్తూ అనంత కాలాలను అధిగమిస్తూ
చీకటి తలుపులను చీల్చుకుంటూ రేపటి వెలుగులను మోసుకుంటూ
నాకోసం ఎలా దిగి వచ్చావు?

మరణపు మూల్గులు సోకలేని శిశిరపు రాల్పులు తాకరాని
అనంత గగనపు అమోఘతటిలో అనునిత్యం నర్తించే అమృతానివి
ఈ సామాన్యుడినెలా మెచ్చావు?