నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, అక్టోబర్ 2016, సోమవారం

సాధన మనస్సుకేనా? - 2

"ఏం ఒళ్ళేం పాపం చేసింది?" అన్నాను.

చరణ్ కాస్త ఖంగు తిన్నాడు. తేరుకుని -"ఇందులో పాపపుణ్యాల ప్రసక్తి ఎక్కడుంది అన్నగారు?' అన్నాడు.

నా పాయింట్ తనకి సరిగ్గా అర్ధం కాలేదని అర్ధమైంది.

ఇంకోరకంగా చెబుదామని, దోవ మార్చి -"అసలు మనసుకి మాత్రం సాధన ఎందుకు?" అడిగాను.

మళ్ళీ కాసేపు ఆలోచనలో పడ్డాడు చరణ్.

"నిగ్రహం కోసం" అన్నాడు కాసేపటి తర్వాత.

"నిగ్రహం లేకుంటే ఏం? అది లేనివాళ్ళు కోటానుకోట్ల మంది ఉన్నారు. వాళ్ళంతా బానే ఉన్నారుగా?" అన్నాను.

"మనస్సు మన కంట్రోల్ లో ఉండాలిగా?" అన్నాడు.

"అవును.మనసు అది ఉండవలసిన స్థితిలో లేదు కనుక.దానికి శిక్షణ అవసరం.అంటే సాధన అవసరం.ఇదేగా నీ జవాబు?" అడిగాను.

సంశయిస్తూ -"ఆ ! అంతే" అన్నాడు.

"అలాగే, ఒళ్ళు కూడా అది ఉండవలసిన స్థితిలో లేదు కనుక దానికి కూడా సాధన అవసరం చరణ్." అన్నాను.

"ఒంటికి ఎలాంటి సాధన అవసరం అవుతుంది?" అడిగాడు.

"చెప్తా విను.ఒంటికి ఉన్న దుస్థితులు ఏవంటే - 'బద్ధకం, అతినిద్ర,అనవసరంగా తిండి తిని లావెక్కడం,సౌష్టవం కోల్పోవడం,సుఖం కోసం వెంపర్లాట,సుఖానికి బాగా అలవాటు పడటం' - ఇవి. వీటిని ఒదిలించడానికి దానికి తగిన సాధన ఇవ్వాలి.అందుకే నా మార్గంలోని మొదటి మెట్లలో యోగ వ్యాయామానికి, ప్రాణాయామానికి చాలా ప్రాముఖ్యతనిస్తాను. అలా చెయ్యడం ద్వారా శరీర సాధన జరుగుతుంది.అది మంచి కండిషన్ లో ఉంటుంది." అన్నాను.

"మనకు శరీరం సంగతి అంతా తెలుసు.కానీ మనస్సు గురించి అంతా తెలీదు కదా?" అడిగాడు చరణ్.

"పొరపాటు.నీ శరీరం గురించి కూడా నీకు ఏమీ తెలీదు.అలా తెలుసనీ ప్రతివాడూ అనుకుంటాడు.అదొక భ్రమ.నీ శరీరంలో నీకు చర్మం వరకే తెలుసు. ఆ లోపల ఉన్నవాటి మీద నీ అదుపు లేదు." అన్నాను.

"ఎందుకు లేదన్నగారు? చెయ్యి నొప్పి వస్తే చెయ్యి నొప్పి అని తెలుస్తున్నది. కాలు నొప్పి వస్తే కాలు నొప్పి అని తెలుస్తున్నది.అన్నీ తెలుస్తున్నాయి కదా?" అన్నాడు.

"లేదు చరణ్.అంతవరకే తెలుస్తుంది.అంతకంటే లోపలికి తెలీదు.ఒక ఉదాహరణ చెప్తా విను.నీకు డొక్కలో ఏదో నొప్పి వస్తుంది.పరీక్షలు చేయిస్తావు.లివర్ లో ఏదో ఒక గడ్డ అని తెలుస్తుంది. అనుకో కాసేపు. అన్నీ నీకు తెలిసే పనైతే పరీక్షలు ఎందుకు? నీకు నీకే తెలియాలి కదా నా లివర్ లో పలానా ప్రాంతంలో ఇంత సైజులో గడ్డ ఉందని ? అలాగే, నీ వైటల్ రీడింగ్స్ అన్నీ నీకే తెలియాలి కదా? మెడికల్ టెస్టులు ఎందుకు చేయిస్తున్నావు? ఒక జ్వరం వస్తే అది ఎందుకు వచ్చిందో దేనివల్ల వచ్చిందో నీకే తెలియాలి.కానీ అలా తెలియడం లేదు కదా? అంటే,నీ ఒళ్ళు గురించి నిజానికి నీకేమీ తెలీదు.నీకు తెలిసిందల్లా చర్మం వరకే.నీకు కనిపించేది చర్మం మాత్రమే. అందుకే దానికి సేవ చేస్తూ ఉంటావు.ఆ లోపలవి నీకు కనిపించవు.అందుకే "బ్యూటీ ఈస్ స్కిన్ డీప్" అని మాటొచ్చింది. నిజానికి మనిషి ఈలోకంలో చేస్తున్నది "చర్మసేవ" మాత్రమే.అంతకంటే వాడికింకేమీ తెలీదు. చర్మంలోనే శర్మం (సుఖం) ఉందనుకుంటాడు మనిషి.అది ఒక జంతువు యొక్క స్థితి మాత్రమే.ఇలా అనుకుంటూ ఉన్నంతవరకూ వాడికీ జంతువుకీ పెద్ద తేడా లేదు.అంతే." అన్నాను.

చరణ్ వింటున్నాడు.

"నిజానికి మనిషి ఏ రకంగా చూచినా పరిమితుడే.అతని శరీరానికీ కొన్ని పరిమితులున్నాయి.మనస్సుకూ పరిమితులున్నాయి.ఈ పరిమితమైన స్థితినుంచి అపరిమితమైన స్థితికి చేరుకోవడమే మనిషి కర్తవ్యమ్.దానికి సాధన అవసరం.అయితే తనకున్న భౌతిక పరిమితుల దృష్ట్యా శరీరం అనేది అన్ని హద్దులనూ అధిగమించి పోలేదు.దానికి కారణం శరీరం భౌతికమైనది. కానీ మనస్సు అలా కాదు.అది అభౌతికం.కనుక అది విశ్వం మొత్తాన్నీ ఆక్రమించగలదు.విశ్వం మొత్తాన్నీ తనలో ఇముడ్చుకోగలదు కూడా.

'భౌతికం అంటేనే ఘనీభవించిన స్థితి అని అర్ధం.ఒక రాయి ఉన్నదని అనుకో.అది ఘనీభవించి ఆ స్థితికి వచ్చింది.కనుక అది ఆ హద్దులలోనే ఇమిడి ఉంటుంది.ఆ హద్దులు దాటితే తన రూపాన్ని కోల్పోతుంది.కానీ మనస్సు అలా కాదు.దానికి రూపం లేదు.అది హద్దులు దాటగలదు.కానీ అదికూడా విశ్వమానసంగా మారినపుడు తన పూర్వస్తితిని కోల్పోతుంది. అయితే దానికి ఆకారం లేదు గనుక ఒక రాయి నాశనం అయినట్లు అది అవదు.అదీ తేడా. సాధన అనేది ఒంటికీ, మనసుకీ - రెంటికీ అవసరమే." అన్నాను.

'మన మనస్సు గురించి కూడా మనకు లోతుగా తెలీదు కదా అన్నగారు?' అన్నాడు చరణ్.

'ఎందుకు తెలీదు? అంత:పరిశీలనా శక్తి ఉన్నవాడికి బాగానే తెలుస్తుంది.కానీ నువ్వు ఎంతగా పరిశీలించినా నీ ఒంట్లో జరుగుతున్న క్రియలు నీకు తెలియవు.అదొక చీకటి లోకం.జ్ఞాననేత్రం ఉంటేనే ఆ విషయాలు కనిపిస్తాయి. మామూలు మనిషికి అది ఒక చీకటి ప్రపంచం అంతే.కానీ నీ మనస్సును గమనించుకుంటే దాని వేషాలన్నీ నీకు అవే అర్ధమౌతాయి.అదీ ఒంటికీ మనసుకీ తేడా.

'అసలూ - దైవం ఇచ్చినదాన్ని "పనికిరాదు" అని నిర్లక్ష్యం చెయ్యడానికి నీకు హక్కెక్కడిది? ఒకవేళ దేహం పనికిమాలినది అయితే దైవం దానిని ఎందుకు సృష్టించాడు? ఎందుకు నీకిచ్చాడు? దైవ సృష్టిలో ఉన్నదానిని నిర్లక్ష్యం చేసే అధికారం మనకెక్కడిది? కనుక నీలో ఏదీ పనికిరానిది కాదు.వాటిని ఎలా వాడుకోవాలో నీకు తెలియాలి.నువ్వు నీ శరీరంతో సహా దేనినీ నిర్లక్ష్యం చెయ్యకూడదు.అలాగని దేనికీ అలుసూ ఇవ్వకూడదు.అందుకనే శరీరం మాయ అనీ భ్రమ అనీ భావించే మూర్ఖ వేదాంతులు కాలగర్భంలో కలసి పోయారు.అవి నిలబడే సిద్ధాంతాలు కావు.' అన్నాను.

'ఇలాంటి అసలైన విషయాలు ఎవ్వరూ చెప్పడం లేదన్నగారు.' అన్నాడు.

'ఎవరూ అంటే?' అడిగాను.

'అదే టీవీల్లో, పేపర్లలో,గుళ్ళలో ఉపన్యాసాలు ఇచ్చే గురువులు' అన్నాడు.

'టీవీల్లో,పేపర్లలో,గుళ్ళలో నీకు గురువులు ఎలా దొరుకుతారు చరణ్? అది ఉత్త కాలక్షేపం మాత్రమే.అందుకే "పురాణ కాలక్షేపం" అనే మాట వచ్చింది. నిజమైన ఆధ్యాత్మికత అలా దొరికేది కాదు.' అన్నాను.

'ఎవరి మతవ్యాపారం వారు చేసుకుంటున్నారన్నగారు' అన్నాడు చివరకు.

'ఒకరి గోల వదిలేయ్ చరణ్.మనకెందుకు? మనం పుట్టింది లోకాన్ని ఉద్దరించడానికి కాదు.ముందు మనల్ని మనం ఉద్దరించుకుంటే చాలు. అలాంటి మత వ్యాపార ఊబిలో పడే ఖర్మ ఉన్నవాళ్ళు పడతారు.అదృష్టం ఉన్నవారు సత్యం చెంతకు చేరతారు.లేనివారు వారి దారిన వారు పోతారు. మనకెందుకు? ముందు మన సంగతి మనం చూచుకుందాం. ఇదే వివేకం అంటే. నువ్వు "వివేక చూడామణి" గురించి విందామని వచ్చావు.నువ్వు ప్రస్తుతం విన్నది అదే.' అన్నాను నవ్వుతూ.

చాలాసేపు మౌనంగా కూచుండిపోయిన చరణ్ చివరకు తేరుకుని - 'ఉంటా అన్నగారు.మళ్ళీ కలుస్తా.' అంటూ లేచాడు.

'సరే.మంచిది.వెళ్లిరా' అన్నాను.

సెలవు తీసుకుని చరణ్ నిష్క్రమించాడు.
read more " సాధన మనస్సుకేనా? - 2 "

30, అక్టోబర్ 2016, ఆదివారం

సాధన మనస్సుకేనా? - 1

ఈరోజు దీపావళి పండుగ. అమావాస్య గనుక ఉదయాన్నే పితృతర్పణాలు వదులుతూ కూచుని ఉన్నాను.ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.ఎవరో వచ్చారు. శ్రీమతి ఆహ్వానించి కూర్చోబెట్టింది.

తర్పణ కార్యక్రమం ముగించి చూద్దునుగదా చరణ్ సోఫాలో శాంతంగా కూచుని కనిపించాడు.ఉభయకుశలోపరి ఫలహారం చేద్దామని లోపలకు పిలిచాను.డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని శ్రీమతి వేస్తున్న వెజిటబుల్ దోసెలు తినసాగాం ఇద్దరం.

"వీటిల్లోకి ఈ పచ్చడి వేసుకో చరణ్ చాలా బాగుంటుంది" - అంటూ ఆవనూనెతో చేసిన ఉసిరికాయ పచ్చడి వడ్డించాను. దాన్ని నంచుకుంటూ ఒక దోసె లాగించాడు చరణ్.

'ఏంటి అన్నగారు ! ఇంత అద్భుతంగా ఉంది? తినీ తినకముందే గుండె వేగం పెరిగింది?' అన్నాడు ఆశ్చర్యంగా.

'అవును చరణ్. నువ్వు బాగా సెన్సిటివ్ గనుక ఆ విషయం వెంటనే పట్టేశావు.ఇది గుండెకు చాలా మంచిది.అందులోనూ చలికాలం కదా.ఆవనూనె బాగా వాడాలి.శరీరంలో వేడి పుట్టిస్తుంది.' అన్నాను.

'తెలుస్తున్నది అన్నగారు.I can feel its effect.' అన్నాడు చరణ్.

నేను నవ్వేశాను.

'అన్నగారు.మీ దగ్గరకు వస్తూ వస్తూ దారిలో ఒకటి అనుకున్నాను.ఇంట్లోకి రావడం తోనే అది తీరిపోయింది' అన్నాడు.

'ఏంటది?' అన్నాను

'దారిలో వస్తూ వస్తూ శంకరుల 'వివేక చూడామణి' గురించి మీ నోటివెంట నాలుగు ముక్కలు విందామని అనుకున్నాను.ఇంట్లోకి రావడంతోనే ఎదురుగా శంకరుల 'బ్రహ్మసూత్ర భాష్యం' కనిపించింది. రెంటికీ తేడా ఏముంది? భలే ఆశ్చర్యంగా ఉంది.' అన్నాడు.

నేను మౌనంగా ఫలహారం చేస్తున్నాను.

క్రమంగా ఇద్దరం ఫలహారం ముగించి లేచాం.

'టీ ఇవ్వమంటారా?' అంది శ్రీమతి.

'వద్దు.ఆ పాడు టీ త్రాగి పొట్ట పాడు చేసుకోవడం ఎందుకు? దాని బదులు ఇది త్రాగుతాం.' అంటూ ' ఎదురుగా ఉన్న సీసాలోనుంచి కొంత ద్రావకాన్ని రెండు గ్లాసులలో పోసి సరిపడా నీళ్ళు కలిపి చరణ్ కు అందించాను.

'ఏంటిది అన్నగారు.ఇంత చేదుగా ఉంది?' అన్నాడు త్రాగుతూ.

'భయం లేదులే చరణ్ త్రాగు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.' అంటూ ఈ పద్యం ఆశువుగా చదివాను.

కం|| చేదే మంచిది యొంటికి
చేదే నీ బాధలన్ని చక్కగ దీర్చున్
చీదుట మూల్గుట దొలగును
చీదర పడకుండ త్రాగు చరణా దీనిన్

'ఇంతకీ ఇదెంటో చెప్పలేదేం అన్నగారు? అన్నాడు చరణ్.

'దీనిపేరు 'గిలోయ్ జ్యూస్' అంటే మన తెలుగులో 'తిప్పతీగ రసం'. సంస్కృతంలో దీనిని 'అమృతలతా రసం' అంటారు.చేదుగా ఉంటుంది కానీ ఒంటికి చాలా మంచిది.' అన్నాను. 

'ఏదో మీరిచ్చారు త్రాగాను.అంతకంటే నాకేం తెలీదు.' అన్నాడు చరణ్.

'మొన్న మీ వదినతో అదే చెబుతున్నాను చరణ్.ఆ మోడరన్ వంటకాలని ఏవేవో చేస్తూ ఉంటుంది.మనకెందుకు ఆ మసాలా వాసనలూ అవీనూ? మన ఇళ్ళలోనుంచి అలాంటి మసాలా వాసనలు రాకూడదు. మన ఇళ్ళలో చక్కగా ఇంగువ తిరగమోత వాసనలు రావాలి.ఏమంటావ్?' అన్నాను.

'అబ్బా !భలే గుర్తు చేసారన్నగారు.మా చిన్నప్పుడైతే మా ఇంట్లో మామిడికాయ పప్పులో ఇంగువ తిరగమోత వేస్తె వీధి చివర్లో ఉన్న మా స్కూల్లోకి ఆ వాసన వచ్చేది అన్నగారు.ఒరేయ్ అమ్మ మామిడికాయ పప్పు చేసిందిరా అని అక్కడినుంచే అరుస్తూ ఇంటికి పరిగెత్తి వచ్చేవాళ్ళం నేనూ మా అన్నయ్యా. అసలూ సరిగ్గా వంట చెయ్యడం అంటే యాసిడ్ టెస్ట్ తిరగమోత సరిగ్గా వెయ్యడమే.అదొక్కటి సరిగ్గా వస్తే వంట మొత్తం వచ్చేసినట్లే.

మా చిన్నప్పుడు మాకు మేనత్త ఒకామె ఉండేది అన్నగారు.బాగా ఆరడుగుల ఎత్తులో పచ్చని పసిమిచాయలో ఉండేది.చీరను గోచీపోసి కట్టి రోటి ముందు కూచునేది.కేజీ కందిపప్పు రోట్లో వేసుకుని కొంచెం జీలకర్ర వేసి మొత్తం క్షణాల్లో రుబ్బి పారేసేది. మా అమ్మేమో ఇంట్లోంచి వేడివేడి తిరగమోత తెచ్చి ఆ రోట్లోనే వెయ్యాలి.లేకపోతే మా మేనత్త ఊరుకునేది కాదు.ఆ మొత్తం పచ్చడి సమంగా కచ్చాపచ్చాగా రుబ్బి చేత్తో అలా చులాగ్గా తీసి గిన్నెకు వేసేది.దాంతోనే మొత్తం అన్నం తినేసేవాళ్ళం.ఇక వేరే కూరలూ గట్రా అవసరం ఉండేది కాదు.అంత అమృతంగా ఉండేది ఆ కంది పచ్చడి.అంతెందుకు అన్నగారు.కూర తెలగపిండి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కూరల్లో? అలాగే పనసపొట్టు కూర, అరటి దూట కూర,రాచ్చిప్పలో చేసిన జీడికాయల పులుసు - అబ్బా అవన్నీ ఇప్పుడు చేసేవాళ్ళూ లేరు అడిగేవాళ్ళూ లేరు.చిన్నప్పటి రోజులకు మళ్ళీ తీసుకెళ్లారన్నగారు.' అన్నాడు చరణ్ తన్మయత్వంతో.

'రాచ్చిప్పలు ఇప్పుడెక్కడున్నాయి అసలు? అంది శ్రీమతి.

'రాచ్చిప్పను సరాసరి పొయ్యి మీద పెట్టి ఎంత మంట పెట్టినా పగలదు వదినగారు.అదేంటో దాని దుంప తెగ!! అందులో చేసిన పులుసు ఎంత మధురంగా ఉంటుందో? అసలంత ఓపికగా వండేవాళ్ళూ ఇప్పుడు లేరు.అలా తినేవాళ్ళూ ఇప్పుడు లేరు. జిల్లెల్లమూడిలో రాధన్నయ్య అని ఉండేవాడు. మహా తిండిపుష్టి ఉన్నవాడు.మనిషి చూట్టానికే ఘటోత్కచునిలా ఉండేవాడు.ఒకరోజున పందానికి ఏభై ఇడ్లీ తిని పది నిమ్మకాయ సోడాలు తాగాడు.ఈరోజుల్లో చేసే బటన్ ఇడ్లీలు కావు.బాగా అరచెయ్యి సైజులో ఉన్న పెద్ద పెద్ద ఇడ్లీలు.అవి తిని సోడాలు త్రాగేసరికి సమయం పదకొండు అయింది. 'ఏం అన్నయ్యా! ఇంకో యాభై ఇడ్లీలు తెప్పించనా' అని సరదాగా అడిగితే తేలిగ్గా నవ్వుతూ ' ఒద్దురా. మళ్ళీ మధ్యాన్నం భోజనం చెయ్యాలి కదా! కొంచం ఖాళీ ఉంచుదాం పొట్టలో అన్నాడన్నగారు' - అన్నాడు చరణ్ అదే తన్మయత్వంతో.

నవ్వుకుంటూ అందరం వచ్చి హాల్లో కూలబడ్డాం. రాత్రి క్లబ్ లో బాగా ఆలస్యం అయింది కదా అందుకని కొంచం నిద్రమత్తుగా ఉండి నేను దివాన్ మీద జారగిలబడ్డాను.

కాసేపు మౌనంగా గడిచాక ఉన్నట్టుండి - 'సాధన అనేది మనస్సుకేగా అన్నగారు?' అడిగాడు చరణ్.

అతని వంక తేరిపార చూచాను.

(ఇంకా ఉంది)
read more " సాధన మనస్సుకేనా? - 1 "

Nee Navvule Vennelani - Kumar Sanu


Nee Navvule Vennelani....

అంటూ 'కుమార్ సానూ' మధురంగా ఆలపించిన ఈ గీతం 'మల్లీశ్వరి' అనే తెలుగు సినిమాలోది.ఈ సినిమా 2004 లో వచ్చింది.ఇది ఫాస్ట్ బీట్ తో కూడిన మంచి మధుర గీతం.ఇటువంటి గీతాలను చెయ్యాలంటే సంగీత దర్శకుడు కోటినే చెయ్యాలి.ఈయన స్వరాలు హిందూస్తానీ బాణీలకు దగ్గరగా చాలా మధురంగా ఉంటాయి. బీట్ ఉన్నప్పటికీ మాధుర్యం ఏ మాత్రం తగ్గకుండా ఈయన స్వరాలు సమకూరుస్తాడు.

నిన్న దీపావళి సందర్భంగా క్లబ్ డే జరిగింది. అందులో నేను పాడిన పాట ఇది. మన టేస్ట్ కు తగినట్లు "Old is Gold" అని 1950 పాటలు పాడితే అక్కడందరూ లేచిపోతారు. అందుకని ఈ కొత్త పాట పాడాను.అందరికీ బాగా నచ్చిందని వేరే చెప్పవలసిన పని లేదుగా ??

సీతారామ శాస్త్రి ఎంత చక్కగా వ్రాస్తారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.ఆయన పాటల్లో సహజమైన లయ ఉంటుంది.అదీగాక తన పాటల్లో చక్కని ప్రాసను వాడుతూ అంతకంటే చక్కని భావాన్ని ఆయా పదాలలో పొదగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

అయితే - ఒరిజినల్ పాటను అక్కడక్కడా కొంచెం మార్చి పాడాను. రెండో చరణంలో - "రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు" అని ఉంటే - "కదలవు కాసేపు" అని మార్చి పాడాను. ప్రాస బాగుందని అలా మార్చాను. అర్ధం పెద్దగా మారలేదనుకోండి.అలాగే, "ఉరివేస్తావు" అనే పదాన్ని "ఉరితీస్తావు" అని మార్చాను.

అద్భుతమైన కరావోకే ట్రాక్ అందించిన "Telugu Karaoke World" వారికి నా కృతజ్ఞతలు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Malliswari (2004)
Lyrics:--Sirivennela Seetarama Sastry
Music:--Koti
Singer:--Kumar Sanu
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------
నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని 
ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవని

బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసీ
వేవేల పువ్వులను పోగేసి - నిలువెత్తు పాలబొమ్మని చేసి
అణువణువు వెండి వెన్నెల పూసి - విరితేనె తోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి - తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి

పగలంతా వెంటపడినా చూడవు నావైపు 
రాత్రంతా కొంటె కలవై కదలవు కాసేపు
ప్రతిచోట నువ్వె ఎదురోస్తావు - ఎటు వెళ్ళలేని వలవేస్తావు
చిరునవ్వుతోనే ఉరి తీస్తావు - నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి - తప్పు నాదంటావా నానా నిందలేసి

నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని 
ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవని
read more " Nee Navvule Vennelani - Kumar Sanu "

22, అక్టోబర్ 2016, శనివారం

ఆయన వయసు 90 - అయినా గట్టిగా ఉన్నాడు




కల్యాణానంద భారతీస్వామి వారి శిష్యుడైన అంగలకుదురు శర్మగారు నా పాఠకులకు సుపరిచితులే. పాత పోస్టులలో ఆయన గురించి వ్రాశాను. ఈయన తెనాలిలో స్థిరపడినప్పటికీ, అంగలకుదురు స్టేషన్ మాస్టారు గా చాలాకాలం పని చేసినందున ఈయన్ను ఇలాగే పిలుస్తాను నేను.

ఈయన అసలు పేరు వెంకట కృష్ణశర్మగారు. ఈయన దగ్గర నేను కొన్ని పాత పుస్తకాలను మూడేళ్ళ క్రితం తీసుకున్నాను. అవి ఆయన గురువైన కల్యాణానంద భారతీ స్వామివారు వ్రాసినవి. బ్రౌన్ కలర్ పేపర్ మీద పట్టుకుంటే ముక్కలై పోయేటట్లు ఉన్న పేపర్ తో ప్రస్తుతం ఆ పుస్తకాలు ఉన్నాయి.వాటిని తిరిగి ఆయనకు ఇవ్వడానికి ఇప్పటికి తీరింది మనకు !!!

తెనాలిలో పాత నటరాజ్ టాకీస్ ఎదురుగా ఉన్న పరమహంస ఆశ్రమం సందులో ఈయన నివాసం. అన్నామలై మెస్సులో భోజనం చేసి మేము వీరింటికి వెళ్లేసరికి మధ్యాన్నం రెండైంది. పై అంతస్తులో వీరి అబ్బాయి ఉంటున్నాడు.క్రింద లోపల ఏసీ గదిలో ఈయన పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.

మేము వచ్చామని చెప్పగానే మహదానంద పడిపోయాడాయన. గదిలోపలకు అడుగు పెట్టేసరికి మంచం మధ్యలో బాసింపట్టు వేసుకుని కూచుని అగుపించాడు బోసినోటితో నవ్వుతూ.

"ఎన్నాళ్ళైంది శర్మగారు మిమ్మల్ని చూచి" - అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు.

"మూడేళ్ళు దాటింది" - అక్కడే ఉన్న చెక్కబల్ల మీద కూచుంటూ నేనన్నాను.

"అయ్యో అక్కడెందుకు? ఆ కుర్చీలో కూచోండి" అంటూ ఒక కుర్చీని చూపాడాయన.

'ఒద్దండి ఇదే సుఖంగా ఉంటుంది దానికంటే' అంటూ 'మీ ఆరోగ్యం ఎలా ఉన్నది?' అడిగాను.

'బాగున్నాను.ప్రస్తుతం నాకు తొంభై ఏళ్ళు.ఏమీ ఆరోగ్య ఇబ్బందులు లేవు.పళ్ళు మాత్రం ఊడిపోయాయి.' అన్నాడాయన బోసినోటితో నవ్వుతూ.

'ఇంతకీ మీరు భోజనం చేశారా? టైం రెండైంది?' అన్నాడాయన ప్రేమగా.

'చేశామండి.సోనోవిజన్ ఎదురుగా ఉన్న అన్నామలై మెస్సులో చేశాము. రుచిగా శుచిగా బాగుంది.' అన్నాను.

అక్కడే ఉన్న వాళ్ళబ్బాయి అందుకుని ' ఎందుకండీ ఇలా చేశారు? మీరు రావడమే ఒక అదృష్టం. కొంచం ముందు చెబితే మా ఇంట్లోనే భోజనం రెడీ చేసేవాళ్ళం కదా" అన్నాడు నొచ్చుకుంటూ.

'మీలాంటి సద్బ్రాహ్మణుల ఇళ్ళలో తినడం నాకూ ఇష్టమే.కానీ ఈసారికి ఇలా వదిలెయ్యండి.ఇంకో సారి చూద్దాం' అన్నా నేను.

"సరే ఉండండి" - అంటూ అబ్బాయి బయటకు వెళ్ళాడు.

నేను శర్మగారి వైపు తిరిగి నవ్వుతూ 'ఏంటండి పళ్ళు పోయాయా? ఇంకో పదేళ్ళాగండి మళ్ళీ వస్తాయి.' అంటూ ' మీ ఆహారం అదేగా?' అడిగాను.

'అదేనండి.పొద్దున్న ఒక గ్లాసు ఆవుపాలు త్రాగుతాను. మధ్యాన్నం ఒక గ్లాసు రాగిజావ. మళ్ళీ రాత్రికి ఒక గ్లాసు ఆవుపాలు.ఇంతే గత ఇరవై ఏళ్ళుగా నా ఆహారం.కాఫీ టీల జోలికి మొదట్నించీ పోను.టిఫిన్లు తినను.సిగిరెట్లూ తాగుడూ ఈ దేహానికి అసలే అలవాటు లేవు.ఆరోగ్యం హాయిగా ఉంది.బీపీ లేదు.సుగర్ లేదు.ఇప్పటికీ పై అంతస్తు మెట్లెక్కి చక్కగా దిగుతాను.నా పనులు హాయిగా చేసుకుంటున్నాను.

1986 లో నేను రిటైరయ్యాను. ఇప్పటికి 30 ఏళ్ళయ్యాయి. అమ్మవారి దయతో హాయిగా ఉన్నాను.' అన్నాడాయన.

'మీ ఆహారపు అలవాట్లే మిమ్మల్ని కాపాడుతున్నాయి.' అన్నాను నేను.

'అవునండి.నేను రిటైరైన కొత్తలో బెంగుళూరులో కొన్నేళ్ళు ఉన్నాను. అప్పుడు అక్కడ ఒకాయన నాకు పరిచయం అయ్యారు.ఆయనకు 86 ఏళ్ళు.నాకు అప్పట్లో మోకాళ్ళ నొప్పులు వచ్చాయి.ఆయన్ను సలహా అడిగితే, ఈ డైట్ పాటించమని చెప్పాడు. ఆరోజు నుంచీ ఇప్పటివరకూ ఇదే నా ఆహారం.ఈ డైట్ మొదలు పెట్టిన నాలుగు నెలల్లో మోకాళ్ళ నొప్పులు మాయం అయ్యాయి.75 ఏళ్ళ వయసులో తిరుపతి కొండ ఎక్కి దిగాను.' అంటూ నవ్వాడాయన.

మరి మీకు ఆవుపాలు ఎక్కడ దొరుకుతాయి? అడిగాను.

"ఇప్పుడు సంగం వారివి దొరుకుతున్నాయి.ఇంతకు ముందు మాకు నందిని పాలు అలవాటు.బెంగుళూరు లో అవే ఉండేవి.అందుకని ఇక్కడకు వచ్చాక కూడా అవే వాడేవాళ్ళం.కానీ అవి జెర్సీ ఆవుపాలని కొందరు చెప్పారు.అందుకని వాటిని మానేసి ఇప్పుడు 'సంగం పాలు' వాడుతున్నా." అన్నాడు.

'అవి స్వచ్చమైనవేనా?" అడిగాను.

'ఏమో మనకు తెలియదు.'అన్నారాయన.

'స్వచ్చమైన ఆవుపాలు కావాలంటే గోసంరక్షణ సంఘం దగ్గరకు వెళితే వాళ్ళు మన ఎదురుగా పితికి ఇస్తారు.అవి మంచివి.' అన్నాడు వింటున్న మూర్తి.

ఏదేమైనా హిమాలయ ప్రాంతాలలో సహజమైన గడ్డిని తిని పెరిగే ఆవుల పాలకున్న శక్తి ఇక్కడ మనం వేసే చెత్త తిని పెరిగే ఆవుల పాలల్లో ఉండదేమో అనిపించింది నాకు. బయటకు ఏమీ అనలేదు.

ఇంతలోకి వారి అబ్బాయి మూడు కాఫీ గ్లాసులతో లోనికి వచ్చాడు.

'ఇప్పుడే భోజనం చేసి వచ్చాము.వద్దు.' అన్నాను నేను.

'పరవాలేదు త్రాగండి. మీరు ఏమీ తీసుకోకపోతే మాకు బాగుండదు. నాన్నగారికి కూడా తెచ్చాను." అన్నాడతను ఆప్యాయంగా.

ఆప్యాయత ముందు నియమాలు నిష్టలూ అన్నీ బలాదూరే గనుక మాట్లాడకుండా ఆ కాఫీ గ్లాసు తీసుకున్నాను.

కాఫీ గ్లాసు తీసుకుంటూ శర్మగారు "నాకా? నాకెందుకురా కాఫీ?' అన్నాడు అదో రకంగా ముఖం పెట్టి.

వాళ్ళబ్బాయి నవ్వుతూ ' ఇప్పుడైనా త్రాగండి నాన్నగారు.ఎప్పుడైనా ఒకసారి పరవాలేదులెండి' అన్నాడు.

మొహమాట పడుతూ కాఫీ గ్లాసు తీసుకున్న శర్మగారు దానిని త్రాగకుండా పక్కనే ఉన్న స్టూల్ మీద ఉంచాడు.

ఇంట్లో చేసిన కాఫీ యేమో చాలా బాగుంది.

కాఫీ చప్పరిస్తూ - 'మీ అనుష్టానం బాగా సాగుతున్నదా శర్మగారు?' అడిగాను.

'ఆ అది మామూలే.' అన్నాడాయన.

'మరి మిగతా సమయాలలో ఏం చేస్తుంటారు?' అడిగాను.

'ఏముంది? సంగీతసేవ.ఇదుగో ఇది' అంటూ ఒక రేడియో లాంటి పెట్టెని చూపించాడాయన.

'ఏంటది? రేడియోనా?" అడిగాను.

'ఇది రేడియో కాదు. తంబురా బాక్సు.' అంటూ దాని స్విచ్ నొక్కాడాయన.మధురమైన తంబురా శృతి అలలు అలలుగా రూమంతా పరచుకోసాగింది.

ఇది పెట్టుకుని త్యాగరాజుల వారివీ, అన్నమయ్యవీ, రామదాసువీ, సదాశివబ్రహ్మెంద్రుల వారివీ కీర్తనలు గొంతెత్తి పాడుకుంటూ ఉంటాను.నాలాగే రిటైరైన కొందరు మిత్రులున్నారు.వారందరూ నా దగ్గరకు సాయంకాలం పూట వస్తారు.అందరం కలసి ఒక్కొక్కరం ఒక్కొక్క కీర్తన పాడుకుంటాం.ఇదే మా కాలక్షేపం.' అన్నాడాయన నవ్వుతూ.

పెద్ద వయసులో ఇలాంటి సత్కాలక్షేపం కంటే కావలసింది ఏముంది? ఆ వయసులో కూడా పేకాటలు, తాగుడు మొదలైన వ్యసనాలలో, డబ్బు యావలో ఏవేవో వ్యాపారాలని వ్యవహారాలని కాలం గడిపే చవకబారు మనుషులు గుర్తొచ్చి వారికీ వీరికీ ఎంత భేదం ఉన్నదో కనిపించి నాకు చాలా సంతోషం అనిపించింది. బ్రాహ్మణ సంస్కారం అంటే ఇదే కదా అనిపించింది.

'చాలా బాగుంది.' అన్నాను నవ్వుతూ.

అంతలో గుర్తొచ్చి - సంచిలోనుంచి పుస్తకాలు తీసి ఆయనకిస్తూ - 'ఇవిగోండి మూడేళ్ళ క్రితం మీ దగ్గర తీసుకున్న మీ గురువుగారి పుస్తకాలు.చదివాను. చాలా బాగున్నాయి.' అన్నాను.

ఆయన మహదానంద పడిపోయాడు.

'ఇవి మీకిచ్చిన గుర్తే నాకు లేదు.కావలిస్తే మీ దగ్గరే ఉంచకపోయారా? నాకెందుకు ఇవి? అన్నాడు.

'మీరు నాకు మొత్తంగా ఇచ్చేస్తే అలాగే ఉంచుకునే వాడిని.కానీ వాటిని చదివి మీకు మళ్ళీ తెచ్చిస్తానని చెప్పాను.కనుక ఆ మాట పాటించాల్సిందే.అందుకే మీ పుస్తకాలు మీకు మళ్ళీ తిరిగి ఇస్తున్నాను.ఇది నా నియమం.' అన్నాను నవ్వుతూ.

వాళ్ళబ్బాయి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

అతనితో ఇలా అన్నాను.

'చూడండి.ఇవి కల్యాణానంద భారతీస్వామివారు వ్రాసిన చాలా విలువైన పుస్తకాలు.వీటిలో కొన్ని 1930 నాటివి ఉన్నాయి.ఇంకొన్నాళ్ళు పోతే ఇవి శిధిలమై పోతాయి.కనుక ముందు వీటిని డిజిటలైజ్ చేసి భద్రపరచండి.ఆ తర్వాత వీలువెంబడి ప్రింట్ చెయ్యవచ్చు.ఈ సంపదను కాలగర్భంలో కలసి పోనివ్వకండి.ఈ విధంగా ఎన్నో విలువైన పుస్తకాలు మన దేశంలో నశించాయి.మిగిలిన కొన్నింటిని ముస్లిం దుర్మార్గులు నాశనం చేశారు.వీటిని అలా కానివ్వకండి.' అన్నాను.

"అలాగే నండి.నాదగ్గర నికాన్ కెమెరా ఉంది.ముందు వీటిని ఏ పేజికి ఆ పేజి తీసి ఫోటోలు తీసి కంప్యూటర్ కు ఎక్కిస్తాను.అప్పుడు భయం లేదు." అన్నాడు వాళ్ళ అబ్బాయి.

"థాంక్యూ"  అన్నాను నవ్వుతూ.

ఆ తర్వాత ఆయన సర్వీసు విశేషాలు, ఎలాంటి దుర్మార్గులైన ఆఫీసర్లతో పనిచేసిందీ ఎన్ని కష్టాలు పడిందీ మధ్యమధ్యలో మంచి ఆఫీసర్లు ఎలా తగిలిందీ వారు తనకు ఎలా హెల్ప్ చేసిందీ చెప్పుకుంటూ వచ్చాడాయన.

'ఏనాడూ పైడబ్బులకు ఆశపడింది లేదు.ఎక్కడకు వేసినా జాయిన్ అయి నాపని నేను చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బ్రతికాను.ఈ ఇల్లొకటి కొనుక్కున్నాను.చాలు.మావాడు ఉద్యోగంలో ఉన్నాడు.అమ్మవారి ధ్యానంలో కాలం వెళ్ళ బుచ్చుతున్నాను.' అన్నాడాయన.

వేల కోట్లు వెనకేసినా ఇంకా తీరని దాహంతో కొట్టుకుంటున్న నేటి లోకపు నీచమనుషులకూ ఈయనకూ తేడా స్పష్టంగా కనిపించింది.

అలా కాసేపు వారితో మాట్లాడి, కొన్ని ఫోటోలు తీసుకుని, మళ్ళీ వస్తానని చెప్పి శెలవు తీసుకున్నాను.

బయటకు వస్తూ తలతిప్పి చూస్తే - ఆయన కాఫీ గ్లాసు అలాగే స్టూల్ మీద ఉన్నది.ఆయన త్రాగనే లేదు.

నా చూపును గమనించి ఆయన నవ్వుతూ - "అది అక్కడ ఉండవలసిందే నేను మాత్రం కాఫీలు టీలు త్రాగను"  అన్నాడు.

'మీరు ఇంకో పదేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా ఉండి "శతమానం భవతి శతాయు పురుష:" అన్న వేదమంత్రాన్ని నిజం చెయ్యాలి.ఆ ఫంక్షన్ కి నేను తప్పకుండా వస్తాను' అన్నాను.

'చూద్దాం శర్మగారు.అమ్మ అనుగ్రహం ఎలా ఉందో?" అన్నాడాయన నవ్వుతూ.

నేనూ నవ్వి బయటకొచ్చేశాను.

నియమనిష్ఠలతో కూడిన జీవితం ఇచ్చే ఆత్మసంతృప్తిని ఇంకేదైనా ఎలా ఇవ్వగలదు?
read more " ఆయన వయసు 90 - అయినా గట్టిగా ఉన్నాడు "

20, అక్టోబర్ 2016, గురువారం

శ్రీశైల సాధనా సమ్మేళనం - 2016

ఈ నెల 17,18 తేదీలలో శ్రీశైల మహాక్షేత్రంలో పంచవటి సభ్యులకు సాధనా సమ్మేళనం జరిగింది.

ఈ సమ్మేళనానికి దాదాపుగా 30 మంది సభ్యులు హాజరైనారు.వీరిలో నలుగురికి నా మార్గంలో 1st Level Deeksha, మిగిలిన వారికి 2nd level Deeksha ఇవ్వబడింది.వారడిగిన ఆధ్యాత్మిక సందేహాలు తీర్చడం జరిగింది.

రెండు రోజులు ఒకే కుటుంబంలా కలసి మెలసి వేరే ఆలోచనలు లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో ఉండి ధ్యానసాధన చేసిన తర్వాత వీరంతా సంతృప్తిగా వారి వారి ఊర్లకు తిరిగి వెళ్ళారు.

ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.


















































































































































read more " శ్రీశైల సాధనా సమ్మేళనం - 2016 "